Archive for August, 2010

విరహవేదన ఇంత మధురంగా…….

ఒకప్పుడు మన సినిమాల్లో నాయికా నాయకులు మామూలు మనుషులలాగా ప్రవర్తించేవారు. మామూలు మనసున్న మనుషుల్లాగా ఆవేదనలు, సంవేదనలను అనుభవించేవారు. అందుకే, ప్రతి సినిమాలో ఒక విరహ గీతం తప్పనిసరిగా వుండేది.

విరహగీతాలు ఎంతో సున్నితంగా వుండేవి. అవి నాయికా నాయకుల విరహ వేదనను ప్రదర్శించటం ద్వారా శ్రోతల మనస్సులలో నిద్రాణమయి వున్న సున్నిత భావనలను తట్టిలేపేవి. తమలో దాగిఉన్నట్టు సామాన్యులు గ్రహించలేని అత్యంత మృదుమధురమయిన సున్నిత భావనలకు అక్షర రూపం ఇచ్చి, అందమయిన గేయంగా మలచేవారు. రాతిహృదయం కూడా కరగి నీరయి జలజలా స్రవించే రేతిలో అమోఘమయిన, సుందరమయిన, అత్యంత సున్నితమయిన గీతాలను సృజించి ప్రజల హృదయాలను రసభరితం చేసేవారు.

ఆజావొ తడప్ తే హై అర్మాన్, యే ష్యాం కీ  తన్ హాయియా ఐసేమే తేరా గం, మెరె బీనా తుం బిన్ రోయే, రసిక్ బల్మా వంటి అనేకానేక అతి గొప్ప విరహ గీతాలున్నాయి. ఒక మధురమయిన అలవికాని ఆవేదనను రగిల్చి, ఆవేదనలోని అందాన్ని, సౌఖ్యాన్ని మనసుకు నేర్పుతాయి. విరహవేదనలోకూడా ఇంత సౌఖ్యం దాగుందా అనిపిస్తాయీ పాటలు. అయితే, విరహ గీతమే అయినా వీటన్నిటికీ, భిన్నమయినదీ, అత్యంత చమత్కారభరితమూ, అదే సమయానికి అతి సున్నితమయిన పాట ఆర్జూ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన బేదర్దీ బాలుమా తుఝ్ కో మెర మన్ యాద్ కర్తా హై, అనే శంకర్ జైకిషన్ సృజించిన గీతం. ఈ పాటలోని భావాల సుమమాలా అల్లింది హస్రత్ జైపురి.

సినిమా కథ మామూలే. నాయికా నాయకులు ప్రేమించుకుంటారు. పాటలు పాడుకుంటారు. ఇదిగో ఇప్పుడే వస్తానన్న నాయకుడు ఎంతకీ రాడు. అతని కోసం ఎదురుచూస్తూ, అతని సాంగత్యం కోసం విలపిస్తూ, అతనితో ఈ ప్రదేశాలలో గడిపిని ఆ ప్రేమ మయమయిన అద్భుతమయిన కాలాన్ని తలచుకుంటూ నాయిక ఒక విరహ గీతం పాడుతుంది. అదే ఈ పాట.

సందర్భం మామూలే. కానీ పాట అంత తేలికయినది కాదు. అతి క్లిష్టమయిన రాగము. ఎన్నో మెలికలుంటాయి. అంతే గొప్ప పదాలు, భావాలౌంటాయి. వాటిని అనుభవిస్తూ పాడాలి. ఆ సంవేదనలకు ప్రాణం పోయాలి. లతా మంగేష్కర్ కు ఇది వెన్నతో పెట్టిన విద్య.

పాట ఆరంభంలోనే, కొండ అంచుపైన వొంటరిగా నిల్చుని, క్రింద లోయలోకి, అనంతమయిన శూన్యంలోకీ చూస్తూ, ఆ ఆ ఆ అంటూ లతా రాగం తీయగానే ఎద జల్లుమంటుంది. మనసులో ఒక ఆవేదనా వీచిక ఎగసిపడుతుంది.

బేదర్దీ బాలుమా తుఝ్కో మెర మన్ యాద్ కర్తా హై
బరస్తాహై జొ ఆంఖోంసే వొ సావన్ యాద్ కార్తా హై

పాట ఆరంభమవుతుంది.

పల్లవిలో నేపధ్యంలో వినిపించే తబలా గతిని గమనించండి. లతా పలికే పదాల భావాలను ఎంత చక్కగా అవి మరింత శోభాయమానం చేస్తాయో అనుభవించండి. అంతేకాదు, తబలా తళతళలు పాటకు ఒక ఊపునిస్తాయి.

హృదయంలేని ప్రియుడా నా మనస్సు నిన్ను గుర్తుకు తెచ్చుకుంటోంది. కంటినుంచి కారే కన్నీరు వర్షాకాలాన్ని తలపుకు తెస్తోంది అంటోది నాయిక.

కభి హుం సాథ్ గుజ్రే దిన్ సజీలీ రాహ్ గుజారోంసే
ఖిజాకే భేస్ మె ఫిర్తీహై అబ్ పత్తే చనారోసె
వొరాహే యాద్ కర్తీహై వొ గుల్షన్ యాద్ కర్తా హై

కవి చమత్కారం ఇక్కడే తెలుస్తుంది.
తాను నాయకుడి కోసం ఎదురుచూస్తున్నానని నాయిక ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎదురుచూస్తున్నారు అంటూ తన విరహ వేదనను ప్రకృతిలో ఆపాదించి పరోక్షంగా తెలుపుతోంది.

ఒకప్పుడు పచ్చగా కళకళ లాడే ఈ దారులలో మనం కలసి నడిచాం. ఇప్పుడు ఎండుతాకులతో నిండి, వాడిపోయిన మోడుల మధ్య తిరుగుతున్నాను. ఈదారులూ, ఈ తోటా నిన్ను గుతుచేస్తున్నాయి అంటోంది. ఇక్కడ ప్రతీకలు ఎంత సందర్భోచితంగా వున్నాయో, నాయిక మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయో గమనించండి.

కోయి ఝోకా హవాకా జబ్ మెర ఆచల్ ఉడాతాహై
గుమాహోతాహై జైసె తూ మెర దామన్ హిలాతాహై
కభిచూమాత జొ తూనే వొ దామన్ యాద్ కర్తాహై

గాలి తరగ ఆమె కొంగు ఎగరగొట్టినప్పుడు ఆమె అతడు తన చేతిని పట్టి ఊపుతున్నాడన్న భ్రాంతి కలుగుతుంది. అతడు తాకిన ఆ  చేయి అతడిని గుర్తుకు తెచ్చుకుంటోంది.

వహిహై ఝీల్ కె మంజర్ వహి కిరణోంకి బర్సాతే
జహ హం తుం కియా కరేథె పహెరో ప్యార్ కీ బాతే
తుఝె ఇస్ ఝీల్ క ఖామోష్ దర్పణ్ యాద్ కర్తాహై

తాము గంటల తరపడి మాట్లాడుకున్న నది అదే, అప్పటి లాగే కిరణాల వర్షం కురుస్తోంది. కానీ, ఇప్పుడు ఆ ప్రకృతిలో జీవం లేదు. అందుకే, నిశ్శబ్ద దర్పణం లాంటి నది అతడిని గుర్తుకుచేస్తోంది.

ఈకడ ఖామోష్ దర్పణ్ అనటం ఎంతో గొప్పగా వుంటుంది. ఆమె నది గురించి చెప్తోందా, తన హృదయం గురించి చెప్తోందా?

ఇలాంటి అత్యద్భుతమయిన కవిత్వం ఎద లోతులలోని ఆవేదనలకు, సంవేదనలకు అక్షర రూపం ఇచ్చేది ఆకాలంలో. అప్పటి ప్రేక్షకులు అందుకే ఎంతో అదృష్టవంతులు. ఆ కవులు, గాయకులు, సంగీత దర్శకులు అదృష్టవంతులు. వారి శ్రోతలు ఒక మంచి సృజనను అర్ధంచేసుకుని ఆదరించేవారు.

అందుకే, ఎంతటి విరహ వేదనలో వున్నా సరే ఇలాంటి పాటలు వింటూంటే ఆవేదన స్థానాన్ని అదో అకమయిన ఆనందం ఆక్రమిస్తుంది. కళ్ళ వెంట నీరు కారుతున్నా, మనసు ప్రశంత సరస్సయిపోతుంది.

ఈ పాట చిత్రీకరణ కూడా ఔచిత్యంగా వుంటూ పాట ప్రభావాన్ని పెంచుతుంది. సాధన అందం గురించి మరో సారి. వెన్నెల ఆకృతి దాలిస్తే అది సాధన లా వుంటుంది.

ర్

August 25, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: సినిమా విశ్లేషణ

లీడర్ (తెలుగు) సినిమా చూశాను.

లేడెర్ సినిమాను ఎట్టకేలకు చూశాను.

ఎప్పటి నుంచో నా కోలీగులూ, స్నేహితులూ ఈ సినిమాను చూడమని చెప్తున్నారు. ఇది డిఫరెంటు చిత్రమనీ, తప్పకుండా చూడాలనీ సలహాలిచ్చారు. అందుకే ఈ సినిమా చూడాలని అనుకున్నాను. మొత్తానికి చూశాను.

సాంకేతికంగా, అంటే, కొన్ని దృశ్యాలు ఫ్రేం చేసిన విధానం బాగుంది. సినిమా పేర్లు ఇచ్చేటప్పుడు, నేపధ్యంలో ఒక చిన్న రేఖలా ఆరంభమయి. అసెంబ్లీ హాలు తో పూర్తవటం చాలా బాగుంది. ఉత్తమ స్థాయి సినిమా చూస్తామన్న ఆశను కలిగించింది. హాలీవుడ్ సినిమాల ప్రభావంతో సాంకేతికంగా మన సినిమాలూ అహివృద్ధి చెందుతున్నాయనిపించింది.

సినిమాలో నాకు నచ్చిన మరో అంశం కథ సమకాలీన సమాజానికి అద్దం పట్టాలని ప్రయత్నించటం.

సాధారణంగా మన కళాకారులు సమకాలీన సంఘటనలను అతి తక్కువగా సినిమాలకు వాడతారు.

పైగా, మన కళ్ళ ఎదురుగా జరుగుతున్న ఘటనలు కేంద్రంగా సినిమా నిర్మించటం  అభినందనీయం.

అయితే, ఆరంభం కలిగించిన ఆశాభావం కాసేపటికి ఆవిరయిపోయింది.

సినిమాలో పెద్ద లోపం స్క్రిప్టు. అంతకన్నా పెద్ద లోపం హీరో పాత్ర కోసం ఎంచుకున్న నటుడు. దాంతో మిగతా విషయాలు ఎలా వున్నా సినిమా మొత్తంగా దెబ్బ తిన్నది.

ఒక యువకుడు, ఆదర్శాలతో రాజకీయాలలో ప్రవేశించి, అవినీతిని కడిగేయటం అన్నది మనకు కొత్తకాదు.

1960 దశకంలో తన ఇమేజ్ మార్చుకునే ప్రయత్నంలో భాగంగా దిలీప్ కుమార్ స్వయంగా లేడర్ అని ఒక సినిమా నిర్మించాడు. ఆ తరువాత అనేక సినిమాలలో హీరోలి ఇలాంటి పనులు చేశారు. ఇటీవలే రంగ్ దే బసంతి సినిమాలో ముగ్గురు, నలుగురు యువకులు అవినీతి రాజకీయ నాయకుడిని కాల్చి చంపుతారు.

అయితే, ఈ సినిమాలో హీరో రాజకీయాలలో అడుఘుపెట్టటానికి దారితీసిన సంఘటన వయ్యెస్సార్ ఘటనను , జగన్ మోహన రెడ్డిని తలపుకు తేవటంతో సినిమా కాస్త భిన్నంగా అనిపిస్తుంది.

ఈ సినిమాలో ముఖ్యమంత్రి ప్రేమ కథ, అతనికి ఆమె వ్యతిరేకిగా పరిచయమయి, ప్రేమలో కలవటం లాంటి దృశ్యాలు, మైకెల్ డగ్లస్ నటించిన, క్లింటన్ ప్రేమ కథ ఆధారంగా నిర్మించిన అమెరికన్ ప్రెసిడెంట్ అనే సినిమాను గుర్తుకు తెస్తాయి. కానీ, ఆ సినిమాలోని సెన్సిటివిటీ కానీ, లాజిక్ కానీ. ఔచిత్యం కానీ ఈ సినిమాలో కనబడవు.

ఒక ముఖ్యమంత్రి ఇలా ఓ అమ్మాయిని కలుస్తూంటే ప్రతిపక్షాలు నోరు మెదపకపోవటం, మీడియా మౌనంగా వుండటం, స్వ పక్షంలోని శతృవులకేమీ తెలియక పోవటం అంత నమ్మదగినవిగా అనిపించవు.

ఇక, ఎమ్మెల్లేలు వారితో సంఘటనలు, దృశ్యాలూ అతి అసహజంగా, ఔచిత్య రహితంగా వున్నాయి. కార్డ్ బోర్డ్ కారెక్టర్లూ, సంఘటనలూ అవి. దాంతో కలగాల్సిన ఉద్విఙ్నతలు, ఆనందాలు కలగవు.

హీరో పాత్ర వ్యక్తిత్వాన్ని సరయిన రీతిలో రూపొందించలేదు. ఆ పాత్ర తెలితేటలు, నాయకుడిగా ఎదుగుదల లాజికల్ గా, సరయిన రీతిలో , కన్విన్సింగ్ గా చూపటంలో అటు స్క్రిప్టు రచయిత, ఇటు దర్శకుడు సంపూర్ణంగా విఫలమయ్యారు. ఒక ప్రణాలిక లేనట్టుగా వుంటాయి మన హీరో రాజకీయాలాటలు.

హీరో పాత్రకు  రానా అనే నటుడు అస్సలు సరిపోలేదు. ఏమీ అర్ధంకానట్టు అయోమయం తప్ప,  ముఖంలో భావం, ఎలాంటి అనుభూతి, అనుభవమూ కనబడని నటన, ఎలాంటి, విశ్వాసమూ, నమ్మకమూ ఉట్తిపడని ప్రవర్తన, చివరికి సంభాషణలు పలకటంలో కూడా ఎలాంటి ఎమోషన్ నూ ధ్వనింప చేయక, బట్టీ పట్తి వాక్యాలు హఠాత్తుగా పలికినట్తు పలికిన సంభాషణలూ,…….. సినిమాకి ప్రధానమయిన పాత్రనే ఇలా అవటము సినిమా ను పూర్తిగా దెబ్బ తీసింది. కొన్ని దృష్యాలలో ఈ హీరో ఏమాయ చేశావే హీరో లా అనిపించాడు. అదే భావరహితమయిన ముఖమూ, అదే సంభాషణలను పలికే విధమూనూ.

సినిమా కృతకంగా, ఔచిత్య రహితంగా, అసంబద్ధంగా వుంది. ఒక మంచి వకాశాన్ని కళాకారులు మరో సారి వ్యర్ధం చేశారన్న బాధ కలుగుతుంది.

మన వాళ్ళు సాంకేతికంగా హాలీవుడ్ వారికి ఏ మాత్రం తీసిపోకున్నా, స్క్రిప్టు విషయంలో, పాత్రలకు తగ్గ నటులను ఎంచుకోవటంలో ఎంతో వెనుకబడి వున్నారని ఈ సినిమా నిరూపిస్తుంది.  `

August 16, 2010 · Kasturi Murali Krishna · 6 Comments
Posted in: సినిమా విశ్లేషణ

భారతీయ వ్యక్తిత్వ వికాసం విడుదలయింది.

నేను రచించిన భారతీయ వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకం పుస్తకాల దుకాణాలను చేరుకున్నది.

ఇది 350 పేజీల పుస్తకం. వెల రూ.150/-. పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎమెస్కో ప్రచురణలు.

ఇవి జాగృతి వార పత్రికలో 2005 నుంచి 2008 వరకూ ధారావాహికంగా వెలువడిన వ్యాసాలు. ఈ శీర్షిక రచనకు ప్రేరణ, ప్రోత్సాహమూ అప్పటి జాగృతి సంపాదకులు రామ మోహన్ రావు గారిదే.

ఈ పుస్తకంలో మొత్తం 12 అధ్యాయాలున్నాయి. అవి,

వ్యక్తిత్వం- విజయం 
వ్యక్తిత్వం- మనస్సు.

వ్యక్తిత్వం- దైవభావన

వ్యక్తిత్వం- ఆదర్శం.

వ్యక్తిత్వం- మాట.

వ్యక్తిత్వం- భయం.

వ్యక్తిత్వం- ఆలోచనలు.

వ్యక్తిత్వం- బ్రహ్మచర్యం.

వ్యక్తిత్వం- శాంతం.

వ్యక్తిత్వం- ధనం.

వ్యక్తిత్వం- అధికారం.

ఈ పుస్తకానికి ఆరంభంలో పరిచయం, నాందీ ప్రస్తావన, చివరలో ఉపసమ్హారాలూ వున్నాయి.

వ్యక్తిత్వం- కులం అన్న వ్యాసాలు ఆరంభించాను కానీ, పూర్తి అయ్యేలోగా అనివార్య కారణాల వల్ల  సగంలో ఆపేయాల్సిరావటం తో ఈ పుస్తకంలో చోటు చేసుకోలేదు. ఆ వ్యాసాలకు ఆరంభ వ్యాసం మాత్రం  ఇందులో చేర్చాను. దేవుడి దయ వుంటే వ్యక్తిత్వం- కులం అనేది అధ్యాయంలా కాక ప్రత్యేక పుస్తకంలా రూపొందుతుంది.

భారతీయ వ్యక్తిత్వ వికాసం పుస్తకం చదివి మీ అభిప్రాయాలను, సూచనలను  నిర్మొహమాటంగా తెలియచేయండి.

August 12, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము, భారతీయ వ్యక్తిత్వ వికాసం

మీడియా గురించి చెప్పుకోటానికి మంచే లేదా????

దేన్నయినా విమర్శించటం చాలా సులభం. విమర్శించేవాడికి వేయి నాల్కలు అని ఒక సామెతవుంది. దీనికన్నా ముందు వాక్యం, చేసేవాడికి రెండే చేతులు.

అంటే, కష్టపడే వాడికి వున్నవి రెండేచేతులు. కానీ, విమర్శించేవాడికి వెయ్యినాల్కలు అన్నమాట. అందుకే, ఎంతో కష్టపడి చేసినపనిని కూడా చూసీచూడకుండా, తెలిసీ తెలియకుండా విమర్శించేస్తూంటారు. విమర్శించేసి తమని తాము ఎంతో గొప్పగా భావించుకుంటారు. ఇదెలాగ అంటే, తానెలాగో ఏమీ సాధించలేడు. కానీ, సాధించిన వాడిని తక్కువచేయటం వల్ల వాడికన్నా తాను అధికుడనయిపోయానని అహాన్ని సంతృప్తి పరచుకోవటంలాంటిది.

మన మీడియాలో బోలెడన్ని అవకతవకలున్నాయి. జర్నలిజంలో ఒకప్పుడున్నంత నిజాయితీలేదు. గౌరవం లేదు. ముఖ్యంగా ఒకప్పుడున్నంత విచక్షణ, విఙ్నానమూ ఇప్పుడు లేవు. పాండిత్యమూ కరవయింది. ఇది కాదనలేని సత్యం.

అయితే ఇది కేవలం జర్నలిజానికేకాదు, నిత్య జీవితంలోని ప్రతి రంగానికి, ప్రతి అంశానికీ వర్తిస్తుంది. నైతిక విలువల దగ్గరనించి ప్రతీదీ ఒకప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. వుండకూడదు కూడా. నిత్య పరిణామశీలి అయిన ప్రపంచంలో మార్పులేకపోవటమన్నది మరణమే. కాబట్టి ప్రతీదీ మారుతుంది. మారాలి. ఆ మార్పును అర్ధం చేసుకుని, మమచిని పెంచుతూ, చెడును ఎత్తిచూపి, దాన్ని పరిహరిస్తూ ముందుకు సాగాలి.

కానీ, మన మీడియోద్ధారకులు చెడును చూపటానికి ఇచ్చిన ప్రాధాన్యము మంచిని చూపటానికి ఇవ్వటంలేదు. లోపాలెంచటానికి ఇచ్చిన ప్రాముఖ్యము, కష్టాలను, సాధక బాధకాలను సానుభూతిగా అర్ధంచేసుకుని తగిన సూచనలు సలహాలు ఇచ్చి పరిస్థితిని మెరుగు పరచటం వైపు ఇవ్వటం లేదు.

ఒకోసారి ఈ విమర్శలలో అక్కసుపాళ్ళు అధికంగా కనిపిస్తూంటుంది. తననెవరూ గుర్తించటం లేదనో, తనకు అవకాశాలు ఇవ్వటంలేదనో అన్న కసి ఈ విమర్శల ద్వారా ఎదుటివారిని చులకన చేయటంలో కనిపిస్తోంది. నేనే అయితేనా…… అన్న భావన అడిగడుగునా కనిపిస్తోంది.

గమనిస్తే, ఇప్పుడు మీడియాలో ప్రతి ఒక్కరు ఎంతో ఉద్వుగ్నతామయమయిన పరిస్థితులలో పని చేస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగానికి సంబంధించిన ఉద్విగ్నత మాత్రమే కాదు. ఆ ఉద్వుగ్నతల నడుమ పనిచేస్తూ కూడా నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ చేతనయినంత మంచి చేయాలని చూసేవారనేకులున్నారు. కానీ, నలుపు దృష్టిని ఆకర్శించినట్టు తెలుపు ఆకర్శించదు. పైగా వీరి నిజాయితీ, క్రమశిక్షణ, తెలివితేటలు, ప్రవాహంలో పడిపోవటంతో ఇతరులు గుర్తించరు. గుర్తించినా ఒప్పుకోరు. తమ గొప్పలు తాము చెప్పుకోరు వీరు. అందుకే మీడియాపైన విమర్శలు గుప్పించేవారు వీరి ప్రసక్తి తేరు. వీరి పనులను ప్రస్తావించరు.

కాబట్తి, ప్రింటు మీడియా కానీ, విజువల్ మీడియా కానీ విమర్శకులు చూపుతున్నంత అధ్వాన్నంగా లేదు. ఆ మీడియాలో ఎంతో తపనతో, ఆర్తితో పనిచేసేవారు అనేకులున్నారు. వీలయితే అలాంటి మంచివారి గురించి తెలిపి వారిని ఆదర్శంగా నిలపటం ద్వారా ఇతరులకూ ఎంతో మేలు చేసినట్టవుతుంది.

కానీ, నాకు అవకాశం రాలేదు కాబట్టి, అవకాశం ఇవ్వని మీడియా అంతా పనికిరానిదే అని విమర్శకులనుకుంటే దానికి దోషం మీడియాది కాదు.

నేను పేర్లు చెప్పను కానీ, నాకు తెలిసిన ఒక జర్నలిస్తు ఎలాంటి రాజకీయాలలోకి పోకుండా, ఎవరి భజన చేయకుండా, తన పనినే దైవంలా భావిస్తూ పనిచేస్తూ ఉన్నత స్థాయిలో వున్న్నాడు.

నాకు తెలిసిన మరో జర్నలిస్తు, ఎలాంటి రాజీ పడకుండా, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, తన పరిథిలో కొత్తవారికి, ప్రతిభవున్నవారికీ అవకాశాలిచ్చి ప్రోత్సహించటం నాకు తెలుసు. నేను ఉన్నత స్థానం లో వున్నాను, నా ముందుకు వచ్చి చేతులు కట్తుకుని నిలబడిన వాడే రచయిత, అన్న అహంకారం చూపకుండా, ఎక్కడ ప్రతిభ వుందనిపిస్తే, వారికి స్వయానా ఫోను ద్వారానో, పరిచయస్తుల ద్వారానో కబురు పపంపి మరీ అవకాశాలిచ్చి ప్రోత్సహించటం నేను కళ్ళారా చూశాను.

నాకు తెలిసిన మరో జర్నలిస్టు, ప్రచురణకు స్వీకరించిన కథలు కాక, తిరస్కరించిన కథలు చదువుతాడు. ఎందుకంటే, మంచి కథలు వెనక్కు పోకూడదని, మమచి కథకులు నిరాశ చెందకూడదని.

నాకు తెలిసిన మరో జర్నలిస్టు, తన క్రింది ఉద్యోగులకు ఎంత స్వేచ్చ నిస్తాడంటే, వారికి ఇచ్చిన పేజీలకు వారే ఎడిటర్లు. ఈయన వారి వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. వారివల్ల పొరపాటయితే మాత్రం బాధ్యత తాను వహిస్తాడు.

ఇలా, చెప్తూ పోతే,  అధ్భుతమయిన వ్యక్తులు అనేకులు ఈనాడు మీడియాలో వున్నారు. తమ మేధ ద్వారా మీడియాకు వన్నె తెస్తున్నారు. భావి తరాల వారికి స్ఫూర్తి నిస్తున్నారు. కానీ, వారు స్వయానా తమ గురించి ఏమీ చెప్పుకోరు. ఎవరినీ చెప్పనివ్వరు.

కాబట్టి, నిజంగా మన మీడియాను మెరుగు పరచాలనుకున్న వారు, తప్పులను ఎత్తి చూపించేకన్నా, మంచిని ఎత్తి చూపించే ప్రయత్నం చేయాలి. మంచిని పొగడాలి. అప్పుడు, చెప్పనవసరం లేకుండానే అందరికీ మంచి ఏమితో తెలుస్తుంది. ఏపని చేస్తే గుర్తింపు లభిస్తుందో తెలుస్తుంది.

అందుకే మన పూర్వీకులు మంచిని మైకులో  చెప్ప మన్నారు. చెడును చెవిలో చెప్పమన్నారు. కానీ. ఇప్పుడు చెడును బహిరంగంగా ప్రకటిస్తూ మంచిని చెవిలో చెప్పటం జరుగుతోంది.

నేను కథాసాగర మథనం శీర్షిక ముందు జాగృతి పత్రికలో రాసేవాడిని. ఆరంభంలో అత్యుత్సాహంతో కథలను చీల్చి చెండాడేవాడిని, ఏవో కొన్ని కథలను మెచ్చేవాడిని.

కొన్ని వారాలతరువాత, జాగృతి పత్రిక  అప్పతి ఎడిటర్ రామమోహనరావు గారు గారు ఒక మాటన్నారు.

నీ శీర్షిక బాగుంది. మంచి స్పందన వస్తోంది. ఉపయోగ కరంగా వుంది. కానీ, 90 కథలలో అయిదు మంచి కథలను చూపి 85 బాగోలేని కథలను చూపుతున్నావు. మంచి కథలనే చూపు. మిగతావి బాగోలేవనే అర్ధమవుతుంది. పాఠకుడు అప్పుడు, ఆ మంచి కథలను చదువుతాడు. నీకూ శ్రమ తప్పుతుంది. పాథకుడికీ మంచి ఎక్కడుందో తెలుస్తుంది. అదీగాక, నెలకు 85 మంది నీకు శతృవులవటమూ తప్పుతుంది, అన్నారు.

గొప్ప సత్యం అది. అందుకే అప్పతినుంచీ కథాసాగర మథనంలో చదివిన కథల సంఖ్య చెప్పి, పరిచయానికి ఎంచుకున్న  కొన్ని కథలనే విమర్శించటం ఆరంభించాను.

కథల విషయంలో చేస్తున్నదే మీడియా విషయంలోనూ జరిగితే మంచి పదిమందికి తెలియటమే కాక, మంచి చేసేవారికి ఉత్సాహమూ, ప్రోత్సాహమూ లభిస్తాయి.

August 6, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: నా రచనలు.