Archive for December 11, 2011

హెల్లో, బాగున్నారా? నేను బాగున్నాను.

చాలా కాలం తరువాత ఎవరయినా కలిస్తే బాగున్నారా? అనడుగుతాం. వారూ మనల్ని బాగున్నారా? అనడుగుతారు. చాలాకాలమయింది నేను నెట్ లోకంలో అడుగిడి/ ఈమధ్య అనేక కారణాలవల్ల కంప్యూటర్ కు దూరంగా వున్నాను.
ఇప్పుడు మళ్ళీ నెట్ దగ్గరకు వచ్చాను. అందుకని అందరినీ పలకరిస్తున్నానన్నమాట.
మా అమాయి వల్ల నాకు రోజులు ఎంతో చిన్నవయిపోయాయి. పొద్దున్న లేచినప్పటినుంచీ తనను స్కూల్లో దింపేవరకూ మరో పని చేయలేను. తనని స్కూల్లో దింపి వచ్చిన పదిహేను నిముషాల్లో నేను ఆఫీసుకు బయలుదేరాలి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి నాకోసం ఎదురుచూస్తూంటుంది. తనతో ఆడాలి. ఆపై కంప్యూటర్ లో తనకు కథలు చూపాలి. పదుకునేముందు కథలు చెప్పాలి. తను పడుకున్న తరువాతనే నాకు ఇతర పనులకు వీలు చిక్కుతుంది. కానీ తను పడుకునేసరికి నాకూ నిద్రవస్తుంది. తెల్లారి నేను లేచి ఏదయినా పని చేయాలనుకుంటే అంతలోనే తనూ లేస్తుంది. నేను నాలుగుగంటలకు లేస్తే తను నాలుగున్నరకు లేస్తుంది. అయిదుకులేస్తే అయిదున్నరకు లేస్తుంది. నేను అర్ధరాత్రి రెండున్నరకు లేస్తే తను మూడుకు లేస్తుంది. అంటే నేనేపని చేయాలనుకున్నా మా అమ్మాయి దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడాలన్నమాట. ఒకోసారి రాసుకో నన్నా అంటుంది. నేను ఒక పేజీ రాయగానే చూస్తా అని లాక్కుని చించి పారేస్తుంది. అదీ కథ. అందుకే ఈ మధ్య ఏమాత్రం సమయం చిక్కినా ఇతర రాతలలో గడుపుతున్నాను. నెట్ జోలికి రావటంలేదు.

దీనికి తోడుగా, మేము రిలయన్స్ కనెక్షన్ వదిలించుకుని బీ ఎస్సెన్నెల్ కు మారాము. రిలయన్స్ వాడు కట్ చేశాడు. బీ ఎస్సెన్నెల్ వాడు కనెక్షన్ ఇచ్చాడు కానీ, అది సరిగ్గా పనిచేయటం ఆరంభమయ్యేసరికి నెల దాటింది. ఇది కూడా నేను నెట్ ప్రపంచానికి దూరంగా వుండటానికి ఒక కారణం.
మర కారణం ఏమిటంటే, ఈమధ్య కాస్త ఆఫీసులో బిజీగా వుంటున్నాను. రకరకాల ఇతర కార్యక్రమాలలో బిజీ అయ్యాను. ఇకపైన మళ్ళీ క్రమం తప్పకుండా బ్లాగ్లోకంలో కనిపించే ప్రయత్నాలు చేస్తాను.

ఈమధ్యకాలంలో, నా రచన ప్రపంచంలో చాలా మార్పులువచ్చాయి. కొత్త సంవత్సరం నుంచీ నా బ్లాగులోనూ కొన్ని మార్పులు తేవాలని నిర్ణయించుకున్నాను.
చాలాకాలంగా ఎంతోమంది నాకు పుస్తకాలు పంపుతూన్నా నేను బ్లాగులో వాటిని పరిచయం చేసి సమీక్షించలేదు. ఇప్పుడు వాటన్నిటినీ సమీక్షించాలనుకుంటున్నాను. వీటితో పాటుగా నేను నాకోసం చదివే ఇతర పుస్తకాలనూ పరిచయం చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా, ఇటీవలె చదివిన నామిని స్వీయ జీవిత చరిత్ర గురించి నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా రాయాలనుకుంటున్నాను.

దేవానంద్ మరణించినప్పుడు నెట్ లేక పోవటంతో దేవ్ గురించి రాయలేక పోయాను. ఒక పత్రికవారు రాయమన్నారు. రాస్తానన్నాను. అంతలో మరో పత్రిక వారడిగితే ఇంకొకరికి ఒప్పుకున్నానని చెప్పాను. ఇంతలో మొదటి పత్రికవారు ఫోను చేసి, ఇప్పుడు రాసినా ఇది రెండువారాల తరువాత వస్తుంది కాబట్టి వొద్దనుకుంటున్నామన్నారు. దాంతో దేవ్ గురించి ఏ పత్రికలోనూ రాయలేక పోయాను. ఇది కాస్త బాధ కలిగించిన విషయం. కాబట్టి త్వరలో నా బ్లాగులో దేవ్ గురించి విపులంగా రాయాలనుకుంటున్నాను.
ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను కానీ, ఇవన్నీ మా అమ్మాయి నాకెంత సమయాన్ని వదిలిపెడుతుందో అన్న దానిపైనే ఆధారపడివుంటుంది.

మరచిపోయాను, ఈ మధ్య కాలంలో నేను, గత 11 ఏళ్ళుగా రాస్తున్న పవర్ పాలిటిక్స్ శీర్షికను రాయటమ్నుంచి విరమించుకున్నాను. దాని గురించీ త్వరలో…….
అంతవరకూ సెలవు…..

December 11, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized