Archive for December, 2012

హారర్ కథలపై తొలి సమీక్ష.

నేను రచించిన భయానక కథల సంపుటి ఆ అరగంట చాలు పై తొలి సమీక్ష పుస్తకం . నెట్ లో ప్రచురితమయింది.
గూగుల్ ప్లస్ లో సైతం ఈ కథల గురించి పాజిటివ్ గా స్పందన లభిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తానికి హారర్ కథలకు తెలుగు పాఠక లోకమ్నుంచి ఆదరణ లభిస్తున్నదన్నమాట.

పుస్తకం లో సమీక్ష లింకు ఇది.. ఈ పుస్తకం కినిగే లో లభ్యమవుతుంది.

http://pustakam.net/?p=13422.

December 30, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

హారర్ స్టోరీ పుస్తకాలు సమీక్షలకిచ్చేశాను.

మన తెలుగు పుస్తకాల ప్రపంచంలో , ఒక పుస్తకం వున్నట్టు ప్రజలకు తెలియాలంటే సమీక్షల పైనే ప్రధానంగా ఆధారపడాల్సివుంటుంది. సినిమా వాళ్ళయితే కథ వేరు. ఉద్యమాలవాళ్ళాయినా, ముఠాల వాళ్ళయినా ఆ కథవేరు. ఏమీలేని రచయితలకు మాత్రం సమీక్షలే ప్రాణ వాయువు. అయితే, మన తెలుగు పత్రికలలో సమీక్షలు ఒక్క ఆంధ్రభూమి దిన పత్రికలో తప్పితే మిగతా అన్ని పత్రికలలో తప్పని సరి తద్దినాల్లాగా మూకుబడి రాతలు తప్ప విశ్లేషణలు, చర్చలకూ తావుండదు. ఒకవేళ అలాంటి అవకాశాన్ని సాహిత్య పేజీలు ఇచ్చినా అవి పాత రచయితల ప్రాభవాన్ని, తమ పాండిత్యాన్ని తెలపటంకోసమో, లేక తమకు నచ్చిన వారిని ఎత్తుకుని మోయటంకోసమో తప్ప సాహిత్యానికి, కొత్త రచయితలకూ, కొత్త పుస్తకాలకూ ఏమాత్రం ఉపయోగపడవు. అయినా సరే పత్రికలలోని నాలుగు లైన్ల సమీక్షలే పుస్తకాలకు లైఫ్ లైన్లు. పత్రికలలో అందినవిలో వేసినా సరే కనీసం అలాంటి పుస్తకం వున్నట్టు పాఠకుడికి తెలిసే వీలుంటుంది. అందుకనే ఒక పుస్తకం వున్నట్టు తెలియాలంటే పత్రికలలో రివ్యూలు రావాలి.

అందుకే, ఒకరోజు ఆఫీసుకి సెలవుపెట్టి మరీ, పుస్తకాల మూటను భుజానికేసుకుని అన్ని పత్రికలకూ వెళ్ళి పుస్తకాలు సమీక్షకిచ్చాను.  అయితే, ఒక పుస్తకం గురించి సమీక్షలు రావటం వెనుకకూడా బోలెడన్ని రాజకీయాలు, అభిప్రాయాలు, అపోహలు వుంటాయి. అందుకే పుస్తకాలిచ్చేసి సమీక్షలెలా వస్తాయోనని ఎదురుచూస్తూన్నాను.
ఈలోగా, పుస్తకం చదివిన పాఠకులనుంచి మాత్రం మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ముందుమాట గురించి కొందరు ప్రత్యేకంగా చర్చించటం ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇప్పటికే కినిగేలో ఎక్కువగా అమ్ముడవుతున్న మొదటి నాలుగు పుస్తకాల జాబితాలోకి నా పుస్తకం చేరింది. రాం గోపాల్ వర్మ, శ్రీరమణ, రంగనాయకమ్మ వంటివారి పుస్తకాల సరసన నుంచుంది.  నవోదయా, సాహిత్య భారతి పుస్తకాల దుకాణాల నుంచి కూడా ఆనందకరమయిన సమాచారమే అందుతోంది.

December 29, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

బుక్ ఫెయిర్ లో ఒక రోజు….

ఈసారి పుస్తక ప్రదర్శన హైదెరాబాదులో ఆరంభమయ్యేసరికి నేను తిరుపతిలో శ్రీవారి సేవలో వున్నాను. కానీ, నా కొత్త పుస్తకం, ఆ అరగంట చాలు, అనే భయానక కథల సంపుటి నేను లేనప్పుడు ఎక్సిబిషన్ లోకి వచ్చే ఏర్పాట్లు చేసి వెళ్ళాను. కానీ, ఇంకా రెండు రోజులలో ఎక్సిబిషన్ పూర్తవుతుందనగా పుస్తకం దుకాణానికి చేరింది. నేను దుకాణాల ముందు పెట్టటానికి పోస్టర్లూ తయారుచేయించి, పుస్తకం కన్నా ముందు అందేట్టు చేశాను. కానీ, ఎందువల్లనో ఎవ్వరూ పోస్టర్లు పెట్టలేదు. దాంతో ఇలాంటి ఒక పుస్తకం వుందన్నది బ్లాగర్లకు, ఫేస్ బుక్ లో వున్నవారికీ తప్ప సామాన్య పాఠకుడికి తెలిసే వీలు లేక పోయింది. ఎందుకంటే, ఇదేమీ సినిమా సెలెబ్రిటీనో, ఉద్యమాల నాయకులో, సాహిత్య మాఫియా ముఠాల సభ్యులో, అరాచకాన్ని దిగజార్పున్నే గొప్ప సాహిత్యమనుకునే అభ్యుదయ విమర్శక మిత్రులున్న రచయితనో, కనీసం అజర్నలిస్తో  రాసిన పుస్తకం కాదు కాదు. కాబట్టి, వందేళ్ళ తెలుగు కథా సాహిత్య చరిత్రలో భయానక కథల తొలి సంపుటి వచ్చిందన్న విషయం ఎవరికీ తెలిసే వీలు లేదు. నెట్ పుణ్యమా అని కొద్దిమందికయినా తెలియచెప్పే వీలు నాకు చిక్కింది. ఇదే ఇంగ్లీషు పుస్తకయివుంటే ఈ పాటికి తెలుగు చానెళ్ళతో సహా అన్ని చానెళ్ళు ఈ విషయాన్ని వార్తల్లో తెలిపేవి. పత్రికలు ఎక్సెర్ప్ట్స్ ప్రచురించి వుండేవి. కానీ, ఇది తెలుగు కథల పుస్తకం కదా…..

ఆదివారమే హైదెరాబాదు వచ్చినా, కొన్ని రాతలు రాయాల్సి వుండటంతో ఆరోజు ఎక్సిబిషన్ వెళ్ళలేక పోయాను. వారం తరువాత ఆఫీసుకు వెళ్ళటంతో ఆఫీసులో బిజీగా వుండటం వల్ల సోమవారమూ వెళ్ళలేక పోయాను. మంగళ వారం సెలవు కావటంతో రాతలు మధ్యాహ్నానికల్ల ముగించి ఎక్సిబిషన్ కు బయలు దేరాను.

బయలుదేరుతూ అరిపిరాల సత్యప్రసాద్ కు ఫోను చేశాను. సోమ శంకర్ కినిగే స్టాలులో వుంటాడు. వస్తున్నట్టు చెప్పాను. ఎక్సిబిషన్ కు నేను చేరే సరికి అరిపిరాల వచ్చాడు. ఇద్దరం కలసి లోపలకు వెళ్ళాం. నాకు నా పుస్తకం చూడాలని ఆత్రం. అచ్చుకాపీ నేను చూడలేదు. నవోదయలో జనం వున్నారు. నాకు పుస్తకం కనబడలేదు. అరిపిరాల చూపించాడు. దూరమ్నుంచే చూశాను. నవోదయ సాంబశివరావును కలిశాను. పుస్తకం ముందు వచ్చివుంటే బాగుండేదన్నాడు. సేల్స్ బాగా వున్నాయన్నాదు. ఇక సమీక్షలు వస్తే ఇంకా డిమాండ్ వుంటుందన్నాడు. విజయవాడ బుక్ ఫెయిర్ లో పుస్తకం అందరికీ కనిపించేట్టు పెట్టటంలో సహాయం చేస్తానన్నాడు. ఒక హిట్ పుస్తకాన్ని చూడగానే గుర్తిస్తానని ఆయన అనటం సంతోశాన్ని కలిగించింది. అంతకంటే ముందు చావా కిరణ్ ఫోను చేసి కథలు అద్భుతంగా వున్నాయని, తాను స్వయంగా కినిగేలో సమీక్షిస్తానని అనటం దీనికి తోడయి మరింత ఆనందాన్ని కలిగించింది.

కినిగేలో సోమ శంకర్ ను కలసి మాత్లాడుతూంటే కత్తి మహేష్ కుమార్, చావా కిరణ్ లు వచ్చారు. వారితో మాట్లాడాను. ఇంతలో మహేష్ హారర్ కథల పుస్తకం కొంటాను, మీరు సంతకం పెట్టాలన్నాదు. అంతకంటేనా అన్నాను కానీ గతంలో ఇలాగే అన్న వారి మాటలు నిజమని నమ్మి ఇప్పతికీ ఒక పెన్ను పాళే అలాగే తెరిచేవుంచాను. అందుకని నాకేమీ ఇంటెరెస్ట్ లేనట్టు నుంచున్నాను. కానీ, అరిపిరాల, కత్తి నిజంగానే నాతో సంతకం పెట్టించుకున్నారు. మహేష్ కుమార్ అయితే రాజతరంగిణి కథల పుస్తకం పై కూడా సంతకం పెట్టించుకున్నాడు.

నేను ఫేస్ బుక్ లో వాగ్దానం చేసినట్టు మిర్చీబజ్జీ తినిపించాను. మజ్జిగ దొరకలేదు. టే కోసం వెతుకుతూంటే అరిపిరాల కుల్ఫీ కొనేశాడు. అవి సేవిస్తూంటేఅ వడ్డి వోం ప్రకాష్ కనిపించాడు. హారర్ బుక్ విడుదలయిందా అని అడిగాడు. ఎక్కువ మాట్లాడేలోగా వెళ్ళిపోయాడు. కాస్సేపు అటూ ఇటూ తిరిగాను. నేను ఎంతకాలంగానో వెతుకుతున్న గర్ల్ విత్ ఎ పెర్ల్ ఇయర్ రింగ్ దొరికింది. అదొక్కటే కొన్నాను. దారిలో కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలల ప్రకటన కనిపించింది. హారర్ కథలు సీరియల్ గా వస్తున్న సమయంలో ఒక హారర్ కథల పత్రిక వచ్చింది. మరో పత్రిక హారర్ కథల పోటీ నిర్వహించింది, ఇప్పుడు నేను డిటెక్టివ్ శరత్ పాత్రను సృష్టించి క్రైం కథలారంభించిన నాలుగు నెలల్లో కొమ్మూరి వారి పాత నవలలన్నీ దుమ్ముదులిపి ప్రచురించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా భవిష్యత్తులో తెలుగు సాహిత్య చరిత్రను ఎవరయినా నిష్పాక్షికంగా పరిశోధిస్తే నా ప్రభావం గురించి ఒక అధ్యాయం తప్పనిసరి అన్న విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఆదివారం అనుబంధాల్లోని క్రైం కథలు వాస్తవ విజయ గాథలుగా మారటం కూడా నా చలవే. నా గురించి నేను నిజాలు చెప్పుకున్నా గొప్పలు చెప్పుకున్నట్టే వుంటుందని అందుకే అంటాను. మన సాహిత్య పెద్దల కళ్ళకున్న గంతలు తొలగే వరకూ  నా గురించి నేనే నిజాలు చెప్పుకోక తప్పదు మరి.

కత్తి, అరిపిరాల వెళ్ళిపోగానే నేనూ వెళ్ళిపోవాలని సిద్ధమయ్యాను. సోమ శంకర్ నేను కలసి టే తాగుతూ సాహిత్య పెద్దల చిన్నతనాన్ని గురించి చర్చించుకున్నాం. ఇంతలో నా ఒక యువ అభిమాని నేను ఎక్సిబిషన్ లో వున్నానై తెలుసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. బహుషా అన్ని వయసులవారూ అభిమానులుగా వున్న కొద్దిమంది రచయితలలోనూ నేనుంటానేమో. తత్వం చదివేవారూ, చారిత్రిక రచనలు ఇష్టపడేవారూ, రాజకీయాలు, క్రైం, మనస్తత్వ శాస్త్రం… ఇలా అన్ని రకాలుగా రాయటం   వల్ల విమర్శకులను మాత్రమే మెప్పించే రచనలు చేసి గొప్ప రచయితలుగా చలామణీ అయ్యే రచయితలకన్నా నాకు ఎక్కువ పాఠకులున్నారు. అందుకే ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని రెందువేల   కాపీలు ముద్రించి అమ్మ గలుగుతున్నాను. అంతకు తక్కువ వేసిన శ్రీకృష్ణదేవరాయలు, సౌశీల్య ద్రౌపది పుస్తకాలను రెండోసారి ముద్రించాల్సి వచ్చింది. రాజతరంగిణి కథలు, రియల్ స్టోరీస్, భారతీయ వ్యక్తిత్వ వికాసం వంటి పుస్తకాలన్నీ పలుముద్రణలకు నోచుకున్నాయి.
సోమశంకర్ కు గుడ్ బయ్ చెప్పి వెనక్కు తిరిగాను.
ఇప్పుడు నా ఆలోచనలు విజయవాడ బుక్ ఫెయిర్ పైన కేంద్రీకృతమయ్యాయి.  రాబోయే నా కొత్త పుస్తకాలు, భారతీయ తత్వ చింతన, పాడుతా తీయగా ల గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నాను.

December 26, 2012 · Kasturi Murali Krishna · 5 Comments
Posted in: నా రచనలు.

సినారె పంపిన ప్రశంసా పత్రం.

గత నెల ఈభూమి మాస పత్రికలో సినారె పాటలను విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసానికి ఎంతగానో ప్రతిస్పందన లభించింది. అది చదివి మా అమ్మ అయితే, ఇకపై హిందీ వాళ్ళ గురించి రాయటం మానేసి తెలుగు వాళ్ళ గురించి రాయమని ఆదేశించింది.  ఇప్పుడు, ఈభూమి ఎడిటర్, సినారె స్వయంగా ఆ వ్యాసం గురించి  తన అభిప్రాయాన్ని రాసి ఈభూమికి పంపగా దాన్ని నాకు అందచేశాడు.
ఇది సినారె నుంచి నేను అందుకున్న రెండవ అభినందన. మొదటి అభినందన మైకెల్ జాక్సన్ జీవిత చరిత్ర రచనకు లభించింది.

ఈ ఉత్తరం చివరలో సినారె  నా పొరపాటును ఎత్తి చూపారు. అవును, ఆ పాట రాసింది ఆరుద్ర. సినారెకు, ఆరుద్రకు, పాఠకులందరికీ క్షమార్పణలు.

ఇదిగో సినారె ఉత్తరం.

December 24, 2012 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

నేను తిరుపతి వెళ్తున్నాను….

నేను ఒక వారం రోజులు తిరుపతిలో సేవ చేయటానికి వెళ్తున్నాను. రెండువారాలకు సరిపడ రాతలు అన్ని పత్రికలకూ ఈచేసి మరీ వెళ్తున్నాను.
ఈలోగా నా హారర్ స్టోరీ కథల పుస్తకం ఎక్సిబిషన్ లోకి వచ్చేస్తుంది. నవోదయ దుకాణం లో దొరుకుతుంది. అంటే నేను తిరిగి వచ్చేలోగా నా పుస్తకం గురించిన మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాలు నా మెయిల్ బాక్సులో ఎదురుచూస్తూంటాయన్న ఆశతో ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నాను.

December 14, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

సైబర్ బుల్లీయింగ్- రియల్ స్టోరీ.

ఇవాళ్టి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది.

December 9, 2012 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , ,  · Posted in: రియల్ స్టోరీస్