Archive for January, 2017

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల విశ్లేషణ-14(c)

కుప్పిలి పద్మ రచించిన మరో రెండు కథలు 2003లో వర్షపు జల్లులో, 2013లో లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ , ఉత్తమ కథలుగా 25ఏళ్ళ ఉత్తమ కథల సంపాదకులు ఎంపిక చేశారు. అయితే, ఈ రెండు కథలు చదువుతూంటే, ఇవి, సాలభంజిక కథలోంచి పుట్తిన ఉప కథలుగా అనిపిస్తాయి తప్ప ప్రత్యేకమయిన కథలుగా అనిపించవు. సాధారణంగా, ఒక కళాకారుడి ఒక కళాప్రదర్శన బాగా పాపులర్ అయితే, కళాకారుడు మళ్ళీ మళ్ళీ అలానే కళాప్రదర్శన చేయాలని ప్రదర్శిస్తాడు. కానీ, మొదటి సారి ఉన్న కొత్తదనం తరువాత వుండదు. ఇమేజీకి బందీ అవటం అంటారు దీన్ని. బహుషా సాలభంజిక కథలో మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేయటం , ఆడవాళ్ళు అన్యాయం అయిపోవటాన్ని చూపించిందని విమర్శకుల నుంచి లభించిన ప్రశంశలు కలిగించిన అభిప్రాయం వల్ల కావచ్చు, ఇక అలాంటి కథలయితేనే మీపులభిస్తుందనేమో, విమర్శకులు తననుంచి అలాంటి కథలే ఆశిస్తారనేమో సాలభంజికలా, పురుషులు అమ్మాయిలను పెళ్ళి పేరుతోనో, మరింకో ఆశచూపో, ప్రలోభ పెట్టి మోసం చేయటమనె అంశమే ఈ రెండు కథల్లోనూ కనిపిస్తుంది. బహుషా తాము ఆశిస్తోందో అందించిందనో ఈ రెండు కథల్లో ఏ మాత్రం కొత్తదనము లేకున్నా, ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
వర్షపు జల్లులో కథ ఆరంభంలో మహి అన్న అమ్మాయి వర్షాన్ని చూస్తూ విషాదంగా వుంటే, వాళ్ళమ్మ, ఏమయింది మహీ? అని అడుగుతుంది. అవును ఏమయింది…అని నాయిక గతంలోకి జారుకుంతుంది…ఇంటర్మేడియట్ లో చేరినప్పటినుంచి మహిలో న్యూనత భావం కలుగుతూంటుంది…తన జీవితంపట్ల, పరిస్థితులపట్ల అసంతృప్తి కలుగుతుంది. క్లాస్ మేట్ దీపాలి కజిన్ ప్రదీప్ ఆమెని కలుస్తాడు. అతను ఆమెని ప్రలోభ పెడతాడు. రెయిన్ డాన్స్ కు తీసుకెళ్తాడు. బీర్ తాగిస్తాడు. ఒకరోజు గెస్ట్ హౌజ్ కి తీసుకెళ్తాడు. ఆమెకు భయం వేసి పరుగెత్తుకుని వచ్చేస్తుంది. ఆమె ఫోన్ చేస్తే, సరిగా మాట్లడడు. పారిపోయావ్ అంటాడు. అన్నీ పెళ్ళి తరువాతే అంటుంది. వెంటనే అతడు..రోజూ తిరిగేవాళ్ళంతా పెళ్ళిచేసుకుంటారనుకుంటున్నావా అని అవమానకరంగా మాట్లాడతాడు. ఇదీ ఆమె బాధ. అది తల్లికి చెప్తుంది. అప్పుడు తల్లి ఓ లెక్చరిచ్చి, కొన్నిసార్లు గాయపడటం అనివార్యం. కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది అని అంటుంది..అంతవరకూ అద్భుతంగా అనిపించని వర్షపు ధ్వని అప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది…ఇదీ కథ.
ఒకరకంగా చూస్తే, ఇలాంటి కథలు బోలెడన్ని వచ్చాయి. ఇంతకన్నా ముందుకెళ్ళి, అబ్బాయి ప్రేమ నటించి, ప్రేమ పేరుతో అమ్మాయిని లొంగదీసుకుని తరువాత వదిలేయటం, బెదిరించటం, బ్లాక్ మెయిల్ చేయటం….ఇలాంటి కథలు బోలెడొచ్చాయి. సినిమాలూ బోలెడున్నాయి. అనేక పాత సినిమాల్లో హీరో చెల్లి ఇలా దెబ్బతింటుంది. వాటితో పోలిస్తే, ఈ కథలోని ప్రదీప్ అమాయకుడే. అమ్మాయి ఒక్కసారి పారిపోగానే తన అసలు రూపం చూపించేసాడు. అనుకున్నది సాధించాలనుకునేవాడు మనసులో కోరిక దాచి, మంచిగా నటించి, అమ్మాయి విశ్వాసం చూరగొని అప్పుడు స్నేహమనో, ప్రేమానో బలహీనం చేసి పబ్బం గడుపుకుంటాడు. అలాంటి కథలూ బోలెడన్ని ఉన్నాయి. ఈ ఉత్తమ కథలను ఎంచుకునే సంపాదకులు ఈసడించే కమర్షియల్ పాపులర్ రచయితలెంతోమంది ఇలాంటి కథలు పలు విభిన్న పద్ధతులలో రచించారు. కొందరు సృంగార కథగా, ఇంకొందరు ట్రాజెడీగా, మరింకొందరు అన్యాయంగా, ఆక్రోశంతో ఇలా పలు విభిన్న కోణాల్లో ఇలాంటి కథలు ఇంతకన్నా ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా రచించారు. వాటికన్నా ఈ కథ ఏ విధంగా భిన్నమో, ఏ విధంగా ఉత్తమమో ఎంత ఆలోచించినా బోధపడదు. అయితే, మేము మెచ్చిందే ఉత్తమ కథ అని సంపాదకులంటారు..కాబట్టి ఈ సంకలనాల సంపాదకులు అమాయకులని, తమకు నచ్చినవారి సాహిత్యం తప్ప మరొకటి చదవరనీ, అందుకే ఇది ఉత్తమ కథగా వారికి తోచిందనీ అనుకోవచ్చు. ఇలాంటి అమాయకులు , సాహిత్యం చదవని వారు ఎంచుకునే ఉత్తమ కథలే ఉత్తమ కథలుగా మిగులుతున్న తెలుగు సాహిత్యం ఎంత అదృష్టం చేసుకుందీ అని ఆనందంతో కన్నీళ్ళు ఎవరికయినా వస్తే నేరం నాది కాదు, కథది..ఉత్తమ కథగా ఎంపిక చేసిన సంపాదకులది.
ఈ కథలోని ప్రదీప్ సాలభంజికలో సురేష్ పాత్రకు దగ్గరగా అనిపిస్తాడు. దాన్లో పెళ్ళి ప్రలోభం చూపించి అమ్మాయిని వాదుకుంటాడు సురేష్. దీన్లో ప్రదీప్ పాపల్ రెయిన్ డాన్స్ కు తీసుకెళ్ళి, బీరు తాగించి, అంతా తిప్పి గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళి, దెబ్బతిని అసలు రూపం చూపించేస్తాడు. అందుకే ఇది అమాయకమయిన మామూలు ఉత్తమ కథ అనుకోవచ్చు. అంటే మనకు మామూలు, సంపాదకులకు అమాయకమయిన ఉత్తమ కథ.
2013 ఉత్తమ కథ లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ కథలో పాత్ర అమాయకత్వాన్ని పోగొట్టుకుందేమోకానీ, సంపాదకులు మాత్రం తమ అమాయకత్వాన్ని అలాగే కాపాదుకుంటూ వస్తున్నారని నిరూపిస్తుందీ ఉత్తమ కథ.
ఇదీ, అబ్బాయి, అమ్మాయిని మోసం చేసే కథనే. అంటే ఒక పదేళ్ళ తరువాత మళ్ళీ మోసం కథే ఉత్తమ కథ అయిందన్నమాట. దీన్లో ఒక సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ విహాన్, దర్శన అనే అమ్మాయితో హాయిగా గడపటానికి షూటింగ్ స్పాట్ కు రమ్మంటాడు. ఆమె రాగానే, అతడి కేరీర్ కి ప్రాముఖ్యం అయిన హనీ అనే ఆమె వస్తుంది. దాంతో దర్శనని నడిరోడ్ లో వదలి పరుగెత్తుతాడు. దర్శన డబ్బులు కార్డులు లేక ఎంతో ఇబ్బంది పడుతుంది. ఎంత ఫోన్ చేసినా విహాన్ సమాధానమివ్వడు. ఆమెకి అతడు జీపులో మరో అమ్మాయితో కనిపిస్తాడు. మరుసటి రోజు ఆమెని విమానం ఎక్కిస్తూ ఏదో కథ చెప్తాడు. ఆమె ఆఫీసుకి వస్తే, ఆఫీసుతో బాసుతో మంచిగా వుంటే సమస్యలుండవని కోలీగులు చెప్తారు.
వోసారి అతనితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళు..నీకీ గోల వదలిపోతుంది..కన్ను గీటుతూ అంది వినీత…
ఐకాంట్ అంది దర్శన.
వో మై డియర్. నీదంతా చాదస్తం. నువ్వు నీ వర్క్ తో మాత్రమే శాటిస్ఫై చెయ్యలేవ్. మేమది ముందే రియలైజ్ అయ్యం. అందుకే ఇప్పుడు చూడు మాకు రోజూ వాడి సతాయింపు వుండదు. పైగా రోజూ పాంపర్ చేస్తాడు. వో పెగ్..వో హగ్ అంతే..అంతుంది..
వాదికంత ఇంపార్టెన్స్ లేదని దర్శన అంటే…
ఆర్యూ మేడ్…ఎక్కడయినా ఇంతే…దానికోసం మరో ఆర్గనైజేషన్ మారటం వేస్ట్…నీకు తెలుసా..నా కాస్మొటెక్స్ బిల్ వొకడికి, నా ఫేషియల్, సెలూన్ బిల్ ఒకడికి ఇచ్చేస్తూంటాను ప్రతి నెలా..దర్శనా ఈ యేజ్లోనే మగవాళ్ళకి మనపై ఆసక్తి వుంటుంది. క్యాష్ ఇట్..ఆ తర్వాత పెళ్ళి పిల్లలు, మన హబ్బీకూడా మనవైపు ఆసక్తిగా చూడడు. అతనికి అవకాశాలు కేరీర్లో బోలెడుంటాయి..మన బాస్ లా…
ఇలా..చెప్తుంది..ఇప్పుడే బాస్ తో ఎంజాయ్ చేసి సమస్యలు సాల్వ్ చేసుకోమంటుంది. అక్కడ విహాన్ దర్శనని పెళ్లి చేసుకుంటే హనీ తనని దూరంపెడుతుందనీ అనుకుంటాడు.
ఇంతలో హనీ ఇంకో యువ కళాకారుదితో బయటకు వెళ్తుంది. సినిమా అవకాశాలు కావాలనుకున్న మరొకడిని గే డైరెక్టర్ రమ్మంటాడు…ఇదే సమయానికి దర్శన బాస్ తో రాజీ పడుతుంది. టే తాగుతుంది. మళ్ళీ విహాన్ ఖండాలాకు పిలిస్తాడు. వెళ్తుంది. అతను హనీ గురించి ఆలోచిస్తూంటాడు. గే ఉదంతం చెప్తాడు. యే ఫీల్డ్ అయితేనేమి క్యాట్( అచ్చుతప్పుకాదు) రేస్లొ అందరం భాగస్తులమే అనుకుంటుంది. కారులో స్టీవీ వండర్ పాట లవ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ లవ్ టుడే…అన్న పాట వస్తూంటుంది. ఇదీ కథ…
ఈ కథ చదువుతూంటే ఒక ఆలోచన వస్తుంది. సరిగ్గా ఇదే సమయానికి బ్లాగుల్లో, ఫేస్ బుక్లో కొందరు ఆడ రీసెర్చ్ స్కాలర్ల గురించి మాట్లాడుతూ అందరూ ప్రొఫెసర్లతో చేస్తారని ఏవో కామెంట్లు వేసుకుంటే, ఆడవాళ్ళగురించి అవమానకరంగా వ్యాఖ్యానించారని వారిపై కేసులుపెట్టి వారిని బ్లాగుల్లోంచి, ఫేస్ బుక్లోంచి తరిమికొట్టారు. ఆ సమయంలోనే ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకున్నారు. ఈ కథలో ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళంతా బాసులతో…వాది సంత్ర్ప్తి కోసం ఓ హగ్..వో పెగ్ తో రాజీపడతారని..మగవాళ్ళు బాసుల్లా వుంటారని..పెళ్ళయితే హబ్బీ కూడా చూడదు కాబట్టి ఇప్పుడే కేష్ చేసుకోవాలనీ….
మగవాళ్ళ కామెంట్లకన్నా ఎక్కువ డామేజింగా, ఆడవాళ్ళ పత్ల, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ పట్ల అపోహలను మరింత పెంచే రీతిలో వుందీ కథ. మగవాళ్ళ టాక్, అవమానకరం అయి, మహిళా రచయిత్రి ఒక హగ్..ఒక పెగ్..ఉత్తమం ఎలా అయింది? పైగా, ఒక మహిళే ఉద్యోగాలు చేసే అందరూ ఒక హగ్, ఒక పెగ్, అనీ ఇప్పుడే కేష్ చేసుకోవాలనీ రాస్తే…అది నిజమని భ్రమపడటంలో తప్పేముంది? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు అవాకులూ చవాకులూ రాస్తే అది ఉత్తమమా? ఎవరో ఒకరో ఇద్దరో హగ్ పెగ్ కు ఒప్పుకుంటే వాళ్ళ వల్ల చులకనకు గురై, బాసు వేధిస్తూంటే చెప్పుకోలేని బాధకు గురయే మహిళా ఉద్యోగులెందరో వున్నారు. ఈ కథ వాళ్ళకి ఏం సందేశం ఇస్తోంది..ఒప్పుకుని సమస్యలను పరిష్కరించుకోమంటోంది. ఇదేనా మహిళల ఆత్మగౌరవం..ఆత్మవిశ్వాసం..ఇదేనా ఫెమినిజం?
ఈ కథలో స్త్రీ పాత్రలను గమనించండి..ఒక్క స్త్రీ పాత్ర కూడా సవ్యంగా లేదు. హనీ, యువకుడు కనిపిస్తే, వాదిని ఫారిన్ తీసుకెళ్తుంది. వాదితో హాలిడేలు గడిపేస్తుంది. నాయిక కోలీఫు హఫ్ పెగ్…కెషిట్..దర్శన విహాన్ తో హాలిడే కు వెళ్తుంది..వాదితో పెళ్ళి తేలకుండానే ఖండాలా వెళ్తుంది..ఇది క్యాట్ రేసు అంతుంది. బాసుతో టే తాగి తిట్టుకుంటుంది. ఇందులో ఏదీ వ్యక్తిత్వం? ఏదీ ఆత్మ గౌరవం? సాలభంజికలు కథలో కళ్ళపై ముద్దుపెట్తుకుని గట్తిగా హత్తుకుని నీకు మంచి మొగుడిని వెతుకుతానంతుందో పాత్ర..ఇందులో హాలిడే కి వెళ్ళి వాది పొందుకోసం తపిస్తూ, వాదు విస్మరిస్తే, వాడి గురించి భయపడుతూ పెళ్ళి ప్రస్తావన తెస్తుంది..వాడేమీ వాగ్దానాలు చేయకున్నా మళ్ళీ ఖండాలా వెళ్తుంది. ఇదేనా ఫెమినిస్ట్ కథలు చెప్పే స్త్రీ వ్యక్తిత్వం..లేక ఆడవాళ్ళిలా వున్నారని చూపిస్తోందా ఈ కథ..ఇలా నష్టపోతున్నారని చెప్తోందా? కానీ నాయిక కొలీగు ఫేషియల్ ఒకడు, ఇంకో ఖర్చు ఇంకోడు అన్నది చూస్తూంటే ఆడవాళ్ళే కేష్ చేసుకుంటున్నాట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఈ కథ గొప్పతనం ఏమిటి? అందరూ కేట్ రేసులో వున్నారని చెప్పటమా? దానికి అందమయిన ప్రక్ర్తి వర్ణనలు, ప్రేమ భావనలు ఇవన్నీ అప్రస్తుతం కాదా? అప్పుడు ఆఫీసు, హారాస్మెంటు..హగ్ పెగ్ వైద్యం…చూపిస్తే సరిపోయేదికదా?
ఏమిటో…ఇదొక ఉత్తమ కథ…దీన్ని చదివి ఇదెందుకు ఉత్తమమయిందో ఆలోచించి విశ్లేషించాలి….
ఒక్క పాత్రకూ వ్యక్తితవ్మ్ లేదు. తనని పిలిచి నదిరోడ్డుమీద వదిలివాది గురించి తపించి మళ్ళీ వాదు పిలవగానే ఖండాలా వెళ్ళిన అమ్మాయిని, ఆ అమ్మాయిపాత్రను సృష్తించిన వారిని, దాన్ని ఉత్తమ కథగా భావించిన వారినీ, ఒక రెండు రోజులు రంగనాయకమ్మ ముందు పారిపోకుండా నిలబెడితే, అప్పుడు వ్యక్తిత్వం , ఆత్మ గౌరవం అంటే తెలిసొస్తుంది. హై క్లాస్ లేడీస్ అంటా ఇమ్మోరల్ అనీ, నీతులూ నియమాలు లేనివారనీ ఉన్న అపోహలను పెంచుతూ, ఆధునిక మహిళలు సెక్స్ ఫస్ట్, మిగతావి తరువాత అనుకుంటున్నారన్న అపోహలను పెంచటమే ఫెమినిజం అయితే, తెలుగు మహిళోద్ధారకులంతా ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం వుంది.
మాకు నచ్చింది, మేము డబ్బులుపెడుతున్నాము కాబట్టి మేమేదంటే అదే ఉత్తమ కథ అనే అహంకారాల స్థానన్న్ని జవాబుదరీ ఆక్రమించనంతవరకూ ఇలాంటి అర్ధం పర్ధం లేని ఉడికీ ఉడకని ఫోకస్ లేని రచనలు ఉత్తమ రచనలవుతాయి. వ్యక్తిత్వం లేని వారూ, ఆత్మగౌరవం ఆత్మవ్శ్వాసం, నైతిక విలువలు, బాధ్యతలు లేని పాత్రలూ ఫెమినిజానికి ప్రతీకలుగా నిలచి మహిళల పట్ల వున్న చులకన్ అభిప్రాయాన్ని మరింత చులకన చేస్తాయి… ఇలాంటి సందర్భాలలోనే అనిపిస్తుంది….ఉత్తమ కథలను నిర్ణయించేవారికి డబ్బు మాత్రమే కాక కనీస సాహిత్య పరిజ్ఞానం, కాస్త విచక్షణ, ఇంకాస్త విలువలపైన విలువ అర్హతలుగా వుంటే బాగుంటుందేమో అని. లేకపోతే, పిగ్మీలంతా మేరు శిఖరాలయి తెలుగు సాహిత్యం దిగ్గజాలై దిశా నిర్దేశనం చేసేస్తూంటారు. అప్పుడు తెలుగు సాహిత్యం ఏ దిక్కు పోతుందో చెప్పనవసరం లేదు. చుట్టూ చూస్తే చాలు.
వచ్చే వ్యాసంలో ఆడెపు లక్స్మీపతి కథల విశ్లేషణ వుంతుంది.

January 17, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథల విశ్లేషణ- 14(బి)

2001 సవత్సరం ఉత్తమ కథల సంకలనంలో కుప్పిలి పద్మ కథ సాలభంజిక తెలుగు కథా ప్రపంచంలో అత్యంత అధికమైన పొగడ్తలకు గురయిన ఆధునిక కథలలో ఒకటి. ఉత్తమ కథ అనగానే సాలభంజిక అంటారు. గ్లోబలైజేషన్లో స్త్రీ ఎక్స్ప్లైటేషన్ అనగానే సాలభంజిక అంటారు.
అంతవరకూ ప్రచురితమయిన కథల్లోంచి 20 ఏళ్ళ ఉత్తమకథలుగా ఎంచుకున్న 30 కథలలో కుప్పిలిపద్మ రచించిన సాలభంజిక ఒకటి. 2000డశకంలోనే రాగలిగే కథల జాబితాలో ఈ కథను కూడా పేర్కొన్నారు జంపాల చౌధరి. కుటుంబం బయటా లోపలా బహుముఖీనమైన దోపిడికి గురవుతూ కూడా అలుపెరుగని పోరాటం చేస్తోన్న స్త్రీల విషాద జీవితాన్ని చిత్రించిన కథ ఇదీని ఏకే ప్రభాకర్ ముందుమాటలో సాలభంజిక కథను ప్రస్తావించారు. సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితంగా జీవితంలో నెలకొన్న కనిపించిన బీభత్సం ఎంత భయానకంగా వుంటుందో సాలభంజిక కథలో కుప్పిలి పద్మ చెప్పిన తీరు గగుర్పాటు కలిగిస్తుందని గుడిపాటి ముందుమాటలో రాశారు. 2001లో ఈ కథ ఎంపికను వివరిస్తూ వాసిరెడ్డి నవీన్, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇక్కడి పాలకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవటం చాలా కథల్లో కనిపిస్తుంది. అలాబలైపోతున్న జీవితాలకు ప్రతినిథులే అంటూ ఇచ్చిన పాత్రల జాబితాల్లో సాలభంజిక లొని పాత్ర అంజలి కూడా వుంది. ఇవే కాక, ఉత్తమ కథలెలా రాయాలని ఈ మధ్య రాసిన వాళ్ళంతా సాలభంజికను పొగడుతారు. విదేశాల్లో సభల్లో కథల గురించి మాట్లాడేవారు కుప్పిలి పద్మ పేరు, సాలభంజిక కథ ప్రస్తావించకుండా వుండరు.
