Archive for December 27, 2010

ద్రౌపదికి అకాడెమీ అవార్డుకు వ్యతిరేక పోరాటం ఇంకా సాగుతోంది……

అవును…

ద్రౌపది నవలకు సాహిత్య అకాడెమీ అవార్డు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటం చల్లబడిపోయిందనుకుంటే పొరపాటు.  అది ఇంకా కొనసాగుతోంది.

ఈ పోరాటంలో కొందరు కోర్టును ఆశ్రయిస్తే, మరికొందరు నిరసన ప్రదర్శనలను ఆశ్రయించారు. కొందరు విమర్శలతో ఆగ్రహ ప్రదర్శన చేస్తే, కొందరు పుస్తక రచనల ద్వారా తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

నేను సౌశీల్య ద్రౌపది రచన ద్వారా నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను.

అయితే, ప్రముఖ రచయిత, జీ.శ్రీ గంగ, కలం పేరుతో చక్కని కథలు రాస్తూ అవార్డులు పొందుతూన్న నా మిత్రుడు, జీ స్రీనివాస రావు తనదయిన పంథాలో ద్రౌపదికి అవార్డునివ్వటాన్ని వ్యతిరేకిస్తున్నాడు.

శ్రీగంగ నవలా రచనలో తనదయిన ప్రత్యేకతను సేతు రహస్యం, మృత్యురహస్యం వాంటి నవలల ద్వారా ప్రదర్శించారు. ఇప్పుడాయన అకాడెమీ అవార్డు రహస్యాన్ని విప్పిచెప్పటానికి ప్రభుత్వం ఏర్పరచిన  సమాచార హక్కు  సౌకర్యాన్ని ఆశ్రయించారు.

జనవరి నెలలో ప్రశ్న అడిగితే ఏదో కప్పదాటుగా సమాధానాన్ని ఆరునెలల తరువాత ఇచ్చి వూరుకున్నారు అకాడెమీ వాళ్ళు. దానితో సంతృప్తి పడక ఆయన మంత్రిత్వ శాఖకు ఉత్తరం రాశారు. తనకు సంతృప్తి కరమయిన సమాచారాన్ని ఇవ్వలేదని.

ఆయన ప్రయత్న ఫలితంగా, ద్రౌపదితో పాటూ, నామినేట్ అయి, ద్రౌపది కన్నా తక్కువ స్థాయి రచనలుగా జ్యూరీ భావించిన రచనల జాబితా అందింది.

దీనితో ఆయన సంతృప్తి పడక ఆయా రచనలను బహుమతికి అర్హంగా భావించకుండేందుకు సభ్యులు చూపిన కారణాలను కోరారు.

దానికి, విషయం కోర్టులో వుంది కాబట్టి సమాచారం ఇవ్వలేమంది అకాడెమీ. అయితే, కోర్టులో వున్న దాని గురించి అభిప్రాయం వ్యక్త పరచకూడదు కానీ, కోర్టుకిచ్చిన సమాచారాన్ని తెలపకూడదని ఎక్కడా లేదని ఆయన వాదించటం వల్ల చివరికి అకాడెమీ వారు ఆయనతో రేపు వీడియో కాంఫరెన్సును ఏర్పాటుచేశారు.

ఆ వివరాలు రేపు అందిస్తాను.

కానీ, ద్రౌపదితో పోటీ పడి ఓడిన రచనల జాబితా చూస్తే ఆశ్చర్యంతో గుండె ఆగిపోతుంది. సాహిత్యానికి జరిగిన అన్యాయానికి రక్తం వుడుకుతుంది. ఈవార్డులలో జరిగుతున్న కుట్రలు, మోసాలు, అన్యాయాల స్వరూపం బట్టబయలవుతుంది.

ద్రౌపదికి అవార్డు ఇవ్వటాన్ని సమర్ధిస్తూ పుస్తకం చదవకుండానే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఆధునిక అభ్యుదయ అభివృద్ధి చెందిన భావాలకు తామే పెట్టింది పేరుగా, అవార్డును వ్యతిరేకిస్తున్న వారంతా అనాగరిక సాంప్రదాయ బురదలో ఇరుక్కుపోయిన పనికిరానివారుగా భావిస్తూ విర్రవీగిన వారందరూ ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సివుంటుంది…. ఏరకంగా సదాశివ గారి యాది, బిరుదురాజు రామరాజు గారి ఆంధ్ర యోగులు, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారి తెలుగు సాహిత్య విమర్శ, అవంత్స సోమసుందర్ గారి కలలు- కన్నీళ్ళు, కొలకూరి ఇనాక్ గారి, కట్టడి, కొలుపులు, సర్కారు గద్ది, స్వామి నవల మీ రాజ్యం మీరేలండి, తుమ్మేటి రఘోత్తం రెడ్డి కథలు వంటి రచనలు ద్రౌపది ముందు తీసికట్టో సమాధానం ఇవ్వాల్సివుంటుంది.

ముఖ్యంగా యాది, ఆంధ్ర యోగులు, కలలు కణ్ణీళ్ళు వంటి అత్యద్భుతమయిన రచనలను కాదని ద్రౌపదికి అవార్డు ఇవ్వటాన్ని ఏరకంగా సమర్ధిస్తారు?

అకాడెమీ వారు ఇచ్చిన లిస్టు, బోర్డు సభ్యుల వివరాలు  ఈ క్రింద ఇస్తున్నాను. ,

December 27, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: ద్రౌపది