Archive for December, 2013

కౌముది జనవరి సంచికలో సరికొత్త శీర్షిక కథాకేళి.

కౌముది జనవరి సంచిక నుంచీ ప్రారంభమయినా నా సరికొత్త శీర్షిక కథాకేళి. ఒకే అంశంతో పలు విభిన్నమయిన కథలను సృజించి, ప్రదర్శ్తుంది ఈ శీర్షిక. కథ అనంతత్వాన్ని, సూక్షమంగానయినా తెలుగు పాథకులకు చేరువచేయాలన్నదీ ప్రయత్నం. మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి. http://www.koumudi.net/Monthly/2014/january/index.html

December 31, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

1929లో కాబట్టి రాయగలిగిన పొలిటికల్లీ పూర్తిగా ఇంకరెక్ట్ కథ.

సాహిత్య కాగడాలో వేలూరి శివరామ శాస్త్రి గారి గురించిన వ్యాసాలకు ఈ వ్యాసం తరువాత కాస్త విరామం వుంటుంది.

ఈవారం పరిచయం చేస్తున్న కథ గురించి తెలుసుకున్న తరువాత ఎందుకని వేలూరి శివరామ శాస్త్రిగారు, ఆయన కథలను ఎవరూ ఎందుకు ప్రస్తావించరో అర్ధమవుతుంది. ఆయన చేదు నిజాలను ఎంత నిక్కచ్చిగా ప్రదర్శించారో తెలియటంతో పాటూ పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథలెలా వుంటాయో స్పష్టమవుతుంది. నిజాలు చెప్పటం నేరమయిన మన సాహిత్య ప్రపంచంలో, ఇలాంటి నిజాలు చెప్పిన వేలూరి గారిని తలవటమెంత పాపమో బోధపడుతుంది.

కథ పేరు వ్యత్యము.

కథ తొలి వాక్యంలోనే చూచాయాగా కథాంశం తెలుస్తుంది.

‘నరసిమ్హులుకు కాటడు పాలేరు. ఇపుడిరువురికిని సుమారు ఎనుబడేండ్లు.’

ఈ వాక్యం చదవగానే మారుతున్న కాలాంతో, మారుతున్న తరాలతో రూపాంతరం చెందుతున్న జీవన విధానాలు, ఆలోచనలు, విలువలు, తద్వారా రూపాంతరం చెందుతున్న మానవ సంబంధాల స్వరూపాన్నీ ఈ కథ ప్రదర్శించబోతోందని ఊహించవచ్చు.

వారిరువురికి ఎనబదేండ్లు అనటంతోటే ఒక తరం, ఆ తరం ప్రాతినిథ్యం వహించే విలువలన్నీ అవసాన దశలో వున్నాయని తెలుస్తుంది.

నరసిమ్హులుకి కాటడు, పాలేరు నమ్మినబంటు మాత్రమే కాదు, ప్రాణానికి ప్రాణం కూడా.

‘దొరవలన పాలేరును పాలేరువలన దొరయు సుఖజీవనమొనరించిరీ అన్న వాక్యం ద్వారా రచయిత సమాజంలో ఒక పద్ధతి ప్రకారం నెలకొల్పుతున్న అపోహలు, అపవాదులు, దురూహల అసలు రూపాన్ని బట్టబయలు చేస్తాడు, ఎలాంటి ఉపన్యాసాలు, సిద్ధాంత చర్చలూ లేకుండా.

దొరకొడుకు సోములు. పాలేరు కొడుకు రాములు. ఒకరోజు కాటడు, సోములుకెదురుపడతాడు. అప్పుడు సోములు, దూరముగానుండూ అంటాడు. అంటే మారుతున్న తరంతో మారుతున్న విలువల ఆధారంగా మారుతున్న మానవసంబంధాలను ఈ వొక్క సంఘటన ద్వారా రచయిత ప్రదర్శిస్తున్నాడు. తండ్రికి ప్రాణం, కొడుకుకి దూరం (అంటరానివాడు).

కాటడు తానుదాచిన నూరుకాసులను దొర దగ్గర దాస్తాడు. ఈ విషయం కొడుకులకూ చెప్తారు. పాత తరం మరణిస్తుంది.

తండ్రి మరణం తరువాత సోములు తన పొలమేకాదు, రాములుకిచ్చిన పొలంలోనూ వ్యవసాయం మానేసి వ్యాపారం చేస్తాడు. రాములు, సోములు వద్దకొచ్చి, పొలంలో వ్యవసాయం చేస్తానంటాడు. ‘తమ నాయనగారి అనుగ్రహమునే తమరు నాయెడ నవలంబింపుడు. నేను మీ వ్యవసాయమంతయు చేసెదను.’ అంటాడు.

కానీ, సోములు అందుకు నిరాకరిస్తాడు.’ నీకు పొలమును లేకు. కాసులంతకన్న లేవూ అని పత్రాలు చింపేస్తాడు.

దాంతో రాములు దయనీయమయిన స్థితికి దిగజారతాడు. తినటానికి తిండి వుండదు. అప్పుడు, రెబెకా అనే యువతి అతనిపై జాలి చూపిస్తుంది. తిండి పెడుతుంది. ఆమె తండ్రి రాములు మతం మార్చుకుని కూతురిని పెళ్ళి చేసుకోమంటాడు.

‘నేనిపుడు నిరుపేదను. మతము పుచ్చుకొనినంత మాత్రమున పిల్లనిత్తువా?’ అని అడుగుతాడు. దానికి ఆమె తండ్రి, మతం మారితే ‘నీవు పంతులవగుదువూ అని ఫాదరీ దగ్గరకు తీసుకెళ్తాడు.

ఫాదరీ అతడికి కిరస్తానీ గురించి చెప్తాడు. ఒక నెల రోజుల తరువాత రాములు జకరయ్య అవుతాడు. రెబెకాకు అతడికి పెళ్ళవుతుంది.

నూరునేబది రూకలు నాకిచ్చుచో పాతికరూకల పంతులపని ఇప్పిస్తానని ఫాదరీ అంటాడు.

‘ అయ్యా, అన్నముచే కడుపు నిండుననియూ, బైబిలుచే నోరు నిండుననియు సద్ వృత్తిచే మనస్సు నిండుననియు నేను మతమున గలిసితిని. నాకు పాటకూటికి టికాణా లేదు” అంటాడు.

చివరికి జకరయ్య పంతులు, రెబెకా పంతులమ్మ అవుతారు.

‘రెబెకా జకరయ్యలు ప్రతి ఆదివారము నాడును యేసు పేర పావలా ముదుపు కట్టవలసియుండెను. వేరు వేరు పండుగలలో పందుగపందుగకు ఒకొక రూపాయి యీయవలసి వచ్చెను. నెలకొక రూపాయి ఇచ్చి మత వా~ంమయము కొనవలసి యుండెను. ఇదియంతయు చూడగా కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో లాగుకొను చందముగాయుండెను. ‘

ఇలాంటి స్థితిలో జకరయ్య ఫాదరీ దగ్గరకు వెళ్ళి ఇది అన్యాయమంటాడు. అప్పుడా ఫాదరీ ‘ మీకును ఏసునకును సాక్షాత్సంబంధము లేదు. మాగుండా మీరాయేసు ముంగిలికి మాత్రమే రాగలరూ అని తిడతాడు. ఉద్యోగంలోచి తీసేస్తాడు, ఎందుకంటే జకరయ్య యేసు చెప్పిన సూక్తులను ఫాదరీకి చెప్పి అతని నైచ్యాన్ని, యేసు బోధలకు వ్యతిరేకంగా వున్న అతని ప్రవర్తనను ఎత్తి చూపిస్తాడు.

అప్పుదు రెబకా’ కిరస్తానీ మతము కాని మతమూ అంటుంది.

జకరయ్య, ‘విద్యావినయములుకల బ్రాహ్మణుదును మాలడును ఎరుకగలవారికొకటే యని చదువుచు దానియర్ధమును త్ర్ణీకరించు సోములుగారే చెడ్డవారని యనుకొంతిని. దైవమును చింతించుచుండువారిని దైవమే కాపాదునని చదువు పాదరీ సోములుగారికి తీసిపోయెనా? ఏమతములో తప్పున్నది, స్వార్ధపరుడగు మానవులో గాక?’ అని ప్రశ్నిస్తాడు.

ఇదీ కథ. కథ గురించి తెలిస్తూంటేనే ఎంతగా పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథనో ఇది అర్ధమవుతుంది.

ఎంత ధైర్యం లేకపోతే, భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఒకప్పుడు ఇప్పతిలా లేదని, కులాలున్నా వారి నదుమ సఖ్యత, స్నేహము, అవగాహన గౌరవాలుండేవని చెప్పటం ఎంత ఘోరం? ఇంత పచ్చి చేదు నిజాన్ని చెప్తే, సమాజంలో ద్వేష భావనలు రెచ్చగొడుతూ పబ్బం గదుపుకునే వారి మనుగడలేమి కావాలి?

మతం మారిపోయినా, హిందువులుగా వున్నప్పుడు పొందే సౌకర్యాలన్నీ పొందుతూ, అందువల్ల లాభపడుతూ, ఆవలి గట్టుకెళ్ళి, ఈవలి గట్తుపై దుమ్మెత్తి పోసి, ఏరు దాటి తెప్ప తగలేస్తూ, పబ్బం గడుపుకునే వారికి ఇలాంటి కథలు ప్రచారంలోకి వస్తే ఎంత నష్టం? తమ అసలు రూపాలను కథకులు ఇలా బయట పెడుతూంటే వారి మనుగడ ప్రస్నార్ధకమయిపోదూ?

అందుకే, ఏదో 1929లో కాబట్టి ఇలాంటి కథ ఆయన రాశాడు, పత్రికలు వేశాయి. ఇప్పుడు ఇలాంటి కథలు రాసే ధైర్యమెవరూ చేయరు. చేసినా జాగృతి లాంటి పత్రిక కూడా వేసే ధైర్యం చేయదు. దాంతో మసిపూసిన మారు నిజాలే తప్ప అసలయిన చేదు నిజాలను రచయితలు ప్రదర్శించే సాహసం చేయటం లేదు. దాంతో కొన్ని తరహా కథలేతప్ప తెలుగు సాహిత్యం తెలుగు సమాజిక జీవితాన్ని సంపూర్ణంగా ప్రదర్సించలేక పోతోంది.

అందుకే, విదేశీ సాహిత్యంలో తీవ్రవాదాన్ని నిరసిస్తూ, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాం సమాజంలో జరుగుతున్న సంఘర్షణ, సామాజిక, మానసిక సందిఘ్ధాలను చూపుతూ కథలొచ్చాయి కానీ, తెలుగులో మాత్రం మైనారిటీలెంట భయంతో వణికి పోతున్నారు, మెజారిటీలెలా తమ మతాన్ని మైనారిటీలపై రుద్దుతున్నారో తప్ప మరో రకమయిన కథలు రావటం లేదు. వాతికి ఆదరణ లేదు. అందుకే, వేలూరి వారి గతి పట్టకుండా వుండాలనే కథకులంతా పొలితికల్లీ కరెక్ట్ కథలే రాస్తున్నారు. విమర్శకులూ ఆ పరిథిలోనే తమ బావుల్లో కప్పలుగా భద్రంగా వున్నారు. తెలుగు సాహిత్యాన్ని వీధిలో పారేశారు. పాథకులు పారిపోతున్నారు.

December 22, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada

1927నాటి వేలూరి గారి అద్భుతమయిన కథ.

వేలూరి శివరామ శాస్త్రి గారి కథ పరిచయానికి వచ్చిన స్పందన చూసి ఉత్సాహంతో కాగడా ఆయనవే మరిన్ని పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ విస్ఫోటనాత్మకమయిన కథలను పరిచయం చేయాలని నిశ్చయించుకుంది.

మామూలు కథలు రాసే సాధారణ రచయిత అయినా, ఏదో ఒక ఉద్యమానికి, సిద్ధాంతానికి చెందినవాడయితే అతది పేరును, కథలను ఏదో రకంగా సజీవంగా వుంచుతారు. ముఖ్యంగా, వామ పక్షభావాలు, విప్లవాత్మక భావాలు, ఇతర ఉద్యమాలు, విప్లవాల భావాలు ప్రదర్శించే పిల్లి కూడా మాంసాహర పులులా భయంకర సహితీ వేత్త అయి బహుమతులందుకుంటుంది తెలుగు సాహిత్యంలో. అలాకాక, అతి గొప్ప కథలు రాసిన మహా రచయిత అయినా, భుజానికెత్తుకునే భజనగాళ్ళ విప్లవ గణాలు లేకపోతే మరుగున పడిపోతాడు. భావి తరాలకతనెవరో తెలియని పరిస్థితి వస్తుంది. కథలు, సాహిత్యం గురించి అంతా తెలుసన్నట్టు మాట్లాడేవారు కూడా వజ్రం అంటే తెలియకుండా వజ్రాలలో మునిగి తేలుతున్నట్టు మాట్లాడుతూ మభ్యపెడుతున్నారని వేలూరి లాంటి వారి రచనలు చదువుతూంటే తెలుస్తుంది. విశ్వనాథ అధ్యాపక వృత్తిలో వున్నవాడు కాబట్తి, ఆయనకనేక శిష్యులు, వారిలో కొందరు ఉన్నత స్థానాలలో వుండటం వల్ల ఆయన రచనలు సజీవంగా వున్నాయి, లేకపోతే, ఈ వామపక్ష అభ్యుదయ విప్లవాల అరుపులు కేకల హోరులో ఆయనకూ వేలూరి వారి గతి పట్టేది.

శివరామ శాస్త్రి గారు వేదాంతం, దర్శనాలు, సాంప్రదాయిక శాస్త్రాలు అధ్యయనం చేశారు. తిరుపతి వేంకట కవుల శిష్యులు. అవధానాలు చేశారు. ఆయన గ్రుహస్తాశ్రమాన్ని వాన ప్రస్థంలా కుటీరం నిర్మించుకుని గడిపారు. లోకానికి దూరంగా అధ్యనము, పథనము, రచనలు చేస్తూ గడిపారు. ఆయన స్నేహితులు పూనుకుని కొన్ని రచనలను భద్రం చేశారు కాబట్తి కొన్ని రచనలయినా మనకు లభిస్తున్నాయి. అనెక రచనలాయనవి కాలి బూదిదయిపోయాయి.

కథలలో అత్యంత నిగూఢమయిన, అతి క్లిష్టమయిన తాత్విక సత్యాలను, మీమాంసలను, అతి సరళమయిన రీతిలో ప్రదర్శించటం అత్యధ్భుతమయిన కథ సౌందర్యోపాసనలో కనిపిస్తుంది.

అలకనందుడనే రాజులు లేక లేక విజయవర్మ అనే కొడుకు పుడతాడు. విజయవర్మను రాజు గారాబంగా పెంచుతాదు. విజయవర్మకు సౌందర్యోపాసన అధికము. పిల్లవాదిని గురుకులం పంపే సమయం వస్తుంది. పంపాలా, వద్దా, అని రాజు ఆలోచిస్తూంటే విజయవర్మ స్వయంగా గురుకులానికి వెళ్తాడు. తాను రాకుమారుడయినా, గురుకులంలో పాతించే నియమాలన్నీ విజయవర్మ పాతిస్తూటాడు.

ఇక్కడ రచయిత కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు.

వస్తువునందలి యందమును జూచి యానందించుట కొందర ప్రకృతి. అందమగు వస్తువును త్యాగము గావించి యానందించుట కొందర ప్రకృతి. అందమగు వస్తువునుపభోగించుట కొందర ప్రకృతి.

విచ్చిన పూవునందు భగవంతుని జూచి యానందించు వారొకరు. దానిని గోసి తెచ్చి భగవంతుని బూజించి యానందించు వారింకొకరు. దానిని త్రుంచి తురుమున తురుముకొని యానందించు వారు మరియొకరు.

విజయవర్మ ఆశ్రమంలో కొన్ని అందమయిన విషయాలు చూస్తాడు.

మరుసటి రోజునుంచీ ఆశ్రమంలో విద్యార్థుల వస్తువులు మాయమవుతూంటాయి. దాంతో అల్లకల్లోలమవుతుంది ఆస్రమం. రకరకాల కథలు ప్రచారంలోకి వస్తాయి.

ఇది విజయవర్మ మనసులో దొంగతనమంటే ఏమిటన్న మీమాంసను రగిలిస్తుంది.

ఇక్కడే రచయిత ప్రతిభ తెలుస్తుంది. కథా గమనానికి భంగం కలగకుండా, పాథకుడికి ఏదో బఒధిస్తున్నట్తు విసుగు రాకుండా గొప్ప తర్కాన్ని తాత్విక సత్యాన్ని రచయిత చిన్న వాక్యాలు, అలతి పదాల్లో చూపిస్తాడు.

ఒక రాజును జయించి మారియొక రాజు వాని భూమినంతయు గలుపుకొనుచున్నాడు. అది పరాక్రమము.

పొలతిని పురుషుడును పురుషుని పొలతియు పరస్పరమాకర్షించి అపహరించుకొనుచున్నారు. ఇది ప్రేమ.

ప్రతి నిముషము ప్రతివాదును పంచభూతములను అపహరించుచునే యున్నాడు. ఇది దైవర్ణము.

పట్టుపదనిచో రాజు. పట్తుపదినచో దొంగ.

జగత్తంతయు దొంగల కొట్టు.

ఇలా ఆలోచిస్తున్న విజయవర్మకు దొంగతనమంటే ఏమిటో తెలుసుకోవాలని వుంటుంది.చర్చ ఇలా సాగుతుంది.

అయ్యా దొంగతనమనిన నేమి?
ఒకని వస్తువును మరియొకడు వాని యనుమతి లేక తనదిగా జేసికొనుట దొంగతనము. ఇది సామాన్య లక్షణము.

వస్తువొకనిదెటులగును?
ఈ బట్ట నేను నేసికొంటిని. ఇది నాది.
దీనిని దేనితో నేసిరి?
ప్రత్తినూలితో.
ప్రత్తియేడది?
ప్రత్తి మొక్కనుండి వచ్చినది.
ప్రత్తి మొక్క?
భీమినుండి.
భూమియెవరిది?
రేనిది.
రేనిదెటులాయెను?
రేడు జయించెను.
దేనిచే?
సైనికుల శక్తిచే.తన పరాక్రమముచే.
అగుచో రేడు దొంగ కాడా?
దొంగకాదని యెవడందుడు?కాని మిగిలిన దొంగల విప్లవమునుండి లోకుల గాపాడుటకీ గజదొంగ కావలయును. అది అన్యథ సిద్ధమగుచో నీ దొంగతో నంతగా పనిలేదు.

ఈ చర్చ జరిగిన రాత్రి విజయవర్మకొక కల వస్తుంది. ఆ కలలో అతదు ఇతర విద్యార్థులనుంచి దొంగిలించిన వస్తువులు తమ బాధలు చెప్పుకుంటాయి. అన్నీ కలసి విజయవర్మ మీదకు యుద్ధానికి వస్తాయి.

మరుసటి రోజు విజయవర్మ అందరి దగ్గరనుంచీ తాను దొంగిలించిన వస్తువులు వారికిచ్చేస్తాడు. ఈ ప్రపంచమున దొరకన్న వేర దొంగ యెవడు? అని అదుగుతాడు.

అప్పుడు గురువుగారు శిక్షగా అతదికి రాజ్యం కట్టబెడతారు. అందరూ తథాస్తు అంటారు. అప్పుడు విజయవర్మకు సౌందర్యబోధ కలుగుతుంది.

విజయవర్మకేమో గానీ, ఈ కథ చదివిన పాథకుడికి పలు రకాల, పలు ప్లేన్లలో సౌందర్యబోధ కలుగుతుంది.

ఇది ఎంతో గొప్ప కథ. చదివిన పాథకుదికి ఙ్నానం కలుగుతుంది. అవగాహన వస్తుంది, తన గురించి, తన చుట్టూ వున్న అంతహ్ బాహ్య ప్రపంచంగురించీ అవగాహన వస్తుంది.

ఈ కథలో విప్లవాలు లేవు కాబట్టి దీన్ని భావి తరాలకు అందించకపోతే నష్టం ఎవరికి? సమస్త ప్రపంచానికి.

అందుకే, విశ్వనాథ వారు ఒక మాట అన్నారు. సాహిత్యం సిద్ధాంతగతం కాకూడదని, తద్వారా సమాజంలో అసహజమయిన ద్వేష భావనలు చెలరేగుతాయని అందుకే, సిద్ధాంతగత సాహిత్యం సాహిత్యం కాదనీ అంటారాయన.

ఇలాంటి కథలు చదివితే వ్యక్తికి ఉద్రేకాలు, ద్వేషభావనలు కలుగవు. అవగాహన, విచక్షణ అలవడతాయి. విప్లవాలు, ద్వేషాలూ, చంపటాలూ లేకపోతే అది సాహిత్యం ఎలా అవుతుందనేవారికి నమస్కారం పెట్టి మరో అద్భుతమయిన కథ రేపు చెప్పుకుందాం.

December 5, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: sahityakaagada

సాహిత్యకాగడా మెచ్చిన 1949 నాటి పొలిటికల్లీ ఇన్ కరెక్టు కథ.

ఎప్పుడూ నిప్పు రవ్వలు వెదజల్లటమేనా? దారి చూపే దివ్వెగా కాగడా పనిచేయదా? అని ప్రశ్నిస్తూ వచ్చిన కాగడాభిమానుల సూచనను మన్నించి ఈవారం నుంచీ కాగడా మెచ్చిన, కాగడాకు నచ్చిన, సాహిత్య ప్రపంచం విస్మరించిన గొప్ప కథలను, కథకులను కాగడా వీలువెంబడి పరిచయం చేయాలని నిశ్చయించింది. అందుకిదే నాందీ ప్రస్తావన.

యువ కథకులేకాదు, తల పండిన కథకులు కూడా నోరిప్పితే గురజాడ, శ్రీపాద అంటారు. ఇంకా వెనక్కు వస్తే, కొకు, చలం, గోపి చంద్ అంటారు. ఇంకా వెనక్కు వస్తే, వోల్గా, కుప్పిలి పద్మ, కాశీభట్ల అంటారు. ఇంకింకా వెనక్కు వస్తే, ఇలాంటి పేర్లే వినిపిస్తాయి. నిన్న మొన్న కళ్ళు తెరచిన కథకులయితే, వెనక్కు చూడ కుండానే, తన కళ్ళెదుట వున్న, అనిల్ రాయలు, శివ సోమయాజులు, వేంపల్లె షరీఫ్ లాంటి పేర్లు చెప్పేసి తాము మెచ్చిన రచయితలు తప్ప మిగిలినవారంతా సోసో సాసా అంటారు.
ఇది ప్రస్తుతం ఏ రచయితను కదిపినా తెలుస్తుంది. తా వలచింది రంభ, తాను మునిగింది గంగ అని పెద్దలు ఊరకనే అనలేదు. ఎవరికి వారు కూటములుగా, ముఠాలుగా విడిపోయి విడిపోయి తమవారే గొప్ప అనుకోవటం వల్ల, వీరేర్పరచిన బాటలో తరువాత వారు గుడ్డిగా ప్రయాణించటం వల్ల, ఒకో తరానికి మనం ఎంతెంతో ముందుకు పోతున్నాము. ఇలా ముందుకు పోతూ, ఒకరిద్దరిని వెంట మోస్తూ, అనేకులను విస్మరిస్తున్నాము. దాని వల్ల, రాను రాను కొత్త తరాలకు గతం అన్నది తెలియని పరిస్థితి వస్తోంది. గతం గురించి తెలుసుకోవాలన్న తపన నశించి, తనకు తెలిసిన రెండు మూడు పేర్లే సర్వస్వం అని విర్రవీగటం, అది కాదన్న వాదిని పట్తించుకోక తమ మూర్ఖత్వంలో తాముండటం ఆనవాయితీగా మారుతోంది. ఇంకా యువ తరమయితే ఆ రెండు మూడు పేర్లూ వదలి, తమ స్నేహితులే అతి గొప్ప రచయితలు, వారి వెనకా ఎవరూ లేరు. ముందు వుండబోరన్నట్టు ప్రవర్తిస్తున్నాను.

కానీ, గతాన్ని విస్మరించిన ఏ జాతికీ భవిష్యత్తు లేనట్టు, తమ పూర్వీకుల సాహిత్యాన్ని విస్మరించిన ఏ సాహిత్యానికి కూడా భవిష్యత్తు వుండదు. తన పూర్వీకుల భుజాన నిలబడి మరింత ముందుకు చూడగలిగినది సాహిత్యమయినా, సమాజమయినా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది. ఇందుకు భిన్నంగా వర్తించ్స్తే, సాహిత్య మయినా, సమాజమయినా, యముని మహిషపు లోహ ఘంటల ఖణేల్, ఖణేళ్ళు వినాల్సివస్తుంది. గమనిస్తే, పాశ్చాత్య రచయితలు, వారు ఎలాంటి రచనలు చేసేవారయినా, తమ పూర్వీకుల సాహిత్యం గురించి ఖ్షుణ్ణంగా తెలిసిన వారయి వుంటారు. మన తెలుగు సాహిత్యకారులు, వారు పండితులయినా, ప్రొఫెస్సర్లయినా, ఈ విషయంలో తమ కంటి ముందు 15 సెంటీమీటర్ల దూరం కూడా చూడలేని హ్రస్వ దృష్టులే.

తెలుగు సాహిత్యంలో పొలిటికల్లీ కరెక్టు కథలే ఎందుకు రాస్తారో, అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుత కథకుడు వేలూరి శివ రామ శాస్త్రి గారికి పట్టిన గతిని గమనిస్తే అర్ధమవుతుంది.

వేలూరి గారు చాలా గొప్ప కథకుడు. అనన్య సామాన్య మయిన శైలీ శిల్పాలతో, సమకాలీన సంఘటనలను, నిక్కచ్చిగా, చేదు నిజాలను ఏమాత్రమూ ఏమార్చకుండా, కుండలు బ్రద్దలు కొడుతూ తన కథలలో ప్రదర్శించారు. ఆయన కథలు చదువుతూంటే, కాల యంత్రంలో వెనకకు ప్రయాణించినట్టనిపిస్తుంది. ఆయన కథలు చదువుతూంటే ఇప్పటి సమాజంలో మనం అనుభవిస్తున్న అనేక సమస్యలకు బీజాలు పడిన విధానమే కాదు, అందుకు కారణాలు తెలుస్తాయి. సమస్యల స్వరూపాలు, పరిష్కారాలూ బోధపడతాయి. అంతేకాదు, ఆయన కథలు మన సామాజిక అభివృద్ధిలో, చరిత్రలోని కీలకమయిన ఘట్టాలను సజీవంగా నిలిపే శక్తి కలవీ అని తెలుస్తుంది. ఆయన కథలు చదువుతూంటే ఎందుకని అవి పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథలో ఎందుకని ఏ విమర్శఖ శిఖామణీ, కథల కాణాచులూ, కథల ప్రాణ ప్రదాతలు, రక్షకులు, స్టేజీలెక్కి కథలెలా రాయాలో చెప్పే ఘనాతిగజఘనులూ ఈయన కథలను తలవరో, కనీసం తెలుసుకోరో, ప్రస్తావించక పోవటం వల్ల, ఈయన కథలు కనబడ్డా ఎవరూ పట్టించుకోకుండా ఎందుకు చేశారో తెలుస్తుంది.

వేలూరి శివ రామ శాస్త్రి గారి జీవిత కాలం, 1892 నుండి 1967. అంటే బ్రిటీష్ వారి హయాం, స్వాతంత్ర్య పోరాటం, నల్ల దొరల ప్రజాస్వామ్యం వంటి వన్నీ ఆయన అనుభవించారు. తన అనుభూతిని, భావి తరాలకు అందించారు.

1949 కాలం లో ఆయన రచించిన నకలు హైదెరాబాదు అన్న కథను ఈ వారం కాగడా పరిచయం చేస్తోంది. కథ చెప్పక మునుపే ఇది పూర్తిగా, పొలిటికల్లీ, సోషల్లీ, ఇంకా ఎన్నెన్ని ఇల్లులున్నాయో అన్నన్ని ఇల్లుల ప్రకారమూ రాయకూడని ఇంకరెక్ట్ కథ. ఎందుకో, కథ చదివితేనే తెలుస్తుంది.

అది నిజాములో ఒక జాగీరు. దానికి మురాద్ అని అపర నిజాం లాంటి జాగీరు. ఆ జాగీరులో 800 గడపలు, ఒక వంద గడపలకు గజ గజ లాడతాయి. ఏ గడపలెవరివో చెప్పనక్కర్లేదు. ఎంత పొలిటికల్లీ చెప్పకూడని నిజాన్ని చెప్పేశాడు రచయిత.

ఇంతలో ఒక రోజు ఆ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎవరో ఎగరేస్తారు. అపర నిజామయిన మురాద్ కు ఆగ్రహం వస్తుంది. జెండా ఎగరేసిన కాఫిరెవరంటాడు, మురాద్. అతని సేనన్ని బజ్జు అందరినీ రెచ్చగొడతాడు. తాను వెనుక నిలబడి రజాకార్లను ఉసి గొల్పుతాడు. రజాకార్లకు, ఇతర ప్రజలకు నదుమ గలాటా మొదలవుతుంది.

రజాకార్లు దెబ్బలు తింటూంటారు. రజాకార్లకిపుడు సంఖ్యాబల ప్రాబల్యము తెలిసి వచ్చెను అంటాడు రచయిత.

ఇంతలో, బజ్జు తుపాకీ తెస్తాడు. టపాకాయ పేల్చి తుపాకీ పేలినట్టు భ్రమ కలిగించటంతో ప్రజలు పారిపోతారు. రజాకార్లు విజృంభిస్తారు.

రజాకార్ల గృహములలో చెరపబడిన ఆడువారి యేడుపులు వినబడుచుండెను. అంటాడు రచయిత.

గ్రాహంపై పట్టు సాధించిన తరువాత బజ్జు మళ్ళీ తన అనుచరులను రెచ్చగొడతాడు. ఇంకా తమ మతములో చేరని వారిని, రజాకార్ల చేరుడు, ఎవడే పొలములో కాలు పెట్టునో వానిదే పొలము అని ప్రకటిస్తాడు. దాంతో పలువురు హరిజనులు రజాకార్లలో చేరి పొలాలు సాధిస్తారు. ఆ భయంతో, బంగారం తీసుకొని పారి పోతున్న వారిపై రజాకార్లు దాడి చేస్తారు.

తెల్లవారులోపల బజ్జు ఇల్లు బంగారమాయెను. అంటాడు రచయిత.

ఇంతలో కొత్త కోడండ్రు నవాబుకొక రేయి నజురానా అన్న ఫర్మానాను అనుసరించి బసవన్న గౌడు కొత్త కోడలిపై మురాద్ కన్నేస్తాడు. కోడలు గౌరమ్మ, మురాద్ భార్య ఫాతిమా అండ కోరుతుంది. ఫాతిమా, మారు వేషంలో గౌరమ్మ శయన మందిరానికి చేరుతుంది.

ఇంతలో మురాద్ చర్య తెలుసుకున్న యువకులు అతనితో యుద్ధానికి సిద్ధపడతారు. మురాద్ కు రక్షణగా రజాకార్లు వుంటారు.

మురాద్ గౌఉరమ్మ ఇల్లు చేరతాడు. ఫాతిమాను చూస్తాడు. ఆపై జరిగింది రచయిత రాతలోనే….

మురాద్ కుప్పున కూలెను. వాకిట కర్రలు లేచెను. రజాకార్ల తలలు పగిలెను.

అప్పుడు గూడెములో కొందరు కర్రలతో కత్తులతో బసవ గౌడు గదిలో ప్రవేశింప పోయిరి. ఫాతిమా ద్వారమునకడ్డుగా నిలిచి యు యస్ ఓ కు అపీలు చేసికొననిదే మీరు మా నిజాం గారిని బందీగా చేయవలదు అనెను.

సరిగ్గా ఆ సమయముననే -నిజాం హిందుస్తాన్ సేనలను తన సంస్థానము లోనికాహ్వానించెనని రేడియో

వానలో వాకిట పడియున్న బజ్జు, నిజాం గారికి ఒక కన్ను హిందువు, ఒక కన్ను ముసల్మాన్ అని యరచెను.

లోపల పడియున్న మురాద్, నేను కంఠము వరకు హిందువును, ఆపైని ముసల్మానును, అని అందరకును సలాము కొట్టి మరల నమస్కారము చేసెను.

ఇదీ కథ. ఈ కథ గురించి ఎవరూ ఎందుకు ప్రస్తావించరో, వేలూరి వారి కథలను గుర్తు చేసుకునేందుకే ఎందుకిష్టపడరో సులభంగా వూహించవచ్చు. ఎందుకని ఇలాంటి కథలను విస్మరించటం వల్ల, మరో రచయిత ఇలాంటి చేదు నిజాలు రాయకుండా చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ప్రయత్నాల ఫలితమే, ఈనాడుక మైనారిటీ కథలంటే, దేశంలో ఇస్లామీయులంతా పోలీసు దమనకాండలకు భయపడుతూబితుకు బితుకు మంటూ బ్రతుకుతున్నారనీ, మసీదుకెళ్ళాలంటే వనికి పోతున్నారనీ, మసీదు దగ్గర చెప్పులు పెట్తుకునే పిల్లాడు, ఎక్కడో చదువ్కుని నగరానికి వచ్చిన అమాయక యువకుడు అంతా అభద్రతతో అణగిపోతున్నారనీ స్థిరపడ్డాయో, ఇందుకు భిన్నంగా రాస్తే ఎవ్వరూ ఎందుకు పట్తించుకోరో తెలుస్తుంది. అర్ధసత్యాలనే అసలయిన సత్యాలుగా నమ్మించటం, నిజాన్ని తొక్కిపట్టటం తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సమస్యలస్వరూపం చెప్పకుండానే తెలుస్తుంది.

December 4, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada