Archive for June, 2011

చిత్ర మాస పత్రికలో నా పూర్తి నవల జూలై సంచికలో.

జూలై నెల చిత్ర మాస్పత్రికలో నా పూర్తి నవల ప్రచురితమవుతోంది.
సాధారణంగా మాస పత్రికలలో ఒక మినీ నవల వుంటుంది. చిత్ర మాస పత్రికలో ఒక సారి కథలు, మరో సారి నాటకం, ఇంకోసారి నవల, ఇలా వేర్వేరు అంశాలుంటాయి.

జూలై నెలలో ఈ అనుబంధంలో నా నవల, జగమే మారినదీ అనే నవల ప్రచురితమవుతోంది.

ఈ నవల మొత్తం జగమే మారినదీ మధురముగా ఈవేళా అనే పాట చుట్టూ తిరుగుతంది. రకరకాల సందర్భాలలో పాత్రల మానసిక స్స్థితినిబట్టి పాట వస్తూంటుంది. గతంలో నేను యేరాత్ భీగీ భీగీ అనే హిందీ పాటలో చరణంలోని పంక్తుల ఆధారంగా, స్వప్నవాసంతం అనే మినీ నవల రాశాను. ఇది ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురితమయింది.

జగమే మారినదీ, నవల మామూలు నవలలౌ కాస్త భిన్నం. ఆధునిక సామాజిక పరిస్థితులను సమీక్షిస్తూ, అవి స్త్రీ పురుష సంబంధాలపై చూపుతున్న ప్రభావాన్నీ, మారుతున్న తరాలకనుగుణంగా మారుతున్న ఆలోచనలనూ ఈ నవల ప్రతిబింబిస్తుంది.

మాస పత్రికలో ఈ నవలను చదివి మీ అభిప్రాయాలను తెలుప ప్రార్ధన.

ఈనెల నుంచీ పాలపిట్ట మాసపత్రికలో నాది సరికొత్త శీర్షిక ప్రారంభమవుతోంది.
తెలుగు సినిమా పాటలలో సాహిత్యాన్ని విశ్లేశిస్తూ రాస్తున్న శీర్షిక ఇది. మొదటి వ్యాసం, ప్రేయసిని వర్ణించే రెండు పాటల గురించి. బహుషా తెలుగు పాటలలో సాహిత్యాన్ని గురించిన అరుదయిన శీర్షిక ఇది అవుతుందేమో!

June 25, 2011 · Kasturi Murali Krishna · One Comment
Tags: , , , ,  · Posted in: నా రచనలు.

అసలయిన హీరో-రాహుల్ ద్రావిడ్.

నేను రాహుల్ ద్రావిడ్ వీరాభిమానిని. గవాస్కర్ రిటయిరయిన తరువాత క్రికెట్ చూడటం మానేసిన నేను rahulమళ్ళీ ద్రావిడ్ కోసం క్రికెట్ చూడటం ఆరంభించాను.

ద్రావిడ్ ఆడుతూంటే చూస్తాను. అతనవుటవగానే టీవీవదలి వేరే పని చూసుకుంటాను. ద్రావిడ్ ను నేను ఇష్టపడటానికి అతని ఆటతో పాటూ అతని వ్యక్తిత్వం కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా, జట్టు భవిష్యత్తు గురించి ద్రావిడ్ తీసుకున్న అనేక నిర్ణయాలు నాకు నచ్చాయి. కెప్టెన్ గా వున్నప్పుడు భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని కొత్త యువ ఆటగాళ్ళను తెరపైకి తెచ్చాడు ద్రావిడ్. కోహ్లి, రైనా, ధోని వంటి వాళ్ళు ఈనాడు ఆడుతున్నారంటే ఎందరికో ఆగ్రహం కలిగిస్తూ ద్రావిడ్ తీసుకున్న నిర్ణయాలు కారణం.

కానీ, ఎన్నడూ ద్రావిడ్ కు తగిన గుర్తింపు లభించలేదు. తగిన రీతిలో అతడి ఆటను విశ్లేషించటమూ జరగలేదు. ఇప్పుడు ద్రావిడ్ వందపరుగుల ఆధారంగా మనం టెస్టు గెలిచినా ఎక్కడా పెద్దగా ద్రావిడ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అయినాసరే ఏమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూపోతూంటాడు ద్రావిడ్. అతనికి ఇది అలవాటు. అందుకే ద్రావిడ్ నాకు నచ్చుతాడు. ఒకరకమయిన నిర్మోహత్వం, స్తితప్రౙ్నత్వం అతనిలో కనిపిస్తాయి.

భారత్ గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ, ద్రావిడ్ మరింత  అధ్భుతమయిన  ఆట తీరుతో ఆడినన్నాళ్ళూ భారత్ను గెలిపిస్తూండాలని ఆశిస్తున్నాను.

June 24, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

ఈ కవిత తప్పకుండా చదవండి.

నేను కవితలు ఆధినిక, వచన కవితలు, హైకూలు, నానోలతో సహా ప్రతీదీ చదువుతాను. ఎప్పుడయినా ఎక్కడయినా, మనసుకు నచ్చే  భావమున్న కొన్ని భావ వాక్యాలున్న కవిత ఒక్కటయినా దొరకకపోతుందా, అన్న ఆశతో, ప్రతీదీ చదువుతూంటాను. నవ్వుకుంటూంటాను. కొన్నిటికి నొట్టూర్పులు విడిచి దేవుడికి దండం పెట్టుకుంటాను. మరికొన్ని చదివిన తరువాత దెవుడుకూడా ఏమీ చేయలేని నిరాశక్తుడని గ్రహించి అతడిని కష్టపెట్టటం ఎందుకని వదిలేస్తూంటాను. ఇటీవలె వచ్చిన అనేక అనే దశాబ్ద కవితల సంకలనం ఎంతో ఆశతో అరువుతెచ్చుకుని చదివి నిట్టొర్చి వదిలేశాను. దాన్లో నామాడి స్రీధర్ కవిత నాకు చాలా చాలా నచ్చింది. అయితే నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నది, ఒక ప్రముఖ కథారచయిత్రిగా నాకు పరిచయమయిన శ్రీవల్లీ రాధిక రచించిన సాధన అనే కవిత గురించి.

ఆమధ్య నేను పాత ఆంధ్రభూములు తిరగేస్తూంటే శ్రీవల్లి రాధిక రచించిన ఒక కవిత కనబడింది. చదివాను. ముగ్ధుడనయ్యాను. అత్యంత ఆధ్యాత్మిక భావనలు అతి సరళంగా, అతి సుందరంగా ఆ కవితలో పొందుపరచారావిడ. ఆవిడ కథలు చదివితే కలిగిన అభిమానం, ఈ కవిత తో గౌరవంగా మారింది. ఆ విషయం ఆవిడతో చెప్పాను కూడా. ఇప్పుడు, ఈవారం నవ్యలో వచ్చిన ఈ కవిత చదివిన తరువాత, ఆవిడతో చెప్పటంకన్నా, బ్లాగర్లందరితో పంచుకోవాలనిపించంది. మనకు తెలిసిన మంచి ఎంతమందికి చెప్పితే అంత ఆనందం. ముఖ్యంగా, తవికలుగా సైతం గుర్తింపు పొందే అర్హత లేని పివికల పీలికలు రాసేసి గూప్ప కవులుగా చలామణి అవుతూ బహుమతులు పొందుతున్న వారు కానీ, వారిని అందలం ఎక్కించి, లబ్ధిపొందుతూన్న విమర్శకులుకానీ ఈ కవితను చదవరని, చదివినా అర్ధంకాదని, అర్ధమయినా వారు ఎవ్వరికీ ఈ విషయం చెప్పరనీ తెలుసు కాబట్టి ఇప్పుడు మంచి పదిమందితో పంచుకునే వీలుంది కాబట్టి ఆ కవిత గురించి నా అభిప్రాయాన్ని అందరిముందుంచుతున్నాను.

ప్రస్తుతం సాహిత్య ప్రపంచంలో కొన్ని పడికత్తు భావాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి. వాటిని రాసేవారే కవులుగా గుర్తింపులు, ఆదరణలు పొందుతున్నారు. అలాంటి సమయంలో, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, ప్రకటించారు రాధికగారీకవితలో.
మహిళనగానే పైటలు తగలేయటం దగ్గరనించి, విప్లవాత్మక భావాలు ప్రదర్శించాలనీ, పురుషులను పురుగుల్లా చూపుతూ, దూషిస్తూ, వారి రాక్షసత్వాన్ని బహిరంగ పరచి ఈసడించాలన్న్న అభిప్రాయం స్థిరపడింది. వీరి కథలు, కవితలూ , ఆక్రోషాలూ, ఆవేషాలూ చూస్తూంటే మనిషిగా అయిపుట్టటంకన్నా, ఏ పురుగుగా పుడితే ప్రేమ భావనలు లేకున్నా కనీసం ద్వేషభావనలుండేవి కావుకదా అనిపిస్తుంది.

ఈ కవితలో ఒక సున్నితమయిన భావనను, మానవ సంబంధాలలోని ఔన్నత్యాన్ని రాధికగారు ప్రదర్శించారు.
విౙ్నానపు జడను వత్తుగా అల్లుకుని, ప్రఙ్నను పూలుగా తురుముకుంటూటే , జడతో కట్టేసుకోవాలని అనుకుని అందరూ బుగ్గలు నొక్కుకున్నారట. గొప్ప భావం.

ఇక్కడ విఙ్నానపు జడ, ప్రఙ్న పూలు అన్న ఆలోచనే అధ్బుతం అనిపిస్తుంది.

నియమ నిష్టల మణులు, అనుష్టానాల నగలను బరువని అందరూ పెదవి విరిచారట.

పెళ్ళి అంటేనే అదేదో అసహ్యమూ, అసభ్యమూ అయిన పదంలా చూస్తూ, ప్రేమ పెళ్ళి, రిజిస్టెర్ మారేజీలు, లివ్ ఇన్ రిలేషన్ షిప్పులూ ఆధునికం గూప, అసలు మానవ సంధాలలోని ఔన్నత్యానికి సిసలు ప్రతీక అని ప్రచారం చేస్తూంటే, కవయిత్రి, నియమ నిష్టల మణులూ, నిత్యానుష్టానాల నగల గురించి మాట్లాడటమే అద్భుతం! అసలీ పదాలను హేళన గా తప్ప ఇలా అర్ధవంతంగా వాడేదెవరు?
జపాలు, తపాలు, వ్రతాలు, వర్తనలు, సర్వాభరణాలు, సంకెళ్ళాని, వాటిని మొగుడు వొలిచేస్తాడని సరసాలాడేరట.

బొట్టుపెట్టుకుంటేనే అటవికులుగా భావించి, గాజులు వేసుకుంటే, నేరంచేసినట్టు చూసేవారే మేధావులుగా మన్ననలందుకునే చోట ఇలాంటి సరసాలు సహజం కదా!

అయితే, ఇలాంటి వాటన్నిటికీ, అమ్మాయి సమాధానం ఇస్తూ తన అలంకరణలు తాను చేసుకుని అహపు వలువల  స్పృహ అయినా లేకుండా అతని ముందు నిలిచేందుకు సిద్ధమయింది.

అధ్భుతమయిన భావం. మానవ సంబంధాలలో అహం వహించే పాత్రను ఎంతో చక్కగా, చూపుతూ, మహిళల అలంకారాల మేలిముసుగ్ తొలగించి అసలు రూపును ప్రదర్శించిందీ కవితద్వారా రచయిత్రి. విప్లవం కన్నా సమన్వయంలో, ఒకరినొకరు అర్ధం చేసుకొనటంలోని సౌందర్యాన్ని చూపింది కవయిత్రి.

ముఖ్యంగా, చివరి చరణాలవల్ల ఈ కవితను భౌతిక స్థాయినుంచి ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగించింది కవయిత్రి. స్త్రీ ప్రకృతి, అని మగవాడు పురుషుడు అన్న భావననుంచి, స్త్రీ పురుషుల కలయికలోని ఆధ్యాత్మికతను ఎంతో మార్మికంగా సూచించింది రచయిత్రి ఈ కవితలో.

అందుకే ఈ కవిత చదవగానే ఎంతో ఆనందం అనిపించింది. మీరూ చదవండి. కవితలోని సౌందర్యాన్ని గ్రహించండి. భావాన్ని గ్రహించండి. చాలాకాలం తరువాత ఉన్నతభావాలున్న మంచి వాక్యాల కలయికలున్న కవితను చదవండి. మీకూ నచ్చితే పదిమందితో పంచుకోండి. నచ్చకపోతే, ఇప్పుడొస్తున్న అనేక కవితలలాగే దీన్నీ మరచిపోండి. నన్ను తిట్టుకోండి.

June 18, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

మచిలిపట్నం, నిజామాబాద్, విశాఖ- ఫోటోలు.

మచిలీపట్నం సభ ఫోటోలు పపంపుతారేమోనని ఇప్పటి వరకూ ఎదురుచూశాను. ఇక అవి రావని నిర్ణయించుకుని, నేను మచిలీపట్నం లో తీసిన ఫోటోలు, నిజామాబాద్ ఫోటోలు, విశాఖలో ఫోటోలు వుంచుతున్నాను.

ఇందులో ఇంటి ముందు నుంచున్నది, విడియాల చక్రవర్తి.

నాతో వున్నది, అయాచితం నటేశ్వర శర్మ గారు.

ఫోటోలో వున్నవారు, రామతీర్థ, జగతి జగద్ధాత్రి.

మొదటి మూడు ఫోటోల తరువాత మచిలీపట్నం లో నేను చూసిన కొన్ని గుడులు, వీధుల ఫోటోలున్నాయి. మచిలీపట్నం బ్లాగర్లీ గుడులు, వీధులను గుర్తుపట్టాలి. వాటి పేర్లు చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June 13, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

నేను బిజీ బిజీ….

నేను నా బ్లాగులో రాసే రాతలు కంప్యూటర్ ముందు నేను గడపగల సమయం పైన ఆధారపడివుంటుంది.

కాగితం పైన నేను చాలా వేగంగా రాస్తాను. అదే కీ బోర్డుపైకి వచ్చేసరికి నా వేగం తగ్గిపోతుంది. అందుకే, ఏదయినా ఎక్కువ రాత అయ్యేసరికి, వచ్చేవారమో, ఇంకోసారో, తరువాతనో అని సీరియల్ చేసేస్తాను. నా విశాఖ సభ వివరాలుకూడా అలాగే మరో రోజు అన్నాను. కానీ, ఆరోజు ఇంతవరకూ రాలేదు.

నేను విశాఖనుంచి వచ్చేసరికి ఆఫీసులో బోలెడంత పని ఎదురుచూస్తోంది. దాంతో రోజూ ఆఫీసులో కాస్త ఆలస్యంగా వుండాల్సివచ్చేది.

దానికి తోడు, పవర్ పాలిటిక్స్, యువలు రెండువారాల మాటర్ ఒకేసారి ఇవ్వాల్సివచ్చింది. ఇదే సమయంలో వార్తలో ఆదివారం అనుబంధానికి కవర్ స్టోరీ రాయాల్సి వచ్చింది. దాదాపుగా ఒక సంవాత్సరం తరువాత మళ్ళీ వార్తకూ, గుడిపాటికి రాస్తున్న రాత అది. ఇంతలో నటరాజ రామకృష్ణ గారు మరణించటంతో, ఆయన గురించి, ఆంధ్రప్రదేశ్ పత్రికకు ఒక వ్యాసం రాయాల్సి వచ్చింది.
ఇవికాక, వారం వారం ఇవ్వాల్సిన సన్ ఫ్లవర్ సీరియల్ ఎలాగో వుంది. దాంతో, కంప్యూటర్ ముందు కూచునే తీరిక చిక్కటం లేదు. ఇప్పుడు కూడా మా అమ్మాయి ఒక్క పదినిముషాలు మాత్రమే నాకు టయిం ఇచ్చింది. ఆ పదినిముషాలలో ఇది రాస్తున్నాను. కాబట్టి, వీలు చూసుకుని, త్వరలో విశాఖ వివరాలు ఫోటోలతో సహా మీముందుంచుతాను.

ఇంకా నేను పరిచయం చేయాలనుకున్న కున్న పుస్తకాలు వున్నాయి. మళ్ళీ త్వరలో కలుద్దాం. సెలవు.

June 11, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

మూడు పుస్తకాల సమీక్షలు.

ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమయిన సమీక్షలు ఇవి.

 

June 6, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము