Archive for September, 2013

ఇంత చెత్త అనువాదం చేసిందెవరో……

ఈవారం సాహిత్యకాగడా ఒక విచిత్రమయిన సంకటంలో ఇరుక్కుంది.

ఏదయినా పుస్తకాన్ని సమీక్షించాలన్నా, విమర్శించాలన్నా పుస్తకాన్ని పూర్తిగా చదవటం మౌలిక అర్హత.

పుస్తకంలో రచయిత ప్రదర్శించిన విషయం గురించి కొంత ముందే తెలిసి వుండటమో, కనీసం విషయాన్ని ప్రస్తావించేముందు దానిగురించి తెలుసుకోవటమో వాంచనీయం.

ఒకవేళ పుస్తకం అనువాదమయితే, అనువాద నాణ్యతను గురించి వ్యాఖ్యానించేముందు, మూలాన్ని చదివివుండటం ఆవశ్యకమయిన విషయం.

అయితే, ఈ నియమాలను, మౌలిక విషయాలనూ విస్మరించిమరీ సాహిత్యకాగడా ఒక పుస్తకం, అదీ అనువాద పుస్తకంపైన వెలుతురు ప్రసరింపచేయకుండావుండలేకపోతోంది. ఎందుకంటే, 19వ పేజీనుంచి ఆరంభమయిన అసలు పుస్తకాన్ని 40 పేజీలవరకు చదివేసరికి సాహిత్యకాగడా మతి మద్రాసుబండి ఎక్కి ముంబాయి వెళ్ళాలని తపనపడి ఎర్నాకులంలో దిగి ఫ్రెంచి భాషలో కవిత్వం రాసి సోమాలియా పైరేట్లతో సన్మానంచేయించుకోవాలని ఎవరెస్టును ఎక్కే మానసిక స్థితికి చేరుకుంది.

గుండె లుంగలుచుట్టుకునిపోయి, మెదడు మోకాలిలోచేరి కాళ్ళవేళ్ళతో ఆలోచించాలని తపనపడేట్టుచేసే ఈ అతి ఘోర దారుణ భీషణ దావనలంలాంటి భయంకర్ అనువాదకుడు తెలుగుభాషోద్ధారకుడు. అంతేకాదు, ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించింది, తెలుగుభాషోద్ధారకులేకాదు, యువ రచయితల తెలుగు భాషా ప్రావీణ్య రాహిత్యానికి చింతిస్తూ తన ఎడిటింగ్ ప్రఙ్నతో వారిని బెదరగొట్టి దూరం తరిమేసే పండితప్రకాండుడు కావటమూ సాహిత్యకాగడాను మండించి మండించి మండిస్తోంది.

అందుకే, పుస్తకం పూర్తిగా చదవకున్నా, ఒరిజినల్ చదవకున్నా, చదివిన 40పేజీల అనువాదాన్నే వ్యాఖ్యాన రహితంగా అందరిముందూ వుంచుతోంది కాగడా. నిజానిజాలు నిర్ణయించుకోండి, తెలుగు సాహిత్యం గురించి ఆలోచించండి. ఒక అత్యుత్తమ ప్రచురణ సంస్థ, ఒక అత్యుత్తమ అనువాదకుడిగా పేరుపొంది, అత్యుత్తమ సంపాదకుడిగా మన్ననలుపొందే అనువాదకుడు, మరో అత్యుత్తమ పండితుడు, ప్రతిపదాన్ని పట్టి పట్టి చూసే ఎడిటరూ కలసి ఇలాంటి పుస్తకాన్ని రూపొందించారంటే మన స్థాయి ఏ స్థాయిలో వుందో గమనించమంటోంది సాహిత్యకాగడా ఈ విషయాలను మీముందుంచుతూ…

ముందుమాటల అనువాదాన్ని వదిలేద్దాం.

కానీ, ముందుమాటవల్ల తెలిసేదేమిటంటే, ఇంగ్లీషులో ఈ పుస్తకం రాస్తున్నారని తెలిసినప్పటినుంచీ ప్రచురణకర్త రచయిత వెంటపడి మరీ అనువాదానికి ఆమోదం తీసుకుని ఈ పుస్తకాన్ని ముద్రించాడన్నది.

అన్ని మాటలూ అయి అసలు పుస్తకం 19వ పేజీలో ఆరంభమవుతుంది.

మొదటి పేరాలోనే ఆక్కడ వాతావరణమంతా విద్యుదావేశంతో నిండి వుంది, అన్న వాక్యం కనిపిస్తుంది. కళ్ళు మెదడు అక్కడ ఆగుతాయి.

ellectric or electrified వంటి పదానికేదో విద్యుదావేశం తెలుగు పదంగా తోస్తుంది. అన్వయం, సమన్వయం రెండూకుదరవు. కానీ, అర్ధంచేసుకుని, ఇదేదో ఉత్తేజితమన్న అర్ధం వచ్చే ఆంగ్లపదతెలుగానువాదం అనుకుని ముందుకు సాగితే, రెండు లైన్ల తరువాత మళ్ళీ ఒక అడ్డంకి…

ఒకవైపు ఓర్పులేని ప్రేక్షకుల ఈలలు, ఇంకోవైపునుంచి, స్త్రీలను ఉద్రేకపరిచే కేకలూ చెవులుబద్దలుకొడుతున్నాయి.

ఇందులో ఈ స్త్రీలను ఉద్రేకపరిచే కేకలు అర్ధం కాదు. దీని అమంగ్ల మూల వాక్యాన్ని ఊహించటమూ కష్టమే. shouts that excite females? బాబోయ్, తెలుగు తెలుగులోనే అర్ధం కాకపోయినా ఫరవాలేదు, కానీ, తెలుగును ఇంగ్లీషులోకి పత్తికొండనాగప్ప పదిరూపాయలు ఎగవేశాదు(cotton mountain cobra father ten rupees jumped away) లా చేయకూడదని నిర్ణయించుకోవటం ఉత్తమంలా వుంది.

అతి కష్టం మీద నవ్వునూ ఏడుపునూ ఆపుకుంటూ ఒక పేజీ చదివిన తరువాత, రంగ స్థలంపై ఏక పాత్రాభినయం ఆయనలొని బెరుకును ఊడగొట్టేసింది, అన్న వాక్యం దగ్గర ఆగిపోతుంది. బెరుకును వూడగొట్టటానికి ఆంగ్ల పదప్రయోగం ఊహించటం కష్టం కాదు. కానీ అనువాదకుడికి ఆ పదానికి ఈ వూడగొట్టటమనే పత్తికొండ నాగప్పకు cotton mountain cobra fatherలాంటి పదం తట్టటం ఆశ్చర్యం.అనువాదకుడి పేరు తెలుసుకున్న తరువాత మీరూ ఆశ్చర్యపోతారు.

ఇంకాస్త ముందుకు వెళ్ళగానే, ఆత్మాభిమానమనే అవతారంలో అతడు తన చుట్టూ వున్న ప్రపంచాన్ని నూతనకాంతిలో దర్శించటం ప్రారంభించాడు.

ఇక్కడ నూతన కాంతికి, ఆంగ్లం newlight అని ఇట్టే గ్రహించవచ్చు. కానీ, ఆత్మాభిమానమనే అవతారం ఏమిటో, అనువదించిన అవతార అనువాదకులేచెప్పాలి.

ఇంకా వరుసగా వచ్చే ఈ వాక్యాలు చూడండి…

అతడు స్కూలు చదువును మధ్యలోనే చాలించుకోవాల్సిన కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన బిడ్డ. శ్రద్ధతో తనను సాకే తండ్రి నీడను కోల్పోయిన బిడ్డ. ఆరాధనామూర్తిగా వుండవలసిన నాన్నను కోల్పోయినబిడ్డ.

ఎన్ని బిడ్డలో….అయినా అన్ని బిడ్డల అర్ధమొకటే. అనువాదకుడు, అన్నిటినీ కలిపి అర్ధం వచ్చే వాక్యాన్న్ని ఒకటి రాసేబదులు, మళ్ళీ పత్తికొండ నాగప్పకే పెద్ద పీట వేశాడు.

అదే పేరాలో నాలుగు లైన్ల తరువాత….

ఇవాళ్టి యువతరం, స్వశక్తి పై గాకుండా……..ఒక పోషకుడి మీదనో, ఒక ఙ్నానపిత మీదనో లేదా ఒక సహాయకుడి మీదనో ఆధారపడజూస్తారు.

ఈ ఙ్నానపిత అనగానేమి. knowledge father? father of knowledge?

దీని తరువాతనే…

కానీ ఆర్ధిక సహాయంకోసం, సామాజిక సహకారం కోఅం, మానసికమయిన ఆత్మీయతానుబంధం కోసం ఇతరులపైన ఆధారపడటమన్నది చాలా ఖరీదయిన ప్రయోగం.

అంతా అర్ధమయినట్టుంది. కానీ ఏమీ బోధపడినట్టు లేదు. సామాన్యులకందని గొప్ప అనువాదం.

5వ తరగతిలో తాను చదువు చాలించిన కుర్రాడు.(fullstop పుస్తకంలోదే) కాని వివిధ చోట్ల మూడేళ్ళు పనిచేసిన తరువాతేనిమిదో తరగతిలో చేరడమే ఆశ్చర్యకర సన్నివేశం. ఈ వాక్యం తరువాత ఆ ఆశ్చర్యాన్ని మరచి పుస్తకం స్టేజ్ ఫియర్ గురించి చర్చిస్తుంది. అనువాదకుడు కళ్ళు తెరచి ప్రతి పదానికీ సరయిన పాదాన్ని నిఘంటువులో చూసి ఎంచుకుంటే ఎడిటర్ కళ్ళుమూసి పెన్నుమూసి ఎడిటింగ్ నిర్వహించినట్టున్నారు.

ఇంకో గొప్ప వాక్యం చూడండి…

ఇలాంటి రోగం ఒకటి ప్రచలితమవుతోందని తెలియనందుకు ఎవరూ చింతించనక్కర్లేదు సుమా! ఎందుకంటే ఇలాంటి జబ్బు ప్రతీ కుటుంబంలోనూ విస్తరించి వుంది….. ప్రతికుటుంబంలో విస్తరించి వున్నా తెలియనందుకు చింతించకూడని జబ్బు? అతిగొప్ప సంశయాత్మకానువాద బ్రహ్మ బిరుదు సిద్ధంగా వుంది.

19వ పేజీనుంచి, 23వ పేజీవరకు వచ్చేసరికి ఓపిక నశిస్తోంది…

అయినా ఒకటి రెండు అమోఘమయినా అనువాదోదాహరణలిచ్చి(ఈ పదాన్ని చూడగానే ఈ పుస్తక సంపాదకుడు అనువాదూదాహరణలనాలి, ఈ కొత్తతరం రచయితలకు వ్యాకరణం తెలియదు అని నొసలు చిట్లించి రచయితలతో పది మార్లు తిరగ రాయించి, ప్రచురణార్హం కాదని తిప్పి పంపేస్తాడు. అతనే ఈ పుస్తకాన్ని ప్రచురణార్హంగా నిర్ణయించాడు) ముగిస్తాను.

ఒకానొకప్పుడు దగడు పూర్వీకులు బతకడానికి సరిపడా వున్న స్థితిమంతుల కుటుంబమే…..ఇది నా తప్పుకాదు, పుస్తకంలో వాక్యం ఇలానే వుంది.

దుర్భర దారిద్ర్యం ఆకుటుంబాన్ని మరణ మహాసముద్రంవైపుకు నెట్టేసినట్టయింది….

మద్రాసురైలెక్కి ముంబాయి పోవాలనుకుని ఎర్ణాకులంలో దిగి….అనిపిస్తోంది కదా!

కీలకమయిన ఈ విజయబీరం శివరాం కీర్తి కిరీటంగా వుండిపోయింది.

విజయబీరం?????????

కుర్ర దగడును తన అమ్మలు పనిమనుషులుగా పొందిన అనుభవం మానసికంగా క్రుంగదీస్తోంది. అమ్మలు పనిమనుసులుగా పొందిన అనుభవం…the experience of having his mothers work as maid servants….. కు పత్తికొండనాగప్ప లాంటి అనువాదం అనుకుంటాను.

ఈ వాక్యాలుచదివి పరస్పర వ్యతిరేకంగా వున్న భావాన్ని గమనించండి…

తమ ముగ్గురినీ సాకగలుగుతున్నానన్న తృప్తి వుండేది. అలా నెత్తిమీదకొచ్చి కూర్చున్న ఆకలి మిత్తిని పక్కకునెట్టేయగలిగానన్న తృప్తివుండేది. కాని రోజంతా కష్టపడితే అతనికి మిగిలింది మాత్రం చేతికీ నోటికీ అందనంత నామ మాత్రపు బత్తేలే!

ఒకపక్క సంతృప్తి వుందంటూ మరో వంక చేతికీ నోటికీ అందనిదంటున్నాడు…ఏమిటో…

ఇలా పడుతూ, ఏడుస్తూ, మూడవ అధ్యాయానికి వచ్చేసరికి, ఆ అధ్యాయంలోనే మొదటి పేరాలో ఒక పదప్రయోగం చూసిన తరువాత కాగడా మండిపోయింది.

కాబట్టి దగడు ఏపని చేసినా సంతోషంగా కష్టించి పనిచేసేవాడు, ఉత్సాహంగా చేసేవాడు. అదిన్నీ ఏదో మొక్కుబడిగా కాకుండా నా బొందో అంటూ పనిలో తలముంకలై చేసేవాడు.

ఈ నా బొందో ఏమిటో తలబద్దలుకొట్టుకున్నా అర్ధం కావటంలేదు. ఇదేదయినా స్థానిక పదమా? మాండలీకమా? అచ్చుతప్పా?

ఏమో…….

ఈ పుస్తకం ఎలాగోలాగ పూర్తి చేస్తాను. కానీ, ఈ పుస్తకాన్ని అనువదించింది, ఏ బీ కే ప్రసాద్ అని, సంపాదకత్వం డాక్టర్, డీ చంద్ర శేఖర రెడ్డి అనిగానీ, ప్రచురించింది ఎమెస్కో అని గానీ నమ్మలేకపోతోంది, జీర్ణించుకోలేక పోతోంది, తట్టుకోలేక పోతోంది సాహిత్య కాగడా.

ఈ పుస్తకం సుషీల్ కుమార్ షిండే జీవిత చరిత్ర, నా తలరాత రాసిందెవరు.

తెలుగు సాహిత్య తలరాత రాస్తోందెవరో………

September 27, 2013 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: sahityakaagada

విశ్వనాథ సాహిత్యం-2

విశ్వనాథ సాహిత్య సాగరం వైపు చూపు ప్రసరింపచేసేముందు, సాహిత్యం గురించి విశ్వనాథ అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సివుంటుంది. ఎలాగో ఆయన సాహిత్యాన్ని తెలుసుకుంటూపోతూంటే ఆయన దృక్పథం, ఆయన దృక్కోణం, ఆలోచనా విధానాలు తెలుస్త్యాయి. కానీ, ఎలాగయితే, సముద్రపు అలల్లో ఆడుకోవటానికి, అలల తాకిడి ఆనందన్ని అనుభవించటానికి సిద్ధమయ్యేముందు కొన్ని తయారీలు చేస్తామో, పాంటు పైకి మడవటం, చెప్పులు విడవటం, అలల తాకిడి ఎక్కువుంటే ఒకరి చేయి ఒకరు పట్టుకోవటం లాంటివి, అలాగే, విశ్వనాథ సాహిత్య సాగరపుటలలను తాకేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సివుంటుంది. ఇవి తెలుసుకున్న తరువాత, అలల్ను ఎదుర్కోవటం కాస్త అలవాటయిన తరువాత, లైఫ్ జాకెట్ వేసుకుని నీళ్ళల్లో దిగాల్సివుంటుంది. ఆతరువాత ఆ సముద్రపులోతులలో ఎవరెవరి సంస్కారాన్ని, దృష్టిని బట్టి వారు అణ్వేషించుకోవాల్సివుంటుంది. వారి వారి సంస్కారాన్ని బట్తి కొందరికి మొసళ్లు, సొర చేపలు, తుఫానులే కనిపిస్తాయి. ఇంకొందరికి, సముద్ర గర్భంలో నిక్షిప్తమయి వున్న అనేకానేక అమూల్యమయిన అద్భుతాలు దర్శనమిస్తాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సంధియుగానికి చెందినవాడు. పూర్వ సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం తరగని కాలం అది. కానీ, ఆధునిక భావాల పవనాలు బలంగా వీయటం ఆరంభమయిన కాలమూ అది. మరో వైపు, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం జాతిలో సంపూర్ణంగా అంతరించని కాలము అది. ఇంకో వైపు, అప్పుడప్పుడే విషంలా నెమ్మదిగా పాకుతున్న కాలం. విశ్వనాథ వారి మాటలలోనే చెప్పాలంటే,’నా-ఆ పసినాటికి ఇంగ్లీషు చదువు నేటికివలె త్రెంచరాని ముళ్ళుగా, త్రెంచినచో నెత్తురుకారెడి ముళ్ళుగా అల్లుకొనలేదు.’ అంటాడు. ఆ కాలం నాటి చదువు గురించి, ‘ పల్లెటూళ్ళలోని ఆనాటి చదువు పెద్ద పుస్తకమును చదివి అర్ధము చేసికొనుట. పెద్ద పుస్తకమనగా, కవిత్రయము యొక్క భారతము, పోతన్న గారి భాగవతము, భాస్కర రామాయణము, ఈ మూడింటికి పెద్ద పుస్తకమని పేరు.’ అంటే ఆ కాలంలో కాస్త చదువు వచ్చిన వాడూ చక్కని తెలుగు తెలిసినవాడే నన్న మాట. అందుకే, విశ్వనాథ, ‘నా ఆంధ్రభాషా పాండిత్యమునకు ప్రధాన గురువు మా తండ్రి, నా కుటుంబము, మాయూరు, ఆనాటి బొచ్చగాండ్రు, మా పాలేళ్ళూ అన్నాడు. ఎందుకంటే, ఈనాటి విద్యా వంతులతో పోలిస్తే, ఆనాటి నిరక్షరాస్యులే ఎక్కువ విద్యావంతులు. ఈ విషయాన్నే చెప్తూ, విశ్వనాథ, తనలాంటి వాతావరణంలోనే పెరిగినా, తన సోదరులు పాందిత్యమున్నా మహాకవులెందుకు కాలేదో స్పష్టంగా వివరించారు.’నా జీవలక్షణములో కవితా శక్తివున్నది. కల్పనా శక్తి వున్నది. ఆంధ్రభాషా సాహిత్య శక్తియున్నది. నాకివియన్నియు దోహదములైనవి. వారికి కాలేదూ అంటాడు. అంతేకాదు, తాను పన్నెండు పదమూడేళ్ళు వచ్చేవరకూ పల్లెలో తెలుగ్ భాషను చదువుకున్నానని, వాళ్ళకు కొంచెము ఙ్నానము వచ్చిన తరువత పల్లెటూరి సంపర్కము తక్కువయిపోయిందని, అందుకని వారు కవులయినా మహా కవులు కాలేక పోయారనీ అంటాడు. ఇక్కడే, సాహిత్యం పట్ల తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు విశ్వనాథ.

“వొట్టిపట్టణములలో పెరిగినవాడు నేటి ఇంగ్లీషు రచయితల వలె తయారగును. పరుల భావములను తీసికొని ఒకడు శబ్దములమీద, మరియొకడు పెర యూహలమీద సాము గరిడీలు చేసెడివాడు. సాంప్రదాయ దూరుడు, ఆర్ద్రతా విరహితుడు అవుతాడు. సాహిత్యమునందు రసమనునది వున్నది. అది విషయానందమునకు దాటినది. జీవుని సమాశ్రయించియున్న మాయను భేదించి బ్రహ్మపదార్ధమును లిప్తకాలమునందు తన్ను తనదిగా జేసికొను లక్షణము తెలియనివాడు. తెలియనిచో నష్టములేదుకానీ, దానిని తిరస్కరించువాడు. ద్వేషించువాడు.” ఇవన్నీ లేనిదే సాహిత్యమన్నమాట. అందుకే అవకాషం దొరికినప్పుడల్లా రసమే సాహిత్యంలో ప్రధానమయిన విషయమని విశ్వనాథ ప్రకటిస్తూ వచ్చాడు. తన రచనలలో, తాను రాసిన ప్రతి అక్షరంలో భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చూపించాలని ప్రయత్నించాడు. జాతి దృష్టిని పరాయీకరణనుంచి, పరాయి భావనలను గుడ్డిగా, బానిసల్లా అనుసరించి, తమ స్వంతమయిన మణి మాణిక్యాలను రాళ్ళనిపొరబడి పారవేయకుండా నిజానిజాలు వివరించాలని ప్రయత్నించాడు.

విశ్వనాథ దృష్తిలో సాహిత్యం సరస్వతి. తాను సృజించే ప్రతి అక్షరం పార్వతీదేవి పాదాల అర్చనకోసం జన్మించిన పుష్పం. “వేదశాత్రోపనిషదాదులు సరస్వతి. కావ్యములయందు గూడ నుదార బుద్ధులయిన పండితులు సరస్వతిని ప్రతిపాదించిరి. ఈ సరస్వతిని రక్షించుట సత్కవియొక్క ధర్మము.” ఇదీ కవి బాధ్యత, ధర్మములను గురించి విశ్వనాథ అభిప్రాయం. ఈ ధర్మ నిర్వహణకొసం, తన బాధ్యతను సక్రమంగా నిర్వహించటం కొసమే ఆయన సాహిత్యాన్ని సృజించారు. ఎన్నడూ, ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురయినా, ఎన్ని దూషణలనెదుర్కొన్నా ఆయన తన ధర్మ నిర్వహణ మానలేదు. తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. తన లక్ష్యానుంచి పక్కకు తొలగలేదు.అయితే, దేశ సామాజిక మనస్తత్వంలో వస్తున్న మార్పును విశ్వనాథ గమనించాడు. ఆ మార్పును అడ్డుకోవటం కన్నా, ఆ వీస్తున్న పవనాల దిశను నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటూ, గతానికి భవిష్యత్తుకూ వర్తమానాన్ని వారధిలావాడుకోవటం నేర్పాలని తన రచనల ద్వారా ప్రయత్నించాడు.

తన ఈ ప్రయత్నం అపోహలకు, హేళనకు, దూషణలకు, తిరస్కారాలకూ గురవుతుందని, గురవుతున్నదనీ ఆయనకు తెలుసు. అయినా తాను నమ్మింది ప్రకటిస్తూ పోయాడు. “పూర్వ మహాకవులను గూర్చికూడా శాఖాభేదములతో వ్యవహరించెడి యీ కితవసాహిత్యవేత్తృప్రపంచమున నా సాహిత్య ప్రయాణము మిక్కిలి ఎగుడు దిగుడులతో సాగిపోయినది.” అని చెప్పుకున్నాడు. అంతేకాదు,” నేటికిని నా సూక్ష్మతమాభిదర్శనపు వ్యావృత్తియు విషయాభిముఖీనమైన హేతుకల్పమును నన్ను కొందరు ఈర్ష్యాగ్రస్తులచేత ద్వేషింపబడునట్లు చేయుచున్నవి” అని తన 74వయేట ఆత్మకథలో వ్రాసుకున్నారు విశ్వనాథవారు.

టూకీగా సాహిత్యం పత్ల విశ్వనాథవారి దృక్కోణం ఇది. అందువల్ల వారు ఎదుర్కొన్న సమస్యల స్వరూపమూ ఇదే.

విశ్వనాథ దృష్టిలో కావ్యము సహజమయిన కామక్రోధాదులను సముద్దీపింపచేయటానికి సృజించటం జరుగుతుంది. వ్యక్తిగతమయిన క్రోధము సహజము, సిద్ధాంతగతమయిన క్రోధము అసహజము. కాబట్టి, సిద్ధాంత గతమయిన క్రోధాన్ని ప్రజ్వరిల్లింపచేసేందుకు రాసేది అసహజమయిన కావ్యము. సహజమయిన భావనలను కలిగించే కావ్యం వల్ల పొందే సుఖదుహ్ఖాలు పాంచభౌతిక శరీరానికి సంబంధించనివి. అంటే అలౌకికమైనవి. ఇలాంటి అలౌకిక భావనలను కలిగించే సహజమైన కావ్య సృజన సాహిత్య లక్ష్యము, లక్షణము అన్నది విశ్వనాథ భావన. ఆయన సాహిత్యాన్ని ఈ భావన ద్వారా విశ్లేషించాల్సి వుంటుంది.

అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సహజ అసహజ భావనలలో వ్యక్తిగతానికి, సిద్ధాంతానికి తేడా ఏమిటన్నది.

ఇది వచ్చే వ్యాసంలో.

(ఈ వ్యాసంలో విశ్వనాథ వారి మాటలుగా ఉదాహరించినవన్నీ ఆయన ఆత్మకథ లోనివి.సరస్వతికి సంబంధించిన వ్యాఖ్య, కావ్యానందం లోనిది.)

September 11, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

విశ్వనాథ సాహిత్య పరిచయం-నాందీ ప్రస్తావన.

విశ్వనాథ సత్యనారయణ గారి సాహిత్యాన్ని పరిచయం చేయాలన్న ఆలోచన ఎప్పటినుంచో వుంది. ఆయన సాహిత్యంపైన ఎవరయినా విమర్శనాస్త్రాలు సంధించినా, ఆయన పైన దూషణబాణాలు విసిరినా, ఆయన సాహిత్యాన్ని దుర్వ్యాఖ్యానంతో తీసిపారేస్తూన్నా, ఆయన సాహిత్యంలోని అర్ధాలను, పరమార్ధాలనూ, గూఢార్ధాలనూ , నిగూఢార్ధాలనూ వివరించాలన్న తీవ్ర తపన కలుగుతూండేది. ముఖ్యంగా, ఆయన సాహిత్యాన్ని చదవని వారు, ఆయన సాహిత్యం దరిదాపులకు కూడా వెళ్ళని వారు, కనీసం ఆయన పుస్తకన్ని ముట్టుకుని కూడా చూడని వారు సైతం, వారూ వీరూ అన్న మాటలను ప్రామాణికంగా తీసుకుని తెలిసీ తెలియక ఒక మహా సాగరంలాంటి సాహిత్యాన్ని తీసిపారేస్తూంటే వీరందరికీ విశ్వనాథ సాహిత్య సాగరంలోని అధ్బుతమయిన విషేషాలను వివరించాలన్న తపన కలుగుతూండేది.

మనకు మంచి తెలిస్తే పది మందితో పంచుకుంటే మంచి పెరుగుతుంది. అందుకని, విశ్వనాథ సాహిత్యాన్ని నేను అర్ధం చేసుకున్న రీతిలో ఇతరులకు చేరువ చేస్తూ, నేను గ్రహించిన మణిమాణిక్యాలు, అందుకున్న అమూల్యమయిన సంపదలను అందరితో పంచుకోవలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను.

ఈ విషయాన్ని ఒక వ్యాస పరంపరగా రాస్తానని ఏ పత్రికతో అన్నా ఏదో ఒక కారణం చెప్పి ఎత్తగొట్టేవారు. నిలదీసి అడిగితే, ఆయన సాహిత్యంలో ఇప్పటి తరానికేముంది అని తమ అఙ్నానాన్ని ప్రదర్శించుకున్నారు. కొందరు, ఆయన్ సాహిత్యాన్ని పరిచయటం చేయటం మతానికి సంబంధించింది, వొద్దులెండి అని తమ లౌకికతను చాటుకునేవారు. ఆ చ్చాందసుడా, వొద్దొద్దు అని తమ భ్యుదయ ప్రోగ్రెస్సివ్ భావాలు చూపేవారు.

ఇలాంటి అనేక అనుభవాల వల్ల విసిగిపోయాను. ఇంతలో బ్లాగులు లభించటం వల్ల బ్లాగులో రాదామనుకున్నాను. పత్రికలలో వున్న పరిమితులు బ్లాగులో వుండవు. కానీ, అనెక కారణాల వల్ల ఆయన్ చిన్న కథల పరిచయం ఆరంభించి కొన సాగించలేకపోయాను.

చివరికి, ఇప్పుడు, అనేక కారణాల వల్ల, నేను పత్రికలలో కాలం లను స్వచ్చందంగా తగ్గించుకుంటున్నాను. కాబట్టి, నేను ఇష్టంగా చేయాలనుకుంటున్న పనులను బ్లాగు ద్వారా వెలువరించాలని నిశ్చయించాను. పత్రికలు ప్రచురించ నిరాకరించినవి, నాకు నచ్చినవి, బ్లాగు ద్వారా పాఠకులకు చేరువచేయాలన్న ప్రయత్నం ఆరంభించాను. అందులో భాగంగా, ఫేస్ బుక్ లో సాహిత్యకాగడా పేజీని ఆరంభించి, నిర్మొహమాటమయిన విమర్శలు చేస్తున్నాను. నా బ్లాగులో నేను ఎంతో కాలంగా అనుకుంటున్న విస్వనాథవారి సాహిత్యాన్ని పరిచయం చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాను.

నా జీవితంలో కీలకమయిన దశలో విశ్వనాథ సాహిత్యం నాకు పరిచయం అయింది. అది వ్యక్తిగతంగా నాకెంతో లాభించింది. ఇతరులు సందేహాలలో కొట్టుకుపోతున్న వేళ, నేను నిశ్చలంగా నిలవగలిగాను. విశ్వనాథ సాహిత్యంతో పరిచయం లేకపోవటం వల్ల్, సమాజము, యువ తరమూ, యువ రచయితలూ ఎంతగానో నష్టపోవటం చూస్తున్నాను. అందుకని, నేను అర్ధం చేసుకున్న విశ్వనాథను అందరితో పంచుకునే ప్రయత్నం ప్రారంభిస్తున్నాను.

విశ్వనాథ సాహిత్యం అనంతమయిన సాగరం. నేను పండితుడను కాను. కానీ, సృజనాత్మక రచయితగా, సున్నిత మనస్తత్వం కలవాడిగా, భావుకుడిగా, రొమాంటిక్ గా, దేశ భక్తుడిగా, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం, వారసత్వం, వాఙ వారసత్వం, వాఙయాలపైన అచంచలమయిన విశ్వాసం వున్నవాడిలా నాకు అర్ధమయిన విశ్వనాథను మీముందుంచుతున్నాను. స్వీకరించినా, తిరసరించినా….విశ్వనాథార్పణం

September 10, 2013 · Kasturi Murali Krishna · 7 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

తుమ్మేటి రఘోత్తం రెడ్డి కథలపైన ఈ వారం సాహిత్యకాగడా వెలుతురు.

ఈవారం సాహిత్యకాగడా వెలుతురు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రచనల పైన ప్రసరిస్తోంది.

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రాసిన కథలు, పెద్ద కథలు, నవలిక లన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ విప్లవ రచయితల సంఘం ‘తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కథలూ అన్న సంపుటాన్ని ప్రచురించింది. ఇందులో మొత్తం 23 రచనలున్నాయి. 7 ముందుమాటలున్నాయి. చివరలో నా రచనా నేపథ్యం అంటూ రచయిత స్వయంగా తన గురించీ, తన రచనల గురించీ రాసిన వ్యాసం వుంది. చివరలో అభిమాన కథకుడికి ప్రేమ లేఖ అన్న ఎన్. వేణు గోపాల్ లేఖ వుంది. మొత్తం పుస్తకంలో 385 పేజీలున్నాయి.

రఘోత్తం రెడ్డి కథలను విశ్లేషించేముందు కొన్ని విషయాలను స్పష్టం చేయాల్సివుంటుంది.

రచయిత ఒక రచనను సృజించాడంటే అది ఎంతలేదన్నా అతని అనుభవాలు, ఆలోచనలు, నమ్మకాలను ప్రతిబింబిస్తుంది. రచయిత తాను చూసింది, విన్నది, అనుభవించింది యధాతధంగా ప్రదర్శిస్తే అది కథ అనేకన్నా వ్యాసమో, వార్తనో అవుతుంది. అయితే, ఎంత ప్రయత్నించినా రచయిత విధి తనపైన విధించిన జీవితానుభవాల పరిథిదాతి పోలేడు. అతడి మేథ ఆ జీవితానుభవాలు విధించిన పరిమితుల పరిథి అనే పంజరంలో చిక్కుకునివుంటుంది. సామాన్యమయిన రచయితలు ఈ పంజరం విధించిన పరిమితుల్లోనే వొదిగివుంటారు. దాంతో వారు కథలు రాసినా అవి కథలుగాకన్నా, జీవన చిత్రణను యథాతథంగా చూపే డాక్యుమెంటరీ కథలుగా అర్ధం చేసుకోవాల్సివుంటుంది.

కథలో వూహ వుండాలి. సృజన వుండాలి. తనపైన, తన మేధపైన విధి విధించిన పరిమితులను దాటి విహరించగలగాలి. తాను నిరాశలో మ్రగ్గుతూ కూడా అందమయిన భవిష్యత్తును ఊహిస్తూ, భావి తరాలకా అందమయిన భవిష్యత్తు బాటకు దారిని చూపాలి. ఏ రచయిత అయితే ఈ పరిథులను దాటి తాత్కాలిక ఆవేశాలు, నిరాశలూ దాటి ఎదుగుతాడో ఆ రచయిత జీవితాన్ని అక్షరాలలో చిత్రించినా అవి డాక్యుమెంటరీ స్థాయిని దాటి సజీవ చిత్రాలుగా నిలుస్తాయి. తర తరాలను ప్రభావితం చేస్తాయి. ఇది కాల్పనిక రచనల ప్రయోజనం.

ఒక విమర్శకుడు, సాహిత్యంలో కాల్పనిక రచనల ప్రయోజనం గురించి రాస్తూ, ‘many people develop their understanding of values and history through reading novels. that is why fictional portrayals are very important in understanding the past, coming to grips with the present and shaping of future’ అన్నాడు.

ఇదీ కాల్పనిక రచనల ప్రాధాన్యం. ఒక వెయ్యి పేజీల వ్యాసం సాధించలేని పని ఒక వంద వాక్యాల కథ సాధిస్తుంది.

కానీ, ఆధునిక సమాజంలో అనేకానేక భావజాలాల ప్రభావంతో సాహిత్య స్వరూపం మారింది. ఇతర భాషలలో కన్నా ఈ ప్రభావం తెలుగు సాహిత్యం పైన అధికంగా పడింది. ఫలితంగా కథలో సృజన కన్నా, ఊహ కన్నా, ఆశాభావం కన్నా, మార్గ దర్శనం కన్నా, భవిష్యత్తుపైన ఆలోచన కన్నా ఉన్నది ఉన్నట్టు, తాను నమ్మిన భావజాలానికి అనుగుణంగా చూపేదే కథ అన్న ఆలోచన బలంగా వేళ్ళూనుకుంది. వామపక్ష భావాల ప్రభావంతో కథ డాక్యుమెంటరీ అయింది.

రావి శాస్త్రి డాక్యుమెంటరీ కథలను సజీవ చిత్రాలుగా చూపే సృజనను ప్రదర్శించాడు. చాసో డాక్యుమెంటరీ కథలను సజీవ చిత్రాల స్థాయికన్నా పైమెట్టుకు చేర్చాడు. ఇలా, పాత తరం రచయితలు తమ సృజనతో భావజాల ప్రదర్శనకూ, నిజాన్ని చూపటానికీ నడుమ సమన్వయం సాధించారు. నిజాన్ని నిజంగా చూపుతూ కూడా డాక్యుమెంటరీ లాంటి వార్తాకథ అని కొట్టిపారేయలేని స్థితిని కల్పించారు. పిపీలికం కథ ఒక ఫేబుల్ లా సాగుతూ సిద్ధాంతాన్ని మనసుకు హత్తుకునేలా చెప్తుంది. అది చెప్పే విషయంపైన అభ్యంతరమున్నా, చెప్పిన విషానం, సృజనలను మెచ్చుకోనివారుండరు. ముఘ్దులు కాని వారుండరు.

తరువాత తరం రచయితలలో ఈ సృజన లొపం స్పష్టంగా కనిపిస్తుంది. వారు ప్రదర్శించేది నూటికి నూరు పాళ్ళు నిజం. వారు చెప్పే అంశాలను ఎంతో కన్విన్సింగ్ గా, మనసుకు హత్తుకునేలా చెప్తారు. కానీ, తరచి చూస్తే, సాహిత్య పరమయిన దృష్టితో చూస్తే అవి కథలనిపించవు. డాక్యుమెంటరీలనిపిస్తాయి. కానీ, ఆ భావజాలాన్ని ప్రచారంచేసే విమర్శకులు, ఆ భావజాలాన్ని ఆదరించే పాఠకులు వాటినే కాథలుగా భావిస్తారు. వారి గొంతు పెద్దగా వినిపిస్తే అవే కథలుగా స్థిరపడతాయి. అలా కథకుడిగా స్థిరపడ్డ వామపక్ష విప్లవ భావజాలాన్ని ప్రదర్శించే రచయితలలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఒకరు.

ఇలాగని, రచయితగా అతడిని తక్కువ చేస్తున్నట్టు భావిస్తే పొరపాటు. అతని రచనల్లో నిజాయితీ వుంది. అతని రచనలలో ఆవేదన వుంది. ఆర్తి వుంది. ఆవేశం వుంది. పాథకుడి గుండెను మెలిపెట్టి నిద్రకు దూరంచేసి తపింపచేసే గుణం వుంది. పాఠకుడి ఊహకు కూడా అందని దుర్భర దారిద్ర్య వాతావరణాన్ని, బొగ్గు కార్మికుల జీవితాలలోని వేదనలను, కడగండ్లను ప్రదర్శించే అత్యద్భుతమయిన లక్షణం వుంది. పాఠకులను ఆశ్చర్య చకితులను చేసే అందమయిన శైలి వుంది. అన్నిటినీ మించి మానవత్వాన్ని తట్టిలేపే మంచి లక్షణం వుంది. కానీ, ఒకటొకటిగా కథలు చదువుతూ పోతూంటే, ప్రతి కథ అంతకు ముందు చదివిన కథలాగే వుంటూ, ఆరంభంలో వున్న కొత్త దనం పోయి, ఒకే కథను పలు మార్లు వేర్వేరుగా చదువుతున్న భావన కలుగుతుంది. ఒక దశ దాటిన తరువాత విసుగువస్తుంది. మొదటి రెండు వాక్యాలు చదవగానే కథలోని విషయమేకాదు, ముగింపుతో సహా అన్నీ ఊహించేయవచ్చు. దీనికి ప్రధాన కారణం కథకుడి లోపం కాదు. కథకుడి దృష్టిని పరిమితం చేసి, సృజన రెక్కలను కట్టేసిన రంగుటద్దాలదీ దోశం.దీనివల్ల అతని కథలు ఒక సార్వజనీనమయిన లక్షణాన్ని కోల్పోయి, అంతర్జాతీయ స్థాయిలో బొగ్గుగని కార్మికుల జీవితాలను ప్రతిబింబించి మన్ననలందుకుంటున్న గొప్ప రచనల సరసన సగర్వంగా నిలబడే స్థాయిని కోల్పోయాయి. కేవలం ఒక భావజాలాన్ని ప్రతిబింబించే పరిమిత పరిథికల ప్రాంతీయ కథలుగా మిగిలిపోయాయి. ఇది, రచయితకేకాదు, తెలుగు సాహిత్యానికీ తీరని నష్టకారణం. రఘోత్తం రెడ్ది కథలు సార్వజనీనతను సాధించకపోవటంలో మాండలీకాన్ని వాడటం ప్రతిబంధకం కాదు. మాండలీకాన్ని వాడటం వల్ల కథల సాంద్రత పెరిగింది. కథలు దెబ్బతిన్నది రచయిత రంగుటద్దాలవల్ల తప్ప ప్రతిభ లోపం వల్ల కాదు. ఆయన ఎంచుకున్న అంశాల లోపం వల్ల కాదు.

రఘోత్తమరెడ్డి తన కథలలో ప్రదర్శించిన సామాజికవాతావరణం, అభ్యుదయభావజాల ప్రవేశంతో మారుతున్న సామాజిక ఆర్ధిక సమీకరణాలూ ఇంతకన్నా ముందు, దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి వారు ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించారు. దాంతో రఘోత్తమరెడ్డి రచనలలోని ఈ వాతావరణం కొత్తగా అనిపించదు. రఘోత్తమరెడ్డి ప్రత్యేకత తాననుభవించిన బొగ్గుగని వాతావరణాన్ని ప్రదర్శించటంలో వుంది. ఇది, ఇతడిని ఇతర కథకులనుంచి ప్రత్యేకంగా నిలుపుతాయి.

ప్రపంచ సాహిత్యంలో బొగ్గుగని కార్మికుల జీవితాలను ప్రతిబింబించే సాహిత్యం అధికంగానే వున్నా, ఎమిల్ జోలా రాసిన, జెర్మినల్, రిచర్డ్ లెవెలిన్ రాసిన, హౌవ్ గ్రీన్ వస్ మై వాలే, అప్తాన్ సింక్లెయిర్ రాసిన కింగ్ కోల్ వంటి రచనలు అత్యంత ప్రసిద్ధమయినవేకాదు, క్లాసిక్ లు గా పరిగణన పొందుతాయి. ఎందుకంటే ఆ రచనలలో సార్వజనీనత వుంది. సమస్యను పలు కోణాలలో విశ్లేషించి ప్రదర్శించటం వుంది. రచయిత అభిప్రాయమంటూ ఒకటి వున్నా, అన్ని అభిప్రాయాలనూ సానుభూతితో చూపి, ఏది మంచో నిర్ణయించుకునే స్వేచ్చ చదువరికే వదిలేయటం వుంది.

హవ్ గ్రీన్ వస్ మై వాలే లో బొగ్గు గనిలో పనిచేసేవారి పరిస్థితులను ఒక కుటుంబం ఆధారంగా చూపుతూ, పర్యావరణ నష్టాన్ని చూపుతూ, పర్యావరణ కాలుష్యాన్ని, మానవ మనో కాలుష్యానికి ప్రతీకను చేస్తూ, భౌతిక ఆధ్యాత్మిక స్థాయిల్లో కథను నడుపుతాడు రచయిత.

కింగ్ కోల్ లో బొగ్గుగని కార్మికుల పరిస్థితులు తెలుసుకునేందుకు నాయకుడు తానూ కార్మికుడిలా గనుల్లో చేరతాడు. సోషలిస్టు ద్రుక్పథంతో రాసినా, ఈ రచనలోనూ ఎక్కడా సమతౌల్యం తప్పదు. జంగిల్ నవలలోలాగే చదువుతున్న పాథకుడి మనసు కరిగి కన్నీరవుతుంది.

జెర్మినల్ లో కథలో మూడు రకాల కార్మికులకూ ప్రాతినిథ్యం లభిస్తుంది. స్వయంగా విద్యావంతుడయిన సోషలిస్టు కార్మికుడు, మధ్యమంగా వుండే కార్మికనాయకుడు, తీవ్రవాదిలాంటి కార్మికుడు…ఈ ముగ్గురి ఆధారంగా కథ నడుస్తుంది. చదువరికి ముగ్గురి ద్రుష్టి కోణం తెలుస్తుంది. అయితే, రచయిత హింస వల్ల వొరిగేదేమీలేదని తన భిప్రాయాన్ని బలపరుస్తాడు. అయినా సరే, హింస వొద్దని చెప్పటం మంచే కాబట్టి పాథకుడు రచనను మెచ్చుతాడు.

అందుకే, ఈ మూడు రచనలు బొగ్గుగని కార్మికుల జీవితాల ప్రదర్శనకు ప్రామాణికంగా నిలుస్తాయి.

డీ హెచ్ లారెన్స్ కు బొగ్గుగనులతో ప్రత్యక్ష సంబంధం వుంది. సన్స్ అండ్ లవర్స్ ఆరంభంలో ఈ వాతావరణం చూపుతాడు. వుమెన్ ఇన్ లవ్ బొగ్గుగనులనుంచి తప్పించుకోవాలనే యువతి గాధ. కానీ, లారెన్స్ దృష్టి మానవ సంబంధాలు, ముఖ్యంగా, లైంగిక భావనలపీ కేంద్రీక్రుతమవటంతో అతని గుర్తింపు వేరేగా వచ్చింది.

రగోత్తమరెడ్ది కథల విషయానికి వస్తే, పైన ఉదాహరించిన రచనలలోని సమన్వయ భావన లేని లోపం స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి కథనూ ఏదో ఒక రకంగా విప్లవంవైపు, సాయుధ పోరాటం వైపు, కార్మిక సంఘాల పోరాటాలవైపు మళ్ళించి, సంఘటిత కార్మికుల విజయాలను చూపటం వైపే పరుగులిడటం తెలుస్తుంది. కార్మికుల జీవితాలు లేని కథలలో అన్యాయాలు, అణచివేతలు చూపటం వుంటుంది. దాంతో, కథలలో సంభాషణలు తీసేస్తే, ఇవన్నీ వ్యాసాలుగా రాస్తే బాగుంటుందనిపిస్తుంది.

అలాగని రఘోత్తమ్‌రెడ్డి రచనలను చులకన చేయకూడదు. తెలుగు సాహిత్యంలో బొగ్గుగని కార్మికుల స్థితిగతులను, వారి జీవితాలలో నిరంతరం ప్రమాదం సరసన బ్రతకాల్సి రావటం, వారి ఆశలు, నిరాశలను ప్రదర్శించిన కథలుగా ఈ కథలు ప్రత్యేక స్థానాన్ని పొందుతాయి. చివరలో రచయిత తన జీవితం గురించి, జీవితంలోంచి కథలు వచ్చిన విధానం గురించి రాయటం వల్ల ఈ కథలకొక ప్రామాణికత వచ్చింది. కథలతో స్పందించే వీలు కలిగింది. కానీ, చదివించేగుణమున్నా, కథలలోని సారూప్యత ఊహకందే విషయాలు, ఏమాత్రం భిన్నంకాని రచయిత ఆలోచన శైలి, కథలలోని అనూహ్యతను చంపేసింది. దాంతో ఒక కథ చదివితే అన్నీ చదివినట్టే నన్న భావన కలుగుతుంది. రంగుటద్దాలతో ప్రపంచాన్ని ప్రదర్శించాలనుకోవటం వల్ల వచ్చిన దోశం ఇది.

అయితే, రఘోత్తమ్‌రెడ్డి గొప్పతనం ఎక్కడ కనిపిస్తుందంటే, ఈ కథలు చదువుతూంటే, తెలంగాణా పల్లెల్లో నక్సలిజానికి, వామపక్షపోరాట భావాలకు ఎందుకని ఆదరణ లభిస్తోందో తెలుస్తుంది. వాటికి ఆదరణ లభించటం కూడా సబబేమోనన్న భావన కలుగుతుంది. ఈక్కడ పట్నాలలో హాయిగా కూర్చుని, అన్ని ఆధునిక సౌకర్యాలనుభవిస్తూ, విప్లవం గురించి, సాయుధ పోరాటం గురించి చులకనగా మాత్లాడేవారంతా ఈ కథలు చదివితే వారికి తమ ఆలోచనల లోపాల గురించి తెలుస్తుంది. కను విప్పు కలుగుతుంది. అంటే, తాను నమ్మిన భావజాల ప్రచారంలోనూ, దానికి సమర్ధన సాధించటంలోనూ, దాన్ని ప్రతిభావంతంగా పదిమందికి పరిచయం చేయటంలోనూ విప్లవ సంఘాల కార్యకర్తగా, సభ్యుడిగా రఘోత్తం రెడ్డి విజయం సాధించాడు. కానీ, తన భావనలకు సార్వజనీనతనాపాదించి, సకల ప్రజలకు సమ్మతమయిన రీతిలో సమన్వయాన్ని ప్రదర్శించే రచయితలా విఫలమయ్యాడని చెప్పవచ్చు. అందుకే, రఘోత్తమ్‌రెడ్డి కథలు చదువుతూంటే ఆయన చూపిన జీవినవిధానానికే కాదు, ఒక సృజనాత్మక రచయిత, వీధి వీధినా, ఊరూరా ప్రజలను ప్రభావితం చేయగల శక్తివంతమయిన రచయిత, సంకుచిత పరిథికి పరిమితమయిపోయాడనీ బాధ కలుగుతుంది. ఇందుకు కారణం ఆయన చుట్టూ వున్నవారేననీ ముందుమాటలు చదివితే తెలుస్తుంది.

వల్లంపాటి వెంకట సుబ్బయ్య తన ముందుమాటలో, ‘లెవెల్లిన్ నవల గని కార్మికుల జీవితాన్ని వాస్తవికంగా వర్ణిస్తుంది కానీ అందులో దృక్పథం లేదు. దృక్పథం వున్న ఆర్వెల్ కార్మికుల దైన్యాన్ని పట్టణాలలోని సామ్యవాద నాయకులమీద రాళ్ళురువ్వటానికి ఉపయోగించుకున్నాడూ అంటాడు. అని ఈ రచనలు ఆరెండిటిని దాటి పోయాయంటాడు. నిజానికి, లెవెల్లిన్ దృక్పథం వామపక్ష సమర్ధకులకు నచ్చదు. అందుకే ఆయనకు దృక్పథం లేదన్నాడు. కానీ, విమర్శకుడికి నచ్చిన దృక్పథం ప్రదర్శించటం వల్ల రగోత్తం రెడ్దికి పేరు వచ్చివుండచ్చుకానీ, పాథకులకు చేరువకాలేకపోయాడు.

ఇది మన తెలుగు సాహిత్యం లో ప్రస్తుతం వున్న పరిస్థితి

September 9, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sahityakaagada

విశ్వనాథ జన్మదిన సందర్భంగా…

రేపు విశ్వనాథ సత్యనారయణ గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని, నా బ్లాగులోనూ, సాహిత్య కాగడా లోనూ విశ్వనాథవారి సాహిత్యంపైన నా విశ్లేషణాత్మకమయిన వ్యాస పరంపరను ఆరంభిస్తున్నాను. గతంలో నా బ్లాగులో ఆయన చిన్న కథలను పరిచయంచేయటం ఆరంభించి మొదటి అడుగుతరువాత కదలలేదు. ఇప్పుడు అక్కడినుంచి ఆరంభిస్తున్నాను. విశ్వనాథవారి సాహిత్యసముద్రంలోనుంచి నేను గ్రహించిన కొన్ని విఙ్నానపు బిందువులను అందరితో పంచుకునే ప్రయత్నం ప్రారంభిస్తున్నాను.

ఎలాంటి పరిమితులు, ఆంక్షలూ, మొహమాటాలూ లేకుండా నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, వివరణలు, విశ్లేషణలతో ఈ వ్యాస పరంపరను రచించే ప్రయత్నం చేస్తున్నాను.

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాయీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్ధిస్తున్నాను.

September 9, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

కథకులందు జర్నలిస్టు కథకులు వేరయా!

సాహిత్యకాగదా సాహిత్య ప్రపంచంలోని అసమానతలను, అన్యాయాలను, ద్వంద్వప్రవృత్తులను ఎత్తిచూపించే ప్రయత్నం చేస్తుంది. వీలయినంత వరకూ వ్యక్తిగతాలకు దూరంగా వుండే ప్రయత్నం చేస్తుంది. జర్నలిస్టు కథకుల గురించి చర్చించేటప్పుడు కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంది.

కథకులందు జర్నలిస్టు కథకులు వేరయా అన్నది ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో అలవాటయిన ధోరణి.

ముందుగా, కథక జర్నలిస్టులకూ, జర్నలిస్టు కథకులకూ నడుమ వున్న తేడాను చెప్పుకోవాలి.

కథలు ముందు రాసి జర్నలిస్టులయిన వారు కథక జర్నలిస్టులు. ముందు జర్నలిస్టులయి, తరువాత కథకులయినవారు జర్నలిస్టు కథకులు. ఈ వారం ఇలాంటి జర్నలిస్టుకథకుల వ్యవహార శైలి, ప్రవర్తన, వీటి ద్వారా సాహిత్య ప్రపంచంలో వీరు చేస్తున్న అకాండతాండవంపై కాగడా వెలుతురు ప్రసరిస్తుంది.

ముందుగా కథలు రాసి తరువాత జర్నలిస్టులయిన వారికి కథకుల బాధలు తెలుసు. వారు కథకులను అర్ధం చేసుకుంటారు. సానుభూతి చూపుతారు.

కథ రాయటం ఒక ఎత్తయితే, రాసిన కథను పత్రికకు పంపటం, అది అచ్చయ్యే వరకూ రచయిత పడే వేదనలు, తపనలు కథక జర్నలిస్టులకు తెలుసు. ఇలాంటి వారు, అంటే, ముందుగా కథలు రాసి తరువాత జర్నలిస్టులయిన వారి వ్యవహార శైలి వేరుగా వుంటుంది. ఇలాంటి వారు పత్రికలలో వున్నప్పుడు, రచయితలకున్న ఫిర్యాదులు వేరే.

వాకాటి పాండురంగా రావు కథక జర్నలిస్టు. ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్ గా వున్నప్పుడు, ఎంతో మంది కథకులను ప్రోత్సహించారు. కథాప్రభ అనే శీర్షికన పెద్ద కథలకు ఊపునిచ్చారు. కొత్త కథకులలో ప్రతిభను గుర్తించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చి, మార్గదర్శనం చేసేవారు. ఇప్పుడు మంచికథలు రాస్తూ పేరు తెచ్చుకుంటున్న వారనేకులు వాకాటి గారి ప్రోత్సాహం పొందినవారే. వారు వాసమూర్తి అనే మరో కథకుడిని కథల ఎంపిక కోసం ప్రత్యేకంగా నియమించారు.

వాసమూర్తిగారు అద్భుతమయిన వ్యక్తి. ఏమాత్రం ప్రతిభ కనబడినా ఆయన రచయిత వెంటపడి మరీ కథలు రాయించేవారు. ప్రచురించి ప్రోత్సహించేవారు. కథలు రాయమని, మీరు కథ పంపి చాలా కాలమయింది, కథ పంపండి అని పేరు లేని రచయితలను సైతం, అహం లేకుండా అడిగి రాయించేవారు.

జగన్నాథ శర్మ, జర్నలిస్టయ్యేకన్నా ముందు కథకుడు. ఆయన, కథలలో విభిన్న ప్రక్రియలకు అత్యంత ఆదరణనిస్తారు. ఒక కథ మంచి చెడు నిర్ణయించటానికి నేనేవరు? అది చదివేట్టుందో లేదో చూస్తానంతే. ప్రచురితమయిన తరువాత పాథకులే మంచి చెడు నిర్ణయిస్తారు అన్నది ఆయన సిద్ధాంతం. అందుకే, ఆయన నవ్య ఎడిటరయిన తరువాత, నవ్యకొక సాహిత్యగంధం అలముకుంది. విభిన్న కథకులకు అవకాశం దొరుకుతోంది.

శ్రీరమణ కూడా ముందు కథకుడు, తరువాత జర్నలిస్టు. అయితే, ఆయన మెత్తనివాడు. వాకాటి, జగన్నాథ శర్మల్లా మాట నెగ్గించుకోలేడు. అందుకే, ఆయన ప్రభలో వున్నప్పుడు, నవ్య ఎడిటర్ అయినప్పుడూ పత్రికలు దిశారహితమయ్యాయి. హాస్య కథలకు ప్రాధాన్యం లభించింది.

కిరణ్ ప్రభ కూడా ముందు రచయిత. తరువాత కౌముది ద్వారా జర్నలిస్టయ్యారు. కౌముది ద్వారా రచయితలయిన వారు అనేకులు.

పై ఉదాహరణలు కథక జర్నలిస్తుల ధోరణి తెలిపేందుకు దృష్టాంతాలు మాత్రమే. ప్రతి దానికీ ఎక్సెప్షన్లుంటాయి. ముఖ్యంగా ఏదో ఒక సిద్ధాంతపు రంగుటద్దాలు ధరించిన వారు ముందు కథకులయి, తరువాత జర్నలిస్టులయినా, వారి రంగుటద్దాలు వారి కళ్ళకన్ని రంగులూ కనబడనీయవు. ఆ ప్రభావం వారి పత్రికలపైఅన పడుతుంది. రచయితలపైనా పడుతుంది. ఒకోసారి పత్రికలకు కొన్ని పాలసీలుంటాయి. దాంతో, నిర్ణయాత్మక స్థానంలో వున్న అభిప్రాయాలతో సంబంధం లేకుండా కథలన్ని ఒకే రకంగా మూసలో పోసినట్టుంటాయి.
ఇక జర్నలిస్టు కథకుల దగ్గరకు వస్తే, వీరికి రాయాలన్న ఆసక్తి వున్నా, సాహిత్యం పైన మక్కువ వున్నా అనేక కారణాలవల్ల పత్రికలలో చేరిన తరువాతనే వీరు రచనలవైపు దృష్టిని మళ్ళించినవారు.

కొందరి భాష బావుంటుంది. దాంతో ఇన్ చార్జి, ఒక బలహీన క్షణంలోనో, అవసరాన్ననుసరించో, నువ్వేదయినా రాయకూడదా, అంటాడు. వీరు తమ శక్తి కొద్దీ రచనలు ఆరంభిస్తారు. అవసరము, ఇష్టం, మొహమాటం కారణమేదయినా వీరు రాసినవి ప్రచురితమవుతాయి. అంటే, ఈ జర్నలిస్టు కథకులకు, ప్రచురణ కోసం రచయితలు పడే బాధలతో అంతగా పరిచయం వుండదు. ఎక్కడో, బ్రతక నేర్చిన లక్షణాలు లేని జర్నలిస్టులకు తప్పించి, మిగతా జర్నలిస్టు కథకులంతా పురిటి నొప్పులు, ప్రసవ వేదనలు తెలియని immaculate conception లాంతి తల్లులన్నమాట. అందుకే వీరికి ఇతర రచయితల పట్ల చులకన భావం వుంటుంది. కథలు అచ్చులో చూసుకోవాలన్న రచయితల తపన ఆటలా వుంటుంది. కథల ప్రచురణ కోసం ఫోన్లు చేసే రచయితలూ, తమ చుట్టూ తిరిగే రచయితలన్నా నవ్వులాటగా వుంటుంది.

ఒక జర్నలిస్టు కథకుడితో ఇన్ చార్జ్ నువ్వో శీర్షిక రాయోయ్, అని టాపిక్ చెప్పాడు. ఆ విషయం గురించి ఆ జర్నలిస్టుకేమీ తెలియదు. దాంతో, ఆ ఇన్ చార్జ్ ఆ విషయానికి సంబంధించిన సీడీలు, క్యాసెట్లూ ఇచ్చి, ఆ రంగంలో పరిచయమున్న వారిని కలిపి, ఇక రాసుకో అన్నాడు. స్వతహాగా ప్రతిభ వున్నవాడు, భాషపైన కాస్త పట్టు వున్నవాడూ కావటంతో అందిస్తే అల్లుకు పోయాడా జర్నలిస్టు కథకుడు.

జర్నలిస్టు, పైగా, ఇన్ చార్జ్ అండదండలున్నవాడు. దాంతో, ఇతర జర్నలిస్టులూ అతని అద్భుతమయిన విఙ్నానానికీ, అమోఘమయిన ప్రతిభకూ ఆశ్చర్య చకితులయి పరమానందాన్ని ప్రకటించారు. రచయితలు సరేసరి. నిజం చెప్పితే తమ కథలు అచ్చుకావు జీవితాంతం. అందుకని వారూ తమ సృజనాత్మకతనంతా ఉపయోగించి అతడిని పొగడ్తలలో ముంచెత్తారు. దాంతో పిల్లి అద్దంలో తనను తాను పులిలా చూసుకున్నట్టు, ఇక ఆరంగంలో తనను మించినవారెవరూ లేరన్న అభిప్రాయానికి వచ్చేశాడా క్జర్నలిస్టు కథకుడు. దాంతో, ఆ రంగంపైన తనకు గుత్తాధిపత్యం వుందనుకుంటాడు.మరో రచయిత ఎవరయినా ఆ రంగంలోకి అడుగుపెడితే సహించలేడు. వాడికి తన పట్టున్న పత్రికలలో స్థానాన్నివ్వడు. (జర్నలిస్టు కథకులూ మాఫియా ముఠాల్లాగే ప్రవర్తిస్తాడు. ఒకడికి నచ్చకపోతే పనిగట్టుకుని ఇతర జర్నలిస్టు స్నేహితులందరికీ తనకు నచ్చనివాడి గురించి చెప్పి, వారూ అతడికి అవకాశాలివ్వకుండా చూస్తాడు.) ఆ రచయితను తనకు ప్రత్యర్ధిగా భావిస్తాడు. అతని పేరు తన పట్టున్న పత్రికలలో ఏరకంగా రాకుండా జాగ్రత్తపడతాడు.

తనకు స్వతహాగా ప్రతిభ వున్నా ఎక్కడో న్యూనతా భావం అతడిని బాధిస్తూంటుంది. దాంతో ప్రతిభ వున్న ప్రతివాడినీ చూసి ఉలిక్కి పడుతూంటాడు. ఎక్కడ తన స్థానాన్ని ఎవడు కాజేస్తాడో నన్న భయంతో తనకు ఎలాంటి ముప్పు లేదని భావించిన వారినీ, తనను పొగడే వారినీ, తనకు లాభమున్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తాడు. తన చుట్టూ నిర్మించుకున్న కంచెలో సురక్షితంగా వుంటాడు. ఇది, ఒక రకమయిన జర్నలిస్టు కథకుడు.

ఇంకో రకమయిన జర్నలిస్టు కథకుడు పూర్తిగా బ్రతక నేర్చినవాడు. ఈయన దృష్టిలో పత్రిక వున్నది తన కోసమే. పాఠకులు ఉన్నది తనని మెచ్చుకోవటం కోసమే. విమర్శకులున్నది తనను ఆకాశానికి ఎత్తటం కోసమే. దాంతో పత్రికను సంపూర్ణంగా వినియోగించుకుంటాడు. తనకు లాభం వున్న వారి కథలే వేస్తాడు. తన పుస్తకం రాయటం నుంచి, ప్రచురితమయ్యే వరకూ ఏదో గొప్ప ఈవెంట్ జరుగుత్న్నట్టు భ్రమ కలిగిస్తాడు. ప్రముఖుల మొహమాటపు పొగడ్తలు, ఈతర లాభాలున్న వారి ప్రశంసలతో అమాయక పాఠకులలో ఒక గొప్ప భ్రమను కలిగిస్తాడు. పత్రిక వున్నది తనకోసమే కాబట్టి పుస్తకం వేసేవీలున్న రాతలే రాస్తాడు. అలా తనను మించిన వారెవరూ లేరన్న భ్రమలో వుంటూ, ఎక్కడ ఈ భ్రమ చెదిరిపోతుందో అన్న భయంలో మీసాలు మెలివేస్తూ బ్రతుకుతూంటాడు. ఒకవేళ తన గొప్పనెవ్వరూ గుర్తించటం లేదనిపిస్తే, తనతో అవసరం వున్న వారి డబ్బులతో పుస్తకాలు వేయిస్తూ దాన్లో తన వంది మాగధుల కథల నడుమ తన కథనూ చొప్పిస్తాడు. వంది మాగధుల కృతఙ్నతను సాధిస్తాడు. ఇలా, ఎంత పేరు సంపాదిస్తే అంత అభద్రతా భావానికి గురవుతాడీ బ్రతక నేర్చిన జర్నలిస్టు కథకుడు. కానీ, ఇతని వల్ల కూడా, రంగుటద్దాల జర్నలిస్టు కథకుల్లాగే సాహిత్యం దెబ్బ తింటుంది.

మరో రకం జర్నలిస్టు కథకులుంటారు. వీరికి రాయాలన్న ఉత్సాహం వుంటుంది. కానీ, ఊహలుండవు. కానీ, పత్రిక చేతిలో వుంది. ఏమి రాసినా ప్రచురితమవుతుంది. అలా వీరి వ్యాసాలు కథల పేరిట ప్రచురితమవుతాయి. కాగడా లాంటి పనికి రాని, పని లేని రచయిత ఎవరయినా, ఇవి వ్యాసాలు, వార్తలు, కథలు కావు, కథలో ఊహ వుండాలి అంటే, మేము అనుభవించనిది ఎలా రాస్తాం? అంటూ సత్యజిత్ రే పోసు పెడతారు. వారికి సన్నాయి నొక్కులు నొక్కే పొగడు బృందాలుంటాయి. వారు వీరేమి రాసినా, ఆముదం తిని అమృతం తాగిన ముఖాలుపెడతారు. వీరిని ఆకాశానికెత్తుతారు. దాంతో వారు మరిన్ని వ్యాసాలు ఆనందగా రాసి ఇవే కథలు పొమ్మంటారు. ఇంకా నూనూగు మీసాలు రాకున్నా, కొమ్ములు తిరిగిన రచయితల కథలపైన అభిప్రాయాలు ప్రకటించేస్తూంటారు. తమ లాగా వ్యాసలు రాసి కథలనే వారికే ప్రోత్సాహం ఇస్తూంటారు. వీరికి ఉన్న స్థానం వల్ల విమర్శకులు కథారచనలో వేరో సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నారని రాసేస్తారు. యూనివెర్సిటీవారు రీసెర్చులూ చేస్తారు. దాంతో తాము ఏమి రాసినా అది అద్భుతమన్న భ్రమలోకి దిగిపోతారు. ఐదంతా పదవి వున్నంతవరకే. ఒక్కసారి పదవి పోయిందా, పొగిడిన వారంతా, పాసిపోయిన తిండి వదలి ఫ్రెష్ తిండి వైపు మూగినట్టు మరో వైపుకి పోతారు. దాంతో ఇలాంటి వారు, కథలు రాయలేక, వ్యాసాలూ రాయలేక, గత వైభవాన్ని తలచుకుంటూ, జానే కహాన్ గయే వొ దిన్, అనుకుంటూ మిగులుతారు. కానీ, వెలుగు వెలిగినన్నాళ్ళూ వీరి వెలుతురు నీడలో వొదిగిన అసాహిత్యం మాత్రం బాగుపరచలేని రీతిలో దెబ్బతింటుంది.

ఇంకోరకమయిన జర్నలిస్టు కథకులుంటారు. వీరికి ఆలోచనలు రావు. కానీ, పేరు పొందాలన్న తపన వుంటుంది. అందుకని, ఇతర భాషలలోని ప్రముఖ కథలని అనువదించి స్వకపోల కల్పితాలుగా ప్రచారం చేసుకుంటారు. కాదనే ధైర్యం ఎవ్వరికీ వుండదు. ఎందుకంటే పెద్దలంతా ఈ జర్నలిస్టు కథకుడి సృజన ముందు ఒరిజనల్ రచయితలంతా దిగదుడుపే అని రాసేస్తారు. వీరి ప్రాపకం కావాల్సిన వారు ఇంకో అడుగు ముందుకెళ్ళి కాఫ్కాలూ, లూయీ బోర్హెస్ లూ, మార్క్వెజ్ లూ ఈయన పాదసేవ చేసుకుని కథా రచనలో అ ఆ లు దిద్దాలంటారు. అసలు రచయితలు దూరంగా నిలుచుని తమాషా చూస్తూ, కార్వాన్ గుజర్ గయా, గుబార్ దేఖ్ తే రహే, అనుకుంటూంటారు.

ఇక, ఎలగో జర్నలిస్టులయి కథా రచయితలుగా చలామణీ అవుతున్నారు కాబట్టి, టీవీ స్క్రిప్టులవైపు మళ్ళుతారు. టీవీల్లోనూ వుండేది జర్నలిస్టులే కాబట్టి, వారూ వీరికే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో టీవీలూ పత్రికల్లా తయారవుతాయి. టీవీ నాటకాలూ సృజన ఏమాత్రం లేని సాగతీత వ్యాసాలవుతాయి. ఇప్పటికీ, టీవీ మాధ్యమంలో కీలకమయిన స్థానాలలో వున్నది పత్రికలవాళ్ళే. అందుకే టీవీ అటు రేడియోకీ, ఇటు పత్రికలకీ నకళ్ళుగా వుంటోంది తప్ప దృష్య మాధ్యమ వ్యాకరణం తెలిసినవారెవరూ ఆ రంగంలో లేరు. ఇది ఏ టీవీ కార్యక్రమం చూసినా తెలుస్తుంది.

నాకు తెలిసిన ఒక జర్నలిస్టు రచయిత వున్నాడు. ఒకేవూరివాడని ఒక సీనియర్ జర్నలిస్టును ఆశ్రయించి వ్యాసాలు రాయించుకుని ప్రచురింపచేసుకున్నాడు. వాటన్నిటినీ పుస్తక రూపంలో వేయించుకుని, సినిమాలో నిష్ణాతుడని పించుకున్నాడు. మరిలిన్ మన్రో స్పెల్లింగ్ కూడా తెలియనివాడు సినిమా విశ్లేషణల నిష్ణాతుడిలా పేరుపొందాడు. ఈ పుస్తకాన్ని చూపి ఒక టీవీ చానెల్ లో చేరిపోయాడు. అక్కడా, వారినీ వీరినీ ఉపయోగించుకుని కొన్ని కార్యక్రమాలు చేశాడు. వాటి ఆధారంగా సినీ రంగంలో ప్రవేశించాడు. కానీ, అక్కడ అసలు నిజం బయటపడటంతో మళ్ళీ ఇప్పుడు పాత పత్రిక రంగంలో సినీ విశ్లేషణలు చేస్తున్నాడు. సినీ స్పెషలిస్టయ్యాడు. ఎందుకంటే కొన్నాళ్ళు సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్నాడు కాబట్టి సినిమాల గురించి తనకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదని ఆయన నమ్మకం.

ఇంకో రకమయిన జర్నలిస్టు రచయిత వున్నాడు. జర్నలిజంలో ప్రవేసించిన తరువాత సులువుగా రచయిత అయ్యే మార్గం కనిపెట్టాడు. ఫెమినిస్టులు కలిస్తే, ఒక ఫెమినిస్టు కథని అటూ ఇటూ చేసి రాసేస్తాడు. అలా, ఏ ఉద్యమకారులు కనిపిస్తే, ఆ వుద్యమ కారుల కథలను అటూ ఇతూ చేసి రాసేసి, వారితోనే తన కథలకు ఉద్యమ ప్రామాణికత కల్పించుకున్నాడు. అందరి బంధువయా, అన్నట్టు, ఒక్క అసలు కథ తప్ప అందరి కథలనూ స్వంతం చేసుకుని ఉత్తమ కథకుడిగా గుర్తింపు పొందుతున్నాడు.

ఇంకో రకమయిన జర్నలిస్టు రచయితలకు ఎప్పుడూ డబ్బు లోటే. కొందరు ఉన్నత స్థానాల్లో వున్న రచయితలకు పేరు పిచ్చి. వారీ జర్నలిస్టులకు డబ్బు లిస్తారు. పార్టీ లిస్తారు. తాగిస్తారు. దాంతో ఈ జర్నలిస్టులు ఆ పెద్ద మనుషులను పెద్ద రచయితలంటూ పొగడుతారు. వారిని అందలానికి ఎత్తేస్తారు. వారితోపాటూ తామూ అందలాలెక్కుతారు. ఎప్పుడయినా డబ్బు తేడాలొస్తే, మొన్నటిదాకా పొగడిన పెద్దమనిషి ఇప్పుడు రచయితేకాడన్నట్టు ప్రవర్తిస్తారు. అయితే, డబ్బు అవసరం లేని జర్నలిస్టులకు కొదువ లేదు కాబట్టి పెద్దమనుషులెప్పుడూ ఉత్తమ రచయితలుగానే చెలామణీఅవుతూంటారు.

ఇంకో రకమయిన జర్నలిస్తులుంటారు. వీరు టీవీల్లో పనిచేస్తూన్నారు కాబట్టి, పత్రికల వాళ్ళాని చర్చలకు పిలిచి వారి ద్వారా పత్రికలలో చోటు సంపాదిస్తారు. వీపు గోకుడు యధా ప్రకారంగా సాగుతుంది. నాకు తెలిసిన ఒక టీవీ జర్నలిస్టు ఇలా పత్రికలవారిని చర్చలకు పిలుస్తూ తన కథలే కాక, తన సహోద్యోగుల కథలనూ ప్రచురింపచేశాడు. అతని కథలు ఎలా వున్నా వాటిని తిరగరాసి మరీ వేసేవారు.అయితే, ఉద్యోగంతోటే అతడి కథలు పడటమూ ఆగిపోయింది. ఒక దశలో తెలుగు యూనివర్శిటీలో ఉత్తమ కథకుడి అవార్డుకోసం పోటీపడ్డ అతడిప్పుడు కనబడడెక్కడా.

ఇంకా ఇలాంటి కథలు జర్నలిస్టు కథకుల గురించి అనేకం వున్నాయి. అవన్నీ రాస్తే కొన్ని వందల పేజీల పుస్తకాలు కొన్ని అవుతాయి.

ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే, జర్నలిస్టులు రచయితలయితే ఎవరికీ అభ్యంతరం వుండౌ కానీ, వారు రచయితలయి, పత్రికలన్నిటినీ వామనుడిలా రెండు అడుగులతో వొత్తిపట్టి మూడో అడుగు అసలు రచయితలు, తెలుగు సాహిత్యంపైన వేస్తేనే అసలు సమస్య మొదలవుతుంది.

ఒక జర్నలిస్టు రచయిత సాహిత్య పేజీకి ఇన్ చార్జ్ గా వుంటే, నిజానికి, రచయితలంతా ఆనందించాల్సివుంటుంది. కానీ, ఎప్పుడయితే ఆ రచయిత తాను మెచ్చిన వారికో, తనను మెచ్చేవారికో, తన రచనలకో సాహిత్య పేజీని పరిమితం చేసి ఇతరాలన్నిటినీ అణచివేస్తే, మిగతా అన్నిటివైపూ గుడ్డికన్నుతో చూస్తే అప్పుడు ఆ జర్నలిస్టు రచయిత ఎంత గొప్ప సాహిత్యకారుడయినా, సాహిత్య హంతకుడే అవుతాడు.

నాకు తెలిసిన ఒక సాహిత్య పేజీ ఇన్ చార్జ్ i have contempt for telugu papers అన్నాడు. అంతేకాదు, పతంజలిని చదవనివాడు, మెచ్చనివాడికీ నా పేజీల్లో స్థానం లేదని అన్నాడు. అలాంటి సంకుచిత ఇంచార్జ్ వున్న పత్రికకు నాతో రాయించుకునే అర్హత లేదన్నానన్నది వేరే విషయం. విచిత్రమేమిటంటే ఆయనా కథా రచయితే.

మరో జర్నలిస్టు కథకుదికి వ్యంగ్య హాస్యమంటే తాను రాసిందే అన్న విశ్వాసం. పొరపాటున ఎడిటర్ మరో రచయితను వ్యంగ్య కథ రాయమన్నాడు. అది ఈ జర్నలిస్టు కథారచయితకు ఆగ్రహం, అవమానం అయిపోయింది. రెండో వ్యంగ్య కథను ఎడిటర్ దాకా పోకుండా తొక్కిపట్టాడు. అడిగీ అడిగీ విసుగొచ్చి ఆ రచయిత మానుకున్నాక, అతను రాయటంలేదని తానే వ్యంగ్య శీర్షిక ఆరంభించాడీ వ్యంగ్య భంజక జర్నలిస్టు రచయిత.

సామాన్య పాఠకుడికి ఇవన్నీ తెలియవు. పండిత పాథకులకు తెలిసినా నిజాలు చెప్తే వారికి వచ్చిన గుర్తింపు ఎక్కడ పోతుందో అన్న భయం. కాబట్టి వారు, మూడు కోతుల పాలసీ అవలంబిస్తారు. వీలయితే నిజం చెప్పినవాడిపైన తామూ రాయి విసిరి తమ లాయల్టీ చాటుకుంటారు.

ఒక చక్కని రచయితకు, ఒక జర్నలిస్టు రచయితకూ వ్యక్తిగత విభేదాలు వచ్చాయి. దాంతో ఆ చక్కని రచయిత కథలు రాయటం మానుకుని వేరే వ్యాపకం వెతుక్కోవాల్సి వచ్చింది. ఒక వందేళ్ళ తరువాత కూడా మిగిలివుండే సాహిత్యాన్ని సృజించిన అతడిప్పుడు కథలు రాయటం మానేశాడు. కారణం, జర్నలిస్టు రచయితకు ఆగ్రహం తెప్పించటమే.

అందుకే, ఈనాడు పెద్దవాడు ఐస్ క్రీం తింటూంటే తనకూ కావాలని పెరాంబ్యులేటర్ లో కూచుని ఏడ్చే పసిపిల్లవాడిలా తయారయింది అసలు రచయితల పరిస్థితి.

పిల్లి అద్దంలో చూసుకుని తనను తాను పులిలా భావించుకుంటూంటే అవునవుననే ఇతర జంతువుల హోరులో, పులి తాను పులునన్నది మరచిపోయి పిల్లిలా వొదిగివుంటున్నది. పిల్లి పులిలా సంచరిస్తోంది. అందుకే ఈనాడు తెలుగు సాహిత్య ప్రపంచంలో గొప్ప గొప్ప జర్నలిస్టు రచయితలున్నారు. జర్నలిస్టు రచయితలు గొప్ప అనే వందిమాగధ రచయితలున్నారు. పొగడ్తలున్నాయి. కానీ పాఠకులు లేరు. పాఠకులున్న రచయితలకు పొగడ్తలు లేవు. పత్రికలలో స్థానం లేదు. ఇదీ తెలుగు సాహిత్యం దుస్థితి.

ఇదంతా జర్నలిస్టు రచయితలవల్లే అనుకుంటే పొరపాటు. ఇంకా అనేక కారణాలున్నాయి. ప్రస్తుతం కాగడా వెలుతురు ఈ అంశంపైన ప్రసరించింది.

అయితే, అందరు జర్నలిస్టు రచయితలూ ఇలాంటి వారే కాదు. అడపా చిరంజీవి అని ఒక జర్నలిస్టు రచయిత వున్నాడు. ఆయన ఎంత అమాయకుడంటే తాను పనిచేస్తున్న పత్రికలలోనే అతని కథలు వేయించుకోలేడు.

అలాగే పోనుగోటి కృష్ణా రెడ్డి అని జర్నలిస్టు రచయిత వున్నాడు. ఈయన నల్గొండ జిల్లాలోని నీటిలో ఫ్లోరయిడ్ గురించి రాసిన పుస్తకమే ఇప్పటికీ ప్రామాణికం. అన్ని చర్చలలో ఆయన పుస్తకంలోని గణాంక వివరాలే చెప్తారు. కానీ, ఒక్క చర్చకూ ఆయనను పిలవరు. ఆయన పట్తించుకోడు. అలాగే, ఆయన చేసిన అనువాదం, విరాట్, 25 ముద్రణలు పొందింది. ఎవ్వరూ ఈ విషయం చెప్పరు. ఏ అనువాదకుల సభకూ ఆయనను పిలవరు. ఆయన పట్టించుకోరు.

కేబీ లక్ష్మి కథకురాలు. కానీ, ఇతర కథకులకు ప్రోత్సాహం ఇస్తుంది. ఆమె జర్నలిస్టు లక్షణాలు లేని అమాయక జర్నలిస్టు.

ఇలా జర్నలిస్టు రచయితల్లో మరో రకం కూడా వున్నారు. కానీ వీరివల్ల జరిగే మంచి, ఇంకో రకం జర్నలిస్టుల వల్ల జరుగుతున్న చెడు ముందు తేలిపోతోంది. లీటరు పాలను చుక్క విషం పాదు చేస్తుంది. కానీ, లీటరు విషాన్ని చుక్కపాలు ఎలానూ ప్రభావం చేయలేవు. అదీ కథ

September 1, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized