Archive for April 10, 2014

శీలా సుభద్రాదేవి కవిత్వం-పుస్తక పరిచయం.

మనసు లేని దానిగా పుట్టివుంటే
బాధే లేకుండా పోయేది
మనసుండీ ముఖం లేకుండా అవుతోంది కదా
అదీ ఎదుర్కోవాల్సిన ఇబ్బంది

అంటూ ఆరంభమయ్యే కవిత , నాదైన నాది. ఈ కవితలో కవయిత్రి తనకంటూ ఒక స్వంత గుర్తింపు సాధించాలన్న మహిళ తపనను అత్యద్భుతంగా, ప్రతీకాత్మకంగా చిత్రించారు.

తనకో ముఖమంటూ లేదని గ్రహించాక,
అప్పట్నుంచీ మొదలుపెట్టాను నా పోరాటాన్ని
నాకో ముఖాన్ని మొలిపించుకోటానికో
ఒక చిరునామా అతికించుకోటానికో, అంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధన కోసం తన తపనని హ్ర్ద్యంగా వర్నిస్తారు. చివరలో,
నాకు ముఖం మొలిచేంత వరకూ
కలంతోనైనా, కత్తితోనైనా
నా మెదణ్ణి నేను తవ్వుకుంటూనే వుంటాను, అంటారు.

ఇలాంటి అత్యంత ఆలోచనాత్మకూ, కవితాత్మకమూ అయిన కవితల సంకలనం 1975 నుంచి 2009 నడుమ సీలా సుభద్రా దేవి రచించిన కవితలన్నితినీ ఒక చోట చేర్చి సమగ్ర పుస్తకంగా ప్రచురించిన , శీలా సుభద్రా దేవి కవిత్వం.

504 పేజీల ఈ పుస్తకంలో 1980లో ముద్రితమయిన, ఆకలి నృత్యం, 1987లో ముద్రితమయిన , మోళి, 1994లో ప్రచురితమయిన, తెగిన పేగు, 1996 లో ప్రచురితమయిన, ఆవిష్కారం, 1999నాటి ఒప్పుల కుప్ప, 2001 నాటి యుద్ధం ఒక గుండెకోత, 2007 లోని ఏకాంత సమూహాలు, 2009 నాతి బతుకు పాటలో అస్తిత్వ రాగం, వంటి కవిత్వ సంకలనాలన్నీ కలిపి వున్నాయి. పుస్తకం చివరలో నా కవితా యాత్ర అన్న శీర్షికన కవయిత్రి తన కవిత్వ రచన ప్రస్థానాన్ని టూకీగా వివరించారు.

గుండె స్పందించినది, హృదయం చెమ్మ గిల్లేలా చేసినది, కళ్ళు ఎరుపెక్కించినది ఏ చిన్న సంఘటనో, దృశ్యమో అయినా చాలు కవిత్వంగా చెక్కుకోవచ్చు అంటారు. అంతేకాదు, ఏది రాసినా నేను నమ్మిన విషయాలనే, నేను స్పందించిన సంఘటనల్నే, నేను దగ్గరగా చూసిన సమాజంలోని జీవితాల్నే, నేను గమనించిన దృశ్యాల్నే నిజాయితీగా కవిత్వీకరిస్తాను, అంటారు. ఒకవాదానికో, ఇజానికో కట్టుబడి కావాలని రాయలేదు అని స్పష్టంగా చెప్తారు.

పుస్తకానికి ముందు మాటలో కాత్యాయనీ విద్మహే, విలువల విధ్వంసం ఎక్కడ ఏ రంగంలో జరిగినా సుహద్రా దేవి సహించలేరు అంటారు. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటికే సుభద్రా దేవి పురుషాహంకారాన్ని సంబోధిస్తూ, సవాల్ చేస్తూ కవిత్వం వ్రాశారన్నారు. చివరలో మొత్తం మీద శీలా సుభద్రా దేవి కవిత్వమంటే ఒక సంపూర్ణ స్త్రీ జీవిత చిత్రపటం. స్త్రీ జీవితంలోని రకరకాల వెలుగు నీడల నేపథ్యంలో అవిశ్రాంత, అసంతృప్త, అశాంత స్త్రీల ఆరాటపు అలికిడిని కంగారు కదలికను ఏక కాలంలో వినిపించే చూపించే శబ్ద చిత్రాలీ కవితలంటారు.

ఆధునిక కవిత్వ ప్రపంచంలోని ద్వేషాలు, సంకుచితాలులేని శుభ్రమయిన, ఆలోచనాత్మకమయిన కవిత్వాన్ని ఆస్వాదించాలనుకునేవారందరికీ కరువుతీరా దప్పికను తీర్చే ఒయాసిస్ నీటిలాంటివీ కవితలు. తప్పక చదవండి. అసలు కవిత్వ పఠనానందాన్ని, సంతృప్తిని పొందండి.
శీలా సుభద్రాదేవి కవిత్వం
504 పేజీలు, వెల; రూ 200/-
ప్రతులకు
2/చ్, బ్రహ్మానంద నగర్
మలక్పెత్, హైదెరాబాద్-36.

April 10, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu