Archive for April 11, 2014

షడ్రుచులు, తెలంగాణా వంటలు-పుస్తక పరిచయం.

366 New Likes
383 Talking About This
10,117 Weekly Total Reach
ఆరంభించినప్పుడు ఇంతగా స్పందన వుంటుందనుకోలేదు. ఈ అభిమానం చూశాక బాధ్యత పెరిగింది. ఇంతమంది తెలుగు పుస్తక ప్రేమికులున్నారని, కొత్త తెలుగు పుస్తకాలకు సంబంధించిన సమాచారం కోసం ఇంతగా ఎదురుచూస్తున్నారనీ ఇప్పుడే తెలిసింది. చినుకులా ఆరంభమయి, వర్షమయి,వడగళ్ళవానయి, కుంభవృష్టి అయి, జల ప్రళయమయినట్టు, తెలుగు పుస్తకాలపయిన ఆదరణ ఇంతింతయి, ఇల అంతవ్వాలని ఆశిస్తున్నాను. గమనిస్తే, లైకుల ద్వారా తమ అభిమానాన్ని చూపిన వారిలో కేవలం ఒక శాతం మాత్రమే రచయితలు, సాహిత్యానికి సమబంధించిన వారు మాత్రమే. మిగతావారంతా పాథకులే. అంటేనే తెలుగు పత్రికలు, విమర్శకులు, రంగుటద్దాల సహిత్య హంతకులు, మాఫియా ముఠాల వల్ల ఎంతగా తెలుగు సాహిత్యం, భాష, పుస్తకాలు దెబ్బతింటున్నాయో. ఇది చూసయిన తెలుగు పుస్తకాన్ని ఒక వైభవాత్మకమయిన స్థానానికి చేర్చటం కోసమయినా సంకుచితాలు, సంకోచాలు వదలి సామాన్యులమంతా ఒకటవుదాం. మాఫియా ముఠాలు, రంగుటద్దాలు, హై బ్రో విమర్శకులను వారి దారికి వదలి మన దారిలో మనం ప్రయాణిద్దాం.

అప్నీ మంజిల్ సచ్ కీ మంజిల్, అప్నా రస్తా నేక్ ( మన గమ్యం సత్యం, మన దారి స్వచ్చం) అని పాడుకుంటూ ముందుకు సాగుదాం.

****************************************************************

రుచి అన్నది నాలికకు మాత్రమే పరిమితం, గొంతు దిగిన తరువాత రుచి లేదు, పచి లేదు అంటారు. కానీ, రుచి భావనను ఇనుమడించి, మెదడులో ఒక ఆనందకరమయిన భావన కలిగించటంలో వంట కనిపించే విధానం, ఘుమఘుమలు ప్రధాన పాత్రవహిస్తాయి. అంటే కన్ను, మెదడు, నాలికల మధ్య సమన్వయం వల్లనే సంతృప్తి ఆనందాలు కలుగుతాయన్నమాట. అందుకే, వంట, వండిన పదార్ధాలను అందంగా కూర్చటం కూడా ప్రధానమయిన కళలుగా గుర్తింపు పొందుతున్నాయి. ఆ కళల్లో ఒకటయిన వంటల తయారీ గురించి తెలిపే పుస్తకం, తెలంగాణా వంటలు.

ఈ పుస్తకాన్ని రచించిన జ్యోతి వలబోజు, సరయిన పనిముట్లు , కొద్దిగా ప్రోత్సాహం దొరికితే ఒక స్త్రీ పట్టుదలతో సాధించగల విజయానికి ఒక నిలువెత్తు ఉదాహరణ అని తెలంగాణా వంటలు పుస్తకానికి ఒక చిన్నమాట రాసిన ఎస్.నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

జ్యోతి గారిలో ఇన్వెంటివ్ మైండ్ ని మనం గమనించవచ్చు అంటారు మల్లాది తన మల్లాది మాటలో. ఒక కొత్త వంటకాన్ని కనిపెట్టేవారే మానవాళికి మేలు చేస్తున్నారని, అలాంటి వారిలో జ్యోతి గారొకరనీ ఆయన రాశారు.

నామాటలో రచయిత్రి, మా ముందు తరానికి, నా తరానికి చెందిన తెలంగాణా ప్రాంతపు సాంప్రదాయకమయిన వంటకాలకు అక్షర రూపమిచ్చి అందమయిన పుస్తకంలా తయారుచేసి రాబోయే తరానికందివ్వాలన్న కోరిక వల్ల ఈ పుస్తకం రూపొందిందని రాశారు. అట్ట వెనుక తన మాట రాస్తూ సీ ఉమాదేవి, తను పుట్టిపెరిగిన తెలంగాణా ప్రాంతపు శాకాహారపు రుచులను ఏడాది కాలంగా ఎంతో శోధన చేసి పుస్తక రూపంగా అందించారని పేర్కొన్నారు.

ఇంత మంది ఇన్ని రకాలుగా ప్రశంసించిన ఈ పుస్తకంలో మొత్తం 288 పేజీల్లో, 267 రకాల వంటకాల తయారీ పొందుపరచి వుంది. పసందయిన మెనూ పేరిట, వంటల వర్గీకరణ వివరాలున్నాయి. ఇందులోని వంటలను స్వీట్లు, నాస్తా, పప్పులు, పచ్చళ్ళు, కూరలు-పులుసు-అన్నం అనే 4 వర్గాలుగా విభాగించారు. స్వీట్లలో మొత్తం 41 రకాల స్వీట్ల తయారీని తెలిపారు. 55 రకాల నాస్తాల తయారీ వివరణ వుంది. 26 రకాల పప్పులున్నాయీ పుస్తకంలో. 41 రకాల పచ్చళ్ళ తయారీలున్నాయి. కూరలు పులుసు అన్నం విభాగంలో 104 రకాల వంటకాలను పలు ఉప విభాగాలలో పొందుపరచారు. టమాట, వంకాయ, ఆలుగడ్డ, బీరకాయ, సెనగపప్పు, ఆనపకాయ, బెండకాయా లతో సహా మొత్తం, 21 రకాల కాయలతో 91 రకాల వంటలున్నాయి. 6 రకాల చారులు, 7 రకాల అన్నాలూ వున్నాయి. పుస్తకం చివరలో 8 రంగుల పేజీల్లో కొన్ని వంటకాల బొమ్మలూ వున్నాయి. ఇల షడ్రుచులను అందంగా అందించిన ఈ పుస్తకం కొన్నవారి ఇళ్ళల్లో నిత్యం రుచికరమయిన వంటలే. ఇక ఆలస్యం దేనికి?

షద్రుచులు(తెలంగాణ వంటలు)
288 పేజీలు, వెల; రూ 150/-
ప్రతులకు
నవోదయ బుక్ స్టోర్స్,కాచిగూడ.
లేక
జ్యోతి వలబోజు
08096310140.

April 11, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu