Archive for September, 2016

25 ఏళ్ళ ఉత్తమ కథలు- విశ్లేషణ-4

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాల విశ్లేషణ ఆరంభించేముందు ఈ సంకలనాల్లో కథల ఎంపికకు ప్రాతిపదికలు, ప్రామాణికలు ఏమిటన్నది స్పష్టంగా తెలుసుకోవాలసివుంటుంది.
ప్రతి సంకలనానికి వున్న ముందుమాటలో ఈ విషయాన్ని సంకలనకర్తలు ప్రకటిస్తూనే వున్నా, 2016 సంకలనం ముందుమాటలో ఆడెపు లక్ష్మీపతి ఈ విషయాన్ని విష్పష్టంగా వివరించారు.  ఆడెపు లక్ష్మీపతి 6 అంశాలను ప్రస్తావించారు. అవి:
1. వినూత్నమైన శైలీ శిల్పాలతో కూడిన కథనం
2. కథావస్తువుకు సంబంధించి కొత్త సరిహద్దుల్లోకి ప్రవేశం
3. సాధారణ అంశమే అయినా ఆవిష్కరించిన తీరులో కొత్తదనం
4. అర్ధవంతమయిన ప్రయోగం
5. అత్యంత ప్రాధాన్యమూ, ప్రాసంగికత కలిగివున్న సమకాలీన సమస్య
6. విస్మృత వర్గాల జీవిత చిత్రణ( వారి భాష యాసలోనే)

ఈ ఆరు అంశాల ప్రాతిపదికన ఉత్తమ కథలను ఎంచుకున్నారన్నమాట.
ఈ అంశాల ప్రాతిపదికగానే 1990 నుంచి సంకలనాల్లోని కథలను విశ్లేషించాల్సివుంటుంది. ఉత్తమ కథను ఎంచుకొనే ప్రామాణికాలు ఎంతగా లోపభూయిష్టమయినవయినా, సంకలనకర్తల స్థాయి, ప్రామాణికాలు ఇంతే..దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఈ ప్రామాణికాల ఆధారంగానే కథలను విస్లేషిస్తూ, వాతి ఆధారంగా తూనికరాళ్ళలోని లోపాలను ఎత్తి చూపించాల్సివుంటుంది.
1990లో వెలువడిన మొదటి సంకలనంలో 15 కథలున్నాయి. ఒక రకంగా ఈ కథలు సంకలన కర్తల ఉద్దేశ్యంలో మంచి కథకు ప్రాతినిథ్యం వహిస్తాయి. గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఈ సంకలనంలోని కథలని పరిశీలిస్తే, ఇంతవరకూ వచ్చిన 25 సంకలనాల్లోని కథలన్నిటినీ దాదాపుగా పరిశీలించినట్టే. కొన్ని ఎక్సెప్షన్లు ఎలాగో వుంటాయి. కానీ, దాదాపుగా అన్నీ ఒకే రకమయిన కథలు. దునియా నయీ హై చెహెరా పురానా అన్నాడోకవి. అంటే ప్రపంచం కొత్తది కానీ, దాని ముఖం పాతదే...అలాగే, కథల పేర్లు, కథకుల పేర్లు మారుతున్నాయి తప్ప..కథలు మారటంలేదన్నమాట!
మరో రకంగా చెప్పాలంటే, హిందీ చలనచిత్ర ప్రపంచంలో నాజిర్ హుస్సేన్ అని ఒక నిర్మాత వున్నాడు. ఆయన ఒకే కథను కొత్త నటీనటులతో, అటూ ఇటూ చేసి 10 సూపర్ హిట్ సినిమాలు తీశాడు. 25 ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలోని కథలు చదువుతూంటే నాజిర్ హుస్సేన్ సినిమాలు గుర్తుకువస్తాయి.
మొదటి సంకలనంలోని 15 కథకుల్లో స్వామి,  పీ సత్యవతి, వాడ్రేవు చినవీరభద్రుడు, బమ్మిడి జగదీశ్వర రావు, కేతు విశ్వనాథ రెడ్ది, కాట్రగడ్డ దయానంద్, పాపినేని శివశంకర్ వంటి  7 గురు రిపీట్ కథకులు. అంటే భవిష్యత్తు సంకలనాలో వీరి కథలు  ప్రచురితమయ్యాయన్నమాట. . డాక్టర్ తనపొట్ట తానుకోసుకోలేడు కానీ, సంపాదకుడు తన కథలను ఉత్తమ కథలుగా ఎన్నుకోగలడు.  దీన్లో పాపినేని శివశంకర్ ఒక సంపాదకుడు. వాడ్రేవు చిన వీరభద్రుడు, కేతు విశ్వనాథ రెడ్డి లని మినహాయిస్తే, మిగతా వారంతా వామ పక్ష భావజాల సమర్ధకులు. ఉద్యమాల్లో ఏదో ఓ రూపంలో వున్నవారు.
మొదటి సంకలనంలో మొదటి కథ సుమనస్పతి రాసిన నిశ్శబ్దం. పట్నంలో స్థిరపడిన పిల్లవాడు, పల్లెలో వున్న అమ్మమ్మను చూడటానికి వెళ్తాడు. పల్లీలో అంతరిస్తున్న ఆప్యాయతలు, అనుబంధాలు, డబ్బులో కొట్టుకుపోతూ సర్వం మరుస్తున్న మనుషులను చూస్తాడు. అమ్మమ్మ మరణంతో కథ ముగుస్తుంది. మొదటి కథ కాబట్టి, ఒక కొత్త విషయం తెలుసుకున్నమని అనుకుందాం. రచయిత కథ చెప్పిన పద్ధతి సూతిగా, స్పష్టంగా వుండి చదివిస్తుంది. అయితే. కథకు కాస్త ఎడితింగ్ అవసరమనిపిస్తుంది. కానీ, 1990నాటి కథకాబట్టి సరిపుచ్చుకోవచ్చు.
జగన్నాథశర్మ పేగుకాలిన వాసన కథకూడా పల్లెల్లో డబ్బు వల్ల దెబ్బతింటున్న మానవ సంబంధాల స్వరూపాన్ని చూపే కథ. రచయిత ప్రతిభవల్ల దృశ్యాలు కళ్ళ ముందు నిలుస్తాయి. కథ ఆశాభావంతో ముగుస్తుంది. సుమనస్పతి కథలాగా నిజాన్ని చూపే డాక్యుమెంటరీ అనిపించదు.
చక్రవేణు కథ కువైట్ సావిత్రమ్మ కథకూడా పల్లెల్లో బంధుత్వాలను , నైతిక విలువలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందో చూపుతుంది. కువైట్ వెల్లి డబ్బు సంపాదిస్తున్నందుకు, సావిత్రమ్మ్మ గురించి నీచంగా మాట్లాడిన వారే, తమ భార్య పరాయివాదితో వుండటానికయినా సిద్ధపడి డబ్బుకోసం కువత్ పంపాలని తపన పడటాన్ని ప్రదర్శిస్తుందీ కథ. మానవ నైజంలోని నైచ్యాన్ని చూపుతుంది. ఈ కథ చదివిన తరువాత కువైట్ వెళ్ళే మహిళలంతా అందుకు సిద్ధపడి ,అక్కడ కావల్సిన మొగోళ్ళ దగ్గరకల్లా వెళ్ళినవాళ్ళేనేమో అనిపిస్తుంది.. కాస్త, మాండలీకం వాడేరన్నది తప్ప ఏరకంగా చూసినా కథలో కొత్తదనమూ, గొప్పదనమూ కనబడదు. ఇలాంటి కథలు అంతకుముందూ వచ్చాయి. ఆ తరువాతా వచ్చాయి. కానీ, ఆ తరువాత వచ్చిన కథలు అయినవారు రాస్తే ఉత్తమ కథలయి సంకలనంలోకి ఎక్కాయి అంతే! గతంలో ఇలా డబ్బు సంపాదిస్తే, చివరలో పశ్చాత్తపం చెందినట్టు చూపేవారు. ఈ కథలో అలాలేదు. అందుకే, బహుషా దీన్ని ఉత్తమ కథగా పరిగనించివుంటారు. నైతిక విలువలొదిలి, గర్వంగా తలెత్తుకు తిరుగుతూ తమచర్యలను సమర్ధించుకోవటమే విప్లవం కదా. దానికి సైద్ధాంతిక పైత్యం జోదిస్తే, అభ్యుదయ విప్లవాత్మక ఉత్తమ కథ అయిపోతుంది. అలాంటి కథల ఈ సంకలనాల్లో బోలెడన్ని. 

మిగతా కథల విశ్లేషణ త్వరలో...

September 21, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనం-విశ్లేషణ-3

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనానికి ముందుమాటలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వామ పక్ష భావజాలం కథలు అధికంగా సంకలనాల్లో వుండటాన్ని సమర్ధించాలని ప్రయత్నించారు. జీవితాన్ని వామపక్ష భావజాలం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు, అందులోంచే అత్యధిక శాతం మంచి సాహిత్యం పండుతున్నప్పుడు అది సంకలనాల్లో ప్రాతినిధ్యాన్ని పొందటం సహజ పరిణామమే..అని సమర్ధించారు.
జీవితాన్ని వామపక్ష భావజాలం తీవ్రంగా ప్రభావితం చేయటం అన్న విషయాన్ని పక్కనపెడితే, అందులోంచే ఉత్తమ సాహిత్యం అధికంగా పండుతోందనటం చర్చనీయాంశమే.
సంకలనాల్లోకి అలాంటి కథలనే ఎన్నుకుంటున్నారు కాబట్టి, తమ కథను ఉత్తమ కథల సంకలనంలో చూడాలని ఆశవుంటుంది కాబట్టి అలాంటి కథలే రాస్తారు రచయితలు. అలాంటి కథలనే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి, అలాంటి కథలే వస్తాయి కాబట్టి, అధిక శాతం వామపక్షభావజాల కథలే వస్తున్నట్టు కనిపిస్తుంది.
ఇక్కడ నా వ్యక్తిగత అనుభవం ఒకటి చెప్తాను.
ఒక పత్రిక ఎడిటర్ నన్ను నవల రాయమన్నాడు. టాపిక్లు చెపాను. ఒకటి ఎన్నుకున్నాడు. దాన్ని ఎలా రాయాలో ఆయన చెప్పటం ఆరంభించాడు. మధ్య మధ్య వామపక్ష భావాలు, అభ్యుదయ భావాలు ఎలా జొప్పించాలో సూచించాడు. అంతా విని నేను నా అభిప్రాయం చెప్పాను. భారతీయ ధర్మం ఔన్నత్యం, భారత జీవన విధానంలోని వైషిష్ట్యం చూపటం నా ఉద్దేశ్యమనీ చెప్పాను. ఆయన నవ్ల అవసరం లేదని చాలా బాధపడుతూ చెప్పాడు. అంతేకాదు, మీరు వామపక్ష భావజాలంతో రాస్తే, మీ పేరు దేశమంతా మారుమోగుతుంది. అందుకు నేను పూచీ..అని కూడా అన్నాడు. ఇప్పటికీ, ఎప్పుడయినా కలిస్తే, నా మాట వినలేదు, అందుకే, ఇంత విశిష్టంగా, విస్తృతంగా రాస్తూ కూడా నీకు రావాల్సిన పేరు, గుర్తింపు రావటంలేదు. ఇప్పటికయినా, కాస్త విప్లవము, స్త్రీ విమోచన, అగ్రవర్ణాల దౌష్ట్యం, పల్లెల్లో జమీందారుల దోపిడి, ప్రభుత్వ హింస లాంటి టాపిక్కులతో రెండు మూడు కథలు రాయి, నీ పేరు పైకి తీసుకెళ్ళే బాధ్యత నాది..అంటూంటాడు. సమాధానంగా, మనకు వచ్చేదాన్ని ఎవ్వరూ ఆపలేరు, రాని దాన్ని ఎవ్వరూ తేలేరు అని నవ్వి తప్పించుకుంటాను.
నేను మొండివాడిని కాబట్టి లొంగలేదు. కానీ, ఎందరో రచయితలు ఆ ప్రలోభానికి లొంగి తమ స్వభావానికి విరుద్ధమయిన రచనలు చేస్తున్నారు.
ఇటీవలె, సుజాత అనే ఆవిడ, వేలుపిళ్ళై రచయిత రామచంద్రరావు గారి ఇంటర్వ్యూను ప్రకటించింది. దాన్లో ఆయన కూడా ఇలాంటి సంఘటన చెప్పారు. సామాజిక స్పృహ వున్న కథ రాస్తే సంకలనానికి పరిగణిస్తామని చెప్పటంతో అలాంటి కథ రాశానని చెప్పారు.
మిథునం కథను ఉత్తమ కథల సంకలనంలో ఎంపికచేసుకోకపోవటానికి కారణాన్ని వివరిస్తూ, సంపాదకులు, ఆ కథ వివాహ వ్యవస్థను సమర్ధిస్తున్నట్టు వుంది కాబట్టి ఎన్నుకోలేదన్నారు. అంటే, కథ మంచి చెడు అది వివాహ వ్యవస్థను సమర్ధిస్తుందా, వ్యతిరేకిస్తుందా అన్న దానిపైన ఆధారపడి వుంటుందన్న మాట. కథ ఎంత గొప్పగా వున్నా, వివాహ వ్యవస్థను సమర్ధిస్తే ఉత్తమ కథ కాకుండాపోతుందన్నమాట. మరి తమ కథలు కథలుకాకుండాపోకుండా, ఉత్తమ కథలుగా గుర్తింపు పొందాలంటే, తాము భద్రంగా వైవాహిక వ్యవస్థలోని శాంతిని అనుభవిస్తూ, తాళులు తెంపే కథలు, పురుషులను పురుగులుగా చూపే కథలు, అక్రమ సంబంధాలే ఉత్తమ సౌఖ్యానికి సోపానాలు, పెళ్లి కుళ్లు అనే కథలను రచయితలు రాస్తారు. వాటిని ఉత్తమ కథలుగా గుర్తిస్తూండటంతో అదే ఉత్తమ కథ అవుతుంది.
అంటే, ఎలాగయితే పెట్తుబడిదార్లు మార్కెట్ ను సృష్టించి వస్తువును అమ్ముకుంటారో, ఇక్కడ కూడా ఉత్తమ కథ ఇది అని చెప్పి అలాంటి కథలు మాత్రమే ఉత్తమ కథలుగా గుర్తింపు పొందేట్తు చేసి, ఉత్తమ కథలని తామనుకున్నవి కాక, మరొకటి కాని పరిస్థితులు కల్పించారన్నమాట...ఈ విషయాన్ని రచయితల కథల విశ్లేషణలో నిరూపించటం జరుగుతుంది. 

ఇక అదే ముందుమాటలో  సాహిత్య రంగంలో రిజర్వేషన్లు అక్కర్లేదని స్పష్టంగా చెప్పారు వల్లంపాటి గారు అమాయకంగా..

ఈ 25ఏళ్ళ ఉత్తమ కథలను చూస్తూంటే అలాంటి రిజర్వేషన్లు ఉన్నాయనీ, వాతిని పాతిస్తున్నారనీ అర్ధమవుతుంది.

సంకలనాలలో దళిత కథ వుండితీరాలి.  మైనారిటీ కథ వుండాలి. స్త్రీ వాదం కథ వుండాలి. అరస, విరస, కురస, నీరస, నోరస వీరుల కథలుండాలి. అయిపోయింది..కథల సంకలనం.  ఇందులో ఇంకా కొందరు ముసలి పేరున్న కథకుల కథలను పరిగణించాలి. వారు ఏమి రాసినా ఉత్తమ కథ అనకపోతే నొచ్చుకుంటారు పెద్దలు. జర్నలిస్టు రచయితలదో ప్రత్యేక రిజర్వేషన్ కోటా. వారి కథలు ఉత్తమం అనకపోతే, సంకలనాలకు ప్రచారం రాదు. సమీక్షలు పాజిటివ్ గా రావు. అందుకే, జీవితంలో ఒకే కథ రాసిన జర్నలిస్టు రచయితలు, ఒకట్రెండే ఉత్తమ కథల సంకలనంకోసం మాత్రమే రాసిన జర్నలిస్టు రచయితలూ ఈ సంకలనల్లో కనిపిస్తారు.( ఎలాగో ఎవ్వరూ వేయకపోతే అచ్చేయటానికి ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. ఇక్కడా ఒక అనుభవం చెప్పాలి. నేను ఒక యువ రచయితను విమర్సించాను. తరువాత అతనికో సలహా ఇచ్చాను. నెట్ పత్రికలకు పరిమితం కాకుండా అచ్చు పత్రికల్లోను కథ పడాలని, మంచి కథ పంపితే అందుకు సహాయం చేస్తాననీ చెప్పాను. అతను సమాధానం ఇవ్వలేదు. కొన్ని వారాలకు అతని కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అలాగే..ఒకాయనను జీవితంలో ఒక్క కథ రాయలేదు, కథల గురించి మాట్లాడవద్దని అన్నాను. అన్న రెండు వారాల్లో అతని కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మళ్ళీ ఇంతవరకూ మరో కథ రాయలేదారచయిత..ఇలాంటి అనుభవాలెన్నో).. ఇవి అయ్యాక, లాబీయింగ్ వాళ్ళుంటారు. రికమండేషన్లుంటాయి. డబ్బులిచ్చే ఎన్నారైల సూచనలుంటాయి. ఇక ఇందులో అసలు కథలకు, కథకులకు స్థానం ఎక్కడ...
బంగారుమురుగులాంటి అధ్బుతమయిన కథను బూర్జువా, అగ్రవర్ణ, మనువాద, కదుపునిండిన అహంకార కథగా ఎందుకు కొట్టిపక్కన పారేయలేదో ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని వెనుక ఎవరెంత కష్టపడి ఆ కథ ఊతమమయినదని ఒప్పించారో తెలుసుకోవాలనుంది.

అంటే, వల్లంపాతి గారు ఎంత సమర్ధించకున్నా, ప్రాంతీయాల వారి, కులాల వారి, భావజాలాల వారి, అవసరము, ఉపయోగాల వారి..అన్ని రిజర్వేషన్లూ అమలులో వున్నాయన్నమాట.
అందుకే..మొవ్వ వృషాద్రిపతి అనే కవి..కథల గురించి ఇలా వ్యాఖ్యానించారు...

ఈనాడెందరో పెద్ద పెద్ద కథా రచయితలున్నారు. ఎన్నో పురస్కారాలు పొందుతున్నారు. బిరుదనామాలతో విరాజిల్లుతున్నారు. వారి కీర్తిని ఆహా! ఓహో! అని ప్రశంసించేవారు గాని, పురస్కారాలందించే వారు గానీ ఆయా రచయితల కథలు పఠించారా? ఏదీ! ఒక కథను చెప్పమనండి. మానవ జీవితానికి అన్వయించి లోతుగా పరిశీలించి ఈ కథలో ఈ శాశ్వత లక్షణముందని చెప్పండి. అంధపరంపరాన్యాయంగా, ఆయన గొప్పవాడంటే గొప్పవాదు ..ఎందుకు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే వారెందరు? ఆయా కథలను ఏ సభలలో ఎవరెక్కడ చెప్పుకొంటున్నారు? లోకం గతానుగతికం కదా!

ఇది పొగడుతునావారికీ, పొగిడించుకుంటున్నవారికీ తెలుసు..కానీ, ఎవరి భయాలు వాళ్ళవి, ఎవరి అవసరాలు వాళ్ళవి, ఉన్నది పోతుందన్న బెదురు, అనుకున్నది కాదేమోనన్న అదురు.....అందుకే, ప్రతి రచయిత మనసులో ఈ సంకలనాలపై అసంతృప్తి వున్నా బయత పడటంలేదు. ఏమో..ఈ సారి కాకున్నా వచ్చే సారి సంకలనంలో కథ వచ్చే అవకాశాన్ని నోరుపారేసుకుని పోగొట్తుకోవటమెందుకని మౌనంగా వుండిపోతున్నారు. పెదవులతో పొగడుతున్నారు.
పూర్తిగా నిరాశ చెందిన కొందరు, తామే సంకలనాలను వేసుకుంటున్నారు. కానీ డబ్బిచ్చిన వాళ్ళ కథలుండటం, సరయిన సంపాదకుడు లేకపోవటంతో ఆ సంకలనాలు ఆశించిన ఫలితాలివ్వటంలేదు. ప్రాతినిథ్య అన్న కథల సంకలనం వస్తూన్నా, అది దళిత మైనారిటీ కథలకు పరిమితమవటంతో సర్వజనాదరణ పొందటంలేదు.  ప్రరవే పేరిట ఒక సంకలనం వచ్చినా అదీ డబ్బుల వసూళ్ళు, సరయిన సంపాదకుడులేకపోవటంతో అంత ప్రాచుర్యం పొందటంలేదు. అందుకే.. 25 ఏళ్ళుగా అప్రతిహతంగా సాగుతూ వస్తున్న ఈ సంకలనానికి అంత ప్రాధాన్యం. ఈ సంకలనమూ ఒక భావజాలానికి పరిమితమయినా, సంకుచిత దృష్టితో కథలను ఎంచుకుంటున్నా, సంకలనకర్తలు మాత్రం తెలుగు కథ మొత్తానికి ఈ సంకలనాన్ని ప్రాతినిథ్యం వహిస్తున్న భ్రమ కలిగించి విజయం సాధిస్తున్నారు. ఈ కథలు ప్రామాణికం కాదు, ఈ ఎంపిక సరయినది కాదు అనే వారి గొంతు వినపడే వీలు లేదు. ఉన్నా పట్టించుకుని సంకలనకర్తలకు దూరమవటం ఎవరికీ ఇష్టం లేదు. పిల్లిమెడలో గంట కట్టటం లాంటిది ఇది..
వచ్చే వ్యాసంలో కథలను విశ్లేషణ ద్వారా, ఇంతవరకూ ప్రతిపాదించినవాతిని నిరూపించటం వుంటుంది.

September 13, 2016 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

25 ఏళ్ళ తెలుగు కథ సంకలనం – విశ్లేషణ 1 & 2.

1.

ముందుగా 25ఏళ్ళుగా తమకు నచ్చిన తమవారి కథలతో సంకలనాలు ప్రచురిస్తూన్న కథా సాహితికి అభినందనలు. వారికి నచ్చిన కథలనే 25ఏళ్ళలో ఉత్తమ కథలుగా నిలిపిన వారి కథా ప్రేమకు నీరాజనాలు. అయితే, కథల పుస్తక ప్రచురణ విషయంలో, ముఖ్యంగా, 25ఏళ్ళ కథలను రెండు సంపుటాలుగా ప్రచురించటంలో వారు కనబరచిన శ్రద్ధ, చూపిన నాణ్యత విషయంలో హృదయపూర్వకంగా అభినందలు తెలుపక తప్పదు. పుస్తకాలను నాణ్యంగా ప్రచురించటం, వాటికి ప్రామాణికతను సాధించటం, తగిన ప్రచారం ఇవ్వటం విషయంలో అభినందించక తప్పదు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భేదభిప్రాయం వుండదు.

ఈ కథల సంకలనాలలోని కథలు, ఎంపిక, అసంతృప్తుల గురించి చర్చించేముందు కాస్త నేపథ్యాన్ని స్మరించాల్సి వుంటుంది.
తెలుగు సాహిత్యం పూర్తిగా కమర్షియలైజ్ అయిపోతూ, మనసుకు హత్తుకునే కథ, నవలల కన్నా, రెచ్చగొట్టి ఉద్రేకపరచే సాహిత్యానికే ప్రాధాన్యం వున్న కాలం అది. అలాంటి పరిస్థితులలో తెలుగు సాహిత్యం దిశను మళ్ళీ మంచి వైపు మళ్ళించాలని తెలుగు సాహిత్యాభిమానులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా వేదగిరి రాంబాబు గారు కథల సంకలనాలు ప్రచురిస్తూ, మంచి కథను నిర్వచించి మంచి కథలను వెలుగులోకి తేవాలని ప్రయత్నిస్తూ, మంచి కథకులకు ప్రోత్సాహమివ్వటం ప్రారంభించారో ఉద్యమంలా. మరో వైపు రచన పత్రిక ఏర్పాటు ద్వారా ఉత్తమ సాహిత్యానికి వేదిక కల్పించాలన్న ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఇంకో వైపునుంచి, మంచి కథలు రాసి రాయటం మానేసిన పాత కథకులందరినీ మేల్కొలిపి వారితో మంచి కథలు రాయించి కథకు మంచి రోజులు తేవలన్న ప్రయత్నాలూ మొదలయ్యాయి. కాళీపట్నం రామారావు గారు కథానిలయం ప్రారంభించి తెలుగు కథకొక ఆశ్రయం కల్పించాలని ఉద్దేశ్యం వ్యక్తపరచటంతో ఆయన కథకు పెద్ద దిక్కయ్యారు. ఆయన ఆధారంగా, రచన సహకారంతో తెలుగు కథ పునరుజ్జీవనంకోసం పెద్దలు నడుం బిగించారు. ఉత్తమ కథల సంకలనం ప్రచురించటం కూడా ఈ కథా పునరుజ్జీవన ప్రయత్నాలలో భాగమే. నాకు గుర్తున్నంత వరకూ( ఇది రిఫరెన్సులు లేకుండా జ్ఞాపకాలననుసరించి రాస్తున్నది. క్రానాలజీ కాస్త అటూ ఇటూ అయితే క్షంతవ్యుడను) కొన్ని పాత రచయితల ఉత్తమ కథల సంకలనాలూ ఇదే సమయంలో వెలువడ్డాయి. మధురాంతకం నరేంద్ర గారూ ఒక ఉత్తమ కథల సంకలనం ప్రచురించారు. ఆ తరువాత కథా సాహితి కథల సంకలనం ప్రారంభించి 25ఏళ్ళుగా ప్రచురణనౌ సాగిస్తోంది. ప్రామాణికతను సాధించింది. వేదగిరి రాంబాబు కూడా ప్రతి సంవత్సరం పత్రికలలో ప్రచురితమయిన కథలపై సమీక్షలతో కొన్నేళ్ళు పుస్తకాలను ప్రచురించారు కానీ…ఆ ప్రయోగం ఆగిపోయింది. కాబట్టి, 25ఏళ్ళుగా తాము ఉత్తమమ అనుకున్న కథల సంకలనాలను ప్రచురిస్తున్న కథా సాహితిని అభినందించక తప్పదు.
నిజంగా సంవత్సరంలో ప్రచురితమయిన కథలన్నీ చదివి, వాటిల్లోంచి మంచి కథలను వెతికి పట్టుకోవటం అంత సులభమయిన పనికాదు. కేవలం పత్రికలలో ఇండెక్స్ చూసి కథల పేర్లు కాపీలు చేస్తేనే కథా విమర్శ నిపుణులై డాక్టరేట్లకు అర్హత పొందే కాలంలో , అన్ని కథలనూ చదివి ఉత్తమ కథలను ఎంచుకోవటమన్నది అంత సులభమయిన పని కాదు. అందుకని కొన్ని ప్రామాణికాలు, తూనిక రాళ్ళు ఏర్పరచుకోవాల్సి వుంటుంది. ఆ పరిమితుల్లో ఒదగని కథలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాల్సివుంటుంది. అనేక విమర్శలను ఎదుర్కోవాల్సివుంటుంది. తాము ఉత్తమ కథకులుగా ఎన్నుకోని వారెలాగో దూషిస్తారు, ఉత్తమ కథకులుగా ఎన్నుకున్న వారూ విమర్శిస్తారు. అయినా ఈ thankless job ను 25 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూండటం ఏరకంగా చూసినా గొప్ప విషయమే.
అభినందనలయిపోయాయి. ఇక 25 ఏళ్ళ సంకలనాలలోని కథల గురించి ప్రస్తావించుకుందాం!
ఉత్తమ కథలను ఎలా నిర్ణయిస్తారన్న విషయంలో, 26వ సంవత్సరపు కథల సంకలనానికి ఆడెపు లక్ష్మీపతి రాసిన ముందుమాటను స్మరించాల్సివుంటుంది.
‘కథకు ముందు మనం తగిలించే మంచి కావ్య భాషలో ఉత్తమ-అనేది అనిర్దిష్టమయిన, అస్పష్టమయిన, ఆత్మాశ్రయకమైన సాపేక్ష విశేషణమేనా? ఉత్తమ కథల ఎంపికకు సంకలన కర్తల whims and fancies ఆధారమా?’
అడగాల్సిన ప్రశ్న ఇది. దానికి సమాధానం కూడా వెంటనే ఇచ్చాడు లక్స్మీపతి.
‘ నేను ఔననే అంటాను. వందలు, వేల కథల్లోంచి ఒక దజను లేదా దజనున్నర కథలను ఉత్తమమైనవిగా ఎంపిక చేసే క్రమంలో సంపాదకుని/ సంకలనకర్త వ్యక్తిగత అభిరుచులు, ఇష్టానిష్టాలు, దృక్పథం, మనహ్ ప్రవృత్తి, భావావేశం తప్పక ప్రభావం చూపుతాయి. ఇక్కడ అబ్సొల్యూట్స్ లేవు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చక పోవచ్చు.
అయినప్పటికీ- తన నిర్ణయంలో శాస్త్రీయత, హేతు బద్ధత గరిష్టస్థాయిలో వున్నాయని చెప్పుకుని సమర్ధించే వీలు సంపాదకునికి వుంది. అదెప్పుడంటే- సాహిత్యం సామాజిక ప్రయోజనం పట్ల ఒక స్పష్టమయిన అభిప్రాయంతో పాటూ సాహిత్యాన్ని వస్త్వాశ్రయంగా విశ్లేషించగల విమర్శనాదృష్టీ, ప్రత్యేకించి ఒక విశిష్ట సాహిత్యప్రక్రియగా కథ పరిణామ వికాసాలు, దాని ప్రస్తుత కొత్త పోకడల గురించిన అవగాహనా తనకు తగినంతగా వున్నప్పుడూ
ఆడెపు లక్స్మీపతి రాసింది అక్షర లక్షలు చేసే సత్యం ఇప్పుడు దీన్ని ఆధారంగా తీసుకుంటే, ఇన్నేళ్ళుగా ఇవీ ఉత్తమ కథలని తెలుగు సాహిత్య ప్రపంచ వేదికపైకి తెస్తున్న కథల సంపాదకుల అర్హతలేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న ఇంతవరకూ ఎవరయినా అడిగారా? అడిగినా దానికి సమాధానం తెలుసు. డబ్బులు పెడుతున్నది మేము. సమయం వెచ్చిస్తున్నది మేము. శ్రమ పడుతున్నది మేము. మేము మాకిష్టమయిన కథలను ప్రచురిస్తున్నాం. మీకు నచ్చకపోతే చదవకండి. చదవమని ఎవ్వరూ బ్రతిమిలాడటంలేదు…ఈ సమాధానికి ఎదురు వాదన లేదు.
అయితే…సంకలనం చేయటమే గొప్ప…అన్న ధోరణిని పక్కనపెడితే, ఎప్పుడయితే సంకలనం చేసి ప్రచురిస్తారో అప్పుడు దాన్ని కొని చదివిన ప్రతి వారికీ దాన్ని విమర్శించే హక్కు వుంటుంది. సినిమా అయినా, కథ అయినా, సాహిత్యమయినా, నాటకమయినా…ఏదయినా వేదికపైకి వచ్చిన తరువాత వేదికపైకి తేవతమే గొప్ప..నా ఇష్టం అనే వెల్లు లేదు. అందుకే..కథల సంవత్సరీక సంకలనాల ముందుమాటల్లోనే పలువురు తమ సంతృప్తిని సున్నితంగా సూచించారు, సంకలన కర్తలను నొప్పించకుండా…
1997 సంకలనానికి ముందుమాటలో వల్లంపాటి వేంకట సుబ్బయా గారు..
‘ ఆ మాట కొస్తే ఈ దశకంలో మనం అతిగా పొగడిన కథల్లో కొన్ని అతి సాధారణ కథలు మాత్రమే. సహేతుకమైన కారణాలు చూపించకుండా కొన్ని కథల్ని పైకెత్తడం, మరికొన్ని కథల్ని కిందికి లాగటం మన కథా సాహిత్యరంగంలో తరచుగా జరుగుతున్న పరినామమే. దీనికి చాలామంది సంపాదకులూ, రచయితలూ, విమర్శకులూ, సంకలనకర్తలూ బాధ్యులే. తమవారికి ఆకులో పెట్టటం తమవారు కానివారికి నేల మీద పెట్టటం రచయితల సంఘాలు చేస్తున్నాయి. సభ్యత్వాలను మించిన సాహిత్యార్హత ఉండొచ్చునన్న ఎరుక ఇంకా పెరగలేదు. అందుచేత రచయితల్నీ, రచనల్నీ విలువ కట్టటంలో తప్పిదాలు జరిగాయి. జరుగుతున్నాయి.’
ఈ సంకలనాలపై ఇంతకన్నా గొప్ప విమర్శ ఎవరూ చేయలేరు. 1997లోని ఈ విమర్శ మొత్తం 26 సంకలనాలకూ వర్తిస్తుంది. సభ్యత్వాలను మించిన సాహిత్యార్హత వుంటుందన్న గ్రహింపు ఈ 26ఏళ్ళ సంకలనాలలో కనిపించదు. వరుసగా ఈ సంకలనాల గురించి, సంకలనాలలోని కథల గురించి విశ్లేషణాత్మక విమర్శ వ్యాసాలలో చర్చించటం జరుగుతుంది. ఏరకంగా ఏ సంకలనాలు రచనలను సరిగా విలువకట్టలేక సభ్యత్వాలకు, స్నేహాలకే పెద్దపీట వేసాయో, ఎందుకని ఈ ప్రయత్నం ప్రశంశనీయమే అయినా ప్రామాణికంగా భావించకూడదో నిరూపించటం జరుగుతంది.
ఈ విమర్శ కేవలం సాహిత్య సంబంధి తప్ప వ్యక్తిగతం కాదని మనవి.
2.
పాతికేళ్ళ కథ రెండు వాల్యూంలలో ఒక మంచిపని చేశారు. చివరలో ఏ రచయితవి ఎన్ని కథలు, ఏయే పత్రికల్లోవి అన్న గణాంక వివరాలు వేశారు. దీని ప్రకారం, 25ఏళ్ళలో ఎంచుకున్న 336 కథలలో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం నుంచి ఎన్నుకున్నవి 70 కథలు. 2016 సంకలనంలోని 12 కథల్లోనూ 4 కథలు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలోవి. గమనిస్తే, ఈ సంకలనాల్లో కొందరు రచయితలు ఆంధ్రజ్యోతిలో తప్ప మరే ఇతర పత్రికలలో కథలు ప్రచురితం కాని వారున్నారు.

రచయితలందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అన్ని రకాల కథలు ప్రచురితం కావు. అందరు రచయితలకథలూ రావు అని. సాధారణంగా ప్రతి పత్రికకూ అక్కడ నిర్ణయాత్మక స్థానంలో వున్న వారి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను అనుసరించి పాల్సీలుంటాయి. దాని ఆధారంగా కథల ఎంపిక జరుగుతంది. కానీ, ఆద్ణ్రజ్యోతిది కాస్త ప్రత్యేకం. అక్కడ అభ్యుదయ భావల, ఫెమినిస్త్ ఉద్యమాల వీర విప్లవ భావాల కథలకే స్థానం. కాబట్టి, అరసస, విరస, కురస, నీరస, నోరస కథలు, కథకులకు అది అడ్డా..లాంటిది. .. అక్కడ మరో దృక్కోణానికి ఆస్కారం లేదు. ఆ పత్రికలో ఇటీవలే ఎన్నారైలకు కోటాకూడా కల్పించారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యేవన్నీ ఏకాక్షి కథలు. ఒకే రంగు కథలు. ఒకే భావ జాలాన్ని సమర్ధిస్తూ, మరో దృక్కోణాన్ని అస్సలు ఆమోదించని కథలు. ఈ కథల్లో మగవాళ్ళెంత క్రూరులయితే అంత మంచిది. ఆడవాళ్ళెంత విశ్రంఖలులయితే అంత గొప్పది. పోలీసులు, మిలటరీ వాళ్ళు ఎంత విలన్లయితే అంత గొప్ప. ప్రభుత్వాలనెంత రాక్షసంగా చూపితే అంత గొప్ప కథ. మన దేశాన్ని, సమాజాన్ని ఎంత దిగజారుడుగా చూపిస్తే అంత అద్భుతమయిన కథ. అధికశాతం కథలు అలాంటివే.రాసేవాళ్ళూ అలాంటి వారే. అలాంటి ఏకాక్ష, రకవర్ణ కథలకే ప్రాధాన్యం ఇచ్చే పత్రికలో ప్రచురితమయిన కథలను అధిక సంఖ్యలో ఉత్తమ కథలుగా ఎంచుకున్నారంటే అర్ధం కథలను ఎంచుకునేవారిదీ అదే దృష్టి అని. ఇందులో ఏమాత్రం సందేహమున్నా , ఒక అడుగు ముందుకు వేసి పరిశీలిస్తే అన్ని సందేహాలు తొలగిపోతాయి.
ఈ సంకలనాల్లో వార్త ఆదివారం అనుబంధంలోని కథలు 26 వున్నాయి. పాలపిట్ట లోని కథలు 9 వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , గుడిపాటి వార్తలో వున్నంతకాలం వార్తలో అరస, విరస, కురస, నీరస, నోరస కథకులకు, కథలకు ప్రాధాన్యం వుండేది. వ్యక్తిగతంగా గుడిపాటి లిబరల్. అంటే అన్ని రకాల భావాలకు సమాన స్థానాన్నిచ్చే వ్యక్తి. నా భావాన్ని మెచ్చేవాదు నా వాడు..మిగతా అంత మూర్ఖులు అనే మూర్ఖత్వం, సంకుచితాలు గుదిపాటికి లేవు. అయినా సరే, ఈ అరస, కురస, విరస, నీరస, నోరస రచయితలన్నా, వారి కథలన్నా కాస్త పక్షపాతం చూపేవాడు. వాటిని ఖందించి, వ్యతిరేకించే కథలు వేయటానికి వెనుకంజ వేసేవాడు. ఆయన, వార్తలో వున్నంతవరకూ..ఉత్తమ కథల సంకలనాల్లో వార్త కథలొచ్చాయి. ఆతరువాత ఉత్తమ కథల సంకలన కర్తల రాడార్ నుంచి తొలగిపోయింది. గుడిపాటి పాలపిట్ట పత్రిక నడుపుతున్నాడు. వార్త స్థానన్ని పాలపిట్ట ఆక్రమించింది.
అలాగే, ఆ ఇజానికి చెందినవారికి తప్ప ఇతరులకు తెలియని అరుణతార, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధానికి అనుబంధంలాంటి సారంగ నెత్ పత్రికలలో ప్రచురితమయిన కథలూ సంకలన కర్తల ఎంపికకు నోచుకోవటం గమనించవచ్చు.
దీన్నిబట్టి చూస్తే, ఈ సంకలనకర్తలకు ఎంపికలో కొన్ని పత్రికలలో ప్రచురితమయ్యే కథలకు ప్రాధాన్యం వుందని స్పష్టమవుతుంది. ఇందుకు కారణం కూడా కథలో నాణ్యత, కథల గొప్పతనం కాదని స్పష్టమవుతుంది. ఈ విషయంలో సందేహాన్ని తొలగిస్తాయి రచయితల గణాంక వివరాలు.
రచయితల విషయానికి వస్తే, డాక్టర్ వీ చంద్రశేఖర రావు కథలు 10 వున్నాయి. తరువాత పెద్దింటి అశోక్ కుమార్ కథలు 9, సన్నపు రెడ్డి వెంకట్రామి రెడ్డి, మధురాంతకం నరేంద్ర, కాట్రగడ్డ దయానంద్,ఖదీర్ బాబు కథలు చేరో 7 వున్నాయి. అట్టాడ అప్పల్నాయుడు, కుప్పిలి పద్మ,పాపినేని శివశంకర్, పీ సత్యవతి కథలు చెరో 6 వున్నాయి. ఆర్ ఉమామహేశ్వర రావు, అజయ్ ప్రసాద్, తల్లావజ్ఝుల పతంజలి, సం వెం రమేష్, ఆడెపు లక్ష్మీపతి, కేతు విశ్వనాథ రెడ్డి, స్వామి కథలు చెరో 5 చొప్పున వున్నాయి. అంటే 17 కథకుల కథలు 106 వున్నాయి.
ఈ రచయితలంతా ఒకే రకమయిన కథలు, ఒకే దృక్కోణంలో రాస్తారు. రచయితల ప్రతిభవల్ల కథల్లో రీడబిలిటీ వుండొచ్చు. కానీ, వారి కథలు మొదలుపెట్టగానే అర్ధమయిపోతాయి. దీనికి తోడు పైన ఇచ్చిన రచయితల జాబితాలో ఒకరిద్దరి మినహా అంతా వామపక్ష, అభ్యుదయ భావాల ఉద్యమాల రంగుటద్దాలు ధరించుకున్న విప్లవ సమర్ధకులే.
అంటే, కథలనెంచుకోవటంలోనూ, కథకులనెంచుకోవటంలోనూ ప్రధాన్యం వ్యక్తిగత అభిప్రాయాలకు, ఇజాల సమర్ధనకు తప్ప ప్రతిభకు, కథలోని నాణ్యతకు కాదన్నమాట.
ఇక్కడ నాణ్యతకు కాదు అన్నమాట కొందరికి అభ్యంతరంగా తోచవచ్చు. దీనికీ వివరణ రాబోయే వ్యాసాలలో వుంటుంది. పైన పేర్కొన్న కథకులు ప్రతిభావంతులు. దాన్లో సందేహంలేదు. కానీ, వారి ప్రతిభకు ఇజం తోడవటం బంగారానికి తావి అబ్బినట్టయింది.
ఇంకా వీరివేకాక, తరచు కనబడే కథకులను ఒక్కసారి పరికిస్తే, వోల్గా, చంద్రలత, బమ్మిడి జగదీశ్వర రావు, గొరుసు జగదీశ్వర రెడ్డి, సుంకోజి దేవేంద్రా చారి, దగ్గుమాటి పద్మాకర్, కే ఎన్ మల్లీశ్వరి, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, బెజ్జారపు రవీందర్, విమల, సీ సుజాత వంటి వారంతా ఈ భావజాల సమర్ధకులే. అక్కడక్కడ ఈ భావజాలాన్ని సమర్ధించని కథకులు ఒకరిద్దరు కనిపించినా( శ్రీరమణ, వారణాసి నాగలక్ష్మి లాంటివారు) అది ఏదో పొరపాటు అనుకోవచ్చు.
ఒకే రకమయిన భావజాలాన్ని సమర్ధించే పత్రికలు, ఒకే రకమయిన భావజాలాన్ని సమర్ధించే కథకులు, ఒకే రకమయిన కథలు, ఒకే రకమయిన భావజాలాన్ని సమర్ధించే కథలనే ఉత్తమ కథలుగా భావించే సంకలన కర్తలు…..ఇదీ మన 25ఏళ్ళ తెలుగు కథల్లో ఉత్తమ కథలను ఒక చోట చేర్చి ప్రచురించే సంకలనాల స్వరూపం. ఇలా ఒకే రకమయిన దృక్కోణాన్ని ప్రతిబింబించే కథలు 25ఏళ్ళ సామాజిక చరిత్రకు ఎలా దర్పణం పడతాయి???
ఈ 25ఏళ్ళ కథలు దర్పణం పదితే, అది, నాణేనికి ఒకవైపుకు మాత్రమే…..
నాణేనికి మరోవైపు కూడా వుంతుందన్న ఆలోచన కూడా కలగని రీతిలో సాహిత్య ప్రపంచాన్ని మభ్యపెట్టటం ఈ సంకలనాల అసలు కథ. అది అసలయిన గొప్ప కథ….
కథల విశ్లేషణ తరువాత వ్యాసంలో…

September 13, 2016 · Kasturi Murali Krishna · 2 Comments
Tags: , , , ,  · Posted in: Uncategorized