అందరూ ఇంతగా పొగడిన సాలభంజిక కథ చదివితే……వీళ్ళంతా కథను చదివి పొగిడేరా? రచయిత్రి పేరు చూసి, కథాంశం చూసి పొగిడేరా? అన్న అనుమానం వస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గత 15ఏళ్ళుగా పేరున్న, పేరులేని ప్రతి ఒక్కరు ఈ కథను ప్రస్తావించారు. రచయిత్రిని పెద్ద రచయిత్రిగా పరిగణిస్తారు. కథల గురించి సమావేశాల్లో కొత్త/చిన్న కథకులకు ఉపన్యాసాలిప్పిస్తారు. కథ చదువుతూంటే వీరంతా కథ చదివి మాట్లాదుతున్నారా? లేక, ఒకరు పొగిడేరు కాబట్టి , పొగడకపోతే ఏమైనా అనుకుంటారేమోనని పొగడుతున్నారా అర్ధంకాదు. తెలుగు సాహిత్య ప్రపంచంలో కథను బట్టి గాక, రచయిత పేరును బట్టి ఉత్తమ కథలనెన్నుకుంటారని, పదే పదే ప్రస్తావిస్తూ ఆ కథను, రచయితను ఒక పీఠంపై నిలబెడతారని అనేందుకు చక్కని ఉదాహరణ ఈ కథ.
కథా రచనలో మౌలిక సూత్రం కథను ప్రథమ పురుషలో చెప్తే, కథ సాంతం అలాగే చెప్పాలి. లేదూ ఠర్డ్ పెర్సొన్ లో చెప్తే అలాగే చెప్పాలి. ఒకసారి థర్డ్ పర్సొన్లో, మరోసారి ప్రథమపురషలో చెప్పటం దోషం. ఈ కథలో రచయిత్రి కాస్సేపు థర్డ్ పెర్సొన్ లో చెప్పటం, అక్కడక్కడా మరచిపోయి నేనూ అంటూ ప్రథమ పురుషలోకి దిగిపోవటం కనిపిస్తుంది. ప్రచురించిన పత్రికవారు పట్తించుకోలేదు. ఉత్తమ కథగా ఎంచుకున్న సంపాదకులు పట్తించుకోలేదు. 20ఏళ్ళ ఊతమ కథగా ఎంచుకున్న ముగ్గురు సంపాదకులు పట్టించుకోలేదు. చివరికి మళ్ళీ అన్నీ కలిపివేస్తున్నప్పుడూ గమనించలేదు. కనీసం, మరో ఎడిషన్లో ఈ మౌలిక దోశం సవరించుకుంటారని ఆశిద్దాం. ఇన్నాళ్లూ ఎవరూ ఈ దోశం గమనించకపోవటానికి కారణం..ఎవ్వరూ కథ చదవకపోవటమే! కుప్పిలి పద్మ కథ..సంకలనంలో వుండాల్సిందే. గ్లోబలైజేషన్లో స్త్రీలను లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేసే కథ..అంతే…అది ఉత్తమ కథ అయిపోయింది. ఇదీ మన తెలుగు కథల ఉత్తమ కథల అసలు కథ….
అంటే రచయిత పేరు, కథాంశం చాలన్నమాట తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉత్తమ కథగా మన్ననలందుకోవటానికి. ఇవిలేనివారు ఎన్ని ఉత్తమ కథలు రాసినా వారుకానీ, వారి కథలుకానీ ఉత్తమ జాతికి చెందినవిగా పరిగణనకు గురవ్వవు.
సాలభంజిక కథ ఒక విమానాశ్రయం అరైవల్స్ లాంజిలో ఆరంభమవుతుంది. మాధురి అనే అమ్మాయి అక్కడ కూర్చుని కౌశిక్ కోసం ఎదురు చూస్తూంటుంది. మాధురి అనే అమ్మాయి ఎస్కార్టులు. విదేశీయులను రిసీవ్ చేసుకుని వారికి కంపానియన్లలా వుంటారు. తప్పొప్పులు ఆలోచించకు..మంచుఇ జీతం అని నేహా అనే ఆమె మాధురిని వొప్పిస్తుంది. ఇదంతా కథ చెప్పేలోగా, కౌశిక్ వస్తాడు. వారు ఇంటికి వెళ్ళేసరికి కౌశిక్ ఆమె భార్యా భర్తలని వాళ్ళకో పాప వుందనీ తెలుస్తుంది.
ఇక్కడ నేహా తనను ఒప్పించిన విధానం వివరిస్తూన్న చోట…..సోయాసాస్ కీ, టొమాటో సాస్ కీ తేడా తెలియనంతగా నాలిక తడి ఆరిపోయి వున్నానేమో ఇంక మంచూరియా రుచినేం చెప్తా….అన్న దగ్గర ఆగిపోతాం…ఇంతవరకూ మాధురి చూస్తోంది, ఆలోచిస్తోంది అని చెప్తూన్న కథ హఠాత్తుగా నేను అని చెప్తోందేమిటని…..అయితే, ఇది చాలా గొప్ప కథ కదా..ఇదేదో అచ్చు తప్పు అనుకుని ముందుకు సాగుతాం…
ఇంటికి వెళ్ళినతరువాత కౌశిక్ గతం తలచుకుని బాధపడవద్దని ఆమెకు నచ్చ చెప్తాడు. ఇక్కడినుంచి మళ్ళీ పొరలు పొరలుగా జ్ఞాపకాలు అంటుంది రచయిత్రి…ఇక్కడ మళ్ళీ నేహా మాధురిని వొప్పించే ప్రయత్నం చేస్తుంది. వుద్యోగం వదలి ఏం చేస్తారు, ఇదే బెస్ట్ అన్నట్తు చెప్తూంటుంది. ఇక్కడ రచయిత్రి మాధురి పాత్ర ఆలోచనలను మళ్ళీ నేను అంటూ చెప్తుంది.
మళ్ళీ ఉలిక్కి పడతాం. అది ఆలోచనా సంభాషణా అని మరో సారి జాగ్రత్తగా చదువుతాం. అది ఆలోచనే…రచయిత్రి పాత్రలో దూరి నేను అంటూ ఆలోచనలను చెప్తోంది. ఒక్కచోట కాదు, ఆ పేరా అంతా…చూస్తూండలేకపోయాను, సంబరపడిపోయాను, తృప్తిపరచానో, ….ఇలా నేను ప్రయోగం వుండటం….రచయిత్రి ఒక్కసారి కథను రాసిన తరువాత చదివిచూసుకోకపోవటమేకాదు, పత్రికలో సబ్ ఎడిటర్ నుంచి…15ఏళ్ళుగా కళ్ళున్న ఏ విమర్శకుడూ దీన్ని చూడలేదనీ, చూడకుండానే ఉత్తమకథని పొగిడేశారని, పాఠకులంటే, సాహిత్యమంటే వీరందరికీ ఎంత గౌరవం వుందోననీ అర్ధమయిపోతుంది.
అంతేకాదు, ప్రతి తెలుగు పాఠకుడు ప్రతి రచయిత ఇకపై ఎవరయినా ఏదయినా కథను ఉత్తమ కథ అంటే, ఆ కథను చదివినట్టు ఆ విమర్శకుడు నిరూపించుకోవాలని నిలదీసి అడగితేకానీ, ఇలాంటి కథలను శైలీ శిల్పాల పరంగా ఉదాహరణగా చూపి మెచ్చటం ఆపరు. కనీసం, భయంతోనయినా కథను ఒక్కసారయినా చదివి పోగడుతారు.
మాధురి ఉద్యోగం మానేయాలనుకుంటే ఇంట్లోవాళ్ళు బాధపడతారు. భయపడతారు.
ఈ పరిస్థితి మనకు గ్లోబలైజేషన్ తోనే రాలేదు. అంతకు ముందు అంతులేని కథలోనూ మనం అమ్మాయి ఇంటికోసం అన్నీ త్యాగం చేయటం చూశాం. ఏదిపాపం? అనే నవలలో భర్త ప్రమాదంలో వికలాంగుడయితే, భార్య కుటుంబాన్ని పోషించటానికి వ్యభిచరించటం..నిజం తెలిసిన తరువాత ఆమె త్యాగాన్ని గుర్తించటం అటుంచి, సానుభూతికూడా ఎవరూ చూపరు. ఇలాంటి కథలు చదివేం. సినిమాల్లోనూ, వ్యభిచరించి కుతుంబాన్ని పైకి తెస్తే అందరూ ఆమెని ఈసడించటం చూశాం. ఆ రచనలన్నీ 2000కు ముందే….వాతికీ, ఈ కథకీ తేడా అల్లా వేశ్యలనో, అక్రమ సంబంధాలనో, ఉపుదుగత్తె అనో కాక, ఎస్కార్ట్లు, కంపానియన్లు అవటం. అంతే తప్ప ఈ కథలో కొత్తదనమూ, అత్యద్భుతమూ ఏమీ లేవు. కనీసం కథంతా ఒకే పురుషలో చెప్పటమూ లేదు.
ఫ్లాష్ బాక్లో మాధురి సినిమాటిక్ సమస్యలన్నీ తెలుస్తాయి. తరువాత అంజలి పాత్ర వస్తుంది. ఈమె గొప్పలు చెప్పుకుంటుంది. సురేష్ అనేవాదు ఆమె గురించి చులకనగా మాట్లాడతాడు. ఇంతలో మాధురి ఈ ఉద్యోగం వదలి ఓ హోటెల్ లో చేరుతుంది. అక్కడ కౌశిక్ పరిచయమవుతాడు. ఇంగ్లీషు సినిమాల్లోలాగా వాళ్ళిద్దరూ దగ్గరయిపోతారు. ఆమె కనురెప్పలపై పెదవులాంచి నీకో అబ్బాయిని వెతుకుతానంటాడు కౌషిక్. అతడిని మరింత గాఢంగా పెనవేసుకుని మనమే పెళ్ళి చేసుకోవచ్చుగా అంటుంది. బహుషా మన అసంతృప్త జర్నలిస్టు విమర్శకులకు పెళ్ళి తరువాత అనకుండా సెక్స్ చేసి పెళ్ళి ప్రస్తావన చేయటం గొప్ప అభ్యుదయ ఆధునిక అభివృద్ధిగా అనిపించి ఉత్తమ కథగా తోచివుంటుంది.
ఇంతలో అంజలి వస్తుంది. సురేష్ తనని ప్రేమిస్తున్నానంటున్నాడని చెప్తుంది. మాధురి పెళ్ళి అవుతుంది.
ఇక్కడి వరకూ కథ మాధురి దృష్టి నుంచి చెప్పిన రచయిత్రి హఠాత్తుగా అంజలి దృష్టి నుంచి చెప్పతం ప్రారంభిస్తుంది. అది అర్ధం అయ్యేసరికి కాస్త సమయం పడుతుంది. సురేష్ అంజలిని తన వ్యాపారాభివృద్ధికి వాడుకుంటాడు. ఇంతలో అంజలికి సురేష్ వేరే ఎవరినో పెళ్ళి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సురేష్ ఆమెని ఖాతరు చేయడు. ఆమె డబ్బులూ ఇవ్వడు. ఇక్కడి నుంచి కథ మళ్ళీ మాధురి వైపునుంచి చెప్పటం ప్రారంభిస్తుంది రచయిత్రి. మాధురికి , అంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కారణం ఆమెకి ఎయిడ్స్.అక్కడ రచయిత్రి ….ప్రాణం పగిలింది…అన్న వాక్యం రాసింది. ప్రాణం పగలటం ఏమిటో…ఇంతకీ ఎవరి ప్రాణం పగిలింది. ఎందుకంటే రచయిత్రి ఒకసారి మాధురి వైపు నుంచి, మరోసారి అంజలి వైపు నుంచి మధ్యలో నేను వైపునుంచి కథ చెప్తున్నారు. ఇక్కడె ఎవరి ప్రాణాన్ని పగలగొట్టారో..విమర్శకులు, ఉత్తమ కథ అని పొగడినవారు చెప్పాలి, ఈ ప్రాణం పగలటం ఏమిటో..ఎవరి ప్రాణం పగిలిందో!!!!
తరువాత సెక్స్ ఎంత పెద్ద బిజినెస్సో ఒక పేరా లెక్చరిస్తుంది మాధురి ఆమె భర్తకు. ఇక్కడ కథ యేరా నిద్రరావటంలేదా…అంటూ ఆరంభమవుతుంది కాబట్టి అది రాత్రి అనుకుంటాం…ఆతరువాత అతను ఆమెని సముదాయిస్తాడు. అప్పుడు
మెల్లిగా నిద్రపోయాడు కౌశిక్.
ఆమెకి నిద్రపట్టటంలేదు…
కాస్త ఆలోన తరువాత డాలీ ఏడుపు వినిపిస్తుంది. రవ్వంత వుదయపు వెలుగులో ఆమెకి మెలకువ వస్తుంది. ఇంతలో చిట్టి చెయ్యివేసిన డాలీ తుళ్ళింతగా నవ్వుతూ బయటకు లాక్కుపోతుంది. బయట వడగళ్ళ వాన..క్రింద పిల్లలు గొడుగులూ పుస్తకాలూ విసిరేసి ఆడుతూంటారు.
ఇది అర్ధం కాదు. ఈవాన రచయిత్రి వర్ణించిన స్థలకాలాల ప్రకారం రవ్వంత వెలుతురు అందికాబట్టి ఉదయంపూట అనుకోవాలి. అప్పుడే పిల్లలు గొదుగులూ పుస్తకాలూ పారేసి ఆడటం ఏమిటి? అంత ప్రొద్దున్నే స్కూళ్ళకు వెళ్తున్నారా? స్కూళ్ళనుంచి వస్తున్నారా? స్కూళ్ళకువెళ్ళేవాళ్ళయితే తల్లితండ్రులు వర్షంలోనూ తీసుకెళ్తారు ఆడనియ్యరు. స్కూలునుంచి వస్తూంటే రవ్వంత వెలుతురు వచ్చేసమయానికి అయిపోయే స్కూళ్ళేమిటి? పిల్లలతో కలసి మాధురి ఆడుతూంటుంది. కథ అయిపోయింది.
ఇంతకీ ఆమె బాధ తీరిందా? తీరితే ఎలా తీరింది? కథంతా గతాన్ని తలచుకుని బాధపడిన మాధురి బాధ ఎలా మాయమయింది? ఇంతకీ ఈ కథకు అర్ధమేమిటి? కథలో రచయిత్రి ప్రత్యేకంగా ప్రదర్సించిన నవీనత్వమేమిటి? ప్రథమ నుంచి తృతీయకు దూకటమా? ఒకపాత్ర పక్షాన కథ చెప్తూ హఠాత్తుగా మరోపాత్ర వైపు చెప్పి మళ్ళీ ఇటు దూకటమా? లేక అక్కడక్కడా కాస్త సెక్సు కాస్త స్త్రీల అణచివేతలూ రాయటమా? ప్రేమించానని నతించి అమ్మాయిని తన వ్యాపార అభివృద్ధికి వాడే పాత్రను సృజించటమా? ఏమిటో, దీన్లో గొప్పతనము విమర్శకులే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథలు ఇంతకన్నా బాగుండేవి బోలెడన్ని చదివేము. పాకుడు రాళ్ళు నిండా ఇలాంటి పాత్రలే..కళ్యాణి, మంజరి …..దాంతో పోలిస్తే పాత్ర చిత్రణ, సన్నివేశ సృష్టీకరణ ఏమీ లేవీకథలో…. పైగా, ఆరంభమ్నుంచీ ఎలాంటి ఆసక్తి కలగదీ కథలో….కనీసం మానసిక సంఘర్షణలూ, మనస్తత్వ పరిశీలనలూ లేవు. మరి ఏరకంగా ఇది పదే పదే ప్రస్తావించే ఉత్తమ కథ అయింది?
కథా రచనలో ఒక ప్రణాళిక వుంతుంది. అయితే ఆరంభమ్నుంచీ ప్రధాన పాత్రల వైపునుంచి మార్చి మార్చి కథ చెప్పటం ఒక ప్రక్రియ. లేదంటే కథంతా ఒక పాత్ర వైపునుంచి చెప్తూ, మిగతావన్నీ ఆ పాత్ర దృష్తితో చూపటం మరో ప్రక్రియ. అలాంటిదేమీ లేక 80శాతం కథ ఓవైపు నుంచి చెప్త్తొ, మళ్ళీ మరోవైపు దూకి చివరికి మళ్ళీ మొదటి పాత్రవైపుకు దూకి హథాత్తుగా ఒక కంక్లూజన్, ఒక రిసొల్యూషన్ లేకుండా కథను ముగించటం ఏరకంగానూ గొప్ప రచనా సంవిధానం కాదు. ఏ కథనయితే ముగించలేమో ఆ కథనొక అందమయిన మలుపు తిప్పి ముగించమంటాడు, కథకుడు కాని సాహిర్. కనీసం అలాగయినా లేదీ కథ..కొన్ని సంఘటనలను ఒక కథగా మలచలేని అశక్తత ఈ కథలో కనిపిస్తుంది. కేవలం అమ్మాయిలను లైంగికంగా వాడుతున్నారన్న అంశం వున్నందుకు ఇది 20000లోనె వచ్చే అంశం అని తీర్మానించటం మన విమర్శకుల అమాయకత్వాన్ని సూచిస్తుంది. కాలం ఏదయినా, జీవన విధానం ఏదయినా, మహిళలు లంగిక ఆనందాలందించే బొమ్మలే అన్న ఒక సోషియాలజిస్ట్ మాటలను గమనిస్తే, సాలభంజికలు ఒక మామూలు సరిగా వుదికీ వుడకని కథ అని అర్ధమవుతుంది. ఉత్తమ కథకుండాల్సిన లక్షణాలేవీ లేని ఉత్తమ కథ అని తెలుస్తుంది. అయితే తెలుగు సాహిత్యంలో ఉత్తమ కథగా ఎంపికయ్యేందుకు ఉండాల్సిన లక్షణాలు వ్యవస్థ విమర్శ, తమవారయిన రచయిత అనే రెందు లక్షణాలు పుష్కలంగా వున్న ఉత్తం కథ ఇది.
మిగతా రెండు కథల విశ్లేషణ మరో వ్యాసంలో…

January 12, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-14(ఏ)

కుప్పిలి పద్మ రచించిన ఆరు కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యి, 25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. 1994లో మసిగుడ్డ, 1995లో విడీఅర్ ఎల్ ఎఫ్, 2000లో ఇన్స్టంట్ లైఫ్, 2001లో సాలభంజిక, 2003లో వర్షపు జల్లులో, 2013లో ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే ఆరు కథలను ఉత్తమ కథలుగా సంపాదకులు నిర్ణయించారు.

కాలం మారి ఎన్నో ఆధునిక గృహ పరికరాలు ఇంటిని అలంకరించినా వంటింట్లోంచి మాయం కాని మసిగుడ్డలానే ఎంత నాగరిక ప్రపంచం మనచుట్టూ ఆవరిస్తున్నా అమ్మ కష్టాలు ఎప్పుడూ అమ్మవే..అన్న నిజాన్ని ప్రతిబింబిస్తుందీ కథ. ఈ మసిగుడ్డ ను కథ అనేకన్నా, నటకీయంగా రాసిన వ్యాసం అనవచ్చు. దీన్లో ఆరంభంలోనే, ఒకావిడకు మసిగుడ్డ దొరకదు. వెతగ్గా అమ్మ జాకెట్ దొరుకుతుంది. ఇంతలో పక్కింటి జానకి వచ్చి ఇంగ్లీష్ నేర్పమంటుంది. ఎందుకంటే పిల్లలు లెక్క చేయటం లేదని.
ప్రాణానికి ప్రాణమిచ్చి జన్మనిచ్చే అమ్మని లక్ష్యపెట్టటానికి అమ్మకి అర్హతలు కావాలా? అని కథచెప్తున్నామె ఆలోచిస్తుంది. గతంలో తాను అమ్మని నిర్లక్ష్యం చేసిన ఉదంతాలు గుర్తు తెచ్చుకుంటుంది. పక్కింటి టీచరమ్మ పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళ ఆలనాపాలనా చూస్తూ తనని తాను నిర్లక్ష్యం చేసుకోవటం గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతలో ఎదురింటి అరుణ వస్తుంది. పక్కింటామె కుంటుతుంది. ఎందుకంటే పిల్లలను దూరం స్కూల్లో చేరిపిస్తే తెచ్చేందుకు సైకిల్ నేరుస్తూ పడుతుంది. కథ చెప్పే ఆమె పిల్లలు తండ్రి కోసం ఎదురుచూస్తారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తారు. పిల్ల మంచిదవుతే తండ్రి నా కూతురే అంటాడు, చెల్లెలు ప్రేమ పెళ్ళి చేసుకుంటే పెంపకం సరిగా లేదని తల్లిని తిడటాడని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు ఆమెకి తల్లులకూ మసిగుడ్డలకూ తేడా లేదన్న గ్రహింపు వస్తుంది. ఇదీ కథ.
నిజానికి ఈ కొన్ని సంఘటనల సమాహారాన్ని కథ అనటం కష్టంగా వుంటుంది. ఈ సంఘటనల ఉద్దేశ్యం తల్లి మసిగుడ్డ అని నిరూపించటమే. రచయిత్రి ఈ సంఘటనలను తాను చూడాలనుకున్న దృష్టిలో చూసి, తాను తీర్మానించాలనుకున్నట్టు తీర్మానించారు. ఆ తీర్మానంలో అభ్యుదయముందనీ, మహిళల అణచివేత వుందనీ, దానికి మసిగుడ్డ ప్రతీక అనీ భావించిన మేధావి అభ్యుదయ ఆధునిక అభివృద్ధి చెందిన విజ్ఞావంత విమర్శకులు దీన్ని ఉత్తమ కథగా తీర్మానించారు.
ఈ కథ చదివితే, అమ్మ గురించి ఇలా కూడా ఆలోచిస్తారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు తల్లిపై ఎంతగా విసుక్కున్నా, లెక్క చేయకుండా ప్రవర్తించినా వారి అంతరాంతరాళాల్లో తల్లిపట్ల అవ్యాజ్యమయిన అనురాగం వుంటుంది. తామేమన్నా అమ్మ తమను అక్కున చేర్చుకుంటుందన్న నమ్మకం వుంటుంది. చెట్టు పిల్లవాడి కథను ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. పిల్లవాడి చిన్నప్పుడు చెట్టు నీడన ఆడుకుంటాడు. పెద్దయ్యాక, పళ్ళు అమ్ముతాడు. చెట్టు కొట్టి ఇల్లుకట్టుకుంటాడు. వృధాప్యంలో ఆకులు లేని మొండెం పై విశ్రమిస్తాడు. అయినా చెట్టు తాను త్యాగం చేస్తున్నానని అనుకోదు. తల్లులు అలాంటి వారు. పిల్లలు తమ ఆనందానికి, స్వేచ్చకూ అడ్డుగా భావించి పిల్లలను ద్వేషించేవారు కొందరుంటారు. కానీ, అధికంగా తల్లులు తాము పిల్లలకు చాకిరి చేస్తున్నట్టో, సేవ చేస్తున్నట్టో భావించరు. పిల్లలౌ తమని కసిరినా వారి ప్రేమలో మార్పు రాదు. తల్లి గుండె కోసుకెళ్తున్న పిల్లవాడి కాలికి రాయి తగిలితే, దెబ్బతగిలిందా అని అడిగేది తల్లి. ఆమెను మసిగుడ్డలా చూపుతూ, ఆమెకేదో అన్యాయమయిపోతున్నట్టు ప్రదర్శించి గొప్పగా భావించుకోవటం తుంటరి తనంలో అమాయకత్వం తప్ప మరేమీ కాదు. పిల్లలను వాళ్ళ మానాన వారిని వదిలేసి తమ సౌఖ్యం తమ లాభం చూసుకునే ఆధునిక అభివృద్ధి చెందిన మహిళలు, పిల్లలు ఆనందాలకు అడ్దుగా భావించేవారు కూడా తల్లిని మసిగుడ్డ అనుకోరు. అలాంటి ఆలోచన ప్రదర్శించినందుకు రచయిత్రికి, దాన్ని ఉత్తమంగా భావించినందుకు సంపాదకులకూ అభినందనలు.
కథా పరంగా చూసినా, ఇందులో కథ లక్షణాలేవీ లేవు. ఒక ఆలోచనను సమర్ధించటానికి ఎంచుకున్న నాలుగు అర్ధవిహీనమయిన సంఘటనల సమాహరం ఇది తప్ప కథ కాదు. ఏమాత్రం ఆసక్తి, ఆలోచనల్లేకుండా వున్న రాత ఇది. పైగా, ఒక చిన్న విషయం చూపి అతి పెద్ద తీర్మానాలు చేసేయటమనే లక్షణం ఇతర సైద్ధాంతిక కథల్లోలాగా ఈ కథలోనూ కనిపిస్తుంది. మరో విషయం…సమాజంలో మానవ సంధాలను వక్ర దృష్టితో చూసి, సంబంధాలను విచ్చిన్నం చేయటమే అభ్యుదయం అనుకుంటే ఈ కథలోని మసిగుడ్డ ఆలోచన అలాంటి అభ్యుదయపుటాలోచన అవుతుంది. అమ్మను మసిగుడ్డ చేసిన ఘనత ఈ కథది.
మరో ఉత్తమకథ వీడీఆర్ ఎల్ కాస్త కథలాగా అనిపిస్తుంది. అయితే, అర్ధం కానిదేమిటంటే ఈ సిద్ధాంతాల కథల్లో బాధలుపడే మహిళ తప్ప మిగతావారెవరూ మనుషుల్లా కనిపించరు. రాక్షసుల్లానేవుంటారు. చివరికి డాక్టర్లు, నర్సులూ కూడా. నాగమణి అనే ఒక పెళ్ళయిన యువతికి అక్కడ సెగగడ్డలు వస్తూంటాయి. ఎవరికీ చెప్పుకోలేక కుములుతూంటుంది. భర్తకు చెప్పితే, బజారు స్త్రీలకు రావాల్సిన రోగం అంటాడు. వందరూపాయలు పారేసి పోతాడు. పక్కింటామెని అడిగి ఒక పాలిక్లినిక్ కి వెళ్తుంది. అక్కడ నర్సులూ డాక్టర్లు పురుగును చూసినట్టు చూస్తారు. సూది గుచ్చినప్పుడు నొప్పి అంటే అప్పుడు తెలియదా నొప్పి అంటుంది నర్సు. ఇలా అందరూ అమానుషంగా ప్రవర్తిస్తూంటారు. చివరికి ఆమెకి ఏదో మామూలు ఇంఫెక్షన్ అని తేలుతుంది. కానీ, భర్త డైవోర్స్ అంటాడు. పిచ్చిగా మాట్లాడతాడు. ఆ అమ్మాయి పోరాడాలని నిర్ణయించుకుంటుంది. అదీ ఈ గొప్ప కథ . కథ చదువుతూంటే, మనుషుల పట్ల మానవ సంబంధాల పట్ల జుగుప్స కలిగించటమే ప్రధానోద్దేశ్యంగా కథ రాసినట్టు అనిపిస్తుంది. సమాజంలో గోప్యంగా వుంచాల్సిన విషయాలను బట్టబయలు చేసి తన గొప్ప నిరూపించుకోవాలన్న ఆత్రం కనిపిస్తుంది. కథ పట్ల, కథలోని పాత్రలపట్ల ఏమాత్రం అవగాహన, సానుభూతి లేకుండా పాత్రలను తనకనువుగా మలచి నడిబజారులో నిలపటం కనిపిస్తుంది. షాకింగ్ అంశాన్ని రాసి పేరు సంపాదించాలన్న తపన కనిపిస్తుంది తప్ప కథను ఆసక్తి కరంగా మలచి, ఆలోచనలను రేకెత్తించాలన్న ప్రయత్నం కనపడదు. ఎందుకంటే, అన్నీ తాను ఆలోచించేసి, ప్రజలకు తననుకున్నది చెప్పటం తప్ప, మానవ జీవితాన్ని ప్రదర్శిస్తూ అందులోంచి జీవిత పాఠాలను ఎత్తి చూపి ప్రదర్శించాలన్న ఆలోచన లేదు కాబట్టి, కార్డ్ బోర్డ్ పాత్రలు, కటౌట్ లాంటి సిద్ధాంతాలు కథలో కనిపిస్తాయి. ఏరకంగా చూసినా ఉత్తమ కథ అనిపించదు. ఒక పాత్రను తీసుకుని అందరూ ఆ పాత్రని కష్టపెట్టటమే పనిగా పెట్టుకున్నట్టుండే పాత కాలపు పతివ్రతల కథకూ దీనికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఆ కథల్లో ఎంత కష్టపెట్టిన్నా సహనంతో, మనోబలంతో అందరినీ గెలుచుకుని తన ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తే, ఈ కథలో పోరాడతాననుకుంటుంది. ఇదే గూపతనమీ కథది.
ఇన్స్టంట్ లైఫ్…ఆధునిక వేగవంతమయిన జీవితాన్ని ప్రతిబింబించేకథ. ఇది కాస్త కథ అనిపిస్తుంది. కానీ, దీన్లోనూ ఒకటిరెండు సంఘటనలు చూపించి తీర్మానాలు చేసేయటం కనిపిస్తుంది. నాయిక పేరు మునీరా. ఆమె సందీప్ ని ప్రేమిస్తుంది. సందీప్ వేరే దేశం వెళ్ళాలనుకుంటాడు. తామిద్దరికీ కుదరదంటాడు. ఆ నొర్ణయం తీసుకోటానికి 14గంటల వ్యక్తిత్వ వికాస క్లాస్ దోహదం చేస్తుంది. ఆమె తల్లి తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ, రాను రాను తండ్రికి డబ్బు ధ్యాస పెరుగుతుంది. తల్లి తండ్రుల నడుమ భేదాభిప్రాయాలు బెడ్ రూములు వేరయ్యేవరకూ వస్తాయి. ప్రపంచంలో వచ్చే మార్పులు బెడ్ రూంల వరకూ వస్తాయన్న సంభాషణ వుంటుంది. చివరలో సందీప్ వచ్చి వేరే ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. మార్పును స్వీకరించని మునీరాను విమర్శిస్తాడు. ఈ తరం త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటారని తీర్మానిస్తారు. కథారంభంలో ఇడ్లీ కొట్టువాడిని తొలగించి ఓ పెద్ద హోటెల్ వస్తే, చివర్లో దాన్ని తొలగించి ఓ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఇంతలో వాళ్ళమ్మ లాంగ్ జర్నీ కి బట్టలు సర్దమంటుంది. అదీ కథ…
ఇతర కథల్లోలాగే ఈ కథలోనూ చిన్న సంఘటనలను చూపి పెద్ద తీర్మానాలు చేయటం కనిపిస్తుంది. ఇద్లీ కొట్టు పోవటంతో ఆరంభమయిన కథ, మానవ సంబంధాల చుట్తూ తిరిగి మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ కు వచ్చి మళ్ళీ లాంగ్ జర్నీతో ముగుస్తుంది. ఇంతకీ కథలో చివరలో తప్ప లాంగ్ జర్నీ ప్రసక్తి మరెక్కడా రాదు. గమనిస్తే, 2000లలో రాసిన ఈ కథలో ఇడ్లీ కొట్తుని పెద్దదుకాణం ఆక్రమించిందన్న ఆక్రోషం కనిపిస్తోంది కానీ, ఇప్పటికీ ఇద్లీ కొట్టులున్నాయి. హాయిగా వున్నాయి. పెద్ద దుకాణాలే కష్టామర్లు లేక, ఖర్చులు రాక వెలతెల పోతున్నాయి. సూపెర్ మార్కెట్లు వస్తే చిల్లర దుకాణాలు, ఫ్రెష్ లు వస్తే కూరగాయలవాళ్ళు పోతారని భయపెట్టే భయంకర బీభత్స దయనీయమైన కథలు రాసేసారీ అభ్యుదయ, ఆధునిక అభివృద్ధి చెందిన అద్భుతమయిన రచయితలంతా. ఆ కథలు చదివితే, దేశంలో తీవ్రమయిన అసంత్ర్ప్తి.దుర్భరమయిన దారిద్ర్యం తాండవిస్తున్నట్టనిపిస్తుంది.కానీ, గమనిస్తే, ఫ్రెష్ లలో కూరగాయలు కొనేవారికన్నా, రైతు బజార్లలో, వారం వారం ఏర్పాటు చేస్తున్న సంతల్లో ఎక్కువ కొనటం కనిపిస్తుంది. అలాగే చిల్లరదుకాణాలు సూపర్ మార్కెట్ల పక్కనే గర్వంగా నిలవటమూ కనిపిస్తుంది. అంటే, ఈ కాసాండ్రాలంతా( అంటే ప్రతి విషయంలో సర్వ నాషనాన్ని చూస్తూ, భవిష్యత్తు గురించి భయపెట్టే వాళ్ళు..వీళ్ళెప్పుడూ చెడు జరుగుతుందని చెప్తూనేవుంటారు) ప్రతి విషయంలో చెడును చూసి ఏదో అన్యాయమయిపోతుందని రాసేస్తూవుంటారు తప్ప నిలచి ఆలోచించరన్నమాట. ప్రస్తుత వ్యవస్థని తిట్తటమో తక్కువచేసి చెడుగా చూపించటమే అభ్యుదయమూ, విప్లవమూ అనుకునే అరస విరస కురస నీరస నోరస రచయితలంతా ఈ అభ్యుదయాన్నే ప్రదర్శిస్తూంటే అదే కోరే సంపాదకులు ఎవరెంత గూప కాసాండ్రాలయితే అంత గొప్ప కథ అని తీర్మానించటంతో అలాంటి కథలే ఉత్తమ కథలుగా మిగులుతున్నాయి. అందుకే, 25ఏళ్ల ఉత్తమ తెలుగు కథల్లో మన దేశం సాధించిన ప్రగతి కానీ, మంచి కానీ కనబడదు. మానవత్వం కనబడదు. అంతా చేడే, నచ్యమే, దారిద్యమే, అణచివేతలు అన్యాయాలే కనిపిస్తాయి. ఈ కథకూడా అలా ఆలొచన, విశ్లేషణ లేకుండా అన్యాయమయిపోతున్నామహో అని ఎలుగెత్తి ఏడ్చే ఏడుపుగొట్టు అన్యాయపు కథే. కాబట్టి దీన్ని ఉత్తమ కథగా ఎంచుకోవటంలో ఆశ్చర్యంలేదు. పైగా ఆసింది కావాల్సినవారు. ఈ కథలో ఒక సందర్భంలో సందీప్ అన్నమాటలు ఇలాంటి ఉత్తమోత్తమ కథలకూ, రచయితలకూ, ఉత్తమ కథల సంకలనాలకూ సంపాదకులకూ వర్తిస్తుంది.
నువ్వు ఈ దేశంలో వస్తున్న ప్రతి మార్పుని వొప్పుకోడానికో, ఆచరించడానికో సిద్ధంగా లేవు..
ఇది నిజం. ఇప్పుడు ఇలాంటి డూంస్ డే సేయర్లు, కాసాండ్రాలు మనదేశంలో మరింత ఎక్కువయ్యారు. వీరిదంతా ఒకటే ఆలోచన. ప్రతిదాన్నీ కారణం లేకుండా విమర్శించటం…ఏదో నాశనం అయిపోతుందని ఏడ్వటం. ఏడిపించటం. అంతే…
ప్రపంచ పరిణామంలోనే ఒక సూత్రం వుంది. ఇది నిత్య పరిణామ శీలి అయిన ప్రపంచం. మార్పును స్వీకరించి, ముందుకు వెళ్ళగలిగినవాడు బ్రతుకుతాడు. లేనివాడు దారిపక్కన పడిపోతాడు. రచయితలు మార్పులను అర్ధం చేసుకుని, దాన్ని తట్టుకోవటం, దానికి తగ్గట్టు మారటం నేర్పాలి కానీ, అయ్యో మార్పొచ్చింది అంతా నాశనమయిపోతుందని ఏడుస్తూ కూచుంటే, కాలం కదలిపోతుంది, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ అక్కడే వుంటారు. ఒక్క తెలుగు సాహిత్య ప్రపంచంలోనే ఇలాంటి కథలు ఉత్తమ కథలుగా, ఎలాంటి ద్రష్టవంలేని వాళ్ళు ఉత్తమ రచయితలుగా గుర్తింపు పొందుతారు.
ద్రష్టత్వం అంటే, సమకాలీన సమాజంలోని ఆవేశకావేశాలకు లోనుకాకుండా, మార్పును అర్ధంచేసుకుని భవిష్యత్తును ఊహించి అందుకు సమాజాన్ని సిద్ధంచేసే మార్గదర్శకుడు…అలాంటి వాడే ఉత్తమ రచయిత. అందుకే, ఋషికానివాడు కావ్యం రాయలేడంటుంది భారతీయ ధర్మం. ఋషులు డ్రష్టలు…ఏది రాస్తే మెచ్చుకుంటారు, ఏ ఏడ్పేడిస్తే అవార్డులొస్తాయని నిజాన్ని చూపకుండా ఏడ్పునే చూపేవారు కాదు. అయితే సంపాదకులకు భారతీయ ధర్మం పట్ల నమ్మకం గౌరవం లేవు కాబట్టి, వారిని మెప్పించేకథలు మాత్రమే రాయాలని తపన వుండేవారి కథలూ అలానేవుంటాయి కాబట్టి. ఈ కథలను చదివిన వెంటనే మరచిపోతారు. కానీ, పద్ధతి ప్రకారం రచయితల పేర్లు ప్రచారం చేయటం వల్ల రచయితల పేర్లు అందరికీ తెలుస్తాయి. చెప్పుకోవటానికి మాత్రం ఔట్ డేటెడ్ కథలు మిగులుతాయి. ఇన్స్టంట్ లైఫ్ లో ఇన్స్టంట్ ఫుడ్ లాంటి కథలివి. చెప్పుకోవటానికి గొప్ప. తింటే ఆరోగ్యంపాడు. రుచీ పచీ వుండదు.
మిగతా మూడు కథలు మరో వ్యాసంలో…

January 12, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized