Archive for October, 2013

కథలు- కార్యశాలలూ.

ఇటీవలె కథలకు సంబంధించి రెండు సమాచారాలు ఈ-మైల్ లో వచ్చాయి. అవి వచ్చినప్పటి నుంచీ సాహిత్యకాగడా కు పనిమొదలయింది.

ఒక మెయిల్ కథాకార్యశాలకు సంబంధించింది. రెండవ మెయిల్ కథలకు సంబంధించిన సమావేశం గురించి.

ఈ రెండూ చూసిన తరువాత కాగడాకు ఇలాంటి కార్యశాలలూ, సమావేశాల గురించి ఎవరూ అడగకున్నా(ఎవరో అడగాలని ఎదురుచూసి మోసపోకుమా అని ఓ మహాఉగకవి ఎప్పుడో చెప్పాడుకదా) సాహిత్యప్రపంచంలో నెలకొని వున్న అపోహల(కాగడా వ్యక్తిగతానుభవాలు, ఇతర స్నేహితుల అనుభవాల ఆధారంగా ఏర్పడిన వ్యక్తిగత అభిప్రాయాలు) గురించి అందరికీ తెలపాలనిపించింది.(కార్డు రాస్తే పోతుందికదా అనేవారికి; కార్డులకూ, కవర్లకూ కాలం ఎప్పుడో చెల్లింది. ఇది ఫేస్ బుక్కులు, బ్లాగులు, ట్విట్టర్ల కాలం).

ముందుగా సాహిత్యకాగడా మరో సారి ఒక విషయం స్పష్టం చేస్తోంది.

మన తెలుగుసాహిత్య రంగంలో, విమర్శక ప్రపంచంలో, సాధారణ పాఠకుల మనస్సుల్లో, ఒక అపోహ స్థిరంగా నాటుకునివుంది. నిజానికి దాన్ని అపోహ అనటం కుదరదు. ఎందుకంటే, ఆ అపోహ ఎంతో నిజం కాబట్టి. ఎవరయిన ఎవరినయినా విమర్శిస్తే, ఆ విమర్శలో నిజానిజాలు చూడకుండా, విమర్శ సబబా, కాదా, కువిమర్శనా, సహృదయంతో చేసిన విమర్శనా అన్నది చూడకుండా, ప్రతి విమర్శకూ వ్యక్తిగతాలు ఆపాదించాలని చూస్తారు. ఎవరినయినా విమర్శిస్తే, ఆ విమర్శ వెనుక వ్యక్తిగత కక్షనో, అసూయనో వున్నట్టు భావిస్తారు. అలా ఆరోపించటం ద్వారా విమర్శను పక్కదారి పట్టిస్తారు. దృష్టి అసలు విషయం నుంచి వ్యక్తిగతం వైపు మళ్ళుతుంది. కనీసం సాహిత్యకాగడా విషయంలో వ్యక్తిగతాలకు తావులేదని అర్ధం చేసుకోవాలి. విమర్శ సాహిత్యానికి సంబంధించిందే తప్ప దాన్లో వ్యక్తిగతమయినదేమీలేదని అర్ధం చేసుకోవాలి.

ఇక కథలకారశాలల దగ్గరకు వస్తే, కార్యశాల అన్న పదానికి ఇంగ్లీషులో సమానార్ధక పదం, వర్క్ షాప్.

వికిపీడియా ప్రకారం, వర్క్ షాప్ అంటే, Beginning with the Industrial Revolution era, a workshop may be a room or building which provides both the area and tools (or machinery) that may be required for the manufacture or repair of manufactured goods. Workshops were the only places of production until the advent of industrialisation and the development of larger factories.

అంటే, ఒక ఫాక్టరీలో వస్తువుల తయారీ జరిగే స్థలమన్నమాట కార్యశాల. అక్కడ తయారయ్యే వస్తువులన్నీ ఒకే రకంగా వుంటాయి. నాణ్యతనేకాదు, రంగు, రూపు, రుచి వంటివన్నీ ఒకే రకంగా వుండాలి. అలా వుండని వాటినీ, తేడాలున్న వాటినీ క్వాలిటీ కంట్రోల్ వారు ఏరి ఏరి చెత్తలో పారేస్తారు. లేకపోతే, కరగించి మళ్ళీ సరిగ్గా తయారు చేస్తారు. ఒకవేళ ఇలా తయారయ్యే వస్తువుల్లో ఏవయినా తేడాలుంటే, అవి, యాజమాన్యం, వస్తువుల తయారీని నిర్ణయించేవారూ ముందే అనుమతించిన మార్పులే అయివుండాలి. లేకపోతే కుదరదు.

ఇది చదువ్తూంటే రవీంద్రనాథ్ టాగోర్ రాసిన డ్రేమర్ కథ గుర్తుకువస్తోంది. జార్జ్ ఆర్వెల్ రాసిన 1984, ఆల్డస్ హక్స్లే రాసిన బ్రేవ్ న్యూవరల్డ్ వంటివన్నీ గుర్తుకువస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథలనేకం గుర్తుకువస్తున్నాయి. వర్క్ షాప్ అంటే ఇదన్నమాట.

కథల వర్క్ షాప్ అంటే ఇలాంటి మూస కథలు, కొన్ని ఆమోదించబడిన పరిథులకు లోబడి సృజించే ఒకే రకమయిన కథల తయారీ జరిగే స్థలమన్నమాట. అందుకే, కథాకార్యశాల అనగానే ఉలిక్కిపడి కాగడా అందులో కథలెలా రాయాలో నేర్పించే మేస్త్రీలెవరా అని చూసింది. అది చూసిన తరువాత తెలుగు సాహిత్యం మరో పది తరాలపాటు ఇప్పుడు కొందరు గీచిన గీటుదాటకుండా ఎలా నడుస్తోందో , అలానే, అదేదారిలో నడవటానికి మూసల అచ్చుపోసే కథాకార్యశాల ఇది అని అర్ధమయిపోయింది. ఇదొక ముఠామేస్త్రీల కార్యశాల అని కథలపాఠాలు చెప్పేవారు, కార్యక్రమ నిర్వాహకుల పేర్లు స్పష్టం చేస్తాయి.

ప్రపంచంలో అందరూ ఒకేలా వుండాలన్న, అస మంజస రంగుటద్దాలు కట్టుకున్నవారు నిర్వాహకులు. ఒకేరకమయిన భావాన్ని, ఆలోచనను తిప్పీ తిప్పీ చెప్పిన విషయాన్ని చెప్పినట్టే చెప్పుకొచ్చే, ఆవుకు నాలుగుకాళ్ళ వ్యాసరచయితలాంటి సృజనాత్మక కథా రచయితలు, నేను, నాకు, నాకే అనేటతువంటి విషాలమయిన, ఉపఓగకరమయిన సంకుచిత దృష్టి కలవారు, నలుగురితోపాటూ నారాయణా(దైవం నారాయణ కాదు) అనేవారూ, ఆమోదయోగ్యమయిన మూస కథలు, పొలిటికల్లీ కరెక్టు కథలు, రంగుటద్దాల్లో మాత్రమే ఎర్రగా, పచ్చగా కనిపించే కథలు రాసేవారంతా( వీరిలో ఇంకా బొడ్డూడని, తప్పటడుగుల బుడి బుడి రచయితలు, విభిన్నత్వం లేక ఏకత్వంలోనే వైవిధ్యాన్ని చూడాలని, చూడలేని వారికి చూపెట్టి దబాయించి వొప్పించే రచయితలూ కథలగురించి కార్యశాల కార్యకర్తలని చూసిన తరువాత, తెలుగు కథ భవిష్యత్తుకేమాత్రం ధోఖా( హిందీ పదం) జరగనివ్వదీ మూసకథావస్తువులకర్మాగారకార్యశాల అని స్పష్టమయింది.

ఇక కథతో ఒక సాయంత్రమంటూ పలువురు కథకులను ఒక చోట చేర్చి పాఠకులతో ముఖాముఖీ ఏర్పరచిన కార్యక్రమ నిర్వాహకుల ఆలోచన అభినందనీయమయినా, కార్యక్రమం జరిగిన తీరు చూసిన తరువాత మాత్రం, మళ్ళే ఆవుకు నాలుగు కాళ్ళే గుర్తుకువస్తుంది.

కథ అన్నది సృజనాత్మక ప్రక్రియ. సృజనాత్మకత సంకెళ్ళలో వొదగదు. కానీ, మన కథల నేర్పువారంతా కథా రచనలో నేర్పరులు కారు. వీలు చిక్కగానే కథ, కథానికల నడుమ తేడా గురించి తలలు బద్దలుకొట్టుకునే రీతిలో వాదించుకుంటారు. అలా వాదిస్తున్న వారెవరికీ ఏ విషయం గురించి వాదిస్తున్నారో అవగాహనే వుండదు. ఈ మధ్యలోకి ఎత్తుగడలు, ముగింపులు, శైలీ, షిల్పం అంటూ తరగతుల్లో పాఠాలు చెప్పే పంతుళ్ళు, ప్రొఫెసర్లు, బోసి నోళ్ళతో, మార్కులేసే మూసిన మెదళ్ళతో రంగంలోకి దూకుతారు. ఈ వాదోపవాదాలు, తమ వాదనే సరయినదని ఎవరెవరో విదేశీయులు, విదేశీయుల భావాలని నొక్కిచెప్పే స్వదేశీ విమర్శకులు, వీరందరినీ చూస్తూంటే కథలు రాయాలనే ఉత్సాహం ఎవరికయినా వుంటే అది కారి నీరై పరుగుపెట్టి పోతుంది. అయితే, వీళ్ళిలా చర్చలు చేస్తూ అహాలను సంతృప్తి పరచే ఈగోల సాహసయాత్రలో వుంటూన్న సమయంలో, నిజంగా కథలు రాసేవారూ, రాయాలనుకునేవారూ కథలు రాస్తూనో, చదువుతూనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

ఇలా జరుగుతున్న కథా కార్యశాలలూ, కథలగురించిన సమావేశాలూ చూస్తూంటే, తెలుగుకథ ఎందుకని ఇప్పుడున్న స్థితిలో వుందో అర్ధమవుతుంది.

కథలు రాయాలనుకునేవారికి, బాబూ, మీరు కథలు రాయాలనుకుంటే ముందు రాసేయండి. వస్తువు, ఎత్తుగడ, ముగింపు, శైలీ, షిల్పం వంటి వాటిని పట్తించుకుని కూచుంటే, కథ రాయటం కాదుకదా, ఏది ఏమిటో కూడా తెలియని అఓమయంలో పడి పోవటం తథ్యం.

కథలు రాయాలనుకునేవారికి ముందు చదవటం అలవాటు చేయాలి. అదీ, మన రంగుటద్దాల విమర్శకులు మెచ్చిన గుప్పెడుమంది జాతీయ అంతర్జాతీయ కథకుల కథలు మాత్రమే కాదు. మన సాహిత్యంలోని కథలేకాదు, అంతర్జాతీయ సాహిత్యంలోని రచనలూ, అవి ఇవీ, వారూ వీరూ అని లేకుండా చదవాలి. ఏ రచనలు తన మనసుకునచ్చుతున్నాయో గమనించి, అలాంటి రచనలు మరింతగా చదవాలి. ఆపై, తన మనసులో కలుగుతున్న సంచలన స్వరూపాన్ని అర్ధం చేసుకునే ప్రాయత్నం చేయాలి. తద్వారా కలిగే మథనం ఫలితంగా కథలు వాటంతట అవే వస్తాయి. మూసల్ల్లో అచ్చులు పోసిన విమర్శకులు మెచ్చే చచ్చు పుచ్చు కథలు కాదు, పాథకులు చదివి, మెచ్చి, పది కాలాలపాతు తమ మదుల్లో దాచుకునే అసలయిన కథలు వస్తాయి.

ఏ కార్యశాలల్లో శిక్షణ పొందారు, ఈనాడు మనం గొప్ప కథకులుగా భావిస్తున్న కథకులంతా. ప్రపంచమే వారి కార్యశాల. మనస్సే కథల సృజనవేదిక. పేరుమోసిన కథకులనేకులస్సలు సరిగ్గా చదువుకోనేలేదు.

అదీగాక కథలు రాసేసమయంలో ఏ రచయితకూడా వీళ్ళు చెప్తున్నట్టు వస్తువులు, ఎత్తుగడలు, శైలి, శిల్పాల గురించి ఆలోచించరు. కథలు రాయాలనుకున్నవారు, రాయకుండా వుండలేరు. వారు ఎలాగయినా రాస్తారు. కాదేదీ కవితకనర్హం అంటే చప్పట్లుకొట్టే మనమే, కథలుఇలాగే వుండాలి, ఇవే వస్తువులుండాలి, ఇలాగే రాయాలి, ఇది కథ, బెత్తెడుంటే కథకాదు, కథానిక, ఇంకాస్త లాగితే పెద్దకథ లాంటివన్నీ కథకులకు అవసరంలేదు. కథకుడు కథ రాసిన తరువాత దాన్ని విశ్లేషించి, విమర్శించాల్సిన వారంతా, ముందే, కథలు ఇలాగే, వీటిగురించే రాయాలని కంచుకోటలు, ముళ్ళకంచేలు కట్టి ఇలాగే రాయాలంటే అలా వచ్చేవి కార్యశాలల కర్మాగారపు సరకులు తప్ప కథలు కావు.

పేరు పొందిన కథకులూ, కాఫ్కా, విలియం ఫాక్నర్, సీపీ స్నో, జేంస్ జాయ్స్, బెర్టోల్ట్ బ్రెక్ట్, టీ ఎస్ ఇలియట్, ఆడెన్, ఎర్నెస్ట్ హెమింగ్వే, సీ ఎస్ ఫారెస్టర్ వంటి వారంతా, హారర్ కథలు, క్రైం కథలూ రాసినవారే. ముందు రచయిత తనకు నచ్చినట్టు స్వేచ్చగా రాయటం అలవాటు చేసుకుంటే తరువాత ఏదయినా రాచవచ్చు. కానీ, కథలు రాయకముందే టెక్నిక్కులూ, ముగింపులూ, క్లాసిక్కులూ ప్రయోగాలూ అంటూ ఏవేవో ఎవరికీ అర్ధంకాని , ఎవరికీ తెలియని విషయాలగురించి, అన్నీ తమకే తెలిసినట్టు మాట్లాడుతూ అహాన్ని సంతృప్తి పరచుకుంటూ పోతూంటే పలు రకాల కథలు చదివే సమయం కానీ, రాసే సమయం కానీ వుండదు. అందుకే, ఇప్పుడు తెలుగు సాహిత్యంలో రికమండేషన్ రాయల్ కథకులూ, డబ్బులిచ్చి, కాకాలు పట్టే భేకాల కథకులు, గుంపులూ, భజనగాళ్ళు, వందిమాగధ వీర కథకులు, మూఅసకథల మొనగాళ్ళు గా మన కథకులు తయారవుతున్నారు. కార్యశాలలూ, కర్మాగారాల వస్తువులు సృజనాత్మక కథలుగా చలామణీ అవుతూ పాఠకులను దూరం తరిమి తరిమి కొడుతూ సాహిత్య్య హత్యను రైట్ రాయల్ గా చేస్తున్నాయి.

October 20, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sahityakaagada

విశ్వనాథ సాహిత్యం-3

విశ్వనాథ సాహిత్య సాగరంలో మునకలేసేముందు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఇతర రచయితలకూ, విశ్వనాథ రచనలకూ ఒక మౌలికమయిన తేడా వుంది. ఇతర రచయితలు తమ స్థాయిలో అతి సున్నితంగా రాస్తారు. అతి గొప్పగా భావ వ్యక్తీకరణ చేస్తారు. తమ చుట్టూ వున్న సమాజాన్నీ మనుషులనూ మనస్తత్వాలనూ ఎంతో గొప్పగా విశ్లేషిస్తారు. అనేక విషయాలను సూటిగా, నిర్భయంగా తమ రచనల్లో ప్రకటిస్తారు. కానీ, విశ్వనాథ వారిలా, ప్రతి చిన్న విషయాన్నీ లోలోతుల్లోకి వెళ్ళి విస్లేషించి, విమర్శించిన వారు అరుదు. అంతేకాదు, ప్రతి విషయాన్ని ఇతరుల్లా ఆయన సిద్ధాంత లోచనాలలోంచి చూడడు. అలా చూడాలనీ ప్రయత్నించడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ మట్టి, ఏ గాలి, ఈ జాతి, ఈ జాతి ఆత్మ దృష్టితో చూస్తాడు. అందుకే, విశ్వనాథ వారు సాహిత్యం అన్నది అసహజమయిన ప్రవృత్తిని వృద్ధి పొందించేదుకు రాయకూడదని నమ్మేరు. ఆయన రచనలన్నీ సహజమయిన కామకొరధాదులు సముద్దీపించటానికే సృజించినవి.

ఇక్కడ ఈ సహజ, అసహజ ప్రవృత్తులంటే ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అర్ధం చేసుకుంటే విస్వనాథ సాహిత్యాన్ని చూడాల్సిన దృష్టి అర్ధమవుతుంది.

సహజ ద్వేషమన్నది హృదయంలోఅంచి పుడుతుంది. ఒకడు మచ్చడు. వాదు చేసే పనులు నచ్చవు. పలు కారణాల వల్ల వాడంటే కోపం కలుగుతుంది. అది ద్వేషంలా పరిణామం చెందుతుంది. అలాగే ప్రేం కూదా. ఈ భావనల వల్ల సుఖం కలగవచ్చు. దుహ్ఖం కలగవచ్చు. ఇవన్నీ వ్యక్తిగత భావనలు. ఒక రచన చదువుతూంటే కూడా ఈ భావనలు కలుగుతాయి. ఇవి శరీరంపైన ప్రభావం చూపవు. అంటే ఆ రచన సహజ ప్రవృత్తిని ఉద్దీప్తం చేస్తున్నదన్నమాట.

ఇందుకు భిన్నంగా, అంటే వ్యక్తిగతమయిన భావనలకు భిన్నమయిన భావనలను కూడా సాహిత్యం కలిగ్స్తుంది. కానీ, అవి, అసహజమయిన భావనలు. ఇక్కడ వ్యక్తితో సంబంధం వుండదు. వ్యక్తినిమరచి ఒక సమూహాన్ని ద్వేషించే భావనలు కలిగించే అలాంటి సాహిత్యం అధికంగా సిద్ధాంతగతమయిన సాహిత్యం. అంటే, హృదయంలో జనించే సహజ భావనలకు భిన్నంగా మనస్సులో జనిస్తాయీభావనలు. అవి అసహజమయిన భావనలు. అలాంటి భావనలను కలిగించే రచనలను రచయితలు చేయకూడదన్నది విశ్వనాథ ప్రగాఢ విశ్వాసం. అంటే రచనకు జీవితము, ప్రపంచము ప్రేరణ అయినా, ఆ ప్రేరణ కు సిద్ధాంత లోచనాల దృష్టిని ఆపాదించకూడదన్నమాట రచయిత.

ఒక రచన చదువుతూంటే, నాయకుడి పైన ప్రేమ కలుగుతుంది. విలన్ పట్ల క్రోధం కలుగుతుంది. కానీ, ఈ ప్రేమకానీ, క్రోధం కానీ నవల పఠనం పూర్తవటంతో పూర్తయిపోతాయి. కానీ, సిద్ధాంతగత సాహిత్యం వల్ల జనించిన భావనలు పాత్రల పరిథి దాటి, సమాజంలోని వ్యక్తుల సమూహాలవైపు ప్రసరిస్తాయి. ఇలాంటి అసహజ ప్రవృత్తి ఉద్దీపితమవటం వల్ల సమాజంలో ద్వేష భావనలు ప్రజ్వరిల్లుతాయి. ఉద్విఙ్నతలు చెలరేగుతాయి. స్నేహ సౌభ్రాత్రుత్వ భావనలు దెబ్బతింటాయి. సమాజంలోని సమతౌల్యం దెబ్బతింటుంది. శాంతి, ప్రశాంతతలకు భంగం కలుగుతుంది. తద్వారా సమాజం బలహీనమవుతుంది. ఇది దేశానికి, సంస్కృతి సాంప్రదాయాలకు, దేశ మౌలిక అస్తిత్వానికి ప్రమాదకరం. కాబట్టి రచయితలు, ఆవేశపరుల్లా కాక, ఆలోచనలున్న విఙ్నాన వంతుల్లా, విచక్షణ వున్న వారిలా, ద్రష్టల్లా వ్యవహరించాల్సి వుంటుంది. రచయిత అలా వ్యవహరించక తాత్కాలిక ఆవేశాలకు లోనయి రచిస్తే, దాని దుష్ప్రభావం రచయిత పైనేకాదు, సమాజం పైన కూడా వుంటుంది. ఒక్కసారి ఇప్పుడొస్తున్న సాహిత్యం, దాన్ని సృజిస్తున్న రచయితల రంగుటద్దాలు, సమాజంలో అవి సృష్టిస్తున్న విభేదాలు, ఉద్విఙ్నతలను గమనిస్తే విశ్వనాథ ఆలోచనలలో లోతు, వాటిలోని సామంజస్యమూ స్పష్టమవుతాయి. ఇలా, ద్రష్టలా వ్యవహరించటం, విచక్షణతో రచనలను సృజించటం, భూత కాలం పట్ల గౌరవం, వర్తమానం పట్ల అవగాహన, భవిష్యత్తుపట్ల ఆలోచన వున్న ద్రష్టలాంటి భారతీయ రచయిత విశ్వనాథ సత్యనారాయణ.

ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న తరువాత విశ్వనాథ సాహిత్య సాగరంలో అడుగిడటం ఆరంభిద్దాము.

October 12, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.