Archive for February 20, 2017

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-16(ఆ)

2004 సంవత్సరంలో అక్కిరాజు భట్టిప్రోలు రచించిన అంటుకొమ్మ ఉత్తమ కథల సంకలనంలో ప్రచురణకు ఎంపికయింది. వంశవృక్షాల్లో అబ్బాయిలు పుట్టని వారి వృక్షం శాఖోపశాఖలుగా ఎదగక అక్కడే ఆగిపోతుందని చూపుతూ, ఇది మహిళలకెంత అన్యాయం అన్న భావాన్ని కలిగించటం కోసం రచించిన కథ ఇది అనిపిస్తుంది. చివరలో ఒక పాత్ర ఆగిపోయిన శాఖను విస్తరింపచేసి, వారి భర్తలు పిల్లలౌ పిల్లల పిల్లలతో నింపుతాడు. వంశవృక్షాల్లో ఆడ పిల్లలు మాత్రమే పుడితే ఆ శాఖ అక్కడ ఆగిపోవటం అన్యాయమన్న భావన కలిగించి, ఎలాగయితే అంటుకొమ్మల ద్వారా కొత్త వృక్షం ఎదుగుతుందో అలా వీరి భర్తల ద్వారా వృక్షం ఎదుగుతుందని చూపించి, ఆడవాళ్ళకు జరిగే ఒక గొప్ప అన్యాయాన్ని చూపించి ఉత్తమ కథ అర్హత సంపాదించారు రచయిత. బహుషా సంపాదకులకూ ఇదొక గొప్ప భావన, ఇంతవరకూ ఎవ్వరూ ఎత్తి చూపని అన్యాయంలా అనిపించి దీన్ని ఉత్తమ కథలా ఎన్నుకుని వుంటారు.
అయితే, ఈ సత్యం చెప్పేందుకు, రచయిత విదేశాలనుంచి కొదుకులను కూతుళ్ళను రప్పించి, వాళ్ళతో నోస్టాల్జిక్ ప్రయాణం జరిపించి, కథ చివరలో వంశవృక్షం ప్రసక్తి తెచ్చి, చివరికి ఆ వంశవ్ర్క్షం కాపీకి ఆడపిల్లల తరువాత పొదిగించినట్తు చూపించి దాన్ని అంటుకొమ్మ అని చెప్పి కథ ముగిస్తారు.
ఈ కథతో వచ్చిన చికేమిటంటే, రచయితకు కానీ, దీన్ని ఉత్తమ కథగా ఎంచుకున్న వారికి గానీ, వంశవృక్షం తయారీ గురించి, సాంప్రదాయం గురించి సరిగ్గా తెలిసినట్టులేదు.
ఒక వంశం ఎలా విస్తరిస్తుంది? ఒక అబ్బాయి..అతదికి పెళ్ళి అవ్వాలి. వాళ్ళకు పిల్లలు పుట్టాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి..ఇలా విస్తరిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబ్బాయి, అమ్మాయి పెళ్ళిచేసుకున్నప్పుడు, అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తుంది. అతడి ఇంటిపేరు స్వీకరిస్తుంది. దాంతో, ఆమె పుట్టింటి వంశానికి చెందినది కాక, అత్తవారింటి వంశానికి చెందినదవుతుంది. అలాంటప్పుడు, వంశవృక్షంలో అమ్మాయి కి ఎవరితో పెళ్ళయిందో రాసి, బ్రాకెట్ పెట్టి, ఆమె ఏ వంశానికి చెందినదయిందో రాస్తారు. అంటే ఆమె ఇకపై పుట్టినింటి వంశవృక్షంలో కాదు, భర్త ఇంతి వంశవృక్షంలో కనిపిస్తుందని రిఫెరెన్స్ అన్నమాట…దాంతో ఈ వంశానికి చెందినదికాదు కాబట్టి, ఈ వంశవ్ర్క్షంలో ఇక ఆమె ప్రసక్తి వుండదు. ఇందులో అన్యాయము, అక్రమము ఏమీలేదు. ఒక భారతీయుదు అమెరికావెళ్ళాడు. అక్కడే స్థిరపది ఆ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. అప్పుడు మన దేశం పౌరుల్లోంచి అతది పేరు పోతుంది. అమెరికా పౌరుల జాబితాలో చేరుతుంది. అతడి గురించి రాసేప్పుడు, పుట్టింది భారత్ లో కానీ అమెరికా పౌరుడు అని చెప్తారు. ఆ తరువాత అతడిని అమెరికా పౌరుడిగానే వ్యవహరిస్తారు. వంశవృక్షాలూ అలాంటివే. పెళ్ళికి ముందు ఈ వంశం. పెళ్ళి తరువాత ఆ వంశం. కాబట్టి, పెళ్ళి అయిన తరువాత ఆమె పిల్లల ప్రసక్తి వేరే వంశవ్ర్క్షంలో వుంటుంది. ఈ వంశవృక్షంలో వుండదు. ఇందులో అన్యాయమేమీ లేదు. ఇది లాజిక్..అంతే…ఎలాగయితే పెళ్ళికాక, అయినా పిల్లలు లేకపోతే వంశవృక్షంలో ఆ శాఖ అక్కడ ఆగిపోతుందో, అలాగే, ఆడపిల్ల శాఖ ఇక్కడ ఆగిపోయి ఇంకోచోట మొదలవుతుంది. ఈ ప్రాకృతికము, తార్కికము అయిన దాన్ని, సాంప్రదాయంలో స్త్రీకి అన్యాయం జరుగుతోందన్న ఆలోచనను కలగచేసి తమ అభ్యుదయాన్ని చాటుకోవాలన్న తపనతో ముందు వెనుక చూడకుండా రాసేసిన కథ ఇది…ఎప్పుడయితే, ఆడపిల్లల తరువాత బోడిగావుండటాన్ని, అదేదో ఘోరమయిన అన్యాయమన్నట్టు, తన తండ్రి పేరు గద్దర, పిల్లల్లేకపోయినా, పిల్లల్లేకుండానేపోయినా, మగపిల్లల్లేకపోయినా కొమ్మ ముందుకు పోదు, అని వ్యాఖ్యానించటంలోనే రచయిత దృష్టి అతని లోపభూయిష్టమయిన ఆలోచన , సాంప్రదాయ వ్యతిరేకత, ఏదో ఒకతిచేసి తప్పుపట్టాలన్న తెంపరితనము అర్ధమవుతాయి. పైగా, నలుగురం అక్కాచెల్లెళ్ళం ఒక్కళ్ళమైనా మగపిల్లాడిగా పుట్టలేకపోయాం, అనిపించి స్త్రీ పక్షపాతిగా మార్కులు కొట్టేశారు రచయిత. కానీ, ఆ నలుగురు అక్కాచేల్లెళ్ళు మరో వంశవృక్షంలో పూలు పళ్ళతో విరిసి శాఖోపశాఖలుగా విస్తరించే వృక్షాలుగా కొనసాగుతున్నారన్న, కనీస పరిజ్ఞానం రచయిత కానీ, అతని పాత్రలు కానీ, దీన్ని ఉత్తమ కథగా భావించిన సంపాదకులుగానీ ప్రదర్శించలేదు. ఇలా మౌలికపుటాలోచనే పొరపాటయిన తరువాత అది ఉత్తమ కథగా భావించటం కష్టం. కానీ, ఇది ఉత్తమ కథ అయింది. ఒకవేళ, అసలు వంవ్ర్క్షాలు గీయటమే తప్పని, ఆడమగా అందరూ ఒకే వంశవృక్షంగా వుండాలనీ, వసుధైకకుటుంబకం లాంటి భావనను తాను ప్రతిపాదిస్తున్నానని ఎవరయినా సమర్ధిస్తే, ఈ కథలో ఆ భావం కనబటంలేదు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ వ్యాసాలు ఉత్తమ కథలుగా ఎంపికయినవి ఎందుకు ఉత్తమ కథలు కావో, లేకపోతే ఎలా ఉత్తమకథలో నిరూపించి విశ్లేసించటమే తప్ప, వీతిని ఉత్తమ కథలుగా ఎందుకెంచుకున్నారని ప్రస్నించటం కాదు.ఎందుకివి ఉత్తమ కథలయ్యాయో తెలుస్తూనేవుంది…!!!
ఇలాంటి అసంబద్ధము, ఔచితీ దూరమయిన మరో ఉత్తమకథ 2006లో ఉత్తమకథగా ఎంపికయిన కథ, గేటెడ్ కమ్యూనిటీ. సతీష్ అనే అబ్బాయి విదేశం వెళ్ళి వస్తాడు. గేటెడ్ కమ్యూనిటీలో వుంటాదు. అతడి స్నేహితుడు అర్జున్, బాల్యంలో చాకలిపనిచేసి కష్టపడి చదువుకుంటాడు. లెక్చరర్ పనిచేస్తూంటాడు. వీళ్ళిద్దరూ క్లాస్ మేట్లు. కలుస్తారు చాలా కాలం తరువాత. సతీష్ తో బాగానే మాట్లాడతాడు అర్జున్. కానీ, ఒకరోజు రైల్ తికెట్ క్యూలో అనాగరికంగా ప్రవర్తిస్తాడు అర్జున్. అతదిని నియంత్రించాలని ప్రయత్నించిన సతీష్ తో నువ్వయితే ఇంటెర్నెట్ లో కొనుక్కుంటావు, అని ఆక్షేపించి, నువ్వుగేటెడ్ కమ్యూనితీలో వుంటావు, నాకింకా బయటి ప్రపంచంతో సంబంధంవుంది అంటాదు. అర్జున్ భార్య కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఓ ఆర్ ఆర్ కడుతూ వాళ్ళ కాలేజీదాన్లో పోతే, రోడ్దుపై ధర్నా చేస్తారు. రోడ్డు క్రింద ఒక్క గేటెడ్ కమ్యూనిటీ పోవటంలేదని ఆక్షేపిస్తాడు. ఇది సతీష్ భార్యకు నచ్చదు. అప్పుడు అర్జున్, ప్రతివాడి చుట్టూగోడలే. మనందరినీ కలిపిబాధించే విషయమేదీ కనబడదే? అంటాడు. అప్పుడు, సతీష్, నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకోంగానే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావురా నీ అయ్య అని అర్జున్ లానే అంటాడు. అదీ కథ..
ఈ కథలో రచయిత, పేదలకు, ధనికులకు తేడా చూపించాలనుకున్నాడో, గేటెడ్ కమ్యూనిటీలోని వారు రియాలిటీకి దూరమయిపోతున్నారని చూపించాలనుకున్నాడో, అర్జున్ లాంటి వాళ్ళ ఆక్రోషం కరెక్టని నిరూపించాలనుకున్న్నాదో తెలియదు కానీ, కథ కానీ, కథలో పాత్రలు కానీ, సంఘటనలు కానీ, ఒకదానికొకటి పొసగక, నానా గందరగోళంగా వుంటుంది. పిండి కొద్దీ రొట్టె అన్నారు. ఎవరి అదృష్టం వారిది. కానీ, డబ్బున్నవాదు దోషి, పేదవాడు అమాయకుడు అన్న వామపక్షభావనతో రాసిన కథ ఇది అనిపిస్తుంది. ఎలాంటి గొప్పదనమూ, కొత్తదనము, ఔచిత్యము, ఆకర్షణ లేని అర్ధంలేని ఉత్తమ కథ ఇది.
ఈ మూడు కథలు చదివిన తరువాత రచయితకు భాష, భావ వ్యక్తీకరణ బావున్నాయికానీ, కథ రాయటానికి ఇవి సరిపోవు. అయినా, ఈ మూడు కథలు ఉత్తమ కథలుగా ఎన్నికవటం వెనుక, సాహిత్యేతర కారణాలున్నాయనిపిస్తుంది. ముఖ్యంగా 2000 తరువాత ఎన్నారై కోటా ఒకతి ఎదుగుతూండటం కూదా ఈ కథలను ఉత్తమ కథలు చేసినట్టున్నాయి. కథలు చదివితే ఈ ఆలోచన బలపడుతుంది.
వచ్చే వ్యాసంలో అజయ్ ప్రసాద్ కథల విశ్లేషణ వుంటుంది.

February 20, 2017 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized