Archive for May, 2011

ఇవాళ్ళ విశాఖపట్నం వెళ్తున్నాను.

ఇవాళ్ళ గోదావరి ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నం వెళ్తున్నాను. విశాఖలో శ్రీకృష్ణదేవరాయలు పుస్తక పరిచయ సభలో పాల్గొనటం కోసం వెళ్తున్నాను.

ఈ సభ విశాఖ పౌర గ్రంథాలయం హాలులో సాయంత్రం అయిదుగంటలకు ఆరంభమవుతుంది. శ్రీమతి జగద్ధాత్రి సభకు అధ్యక్షత వహిస్తారు, శ్రీ సూర్యారావు, సుదర్శన రాజులు పుస్తకం గురించి ప్రసంగిస్తారు. చలసాని ప్రసాద రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

టూకీగా ఇవీ సభ వివరాలు. విశాఖలో వుండే బ్లాగరులు, సాహిత్య పిపాసులు అందరికీ ఇదే ఆహ్వానం.

ఈ సభలో నా పుస్తకాలు, సైన్స్ ఫిక్షన్ కథలు, తీవ్రవాదం, 4క్ష్5, అంతర్మథనం తక్కువ ధరకు లభిస్తాయి.

May 29, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఈనెల 30న విశాఖలో శ్రీకృష్ణదేవరాయలు పుస్తక పరిచయ సభ.

ఈనెల 30వ తారీఖున సాయంత్రం ఆరుగంటలకు విశాఖపట్టణం గ్రంథాలయ భవనంలో శ్రీకృష్ణదేవరాలు పుస్తక పరిచయ సభ జరుగుతుంది.

ఈ సభను రామతీర్థ, జగతి జగద్ధాత్రి గార్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రకంగా విశాఖ సాహితీప్రియులను కలిసే అవకాశం నాకు లభిస్తోంది. నా పుస్తకాల గురించి చర్చించే వీలు లభిస్తోంది.

ఈ సందర్భంలో ఇటీవలే ఒక పాఠకుడు నాతో అన్న మాటలను కొంచేం గర్వంగా, కొంచెం భయంగా మీతో పంచుకుంటున్నాను.

గర్వం ఎందుకో ఆ మాటలు విన్న తరువాత మీకే అర్ధమవుతుంది.

భయం ఎందుకో ఆ మాటలు తెలుసుకున్న తరువాత మీకే తెలుస్తుంది.

గుంటూరులో సభ పూర్తయిన తరువాత ఒకాయన నా దగ్గరకు వచ్చాడు. ఆయన నాకు పరిచయం లేదు. ఆయన తనని తాను పరిచయం చేసుకుంటూ, నా రాజతరంగిణి కథలు, సౌశీల్య ద్రౌపది చదివానన్నాడు. భారతీయవ్యక్తిత్వవికాసం చదువుతున్నానన్నాడు. నా పేరువిని నన్ను కలిసేందుకు వచ్చానన్నాడు. అని మాటల మధ్యలో , ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఏకైక తెలుగు రచయిత ఎవరయినావుంటే అది నేనేనని నాతో అన్నాడు.

ముందు నాకనేమన్నాడో అర్ధంకాలేదు. అదేమిటి అని అడిగాను.

ప్రస్తుతం తెలుగులో సీమాంధ్ర రచయితలున్నారు. కళింగాంధ్ర రచయితలున్నారు.రాయలసీమ రచయితలున్నారు. తెలంగాణా రచయితలున్నారు, దళిత రచయితలున్నారు, ఉద్యమ రచయితలున్నారు. కానీ తెలుగు రచయిత మీరొక్కరే, అన్నాడు.

అంతేకాదు, రివ్యూలతో సంబంధంలేకుండా, విమర్శకుల పొగడ్తలు, ఇతర ప్రచారాలతో సంబంధంలేకుండా, తిన్నగా రాష్ట్రం నలుమూలలా పాఠకుల దగ్గరకు వెళ్ళి పుస్తకాలను పరిచయంచేసి అమ్ముకుంటున్న ఏకైక రచయితనూ నేనే అన్నాడు. ఎందుకంటే, నా పుస్తక పరిచయ సభలను సాహిత్య సంస్థలో, సాహిత్యలోకానికి సంబంధించిన వ్యక్తులో కాదు. నా రచనలను మెచ్చిన పాఠకులు తామే ఏదో రకంగా సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావటంలేదు. శ్రీకృష్ణదేవరాయలు పుస్తక సభలు ఇంకా, హిందుపూర్, పెనుకొండ, కరీం నగర్, వరంగల్ లలో జరగాల్సివుంది. ఇప్పటికి, గుంటూరు నిజామాబాద్ లలో జరిగాయి. 30న విశాఖలో జరుగుతోంది.
ఆరోజు వీలు చూసుకుని విశాఖ పరిసర ప్రాంతాలలో వున్నవారు సభకు రావాలని ఇదే నా ఆహ్వానం.తెలుగురచయితకు ప్రోత్సాహం ఇవాలని నా విన్నాపం.

May 23, 2011 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: నా రచనలు.

నిజామాబాద్ సభ విశేషాలు.

నిజామాబాద్ సభ అత్యంత సంతృప్తిని కలిగించింది, ఆనందానుభూతిని  మిగిల్చింది.

సభ రైల్వే స్టేషన్ ఎదురుగా వున్న గీతాభవన్ లో. అక్కడ లైబ్రేరియన్ మేడిచర్ల ప్రభాకర రావు గారు పరిచయమయ్యారు. ఆయన దాదాపుగా 15 పద్య కావ్యాల పుస్తకాలు ప్రచురించారు. వాటిని చూపారు. వారితో మాట్లాడుతూ, సమయం చిక్కినప్పుడల్లా ఆ పద్యాలను చదువుతూ కూచున్నాను.

సభ ఆరంభమవుతోంది రమ్మని సభను ఏర్పాటు చేసిన కిరణ్ కుమార్ పిలిచారు. ఈయనను నేను దాదాపుగా అయిదారేళ్ళ క్రితం కేవలం 10 నిముషాలు కలిశాను. ఆయన నా నవల అసిధార చదివి నన్ను కలవటానికి నిజామాబాద్ నుంచి వచ్చాడు. అప్పుడొక 10 నిముషాలు మాట్లాడుకున్నాం. అప్పటి నుంచీ అప్పుడప్పుడూ ఫోను చేస్తూంటాడు. ఆంధ్రభూమిలో శ్రీకృష్ణదేవరాయలు సీరియల్ చదివి ఫోను చేస్తే త్వరలో అది పుస్తకం రూపంలో వస్తోందని చెప్పాను. అయితే నిజామాబాద్ లో సభ చేస్తానన్నాడు. అన్నట్టే సభను ఏర్పాటు చేశాడు.

సభ ఆరంభమవుతూంటే నేను అతడిని, అయాచితం నటేశ్వర శర్మ గారు రాలేదా అని అడిగాను. అదిగో అంటూ ఆయనను చూపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాము. నా రచనలు చదువుతూంటానని ఆయన చెప్పారు. కలసిన అయిదు నిముషాలలో ఆత్మీయులుగా మాట్లాడుకున్నాము. సాహిత్య మాఫియా ముఠాలు, సాహిత్య అంటరానితనం విషయాలలో మాకు చాలా మటుకు అభిప్రాయాలు కుదిరాయి.

ఇంతలో సభ ఆరంభమయింది. అందరినీ స్టేజి మీదకు పిలిచారు. అప్పుడు డాక్టర్ త్రివేణి గారిని చూశాను. అయితే, నా దృష్టి సభలో స్టేజీ క్రింద వున్న వారి పైనే వుంది. ఎందుకంటే స్టేజీపైన ఏడుగురుంటే స్టేజీ క్రింద ఆరుగురున్నారు. దానిలో ఒకామె అందరినీ స్టేజి పైకి ఆహ్వానించినామె. ఇదారు ప్రెస్ రిపోర్టర్లు!

నాకు చాలా నిరాశగా అనిపించింది. సభకు ముందే ఒకాయన అక్కడి రాజకీయాలగురించి చెప్పాడు. ఒక వర్గం వారు సభ చేస్తే మరో వర్గం వారు దాన్ని విజయవంతం కాకుండా చూస్తారని. కానీ, నాకెందుకో నిరాశగా అనిపించింది. ఎప్పుడు సాహిత్య ప్రపంచాన్ని ఈ వ్యక్తిగత రాజకీయాల జాడ్యాలు వదులుతాయో అనుకున్నాను.

ఇంతలో అధ్యక్షురాలు డాక్టర్ త్రివేణి గారు మాట్లాడటం ఆరంభించారు. అంతే నా నిరాశ క్షణంలో మాయమయిపోయింది. ఆమె నవలలోని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని చదవటమే కాదు, దాన్లో నేను చేసిన ప్రయోగాలను, చూపిన చమత్కారాలను అర్ధంచేసుకొని అనుభవించి వాటిని వివరిస్తోంది. నా మనసు ఆనందంతో విహంగమయి వినువీధిన విహరించసాగింది. ఎందుకంటే ఇంతకాలం నేను చేసిన రచనలను ఇంత లోతుగా అర్ధంచేసుకుని అనుభవించి వ్యక్త పరచే విమర్శకుడిని నేను కలవలేదు.

నేను నా ప్రతి రచనలో అనేక రకాల ప్రయోగాలు, చమత్కారాలు చేస్తూంటాను. అనేక విషయాలను పొందుపరస్తూంటాను. కానీ, మన పత్రికలలో సమీక్షల పరిథి కొద్ది లైన్లు మాత్రమే. సాహిత్య పేజీలలో విశ్లేషణలు కొద్ది మందికి మాత్రమే. అలాంటి పరిస్థితులలో నా రచనలలోని సొంపులను, సొబగులను, లక్ష్యాలను, లావణ్యాలను పాఠకులకు నేనే వివరించాల్సి వస్తుందని చాలా బాధ పడుతూన్నాను.

ఒక ఎడిటర్ ని కలసి రాజతరంగిణి కథలలో నేను చేసిన చమత్కారాలు, పొందుపరచిన అంశాలు, ప్రతీకలు వాటి నిగూఢార్ధాలు వివరిస్తూ నేను ఒక వ్యాసం రాసేందుకు అనుమతి అడిగాను. నేను చెప్పింది విని ఆయన నన్ను మెచ్చుకున్నాడు. ఈకాలంలో ఇలాంటి రచనలు చేయగలవాడు మరొకడులేడని పొగిడాడు. విమర్శకులంతా ఏదో పుస్తకం చదివి ముందుమాట ఆధారంగా నాలుగు ముక్కలు రాయగలిగేవారే తప్ప ఎవ్వరికీ విమర్శ అంటే ఏమిటో తెలియదని అన్నాడు. కానీ, నాకు కనుక నా కథల గురించి నేను రాసుకునే అవకాశాన్నిస్తే, గద్దల్లాంటి రచయితలంతా తమ కవితలు, కథలు, నవలలగురించి తాము రాసుకుంటామని చంపేస్తారని అన్నాడు. అందుకే, నా బాధ అర్ధమవుతూన్నా, నాపైన  సానుభూతి వున్నా, నా కోరిక సమంజసమయినదే అయినా, సారీ అన్నాడు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పత్రికలో అనేక కథకుల రచయితల కథలగురించి, రచనల గురించి ఘూకం కేక బేకం బాకాలు మోగుతూనేవున్నాయన్నది వేరే సంగతి. వారి పరిమితులను, బలహీనతలను నేను అర్ధం చేసుకోగలను. నాతో వుంటే, తనని కూడా హిందూ చాందసవాది అనుకుంటారని , మెయిన్ స్ట్రీం జర్నలిస్టులంతా దూరం పెడతారని నా పదేళ్ళ స్నేహితుడు నాతో మాట్లాడటమే మానేశాడు. అంత శక్తిమంతం మన సాహిత్య మాఫియా ముఠాల సాహిత్య అంటరానితనం.

అందుకే డాక్టర్ త్రివేణి గారు నా రచన గురించి వ్శదంగా, విపులంగా, లోతుగా విశ్లేశిస్తూంటే నేను పొంగిపోయాను. కల నిజమయినంతగా ఆనందపడ్డాను. ఇలాంటి ఒక్క విమర్శ వినేందుకు ఎన్ని అవమానాలయినా, వివక్షతలయినా అనుభవించవచ్చానిపించింది. ఆవిడని నేను చూడటం అదే ప్రధమం. మాకు పరిచయం కూడా కాలేదు. మేము ఒక్క మాటా మాట్లాడుకోలేదు. కానీ నా రచన ద్వారా ఆమె నా హృదయాన్ని తెరచిన పుస్తకంలా గ్రహించేసింది. నా రచనల నేపథ్యాన్ని, లక్ష్యాన్ని వివరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను సృజిచిన శ్రీకృష్ణదేవరాయల ద్వారా రచయితగా నన్ను సంపూర్ణంగా అర్ధంచేసుకుంది.

సభలో సంఖ్యల్;ఏరన్న నిరాశ మాయమయింది. నిజానికి ఆవిడ నాతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.

అయాచితం నటేశ్వర శర్మ గారు ఈ రచనను ఒక వచన కావ్యం అన్నారు. ధన్యుడను. ఆయన నా పదప్రయోగాల గురించి చెప్పారు. ఇదొక వచనకవిత్వమని నిరూపించారు. వచన కవిత్వంగా చలామణీ అవుతున్నదానిలో కనబడని రసం ఇందులో కనబడుతుందని అన్నారు.

పడాల రామారావు గారు మాట్లాడుతూ రచనలో నా చమత్కారాలను ఉదాహరించారు. పదాలను విరిచి, మార్చి నేను సృజించిన దృష్యాలను ఆయన ఎత్తి చూపించారు. ఇదొక వచన కావ్యమని నిర్ధారించారు.

ఇంతలో సభ నిండింది. కానీ, అప్పటికే నా కడుపు, హృదయం నిండిపోయాయి.

నేను శ్రీకృష్ణదేవరాయల రచన చేసిన విధానాన్ని నాపై పరిమితులను అధిగమించిన వైనాన్ని వివరించాను. నా రచనను ఇంత లోతుగా చదివి అర్ధం చేసుకున్న వారికి జోహార్లర్పించాను. చారిత్రిక నవలల ప్రయోజనం సమకాలిక ప్రపంచానికి అవి ఇవ్వగల సందేశాలను వివరించాను.

ముఖ్యంగా, రాయలను మోసం చేసిన తురకవాడికి ఆదిల్షా ఆశ్రయమిచ్చి, అలాంటివాడులేడని బుకాయిస్తే రాయలు తురకల సామ్రాజ్యాలపై దాడిచేసి వారికి గుణపాఠాన్ని నేర్పిన వైనాన్ని ప్రస్తుతం మనం దావూద్ ఇబ్రహీం, ముంబాయి దాడుల సమయంలో మన నేతల ప్రవర్తనతో పోల్చి చూపాను. అంతేకాదు, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోనివారు ఆ తప్పిదాలను మళ్ళీచేస్తారు కాబట్టి వారికి ఆ తప్పిదాలను గుర్తుచేయాల్సిన బాధ్యత సృజనాత్మక కళాకారులది, మేధావులదీ అని చెప్పాను. మన మేథావులు ఆ పని చేయటంలేదు. పైగా మన ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తున్నారు. కాబట్టి సృజనాత్మక రచయితగా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నానై, నన్ను ఎంతగా విస్మరించాలని సాహిత్య పెద్దలు ప్రయత్నిస్తూన్నా విస్మరించేవీలివ్వటంలేదనీ చెప్పాను. పత్రికలు కొన్ని నా పుస్తకాల సమీక్షలు ఇవ్వకపోయినా, పుస్తకాల దుకాణాలు నా పుస్తకాలు అమ్మకపోయినా, ఇప్పుడు పాఠకులే ముందుకు వచ్చి సభలు చేస్తున్నారని, ఆ రకంగా పాఠకులను నేను చేరుకోగలుగుతున్నానేఎ చెప్పాను. ఈ సందర్భంలో ఒక రాజతరంఘిని కథ, మూలంలో ఏలావుంది, దాన్ని నేను ఆధునిక సమాజానికి ఎలా అన్వయిస్తూ కథను సృజించానో చెప్పాను. సబ్భలో వున్నవారిపైన దాని ప్రభావం చూసిన తరువాత నాకొక నమ్మకం కలిగింది. ఎవరెంత ప్రయత్నించినా, నా రచనలు పాఠకులను చేరితేచాలి, అవి వారి హృదయాలలో నిలుస్తాయి. సభ అయిన తరువాత ఒకాయన వచ్చి, నేను రాసిన మర్మయోగం చదివినప్పటినుంచీ నన్ను కలవాలనుకుంటున్నానని చెప్పాడు. మరొకాయన అసిధార, భారతీయ వ్యక్తిత్వ వికాసం గురించి అడిగాడు. ఇంకొకాయన రియల్ స్టోరీలగురించి పొగిడాడు. నాకు ఎంతగా ఆనందంగా అనిపించిందంటే నేను ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు, 14500 అడుగులవద్ద మంచు తుఫానులో ఇరుక్కుని, రాత్రంతా వణుకుతూ తల్లారి చూస్తానో లేదనుకుంటూ గడిపినతరువాత ఉదయం 330-4 గంటల నడుమ ఆకాశంలో సూర్యునివెలుగురేక కనిపించి, క్షణంలో కొండల శిఖరాలన్నీ బంగారురంగులోకి మారినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ సభ పూర్తయ్యేసరికి అంత ఆనందం కలిగింది.

సభలో ఒకాయన మొదటినుంచీ మూలన కూచుని శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం చదువుతున్నాడు. సభ అయిన తరువాత ఆయన నా దగ్గరకు వచ్చు చేయికలిపి ఈతరానికి తగ్గ రచన ఇది. ఇంతకన్నా ఎక్కువయితే వారు చదవరు. ఇంతలోనే నాయకత్వ లక్షణాలు, ధార్మికత, ఆధ్యాత్మికత,నైతికవిలువలు, మన ధర్మం. వంటి అన్ని విషయాలు చెప్పారు అని కౌగలించుకున్నాడు. ఆయన తన విద్యార్ధులకు ఇచ్చేందుకు 35 కాపీలు కొన్నాడు. ఇది పాఠ్యపుస్తకాలతో పాటూ చదివిస్తాను. అన్నాడు.

ఆనందం, సంతోశం, సంతృప్తి అన్న పదాలు సరిపోవటంలేదు.

మరుసటి రోజు, అంటే ఇవ్వాళ్ళ నేను అక్కడి విధ్యార్ధినీ విధ్యార్ధులతో ఎంత ఆనందంగా ముచ్చటించానంటే, వారూ నన్ను అభిమానించారు. నా ఆ ఆనందం ఇంకా తగ్గలేదు.

నేను క్లాసయిన తరువాత వచ్చేస్తుంటే, నా క్లాసు విన్న ఒక అధ్యాపకుడు బస్సుఎక్కిస్తూ అన్నాడు,  అసిధార కొన్ని కాపీలు కావాలని. నేను కాపీలయిపోయాయి. మళ్ళీ ప్రింటు చేయాలి, కానీ, కొత్త పుస్తకాలు ప్రింటు చేయాల్సినవి బోలెడుండగా, పాతవాటినే ప్రింటు చేయటము అమ్ముడవుతాయో లేదో ఎదురుచూడటం మూర్ఖత్వమని ఆగానని చెప్పాను. దానికాయన నా చేతిలో చేయివేసి చెప్పాడు, ఎంతవుతుందో చెప్పండి, ఇక్కడి ఉపాధ్యాయులమంతా చందాలు వేసుకుని రిప్రింటు ఖర్చు భరిస్తామన్నాడు.

my cup is full. i have no more to say…only a lot to write

May 15, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము

నేను నిజామాబాద్ వెళ్తున్నాను.

రేపు సాయంత్రం అయిదున్నరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా వున్న గీతా భవన్ లో శ్రీకృష్ణదేవరాయలు పుస్తక పరిచయ సభ జరుగుతుంది. ఆ సభ కోసమని రేపు నేను నిజామాబాద్ ప్రయాణమవుతున్నాను.

ఉదయం నాందేడ్ ఎక్స్ప్రెస్ లో బాసరకు వెళ్తాను. అక్కడ టాగోర్ విద్యానికేతన్ లో భారతీయ వ్యక్తిత్వ వికాసం గురించి ఒక చిన్న చర్చ జరుగుతుంది. తరువాత నిజామాబాద్ వెళ్తాము. అక్కడ పుస్తక పరిచయ సభ జరుగుతుంది.

రాత్రికి నిజామాబాద్ లో వుండి మరుసటి రోజు తెల్లారే కామారెడ్డి ప్రయాణమవుతాము. అక్కడ రెండు సమ్మర్ కాంపుల్లో భారతీయవ్యక్తిత్వ వికాసం గురించి చర్చలు జరుగుతాయి. సాయంత్రం కామారెడ్డిలో తిరుగు రైలు ఎక్కి బొలారం చేరతాను. అక్కడ నా స్నేహితుడి ఇంట్లో నా బండి తీసుకుని ఇల్లు చేరుకుంటాను. ఇవీ  ఈ శని ఆదివారాలలో నా కార్యక్రమాలు.

శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం కూడా సౌశీల్య ద్రౌపదిలానే లాభాల దిశలో ప్రయాణిస్తోంది.

నిజామాబాద్ సభ తరువాత, ఈనెల 30వ తారీఖున విశాఖపత్ణం లో సభ జరుగుతుంది. ఇంకా వరంగల్, ఖమ్మం, తెనాలి లలో కూడా సభ జరిగే అవకాశాలున్నాయి.

సౌశీల్య ద్రౌపది పుస్తకాల దుకాణాలలో కన్నా సభలలోనే ఎక్కువగా అమ్ముడయింది. ఇలాంటి సభల వల్ల పుస్తకం గురించి పదిమందికీ తెలుస్తుంది. తద్వారా పుస్తక సమీక్షలు, విమర్శకుల పొగడ్తల చర్చలతో సంబంధం లేకుండా, ఒక పుస్తకం కనీసం కొన్ని వందల కాపీలయినా అమ్ముడుపోతుంది. ఇక ఆపై పుస్తకం నిలవటం అన్నది కాలంపైన విధిపైనా, పాఠకులు ఎంతగా దాన్ని ఆదరిస్తారన్నదానిపైనా ఆధారపడివుంటుంది.

నా మచిలీపట్నం సభ విశేషాలు రాయాలంటే ఫోటోలు ఇంకా చేరక పోవటం అడ్డొస్తోంది.

May 13, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నిజామాబాద్ లో శ్రీకృష్ణదేవరాయలు పుస్తక పరిచయ సభ..

ఈ శనివారం, అంటే 14వ తారీఖున నిజామాబాదులో రైల్వే స్టేషన్ ఎదురుగా వున్న గీతా భవనం లో సాయంత్రం ఆరుగంటలకు శ్రీకృష్ణదేవరాయలు పుస్తక పరిచయ సభ జరుగుతుంది. ఆయాచితం నటేశ్వర శర్మ గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు.

మిగతా వివరాలు త్వరలో….

May 11, 2011 · Kasturi Murali Krishna · 5 Comments
Posted in: Uncategorized

నేను మచిలీపట్ణం వెళ్తున్నాను.

నేను ఇవాళ్ళ రాత్రి మచిలీపట్ణం ఎక్స్ప్రెస్ లో మచిలీపట్ణం వెళ్తున్నాను. నిజానికి నాకు బహుమతినిచ్చే సభ ఆదివారం ఉదయం జరుగుతుంది.  కానీ, మచిలీపట్ణం నుంచి వెలువడుతున్న సన్ ఫ్లవర్ వీక్లీ పత్రికతో నేను రాస్తున్న సీరియల్ వల్ల సంబంధం కలిగింది. ఆ సీరియల్ ను పాఠకులు బాగా స్వీకరిస్తూండటంతో నన్ను ఒక రోజు ముందు రమ్మన్నారు. అదీగాక, మిత్రుడు, విడియాల చక్రవర్తి కూడా ఒక రోజు ముందు రమ్మనటంతో ఇవాళ్ళే బయలు దేరుతున్నాను. ఇంతకీ, నాకు  ఇస్తున్న ఈ ఉత్తమ జర్నలిస్టు అవార్డును విడియాల చక్రవర్తి వారి తండ్రి స్మారకార్ధం ఏర్పాటు చేసిన అవార్ డు.

మళ్ళీ ఆదివారం సాయంత్రం బయలు దేరి హైదరాబాదు వచ్చేస్తాను. సోమ వారం నుంచీ ఉద్యోగానికి వెళ్ళాలి కదా!

May 6, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized