Archive for September 1, 2013

కథకులందు జర్నలిస్టు కథకులు వేరయా!

సాహిత్యకాగదా సాహిత్య ప్రపంచంలోని అసమానతలను, అన్యాయాలను, ద్వంద్వప్రవృత్తులను ఎత్తిచూపించే ప్రయత్నం చేస్తుంది. వీలయినంత వరకూ వ్యక్తిగతాలకు దూరంగా వుండే ప్రయత్నం చేస్తుంది. జర్నలిస్టు కథకుల గురించి చర్చించేటప్పుడు కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంది.

కథకులందు జర్నలిస్టు కథకులు వేరయా అన్నది ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో అలవాటయిన ధోరణి.

ముందుగా, కథక జర్నలిస్టులకూ, జర్నలిస్టు కథకులకూ నడుమ వున్న తేడాను చెప్పుకోవాలి.

కథలు ముందు రాసి జర్నలిస్టులయిన వారు కథక జర్నలిస్టులు. ముందు జర్నలిస్టులయి, తరువాత కథకులయినవారు జర్నలిస్టు కథకులు. ఈ వారం ఇలాంటి జర్నలిస్టుకథకుల వ్యవహార శైలి, ప్రవర్తన, వీటి ద్వారా సాహిత్య ప్రపంచంలో వీరు చేస్తున్న అకాండతాండవంపై కాగడా వెలుతురు ప్రసరిస్తుంది.

ముందుగా కథలు రాసి తరువాత జర్నలిస్టులయిన వారికి కథకుల బాధలు తెలుసు. వారు కథకులను అర్ధం చేసుకుంటారు. సానుభూతి చూపుతారు.

కథ రాయటం ఒక ఎత్తయితే, రాసిన కథను పత్రికకు పంపటం, అది అచ్చయ్యే వరకూ రచయిత పడే వేదనలు, తపనలు కథక జర్నలిస్టులకు తెలుసు. ఇలాంటి వారు, అంటే, ముందుగా కథలు రాసి తరువాత జర్నలిస్టులయిన వారి వ్యవహార శైలి వేరుగా వుంటుంది. ఇలాంటి వారు పత్రికలలో వున్నప్పుడు, రచయితలకున్న ఫిర్యాదులు వేరే.

వాకాటి పాండురంగా రావు కథక జర్నలిస్టు. ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్ గా వున్నప్పుడు, ఎంతో మంది కథకులను ప్రోత్సహించారు. కథాప్రభ అనే శీర్షికన పెద్ద కథలకు ఊపునిచ్చారు. కొత్త కథకులలో ప్రతిభను గుర్తించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చి, మార్గదర్శనం చేసేవారు. ఇప్పుడు మంచికథలు రాస్తూ పేరు తెచ్చుకుంటున్న వారనేకులు వాకాటి గారి ప్రోత్సాహం పొందినవారే. వారు వాసమూర్తి అనే మరో కథకుడిని కథల ఎంపిక కోసం ప్రత్యేకంగా నియమించారు.

వాసమూర్తిగారు అద్భుతమయిన వ్యక్తి. ఏమాత్రం ప్రతిభ కనబడినా ఆయన రచయిత వెంటపడి మరీ కథలు రాయించేవారు. ప్రచురించి ప్రోత్సహించేవారు. కథలు రాయమని, మీరు కథ పంపి చాలా కాలమయింది, కథ పంపండి అని పేరు లేని రచయితలను సైతం, అహం లేకుండా అడిగి రాయించేవారు.

జగన్నాథ శర్మ, జర్నలిస్టయ్యేకన్నా ముందు కథకుడు. ఆయన, కథలలో విభిన్న ప్రక్రియలకు అత్యంత ఆదరణనిస్తారు. ఒక కథ మంచి చెడు నిర్ణయించటానికి నేనేవరు? అది చదివేట్టుందో లేదో చూస్తానంతే. ప్రచురితమయిన తరువాత పాథకులే మంచి చెడు నిర్ణయిస్తారు అన్నది ఆయన సిద్ధాంతం. అందుకే, ఆయన నవ్య ఎడిటరయిన తరువాత, నవ్యకొక సాహిత్యగంధం అలముకుంది. విభిన్న కథకులకు అవకాశం దొరుకుతోంది.

శ్రీరమణ కూడా ముందు కథకుడు, తరువాత జర్నలిస్టు. అయితే, ఆయన మెత్తనివాడు. వాకాటి, జగన్నాథ శర్మల్లా మాట నెగ్గించుకోలేడు. అందుకే, ఆయన ప్రభలో వున్నప్పుడు, నవ్య ఎడిటర్ అయినప్పుడూ పత్రికలు దిశారహితమయ్యాయి. హాస్య కథలకు ప్రాధాన్యం లభించింది.

కిరణ్ ప్రభ కూడా ముందు రచయిత. తరువాత కౌముది ద్వారా జర్నలిస్టయ్యారు. కౌముది ద్వారా రచయితలయిన వారు అనేకులు.

పై ఉదాహరణలు కథక జర్నలిస్తుల ధోరణి తెలిపేందుకు దృష్టాంతాలు మాత్రమే. ప్రతి దానికీ ఎక్సెప్షన్లుంటాయి. ముఖ్యంగా ఏదో ఒక సిద్ధాంతపు రంగుటద్దాలు ధరించిన వారు ముందు కథకులయి, తరువాత జర్నలిస్టులయినా, వారి రంగుటద్దాలు వారి కళ్ళకన్ని రంగులూ కనబడనీయవు. ఆ ప్రభావం వారి పత్రికలపైఅన పడుతుంది. రచయితలపైనా పడుతుంది. ఒకోసారి పత్రికలకు కొన్ని పాలసీలుంటాయి. దాంతో, నిర్ణయాత్మక స్థానంలో వున్న అభిప్రాయాలతో సంబంధం లేకుండా కథలన్ని ఒకే రకంగా మూసలో పోసినట్టుంటాయి.
ఇక జర్నలిస్టు కథకుల దగ్గరకు వస్తే, వీరికి రాయాలన్న ఆసక్తి వున్నా, సాహిత్యం పైన మక్కువ వున్నా అనేక కారణాలవల్ల పత్రికలలో చేరిన తరువాతనే వీరు రచనలవైపు దృష్టిని మళ్ళించినవారు.

కొందరి భాష బావుంటుంది. దాంతో ఇన్ చార్జి, ఒక బలహీన క్షణంలోనో, అవసరాన్ననుసరించో, నువ్వేదయినా రాయకూడదా, అంటాడు. వీరు తమ శక్తి కొద్దీ రచనలు ఆరంభిస్తారు. అవసరము, ఇష్టం, మొహమాటం కారణమేదయినా వీరు రాసినవి ప్రచురితమవుతాయి. అంటే, ఈ జర్నలిస్టు కథకులకు, ప్రచురణ కోసం రచయితలు పడే బాధలతో అంతగా పరిచయం వుండదు. ఎక్కడో, బ్రతక నేర్చిన లక్షణాలు లేని జర్నలిస్టులకు తప్పించి, మిగతా జర్నలిస్టు కథకులంతా పురిటి నొప్పులు, ప్రసవ వేదనలు తెలియని immaculate conception లాంతి తల్లులన్నమాట. అందుకే వీరికి ఇతర రచయితల పట్ల చులకన భావం వుంటుంది. కథలు అచ్చులో చూసుకోవాలన్న రచయితల తపన ఆటలా వుంటుంది. కథల ప్రచురణ కోసం ఫోన్లు చేసే రచయితలూ, తమ చుట్టూ తిరిగే రచయితలన్నా నవ్వులాటగా వుంటుంది.

ఒక జర్నలిస్టు కథకుడితో ఇన్ చార్జ్ నువ్వో శీర్షిక రాయోయ్, అని టాపిక్ చెప్పాడు. ఆ విషయం గురించి ఆ జర్నలిస్టుకేమీ తెలియదు. దాంతో, ఆ ఇన్ చార్జ్ ఆ విషయానికి సంబంధించిన సీడీలు, క్యాసెట్లూ ఇచ్చి, ఆ రంగంలో పరిచయమున్న వారిని కలిపి, ఇక రాసుకో అన్నాడు. స్వతహాగా ప్రతిభ వున్నవాడు, భాషపైన కాస్త పట్టు వున్నవాడూ కావటంతో అందిస్తే అల్లుకు పోయాడా జర్నలిస్టు కథకుడు.

జర్నలిస్టు, పైగా, ఇన్ చార్జ్ అండదండలున్నవాడు. దాంతో, ఇతర జర్నలిస్టులూ అతని అద్భుతమయిన విఙ్నానానికీ, అమోఘమయిన ప్రతిభకూ ఆశ్చర్య చకితులయి పరమానందాన్ని ప్రకటించారు. రచయితలు సరేసరి. నిజం చెప్పితే తమ కథలు అచ్చుకావు జీవితాంతం. అందుకని వారూ తమ సృజనాత్మకతనంతా ఉపయోగించి అతడిని పొగడ్తలలో ముంచెత్తారు. దాంతో పిల్లి అద్దంలో తనను తాను పులిలా చూసుకున్నట్టు, ఇక ఆరంగంలో తనను మించినవారెవరూ లేరన్న అభిప్రాయానికి వచ్చేశాడా క్జర్నలిస్టు కథకుడు. దాంతో, ఆ రంగంపైన తనకు గుత్తాధిపత్యం వుందనుకుంటాడు.మరో రచయిత ఎవరయినా ఆ రంగంలోకి అడుగుపెడితే సహించలేడు. వాడికి తన పట్టున్న పత్రికలలో స్థానాన్నివ్వడు. (జర్నలిస్టు కథకులూ మాఫియా ముఠాల్లాగే ప్రవర్తిస్తాడు. ఒకడికి నచ్చకపోతే పనిగట్టుకుని ఇతర జర్నలిస్టు స్నేహితులందరికీ తనకు నచ్చనివాడి గురించి చెప్పి, వారూ అతడికి అవకాశాలివ్వకుండా చూస్తాడు.) ఆ రచయితను తనకు ప్రత్యర్ధిగా భావిస్తాడు. అతని పేరు తన పట్టున్న పత్రికలలో ఏరకంగా రాకుండా జాగ్రత్తపడతాడు.

తనకు స్వతహాగా ప్రతిభ వున్నా ఎక్కడో న్యూనతా భావం అతడిని బాధిస్తూంటుంది. దాంతో ప్రతిభ వున్న ప్రతివాడినీ చూసి ఉలిక్కి పడుతూంటాడు. ఎక్కడ తన స్థానాన్ని ఎవడు కాజేస్తాడో నన్న భయంతో తనకు ఎలాంటి ముప్పు లేదని భావించిన వారినీ, తనను పొగడే వారినీ, తనకు లాభమున్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తాడు. తన చుట్టూ నిర్మించుకున్న కంచెలో సురక్షితంగా వుంటాడు. ఇది, ఒక రకమయిన జర్నలిస్టు కథకుడు.

ఇంకో రకమయిన జర్నలిస్టు కథకుడు పూర్తిగా బ్రతక నేర్చినవాడు. ఈయన దృష్టిలో పత్రిక వున్నది తన కోసమే. పాఠకులు ఉన్నది తనని మెచ్చుకోవటం కోసమే. విమర్శకులున్నది తనను ఆకాశానికి ఎత్తటం కోసమే. దాంతో పత్రికను సంపూర్ణంగా వినియోగించుకుంటాడు. తనకు లాభం వున్న వారి కథలే వేస్తాడు. తన పుస్తకం రాయటం నుంచి, ప్రచురితమయ్యే వరకూ ఏదో గొప్ప ఈవెంట్ జరుగుత్న్నట్టు భ్రమ కలిగిస్తాడు. ప్రముఖుల మొహమాటపు పొగడ్తలు, ఈతర లాభాలున్న వారి ప్రశంసలతో అమాయక పాఠకులలో ఒక గొప్ప భ్రమను కలిగిస్తాడు. పత్రిక వున్నది తనకోసమే కాబట్టి పుస్తకం వేసేవీలున్న రాతలే రాస్తాడు. అలా తనను మించిన వారెవరూ లేరన్న భ్రమలో వుంటూ, ఎక్కడ ఈ భ్రమ చెదిరిపోతుందో అన్న భయంలో మీసాలు మెలివేస్తూ బ్రతుకుతూంటాడు. ఒకవేళ తన గొప్పనెవ్వరూ గుర్తించటం లేదనిపిస్తే, తనతో అవసరం వున్న వారి డబ్బులతో పుస్తకాలు వేయిస్తూ దాన్లో తన వంది మాగధుల కథల నడుమ తన కథనూ చొప్పిస్తాడు. వంది మాగధుల కృతఙ్నతను సాధిస్తాడు. ఇలా, ఎంత పేరు సంపాదిస్తే అంత అభద్రతా భావానికి గురవుతాడీ బ్రతక నేర్చిన జర్నలిస్టు కథకుడు. కానీ, ఇతని వల్ల కూడా, రంగుటద్దాల జర్నలిస్టు కథకుల్లాగే సాహిత్యం దెబ్బ తింటుంది.

మరో రకం జర్నలిస్టు కథకులుంటారు. వీరికి రాయాలన్న ఉత్సాహం వుంటుంది. కానీ, ఊహలుండవు. కానీ, పత్రిక చేతిలో వుంది. ఏమి రాసినా ప్రచురితమవుతుంది. అలా వీరి వ్యాసాలు కథల పేరిట ప్రచురితమవుతాయి. కాగడా లాంటి పనికి రాని, పని లేని రచయిత ఎవరయినా, ఇవి వ్యాసాలు, వార్తలు, కథలు కావు, కథలో ఊహ వుండాలి అంటే, మేము అనుభవించనిది ఎలా రాస్తాం? అంటూ సత్యజిత్ రే పోసు పెడతారు. వారికి సన్నాయి నొక్కులు నొక్కే పొగడు బృందాలుంటాయి. వారు వీరేమి రాసినా, ఆముదం తిని అమృతం తాగిన ముఖాలుపెడతారు. వీరిని ఆకాశానికెత్తుతారు. దాంతో వారు మరిన్ని వ్యాసాలు ఆనందగా రాసి ఇవే కథలు పొమ్మంటారు. ఇంకా నూనూగు మీసాలు రాకున్నా, కొమ్ములు తిరిగిన రచయితల కథలపైన అభిప్రాయాలు ప్రకటించేస్తూంటారు. తమ లాగా వ్యాసలు రాసి కథలనే వారికే ప్రోత్సాహం ఇస్తూంటారు. వీరికి ఉన్న స్థానం వల్ల విమర్శకులు కథారచనలో వేరో సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నారని రాసేస్తారు. యూనివెర్సిటీవారు రీసెర్చులూ చేస్తారు. దాంతో తాము ఏమి రాసినా అది అద్భుతమన్న భ్రమలోకి దిగిపోతారు. ఐదంతా పదవి వున్నంతవరకే. ఒక్కసారి పదవి పోయిందా, పొగిడిన వారంతా, పాసిపోయిన తిండి వదలి ఫ్రెష్ తిండి వైపు మూగినట్టు మరో వైపుకి పోతారు. దాంతో ఇలాంటి వారు, కథలు రాయలేక, వ్యాసాలూ రాయలేక, గత వైభవాన్ని తలచుకుంటూ, జానే కహాన్ గయే వొ దిన్, అనుకుంటూ మిగులుతారు. కానీ, వెలుగు వెలిగినన్నాళ్ళూ వీరి వెలుతురు నీడలో వొదిగిన అసాహిత్యం మాత్రం బాగుపరచలేని రీతిలో దెబ్బతింటుంది.

ఇంకోరకమయిన జర్నలిస్టు కథకులుంటారు. వీరికి ఆలోచనలు రావు. కానీ, పేరు పొందాలన్న తపన వుంటుంది. అందుకని, ఇతర భాషలలోని ప్రముఖ కథలని అనువదించి స్వకపోల కల్పితాలుగా ప్రచారం చేసుకుంటారు. కాదనే ధైర్యం ఎవ్వరికీ వుండదు. ఎందుకంటే పెద్దలంతా ఈ జర్నలిస్టు కథకుడి సృజన ముందు ఒరిజనల్ రచయితలంతా దిగదుడుపే అని రాసేస్తారు. వీరి ప్రాపకం కావాల్సిన వారు ఇంకో అడుగు ముందుకెళ్ళి కాఫ్కాలూ, లూయీ బోర్హెస్ లూ, మార్క్వెజ్ లూ ఈయన పాదసేవ చేసుకుని కథా రచనలో అ ఆ లు దిద్దాలంటారు. అసలు రచయితలు దూరంగా నిలుచుని తమాషా చూస్తూ, కార్వాన్ గుజర్ గయా, గుబార్ దేఖ్ తే రహే, అనుకుంటూంటారు.

ఇక, ఎలగో జర్నలిస్టులయి కథా రచయితలుగా చలామణీ అవుతున్నారు కాబట్టి, టీవీ స్క్రిప్టులవైపు మళ్ళుతారు. టీవీల్లోనూ వుండేది జర్నలిస్టులే కాబట్టి, వారూ వీరికే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో టీవీలూ పత్రికల్లా తయారవుతాయి. టీవీ నాటకాలూ సృజన ఏమాత్రం లేని సాగతీత వ్యాసాలవుతాయి. ఇప్పటికీ, టీవీ మాధ్యమంలో కీలకమయిన స్థానాలలో వున్నది పత్రికలవాళ్ళే. అందుకే టీవీ అటు రేడియోకీ, ఇటు పత్రికలకీ నకళ్ళుగా వుంటోంది తప్ప దృష్య మాధ్యమ వ్యాకరణం తెలిసినవారెవరూ ఆ రంగంలో లేరు. ఇది ఏ టీవీ కార్యక్రమం చూసినా తెలుస్తుంది.

నాకు తెలిసిన ఒక జర్నలిస్టు రచయిత వున్నాడు. ఒకేవూరివాడని ఒక సీనియర్ జర్నలిస్టును ఆశ్రయించి వ్యాసాలు రాయించుకుని ప్రచురింపచేసుకున్నాడు. వాటన్నిటినీ పుస్తక రూపంలో వేయించుకుని, సినిమాలో నిష్ణాతుడని పించుకున్నాడు. మరిలిన్ మన్రో స్పెల్లింగ్ కూడా తెలియనివాడు సినిమా విశ్లేషణల నిష్ణాతుడిలా పేరుపొందాడు. ఈ పుస్తకాన్ని చూపి ఒక టీవీ చానెల్ లో చేరిపోయాడు. అక్కడా, వారినీ వీరినీ ఉపయోగించుకుని కొన్ని కార్యక్రమాలు చేశాడు. వాటి ఆధారంగా సినీ రంగంలో ప్రవేశించాడు. కానీ, అక్కడ అసలు నిజం బయటపడటంతో మళ్ళీ ఇప్పుడు పాత పత్రిక రంగంలో సినీ విశ్లేషణలు చేస్తున్నాడు. సినీ స్పెషలిస్టయ్యాడు. ఎందుకంటే కొన్నాళ్ళు సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్నాడు కాబట్టి సినిమాల గురించి తనకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదని ఆయన నమ్మకం.

ఇంకో రకమయిన జర్నలిస్టు రచయిత వున్నాడు. జర్నలిజంలో ప్రవేసించిన తరువాత సులువుగా రచయిత అయ్యే మార్గం కనిపెట్టాడు. ఫెమినిస్టులు కలిస్తే, ఒక ఫెమినిస్టు కథని అటూ ఇటూ చేసి రాసేస్తాడు. అలా, ఏ ఉద్యమకారులు కనిపిస్తే, ఆ వుద్యమ కారుల కథలను అటూ ఇతూ చేసి రాసేసి, వారితోనే తన కథలకు ఉద్యమ ప్రామాణికత కల్పించుకున్నాడు. అందరి బంధువయా, అన్నట్టు, ఒక్క అసలు కథ తప్ప అందరి కథలనూ స్వంతం చేసుకుని ఉత్తమ కథకుడిగా గుర్తింపు పొందుతున్నాడు.

ఇంకో రకమయిన జర్నలిస్టు రచయితలకు ఎప్పుడూ డబ్బు లోటే. కొందరు ఉన్నత స్థానాల్లో వున్న రచయితలకు పేరు పిచ్చి. వారీ జర్నలిస్టులకు డబ్బు లిస్తారు. పార్టీ లిస్తారు. తాగిస్తారు. దాంతో ఈ జర్నలిస్టులు ఆ పెద్ద మనుషులను పెద్ద రచయితలంటూ పొగడుతారు. వారిని అందలానికి ఎత్తేస్తారు. వారితోపాటూ తామూ అందలాలెక్కుతారు. ఎప్పుడయినా డబ్బు తేడాలొస్తే, మొన్నటిదాకా పొగడిన పెద్దమనిషి ఇప్పుడు రచయితేకాడన్నట్టు ప్రవర్తిస్తారు. అయితే, డబ్బు అవసరం లేని జర్నలిస్టులకు కొదువ లేదు కాబట్టి పెద్దమనుషులెప్పుడూ ఉత్తమ రచయితలుగానే చెలామణీఅవుతూంటారు.

ఇంకో రకమయిన జర్నలిస్తులుంటారు. వీరు టీవీల్లో పనిచేస్తూన్నారు కాబట్టి, పత్రికల వాళ్ళాని చర్చలకు పిలిచి వారి ద్వారా పత్రికలలో చోటు సంపాదిస్తారు. వీపు గోకుడు యధా ప్రకారంగా సాగుతుంది. నాకు తెలిసిన ఒక టీవీ జర్నలిస్టు ఇలా పత్రికలవారిని చర్చలకు పిలుస్తూ తన కథలే కాక, తన సహోద్యోగుల కథలనూ ప్రచురింపచేశాడు. అతని కథలు ఎలా వున్నా వాటిని తిరగరాసి మరీ వేసేవారు.అయితే, ఉద్యోగంతోటే అతడి కథలు పడటమూ ఆగిపోయింది. ఒక దశలో తెలుగు యూనివర్శిటీలో ఉత్తమ కథకుడి అవార్డుకోసం పోటీపడ్డ అతడిప్పుడు కనబడడెక్కడా.

ఇంకా ఇలాంటి కథలు జర్నలిస్టు కథకుల గురించి అనేకం వున్నాయి. అవన్నీ రాస్తే కొన్ని వందల పేజీల పుస్తకాలు కొన్ని అవుతాయి.

ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే, జర్నలిస్టులు రచయితలయితే ఎవరికీ అభ్యంతరం వుండౌ కానీ, వారు రచయితలయి, పత్రికలన్నిటినీ వామనుడిలా రెండు అడుగులతో వొత్తిపట్టి మూడో అడుగు అసలు రచయితలు, తెలుగు సాహిత్యంపైన వేస్తేనే అసలు సమస్య మొదలవుతుంది.

ఒక జర్నలిస్టు రచయిత సాహిత్య పేజీకి ఇన్ చార్జ్ గా వుంటే, నిజానికి, రచయితలంతా ఆనందించాల్సివుంటుంది. కానీ, ఎప్పుడయితే ఆ రచయిత తాను మెచ్చిన వారికో, తనను మెచ్చేవారికో, తన రచనలకో సాహిత్య పేజీని పరిమితం చేసి ఇతరాలన్నిటినీ అణచివేస్తే, మిగతా అన్నిటివైపూ గుడ్డికన్నుతో చూస్తే అప్పుడు ఆ జర్నలిస్టు రచయిత ఎంత గొప్ప సాహిత్యకారుడయినా, సాహిత్య హంతకుడే అవుతాడు.

నాకు తెలిసిన ఒక సాహిత్య పేజీ ఇన్ చార్జ్ i have contempt for telugu papers అన్నాడు. అంతేకాదు, పతంజలిని చదవనివాడు, మెచ్చనివాడికీ నా పేజీల్లో స్థానం లేదని అన్నాడు. అలాంటి సంకుచిత ఇంచార్జ్ వున్న పత్రికకు నాతో రాయించుకునే అర్హత లేదన్నానన్నది వేరే విషయం. విచిత్రమేమిటంటే ఆయనా కథా రచయితే.

మరో జర్నలిస్టు కథకుదికి వ్యంగ్య హాస్యమంటే తాను రాసిందే అన్న విశ్వాసం. పొరపాటున ఎడిటర్ మరో రచయితను వ్యంగ్య కథ రాయమన్నాడు. అది ఈ జర్నలిస్టు కథారచయితకు ఆగ్రహం, అవమానం అయిపోయింది. రెండో వ్యంగ్య కథను ఎడిటర్ దాకా పోకుండా తొక్కిపట్టాడు. అడిగీ అడిగీ విసుగొచ్చి ఆ రచయిత మానుకున్నాక, అతను రాయటంలేదని తానే వ్యంగ్య శీర్షిక ఆరంభించాడీ వ్యంగ్య భంజక జర్నలిస్టు రచయిత.

సామాన్య పాఠకుడికి ఇవన్నీ తెలియవు. పండిత పాథకులకు తెలిసినా నిజాలు చెప్తే వారికి వచ్చిన గుర్తింపు ఎక్కడ పోతుందో అన్న భయం. కాబట్టి వారు, మూడు కోతుల పాలసీ అవలంబిస్తారు. వీలయితే నిజం చెప్పినవాడిపైన తామూ రాయి విసిరి తమ లాయల్టీ చాటుకుంటారు.

ఒక చక్కని రచయితకు, ఒక జర్నలిస్టు రచయితకూ వ్యక్తిగత విభేదాలు వచ్చాయి. దాంతో ఆ చక్కని రచయిత కథలు రాయటం మానుకుని వేరే వ్యాపకం వెతుక్కోవాల్సి వచ్చింది. ఒక వందేళ్ళ తరువాత కూడా మిగిలివుండే సాహిత్యాన్ని సృజించిన అతడిప్పుడు కథలు రాయటం మానేశాడు. కారణం, జర్నలిస్టు రచయితకు ఆగ్రహం తెప్పించటమే.

అందుకే, ఈనాడు పెద్దవాడు ఐస్ క్రీం తింటూంటే తనకూ కావాలని పెరాంబ్యులేటర్ లో కూచుని ఏడ్చే పసిపిల్లవాడిలా తయారయింది అసలు రచయితల పరిస్థితి.

పిల్లి అద్దంలో చూసుకుని తనను తాను పులిలా భావించుకుంటూంటే అవునవుననే ఇతర జంతువుల హోరులో, పులి తాను పులునన్నది మరచిపోయి పిల్లిలా వొదిగివుంటున్నది. పిల్లి పులిలా సంచరిస్తోంది. అందుకే ఈనాడు తెలుగు సాహిత్య ప్రపంచంలో గొప్ప గొప్ప జర్నలిస్టు రచయితలున్నారు. జర్నలిస్టు రచయితలు గొప్ప అనే వందిమాగధ రచయితలున్నారు. పొగడ్తలున్నాయి. కానీ పాఠకులు లేరు. పాఠకులున్న రచయితలకు పొగడ్తలు లేవు. పత్రికలలో స్థానం లేదు. ఇదీ తెలుగు సాహిత్యం దుస్థితి.

ఇదంతా జర్నలిస్టు రచయితలవల్లే అనుకుంటే పొరపాటు. ఇంకా అనేక కారణాలున్నాయి. ప్రస్తుతం కాగడా వెలుతురు ఈ అంశంపైన ప్రసరించింది.

అయితే, అందరు జర్నలిస్టు రచయితలూ ఇలాంటి వారే కాదు. అడపా చిరంజీవి అని ఒక జర్నలిస్టు రచయిత వున్నాడు. ఆయన ఎంత అమాయకుడంటే తాను పనిచేస్తున్న పత్రికలలోనే అతని కథలు వేయించుకోలేడు.

అలాగే పోనుగోటి కృష్ణా రెడ్డి అని జర్నలిస్టు రచయిత వున్నాడు. ఈయన నల్గొండ జిల్లాలోని నీటిలో ఫ్లోరయిడ్ గురించి రాసిన పుస్తకమే ఇప్పటికీ ప్రామాణికం. అన్ని చర్చలలో ఆయన పుస్తకంలోని గణాంక వివరాలే చెప్తారు. కానీ, ఒక్క చర్చకూ ఆయనను పిలవరు. ఆయన పట్తించుకోడు. అలాగే, ఆయన చేసిన అనువాదం, విరాట్, 25 ముద్రణలు పొందింది. ఎవ్వరూ ఈ విషయం చెప్పరు. ఏ అనువాదకుల సభకూ ఆయనను పిలవరు. ఆయన పట్టించుకోరు.

కేబీ లక్ష్మి కథకురాలు. కానీ, ఇతర కథకులకు ప్రోత్సాహం ఇస్తుంది. ఆమె జర్నలిస్టు లక్షణాలు లేని అమాయక జర్నలిస్టు.

ఇలా జర్నలిస్టు రచయితల్లో మరో రకం కూడా వున్నారు. కానీ వీరివల్ల జరిగే మంచి, ఇంకో రకం జర్నలిస్టుల వల్ల జరుగుతున్న చెడు ముందు తేలిపోతోంది. లీటరు పాలను చుక్క విషం పాదు చేస్తుంది. కానీ, లీటరు విషాన్ని చుక్కపాలు ఎలానూ ప్రభావం చేయలేవు. అదీ కథ

September 1, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized