Archive for December, 2016

25ఏళ్ళ ఉత్తమ కథా విశ్లేషణ-13(ఎఫ్)

25ఏళ్ళ ఉత్తమ కథల విమర్శలో కథా విమర్శన సూత్రాలను పాటించటంలేదని ఒకాయన మెసేజ్ ద్వారా విమర్శించాడు. బహిరంగంగా పోస్టు పెట్టవచ్చుగా అంటే తన అభిప్రాయం అందరికోసం కాదని, నాకు మాత్రమే సూచన అని అన్నాడు. అప్పుదొచ్చిందొక ఆలోచన…..విమర్శ సూత్రాలేమిటి?
విమర్శకు నాకు తెలిసి ఒకటే సూత్రం…ఒక రచన చదివిన తరువాత ఆ రచన నాలో ఎలాంటి సంచలనం కలిగించింది? ఎలాంటి ఆలోచనలకు కారణమయింది? ఎలాంటి భావాలను కలిగించింది? ఇంతే…ఒక కథను నేను ఈ మూడు ప్రశ్నల ఆధారంగానే సమీక్షిస్తాను. ఎత్తుగడలు, ముగింపులు మిగతా అన్నీ పండితులకు, పనిలేని అకాడెమీషియన్లకు…. నేను కథ రాసే సమయంలో ఎత్తుగడ ముగింపులు, కాంఫ్లిక్తులు, రిజల్యూషన్లు వంతి విషయాలను పట్టించుకోను. కథను చదివేటప్పుడూ పట్తించుకోను. కథను విమర్శించేటప్పుడూ పట్టించుకోను. అవన్నీ, తమ పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకునే వాళ్ళుపట్తించుకుంటారు. పుస్తకాలు రాస్తారు.
నాకు కథలో లాజిక్ ప్రధానమయిన విషయం.
నేను కేతు విశ్వనాథరెడ్డి గారి కథను విమర్శించినందుకు ఒకాయన నన్ను ఆక్షేపిస్తూ, ఆ కథలో ఎంత గొప్ప అంశాన్ని చెప్పాడో చూడు, అంతేకానీ, పోలింగ్ బూతులు ఎలా వుంటాయనే టెక్నికల్ విషయాలు పట్టించుకోకు అని నిందించాడు. నమస్కారాలు…నేను ఎద కరిగే కథ రాసి, చివరలో నాయిక హైదరాబాదు పొలిమేరల్లో వున్న సముద్రం లో మునిగి చనిపోయిందని రాస్తే అది గొప్ప కథ అవుతుందా? నేను గొప్ప విషయాన్ని చెప్పేనని ఎవరయినా నా కథని గొప్ప కథ అంటారా? సామాజికంగా, రచయితల స్థాయిలేవయినా, కథా ప్రపంచంలో కథకులదంతా ఒకే స్థాయి….వహాన్ కోయీ చోటా, న కోయీ బడా హై, వహాన్ హర్ బషర్ ఎక్ తప్ మె ఖడా హై…అంటారు, భగవంతుడి మందిరంలోని వారిని వర్ణిస్తూ, ఇది కథకులకూ వర్తిస్తుంది. ఆ కథకుడు కేతు విశ్వనాథ రెడ్ది కావచ్చు, ఖదీర్ బాబు కావచ్చు, కస్తూరి మురళీకృష్ణ కావచ్చు. కథా విమర్శలో అంతా సమానమే…
బాగా అనిపిస్తే మెచ్చుకోవటమే…బాగోలేకపోతే ఏది బాగాలేదో నిర్మొహమాటంగా చెప్పటమే…అప్పుడే సాహిత్య ప్రపంచం సుసంపన్నం అవుతుంది. ఆ దిశలోనే ఈ ప్రయత్నం!!!!

మృణ్మయనాదం కథ దగ్గరకు వస్తే, పాత్రల చిత్రణ, వ్యక్తిత్వ ప్రదర్శన విషయాన్ని ప్రత్యేకంగా విమర్శించుకోవాల్సివుంటుంది. ఎందుకంటే, మామూలు కథల పాత్రల్లాకాక ఈ పాత్రలకు పురాణాలు ఆధారం, పౌరాణిక పాత్రల ద్వారా, తన సిద్ధాంతానికి ప్రామాణికతను సాధించాలని రచయిత్రి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి, పాత్రల చిత్రణ, ఆ చిత్రణ ఔచిత్యాన్ని లోతుగా పరిశీలించాల్సివుంటుంది. ఇక్కడ రచయిత్రి చెప్పే సిద్ధాంతం మంచిదా, చెదా అన్న దానితో సంబంధంలేదు. దృష్టి కేవలం పాత్రల చిత్రణ, వ్యక్తిత్వ ప్రదర్శనలోని ఔచిత్యం గురించే. తమ కథలలో రచయితలు తాము నమ్మిన సిద్ధాంతాలను ప్రదర్శిస్తారు. అది వారి ఇష్టం. ఇక్కడ విమర్శ పరిథి ఆ సిద్ధాంత ప్రదర్శన పద్ధతిలోని ఔచిత్యం గురించే…సిద్ధాంతం గురించి కాదు.
రాముడిని ఆరంభంలో శివధనుర్భంగం కావించిన శ్రీరామచంద్రుడు అన్నారు రచయిత్రి. తరువాత, వారిదారి వివాహమవుతుంది, సీతాదేవికి రెండు రాత్రుల్లో రాముడితో మాట కలిపి చమత్కరించే చనువు ఏర్పడింది. రాముడు సీతా సౌందర్యాన్ని ఏం చేసుకోవాలో తెలియని అమాయకత్వం నుంచి బయటపడ్డాడు అంటుంది రచయిత్రి…ఇది రచయిత్రి ఊహ….ఇంతకీ సౌందర్యాన్ని ఏం చేసుకుంటారు? మరి రాముడి మగతనాన్ని ఏం చేసుకోవాలో తెలియని అమాయకత్వం నుంచి సీత బయటపడలేదా? అంటే స్త్రీ పురుష సంబంధంలో స్త్రీ సౌందర్యాన్ని పురుషుడే ఏమయినా చేసుకోవాలా? సరే, ఇది కోది గుడ్డుకు ఈకలు పీకినట్టుంతుందనుకుందాం..కానీ, మిథిలకు రాకముందే రాముడికి దారిలో అనేక కథలు తెలిసాయి. అహల్య కథ, శివపార్వతుల కథ, విశ్వామిత్ర కథలు కూడా దాన్లో భాగాలే….స్త్రీ సౌందర్యాన్ని ఏం చేసుకోవాలో తెలియని అమాయకత్వంలో ఎంతగా వున్నా, దాన్ని లైంగికంగానయితే వాడుకోవచ్చన్న కనీస పరిజ్ఞానం రాముడికి అప్పటికే లేకపోతే, అప్పుడయినా వచ్చివుంటుందనుకోవచ్చు..ఆ కాలంలో లైంగికానికి ఇప్పుడున్నంత ప్రాధాన్యం లేదు. యుక్త వయసు వచ్చినవారికి తెలిసేది. కాబట్టి సౌందర్యాన్ని అనుభవించే ఇంకేదో అమాయకత్వం వదిలివుండాలి. అదేమితో రచయిత్రి రాయలేదు. కానీ, ఈ వాక్యం వల్ల రాముడిని ఒక సామాన్య అమాయక యువకుడి స్థాయికి దింపింది రచయిత్రి..ఇక కాశీవిశ్వనాథ అనుభవ్ సినిమాపై తెరతీయటమే తరువాయి అనిపిస్తుంది.
విశ్వామిత్రునితో తాను ఎంతమంది రాక్షసులను అలవోకగా చంపాడో అతిశయోక్తులతో చెబుతున్నాడు రాముడంతుంది రచయిత్రి…..ఇది కూడా రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపిస్తుంది…ఎందుకంటే, రాముడికి అతిశయోక్తుల అవసరం లేదు. అప్పటికే, రాముడి ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. విశ్వామిత్రుడు వీరు తన యజ్ఞాన్ని కాపాడటం చెప్తాడు. రాముడు సివ ధనుస్సు విరిచాడు. పైగా, ఇంకా వివాహ సంబరాలు పూర్తికాకముందే పరశురాముడు వస్తాడు. రామ దశరథే వీర వీర్యం తే శ్రూయతేఅద్భుతం, అంటాడు. అంటే నీ వీరత్వం గొప్పతనాన్ని నేను విన్నాను అని. ఇది అందరిముందు జరిగింది…అంటే రాముడి అహం అణచటానికి ఆగ్రహంతో వచ్చినవాడు రాముడి శౌర్య ప్రతాపాలగురించి చాలా విన్నానని అంటున్నాడు. అందరిముందే రాముడు పరశురాముది అహం అణచివేస్తాడు. ఇప్పుడిక, రాముడు తన శౌర్యం గురించి అతుశయోక్తులు చెప్పాల్సిన అవసరం వుందా? వంద పరుగులు చేసినవాడి గురించే వందమంది వందరకాలుగా పొగడుతారు. వాడెప్పుడూ నేనిలా కొట్టాను అలా కొట్టాను అని చెప్పుకోడు. ఎందుకూ పనికిఏఅని చేతకాని వాడు తన స్త్రీ ముందు గొప్పలు చెప్పుకుంటాడు. నిజంగా సాధించినవాడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినా, రాముడు గొప్పలు చెప్పుకుంటున్నాడని రాయటం, రామాయణం తెలియకపోవటమో, తెలిసినా హేళన చేయాలని చులకన చేయాలన్న చిలిపి తనం వల్లనో అవుతుంది. ఏదయినా పొరపాటే…తెలియకపోతే తెలుస్కుని రాయాలి కానీ, అజ్ఞాన్ని ప్రజలపై రూద్దవద్దు. అదీ కోటానుకోత్లమంది దైవంలా కొలిచే పౌరాణిక పాత్ర గురించి అజ్ఞానంతో రాయటం అన్యాయం. తెలిసీ కావాలని రాస్తే, అదీ నేరమే…తెలిసి తెలిసి పబ్లిసిటీ కోసం కావాలని చులకనగా రాయటం సాహిత్యం కాదు. అందరూ గౌరవించేవాడికి మర్యాదనివ్వటం మర్యాదస్తుల లక్షణం.
పరశురాముడి సవాలును స్వీకరిస్తూ రాముడు, అవజానాసి మే తేజహ్ పశ్య మేధ్య పరాక్రమం, అంటాడు. అంటే, నన్ను నిర్వీర్యుడిగా భావిస్తున్నావు. బ్రాహ్మణుడివయిన నీ ముందు క్షత్రియ ధర్మం వల్ల ఎక్కువమాట్లాడలేను, ఇదిగో చూడు నా శక్తి తేజం అంటాడు. చూపిస్తాడు. అలా, బహిరంగంగా అందరిముందూ తన శక్తిని ప్రదర్శించినవాడికి, అతిశయోక్తుల అవసరం వుందని భావించటమే పెద్ద అతిశయోక్తి, అనృతం..తాను ఏ పాత్రల ఆధారంగా రచనను సృజింస్తున్నారో ఆ పాత్రల గురించి సరయిన అవగాహన పరిజ్ఞానం లేకుండా రచన సాగిందనటానికి నిదర్శనం. ఇలాంటి దాన్ని గొప్ప రచనగా భావించేవరూ ఇలాంటి అవగాహన రాహిత్యమో, దురభిప్రాయమో కలిగినవారయివుంటారు కానీ, విజ్ఞాన వంతులుకారు.
ఆ తరువాత వారి సంభాషణ అహల్యవైపు మళ్ళుతుంది. అహల్యను అద్భుతమయిన సౌందర్యరాశి అనగానే సీత చిన్నబోతుంది. సరదాకైనా, పరస్త్రీ సౌందర్యవర్ణనతో చిన్నబుచ్చే వయసు మనసు రామునికింకా రాలేదు అని వ్యాఖ్యానిస్తుంది రచయిత్రి…సామాన్య యువతీ యువకుల కథ ఇది. దీనికి రాముడు సీతలను వాదుకోవటం కావాలని చేసిన చిలిపిపని తప్ప మరొకటి కాదు. రచయిత్రి రామాయణం పిట్టకథలు రాసి పిట్ట రెట్టలాంటి కథ రాసింది తప్ప రామాయణంతో పరిచయంలేదని నిరూపించే వ్యాఖ్య ఇది.
రాముదిని శతానందుడు, అహల్య గౌతముల కొడుకు ఆహ్వానిస్తాడు. రాముడివల్ల తన తల్లీ తండ్రి తిరిగి కలిసారని రాముడిని పొగడుతాడు. రాఘవౌ తు తదా తస్యాహ్ పాదౌ జగ్రుహతుర్ముదా!!! అంటే రాముడు లక్ష్మణుడు అహల్యపాదాలను తాకి ఆనందంతో నమస్కరించారని….అంటే, రాముడు అహల్యని అసహ్యించుకోలేదు. ఆమెను చిన్నచూపు చూడలేదు. ఆమెను గౌరవించాడు. ఆమెపాదాలు తాకి నమస్కరించాడు…..అంతేకాదు, గౌతముడు కూడా అహల్యను వదిలేయలేదు. ఆమె ఒక రకమయిన శిస్ఖను అనుభవిస్తూంటే తానొక శిక్షను విధించుకున్నాడు. ఆమె రూపం ధరించగానే ఆమెను కలసాడు. కలసి జీవించారు వారిద్దరూ..
అంటే అహల్యకు ఇందుదితో సంబంధం వుందని రాముడు అసహ్యించుకున్నాడు, సీతకు ఆమె గురించి తెలియకూదదని తపన పడ్డాడు, గౌతముడు అన్యాయం చేశాడు, అహల్య పురుషులగురించి సీతకు చెప్పి పరీక్షకు లొంగకు అని అన్నది అంతా రచయిత్రి బుర్రలో కదిలిన ఊహా పురుగు తప్ప రామాయణంలో లేదు. ఆయా పాత్రల వ్యక్తిత్వాలలో లేదు. అంటే కథకు ప్రాతిపదికనే పాత్రల వ్యక్తిత్వభంగం అనౌచితం అయితే, ఇక కథకు ప్రామాణికత ఏముంది. కలిగులా నీచ రాజు. వాదిని ఉత్తమ రాజుగా చూపిస్తూ కథ రాస్తే ఎవరయినా ఒప్పుకుంటారా? యులిసెస్ కోసం పెనెలోప్ ఎదురుచూస్తోంది. ఎందరెన్ని ప్రలోభాలుపెట్టినా లొంగలేదు. ఆ కథరాస్తూ, పెనెలోప్ ఎవరుదొరికితే వారితో కలిసింది. యులిసెస్ కు తెలియకుండా దాచిందని రాస్తే ఒప్పుకుంటారా? అది అనౌచిత్యమని, అన్యాయమని అలాంటి కథలను కొట్టిపారేస్తారు. మరి రాముడు సీత అహల్యల పాత్రలను వక్రీకరించి ఏమాత్రం ఆధారంలెని వికృతమయిన ఊహాలతో రాసిన కథ ఉత్తమ కథ ఎలా అవుతుంది? దానికి అవార్డులెలా వస్తాయి? ఇక్కడే సమాజంలో ఉన్న వికృతి, సాహిత్య ప్రపంచంలోని వికృతులు స్పష్టమవుతాయి.
ఇలా విశ్లేషిస్తూ పోతే కథ అణువణువునా అవగాహన రాహిత్యం, అనుచిత్యం, మూర్ఖత్వం, అజ్ఞానాలు ఉట్టిపడుతూంటాయి. అయితే, మౌలికమయిన ఆధారమే పొరపాటయిన తరువాత ఇక కథ పనికిరానిది అని నిర్ధారించుకున్న తరువాత ఇక కథ పిచ్చి ఊహ తప్ప కథ కాదు. అదీ, నిజం ఆధారంగా లేని పుక్కిటి ఊహ…
ఇక ఈ పనికిరాని కథకాని ఉత్తమకథలో అందరికన్నా మూర్ఖమయిన పాత్ర సీతది. ఆమె రాముదిని వదిలేయటానికి సరయిన కారణంలేదు. ఎవరేది చెప్తే అది నమ్మేసి సంసారాన్ని జీవితాన్ని పాదు చేసుకునే మతిలేని యువతిలా అనిపిస్తుంది సీత…..అత్యంత ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం కల సీత పాత్ర అలా అనిపించటానికి కారణం రచయిత్రి కథా కథన కౌశలమే కారణం….
ఈ నాలుగు కథలను విశ్లేషించి చూస్తే, రచయిత్రిగా వోల్గా గురించి పెద్ద మంచి అభిప్రాయం కలగదు. ఆమె కథలు ఉత్తమ కథలుగా పరిగణించటంలో సంసారాన్ని వదిలేయమని, వివాహబంధం పనికిరానిదని చెప్తూ పురుషులను తిట్టే సిద్ధాంతం ప్రధాన పాత్ర వహించింది తప్ప, కథా కథన కౌశలం, స్ర్జనాత్మక అభినివేసణం వంటివేవీ కాదను నిర్ధారణగా చెప్పవచ్చు.
వచ్చే వ్యాసంలో కుప్పిలి పద్మ కథల విశ్లేషణ వుంటుంది.

December 31, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-13(ఇ)

ప్రపంచంలోని ఇతర దేశాలలోని ధర్మానికి భారతదేశాంలోని సనాతన ధర్మానికి మౌలికంగా ఒక తేడా వుంది. ఆయా ధర్మాలు ఒక వ్యక్తి పైననో, ఒక పుస్తకంపైననో ఆధారపడివుంటాయి. కానీ భారతీయ సనాతన ధర్మం ఇలా ఒక వ్యక్తి, పుస్తకంపైన ఆధారపడివుండదు. ఇక్కడ ధర్మం, జీవన విధానం ఒకదానితో ఒకటి పడుగులో పేకలా కలసిపోయాయి. ఒక రాజు సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేసినట్టు..పలు పొరలలో ధర్మ రక్షణ కవచాలున్నాయి. ఒకోపోరను చీలుస్తూ పోతే కానీ కేంద్రాన్ని ఎవరూ చేరలేరు. కేంద్రం చేరేలోగా చీల్చేవారి శక్తి ఉడిగి వారీ ధర్మ ప్రవాహంలో భాగమయిపోతారు. అందుకే, అనంతంగా భారతీయ ధర్మం ఒక సజీవ నదిలా ప్రవహిస్తూ వస్తోంది.
సృష్టిలోనే ప్రకృతికి వికృతి వుండే వ్యవస్థ వుంది. కాబట్టి, ఏదయినా అవిశ్రాంతంగా ప్రవహిస్తోందంటే దాని ప్రవాహాన్ని అడ్డుకోవాలనో, దారి మళ్లించాలనో ప్రవాహంలోని నీటిని మలినపరచి దాన్ని నిరుపయోగం చేయాలనో, నీరంతా దారి మళ్ళించి దాన్ని ఎండబెట్టాలనో ప్రయత్నాలు జరగటం సృష్తిలోనే వుంది. ఇన్ని ప్రయత్నాలు జరుగుతూనే వున్నా ప్రవహిస్తూన్నదే సజీవంగా నిలుస్తుంది. లేనిది, కొంత కాలం ప్రవహించి ఎండిపోతుంది. భారతీయ ధర్మం అనంతంగా ప్రవహిస్తూనే వుంది. అనాదిగా దానికి వ్యతిరేక ప్రయత్నాలు జరుగుతూనే వున్నా ప్రవాహం ఆగలేదు. ఇందుకు కారణం పలు విభిన్నమయిన పొరలు పొరలుగా ఏర్పడ్డ ధర్మ లక్షణం. ఏదో ఒక పొర ధర్మాన్ని రక్షిస్తూ సజీవంగా నిలుపుతోంది. భారతీయ ధర్మానికి వేదం బీజం అయినా రామాయణ భారతాలు పట్టుగొమ్మలు. ఈ ధర్మాన్ని సజీవంగా నిలుపుతూ తరం నుంచి మరో తరానికి ధర్మం అందటంలో తోడ్పదుతున్న జీవ లక్షణానికి మూలకారణాలు రామాయణ భారతాలు. ఈ ధర్మాన్ని దెబ్బ తీయాలనుకునే వారు , రామాయణ భారతాలపై ప్రజల విస్వాసాన్ని సడలిస్తే కానీ తమ లక్ష్యం నెరవేరదని భావించారు. ఫలితంగా పురాణాలను, పురాణ పాత్రలను అవహేళన చేయటం, వాతిలో దోశాలు చూపించి వాటిపై నమ్మకాన్ని సడలించటం, పాత్రల వ్యక్తిత్వాలను దెబ్బ తీసి, పాత్రల పైన్ అవిస్వాసాన్ని సడలించటం ద్వారా ధర్మంపై విస్వాసాన్ని సదలించి, వ్యక్తులలో న్యూనతాభావాన్ని కలిగించటం. పురాణాలపత్ల అసహ్యాన్ని కలిగించతం లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో కోణంలో, తమ సిద్ధాంతాలను పురాణ పాత్రల ద్వారా చెప్పించి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయటం. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి తమ దారిలోకి తెచ్చుకోవటం. అలాంటి ప్రయత్నంలో భాగమే వోల్గా రచించిన మృణ్మయ నాదం కథ!
సాధారణంగా ఏదయిన ఒక పురాణం ఆధారంగానో, చారిత్రిక పాత్ర, సంఘటన ఆధారంగానో ఒక సృజనాత్మక రచన చేస్తున్నప్పుడు కొన్ని మౌలిక సూత్రాలను మర్యాదలను పాతించాల్సి వుంటుంది.
ఉదాహరణకు బైబిల్ లో మోజెస్ పాత్ర ఆధారంగా ఒక కాల్పనిక కథ సృజించాలంటే, బైబిల్ లో మోజెస్ వ్యక్తిత్వము, లక్షణాలు ఆలోచనా విధానము, ప్రవర్తన వంటి విషయాలను మార్చకుండా వాటి చుట్టే కథ అల్లాలన్నమాట. ఇది చారిత్రక పాత్రల ఆధారంగా సృజించే రచనలకూ వర్తిస్తుంది. ఒకవేళ చారిత్రిక పాత్రలనో పురాణపాత్రలనో అవహేళన చేస్తూ వ్యంగ్యాత్మక రచనను సృజించాలన్నా, వ్యంగ్యాన్ని, అవహేళనను కూడా మూలంలోని లక్షణాల ఆధారంగా సృజించాలి తప్ప లేనిది , విరుద్ధమయినదీ స్ర్జించటానికి వీలులేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే, పౌరానిక చారిత్రక పాత్రల బదులు ప్రతీకాత్మకమయిన పాత్రల స్ర్జన ద్వారా ఆపని చేయాలే తప్ప ఒరిజినల్ గా వున్న పాత్రల వ్యక్తిత్వాన్ని మార్చకూడదు. ఇది సాహిత్య మర్యాద!
రామయణాన్ని రఘువంశంగా స్ర్జిస్తున్నప్పుడు, కుమార సంభవాన్ని స్ర్జిస్తున్నప్పుడు, చివరికి కాల్పనిక మేఘ సందేశాన్ని స్ర్జిస్తున్నప్పుడూ కాళిదాసు ఈ మర్యాదను పాతించాడు. రామాయణ భారతాలనేకాదు ఇతర పురాణాల ఆధారంగా కావ్యాలను సృజిస్తున్నప్పుడూ కవులు ఈ మర్యాదను పాతించారు. ఈ మర్యాదను పాతిస్తూ తమ స్ర్జనాత్మకతను వీర విహారం చేయించారు. జయదేవుడి రాధాకృష్ణుల సృనగారాన్ని కావ్యీకరిస్తూ కూడా ఈ మర్యాదను పాటించాదు. మనవారే కాదు, ప్రపంచంలో ఏప్రాంతంలోని సాహిత్యకారుడయినా పూర్వీకులను గౌరవించే ఈ సత్సాంప్రదాయాన్ని పాతించాడు. చివరికి అవహేళనలోనూ ఈ మర్యాదని పాతించారు.
హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక అత్యంత భయంకరమయిన వ్యంగ్యాత్మకమయిన సినిమాను రూపొందించాదు మెల్ బ్రూక్స్ అనే కళాకారుడు. దాన్లో మోజెస్ పాత్ర ఇరవై సూత్రాలున్న పలకలను పట్టుకువస్తుంది. దేవు మనకు 20 సూత్రాలిచ్చాడు అనబోతే 10 సూత్రాలున్న పలక పడి విరిగిపోతుంది. అప్పుడాయన దేవుడు పది సూత్రాలిచ్చాడు అని ప్రకతిస్తాడు. అత్యంత వ్యంగ్యాత్మకమయిన ఈ దృశ్యానికి ఆధారం నిజంలో వుంది. ఇది స్ర్జనాత్మక కళాకారుడు తన పూర్వీకులను గౌరవించతం కాదు తననౌ తాను గౌరవించుకోవటం అన్నమాట.
వోల్గా రామాయణం ఆధారంగా సృజించిన మృణ్మయనాదం కథలో ఇలాంటి మర్యాదపాతించటం ఏ కోశానా కనబడదు సరికదా, ఈ కథ రాయటానికి రామాయణ పాత్రలను వక్రీకరించి, వాతి వ్యక్తిత్వానికి విరుద్ధంగా ప్రదర్శించేబదులు స్వయంగా పాత్రలను స్ర్ష్టించి రాయవచ్చు కదా??? అన్న సందేహం వస్తుంది. కానీ, అలా స్వయంగా పాత్రలను స్ర్జించి రాస్తే, రచయిత్రి లక్ష్య, పురాణాన్ని అవహేళన చేయటం, పురాణ పాత్రలపై విస్వాసాన్ని సడలించటం నెరవేరవు. అందుకని రామాయణ వక్రీకరణ, రామాయణం పేరిట స్వీయ సృష్టి చేయటం జరిగింది. సాహిత్య విమర్శ మౌలిక సూత్రాలు తెలిసిన వారెవరూ ఈ కల్పనలను వక్రీకరణలను మెచ్చరు. దీన్ని ఉత్తమ కథగా పరిగణించరు. కానీ, ఇది ఉత్తమ కథ కావటమే కాదు, ఇలాంటి కథలకు సాహిత్య అకాడెమీ బహుమతి రావటం, సాహిత్య అకాడెమీ న్యాయ నిర్ణేతలకు కూడా సృజన మౌలిక మర్యాదలు సూత్రాలు, విమర్శ సూత్రాలు తెలియని దుస్థితిలో సాహిత్యం ఉందని స్పష్టం చేస్తుంది.
ఇక, కథ దగ్గరికి వస్తే….. రాముడు, సీతతో మాటల్లో అహల్య గురించి చెప్తాడు. కానీ, అహల్య గురించి ఆమె ఆలోచిస్తూంటే అసలు ఇలాంటి విషయాలు నువ్వు వినకూడదు అంటాడు. తరువాత కౌసల్య సీతకు అహల్య గురించి చెప్తుంది. జరిగిన దానిలో అహల్య తప్పు లేకున్నా, రాముదు చులకనగా అన్నాడు అత్త తలరాత అంది అని ఆలోచిస్తుంది సీత. రాముదితో అడవులకు వెళ్తున్నప్పుడు, అహల్యను కలుస్తుంది. అహల్యద్వారా మైల శౌచం పవిత్రం అపవిత్రం శీలం పతనం లాంటి పదాలను అగ్రవర్ణ పురుషులెంత బలంగా సృష్టించారంటే ఇందులో సత్యాసత్యాల ప్రసక్తి లేదు, విచక్షణ ప్రసక్తి లేదు అంటుంది. అంతేకాదు ప్రపంచంలో మగవాళ్ళంతా ఒకటేనని చెప్పి ఎన్నడూ విచారణకు అంగీకరించకు అధికారానికి లొంగకు అని చెప్తుంది. తరువాత సీతతో రాముడు అలాంటి స్త్రీల మాటలు నీలాంటి నిర్మల హృదయులకూ అమాయకులకూ అర్ధంకావని ఆజ్ఞాపించినట్టే అంటాడు రాముడు. తరువాత రాముడు అగ్ని ప్రవేశ పరీక్ష పెడతాడు సీతకు. అయోధ్యకు వచ్చిన తరువాత అరణ్యాలలో వదిలేస్తాడు లక్ష్మణుడు. అక్కడ అహల్యను కలుస్తుంది సీత.. అక్కడ అహల్య సీతకు జ్ఞాన బోధ చేస్తుంది. తరువాత సీత రాముడిని వదిలేస్తూ నన్ను నేను తెలుసుకున్నాను. ఈ విశ్వమంతా నాదే. నాకు లేనిదేమీ లేదు అంటుంది. బయటనుంచి వచ్చే అధికారానికి లొంగని సీత తన లోపల తన మీద తనకున్న అధికారపు శక్తిని మొదటి సారి సంపూర్ణంగా అనుభవించింది సీత అంటూ కథ ముగుస్తుంది.
ఈ కథ చదివిన తరువాత, ఇతర మూడు కథలు చదివిన తరువాత పంచతంత్రంలోని నీలి నక్క కథ సరిగా సరిపోతుందనిపిస్తుంది… ప్రతి కథలో పురుషుడు దుష్తుడు. తనని తాను తెలుస్కోవటమంటే పురుషుదిని, పిల్లలను వదిలేయటమే. అవకాసంలేదు కానీ, ఉంటే ఈ కథలో సీత పక్కన మరో ఆశ్రమంలో ఒక ఋషి వుంటే సీత వాడికి సేవలు చేస్తూ తోడు కథలోలాగా వుండేట్టు చేసేదేమో రచయిత్రి అనిపిస్తుంది. ఈ కథలు చదివితే మొగుదిన వదిలినా మరో పురుషుడి తోడు అవసరమే అన్న భావన కలుగుతుంది. పిల్లలు , మొగుడు లేకపోతే స్త్రీ బ్రతుకు ఆనందమయమే అనిపిస్తుంది. ఈ సిద్ధాంత చర్చను పక్కన పెట్టి కథలోని పాత్రల చిత్రణ దాన్లోని అనౌచిత్యాల దగ్గరకు వస్తే కథ నిర్మాణంలో సృజనలో మౌలికంగా వున్న లోపాలు తెలుస్తాయి.
ముందుగా, కథా నిర్మాణం చొస్తే, రామాయణం తెలియని వాడికి కథ అర్ధం కాదు. అంటే దీన్ని ఆంగ్లంలోకి అనువదించి రామాయణం తెలియని వాడితో చదివిస్తే ఈ కథను most disjointed and meaningless story అంటాడు. ఎందుకంటే, మొదటి చాప్టర్ పెళ్ళవుతుంది అహల్య ప్రసక్తి వస్తుంది. రెండవ చాప్టర్ అయోధ్యలో జరుగుతుంది..అహల్య సీతల సంభాషణ రాముడు విసుక్కోవటంతో పూర్తవుతుంది. మూడవ చాప్టర్ లో అడవిలో అహల్యను కలవటం వుంతుంది. ఇంతకీ రాముడు సీత అయోధ్య వదలి అరణ్యానికి రావటానికి కారణం రామాయణం తెలియని వాదికి తెలియదు. నువ్వు అరణ్యానికి ఎందుకొచ్చావు, అంటే రాముడిని వదిలి వుండలేక అంటుంది..రాముడు అరణ్యానికి ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న అహల్యవేయదు. దానికి సమాధానం లేదు. అంటే రామాయణం తెలియకపోతే అడవికి పనిలేక వచ్చారనుకుంటాడు. ఇది కథలో structural లోపం. మళ్ళీ శీల పరీక్ష వుంటుంది. ఇది కూడా ఎందుకు? ఏమితి తెలియదు. కథలో రచయిత్రి చెప్పదు. రావణుడు ఎత్తుకుపోయే ప్రసక్తి లేదు. అయోధ్యకు వచ్చిన తరువాత అరన్యానికి ఎందుకు పంపాడో కారణం లేదు. పైగా రాముడు రావటంలేదంటే అహల్యతో ఎంతసేపైనా గడపవచ్చు.మనసునంతా కడిగేసుకోవచ్చు అనుకుంటుంది. తరువాత వాల్మీకి ఆశ్రమంలో అహల్యను కలుస్తుంది. మళ్ళీ చివరి అధ్యాయం రాముడు విలపిస్తున్నాడు అంటూ ఆరంభమవుతుంది. ఎందుకు ఏమిటి తెలియదు….అంటే రామాయణాన్ని పక్కన పెట్టి ఒక కథగా చూస్తే..తలాతోకా లేని అసందర్భ ప్రేలాపన అనిపిస్తుంది తప్ప ఒక coherent story గా అనిపించదు. ఇక్కడ కథనే సరిగ్గ లేదు, ఇక కథలో పాత్రలు సరిగ్గా ఎలా ఎదుగుతాయి?
సృజనలో మౌలిక లక్షణం ఏదయినా అధారంగా రచన చేస్తే, మూలంలో పాత్రల వ్యక్తిత్వాలను మార్చకూడదన్నది. మహాత్మా గాంధి సినిమా తీస్తూ మహాత్ముడు ఒక అమ్మాయిల గుంపులో కస్తూరిబాతో గ్రూపు డాన్స్ పాట పాదినట్టు చెప్పకూడదు. రామకృష్ణ పరమహంసను అతని భార్య రెచ్చగొట్టాలని ప్ర్యత్నించినట్టు రాయకూడదు. అది అనౌచిత్యమేకాదు. ఘోరం కూడా!!!
ఈ కథలో అడుగడుగునా అలాంటి ఘోరాలు కోకొల్లలు కనిపిస్తాయి.
ఇవి వచ్చే వ్యాసంలో…

December 18, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-13(డి)

సారీ జాఫర్ కథ ను ఉత్తమ కథగా ఎంచుకోవటానికి కారణాలను ముందుమాటలో సంపాదకులు వివరించారు. ముస్లిం జీవితాలన్ను చర్చించిన కథ అని, ఈ కథతోపాటూ 2003 సంకలనంలో ఎంచుకున్న ఇంకో రెండు కథలను గమనిస్తే గాయపడ్డ ముస్లింల మనస్సులు, వారిని వెన్నాడే అభద్రతాభావాలు అర్ధమవుతాయనీ, అతి మామూలు విషయాలు, సంఘటనలు వారి మనోభావాలను దెబ్బతీసే సున్నితమైన స్థితికి కళ్లకుకట్టినట్తు చూపిస్తాయనీ రాశాౠ. అంతే కాదు, కథానిర్మాణం విషయంలో అనుభవజ్ఞులు కావటంతో రావాల్సిన సమయంలో వచ్చిన మంచి కథ అనిపించారని రాశాౠ.
అయితేం సారీ జాఫర్ కథ చదివితే, బహుషా ఈ కథ సంపాదకులకు సరిగా అర్ధం కాలేదేమోనన్న అనుమానం కలుగుతుంది. అంతేకాదు..ఈ కథ పాత హిందీ సినిమా ధర్మపుత్రను తలపుకు తెస్తుంది. రచయిత్రికి హిందీ సినిమాలతో పరిచయం బాగానే వుందని కథలో ఒకచోట జాఫర్, రామారావులు గజల్స్, హిందీ సినిమాపాతలు రాత్రంతా పాడుకునేవారని రాయటం పట్టిస్తుంది.
రామారావు, జాఫర్ లు స్నేహితులవుతారు. జాఫర్ రామారావుకు సహాయంచేస్తాడు. జాఫర్ వ్యాపారం కలసిరాక కరీమ్నగర్ వెళ్తాడు. చాలా ఏళ్ళ తరువాత కూతురిని హైదరాబాదులో చదివించేందుకు వస్తాడు. అద్దె ఇల్లో, హాస్టలో దొరికేవరకూ తమ ఇంట్లో వుంచమని రామారావు అంటాడు. అయితే, అతని కొడుకు వినయ్ కి ముస్లిం ఇంత్లో వుండటం నచ్చదు. ఆమెని పొమ్మంటాడు. పెద్ద బొట్టుపెట్టుకుని ఆమెని అవమానిస్తాడు. ఆమె కూడా బురఖాలు వేసుకుంటుంది. లేకపోతే మీకూ మాకు తేడా ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నిస్తుంది. చివరికి మావాళ్ళంతా అక్కడే వున్నారని ముస్లిం లుండే ప్రాంతంలో అద్దెగది తీసుకుని వెళ్ళిపోతుంది. తల్లికి చలం నవలలో పాత్ర జాఫర్ అన్నా, పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రం అన్నా ఇష్టమని తెలిసి కొడుకు మంది పడతాడు. వసీం అక్రం ని జట్టులోంచి తీసేస్తే సంతోశిస్తాడు. తల్లి క్రికెట్ పై ఇష్టం పోయిందంతుంది. కొదుకు వేరే దేశం వెళ్ళిపోతాడు. కొదుకు ప్రవర్తనకు రామారాచు బాధపడతాడు. సారీ జాఫరాలి అనుకుంటాడు. ఈ మధ్యలో రామారావులాంటి అనేకమంది ఆలోచించకపోవటంవల్లనే, రథయాత్రలూ, బాబ్రీ మసీదులు, గుజరాత్ లూ జరిగాయని వాళ్ళకు తట్టడు. అంటూ చిన్న వ్యాఖ్యానన్ని రచయిత్రి తనవంతుగా చొప్పించారు( ఇది ఉత్తమ కథా రచన సూత్రానికి విరుద్ధం. అయినా అనుభవజ్ఞురాలయిన రచయిత్రికాబట్టి నియమభంగమే నాగాభరణం అనుకోవాలి) . ఇదీ సారీ జాఫర్ కథ.
ఈ కథలో వినయ్ ప్రవర్తన, అతని సంభాషణలు తిన్నగా హిందీ సినిమా ధర్మపుత్రలో శశి కపూర్ పాత్రను గుర్తుకు తెస్తాయి. బొట్టు గురించిన సంభాషణ కూడా ఆ సినిమాలోదే. ఇంటికి వచ్చిన అతిథిని అవమానించటం, పొమ్మనటం , తండ్రి వీడికీ బుద్ధులు ఎలా వచ్చాయని అనుకోవటం అంతా, ధర్మపుత్ర సినిమానే!
ఇంతకీ కథ ముగింపేమిటి? ఒక రాజకీయ కథ, తోడుల్లోలాగే…ఒక ఉపన్యాసం, ఒక అసంబద్ధమయిన కంక్లూజన్, రచయిత్రి కథతో సంబంధంలేకుండా కథలోకొచ్చి తీర్మానాలు చేయటం….ఇదీ ఉత్తమ కథ!
కథగా తీసుకుంటే, నిజంగా హిందూ ధర్మాన్ని తీవ్రంగా అభిమానించేవారెవరూ ఇస్లామీయులను అంతగా ద్వేషించరు. ద్వేషించినా, ఇలా బహిరంగంగా అవమానించరు. కనీసం ఇంటికి వచ్చిన వారితో అలా అనాగరికంగా ప్రవర్తించరు. నిజానికి ధర్మ పుత్రలో ఆయా దృశ్యాలు సినిమాకోసం కృత్రిమంగా కల్పించినవి. సినిమాలోనూ కృతకంగా వుంటాయి. ఆ సినిమా ఏ నవల ఆధారంగా తీశారో ఆ నవలలో అలా అనాగరికంగా, క్రూడ్ గా ప్రవర్తించదు ఆ పాత్ర. చరిత్రను ఒక సారి గమనిస్తే, హిందువులను చూసి ముస్లింలు అభద్రతా భావానికి గురవటం కన్నా, ముస్లింలను చూసి హిందువులే అభద్రతాభావానికి గురవటం ఈనాటికీ కనిపిస్తుంది. రచయిర్తి చెప్పినట్టు సెక్యులరిస్టులు మౌనంగా వుండటం అన్నది మన దేశంలో జరగలేదు. ఏ విషయమయినా, హింసను మన దేశ ప్రజలు నిర్ద్వంద్వంగా ఖందించటం మనకు తెలుస్తూనేవుంది. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు ఉరితీత గురించిన వివాదం ఇప్పటికీ రగులుతోంది. అదే, మరో ప్రజాస్వామ్యమయిన అమెరికాలో బుష్ అన్యాయంగా ఇరాక్ పై దాడి చేసినా, అఫ్గన్ తీవ్రవాదులను గుంతానమో బే లో అమానుష పరిస్థిల్లో వుంచినా పెద్దగా ఎవరూ కిక్కురుమనలేదు. అదే మన దేశంలో దేశంపై దాడి చేసినవాడిని శిక్షించాలంటే సైన్యాన్ని దింపాల్సిరావటమేకాదు, ఇప్పటికీ నిరసనలు తెలుస్తున్నాయి. ఒకసారి మసీదు దగ్గర బాంబుపేలితే, భయపడి మసీదుకెళ్ళననే కథను గొప్ప కథ అని అవార్డులిచ్చి, ముస్లింల అణచివేత అంటూ మనం ప్రచారం చేసుకుంటాం. కానీ, గుడులపై జరిగిన బాంబుదాడులు, అమర్నాథ్ యాత్రపైని తీవ్రవాదం నీడలున్నా తీవ్రవాదులను ఎదిరించి మరీ గుళ్ళకు యాత్రలకు వెళ్ళే ధైర్యాన్ని కథల్లో ఎక్కడా ప్రస్తావించం. ప్రస్తావిస్తే మనోభావాలు గాయపడతాయని మిన్నకుంటాం. అలాంటి దేశం మనది. ఎవరయినా దెబ్బకొడితే, అబ్బ అనె కనీ, అయ్యో అని కానీ అనకుండా, నన్నుకొట్టిన నీ చేయికి నొప్పిపుట్టించినందుకు తప్పునాదే అనే మనస్తత్వం మనది. అలాంటి దేశంలో ఇలాంటి అసంబద్ధపు, అర్ధం పర్ధం లేని కథలే ఉత్తమ కథలవుతాయి.
నిజానికి , ముస్లింలంటేనే సమాజంలో ఒక రకమయిన వెరపు వుంది. ఇప్పటికీ పాత బస్తీలోనేకాదు, ముస్లీములు అధికంగా వున్న కాలనీల్లో ధైర్యంగా తిరిగే ముస్లిమేతరులు లేరు. పోలీసులకే భయం అటు వెళ్ళలంటే…కానీ మన కథల్లో ముస్లింలు మంచివారు. హిందువులు ముస్లిం ద్వేషులు. అనాగరికులు. అలాంటి పొలిటికల్లీ కరెక్ట్ కథలే ఉత్తమ కథలు. ఈ 25ఏళ్ళ సంకలనాల్లో ఈ అంసంతో వున్న కథలనీ ఇలాంటివే…గమనిస్తే, భారత్దేశంలో వున్నంత స్వేచ్హ భద్రత, ఇస్లామీయులకు ఇస్లాం దేశాల్లోకూడా లేదు. అమ్మాయి బుర్ఖా విషయంలో మతమౌఢ్యమని చర్చించారు రచయిత్రి. కానీ, హిందూ మతమౌఢ్యం లేని యూరప్ దేశాల్లోనూ మత చిహ్నాలు ధరించకూడదని, స్థానిక భాష నేర్చుకోవాలని ఆయా ప్రభుత్వాలు( లౌకిక ప్రభుత్వాలే, రెందు చేతులతో వలసకు వచ్చినవారిని ఆహ్వానించిన దేశాలే) ఆంక్షలు విధించటం చూస్తూంటే, ప్రతి చిన్న విషయానికి మనోభావాలు గాయపడి హింసకు దిగటానికి హిందూ మతమౌఢ్యం కారణం కానేకాదని, హిందూ మతమౌఢ్యం అన్నది మన వామపక్ష, లౌకిక వాదుల ఊహ తప్ప అలాంటిది ఏమీ లేదనీ తెలుస్తుంది. కానీ, అలా లేనిదాన్ని ఉన్నట్టు రాసి, హిందూ ధర్మంపై బురదజల్లితేనే అది అచ్చమైన అలౌకికలౌకిక అభ్యుదయ కథ అవుతుంది, పొలితికల్లీ కరెక్ట్ కథ అవుతుంది. అందుకే, ఉత్తమ కథల్లో ముస్లింల అభద్రతాభావాలు కనిపిస్తాయి కానీ, తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి హాహాకారాలు రోదనలు వినిపించవు. ఆయా కుతుంబాల దయనీయ గాథలు, తమ భయాలతో జరిపే భీకర పోరాటాలు కనబడవు. మాట్లాడితే గుజరాతు గాయాలంటారు కానీ, ముంబాయి దాడిలోని పోయిన ప్రాణాల ఆర్తనాదాల ప్రసక్తి తేరు. ప్రభుత్వ హింస అని సైన్యాన్ని నరరూప రాక్షసులుగా చూపుతారు కానీ, పట్టుబడ్డ వారితో తీవ్రవాదులు పశువుల్లా వ్యవహరించే తీరు, చిక్కిన అమ్మాయిలతో క్రూరమృగాల్ల తీవ్రవాదులు వ్యవహరించే విధానము, వారికి ఆశ్రయం కల్పిస్తూన్న పందికొక్కుల్లంటి ఇంటి దొంగల ద్రోహమూ తెలుగు కథల్లో కనబడవు. ఎందుకంటే, ఒక పద్ధతి ప్రకారం నిజం చెప్పటం నేరమని నమ్మించారు. ఆబద్ధమే ఉత్తమమని స్థిరపరచారు. అందుకే, సారీ జాఫర్ లూ, జమీన్ లు ఉత్తమ కథలయ్యాయి. చంకీపూలదండలు ఉత్తమ కథలయ్యాయి.
కథగా చూసినా పాత్రల చిత్రీకరణ సరిగాలేదు. వినయ్ పాత్ర ఎందుకలా అయిందో వివరణ లేదు.( ధర్మపుత్రలో కూడా ఆ పాత్ర అలా హఠాత్తుగా ప్రవర్తిస్తుంది…నేరం రచయిత్రిది కాదు….ధర్మపుత్ర సినిమాది) ….సంపాదకులూ భారతీయ సంప్రదాయానికి ధర్మానికీ వ్యతిరేకులు కావటంతో( ఈ వ్యతిరేకత ఎలాంటిదంటే తాము సుఖంగా సంసారాలు చేసుకుంటూంటారు కానీ, కథలు దాంపత్యాన్ని తూలనాడాలి, కూల ద్రోయాలి, తాము పురుషుడి అండలో వుంటారు కానీ, మహిళలు సంసారాలు వదలి వేతులు కలిపి పోరాడాలి….వగైరా..వగైరా) ఇలాంటి అర్ధం పర్ధంలేని కథలు, అవగాహన ఆలోచన లేని కథలు, తాము ప్రచారం చేయాలనుకుంటున్న భావం వస్తే చాలు..దాని ఔచిత్యము, తర్కమూ చూడకుండా ఉత్తమ కథ అనేస్తున్నారు. నమ్మిస్తున్నారు. స్థిరపరుస్తున్నారు.
వచ్చే వ్యాసంలో మృణ్మయనాదం విశ్లేషణ వుంటుంది…

December 18, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథ- విశ్లేషణ- 13(సి)

సాధారణంగా ఒక వ్యక్తి ఏదయినా నిర్ణయానికి వచ్చేటప్పుడు అన్నీ ఆలోచిస్తాడు. అన్ని కోణాల్లోంచి విషయాన్ని విశ్లేషించి నిర్ధారించుకుంటాడు. ఒక రాజకీయ కథలో..అమ్మాయికి కష్టం వచ్చింది. మొగుడికి కష్టం వచ్చినప్పుడు ఆమె అండగా నిలబడింది. ఈంకి పిల్లలు పుట్టరని తెలియగానే, మొగుడు పట్టించుకోలేదు. అత్తగారు, అమ్మాయి అమ్మా నాన్నలను పిలిపించి అమ్మాయిని తీసుకుపొమ్మంటారు. భర్త విడాకులిస్తే సరి లేకపోతే ఎలా తీఎసుకోవాలో తనకు తెలుసని వణికించే పద్ధతులు చెప్తాడు. అప్పుడా అమ్మాయి ఉద్యోగమంటే హక్కులడుగుతారు కాబట్టి ప్రేమ, అనురాగం, దాంపత్యం అని పాతివ్రత్యమని, మాతృత్వమని మభ్యపెట్టి ఆడవారికి అన్యాయం చేస్తున్నారని తీర్మానిస్తుంది. తన భర్తకి కష్టం వస్తే యూనియన్ వారు వచ్చి ధైర్యం చెప్పారు. ఆడవాళ్ళందరూ ఒకటయి తన సహాయానికి ఎందుకు రావటం లేదు అని ఆలోచించి, ఆడవాళ్ళను విడగొట్టారని అందరూ ఒకటవాలని తీర్మానించటంతో కథ ముగుస్తుంది.
కథలో ఎక్కడా కథనమంటూ వుండదు. ఒక డాక్యుమెంటరీలా సాగుతుంది కథ. చివరికి అమ్మాయికి ఇంత జ్ఞానోదయమవటం , ఆమె చేసిన తీర్మానాలకు ఎలాంటి సమర్ధన కానీ, కారణాలు కానీ చూపలేదు. తార్కికంగా ఆలోచించటం, విషయాన్ని సూక్ష్మంగా విభజించి చూడటం లేదు. నిజానికి భర్త విడాకులిమ్మనగానే భయపడి వణికినట్తు చూపించి, భయంకరమయిన అసంబద్ధ తీర్మానాలు చేసే బదులు, ఆ అమ్మాయి కోర్టును ఆశ్రయించినట్టు, పోరాడినట్టు చూపితే నిజానికి దగ్గిరవుండేది. కానీ, అలాంటిదేమీ లేకుండా, హఠాత్తుగా వివాహ వ్యవస్థ మొత్తం అన్యాయం అని తీర్మానించేసి గొప్ప నిజం కనుక్కున్నట్టు ప్రకటించి ఇదే కథ ముగింపు అనటం కథను అర్ధవిహీనమయిన రాతగా మారుస్తుంది. ఇంతకీ తోటి స్త్రీలందరూ చేయి కలిపేరు. తరువాత ఏమయింది? వాడిని తంతారు. అమ్మాయిని వేరు తెచ్చారు. తరువాత? మళ్ళీ మరో మొగాడిని పెళ్ళి చేసుకుతుందా? కానీ, వివాహ వ్యవస్థ పనికిరాదని, మోసమనీ తీర్మానించింది కదా? కాబట్టి వివాహం లేకుండా కలసి వుంటుందా? అలాంటప్పుడూ మళ్ళీ వంది పెట్టటం వంటి చాకిరీ వుంటుంది కదా? లేక మొగుడికి చేస్తే తప్పు కానీ, అది దోపిడి అవుతుంది కానీ, పరాయి మగాడికి చేసే సేవలు అభ్యుదయము, గొప్పతనము ఆనందదాయకమూ అవుతాయా?
అవుతాయంటుంది రచయిత్రి వోల్గా తోడు కథలో!
అతని భార్య పోతుంది. ఈమె భర్త పోతాడు. పక్క పక్క ఇళ్ళు ఒకే రకమయిన పరిస్థితిలో వుండటంతో వారిద్దరూ సన్నిహితులవుతారు. ఆమె వండి పెట్టటం, అతడు ఆమెకి పనులు చేస్తూండటం జరుగుతుంది. అతడు పెళ్లి చేసుకుందామంటాడు. ఆమె….
ఈ వయసులో నా కోసం నేను బతకాలని వుంది కానీ, మరెవరి కోసమో ఎడ్జస్టవుతూ బతకాలని లేదు. మీకు సేవలు చేస్తూ బతకాలని లేదు…అంటుంది.
అంతటితో ఆగదు.
మీ మగవాళ్ళకు తోడంటే సేవలే అని నా ఉద్దేశ్యం అని పొమ్మంటుంది.
తన ఇల్లుచక్కబెట్టి , తన మంచి చెడ్డలు చూడాలనిగాక ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకునుకున్నాడు? ఎవరయినా ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు? అందుకేగా- ఆ సేవలు చెయ్యనంది విజయలక్ష్మి. ఏ ఆడదయినా ఎందుకు చెయ్యాలి? తనకు కావలసింది మంచి పనిమనిషా? మంచి తోడా ? అని ఆలోచించుకుంటాడు.
తరువాత వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. రెందు రోజులు అతని ఇంట్లో భోజనమయితో మూడు రోజులు ఆమె ఇంట్లో భోజనం. ఇంతలో అతనికి మనమడు పుడితే వూరు వెళ్తాడు. ఆమెని చూడకుండా వుండలేకపోతాడు. ఆమె కూడా అతడి కోసం ఎదురుచూస్తుంది. అతడు సంతోషంతో మతి పోయి ఆమెని కౌగలించుకుంటాడు.
ఇదీ కథ. ఈ కథ ద్వారా రచయిత్రి ఏమి చెప్పదలచుకున్నారో ఆలోచిస్తే, సమాధానాలకన్నా సందేహాలే ఎక్కువ వస్తాయి.
పెళ్ళిలో హక్కులు, సేవలు ఉంటాయి కాబట్టి పెళ్ళి వొద్దు..ఆడవాళ్ళ స్వేచ్చను ( అంటే లైంగిక స్వేచ్చ మాత్రమే) సమర్ధించే పురుషోత్తములు సంతోషంతో రచనకు ఉత్తమ రచన అన్న మార్కులేసేస్తారు.
ఆడ మగ, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళుంటూ, ఎవరి పనులు వారు చేసుకుంటూ వుండాలి. కానీ, కలుస్తూండాలి. అలా ఎలాంటి బంధనాలు, లేకుండా కలవాలి.
అమ్మాయిలు, ఎలాంటి కండిషన్లు లేకుండా వచ్చి, పనికాగానే వెళ్ళిపోవాలి, ఎలాంటి డిమాండ్లు, హక్కులు వుండకూడదని కలలుగనే పురుషులందరి వోట్లూ ఈ కథకే!!!
అంతా బాగానే వుంది. మరి చివరలో..ఆమె అతని కోసం, అతను ఆమె కోసం ఎదురుచూడటం ఎందుకు? ఆ కౌగలింత ఎందుకు? ఇప్పుడిద్దరి నదుమ ఆత్మీయత ఏర్పదింది కాబట్టి కలసి బ్రతకవచ్చనా?
ఫెనిజంలో సెకండ్ వేవ్ కు కారకురాలయిన ఎరికా జాంగ్ అనే రచయిత్రి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంది. అయినా ఆమెకు తోడు దొరకలేదు. zipless fuck అన్న పదాన్ని స్ర్ష్టించి, ఆడవాళ్ళ లైంగికతకు పెద్దపీట వేసిన ఎరికా జాంగ్, తన ప్రతి వైవాహిక సంబంధానుభవాన్ని తన రచనల్లో ప్రదర్శించింది. ఇంతకీ ఇంత లైంగిక స్వేచ్చ, ఇన్ని పెళ్ళిళ్ళు ఇన్ని సంబంధాల తరువాతయినా ఆమెకు సంతృప్తి లభించిందా?
లేదు.
తోడు లభించిందా?
లేదు.
గుస్తావ్ ఫ్లాబెర్ట్ అనే ఆయన మదాం బొవరీ అని ఒక రచన చేశాడు. ప్రేమ కోసం తపిస్తూ, మగవారి లైంగికతకు బలవటం తప్ప ప్రేమ లభించని యువతి మానసిక వ్యథను అద్భుతంగా వర్నించిన రచన అది.
ఆ రచనలో వున్న అవగాహన, సానుభూతి, ఆవేదనలు లేకుండా, ఎవరికి వారు బ్రతకాలి, కలవాలి, పోవాలి అంటే, అది అర్ధం లేని సిద్ధాంతం తప్ప ఆచరణీయము, అనుసరణీయము, అభిలషణీయము కాదు.
ఒక్క సారి ఈ కథలో చూపించినట్టు, పురుషులు స్త్రీలు ఎవరికి వారే వున్నారనుకుందాం. ఎవరిపైనా ఎవరికీ హక్కులు లేవు, బంధనాలు లేవు. బాధ్యతలు లేవు. అప్పుడేమవుతుంది?
ఏమవుతుంది….మానవ స్వభావంలోని మౌలిక లక్షణం…నాది..అన్నది వసరం . అది లేకపోతే సృష్తించుకుంటాడు. ఆపై నాది అన్న దానిని పట్టి తన దగ్గిరే వుంచుకోవాలనుకుంటాడు. అసూయలు, ద్వేషాలు, పోరాటాలు…అరాచకం!!!!
ఆల్ అబౌట్ ఆనా అని ఒక డేనిష్ సినిమావుంది. తొలి సారిగా మహిళలకోసం తీసిన పోర్నోగ్రాఫిక్ సినిమా అది. అనేక అవార్డులు పొందింది. దాన్లో ఆనా అనే అమ్మాయికి ఎలాంటి బంధనాలు, హక్కులు, బాధ్యతలు లేని జీవితం కావాలి. అలానే వుంతుంది. కానీ, ఒకడి పై ప్రేమ కలుగుతుంది. అసూయ మోదలవుతుంది…..
మానవ స్వభావాన్ని, సామాజిక మనస్తత్వాన్నీ అవగాహన చేసుకుని, అర్ధం చేసుకుని లోతయిన ఆలోచనతో, భవిష్యత్తు, భావి తరాలపై దృష్టి పెట్టి తార్కికంగా చేసే ఆలోచనలు వేరు. వున్న వ్యవస్థపై కసి పెంచుకుని, గోడలు కూల్చటం తప్ప, కట్టటంపై కానీ, గోడ కూల్చిన తరువాత ఏం చేయాలో అన్న దానిపై ఆలోచన కానీ, అవగాహన కానీ లేకుండా సిద్ధాంతాలను ఏర్పాతు చేసి వాటి సమర్ధన కోసం కథలు రాస్తే, ఆ వ్యవస్థను కూల్చటమే పనిగా పెట్తుకున్న వారు దాన్ని అందలానికి ఎత్తటంలో ఆశ్చర్యం ఏముంది!!! వైవాహిక వ్యవస్థను సమర్ధించేదిగా వుందని, అందరూ మెచ్చిన కథను తిరస్కరించిన సంపాదకులకు ఇలాంటి కథలు ఉత్తమంగా కనబడటంలో ఆశ్చర్యం ఏముంది?????

మరో వ్యాసంలో సారీ జాఫర్ కథ విశ్లేషణ…

December 16, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ- 13(బి)

ఒక రాజకీయ కథ మొత్తం ప్రథమపురుషలో అమ్మాయి చెప్తుంది. మధుసూధన్ అనే ఆయనను కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటుంది కొన్ని రోజులు ఆనందంగా వుంటారు. ఇంతలో అతనికి పనిచేస్తుంటే చేయి తెగిపోతుంది. అప్పుడు ఈమె ధైర్య్మ్ చెప్తుంది దగ్గర వుండి సేవ చేస్తుంది. ఆఫీసులో యూనియన్ వాళ్ళు వచ్చి కంపెంసేషన్ ఇప్పిస్తారు. అతనిఉద్యోగం పోకుండా కాపాడతారు ఇంతలో ఆమె గర్భవతి అవుతుంది. అబార్షన్ అవుతుంది.ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తారు దాంతో అమ్మాయి కష్టాలు మొదలవుతాయి. అత్తమామలు వేధిస్తారు. అతడు పిల్లలకోసం ఇంకో పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆమె తల్లితండ్రులను పిలిచి అమ్మాయిని తీసుకుపొమ్మంటారు అప్పుడా అమ్మాయి, తనకు జరిగిన అన్యాయాన్ని, సాటి మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టి..
నేను ఒంటరిగా వున్నాను. ఎందుకు? నా ఒంటరితనం వెనుక ఉన్న కుట్ర ఎలా మొదలయిది? ఆడవాళ్ళందరూ ఒకటిగా ఎందుకు లేరు? తల్లులుగా, భార్యలుగా, కూతుళ్ళుగా, అత్తలుగా, కోడళ్ళుగా, ఆడబిడ్డలుగా ఎందుకు విడిపోయారు? ఎవరు విడగొట్టారు? దాంపత్యం పేరిట, మాతృత్వం పేరిట ఎందుకింత మోసం చేస్తున్నారు?
అని ఆలోచిస్తుంది. చివరికి
నా జీవిత సాఫల్యం నా మాంగల్యంలో లేదు. నా పతి సేవల్లో లేదు. నేను కనలేని సంతానంలో లేదు. నా తోటి స్త్రీలందరితో చేయి కలపటంలోనే వుంది…
అని తీర్మానిస్తుంది. కథ అయిపోయింది.
కథా పరంగా చూస్తే..ఒక మామూలు కథ చెప్తూ..నాకాలు విరిగింది కాబట్టి అందరూ కాళ్ళు విరుచుకోండి అని చెప్పినట్టు అసంబద్ధంగా, అర్ధ రహితంగా వుందీ కథ..
ఈ వాదనలో అర్ధం కానిదేమంటే…..ఆడవాళ్ళందరూ ఒకటిగా ఎందుకు లేరు? తల్లులుగా, భార్యలుగా, కూతుళ్ళుగా, అత్తలుగా, కోడళ్ళుగా, ఆడబిడ్డలుగా ఎందుకు విడిపోయారు?…..అనటం..
అంటే ఏమిటి? మగవాళ్ళు తండ్రులుగా, కొడుకులుగా, భర్తలుగా, అన్నలుగా, తమ్ముళ్లుగా, ఉద్యోగులుగా, సేవకులుగా విడిపోలేదా? ఏమిటీ అర్ధం పర్ధంలేని వాదన?
అమ్మాయికి అన్యాయం జరిగింది. దానికి ఆ అమ్మాయి ఏం చేసింది. మహిళలారా మీరంతా ఒంటరిగా వున్నారు. ఇళ్ళనొదిలి, మొగుళ్ళనొదిలి,పిల్లలనొదిలి, తల్లి తండౄలను వదిలి వచ్చేయండి. మనమంతా చేతులు కలిపి ఒక్కటవ్వుదాం..అంటోంది.మామూలుగా ఎవరయినా ఇలా మాట్లాడితే పిచ్చాసుపత్రిలో పెడతారు. కానీ, మన తెలుగు సాహిత్యంలో ఉత్తమ కథ అని, ఉత్తమ రచయిత అని, ఉత్తమ అభ్యుదయ అభివృద్ధ పథమని, సాహిత్య అకాడెమీ బహుమతులిచ్చి, ఆదర్శం చేస్తారు…..
అనగనగా ఒక అమ్మాయి. సరయిన చదువు లేదు. వాళ్ళు లేబర్లు. భర్త తాగొచ్చి తంతాడు. అత్త వేధిస్తుంది. పిల్లలు గాలికి పెరుగుతున్నారు. అయినా ఆమె అధైర్యపడలేదు. చదువుకుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. అంచెలంచెలుగా ఎదిగింది. పెద్ద వ్యాపారి అయింది. పిల్లలను పెద్ద చేసింది. భర్తను సంసరించింది. ధనం సంపాదించి ఇప్పుడు అనాథలకు పేదలకు ఆసరా ఇస్తోంది..
ఇది కథ కాదు. ప్రఖ్యాత వ్యాపరి జ్యోతి రెడ్డి స్వీయ జీవిత గాథ..
ఒకతి నిజం..ఒకటి ఆబద్ధం…
ఆబద్ధం కన్నా నిజం బాగుంది. మనం నిజాన్ని విస్మరించి ఆబద్ధాల వెంట పడుతున్నాం… ఎండమావులను ఒయాసిస్సని భ్రమపడి జీవాలను ఎడారిపాలు చేసుకుంటున్నాం….అందుకు చక్కతినిదర్శనం కథ కాదు, వ్యాసం కాదు, కథకూ వ్యాసానికీ, అర్ధం పర్ధంలేని ఉపన్యాసానికి నదుమ కొట్తుమిట్టాడే పిచ్చి ప్రెలాపన మనకు ఉత్తమ కథ!
ఈ కథలో చూపించినటు వంటి జీవితాలున్నాయి. దుర్భరమయిన జీవితాలున్నాయి అలాంటి జీవితాలలో వెలుగు నింపి ఆశాభావం కలిగించి స్ఫూర్తి నిస్తే ఎలావుంటుంది! ఇలా, నేను అన్యాయమయిపోయానోచ్..అందరూ నాలాగే అన్యాయమయిపోండి అని పంచతంత్రంలో నీలి నక్కల్లా ప్రవర్తిస్తే ఎలావుంటుంది? సాహిత్య అకాడెమీ అవార్డు వస్తుంది. గొప్ప పేరొస్తుంది. ఎందుకంటే అసంతృప్త అభ్యుదయ జర్నలిస్టు సమాజోద్ధారక స్వార్ధ పూరిత మతిల్లోనై మేధావులతో తెలుగు సాహిత్య ప్రపంచం నిండి వుంది కాబట్టి. చివరలో కథలో ఎక్కడా substantiate చెయ్యని సిద్ధాంతాలతోఒక వ్యాసం రాస్తే అది ఉత్తమ కథ అవుతుందా?
భార్యకు అనారోగ్యం వస్తే దగ్గరుండి సేవ చేసే భర్తలున్నారు. పెద్దలమాటకు తలవంచిమెదడెదగని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం బ్రహ్మచారిగానే వుంటూ భార్యను పసిబిడ్డ గా చూసుకునే పురుషులున్నారు.
ప్రపంచ రీతి తెలుసుకోకుండా, మానవ మనస్తత్వం, బంధాలు బాంధవ్యాల స్వరూపాలు తెలియకుండా నేను నీలి ద్రవంలో పడి నీలంగా అయ్యాను కాబట్తి అందరూ నీలిరంగులోకే రావాలని, వ్యక్తిగత బలహీనతలకు జగద్రక్షకాలన్న సైంధ్ధాంతిక ముసుగు తొడిగి సమాజాన్ని మభ్యపెట్తి పబ్బం గడుపుకునే ఈ రచన ఉత్తమ రచన..అది మన దౌర్భాగ్యం
ఏ రకంగా చూసినా, ఇందులో ఉత్తమమన్నది కనబడడు.
అలైస్ వాకర్ అని ఒక వుమనిస్ట్ రచయిత్రి వుంది. ఆమె రచనలో ఒక స్త్రీ భర్తనే సర్వస్వంగా భావించి ఊడిగం చేస్తుంది. చివరికి భర్త దృష్టిలో తనకూ door mat కూ తేడా లేదని గ్రహిస్తుంది. అన్నీ వదలి తన కాళ్ళ మీద నిలుస్తుంది. తనలాంటి వారిని చేరదీస్తుంది. గౌరవంగా బ్రతుకుతుంది. స్త్రీకి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం వుండాలని చూపిస్తుంది. పిడికిళ్లు బిగించి అర్ధం పర్ధం లేని లెక్చర్లిచ్చి.అందరూ నా లాగ కండీనదు.ఆ రచన పేరు కలర్ పర్పుల్….
ప్రపంచ వ్యాప్తంగా మహిళా రచయితలు ఒక పాజిటివ్ దృక్పథంతో,మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమదింప చేయాలని చూస్తూంటున్నారు. అది ఈ కథలో ఏ కోశానా కనిపించదు. అయినా ఇది ఉత్తమకథ..
తదుపరి వ్యాసంలో తోదు కథ విశ్లేషణ వుంతుంది.

December 16, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-13(ఏ)

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాలలో వోల్గా కథలు నాలుగు ఉన్నాయి. 1992లో ఒక రాజకీయ కథ, 1993లో తోడు, 2003లో సారీ జాఫర్, 2006 లో మృణ్మయ నాదం అనే కథలను ఈ సంకలనాల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు.
వోల్గా కథలను ఇతరుల కథలలో ఒకటి రెండు కోణాలలో విశ్లేషించటం కుదరదు. తెలుగులో ఫెమినిస్ట్ రచనలకు, సాంప్రదాయంలో మహిళల పట్ల వివక్షతలను ఎత్తిచూపించటానికి ఆమె రచనలు ఎంతమందికో ప్రేరణనిచ్చి, గీటురాయిగా మారేయి. అంతకుముందు ఎందరో రచయితలు ఈ అంశాలను ఎత్తి చూపించినా దాన్ని institutionalize చేసింది వోల్గా. ఆ తరువాత వచ్చిన అభ్యుదయ ఫెమినిస్ట్ రచయిత్రులందరూ ఎంత ప్రయత్నించినా వోల్గా బాటలో నడవాల్సిరావటమే కాదు, ఎంత విభిన్నంగా తమ భావాలను సిద్ధాంతాలనూ ప్రదర్శించాలని ప్రయత్నించినా అవన్నీ వోల్గా ప్రదర్శించిన భావాల కొనసాగింపు తప్ప కొత్తవి కావు. విభిన్నం కావు. ఇంకా వీలయితే, వోల్గా భావాల వికృతి రూపాలుగా కూడా అనవచ్చు. అంత శక్తివంతమయిన రచయిత్రి, తన రచనకొక బ్రాండ్ నేం ఆపాదించగలిగిన రచయిత్రి కాబట్టి వోల్గా రచనలను ఆశామాషీగా, ఇతరుల రచనలను విశ్లేషించిన రీతిలో విశ్లేషించటం ఆమె రచనలకు అన్యాయం చేసినట్టవుతుంది.
కాబట్టి వోల్గా రచనలను, కథగా, కథ వ్ ఇస్లేషణ సూత్రాలననుసరించి విశ్లేషించాల్సివుంటుంది. కథలో వ్యక్త పరచిన ఆలోచనలు, వాటి సామంజస్యం, ఆలోచనలను వ్యక్త పరచిన తీరు, వ్యక్తపరచటంలో రచయిత్రి టోన్ …వంటివీ పరిగణించాల్సివుంటుంది. ఆ తరువాత, వ్యక్త పరచిన భావజాలం లోని తర్కము, లాభాలు నష్టాలు, ఆలోచనలను ప్రభావితం చేసిన తీరు వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుంది. ఆపై, పురాణాల ఆధారంగా తన భావాలను వ్యక్తపరచిన తీరు, కల్పనలు, కల్పనల్లోని ఔచిత్యం, కల్పనలకు ఆధారాలు, ఇలాంటి పౌరాణిక గాథలను ఆధునిక కాలానికి తమ సిద్ధాంతాల ఆధారంగా పునహ్ సృజన చేస్తున్నప్పుడు పాతించవలసిన నియమాలు దృష్టి వంటి వాటినీ పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందన్నమాట. వోల్గా రచనలపై తెలుగు సాహిత్యంలో ఇన్ని విభిన్నమయిన కోణాల్లో విశ్లేషణ జరగలేదు. ఇలాంటి విశ్లేషణలు లేకుండానే రచయిత్రి రచనల నాణ్యాన్ని నిర్ణయించటం తెలుగు సాహిత్య ప్రపంచంలోని అతి పెద్ద విషాదం. రచయితలకొక గుంపు వుంటే, అది శక్తివంతమయిన భజన్ భట్రాజ గణాల గుంపయితే ఎలాగ తెలుగు సాహిత్య ప్రపంచంలో బ్రాండ్ ను ఏర్పరచుకుని ట్రెండ్ సెట్టర్స్ గా చలామణీ అయి ఒక మూస రచనల ఘరానాను ఏర్పాటు చేయవచ్చో వోల్గా ఈ నాలుగు రచనలను విశ్లేషిస్తే బోధపడుతుంది.
నాలుగు రచనల ద్వారా ఒక రచయిత గురించి తీర్మానాలు చేయటం అసంబద్ధం అనిపించవచ్చు. అది నిజమే కూడా… mandala, all under heaven the rainbow వంటి రచనలు మాత్రమే చదివి పెర్ల్ ఎస్ బక్ గురించి తీర్మానించటం ఎంత అసంబద్ధమో , ఇలా నాలుగు కథలను ఎంచుకుని రచయిత్రి గురించి తీర్మానించటమూ అంతే అనౌచిత్యం. కానీ, ఈ విశ్లేషణ 25ఏళ్ళ ఉత్తమ కథలకు మాత్రమే పరిమితం కాబట్టి, ఎలాంటి తీర్మానాలు, వ్యాఖ్యాలు చేసినా అవి ఈ నాలుగు కథల పరిథిలొ మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ వ్యాఖ్యలు ఈ నాలుగు కథలకు పరిమితం. ఆ కథ అంత గొప్పగా వుంది, ఈ కథ ఇంకా గొప్పది లాంటి వాదనలు చర్చలకు తావివ్వకుండా, ఎలాంటి వాదనలు చేసినా ఈ నాలుగు కథల పరిథిలోనే చేయాలని మనవి.
1992లో ప్రచురితమయిన ఒక రాజకీయ కథను కథ అని ఒప్పుకోవటం కష్టం. కథకు మన విమర్శకులే, ఎత్తుగడ, ముగింపు అంటూ కొన్ని నియమాలేర్పరచారు. వాటితోపాటూ conflict, conflict resolution అంటూ కొన్ని సూత్రాలేర్పరచారు. వీటికి తోడు, కథకు ఒక ముగింపు వుండాలని, కథలో రచయిత ఉపన్యాసాలివ్వకూడదనీ చెప్పారు. అలాంటి వేవీ ఈ కథకు వర్తించవు. ముఖ్యంగా సినిమా అంతా అయిన తరువాత నేపథ్యంలో సినిమా లక్ష్యము, ఉద్దేస్యమూ వంటి వాతి గురించి ఒక ఉపన్యాసం ఇస్తే ఆ సినిమా ఎంత పనికి రానిదిగా పరిగణిస్తారో, ఆ సినిమా దర్శకుడికి ద్ర్శ్య మాథ్యమం గురించి ఏమీ తెలియదని ఎలా భావిస్తారో అలాగే చివరలో ఒక ఆలోచనోపన్యాసం వుంటే కూడా మనం ఉత్తమ కథగా పరిగణించం. కొతాగా కథలు రాసేవారికి, కథల్లో ఉపన్యాసాలు, ఆలోచనలు ఉండకూడదు.పాత్రల ప్రవర్తన ద్వారా వారు చెప్పాలనుకున్నది మనకు తెలియాలి. సంఘటనలుండాని, ఉపన్యాసాలు, ఆలోచనలు కాదు అని చెప్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి దయార్ద్రహృదయుడని చెప్పేందుకు, అతని దయ గురించి పది పేజీలు వర్ణిస్తూ రాయనవసరంలేదు. అతను నడుస్తూ ఆగిపోయి, కాలిక్రింద నలగబోయే ఒక చీమను ఆకుపైకి ఎక్కించి రోడ్ కి దూరంగా పారవేసినట్టు చెప్తే చాలు. ఒక వ్యక్తి సున్నిత హృదయుడని పది పేజీల వర్ణన అవసరంలేదు. ఒక తుమ్మెదను ఎవరో కాలితో తొక్కితే గుందెలు పిండేలా కన్నీళ్ళు పెట్టాడని చెప్తే చాలు. ఇవన్నీ కథా రచనలో మౌలికంగా కథారచయితలకు తెలియాల్సిన విషయాలు. ఉత్తమ కథా రచనకు మరో టెక్ణిక్ చెప్తారు. పాత్రలకు జరిగిన అన్యాయన్ పాత్రలే చెప్పకూడదు. సంఘటనల ద్వారా పాఠకులమనస్సులకు బోధపడాలి. నల్లవారి స్తిత్వ ఉద్యమానికి ఊపునిచ్చి బ్లాక్ సాహిత్యాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేసిన ralph ellison రచన invisible man లో ఎక్కడా ఆయన నల్లవారికి అన్యాయం జరుగుతోందంటూ ఉపన్యాసాలు దంచడు. ఆవేదన ప్రదర్శించడు. ఆక్రోషం చూపించడు. ఎవరిపైనా ద్వేషాలు ప్రదర్శించడు. కానీ, చదివేవారి మనస్సుకు హత్తులుని మెలిపెట్టేలా తన కథ మామూలుగా చెప్తాడు.
i was looking for my self and asking everyone except myself questions which i, and only i, could answer. it took me a long time and much painful boomeranging of of my expectations to achieve a realization everyone else appears to have been born with; that i am nobody but myself. but first i have to discover that i am an invisible man
ఇలా ఆరంభమవుతుంది రచన. ఎక్కడా ఎవరినీ విమర్సించటం లేదు. తన అభిప్రాయాన్ని తీర్మానాలను పాఠకుదికి చెప్పి బ్రెయిన్ వాష్ చేయాలన్న తపన లేదు. కానీ, ఈ ఆరంభ వాక్యాలు చాలు మొత్తం రచయిత దృష్టి, దుర్భరము అత్యంత ఘోరమూ అయిన అతని బాధ, పరిస్థితులు మనకు అర్ధం కావటానికి. తాను ఆకారంలేని ,ఎవరికీ కనబడని మనిషని గురించటాన్ని మించిన ఘోరం ఏముది? అంటే తానెందుకూ పనికి రాదు, ఉన్నా లేనట్టే, తన కెవరూ ఎలాంటి ప్రాధాన్యాన్నివ్వరు. ఇలా ఆ ఒక్క వాక్యం నుంచి ఎన్నెన్నో అర్ధాలను తీయవచ్చు. ఇది అసలు సిసలయిన అత్య్త్తమ రచనకు అత్యుత్తమ ఉదాహరణ. ఒక వ్యక్తి నేను invisible అని గుర్తిస్తూ మనుషుల మధ్య జీవించటం…..ఊహిస్తేనే వొళ్ళు జలదరిస్తుంది. ఇది, ప్రపంచంలో ఏ ప్రాంతలో అణాచివేతకుగురయిన ప్రతి ఒక్కరి మనస్సు స్పందన. ఎల్లలు లేను. ఈ వాక్యానికి, ఈ భావానికి, ఎల్లలు లేవు, రంగులు లేవు, లింగ భేదము లేదు. కులం లేదు. సార్వజనీన భావన అది. వ్యక్తిగతాన్ని విశ్వజనీన భావన స్థాయికి ఎదిగింపచేసి సకలమానవాళి స్వరంగా మార్చటం మనకు ఆ రచనలో కనిపిస్తుంది.
ఒక రాజకీయ కథ ఆరంభ వాక్యాలు చూడండి.
నేను చేసిన తప్పేమిటో అర్ధం కావటంలేదు. జరిగిన దానిలో ఏ కొంచెం పొరపాటున్నా, దానిని ఆపటం, మరింకో విధంగా మార్చటం నా చేతుల్లో వున్నా నాకింత కోపం రాదని చెప్పగలను. ఇలాంటి కష్టమే నా భర్తకు వస్తే ఆయనకెంత సహకరించాను. ఎంత ఓదార్చాను. ఎలా గుండెల్లో దాచుకున్నాను…..
ఇదీ ఆరంభం. ఒక సార్వజనీన మయిన సమస్యను వ్యక్తిగతం చేయటం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె భర్తకు కష్టం వచ్చింది. ఆమె ఆదుకుంది. ఆమెకు కష్టం వచ్చింది. భర్త ఆదుకోలేదు. ఆమెకు కోపం వచ్చింది. ఇది వ్యక్తి గతమయిపోయింది. ఆమెకు వచ్చిన కష్టం అందరికీ రావాలని లేదు. ఆమె భర్తలా ప్రతి భర్త వుండాలని లేదు. కానీ, ఈ కథ ద్వారా రచయిత్రి మగవాళ్ళంతా ఇంతే. ఈ సమాజము, ఈ వైవాహిక వ్యవస్థ అంతా ఇంతే….అని చూపించాలని ప్రయత్నించారు. అంటే వ్యక్తిగత సమస్యను సార్వజనీన సమస్యలా చేసి మనుషులంతా గొర్రెలన్న ఆలోచనతో, అందరూ జీరక్స్ కాపీలు, ఇలాగే వుంటారన్న భావనను రచయిత్రి ఈ కథ ద్వారా ప్రదర్సించారన్నమాట.
సార్వజనీన భావనను వ్యక్తిగత జీవిత గాథగా ప్రదర్శితూ దానిలోని సార్వజనీనతను ప్రదర్సించటం ఉత్తమమా? వ్యక్తిగత భావనను సార్వజనీన భావనగా ప్రదర్సించి దాన్ని సమాజానికి వ్యవస్థకు ఆపాదించి విమర్సించటం ఉత్తమమా? ప్రపంచ సాహిత్యం మొదతిది ఉత్తమం అంటుంది. తెలుగు సాహిత్య పెద్దలు రెండవది ఉత్తమం అంటారు. ఇంకా ముందుకు వెళ్తే, తెలుగు సాహిత్యం ఉత్తమమనేదెంత ఉత్తనో తెలుస్తుంది..

ఇది వచ్చే వ్యాసంలో…..

December 15, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized