Archive for September 11, 2013

విశ్వనాథ సాహిత్యం-2

విశ్వనాథ సాహిత్య సాగరం వైపు చూపు ప్రసరింపచేసేముందు, సాహిత్యం గురించి విశ్వనాథ అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సివుంటుంది. ఎలాగో ఆయన సాహిత్యాన్ని తెలుసుకుంటూపోతూంటే ఆయన దృక్పథం, ఆయన దృక్కోణం, ఆలోచనా విధానాలు తెలుస్త్యాయి. కానీ, ఎలాగయితే, సముద్రపు అలల్లో ఆడుకోవటానికి, అలల తాకిడి ఆనందన్ని అనుభవించటానికి సిద్ధమయ్యేముందు కొన్ని తయారీలు చేస్తామో, పాంటు పైకి మడవటం, చెప్పులు విడవటం, అలల తాకిడి ఎక్కువుంటే ఒకరి చేయి ఒకరు పట్టుకోవటం లాంటివి, అలాగే, విశ్వనాథ సాహిత్య సాగరపుటలలను తాకేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సివుంటుంది. ఇవి తెలుసుకున్న తరువాత, అలల్ను ఎదుర్కోవటం కాస్త అలవాటయిన తరువాత, లైఫ్ జాకెట్ వేసుకుని నీళ్ళల్లో దిగాల్సివుంటుంది. ఆతరువాత ఆ సముద్రపులోతులలో ఎవరెవరి సంస్కారాన్ని, దృష్టిని బట్టి వారు అణ్వేషించుకోవాల్సివుంటుంది. వారి వారి సంస్కారాన్ని బట్తి కొందరికి మొసళ్లు, సొర చేపలు, తుఫానులే కనిపిస్తాయి. ఇంకొందరికి, సముద్ర గర్భంలో నిక్షిప్తమయి వున్న అనేకానేక అమూల్యమయిన అద్భుతాలు దర్శనమిస్తాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సంధియుగానికి చెందినవాడు. పూర్వ సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం తరగని కాలం అది. కానీ, ఆధునిక భావాల పవనాలు బలంగా వీయటం ఆరంభమయిన కాలమూ అది. మరో వైపు, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం జాతిలో సంపూర్ణంగా అంతరించని కాలము అది. ఇంకో వైపు, అప్పుడప్పుడే విషంలా నెమ్మదిగా పాకుతున్న కాలం. విశ్వనాథ వారి మాటలలోనే చెప్పాలంటే,’నా-ఆ పసినాటికి ఇంగ్లీషు చదువు నేటికివలె త్రెంచరాని ముళ్ళుగా, త్రెంచినచో నెత్తురుకారెడి ముళ్ళుగా అల్లుకొనలేదు.’ అంటాడు. ఆ కాలం నాటి చదువు గురించి, ‘ పల్లెటూళ్ళలోని ఆనాటి చదువు పెద్ద పుస్తకమును చదివి అర్ధము చేసికొనుట. పెద్ద పుస్తకమనగా, కవిత్రయము యొక్క భారతము, పోతన్న గారి భాగవతము, భాస్కర రామాయణము, ఈ మూడింటికి పెద్ద పుస్తకమని పేరు.’ అంటే ఆ కాలంలో కాస్త చదువు వచ్చిన వాడూ చక్కని తెలుగు తెలిసినవాడే నన్న మాట. అందుకే, విశ్వనాథ, ‘నా ఆంధ్రభాషా పాండిత్యమునకు ప్రధాన గురువు మా తండ్రి, నా కుటుంబము, మాయూరు, ఆనాటి బొచ్చగాండ్రు, మా పాలేళ్ళూ అన్నాడు. ఎందుకంటే, ఈనాటి విద్యా వంతులతో పోలిస్తే, ఆనాటి నిరక్షరాస్యులే ఎక్కువ విద్యావంతులు. ఈ విషయాన్నే చెప్తూ, విశ్వనాథ, తనలాంటి వాతావరణంలోనే పెరిగినా, తన సోదరులు పాందిత్యమున్నా మహాకవులెందుకు కాలేదో స్పష్టంగా వివరించారు.’నా జీవలక్షణములో కవితా శక్తివున్నది. కల్పనా శక్తి వున్నది. ఆంధ్రభాషా సాహిత్య శక్తియున్నది. నాకివియన్నియు దోహదములైనవి. వారికి కాలేదూ అంటాడు. అంతేకాదు, తాను పన్నెండు పదమూడేళ్ళు వచ్చేవరకూ పల్లెలో తెలుగ్ భాషను చదువుకున్నానని, వాళ్ళకు కొంచెము ఙ్నానము వచ్చిన తరువత పల్లెటూరి సంపర్కము తక్కువయిపోయిందని, అందుకని వారు కవులయినా మహా కవులు కాలేక పోయారనీ అంటాడు. ఇక్కడే, సాహిత్యం పట్ల తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు విశ్వనాథ.

“వొట్టిపట్టణములలో పెరిగినవాడు నేటి ఇంగ్లీషు రచయితల వలె తయారగును. పరుల భావములను తీసికొని ఒకడు శబ్దములమీద, మరియొకడు పెర యూహలమీద సాము గరిడీలు చేసెడివాడు. సాంప్రదాయ దూరుడు, ఆర్ద్రతా విరహితుడు అవుతాడు. సాహిత్యమునందు రసమనునది వున్నది. అది విషయానందమునకు దాటినది. జీవుని సమాశ్రయించియున్న మాయను భేదించి బ్రహ్మపదార్ధమును లిప్తకాలమునందు తన్ను తనదిగా జేసికొను లక్షణము తెలియనివాడు. తెలియనిచో నష్టములేదుకానీ, దానిని తిరస్కరించువాడు. ద్వేషించువాడు.” ఇవన్నీ లేనిదే సాహిత్యమన్నమాట. అందుకే అవకాషం దొరికినప్పుడల్లా రసమే సాహిత్యంలో ప్రధానమయిన విషయమని విశ్వనాథ ప్రకటిస్తూ వచ్చాడు. తన రచనలలో, తాను రాసిన ప్రతి అక్షరంలో భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చూపించాలని ప్రయత్నించాడు. జాతి దృష్టిని పరాయీకరణనుంచి, పరాయి భావనలను గుడ్డిగా, బానిసల్లా అనుసరించి, తమ స్వంతమయిన మణి మాణిక్యాలను రాళ్ళనిపొరబడి పారవేయకుండా నిజానిజాలు వివరించాలని ప్రయత్నించాడు.

విశ్వనాథ దృష్తిలో సాహిత్యం సరస్వతి. తాను సృజించే ప్రతి అక్షరం పార్వతీదేవి పాదాల అర్చనకోసం జన్మించిన పుష్పం. “వేదశాత్రోపనిషదాదులు సరస్వతి. కావ్యములయందు గూడ నుదార బుద్ధులయిన పండితులు సరస్వతిని ప్రతిపాదించిరి. ఈ సరస్వతిని రక్షించుట సత్కవియొక్క ధర్మము.” ఇదీ కవి బాధ్యత, ధర్మములను గురించి విశ్వనాథ అభిప్రాయం. ఈ ధర్మ నిర్వహణకొసం, తన బాధ్యతను సక్రమంగా నిర్వహించటం కొసమే ఆయన సాహిత్యాన్ని సృజించారు. ఎన్నడూ, ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురయినా, ఎన్ని దూషణలనెదుర్కొన్నా ఆయన తన ధర్మ నిర్వహణ మానలేదు. తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. తన లక్ష్యానుంచి పక్కకు తొలగలేదు.అయితే, దేశ సామాజిక మనస్తత్వంలో వస్తున్న మార్పును విశ్వనాథ గమనించాడు. ఆ మార్పును అడ్డుకోవటం కన్నా, ఆ వీస్తున్న పవనాల దిశను నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటూ, గతానికి భవిష్యత్తుకూ వర్తమానాన్ని వారధిలావాడుకోవటం నేర్పాలని తన రచనల ద్వారా ప్రయత్నించాడు.

తన ఈ ప్రయత్నం అపోహలకు, హేళనకు, దూషణలకు, తిరస్కారాలకూ గురవుతుందని, గురవుతున్నదనీ ఆయనకు తెలుసు. అయినా తాను నమ్మింది ప్రకటిస్తూ పోయాడు. “పూర్వ మహాకవులను గూర్చికూడా శాఖాభేదములతో వ్యవహరించెడి యీ కితవసాహిత్యవేత్తృప్రపంచమున నా సాహిత్య ప్రయాణము మిక్కిలి ఎగుడు దిగుడులతో సాగిపోయినది.” అని చెప్పుకున్నాడు. అంతేకాదు,” నేటికిని నా సూక్ష్మతమాభిదర్శనపు వ్యావృత్తియు విషయాభిముఖీనమైన హేతుకల్పమును నన్ను కొందరు ఈర్ష్యాగ్రస్తులచేత ద్వేషింపబడునట్లు చేయుచున్నవి” అని తన 74వయేట ఆత్మకథలో వ్రాసుకున్నారు విశ్వనాథవారు.

టూకీగా సాహిత్యం పత్ల విశ్వనాథవారి దృక్కోణం ఇది. అందువల్ల వారు ఎదుర్కొన్న సమస్యల స్వరూపమూ ఇదే.

విశ్వనాథ దృష్టిలో కావ్యము సహజమయిన కామక్రోధాదులను సముద్దీపింపచేయటానికి సృజించటం జరుగుతుంది. వ్యక్తిగతమయిన క్రోధము సహజము, సిద్ధాంతగతమయిన క్రోధము అసహజము. కాబట్టి, సిద్ధాంత గతమయిన క్రోధాన్ని ప్రజ్వరిల్లింపచేసేందుకు రాసేది అసహజమయిన కావ్యము. సహజమయిన భావనలను కలిగించే కావ్యం వల్ల పొందే సుఖదుహ్ఖాలు పాంచభౌతిక శరీరానికి సంబంధించనివి. అంటే అలౌకికమైనవి. ఇలాంటి అలౌకిక భావనలను కలిగించే సహజమైన కావ్య సృజన సాహిత్య లక్ష్యము, లక్షణము అన్నది విశ్వనాథ భావన. ఆయన సాహిత్యాన్ని ఈ భావన ద్వారా విశ్లేషించాల్సి వుంటుంది.

అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సహజ అసహజ భావనలలో వ్యక్తిగతానికి, సిద్ధాంతానికి తేడా ఏమిటన్నది.

ఇది వచ్చే వ్యాసంలో.

(ఈ వ్యాసంలో విశ్వనాథ వారి మాటలుగా ఉదాహరించినవన్నీ ఆయన ఆత్మకథ లోనివి.సరస్వతికి సంబంధించిన వ్యాఖ్య, కావ్యానందం లోనిది.)

September 11, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.