Archive for October, 2016

25ఏళ్ళ ఉత్తమకథ విశ్లేషణ-9

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనంలో వాడ్రేవు చిన వీరభద్రుడు, బమ్మిడి జగదీశ్వరరావు కథలు చెరో మూడేసి వున్నాయి. వీరిద్దరిలో బమ్మిడి జగదీశ్వరరావు కథకుడేకాక, వామపక్ష ఉద్యమాలతో సంబంధం వున్నవాడు. ఈ సంకలనాలలో కథ ఎంపిక అవటానికి అదొక అదనపు అర్హత!
వాడ్రేవు చినవీరభద్రుడు ప్రధానంగా కథకుడు కాదు. ఆయన కవి. సాహిత్య విశ్లేషకుడు. తాత్విక సాహిత్యం లోలోతుల్లోకి వెళ్ళి అత్యంత నిగూధమయిన రహస్యాలను గ్రహించి ప్రకటించగల సహృదయుడు. సునిషిత అధ్యయనశీలి. ఒకరకంగా చెప్పాలంటే , ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్య విమర్శ గురించి అవగాహన కలిగిన పండితుడు అనవచ్చు. కానీ ఇది ఆయన కథా రచనలో కనిపించదు. కథా రచనలోనూ ఆసక్తి కరంగా ఒక స్థాయివరకూ రచించినా, వాక్యం శుభ్రంగా, భావానికి సంధర్భానికి తగ్గ పదాల కూర్పుతో వున్నా, రచయితకు నిడివి మీద నియంత్రణలేదని, కథా రచనలో ఆరంభం ఎంత ప్రాధాన్యమో ముగింపు అంతకన్నా ప్రాధాన్యమన్న భావన రాహిత్యం ఈ మూడు కథల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.కథా రచయితగా కన్నా, కవిగా, తాత్విక రచయితగా, సాహిత్య విమర్శకుదిగా ఆయన ఉత్తమ సాహిత్యాన్ని స్ర్జించారనవచ్చు.
చిన వీరభద్రుడి కథలు 1990లో సుజాత, 2002లో ప్రశ్నభూమి, 2010లో పాఠాంతరం అనే కథలను సంకలన కర్తలు ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు. సుజాత కథ, 20ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలోనూ వుంది.
సుజాత కథ ఆరంభమే, లాకప్ రూంలో నాపై అత్యాచారం జరిగి ఏడాది కావస్తోంది , అంటూ ఆరంభమవుతుంది. సగం కథ తెలిసిపోవటమే కాదు, సంకలన కర్తలకీ కథ ఎందుకంత నచ్చిందో కూడా అర్ధమయిపోతుంది. సంకలనకర్తలు ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యతిరేకులు. ఈ వ్యవస్థను నిలిపే పోలీసులంటే వారికి పరమ అసహనం. పోలీసులేకాదు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే ఏ వ్యవస్థకూడా వారికి నచ్చదు. వాటిని ఎంత విమర్శిస్తే అంత ఉత్తమ కథ. అందుకే, ఈ కథ ఆరంభ వాక్యం చదవగానే కథ అర్ధమయిపోవటమే కాదు, ఎందుకని సుదీర్ఘమూ, పలు అర్ధంలేని మెలికలు తిరిగే ఈ కథ ఎందుకని ఉత్తమ కథ అయిందో తెలిసిపోతుంది.కథ ఆరంభంలో తనపై జరిగిన అత్యాచారినికి వికలమయిన అమ్మాయి మానసిక స్థిని తెలిపటం వుంటుంది. ఆపై, అమ్మాయి, ప్రగతి శీల, క్రియాశీల శక్తులకు వేదిక అయిన ప్రోగ్రెసివ్ ఫోరం సమావేశానికి వెళ్లాలని అనటంతో, కథ ఉత్తమ కథ ఎందుకయిందో మరో సాక్షం అవసరం లేకుండా తెలిసిపోతుంది. ఆ అమ్మాయి ఎక్కడికీ కదలదు. కానీ, తాను జైల్ లో వున్నప్పుడు తన విడుదలకు ప్రయత్నించిన వారు కాబట్టి వారు ఏర్పాటు చేసిన సమావేశానికి వెల్తుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బాక్ లో సుజాత ఎలా అరెస్టయిందో చెప్తారు. ఆమె, సెలవులకని వూరొచ్చి, సోషియాలజీ లెక్చరర్ సుధాకర్ ని కలవాలని మధ్యాహ్నం మూడింటికి బయలు దేరుతుంది. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు కలసి చేసే ఊరేగింపు ఎదురొస్తుంది. తెలిసిన టీచర్లు కనబడితే మాట్లాడుతుంది. అది చూసి వెయ్యండిరా దీన్ని జీపులో అని పోలీసులు జైలుకు తీసుకువెళ్తారు. ఆమె దగ్గర సుధాకర్ కి రాసిన ఉత్తరం వుంతుంది. దాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిందివుందని పోలీసులు ఆమెని రాత్రికి వుంచేస్తారు. ఇక్కడే కథ బలహీనమవుతుంది. ప్రొద్దున్నే ఉద్యమంలో పాల్గొని పట్తుబడ్డ వారిని సాయంత్రానికల్లా వదిలేశారని అందుకనే సాయంత్రం ఆమె ఒక్కర్తే పోలీసు లాక్ అప్ లో వుందని రచయిత రాశారు. సాయంత్రం కూడా తీవ్రత తగ్గలేదనీ రాసారు. అలాంటప్పుడు సాయంత్రం మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఉద్యమంలో వున్నవారితో మాట్లాడినందుకే ఈమెను అరెస్టు చేసిన పోలీసులు ప్రదర్శన చేస్తున్న వారందరినీ ఎందుకని అరెస్టు చేయలేదు? పైగా ఆమె తండ్రి మునిసిపల్ ఇంజనీయర్ గారి అమ్మాయి. మూడు గంటలకు బయటకు వెళ్ళిన అమ్మాయి, ( అసలు బయట ఉద్యమాలున్నప్పుడు ఇళ్ళల్లోంచి ఆడపిల్లలను బయటకు వెళ్ళనివ్వరు) రాత్రి ఏడుకు ఇంటికి రాకపోతే తల్లితండ్రులు కంగారు పడి ముందుగా పోలీసులను కలుస్తారు. కలిస్తే కథేలేదు. కాబట్టి అత్యాచారం జరిగిన తరువాత మునిసిపల్ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అంటే, రాత్రంతా అమ్మాయి ఇంటికి రాకపోతే ఇంట్లోవాళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఆతరువాత, మొత్తం ప్రోగ్రెసివ్ ఫోరంలూ అందరూ పట్టించుకోవాల్సివచ్చింది. పది రోజులు అమ్మాయి జైల్లో వుంటుంది. అసలు ఉద్యమాలు చేసిన వారిని వదిలేసి అమ్మాయినే పట్టుకుని లాకప్ లో పెట్టటం ఒక అనౌచిత్యం. కనీసం ఉద్యమ నాయకులను కూడా పట్టుకోని వారు, పట్టుకున్నా విడిచేసిన వారు ఈ ఒక్క అమ్మాయినే పట్టుకుని అత్యాచారం చేయటం, అదీ పెద్ద స్థాయి ఉద్యోగంలో వుండి వాళ్ళ నాన్న ఆ రాత్రంతా పోలీసులకు చెప్పకపోవటం కథను కృత్రిమ సినిమాటిక్ సన్నివేశంతో పోలీసుల క్రౌర్యాన్ని చూపి మార్కులు కొట్టేయలన్న తపనను చూపిస్తుంది.
నిజానికి మన పోలీసులు సినిమాల్లో, నవలల్లో అటు జోకర్లుగానో, ఇటు రాక్షసులుగానో కనిపిస్తారు కానీ, వాళ్ళు ఒక్క చూపులో ఎవరేమిటో గ్రహించేస్తారు. ఎవరు నేరస్తులో, ఎవరు కాదో, ఆవలించకముందే ప్రేగులు లెక్కపెట్టి దాన్లో వున్న దోషాలూ చెప్పేస్తారు. ముఖ్యంగా, చదువుకున్నట్టు కనిపించే అమ్మాయితో, ఆమె, ఎలాంటి అసభ్య, అభ్యంతకర ప్రవర్తన లేనప్పుడు, అత్యంత మర్యాదగా ప్రవర్తిస్తారు. అరెస్టయిన అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలు అడగకుండా, తెలుసుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రేపులు చేసేయరు. అలాగని పోలీసు స్టేషన్లలో రేపులు జరగలేదా? అంటే జరిగాయి. కానీ అలా జరగటానికి సరయిన కారణాన్ని ఈ కథ చూపదు. నిజానికి విద్యార్థులు బస్సులను, రైళ్ళను తగలబెడుతూ రెడ్ హాండెడ్ గా చిక్కినా, అరెస్టు చేసి గంట తరువాత వదిలేస్తారు. కాబట్టి, కథలో పోలీసు దౌష్ట్యము, రాక్షసత్వమూ, ప్రోగ్రెసివ్ సంస్థల గొప్పతనమూ స్పష్టంగా రచయిత ప్రదర్సించినందుకే ఇది ఉత్తమ కథ అయింది తప్ప, కథా రచనలో రచయిత ప్రదర్శించిన మెళకువలకో, ఉత్తమ స్థాయి సృజనవల్లనో కాదనిపిస్తుంది. ముగింపుకూడా లేదీ కథకు. తన అనంతర జీవితం ఎలా? అని సుజాత ఆలోచిస్తూంటే కథ ముగుస్తుంది. ఈ కథలో అధిక భాగం ఆలోచనలుంటాయి. ఏరకంగా చూసినా గొప్ప కథ అనిపించదు.
ప్రశ్నభూమి కథ ఒక స్థాయిదాకా అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. మండల రెవెన్యూ అధికారి చంద్రమోహన్ పైన మండలాధ్యక్షుడు రామినాయుడు కేసు పెడతాడు. వాళ్ళ రేషన్ దుకాణం మూసిన తరువాత రాత్రి 8-8.30 మధ్యన వర్షం కురిసే రాత్రి వచ్చి చంద్ర మోహన్, నాయుడు భార్యపై అత్యాచారం చేయాలని ప్రయత్నించాడన్నది నేరారోపణ. దాని మీద కోర్టులో విచారణ జరుగుతూంటుంది. మోహన్ చంద్ర రావు మాట్లాడనంత వరకూ కథ ఆసక్తి కరంగా సాగుతుంది. నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవలన్న ఆసక్తి కలుగుతుంది. రచయిత కథను ఎలా ముగిస్తాడో అని ఆలోచిస్తూ కథ చదువుతూంటాం. మోహన్ చంద్ర మాట్లాడటం మొదలుపెట్టినప్పటినుంచి, కథ గురితప్పుతుంది. ముంబాయి వెళ్ళే రైలు, దారి మళ్ళి, గౌహతి వెళ్తే ఎలావుంటుందో అలా అనిపిస్తుంది కథ పూర్తి చేసిన తరువాత.
మోహన్ చంద్ర, అసలు విషయం విడిచి, ఆవారాలో రాజ్ కపూర్, ఇంకా ఆ మురికి గుడిసెల నడుమ పిల్లలు ఆడుతూనే వున్నారని లెక్చరిచ్చినట్టు ఈ పాత్ర, తన నేపథ్యం, తను ఉద్యోగం సంపాదించటం, ఉద్యోగంలో అందరూ తనకు సేవలు చేస్తూంటే కలిగిన భావాలు, పనిమనుషులు, ఆడపనిమనిషితో సంబంధం, చెప్పుడు మాటలు విని వారిని తరిమివేయటం వంటివి మామూలుగా మరో సందర్భంలో నప్పేవేమో కానీ, ఈ కథను పూర్తిగా దశ దిశను మార్చేస్తాయి. ఈ కథ ఎందుకు ఉత్తమ కథగా ఎంపికయిందని ఆలోచిస్తే, ఈ కథలో వ్యవస్థను విమర్శించటం వుంది. నా ఉద్యోగం నన్ను మనిషిగా నశింపచేసి ఒక లైంగికావయవంగా మారిందని స్టేట్ పై నేరం నెట్టటం వుంది. రాజ్యాంగాన్ని, రాజ్య పరికరాలయిన ఆఫీసర్లను దోషులుగా నిలపటం వుంది.వ్యవస్థను విమర్శిస్తూ, దీన్ని కూల ద్రోయాలని ఉద్యమం చేసే వారిలో ఒకరయిన సంపాదకులకు కథతో కన్నా, రచయిత చూపిన వ్యవస్థ వ్యతిరేకత ప్రాధాన్యం అయి, ఔచిత్యాలు, అనౌచిత్యాలు, ఉపన్యాసాలు పక్కనపెట్టి దీన్ని ఉత్తమ కథగా నిర్ణయించటంలో ఆశ్చర్యం లేదు. ఇంతకీ, కథ పూర్తయినా ఆరోజు ఏమి జరిగిందో తెలియదు. రచయిత కేసు ఏ విధంగా డిస్పోస్ అయిందో అప్రస్తుతం అంటాడు కానీ, కథకు అదే ప్రస్తుతం . తుపాకీ కనిపిస్తే, అది పేలటమో, లేక కనీసం దాని గురించి చివరలో తెలియటమో, ఏదో ఉపయోగం వుండటమో కథా రచనలో మౌలిక సూత్రం. ఆ సూత్రాన్ని విస్మరించి, అసలు విషయం చెప్పకుండా వ్యవస్థని తిట్టి, మాజిస్ట్రేట్ గారి అమ్మాయితో మోహన్ వివాహం అయిందని కథ ముగించటం, ఫెయిలయిన వ్యంగ్యం.
కథగా, పాఠాంతరం కాస్త మెరుగనిపించినా, రచయితలోని పండితుడు కథనాన్ని డామినేట్ చేయటం, మళ్ళీ ముగింపు అసందిగ్ధంగా వుంటుంది. ఒక పత్రిక ఎడిటర్ దగ్గరకు ఒక స్కూలు యజమాని కొడుకు వస్తాడు. విదేశాల్లో వుంటాడీయన. వారిద్దరూ హాంలెట్( షేక్ష్పియర్ నాటకం) గురించి చర్చించుకుంటారు. హాంలెట్ అసలు తప్పు ఘోరాన్ని ఆపగలిగి ఆపలేకపోవటం అని తీర్మానిస్తారు. ఇంతకీ , అసలు విషయం ఏమిటంటే, వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయిని క్లాస్ మేట్స్ వేధిస్తున్నారని ఎడిటర్ కు ఫోన్ కాల్స్ వస్తూంటాయి. ఆ విషయం చెప్తాడు. ఆ తరువాత మళ్ళీ కాస్త చర్చ తరువాత, మా సస్థ రెప్యుతేషన్ పాదు చేయాలన్న పని ఇది అంటాడా యువకుడు. చివరికి ఆ అమ్మాయి మీద ఏసిడ్ దాడి జరిగిందని తెలుస్తుంది. అప్పుడు ఎడిటర్ హాంలెట్ లాగా ఫీలయిపోతాడు. చిన్నప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చి టాయ్లెట్ కి వెళ్ళాలంటే వెంట వచ్చిన ఇక్బాల్ గుర్తుకొస్తాడు.ఇక్బాల్ నువ్వెక్కడున్నావు? అనుకోవటంతో కథ ముగుస్తుంది.
నిజానికి , ఈ కథ ఉత్తమ కథ ఎలా అయిందో అర్ధం కాదు. ఎడిటింగ్ అవసరమయిన కథ ఇది. ఆరంభంలోని మూడు పేజీల చర్చను ఒక్క ముక్కలో చెప్పవచ్చు. హాంలెట్ గురించిన సుదీర్ఘమయిన చర్చ లిటరేచర్ విద్యార్ధులకు ఉపయోగ్గపడవచ్చు. అదంతా తీసేసి తిన్నగా నిన్నెందుకు పిలిచానంటే తో ఆరంభమయితే ఒక్క పేజీలో కథ అయిపోతుంది. ఇంతకీ ఎడిటర్ అంతగా గిల్టీ ఫీలవటం అంతగా నప్పదు. స్కూలు యాజమాన్యానికి తెలిపాడు. అతని బాధ్యత అయిపోయింది. నిరాధారమయిన వార్తలు పత్రికలో వేస్తాడా? టెలీఫోనుల సంగతి పోలీసులకు చెప్తే, వారూ యాజమాన్యానికే తెలియచెప్పేవారు. ఇంతకీ, కరప్షన్ అనీ, ఇక్కడ ఉండాలనిపించటంలేదనీ అని, హాంలెట్ గురించి అంత మాట్లాడిన యువకుడు సాధించిందేమిటి? ఈ కథలో హాంలెట్ ఆ యువకుడే. సమాచారం అందుకుని, పరిశోధించి సరయిన నిర్ణయం తీసుకోకుండా, ఇంత అనర్ధం కానిచ్చింది అతడు. కాబట్టి, ఎడిటర్ కాదు, ఆ యువకుడు బాధపడాలి. కథలో చివర్లో అతడి ప్రసక్తే లేదు. స్కూలు రెప్యుటేషన్ గురించి ఆలోచించే అతడు, తమ స్కూలు విద్యార్థినిపై ఏసిడ్ దాడి అవనిచ్చాడంటే అది అతని వైఫల్యం. స్కూలుకు చెడ్డ పేరు. మరి కథ ఏం సాధించింది? కనీసం ఇది వేరే స్కూలు వాళ్ళ కుట్ర అని తేలిస్తే, స్కూళ్ళ నడుమ పోటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని చూపించిన కథ అనుకోవచ్చు. ఇంతకీ, ఎడిటర్ సరయిన నిర్ణయం తీసుకోలేకపోవటానికి, అతని ఇక్బాల్ అనుభవానికి సంబంధమేమిటి?
ఈ మూడు కథలు ఈ రచయిత ఉత్తమ కథలయితే, కథా రచయితగా కన్నా, విమర్శకుడిగా, వ్యాస రచయితగానే ఈ రచయితను గుర్తించటం ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ కథలను ఉత్తమ కథలుగా ఎన్నుకోవటంలో సంపాదకులు కథ, కథనం, ఔచిత్యం కన్నా, వేరే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తూనేవుంది.
బమ్మిడి జగదీశ్వర రావు కథల విశ్లేషణ రాబోయే వ్యాసంలో….

October 28, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథల విశ్లేషణ-8

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనంలో పాపినేని శివశంకర్ కథలు 6 ఉన్నాయి. ఈ సంకలనానికి ఈయనకూడా ఒక సంపాదకుడు. ఇది, సంపాదకుడు తన కథనే ఉత్తమ కథగా ఎంచుకోవచ్చా? అన్న ప్రశ్నకు దారి తీస్తుంది. ఎంచుకోవచ్చనేవారున్నారు, ఎంచుకోకూడదనేవారున్నారు. పత్రికలు పోటీలుపెట్టి, ఆ పత్రికలో పనిచేసేవారు కానీ, వారి బంధువులుకానీ పోటీలో పాల్గొనేందుకు అర్హులు కాదని అనేవారొకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. పత్రికలలో పోటీలు పెడితే, జడ్జి స్థానంలో వున్నవారితో ప్రొద్దస్తమానమూ తిరిగేవారికే గర్వంగా అవార్డులిచ్చేసుకునే కాలం ఇది. conflict of interest అన్న పదం అన్నది వ్యాపారానికేకానీ సాహిత్య వ్యాపారానికి కాదు అన్నది స్థిరపడిన కాలం ఇది. కాబట్టి ఎడిటర్ స్థానంలో వుండి తన కథలను ఉత్తమ కథలుగా ఎంచుకోవటాన్ని నిరసిస్తూనే ఆమోదించాల్సి వుంటుంది.
పాపినేని శివశంకర్ కథలు, 1990లో ఇప్పుడూ-ఇక్కడా, 1995లో చింతలతోపు, 1998లో సగం తెరచిన తలుపు, 1999లో మనుషులు వదులవుతారు, 2004లో చివరి పిచ్చిక, 2007లో సముద్రం అనే కథలను ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు. ఎవరు? ఆయనే!
ఇప్పుడూ ఇక్కడా మామూలుగా మనకలవాటయిన కథ. నీలిమ అనే పాపకు తండ్రి పెద్దగా కష్టపడకున్నా డబ్బులు సంపాదించేయటం రిక్షాలో అమ్మాయిని స్కూలుకు తీసుకెళ్ళే కన్నయ్యకు ఎంత కష్టపడ్డా డబ్బులెందుకుండవో అర్ధం కాదు. పైగా, వాళ్ళు ప్రతి విషయానికి నువ్వు పెద్దగయ్యాక అనటం ఆ పాపకి నచ్చదు. ఆమె వేసిన బొమ్మకు బహుమతి వస్తే తల్లి తండ్రి పట్తించుకోరు.వారు కొన్న లాకెట్ గురించి ఆలోచిస్తూంటారు.
అమ్మ నాన్న ఎంతసేపటికి నన్నుగాక నా భవిష్యత్తునే పట్టించుకుంటారు. అన్నీ డబ్బుకు సంబంధించిన ఆలోచనలే. డబ్బునే కోరుకునేవారు మనుషుల్ని ప్రేమించలేరు కదూ? ఈ మనుషుల మాటల్లో, చేష్టల్లో ఎక్కడో భలే ఆబద్ధం వుంది మామయ్యా! నిన్ను మరీ మరీ చూడాలనిపిస్తోంది. నువ్వు రావా? అంటూ ఉత్తరం రాయటంతో కథ ముగుస్తుంది.
మామూలు కథ ఇది. ధనవంతుడు పేద రిక్షావాడికి డబ్బులివ్వకపోవటం, వాడి డగ్గర డబ్బులు మూల్గుతూండటం, కూతురు సెన్సిటివ్ అవటం, ఆమెను పెద్దలి ఇగ్నోర్ చేయటం…ఈ కూతురే యుక్తవయస్య్దైతే, ఇది యద్దనపూడి మీనా నవలకు నకలు తయారయ్యేది, కాస్త ప్రేమ ఎలిమెంట్ జోడిస్తే! కానీ, ఇది అభ్యుదయ భావాల కథ కదా! కాబట్టి తల్లితండ్రుల డబ్బు బాధ ను విమర్శిస్తే ఉత్తమ సీరియస్ కథ అయిపోతుంది. అయితే, ఈ కథ చివరలో పాప మామయ్యకు ఉత్తరం రాస్తుంది. నిన్ను చూడాలంటుంది. ఈ మామయ్య ఎవరు? అతనికి డబ్బు బాధ లేదా? ఏ రకంగా పాప తన వారికన్నా, ఆ మామయ్యను మంచి అనుకుంటోంది? ఇవన్నీ, సమాధానం లేని ప్రశ్నలు. ఎందుకంటే, ఈ కథలో చివరి వాక్యంలో తప్ప, ఆయన ప్రసక్తి ఎక్కడా రాదు. హీరోయిన్ కొండ అంచునుంచి దూకేసమయానికి వెనుకనుంచి ఒకచేయి వచ్చి లాగినట్టు హఠాత్తుగా వచ్చేస్తాడీ మామయ్య కథలోకి. వస్తు పరంగా, వ్యక్తీకరణ పరంగా ఏమాత్రం కొత్తదనం లేని ఈ కథను సంపాదకుడు ఉత్తమ కథ( కాకి పిల్ల కాకికి ముద్దు) అనుకోవటం సహజం కదా!
చింతలతోపు కథ గురించి గతంలో ప్రస్తావించుకున్నాం. పొగాకు రైతులు, ప్రభుత్వ నిర్ణయాలు, వానలు పదకపోవటం వగైరా.వగైరాల మామూలు అలవాటయిన అభ్యుదయ ఉత్తమ మూస కథ ఇది.
రామకృష్ణ ఓ సబ్ ఎడిటర్. రొటీన్ జీవితం. అతగాడు ఊరెళ్తాడు. అక్కడ గతంలోని స్వేచ గుర్తుకువస్తుంది. స్నేహితులందరితో కలసి బట్టలిప్పి నీళ్ళల్లో దూకుతాడు. ఏమీలేని అత్యుత్తమ కథ ఇది. భార్య అసంతృప్తితో ఆరంభమవుతుంది కథ. మొదటి పేరా చదివి ఇది pre mature ejaculation కు సంబంధించిన కథేమో అనుకుంటాం. ఆయన సాహిత్య పేజీ ఇంచార్జి, కానీ ఎడిటర్ చెప్పిన వారి కవితలు వేయాల్సి వస్తుంది. ఇది చిరాకు. ఈ కథ 1998నాతిది. అప్పటికే సాహిత్య పేజీ ఇంచార్జీలు ఆ పేజీని సాహత్య పేజీలా మార్చి తమవారిని, తమకు లాభాలున్నవారి బాకాపేజీలా, ప్రచార కరపత్రంలా సాహిత్య పేజీని మార్చేశారు. రైతుల ఆత్మహత్యల గురించి కవితలు వేస్తూ ఇంకో ప్రాబ్లం గురించి కవిత వేయమనగానే నిరాశకు గురవటం, టిపికల్, అభ్యుదయ ఆదర్శ వామపక్ష మైనారిటీ లౌకికవాద సబ్ ఎడిటర్ లక్షణం. రచయిత ఈ కథలోనూ ఆ లక్షణాన్ని చూపారు.
మూడు దశాబ్దాలనాతి బాణీ, అంత్యప్రాసలు, ఏళ్ళ తరబడి కవులు వాడీ వాడీ అలసిపోయిన మాటలు అంటూ సాంప్రదాయ పద్యాలను ఈ సడిస్తాడీ రచయిత. అందుకే ఉత్తమ కథ అయిందిది. కానీ, ఈ నాటికి సాంప్రదాయ పద్యాలు చదివి మైమరచిపోయేవారే అధికం, ఆధునిక మాటల పేరాగ్రాఫుల మూటల, చచ్చుపుచ్చు వచన రచనల కవితలకెవ్వరూ స్పందించటంలేదన్న నిజం రచయితకు తెలుసో లేదో..కవులందరికీ తెలుసు. అయినా, ఇది ఊతమ కథ అయింది, ఎలాంటి మెరుపులు లేకున్నా!( కాకి పిల్ల కాకికి కాక ఇంకెవరికి ముద్దు?)
మనుషులు వదులవుతారు అన్నది మరో సగటు మామూలు మూస కథ.
వయసయి పోతున్న చక్రపాణికి భార్య కన్నా, మరో అమ్మాయి అందంగా కనబడుతుంది. ఆమె మొదటి భర్తతో వేరుపడుతుంది. చక్రపాణిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అతనితో వూరు వస్తుంది. కానీ, అతను సెక్స్ కోసమే తనవెంటపదుతున్నాడని గ్రహించి పొమ్మంటుంది. ఇదీ కథ…బాగుందనేవాళ్ళ అభిరుచి వాళ్ళది..( కాకి పిల్ల కాకికే ముద్దు)
కాస్త విభిన్నంగా కథ చెప్పాలన్న ప్రయత్నం చివరి పిచ్చిక కథలో కనిపిస్తుంది. మానవుడి చర్యల వల్ల పిచ్చుకలజాతి అంతరించటాన్ని చూపాలని ప్రయత్నం చేస్తూ, పర్యావరణ కాలుష్యాన్ని పనిలో పనిగా చూపించారు రచయిత. మామూలుగా అయితే, అప్పుడప్పుడే కథలు రాస్తూన్న రచయిత తడబడే బుది బుడి అడుగుల ప్రయత్నమీ కథ అనుకునేవాళ్ళం. కానీ, ఇది ఆయేటి ఉత్తమ కథ!( కాకి పిల్ల కాకికి ముద్దు)
ఈ ఉత్తమ కథల సంకలనంలో ఎంపికయిన పాపినేని శివశంకర్ కథలలో ఏమాత్రమయినా కాస్త బాగున్నదనిపించే కథ సముద్రం. కొన్నేళ్ళుగా కథలు రాస్తూవుంటే రచయిత పరిణతి సాధిస్తాడు. ఈ కథారచనలో కొంతయినా కథారచన సంవిధానంలో రచయిత ఒక అడుగు ముందుకువేశాడు అనిపిస్తుంది ఈ కథ చదివిన తరువాత.
సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి అంటూ ఆరంభమయ్యే ఈ కథ వనమాలి అనే వ్యక్తి జీవిత గమనాన్ని చూపుతూ, దేనికీ చలించని వ్యక్తిత్వాన్ని చూపుతూ, చివరికి అతను మరణించినప్పుడు, చుట్టూ వున్న పుస్తకాలని చూస్తూ, రచయిత సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి అనుకోవటంతో ముగుస్తుంది. rounded off story ఇది. మనకు వనమాలి పాత్రపైన ఎలాంటి అభిమానం, జాలి, అనుబంధం కలగదు. రచయిత రచన అలా అంటీ ముట్టనట్టు matter of fact లా వుంటుంది. కానీ, కథను రౌండ్ ఆఫ్ చేసిన విధానం బావుంది. అందుకని, కాకి పిల్ల చిన్నతనంలో ముద్దుగా వుంటుంది, అందరికీ కాకపోయినా, కొందరికి అనుకోవచ్చు.
వచ్చే వ్యాసంలో రిపీట్ కథకులు వాడ్రేవు చినవీరభద్రుడు, బమ్మిడి జగదీశ్వరరావు కథల విశ్లేషన వుంతుంది.

October 25, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ వుత్తమ కథ విశ్లేషణ-6

ఫార్ములా సినిమాలని ఒక మాట వింటూంటాం. అది కథలకూ వర్తిస్తుందని 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో రిపీప్త్ కథకులిద్దరుముగ్గురి కథలు చదవగానే అనిపిస్తుంది. ఫార్మూలా సినిమాలు సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అందరూ అదే ఫార్మూలాను అనుసరించేట్టు, రచయితలు ఏదయినా కొత్త ఆలోచన చెప్తే ప్రేక్షకులు ఆమోదించరని ఫార్మూలానే అనుసరించమనేట్టు, ఈ ఉత్తమకథల సంకలన కర్తలుకూడా బాగున్నా, బాగాలేకున్నా ఇదే ఉత్తమకథల ఫార్మూలా అని రచయితలు, పాఠకులు, సాహిత్య డింపతుల మెదళ్ళనూ వాష్ చేసినట్టు ఈ కథలు నిరూపిస్తాయి. ముందుగా, మొదటి సంకలనంలోని రిపీట్ కథకుడు స్వామి కథలను పరిశీలిద్దాం. ఈయనవి మొత్తం 5 కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. 1990లో అద్దం, 1991 లో వానరాలె, 1996లో నదఖ, 2003లో తెల్లదయ్యం అను గ్రామ వివక్ష కథ, 2009లో రంకె అనే అయిదుకథలు ఈ రచయిత ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
కథ అన్నదానికి కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాల పరిథిలో రచయితలు అనేకానేక ప్రయోగాలు చేస్తారు. ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. కానీ, పద్ధతి ఏదయినా, కథ ఆసక్తి కరంగా వుండాలి. ఆలోచనలు కలిగించాలి. మానవ జీవితంపైనా, మనస్తత్వంపైనా, సమాజంపైనా అవగాహన కలిగించాలి. పైగా, అందరికీ అర్ధం కావాలని మనం భాషనే సులభతరం చేసుకున్నాం. ఏది మాట్లాడితే అదే రాయాలనుకుంటున్నాం. కాబట్టి, ప్రయోగం ఎలాంటిదయినా అది అందరికీ అర్ధం అయ్యేట్టుంటేనే దానికి సార్ధకత.
స్వామి కథ అద్దం కథనా, వ్యాసమా, ఒక చమత్కార భరిత శీర్షికలోని ఒక ఐటమా? అన్న ప్రశ్న వస్తుంది. ఇదొక ఆలోచన. ఆలోచనను కథగా మలచటం ఈ ఉత్తమ కథగా ఎంపికయిన కథలో కనబడదు. లోకమొక అద్దం అన్న అంశం ఆధారంగా రచించిన ఒక వ్యాసం అనవచ్చీకథను. ఈ ఆలోచనలు కూదా ఒక లాజిక్, ఒక ఔచిత్యాన్ని పాతించవు. ముందు అద్దం లోకం అంటూ ఆరంభమవుతుందీ ఆలోచన( దీన్ని ఎవరయినా ఆలోచనా స్రవంతి అని సమర్ధిస్తారేమో..ఆలోచనా స్రవంతిలోనూ సంఘటనలుంటాయి. దీన్లో అదీ లేదు. ) ఇంతకీ, ఈ ఆలోచనాత్మక వ్యాసం ద్వారా రచయిత ఏమి చెప్పాలనుకుంటాడంటే, ఈ ప్రపంచం మనపై ముద్రలు వేస్తుందనీ, మనం మన ఇష్టానుసారంగా కాక, సమాజంలొ ఇతరుల అభిప్రాయాల ప్రకారం బ్రతుకుతామని, మనిషి సమాజంవైపు కాక, తనలోకి తాను చూసుకోవాలనీ చెప్తుందీ ఉత్తమ కథ అయిన వ్యాసం. భవిషయత్తులో పలు సంకలనాల్లో ఇలాంటి ఉత్తమ కథలయిన వ్యాసాలు కనబడతాయి. వాటికి దారిచూపిందే అద్దమే..
ఉన్నదున్నట్టు చూపిస్తే వార్త అవుతుంది. ఉన్నదానికి ఊహలను జోడించి, నాటకీయంగా చెప్తే కథ అవుతుంది. వాడు బస్సెక్కాడు. బస్సులో సీటు దొరకలేదు. ఒకదు బీడీ కాల్చాడు. ఒకడు పాట పాడాడు. ఎండ మండిస్తోంది. చెమట కారుతోంది. నేను దిగే స్టాపు వచ్చింది. దిగాను…ఇది రిపోర్టింగ్. కథ కాదు. కానీ, నేను అనుభవించిందే రాస్తాను. అనుభవించనిది రాయలేను అని కొందరు రచయితలు తమ రిపోర్టుల్లాంటి కథలను self righteous గా సమర్ధించుకుంటారు. వానరాలె అలాంటి సమర్ధన అవసరమయిన కథ. వానలు రావు. రైతు ఒక పంట వేయాలనుకుంటాడు. డబ్బులుండవు. ఇంట్లో ఖర్చులుంటాయి. అప్పులుంటాయి. విత్తనాలకు డబ్బులుకావాలి. ఎలాగో విత్తనాలు తెస్తాడు. వాన వస్తుందని చెప్తే ఒక పంట బదులు మరో పంట వేస్తాడు. వాన రాదు. దాంతో ఆ పండిన ఏదో పంటను..ఎంతకో అముకుని మరిన్ని అప్పులు చేస్తాడు. వచ్చేసారికి ఏ పంట వేయాలా అని ఆలోచిస్తాడు. అప్పటికీ వాన రాదు. ఒక ఆర్ట్ ఫిల్మ్ లా వుంటుందీ కథ.
1995లో ఉత్తమ కథగా ఎంపికయిన మరో రిపీట్ కథకుడు, ఈ సంకలనానికి ఒక సంపాదకుడు అయిన పాపినేని శివశంకర్ కథ చింతలతోపు దాదాపుగా ఇదే కథ. స్వామి కథ ఆర్ట్ ఫిల్మ్ లా వుంటుంది. పాపినేని కథ కమర్షియల్ ఫార్మాట్ లోని ఆర్ట్ ఫిల్మ్ లా వుంటుంది. ఆ కథ ఒక పిల్లవాది చదువు, పెద్దల పంటలు పండించాలనే విఫల ప్రయత్నాలు ఆల్టెర్నేట్ గా చూపిస్తుంది. ప్రభుత్వం పొగాకు పంట వేయమంటే అది వేస్తాడు. ధర తగ్గి నష్టపోతాడు. దాంతో చింతలతోపు కొట్టి వచ్చేసారికి పత్తి వేదామనుకుంటారు. తమ నష్టానికి ప్రభుత్వం బాధ్యత అంటారు. ఇదీ ముగింపులేని కథ. సినిమాలో ఒక సీనులాంటిది స్వామి కథ అయితే, రెండు మూడు సీన్లు ఈ కథ. రెండూ ఒకే అంశం చెప్పినా, భిన్నంగా చెప్తాయి. పాపినేని శివశంకర్ కథ ముగింపు కాని కథగా వుంటే, స్వామి కథ ముగింపులేని డాక్యుమెంటరీగా వుంటుంది. ఇంకా ఇలాంటి కథకని కథలవ్యధలు ఈ 25ఏళ్ళలో బోలెడున్నాయి. ఆయా సంధర్భాలలో వాటిని ప్రస్తావించుకుందాం.
స్వామి మూడో కథ నడక కూడా కథకు తక్కువ, వ్యాసానికి ఎక్కువలా వుంటుంది. కథ ఏకసూత్రంగా సాగదు. ఎటో ఎటో పోతుంది. పల్లెవాతావరణం చూపితే ఉత్తమ కథ అన్న ఫార్మూలా( ఇది అందరు రచయితలకూ వర్తించదు. ) అనుసరించి, మల్లయ్య డబ్బుల్లేకుండా పేటకు పోయి ఏవేవో చేయాలనుకుంటాడు. ఒకప్పుడు అని రచయిత జొరబడి నాగరికతా వ్యామోహం గురించి స్లోగన్లలాంటి వాక్యాలు చెప్తాడు. బస్సెక్కగానే మళ్ళీ ఫ్లాష్ బాక్ లోకి పోతాడు. కూలీలు చేయటం, కష్టాలు, అప్పులు, జబ్బులు వగైరా, వగైరాలు సాగుతాయి. అటునుంచి వూళ్ళో బోయోళ్ళు కమ్మల కులాల వరిరం వైపుకు మళ్ళుతుంది కథ. అటునుంచి బస్సులేని కాలంలో వూరి ప్రశాంతత గురించి మరో లెక్చరుంటుంది. అటునుంచి మళ్ళీ వూరి వర్ణన. బస్సు నాయుడి కోసం ఆగిపోతే, దాని వర్ణన. మల్లయ్య నాయుడిని తిట్టుకోవటం, అతడు చేసిన మోసాలను తలచుకోవటం వగైరా వగైరాలుంటాయి.అక్కడినుంచి మళ్ళీ కూలీల పద్ధతిలో మార్పులు, మారిన జీవన విధానాల సమాచారం ఆలోచనల రూపంలో అందుతుంది. తక్కువ కులాల పిల్లలు ఫాషన్లు, నాయుడు దౌర్జన్యాలు వగైరా, వగైరా…మళ్ళీ నలభై యేళ్ళ క్రితం —ఫ్లాష్ బ్యాకూ….అటునుంచి సినిమాచూసి డబ్బుల్లేకున్నా, తాగాలని నిశ్చయించుకుంటాడు. అతనికి ఒక ఫ్రెండ్ కలుస్తాడు. వాడు నాయుడు వ్యతిరేకి అయిన రెడ్డి క్యాంపు మనిషి..ఇక్కడనుంచి రెడ్డి క్యాంపు, వాళ్ళ గొడవల సమాచారముంటుంది. చివరికి మన మల్లయ్య ఆ రెడ్డి క్యాంపులో చేరి తన వూరికి బాంబులు తీసుకుపోవటంతో ” పల్లెనుంచి పట్నానికి, పట్నం నుంచి పల్లెకి ఒక కలగాపులగపు కొత్త రాజకీయ సంస్కృతిని విస్తరింపచేస్తున్న యాంత్రిక సూత్రం లాగా మల్లయ్య గ్రామానికి పోయే బస్సు సిద్ధంగా వుంది” అంటూ కథ ముగుస్తుంది. ఈ కథ, ఇది తిరిగే పాముల మెలికల్లాంటి పల్లె మార్పుల సమాచార మెలికలు చదివి కథ ముగింపు చూసిన తరువాత…పాఠకుడు తెలుగు కథను వదిలి ఎంత దూరం పారిపోతాడంటే, రచయితలు తమ పుస్తకాలను తామే అచ్చువేసుకుని వీధుల్లో నిలబడి ఫ్రీగా ఇస్తామని పిలిచినా, పొయ్యిల్లోకి కట్టెలులేకున్నా సరే ఎవ్వరూ ఫ్రీ కాపీకూడా తీసుకోనంత దూరం పారిపోతారు. ఇలాంటివన్నీ ఉత్తమ కథలవటంతో, ఇవే ఉత్తమ కథలని రంగుటద్దాల భట్రాజ విమర్శక డింపతులంతా తీర్మానించి వేదికలెక్కి 25ఏళ్ళుగా అరచి చెప్తూండటంతో ఇవి ఉత్తమ కథలయాయి. సంకలనాలు మిగిలాయి. పాథకులు హుష్ కాకి!!!
తెల్లదయ్యం కథ దాదాపుగా ఇలాంటిదే. కాస్త విభిన్నంగా చెప్పాలని రచయిత ప్రయత్నించటం తెలుస్తుంది. దీన్లో అన్నీ మాయమయిపోతూంటాయి. మాయమయినవన్నీ మిల్లుల్లో తేలుతూంటాయి. ” నీ గ్రామంలోని సంపద నీ గ్రామంలో కాకుండా మరెక్కడో చదువులై, ఉద్యోగాలై, పరిశ్రమలై, కళలు, రాజకీయాలుగా మారుతున్నంత కాలం నీకూ నీ పల్లెకూ ఈ మాయ రోగం తప్పదు. మేలుకో! తిరగబడు! నీ శత్రువును నువ్వే కనుక్కో!” అన్న సందేశం వస్తుంది. ఇంతలో సముద్రానికవతలనుంచి ఎగిరొచ్చిన తెల్లదయ్యం జనాలను భయభ్రాతుల్ని చేస్తుంది. వేట కొడవలితో తెల్లదయ్యాన్ని నరకుతాడు. బండ్లు తరలిస్తున్న రెడ్డిని బెదిరిస్తాడు. అదీ కథ. కథను కొత్త రకంగా చెపాలని ప్రయత్నించినా కొత్త దనం లేని కథ ఇది. పైగా, ఇక్కడ ఎవరు శత్రువులు? ఎవరి మీద తిరగబడాలి? రెడ్డి ప్రతీకగా వున్నా, కథలో రచయిత వాదిన పదజాలం పల్లెలనూ పట్నాలనూ శత్రువులుగా వేరు చేసి చూపిస్తుంది. సమాజంలో ఏవయినా మార్పులుంటే రచయిత అన్నవాదు, ఇతరులకన్నా భిన్నం కాబట్టి, ఆ మార్పులను అవగాహన చేసుకోవాలి. పరిణామాల ప్రభావాన్ని గ్రహించాలి. ఆ అవగాహన, గ్రహింపు ద్వారా ప్రజల భయాలను, సంకుచితాలను తొలగించి వారికి మార్గదర్శనం చేయాలి. రచయిత కూడా సామాన్య ప్రజలలాగే ఆవేశ కావేషాలకు గురయి చంపండి, కొట్టండి, నరకండి అంటే, ఇక సమాజానికి మార్గదర్శనం చేసేదెవరు? అందుకే, దీపం పురుగులు మాడిపోయేందుకు దీపంవైపు పరుగులు తీసేట్టు సమాజం గుడ్డిగా సంకుచితాలకు, ద్వేషాలకూ పెద్దపీట వేసి తానున్న కొమ్మక్రింద నిప్పుపెట్టుకునే మూర్ఖుల్లా ప్రవర్తిస్తోంది. మార్గదర్శనం చేయాల్సినవారే గమ్యం దిశలేకుండావుంటే ఇలాగే వుంటుంది. ఏరకంగానూ, ఈ కథను ఉత్తమ కథగా పరిగణించలేము. మిగతా కథలతో పోలిస్తే, సగం వరకూ ఆసక్తిగా అనిపిస్తుంది. రచయిత ఊహ మెచ్చుకోవాలనిపిస్తుంది.
ఈ రచయిత మరో కథ రంకె మిగతా కథల ఫార్మూలానే అనుసరిస్తుంది. అయితే ఇంతకు ముందు కథలో మాయమవటం వుంటే, దీన్లో యాగంటి బసవయ్యను విప్లవానికి ప్రతీకగా వాడటం కనిపిస్తుంది. అయితే, ఈ ప్రతీక ఔచిత్యానికి ఒదగదు. ఈ కథలో అభినందించాల్సిన విషయం ఏమిటంటే, ఆత్మ హత్యలను గ్లోరిఫై చేసేబదులు రచయిత ఆత్మహత్య వ్యర్ధమనీ, అర్ధంలేనిదనీ చెప్పాలని ప్రయత్నించటం. చివరలో ఒక పెద్ద వ్యాసంలాంటి విమర్శ వుంటుంది. మళ్ళీ ఇది కథ అని గుర్తొచ్చి, ఆత్మహత్య చేసుకున్న రైతు రాతిగిట్టెలున్న దూడగా పుట్టటంతో కథ ముగుస్తుంది.
గమనిస్తే, ఉత్తమ కథలుగా ఎంపికయిన అయిదు కథలూ దాదాపుగా ఒకే పరిథిలో తిరగటం తెలుస్తుంది. అద్దంలోని ఆలోచనలు, రంకె దగ్గరకు వచ్చేసరికి ప్రతీకలుగా ప్రదర్సించే స్థాయికి రచయిత పరిణతి చెందటం కనిపిస్తుంది. కానీ, అన్ని కథల్లో రచయిత ప్రదర్సించిన అంశం ఒకటే… నిరాశా నిర్స్పృహలు తప్ప, ఒక defeatist depressive mentality తప్ప మరొకటి కాదు.
పల్లె వాతావరణాన్ని చూపించాయి కాబట్టి ఉత్తమ కథలు, పల్లెల్లో రెడ్ది, నాయుడు గొడవల్లో నలిగే ఇతర కులాల వారి పరిస్థితి చూపించాయి, రైతుల దుస్థితి చూపించాయి అని సమర్ధించుకుంటే ఒక నమస్కారం. కానీ, కథా రచన సూత్రాలు, నియమాలూ ఆధారంగా ఒకో కథని తీసుకుని విశ్లేషిస్తే, ఈ కథలు నిరాశను పెంచటమే కాదు, సమాజంలో విద్వేష భావనలు కలిగించి ఒక negative ఆలోచనకు దారి తీస్తాయని అనిపిస్తుంది.
తిరగబడాలి..ఎవరి మీద? కొడవలి తో నరకాలి. ఎవరిని? ఏదో ఒక గుంపులో చేరి బాంబులేయాలి. ఇదేనా కథల సారం? రాజకీయ నాయకులు దుర్మార్గులు. సరే, దానికి చంపటమో, రంకెలేసి తన్నటమో పరిష్కారమా? అది పరిస్థిని మారుస్తుందా?
ఒక కథలో మల్లయ్య బాంబులు తీసుకుని వూరెళ్తాడు. అది పరిష్కారమా? అలాగే జరుగుతోంది. అలాగే రాశాను..అన్నది సమాధానం కాదు. అలాగే రాస్తే అది వార్త అవుతుంది. ఆ పరిస్థితిలోంచి ఎలా బయటపడల్లో సూచించటం రచయిత పని కాదా? గాడ్ ఫాదర్ లాంటి రచనలోనే రచయిత మాఫియా ఫామిలీ నెమ్మదిగా సమాజంలో మంచి స్థానం సంపాదించటంకోసం మాఫియా పనులు మానేసి గౌరవ ప్రదమయిన వ్యాపారం చేయాలని ప్రయత్నించటం చూపుతాడు రచయిత. అలా జరగకపోవచ్చు. కానీ, ఒక మంచి ఆలోచన ప్రదర్సించటం అభిలషణీయం కదా? అబసవయ్య రంకెలేశాడు. ఏమవుతుంది? ఎవరు నాశనమవుతారు? ఏం ఒరిగింది? ఇలాంటి ప్రశ్నలకు తావు లేకుండా చక్కని ఆలోచనలు కలిగించి మార్గదర్శనం చేసేవే ఉత్తమ కథలు. కేవలం దుర్భర పరిస్థితులు, పల్లెల్లో మార్పులు చూపించి ఆవేశాలు రగల్చటం ఉత్తమం కాదు. అలాంటి కథలు ఉత్తమ కథలు కావు. అలా ఎవరయినా భావిస్తే, వారు కథా రచన గురించి క్లాసులు అటెండ్ చేయాల్సివుంటుంది.
వచ్చే  రిపీట్ కథకులు కేతు విశ్వనాథ రెడ్డి, పాపినేని శివశంకర్ కథల విశ్లేషణ వుంటుంది.
 
Murali Krishna Kasturi
Write a comment…

October 11, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమకథల విశ్లేషణ-5

నేను కథకు సాంవత్సరీకాలు నిర్వహించి ఉత్తమ కథలను ఎంచుకునేవారిని, వారి ఉత్తమ కథలను విమర్శిస్తూంటే, ఒక యువ రచయిత, మీరు ఉత్తమ కథలుగా ఎంపికయ్యే అర్హతలుండే కథలు రాయటంలేదు. రాస్తే, మీవీ ఎంపికయ్యేవి అన్నాడు. అతడు యువ రచయిత, ఇంకా తెలుగు సాహిత్య రంగంలోని రాజకీయాలు, విమర్శక డింపతుల మాఫియా ముఠాల రాజకీయాల గురించి అతనికి పరిచయం లేదు కాబట్టి నేను వాదన పెంచలేదు. అప్పటి అతని వాదనకు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాను. సైన్స్ ఫిక్షన్ కథలు, క్రైం కథలు లాంటి భిన్నమయిన కథలకు ఉత్తమ కథల సంకలనాలలోకి ఎంపికయ్యే అర్హతవుండదన్న అభిప్రాయం అమలులో వుంది. సామాజిక స్ప్ర్హ, అణచివేతలు లాంటి కంట తది పెట్తించే ఆర్ట్ ఫిలంస్ లాంటి కథలే ఉత్తమ కథలన్న అభిప్రాయమూ వుంది. కానీ, తొలి ఉత్తమ కథల సంకలనంలోనే కాదు, పలు సంవత్సరాల సంకలనాల్లో సైన్స్ ఫిక్షన్ లాంటి కథలను ఉత్తమ కథలుగా ఎంచుకుని, సంకలనంలో ప్రచురించటం కనిపిస్తుంది. అంటే, ఇక్కడ ఉత్తమ కథగా ఎంపిక కావాలంటే కథ ఉత్తమంగా వుండటం కాదు ప్రామాణికం. అది మనకయినవారు, కావాల్సినవారు రాయటమే ప్రాధాన్యం అన్నమాట! యర్రమిల్లి జే శేఖర్ రచించిన భూమిపుత్రుడు సైన్స్ ఫిక్షన్ పరిథి అంచుల్లో కదిలే కథ. 2090 సంవత్సరంలో మనిషి ప్లూటో గ్రహంలో దిగటంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తరువాత కథ ఉదయ్ అనే వ్యక్తి స్పేస్ షిప్ లో వినువీధుల్లో ప్రయాణించటం తెలుస్తుంది. 2030నాటికి భూమి మీద వాతావరణం పాడయిపోయిందనీ, ఆక్సోజనత్స్, కాంపాక్స్ సెరాల్స్ కనుక్కున్నారనీ తెలుస్తుంది. చంద్రుడూ శుక్రుడూ మానవ నివాసయోగ్యంగా మలచబడ్డాయనీ తెలుస్తుంది. ఆక్సోజనట్స్ ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అవి ఒక డజన్ వుంటేవారం దాకా బెంగవుందదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన దగ్గర ఒకటే వుంటుంది. కాంపాక్ట్ పవర్ సెల్స్ ఎంత శక్తివంతమయినవంటే శుక్రగ్రహానికి ప్రొద్దున్న వెళ్ళి సాయంత్రానికి రాగలుగుతాయి స్పేస్ షిప్స్. ఇలా మనకు చెప్తూన్న సమయంలో అతను ప్రమాద సిగ్న చూడడు. రెడ్ లైత్ కి గుద్దుకుంతాడు. అతను ఎక్కడున్నాడో తెలుసుకోలేక పోతాడు. ఆక్సిజన్ అయిపోతూంటుంది. చివరికి దారి తప్పి ఎటో పోతూ ఓ గ్రహంలో పడతాడు. తీరా చూస్తే అది భూమి. అప్పుడతనికి మానవుల తెలివి తేటలమీద నమ్మకంపోతుంది. ఇదీ కథ!!! చదివిన తరువాత ఇదా కథ? అనిపిస్తుంది. ఆ తరువాత ఇది సైన్స్ ఫిక్షనా? ఏదో ఊహించి ఇష్టమయినట్టు రాసేసిన కథా? అనిపిస్తుంది. ఆతరువాత ఇది ఉత్తమ కథ ఎలా అయిందన్న సందేహం వస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథగా పరిగణించాలంటే కొన్ని మౌలికమయిన లక్షణాలుంటాయి. అలాంటివి కంచుకాగడా పెట్టి వెతికినా ఈ కథలో కనబడవు. కేవలం, 2090 అని, సుక్రగ్రహంలో మనిషి దిగాడనీ, ఏవో సెల్స్ కనుక్కున్నాడనీ చెప్పినంత మాత్రాన అది సైన్స్ ఫిక్షన్ కథ కాదు. సైన్స్ ఫిక్షన్ కు ఊహ ఎంత ముఖ్యమో లాజిక్ అంతే ప్రాధాన్యం. ముఖం, సైన్స్ ఆధారంగా ఆ ఊహ వుండటం. ఈ కథలో ఊహ వుంది. అర్ధం లేదు. స్పేస్ షిప్ లో ప్రమాదం అయిన తరువాత ఎటో తిరిగ్ భూమి మీదకు రావటం, అందువల్ల మనిషి తెలివితేటల మీద నమ్మకంపోవటం ఎందుకో అర్ధం కాదు. దాని వెనుక వున్న కారణాలూ కథలో ఎక్కడా లేవు. ఇక ఎంత పవర్ సెల్స్ కనుక్కున్నా ప్రొద్దున్నే శుక్ర గ్రహానికి వెళ్లి సాయంత్రానికల్లా ఇల్లు చేరటం కుదరదు. interplanetary distances concept రచయితకస్సలున్నట్తు లేదు. పైగా, కాంతివేగంతో ప్రయాణించగలగటమూ, కాంతికన్నా వేగంగా ప్రయాణించలేకపోవటానికి కారణాల ప్రస్తావన అవగాహనలు కథలో కనబడవు. ఇంతకీ, ఈ ఉదయ్ ఎక్కడనుంచి బయలుదేరాడో అతని గమ్యం ఏమితో ఎక్కడా కథలో లేదు. కేవలం, స్పేస్ ప్రయాణం చూపి ప్రమాదం చూపటమే కథ లక్ష్యంలా అనిపిస్తుంది. కథలో ఒక చోట ఇంకో పది నిముషాల్లో భూమిని చేరుకోకపోతే..అన్న వాక్యం వల్ల అతను భూమిని చేరాలని అర్ధమవుతుంది తప్ప ఎటునుంచి ఎటు అన్నది తెలియదు. అయితే, మరో చోట ఉదయ్ దిగిన గ్రహం చంద్రుడూ కాదు, శుక్రుడూ కాదు అంటాడు. కానీ చివరలో భూమిని చేరతాడు. అంటే కథ రచయిత ఊహకొచ్చింది రాసినట్టు కనిపిస్తుంది తప్ప, సైన్స్, లాజిక్ లు ఉపయోగించినట్టు కనబడదు. ఈ కథను ఉత్తమ కథగా నిర్ణయించారంటే అర్ధం, సంపాదకులకు, సైన్స్ ఫిక్షన్ అంటే తెలియదని. ఆర్థర్ సీ క్లార్క్ ఇలాంటి కథ ఒకటి రాశాడు. చంద్రగ్రహానికి వెళ్ళిన షిప్ పాడవుతుంది. భూమితో సంబంధం తెగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వ్యోమగామి, కేవలం నక్షత్రాల ఆధారంగా, భూమివైపు ప్రయాణించి భూమిని చేరుకుంటాడు. ఆ కథ చదివితే, అంతరిక్ష ప్రయాణం గురించేకాదు, అంత రిక్ష ప్రయాణంలోని సాధకబాధకాలు వంటి అనేక విషయాలు తెలుస్తాయి. ఈ కథలో జరిగినట్టే అపోలో మిషన్ లో జరిగింది. అప్పుడా వ్యోమగామి క్లార్క్ కథ స్ఫూర్తిగా ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ నిజం ప్రకతించాడు. అదీ సైన్స్ ఫిక్షన్ రచన గొప్పతనం. రచయిత భూమి మీదేవుంటాడు కానీ, అతని ఊహ అంతరిక్షంలో ప్రయానించే వ్యోమగాములకు దారిచూపుతుంది. అంతేకాదు, సైన్స్ ఫిక్షన్ మానవ మేధ గొప్పతనాన్ని చూపుతుంది తప్ప తక్కువ చేయదు. ఈ కథలో అదీ లేదు. మనిషి తెలివితేటలమీద నమ్మకం పోయిన తరువాత ఇక సైన్సేముంది? సైన్స్ ఫిక్షనేముంది? అయితే, 1990లోనే కాదు, ఇతర సంవత్సరాల సంకలనల్లోనూ అక్కడక్కడా సైన్స్ ఫిక్షన్ కథలు కనిపిస్తాయి. అంటే ఉత్తమ కథల ఎంపికకు సైన్స్ ఫిక్షన్ రచన అనర్హత కాదన్నమాట! అలాంటప్పుడు తెలుగులో వచ్చిన most authentic, hardcore science fiction కథల్లో ఒక్కటీ ఈ ఉత్తమ కథల సంకలనాల్లో కనబడదేమిటి? ఆ కథల్లో ఆధునిక సైన్స్ రీసెర్చ్ ఏ స్థాయిలో వుందో తెలుపుతూ, కథలో వాదిన సైన్స్ అంశాల నేపథ్యమూ ముందు వివరించి కథను సృజించటం కనిపిస్తుంది.ఎదుకంటే, ఆ విషయాలు తెలపకపోతే పాథకులు కథలో ప్రదర్శించినవి అభూత కల్పనలనుకునే వీలుంటుంది కాబట్టి. అందులో ఒక కథలో ముగ్గురు వార్మ్ హోల్స్ లో ప్రయాణించి మరో ప్రపంచం చేరతారు. తాము తమ ఇల్లు చేరుకోలేమని తెలిసినా సైన్స్ అభివృద్ధికోసం వారీ సాహసం చేస్తారు. అలా ప్రయానించిన వారు ఒక గ్రహం చేరతారు. దాని వాతావరణం భూమి లాగేవుంటుంది కానీ, అక్కద జీవం వుండదు. దాని గురించి తెలుస్కోవాలని ఒక వ్యోమగామి వెళ్తాడు. గ్రహం వాతావరణంలో ఏదో మార్పు వస్తుంది. ఇంతలో వారికి తమ గ్రహం నాశనం అయిపోయేముందు ఎవరో ఇచ్చిన చివరి సందేసం వినిపిస్తుంది. వెళ్లిన వాదు తిరిగి రాకపోవటంతో రెండోవదూ వెళ్తాడు. ఆ గ్రహ వాతవారణం ఇంకా మారుతుంది. అతనూ ఎంతకీ రాడు. ఇంతలో మిగిలిన వ్యోమగామి ఒక విషయ్మ్ గ్రహిస్తాడు. ఆ మెసేజ్ తాము దిగిన గ్రహం నుంచే వస్తోందని గ్రహిస్తాడు. ఎంతకీ వెళ్లినవాళ్ళు రాకపోవటంతో చివరి వ్యోమగామి కూడా షిప్ వదలి గ్రహంపై అదుగుపెడతాడు. దాంతో వాతవరణంలో మార్పు వేగవంతావుతంది. కాస్త దూరం వెళ్లిన తరువాత గ్రహిస్తాడు. తామి ఆ గ్రహానికి వచ్చినప్పుదు అక్కడ చెట్లేలేవు. కానీ, ఇప్పుడు రెందు చెత్లుంటాయి. అప్పుడు అతనూ కదలలేకపోతాడు. కారణం అతనూ చెట్టులా మరిపోతూంటాడు. అప్పుదు గేహిస్తాడు. తాము కొన్ని కాంతి సంవత్సరాలు ప్రయానించి తమ గ్రహమే చేరారనీ, అప్పతికది పాదయిపోయిందనీ, కానీ, జీవం నిద్రాణంగా వున్న ఆ వాతావరనంలోకి జీవులు ప్రవేసించగామే మళ్ళీ జీవోత్పత్తి ప్రారంభమయిందని, ఆ గ్రహంలో పునహ్ సృష్టి ప్రారంభమయిందనీ అర్ధం చేస్తుకుంటాడు. ఇదీ కథ! ఇలాంటి 13 కథలున్నాయి. ఇవన్నీ, సంకలనకర్తల దృష్టికి రాలేదు. వచ్చినా ఉత్తమ కథలు కాలేదు. ఎందుకంటే వాతిని రాసింది అరస విరస నీరస నోరస, తస్మదీయ జర్నలిస్టు రచయితలు, కావాల్సిన వారు., ఉపయోగపడేవారూ కాదు కాబట్టి. అంటే కావాల్సిన వారు ఏమి రాసినా ఉత్తమ కథ.కానివారు ఎంత ఉత్తమంగా రాసినా అది కథకాదన్నమాట! అందుకే, ఉత్తమ కథల సంకలనానికి అర్హమయిన కథలు రాయలేదన్న స్నేహితుదికి సమాధానం ఏమిటంటే, ఉత్తమ కథలంటే తెలియని వారు ఎంచుకునే పరిస్థితిలో ఉత్తమ కథ రాయటమనే పొరపాతు చేశాను. నేను రాసింది ఉత్తమ కథనే. దాన్ని గుర్తించే అర్హత వారికి లేదు. ఈ సంకలనంలో నిజంగా కాస్తయినా బాగా అనిపించే కథ, తిరగబడ్డ ధర్మం. రాసింది నందిగం కృష్ణారావు. ఎందుకంటే, ఈ కథలో జీవితం వుంది. మానవ మనస్తత్వం వుంది. సమాజం వుంది. కథను చెప్పిన విధానం బాగుంది. కథను ఒక యూనిట్ లా రచించటం బాగుంది. ఎలాగయితే సినిమాలో తుపకీ కనిపిస్తే అది పేలాలో, అలాగే కథలో మొదలు చెప్పింది చివరలో క్లారిఫై కావాలి. ఈ కథలో అయింది. గాదిదపై ఊరేగాలన్న కోరిక ఆధారంగా ప్రదర్సించిన వ్యంగ్యమూ బావుంది. ఈ సంకలనంలోని రిపీట్ కథకుల కథల విశ్లేషణ నెక్ష్ట్ టైం!

October 2, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized