Archive for September, 2012

సాక్షి ఫన్ డేలో నా వ్యాసం చదవండి.

ఇవాళ్టి సాక్షి ఫన్ డే లో బయో డైవర్సిటీ గురించి నేను రాసిన వ్యాసం ప్రచురితమయింది.

ఈ వ్యాసంలో ఒక భిన్నమయిన ద్రుఖ్ఖోణాన్ని ప్రదర్శించాను. చదవి మీ అభిప్రాయాన్ని తెలపండి.

September 30, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

నవలనుంచి సినిమా వరకు- రాబిట్ ప్రూఫ్ ఫెన్స్.

ఈ భూమి మాస పత్రిక సెప్టెంబర్ సంచికలో ప్రచురితమయిందీ వ్యాసం.

September 29, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: సినిమా విశ్లేషణ

బందులుచేస్తే ధరలు తగ్గుతాయా? అంటున్న సగటుమనిషి

ఇది 25.వ తారీఖు ఆంధ్రప్రభలో ప్రచురితమయింది.

September 28, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

నా ఈ రచనలు చదువుతున్నారా?

ఈమధ్య రకరకాల కారణాలవల్ల  అనుకున్న రీతిలో పోస్టులను అందించలేక పోతున్నాను. దాంతో నేను వివిధ పత్రికలలో రచిస్తున్న విభిన్నమయిన రచనలను అందించలేక పోతున్నాను. అందరూ అన్ని పత్రికలు చదవరు కాబట్టి నా  అన్ని రచనలు  లభ్యమయ్యే వేదికగా నా బ్లాగును మలచాలన్న కోరిక అందుకే తీరటంలేదు. అందుకే, కనీసం అన్నిటినీ పొందుపరచలేకపోతున్నా, కనీసం, ఏయే పత్రికలలో ప్రచురితమవుతున్నాయో తెలపాలని అనుకుంటూంటే ఇవాళ్ళ కుదిరింది. అదీ, అనుకోకుండా ఇంట్లో వుండాల్సిరావటం వల్ల.

ప్రతి వారం నవ్య వార పత్రికలో క్రైం కథలు వస్తున్నాయి. వీలయినంత వరకూ క్రైం కథల రచనలోని విభిన్న ప్రక్రియలను ప్రతిబింబించాలని ప్రయత్నిస్తున్నాను. ఇదే పత్రికలో శైశవగీతి అనే శీర్షికనూ రచిస్తున్నాను.

ప్రతి మంగళ వారం ఆంధ్రప్రభలో ఎడిట్ పేజీలో సగటుమనిషిస్వగతం శీర్షిక రచిస్తున్నాను.

వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం లో రియల్ స్తోరీలు రాస్తున్నాను. ఈ  ఆదివారం బయోడైవర్సిటీ కి సంబంధించిన కథ వస్తుంది.

పాలపిట్ట మాస పత్రికలో కమర్షియల్ క్లాసిక్స్ శీర్షికన క్లాసిక్ కమర్షియల్ సినిమాలను పరిచయం చేస్తున్నాను. ఈ నెల, అంటే అక్టోబర్ సంచికలో 1949లో విడుదలయిన అందాజ్ పరిచయం వుంటుంది.

ఈభూమి మాస పత్రికలో పాడుతా తీయగా శీర్షికన ఆగస్తు నెలలో కైఫి ఆజ్మీ  గేయాల విశ్లేషణ ప్రచురితమయింది.అక్తోబర్ నెలలో కవి నీరజ్ పాటల పరిచయం వుంటుంది. ఈ పత్రికలోనే రాస్తున్న మరో శీర్షిక   నవల నుంచి సినిమా వరకూ లో ఆగస్టు సంచికలో రాబిట్ ప్రూఫ్ ఫెన్స్ నవల సినిమాల పరిచయం వుంది. అక్టోబర్ నెలలో జురాసిక్ పార్క్ నవల సినిమాల పరిచయం వస్తుంది.

దాదాపుగా సంవత్సరం నుంచీ తయారీలో వున్న భయానక కథల సంపుటి అక్తోబర్ నెలలో విడుదల కావచ్చు. 

భారతీయ తత్వచింతన పుస్తకం తయారీలో వుంది. పాడుతా తీయగా తయారీలో వుంది. నా సైన్స్ ఫిక్షన్ నవల, వార్తలో సీరియల్  గా వచ్చింది, పునహ్  సృష్టికి పురిటినొప్పులు, ఎమెకో వారు ప్రచురిస్తున్నారు. 

ఇవీ టూకీగా  ఈ నెల నా రచనలు. వీలయినన్ని చదివి  నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలపండి.

September 26, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

మౌనమే భూషణం అంటున్న సగటుమనిషి.

ఇది ఈవేళ్టి ఆంధ్రప్రభలో సగటుమనిషి స్వగతం శీర్షికన ప్రచురితమయింది.

September 18, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

“నాన్నా!! తొందరగా వచ్చేయ్” కథాసంకలనానికి నేను రాసిన ముందుమాట

కొల్లూరి సోమ శంకర్‌ నాకు కథకుడిగా తెలియడమే కాదు, వ్యక్తిగతంగా మా మధ్య స్నేహం ఉంది. సోమ శంకర్‌ని మొదటిసారి కలసినప్పుడే నాకు అతని పట్ల అభిమానం కలిగింది. దానికి కారణం ఏమిటంటే, నన్ను సోమ శంకర్ కలసినప్పుడు కథకుడిగా అతను కీలకమైన దశలో ఉన్నాడు.

ప్రతీ రచయిత రచనా జీవితంలో దశలుంటాయి. తాను రాయగలనన్న విశ్వాసం కలగడం ఒక దశ.  ఆ తరువాత నిజంగా రాయగలగడం మరో దశ. రాసిన తరువాత వాటిని అచ్చులో చూసుకోవాలని తపనపడి, అచ్చయితే సంతోషించడం; అచ్చవకపోతే నిరాశపడడం మూడో దశ. కొన్ని కథలు అచ్చయిన తరువాత తన కథలను ఎవరూ గుర్తించడం లేదని బాధపడుతూ; విరివిగా అచ్చవుతూ, అందరి పొగడ్తలు అందుకుంటున్న ఇతర రచయితల కథలతో తన కథలు పోల్చుకుని; వారికన్నా నాణ్యమైన కథలు రచించినా తనని ఎవరూ ఎందుకు గుర్తించడం లేదని బాధపడడం, నిరాశచెందడం నాలుగవ దశ. ఈ నాలుగవ దశ రచయిత ఎదుగుదలలో కీలకమైన దశ.

తనకన్నా తక్కువ నాణ్యమైన రచయితల రచనలు విరివిగా ప్రచురితమవడం, వారు ప్రశంసలు అందుకోవడం, తాను ఎంత బాగా రచిస్తున్నా తనని ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరాశ చెంది అనేకులు రచించడం మానేస్తారు.  ఆ నిరాశని కసిగా మార్చుకుని పట్టుదలతో రచనలు కొనసాగిస్తారు కొందరు. నిరాశని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుని, ఇతరుల పొగడ్తలు, తిరస్కరణలతో సంబంధం లేకుండా తమదైన ధోరణిలో తమకు నచ్చిన రీతిలో రచనలు సాగిస్తారు అతి తక్కువ మంది.  ఇంకొందరు ట్రెండ్‌ని చూసి, దాని ప్రకారం రచిస్తారు. అంటే, ఈ నాల్గవ దశ ఒక రచయిత భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ ఆన్నమాట. ఇలాంటి దశలో సోమ శంకర్‌తో నాకు పరిచయం అయ్యింది.

అందరు రచయితలూ ఈ దశలని అనుభవిస్తారా? అని ప్రశ్నించేవారికి, ఎలాంటి రికమండేషన్లు, పెద్ద పెద్ద స్నేహాలు, పెద్ద ఉద్యోగాలు లేని వారు, జర్నలిస్టులు కానివారు అయిన రచయితలంతా, ప్రతిభతో సంబంధం లేకుండా ఈ నాలుగు దశలను అనుభవిస్తారు.  సోమ శంకర్‍కు ఎలాంటి రికమండేషన్లు లేవు. పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నవారి పరిచయాలు లేవు. అతనిది పెద్ద ఉద్యోగమూ కాదు. అతను జర్నలిస్టు కాదు, సరికదా విలేఖరులతో స్నేహమూ లేదు. అందుకే రచించాలన్న తపన ఉన్నా, ఉత్తమ స్థాయిలో రచనలు చేస్తున్నా, అతని రచనలు ప్రచురితమవడం గగనమయ్యేది.  ఇది అతనిలో అయోమయాన్ని, నిరాశని కలిగిస్తుండేది.  ఒక స్థితిలో రచనలు చేయడం ‘వ్యర్థం’ అన్న ఆలోచన కూడా అతడికి కలుగుతూండేది. కానీ అసలైన రచయితను ఇతర రచయితలనుంచి వేరుచేసే అంశం ఏంటంటే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎంత నిరాశలో మ్రగ్గినా అసలైన రచయిత రాయకుండా ఉండలేడు. సోమ శంకర్ అసలైన రచయిత. అందుకే నా అనుభవాల ఆధారంగా సోమ శంకర్‌కి ఓ ఉచిత సలహా ఇచ్చాను.

ఇతరులు, అంటే, సులభంగా ప్రచురితమయి, గుర్తింపు పొంది, పేరు పొందే రచయితలకూ; ప్రతిభ ఉండీ గుర్తింపు, ప్రచురణకు గురయ్యే నాలుగు కండీషన్లను పూర్తి చేయని మాలాంటి రచయితలకూ ఒక తేడా ఉంటుంది. అదేమిటంటే వాళ్ళు ఎలా రాసినా సరిపోతుంది. కానీ మేము మాత్రం ప్రతీ రచనని అత్యద్భుతంగా మాత్రమే రాయాలి. ఎంత అద్భుతంగా అంటే, అది చదివిన తరువాత (ఇది ప్రధానం – రచయిత పేరు చూసి తెలియని వాడని పక్కన పెడితే, ఏమీ చేయలేము) ఎలాంటి వ్యక్తి అయినా దాన్ని ప్రచురించకుండా ఉండలేనంత అద్బుతంగా రాయాలి. అంతకు ఏ మాత్రం తక్కువ స్థాయిలో రచించినా మాలాంటి వారి రచనలు ప్రచురితం కావు. కాబట్టి మేం చేసే ప్రతీ రచనా అత్యుత్తమ స్థాయిలో ఉంటేగానీ ప్రచురితం కావని వివరించాను. ఇలా తప్పనిసరిగా అత్యుత్తమ రచనలే చేయాల్సిరావడం వల్ల కొద్దికాలానికి కళ్ళు మూసుకుని రాసినా అత్యుత్తమ స్థాయిలో రచించడం అలవాటయిపోతుంది. దాంతో, సులువుగా పేరు సంపాదించిన వారి రచనలు మా రచనల ముందు వెలవెలబోయి పాఠకులకు స్పష్టంగా తెలుస్తుంది ప్రతిభ ఉన్న రచయితలెవరో. ఇది వివరించాను. ఆ తరువాత అంచెలంచెలుగా రచయితగా సోమ శంకర్ ఎదగడం అతి దగ్గరగా చూస్తూ సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను.

అనువాదకుడిగా సోమ శంకర్ విలక్షణ ప్రతిభను ప్రదర్శిస్తూ తనదైన ప్రత్యేక గుర్తింపును పొందడం అత్యంత ఆనందం కలిగించే విషయం. ఇందుకు సోమ శంకర్ అనువాద శైలితో పాటు, అతను కథ ఎంచుకునే విధానం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడే, ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతాను.

సోమ శంకర్ కథను ఎంచుకోడం దగ్గర నుంచి దాన్ని పత్రికకు పంపటం వరకూ ఏదో ఒక రూపంలో నా హస్తం ఉంటుంది. ఒక కథ నచ్చగానే ముందుగా నాకు చెబుతాడు. ఆపై దాని గురించి చర్చిస్తాడు. చివరకి రాయకుండా ఉండలేని పరిస్థితిలో దాన్ని రాసేస్తాడు.  ఇక్కడ నేను చేసేదల్లా నిర్మొహమాటంగా కథ గురించి నా అభిప్రాయం చెప్పడమే. అతను అనువదించడానికి ఎంచుకునే కథలోని విశిష్ట లక్షణాన్ని, భిన్నమైన పంథాని గుర్తించి, సోమ శంకర్ అభిప్రాయంతో ఏకీభవించడమే నేను చేసే పని.  అంటే విభిన్నమైన, విలక్షణమైన కథను ఎంచుకోడంతోటే సోమ శంకర్ రచయితగా సగం విజయం సాధిస్తాడన్నమాట! దానికి అనువాదం అంటే నమ్మలేని రీతిలో అనుసృజన చేయడంతో సోమ శంకర్ విజయం సంపూర్ణమవుతుంది. అందుకే, ఇతరులు అనువాద రచయితలుగా ఎంత పేరు సంపాదించినప్పటికీ, ఎంత గుర్తింపు పొందినప్పటికీ, అనువాదకుడిగా సోమ శంకర్ కథలు ఇతర కథకుల కథల కన్నా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సోమ శంకర్ అనువదించిన కథలు చదివిన వారు వాటిని మరిచిపోలేరు.  ఆ కథలు మనస్సు లోలోతుల్లో సంచలనం కలిగిస్తాయి. అందుకే ఈ సంకలనం లోని 15 కథలూ పాఠకుడికి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇవే కాదు, సోమ శంకర్ అనుసృజించిన కథలలో అధిక శాతం కథలు ఇదే భావనని కలిగిస్తాయి. సోమ శంకర్‌తో నాకున్న సన్నిహిత పరిచయం వల్ల నేనిలా అంటున్నానని అనుకోవద్దు. కథలు చదివి చూడండి. మీరూ నాతో ఏకీభవిస్తారన్న విశ్వాసం నాకుంది.  అందుకే నేను ఏ ఒక్క కథ గురించో ప్రత్యేకంగా చెప్పడం లేదు. అలా చెప్పడం ఆరంభిస్తే ముందుమాట కాస్తా విశ్లేషణాత్మక విమర్శన గ్రంథంలా తయారవుతుంది.

చివరగా మరోమాట, ఇంతవరకూ సోమ శంకర్ ప్రచురించిన ప్రతీ పుస్తకంతోనూ నాకు ఏదో ఒక రకమైన సంబంధం ఉంటూ వస్తోంది.  “4 x 5” కథల సంకలనంలో నలుగురు రచయితలం కలసి చెరో అయిదు కథలు ప్రచురించాం. కస్తూరి ప్రచురణల పుస్తకం అది. సోమ శంకర్ అనువాద కథల సంకలనం “మనీ ప్లాంట్” కూడా కస్తూరి ప్రచురణల పుస్తకమే. “కొంటెబొమ్మ సాహసాలు” పుస్తకం అనువదించినప్పుడూ, రాతప్రతిని చూసి తగిన సలహాలనిచ్చాను. ఇప్పుడు సోమ శంకర్ తన కొన్ని కథలని ఈ-బుక్‌గా ప్రచురించదలచానని అనగానే నా ప్రమేయం లేని తొలి పుస్తకం అనుకున్నాను, కానీ మిత్ర వాక్యం రాయమని నన్ను అడగడంతో ఈ పుస్తకంతోటీ నాకు సంబంధం ఏర్పడింది.

ఈ అవకాశాన్ని పురస్కరించుకుని పాఠకులకూ ఒక మనవి. తెలుగు సాహిత్య రంగంలో ఒక రచయిత నిలదొక్కుకుని రచనలు చేయాలంటే ఉత్సాహం, ప్రోత్సాహాల కన్నా, తిరస్కారం, నిరాశలు, అవమానాలే అధికంగా లభిస్తాయి. విమర్శకులు రంగుటద్దాలు పెట్టుకుని కొందరు రచయితలని భుజాలనెత్తుకుని మోస్తున్నారు. దాంతో పాఠకులకి  కొన్ని పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. దీనికి తోడు, మన విమర్శకులు ఎప్పుడూ గుప్పెడు పాత తరం రచయితల పేర్లే వల్లె వేస్తుండడంతో పాఠకులూ వారికే పరిమితం అవుతున్నారు. ఇందువల్ల జరుగుతున్న దేమిటంటే అసలైన రచయిత అణిగిపోతున్నాడు.  విమర్శకులు ఎలాగూ తమ రంగుటద్దాలు వదలరు కాబట్టి, పాఠకులైనా తమ దృష్టిని ‘పాత’ నుంచి కాస్తయినా కొత్త తరం రచయితలవైపు సారించాలి. కొత్త తరం రచయితలలో చక్కని రచనలు చేస్తున్న వారిని ప్రోత్సహించాలి. మన పాత తరం రచయితలు గొప్పవాళ్ళే. కానీ వాళ్ళని పట్టుకుని వేలాడుతూ, కొత్త తరం రచయితల ప్రతిభను విస్మరిస్తే, భవిష్యత్తులో మనకు పాత తరం తప్ప తరువాతి తరం రచయితలు విస్మృతిలో పడతారు. ఇది సాహిత్యాన్ని, తద్వారా భాషనూ ప్రమాదంలోకి నెడుతుంది. అందుకని అప్పుడప్పుడూ కొత్త తరం రచయితల కథలూ చదివి, నచ్చితే పది మందికీ వాటి గురించి చెప్తుండమని మనవి.  సోమ శంకర్ కథలు చదివి మీలో మీరు సంతోషించి వదిలేయకుండా, పదిమందికీ చెప్పి చదివించాలని నా విన్నపం.

నాన్నా!! తొందరగా వచ్చేయ్” అనే అనువాద కథా సంపుటి వెలువరిస్తున్న సందర్బంగా సోమ శంకర్‌ని అభినందిస్తూ, మరో ఉచిత సలహా ఇస్తున్నాను. రాయగలిగినంత విరివిగా సోమ శంకర్ రాయడం లేదు. కారణాలూ నాకూ తెలుసు. అయినా సరే, ఏదో ఒక రకంగా, వీలు చేసుకుని కథలు రాస్తూనే ఉండాలి. అనువాద కథలతో పాటుగా స్వంత కథలను సృజించడంపై కూడా దృష్టి పెట్టాలి.

సోమ శంకర్‌కి శుభాకాంక్షలతో….

* * *

“నాన్నా!! తొందరగా వచ్చేయ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకు తీసుకుని ఈ కథలని చదవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

నాన్నా!! తొందరగా వచ్చేయ్ On Kinige

September 12, 2012 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , , ,  · Posted in: Uncategorized, పుస్తక పరిచయము