Archive for December 26, 2012

బుక్ ఫెయిర్ లో ఒక రోజు….

ఈసారి పుస్తక ప్రదర్శన హైదెరాబాదులో ఆరంభమయ్యేసరికి నేను తిరుపతిలో శ్రీవారి సేవలో వున్నాను. కానీ, నా కొత్త పుస్తకం, ఆ అరగంట చాలు, అనే భయానక కథల సంపుటి నేను లేనప్పుడు ఎక్సిబిషన్ లోకి వచ్చే ఏర్పాట్లు చేసి వెళ్ళాను. కానీ, ఇంకా రెండు రోజులలో ఎక్సిబిషన్ పూర్తవుతుందనగా పుస్తకం దుకాణానికి చేరింది. నేను దుకాణాల ముందు పెట్టటానికి పోస్టర్లూ తయారుచేయించి, పుస్తకం కన్నా ముందు అందేట్టు చేశాను. కానీ, ఎందువల్లనో ఎవ్వరూ పోస్టర్లు పెట్టలేదు. దాంతో ఇలాంటి ఒక పుస్తకం వుందన్నది బ్లాగర్లకు, ఫేస్ బుక్ లో వున్నవారికీ తప్ప సామాన్య పాఠకుడికి తెలిసే వీలు లేక పోయింది. ఎందుకంటే, ఇదేమీ సినిమా సెలెబ్రిటీనో, ఉద్యమాల నాయకులో, సాహిత్య మాఫియా ముఠాల సభ్యులో, అరాచకాన్ని దిగజార్పున్నే గొప్ప సాహిత్యమనుకునే అభ్యుదయ విమర్శక మిత్రులున్న రచయితనో, కనీసం అజర్నలిస్తో  రాసిన పుస్తకం కాదు కాదు. కాబట్టి, వందేళ్ళ తెలుగు కథా సాహిత్య చరిత్రలో భయానక కథల తొలి సంపుటి వచ్చిందన్న విషయం ఎవరికీ తెలిసే వీలు లేదు. నెట్ పుణ్యమా అని కొద్దిమందికయినా తెలియచెప్పే వీలు నాకు చిక్కింది. ఇదే ఇంగ్లీషు పుస్తకయివుంటే ఈ పాటికి తెలుగు చానెళ్ళతో సహా అన్ని చానెళ్ళు ఈ విషయాన్ని వార్తల్లో తెలిపేవి. పత్రికలు ఎక్సెర్ప్ట్స్ ప్రచురించి వుండేవి. కానీ, ఇది తెలుగు కథల పుస్తకం కదా…..

ఆదివారమే హైదెరాబాదు వచ్చినా, కొన్ని రాతలు రాయాల్సి వుండటంతో ఆరోజు ఎక్సిబిషన్ వెళ్ళలేక పోయాను. వారం తరువాత ఆఫీసుకు వెళ్ళటంతో ఆఫీసులో బిజీగా వుండటం వల్ల సోమవారమూ వెళ్ళలేక పోయాను. మంగళ వారం సెలవు కావటంతో రాతలు మధ్యాహ్నానికల్ల ముగించి ఎక్సిబిషన్ కు బయలు దేరాను.

బయలుదేరుతూ అరిపిరాల సత్యప్రసాద్ కు ఫోను చేశాను. సోమ శంకర్ కినిగే స్టాలులో వుంటాడు. వస్తున్నట్టు చెప్పాను. ఎక్సిబిషన్ కు నేను చేరే సరికి అరిపిరాల వచ్చాడు. ఇద్దరం కలసి లోపలకు వెళ్ళాం. నాకు నా పుస్తకం చూడాలని ఆత్రం. అచ్చుకాపీ నేను చూడలేదు. నవోదయలో జనం వున్నారు. నాకు పుస్తకం కనబడలేదు. అరిపిరాల చూపించాడు. దూరమ్నుంచే చూశాను. నవోదయ సాంబశివరావును కలిశాను. పుస్తకం ముందు వచ్చివుంటే బాగుండేదన్నాడు. సేల్స్ బాగా వున్నాయన్నాదు. ఇక సమీక్షలు వస్తే ఇంకా డిమాండ్ వుంటుందన్నాడు. విజయవాడ బుక్ ఫెయిర్ లో పుస్తకం అందరికీ కనిపించేట్టు పెట్టటంలో సహాయం చేస్తానన్నాడు. ఒక హిట్ పుస్తకాన్ని చూడగానే గుర్తిస్తానని ఆయన అనటం సంతోశాన్ని కలిగించింది. అంతకంటే ముందు చావా కిరణ్ ఫోను చేసి కథలు అద్భుతంగా వున్నాయని, తాను స్వయంగా కినిగేలో సమీక్షిస్తానని అనటం దీనికి తోడయి మరింత ఆనందాన్ని కలిగించింది.

కినిగేలో సోమ శంకర్ ను కలసి మాత్లాడుతూంటే కత్తి మహేష్ కుమార్, చావా కిరణ్ లు వచ్చారు. వారితో మాట్లాడాను. ఇంతలో మహేష్ హారర్ కథల పుస్తకం కొంటాను, మీరు సంతకం పెట్టాలన్నాదు. అంతకంటేనా అన్నాను కానీ గతంలో ఇలాగే అన్న వారి మాటలు నిజమని నమ్మి ఇప్పతికీ ఒక పెన్ను పాళే అలాగే తెరిచేవుంచాను. అందుకని నాకేమీ ఇంటెరెస్ట్ లేనట్టు నుంచున్నాను. కానీ, అరిపిరాల, కత్తి నిజంగానే నాతో సంతకం పెట్టించుకున్నారు. మహేష్ కుమార్ అయితే రాజతరంగిణి కథల పుస్తకం పై కూడా సంతకం పెట్టించుకున్నాడు.

నేను ఫేస్ బుక్ లో వాగ్దానం చేసినట్టు మిర్చీబజ్జీ తినిపించాను. మజ్జిగ దొరకలేదు. టే కోసం వెతుకుతూంటే అరిపిరాల కుల్ఫీ కొనేశాడు. అవి సేవిస్తూంటేఅ వడ్డి వోం ప్రకాష్ కనిపించాడు. హారర్ బుక్ విడుదలయిందా అని అడిగాడు. ఎక్కువ మాట్లాడేలోగా వెళ్ళిపోయాడు. కాస్సేపు అటూ ఇటూ తిరిగాను. నేను ఎంతకాలంగానో వెతుకుతున్న గర్ల్ విత్ ఎ పెర్ల్ ఇయర్ రింగ్ దొరికింది. అదొక్కటే కొన్నాను. దారిలో కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలల ప్రకటన కనిపించింది. హారర్ కథలు సీరియల్ గా వస్తున్న సమయంలో ఒక హారర్ కథల పత్రిక వచ్చింది. మరో పత్రిక హారర్ కథల పోటీ నిర్వహించింది, ఇప్పుడు నేను డిటెక్టివ్ శరత్ పాత్రను సృష్టించి క్రైం కథలారంభించిన నాలుగు నెలల్లో కొమ్మూరి వారి పాత నవలలన్నీ దుమ్ముదులిపి ప్రచురించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా భవిష్యత్తులో తెలుగు సాహిత్య చరిత్రను ఎవరయినా నిష్పాక్షికంగా పరిశోధిస్తే నా ప్రభావం గురించి ఒక అధ్యాయం తప్పనిసరి అన్న విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఆదివారం అనుబంధాల్లోని క్రైం కథలు వాస్తవ విజయ గాథలుగా మారటం కూడా నా చలవే. నా గురించి నేను నిజాలు చెప్పుకున్నా గొప్పలు చెప్పుకున్నట్టే వుంటుందని అందుకే అంటాను. మన సాహిత్య పెద్దల కళ్ళకున్న గంతలు తొలగే వరకూ  నా గురించి నేనే నిజాలు చెప్పుకోక తప్పదు మరి.

కత్తి, అరిపిరాల వెళ్ళిపోగానే నేనూ వెళ్ళిపోవాలని సిద్ధమయ్యాను. సోమ శంకర్ నేను కలసి టే తాగుతూ సాహిత్య పెద్దల చిన్నతనాన్ని గురించి చర్చించుకున్నాం. ఇంతలో నా ఒక యువ అభిమాని నేను ఎక్సిబిషన్ లో వున్నానై తెలుసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. బహుషా అన్ని వయసులవారూ అభిమానులుగా వున్న కొద్దిమంది రచయితలలోనూ నేనుంటానేమో. తత్వం చదివేవారూ, చారిత్రిక రచనలు ఇష్టపడేవారూ, రాజకీయాలు, క్రైం, మనస్తత్వ శాస్త్రం… ఇలా అన్ని రకాలుగా రాయటం   వల్ల విమర్శకులను మాత్రమే మెప్పించే రచనలు చేసి గొప్ప రచయితలుగా చలామణీ అయ్యే రచయితలకన్నా నాకు ఎక్కువ పాఠకులున్నారు. అందుకే ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని రెందువేల   కాపీలు ముద్రించి అమ్మ గలుగుతున్నాను. అంతకు తక్కువ వేసిన శ్రీకృష్ణదేవరాయలు, సౌశీల్య ద్రౌపది పుస్తకాలను రెండోసారి ముద్రించాల్సి వచ్చింది. రాజతరంగిణి కథలు, రియల్ స్టోరీస్, భారతీయ వ్యక్తిత్వ వికాసం వంటి పుస్తకాలన్నీ పలుముద్రణలకు నోచుకున్నాయి.
సోమశంకర్ కు గుడ్ బయ్ చెప్పి వెనక్కు తిరిగాను.
ఇప్పుడు నా ఆలోచనలు విజయవాడ బుక్ ఫెయిర్ పైన కేంద్రీకృతమయ్యాయి.  రాబోయే నా కొత్త పుస్తకాలు, భారతీయ తత్వ చింతన, పాడుతా తీయగా ల గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నాను.

December 26, 2012 · Kasturi Murali Krishna · 5 Comments
Posted in: నా రచనలు.