Archive for June, 2017

25ఏళ్ళ ఉత్తమ తెలుగుకథ విశ్లేషణ-20(1)

2005 సంవత్సరంలో ఉత్తమ కథగా ఎంపికయిన వివినమూర్తి కథ జ్ఞాతం. ఈ కథ చదువుతూంటే ఇది ఉత్తమ కథగా ఎలా ఎంపికయిందో అర్ధం కాక పోవటమేకాదు, అసలు కథకుండవలసిన లస్ఖణాలేమిటి? అన్న ప్రశ్న కూడా కలుగుతుంది. కేవలం రెండు మూడు పాత్రలు వాటినడుమ సంభాషణలు వుంటే అది కథ అది కథ అయిపోతుందా? ఉత్తమ కథ అయిపోతుందా? అన్న ప్రశ్న,వివ్నమూర్తి మొదటి కథ చదివినప్పుడు కలిగిన సందేహం, ఈ కథ చదివేసరికి వృక్షమై కూచుంటుంది.
ఇందులో కూడా పాత్రలున్నాయి. అసంబద్ధమయిన సంఘటనలున్నాయి. అర్ధము, ఔచిత్యము లేని సంభాషణలున్నాయి. ఎలాంటి లాజిక్ లేని వాదనలు తీర్మానాలు ఉన్నాయి. ఇది ఉత్తమ కథ!!!!!
వసుధ మోహన్రావు భార్యా భర్తలు. వారిది కులాంతర వివాహం. మోహన్రావు దళిత ధ్వని అనే పత్రిక నడుపుతూంటాడు. వాళ్ళబ్బాయి సౌమ్య అనే అమ్మాయిని ఇంటికి పిలుస్తాడు. ఆమె అగ్రవర్ణానికి చెందింది. సుమన్ తండ్రి దళితుడని తెలిసి వాళ్ళవాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు. కానీ, అమ్మాయి చస్తాననటంతో వాళ్ళు ఒప్పుకుంటారు. ఇదీ కథ. ఇదేం కథ అంటరా? ఇంతటితో అయిపోలేదు. ఈ కథలో తెలివి ఏమాత్రం కనబడని తెలివయిన చర్చలున్నాయి. ఆధారంలేని అడ్డదిడ్డమయిన తీర్మానాలున్నాయి.
ముందుగా, అబ్బాయి సుమన్ సౌమ్య ని అడ్మైర్ చేస్తూంటాడు. ప్రేమిస్తున్నాననడు. తన భావన ఏమిటో తెలియదతనికి. ఈ పాత్ర ఎంత పనికిరానిదంటే,కులం ఆధారంగా సౌమ్య తల్లితండృలు పెళ్ళి వొద్దంటే ఈ పాత్ర కిమ్మనదు. ఈ పాత్ర అవసరం రచయితకు అమ్మాయిని ఇంటికి తేవటంతో తీరిపోయింది. అంటే ఒక పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్ర గురించే రచయిత మరచిపోయాడన్నమాట. ఆ అమ్మాయిపై తన భావన గురించి అవగాహనలేనట్టున్న సుమన్ ఆమె కాదన్నతరువాత ఏమన్నాడు? బాధపడ్డాడా? పోతేపోనీలే అన్నాడా? మనకు తెలియదు. అర్ధాంతరంగా అదృశ్యమయిపోతుందీ పాత్ర. ఇది ఉత్తమ కథారచనలోని ప్రధాన సూత్రోల్లంఘన. అనవసరంగా పాత్రను ప్రవేశపెట్టద్దు. ప్రవేశపెడితే పాత్రకోప్రయోజనము, వ్యక్తిత్వము ఉండాలి. కేవలం సౌమ్యను ఇంటికి తేవటంతో సుమన్ పాత్ర పని తీరిపోయింది.
సౌమ్య పాత్రకూ వ్యక్తిత్వంలేదు. వసుధ పెళ్ళిప్రస్తావన తెస్తే పేపరు ముఖానికి అడ్డుపెట్టి చదువుతూండేంత అనాగరికురాలు, అమర్యాదస్తురాలు ఈమె. కాస్త తెలివున్న ఎవరయినా, వేరేవారి ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దలమాటలు వింటారు పేపరు చదువుతూ వినరుపైగా, పెళ్ళి అనగానే ఏమీ అనకుండా వెళ్ళిపోయిన ఈమె,అంటే ప్రేమ అన్న భావనకూడా లేని ఆమె, సుమన్ నే చేసుకుంటానని పట్తుబట్టటం ఆ పాత్ర మెదడు ఎక్కడుందో నన్న సందేహం కలిగిస్తుంది. దీన్ని, రచయిత థ్రిల్ అన్న వివరణతో సమర్ధించాలని చూశాడు. కానీ, వారిది థ్రిల్ అన్న ఆలోచన కలిగించే సంఘటనేలేదీ కథలో. అంతేకాదు, సుమన్ తండ్రి కులం తెలిసి కొన్నాళ్ళు మాటలు తగ్గించి మళ్ళీ మాటలు పెళ్ళివరకూ తేవటానికీ ఎలాంటి బలమయిన సంఘటన లేదు దీని ఆధారంగానే వారిమధ్య ప్రేమలేదు అంతా థ్రిల్ కోసం అనుకోమంటే కుదరదు.
ఇక, వసుధ, మోహన్రావు పాత్రలు రెండూపనికిమాలిన పాత్రలు. ఆరంభం తుం బిన్ జావో కహా అన్నపాట వసుధ వింటూంటే జరుగుతుంది అక్కడ చదివితే ఆమెకూ మోహన్రవుకూనడుమ సఖ్యత వున్నట్టనిపిస్తుంది. హఠాత్తుగా దళిత్ ఆంగిల్ తెస్తాడు రచయిత. అప్పుడు ఇద్దరూ పోరాడుకుని, మాటలనుకుంటారు. ఒకరినొకరు కులం ఆధారంగా ఎలా నొప్పించుకున్నారో చెప్పుకుంటారు. అంటే ఇన్నేళ్ళూ వాళ్ళు మనసులు విప్పి మాట్లాదుకోలేదా? మరి కులాంతర వివాహం చేసుకుని ఇన్నిరోజులు ఎలా కలసివున్నారు? వారిదీ థ్రిల్ వివాహమేనా? ఈ విషయం కొడుకు పెళ్లి దగ్గరకొచ్చేదాకా తెలియలేదా? ఏమిటో , ఒక్క పాత్రకూడా మెదడున్న మనిషిలా అనిపించదు. వీటికి తోడుమధ్యలో దళిత ధ్వనిలో ఒక పెద్ద వ్యాసాన్ని మనపై వదులుతాడు రచయిత… మొత్తానికి కథలు రాయటం తెలియనివారుకూడా ఇంతకన్నా కోహెరెంట్ గా,లాజికల్గా, ఆసక్తికరంగా కథ రాయగలరనిపిస్తుందీ ఉత్తమ కథ చదువుతూంటే…..
2008లో ఉత్తమకథగా ఎంపికయిన వివినమూర్తి కథ అగ్రహారం. ఈ కథకూడా ముందరి రెండు కథల లాంటిదే. అలాంటిలోపాలన్నీ ఇబ్బడి ముబ్బడిగా కలిగిన కథే. ఇద్దరు అన్నదమ్ములు. అన్న మతాంతర వివాం చేసుంటాడు. అన్నీ వదలి వచ్చేస్తాడు. చాలా ఏళ్ళకు తమ్ముడు అన్నని చూసేందుకు వస్తాడు. అప్పటికి అన్న వొంటరి. తమ్ముడిని తనదగ్గర వుండమంటాడు. అంటే తనకి వూడిగం చేయటానికన్నమాట. తమ్ముడు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు.ఈ మధ్యలో భార్యపోయింది కాబట్టి తనకు సహాయంగా వున్న నర్సు పిల్లపై చేతగాని అన్న కన్నుంటుందని చూపిస్తాదు రచయిత. ఏరకంగా చూసినా ఇదీ ఒక కోహెరెంట్,లాజికల్కథ అనిపించదు.
మొత్తానికి ఈ మూడు కథలు చదివితే, రచయితపైనా, సంపాదకులపైనా చులకన అభిప్రాయం కలుగుతుంది.
వచ్చే వ్యాసంలో కే ఎన్ మళ్ళీశ్వరి కథల విశ్లేషణ వుంటుంది.

June 22, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణా-20

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాల్లో వివినమూర్తి కథలు మూడున్నాయి. 1992లో పయనం-పలాయనం, 2005లో జ్ఞాతం, 2008లో అగ్రహారం అనే కథలను ఈ సంకలనాల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. అయితే ఈ మూడు కథలు చదివితే రచయితగా వివినమూర్తి నపుణ్యం ప్రశ్నార్ధకం అవుతుంది . ఈ మూడు కథలలో ఏ కథకూడా ఉత్తమం అనిపించటం అటుంచి, కనీసం చదవదగ్గ కథ కూడా అనిపించదు. ఎందుకంటే, ఈ కథలలో రచయిత కథ చెప్పటం కన్నా, తన దృక్కోణాన్ని చెప్పటం,సిద్ధాంతాలు ప్రకటించటం, సమాజాన్ని తన సిద్ధాంతం ఆధారంగా విమర్శించటం( పరిష్కారాల ప్రసక్తి ఎలాగో వుండదు) పైనే దృష్టి పెట్టాడు. దాంతో, ఈ రచయిత సైద్ధాంతికంగా సంకలనకర్తలతో ఏకీభవిస్తూండటంతో ఈ కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి తప్ప కథన కౌశలము, నైపుణ్యం, ఉత్తమత్వం వంటివాటివల్ల కాదు అన్న అభిప్రాయం కలుగుతుంది.
పయనం-పలాయనం అర్ధంపర్ధం లేని కథ. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది ఒక కథేనా? అనిపిస్తుంది. సారధి, వాణి భార్య భర్తలు.వారి నడుమ సఖ్యత, గౌరవాభిమానాలు లేవని రచయిత కథ ఆరంభంలోనే తెలియపరుస్తాడు.
నువ్వు మునుపటిలా ఉండటంలేదు
భుజాలొకమారు విదిలించింది. రెండుచేతులూ ఎత్తి వొళ్ళు విరుచుకుని జుత్తులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుకుంది. తల విదుల్చుకుంది. ఎలావుంది సెంటు? అంది
సారధి తేరి పార చూశాడు
నీకు టేస్ట్ లేదు. వాసనలలో తేడా తెలియదు. ఇలాంటి సెంటు ఒకటుందని నీకు తెలుసా?
నేను భారతీయుడిని అంత చిన్న విషయాలు నాకు పట్టవు.
ఇదీ, వారిద్దరి నడుమ అనుబంధ రాహిత్యాన్ని ప్రదర్శించే సంఘటన..
అయితే…దీన్లో రచయిత నేను భారతీయుడిని అంత చిన్న విషయాలు నాకు పట్టవు…అనటంలో అంతరార్ధం ఏమిటీని వెతికితే ఏమీలేదు అని తెలుస్తుంది. భారతీయ మొగుళ్ళకు, వాసనలు తెలియవు, వారికి సెంటుల గురించి తెలియదు, భార్యలు సెంటులు పూసుకున్నా గమనించరు అన్న అర్ధం తప్ప మరొకటి స్ఫురించదు . ఇదేమి అర్ధం అంటే..అస్సలు అర్ధంలేనీర్ధం అనాల్సివస్తుంది. అసలీ సందర్భంలో ఆ సంభాషణ ఏమిటో అర్ధమేకాదు. కానీ, భారతీయుడిని అని చులకన ధ్వనింపచేయటంతో ఉత్తమ కథకు మార్కొకటి వచ్చి చేరివుంటుంది.
తరువాత అతనికి ఫోను వస్తుంది. అమ్మ బెంగళోరు రమ్మంటుంది అని భార్యకు చెప్తాడు. ఆ తరువాత ముసలి వూరు, ముసలి కంపు అంటూవ్యాఖ్యానిస్తాడు. ఇక్కదికి రమ్మంటే రారు,బెంగళోరులో కూచోటానికి నాకు పనిలేదా? అంటాడు.
అసలు దీనికి అర్ధం ఏమిటి? ముసలి నగరం అన్న సంభాషణ అవసరమా? అది పాత్ర వ్యక్తిత్వం గురించి ఏం చెప్తోంది?
సారధి ఇలా ఫోన్లో మాట్లాడుతూంటే, అతని భార్య వీడి బట్టలూడ దీసి రోడ్ మీద పరుగెత్తిస్తే..ఇలా ఆలోచిస్తూంటుంది……ఇక్కడే కథపై సగం ఆసక్తి చచ్చిపోతుంది. పాత్రల పరిచయం బాలేదు.వాటి వ్యక్తిత్వ వివరణ లేదు. సంభాషణల్లో లాజిక్ లేదు. ఆలోచనల్లో అర్ధంలేదు.
ఇక్కదినించి కథ బెంగళోరులో సారధి తల్లితండ్రుల దగ్గరికి చేరుతుంది. తల్లి కామేశ్వరి ఆరోగ్యం బాగుండదు. తండ్రి రంగనాథం పుస్తకంలో మునిగివుంటాడు. ఆమె కొడుకు గురించి ఆలోచిస్తే, రంగనాథం ఈ ప్రాణి మరణించిన తరువాత ఏమవుతుంది అని మళ్ళీ లాజిక్ రహితంగా ఆలోచిస్తాడు. ఆమె తనను విడిచి వెళ్తే తనకేమవుతుందనీ ఆలోచిస్తాడు. ఆమె కొడుకు గురించి మాట్లాదుతూంటుంది. వాడిని తప్పుపట్టకు అంటాడు రంగనాథం
నేను అవిశ్వాసిని రంగా! రాతిని పాముని నమ్మేటంత విశ్వాసివి నువ్వు.అంటుంది..
విశ్వాసులు వ్యక్తులను తపుపడతారంటావు నువ్వు అందామనుకుంటాడు రంగనాథం
ఈ సంభాషణలో విశ్వాసులు,అవిశాసి….పదప్రయోగాలు ఎబ్బెట్టుగా వుండటమేకాదు..వాక్యాలను అర్ధ విహీనం చేస్తాయి. విశ్వాసులు వ్యక్తులను తప్పుపట్టటం ఏమిటో?????/ఇక్కడ ఆమెను తప్పుపట్టద్దంటున్నాడు విశ్వాసి…మరి విశ్వాసి తప్పుపట్టటం ఏమిటి? ఏమో!!!!!!
అంతలో ఆమె….పరమాత్మ…ఆత్మ…స్వర్గాలు అంటూ ఏదేదో..మళ్ళీ అర్ధం లేకుండా మాట్లాడుతుంది. ఆమె మాటలవల్ల తెలిసేదేమిటంటే……భిన్నాభిప్రాయాలు కలవారి సంసారాలు.భగవంతుడిని విశ్వసించేవారివల్లనే నిలబడతాయని అర్ధమవుతుంది.
విశ్వాసం ప్రాధమికమయినదా? కాదా అన్న సందేహం వస్తుంది. సమాధానం లేదు.
ఇక్కడినుంచి ఫ్లాష్ బాక్/////
ఆమె, తన కోలీగుతో ప్రయాణం చేసేటప్పుడు, ఒక వర్షం కురిసిన రాత్రి,అనుకోని పరిస్థితులలో,ఒకే గదిలో వుండాల్సివస్తే, అతడు ఆమె తన 37ఏళ్ళ శరీరం తన భర్కతి ఉద్రేకం కలిగిస్తుంది కానీ పరాయివాళ్ళకు కలిగించదా? అన్న రోషంతో, చీర మార్చుకోమని బయటకు పోతున్న కోలీగుచేయిపట్తుకుని మంచం మీదకు ఆహ్వానిస్తుంది.
ఈ విషయం భర్తకు చెప్తుంది.
అది విని రంగనాధం మూడు నెలలు ఎతో వెళ్లిపోతాడు. గడ్డం పెంచుకు వస్తాడు. మనల్ని మన విశ్వాసాలే రక్షించాయి అంటాడు.
ఇంతలో కొడుకు కోడలు వస్తారు. వారి సమస్య ఏమిటంటే, ప్రమోషన్ కోసం కొడుకు భార్యను ఆఫీసర్ దగ్గరకు పంపుతాడు. ఆమె ఆఫీసర్ కు ఫోను చేస్తూంటే తిడతాడు. దానికి ఆమె నువ్వు అరువిస్తావు . వాడు ఎరువిస్తాడు అంటుంది .
ఇదంతా రంగనాధం, కామేశ్వరి వింటారు. ప్రపంచం మారటం వల్ల స్త్రీ పురుష సంబంధాలు మారుతున్నాయని, కేరీర్ కోసం పెళ్ళాన్ని అమ్ముకోవటం,కేరీర్ అంటే ఏమిటి ఈ పదాన్ని ఎవరు కల్పించారు? అంటూఅర్ధం పర్ధం, తల తోక లేని చర్చలు చేస్తూ చివరికి ఇదంతా ఫ్రీ మార్కెట్ సృష్టించినవారి దోషం అని తేలుస్తారు. వాణి ఫ్రీ మార్కెట్ ని తెగ తిడుతుంది. తెలియటం వల్ల మనుషులు న్యాయంగా వుంటారన్నది పాతకాలం మాట అంటుంది కామేశ్వరి చచ్చిపోతుంది. ఆమె చావు పలాయనమా? పయనమా? అని స్థానువవుతాడు రంగనాథం….ఇదీ కథ….
ఈ కథలో ఒక పాత్ర చిత్రణ కానీ, వ్యక్తిత్వ నిరూపణ కానీ, సంఘటనల సృష్టీకరణలో ఔచిత్యం కానీ, సంభాషణల్లో చమత్కారం కానీ, ఏమీలేక,కలం ఎతుకదిలితే అటు కదిపి,మెదడుకేది తోస్తే అది రాసి, ఫ్రీ మార్కెట్ ని తిట్టి, సమాజాన్ని దూషించటం తప్ప ఏముందో ఈ కథలో అక్షరం అక్షరాన్ని ఎంత తరచి చూసినా ఏమీ తెలియదు.

వాణి పాత్ర….ఆమె భర్త ప్రమోషన్ కోసం ఆయన కల్చర్డ్ గా వుండమన్నాను, సోషల్ గా మూవ్ అవ మన్నాను,వాదితో పదుకోమనలేదు అని భర్త అంటే, పదుకొన్నందుకు అభ్యంతర పెట్టలేదంటుంది.భర్త ముందే వాడికి ఫోన్ చేస్తుంది. ….ఇక్కడెక్కడా….ఆమె వ్యక్తిత్వంప్రసక్తి లేదు…. రంగనాధం, కామేశ్వరిలు విన్నది ఇంతే…కానీ..వాళ్ళు చర్చించేప్పుడు.కేరీర్ కోసం పెళ్ళాన్ని అమ్ముకుంటున్నాడు కొడుకు, విలాసాలకోసమో,లాలసకోసమో వాడి మాట పాటించింది కోడలు అంటారు…..
ఇంతకీ విలువలు పాడైపోతున్నాయి, పతనమై పోతున్నాయి అని బాధపడుతున్నదెవరు? తన భర్తను ఉద్రేక పరచిన 37ఏళ్ళ శరీరాన్ని పట్టించుకోని కోలీగు చేయిపట్టి మంచం మీదకు లాగిన మహిళ…!!!!!!!
దీని గురించి ఇంకా ఏమి వ్యాఖ్యానించిన సభ్యత హద్దులు దాటినట్టనిపించవచ్చు..
కనీసం కోడలు భర్త మాట పాతించింది. ఈమె….కేవలం ఒక వర్షం కురిసిన రాత్రి,కోలీగును తన 37ఏళ్ళ శరీరం ఉద్రేకపరచలేదని,అక్కడ డ్రా లో కండోం వుందని…బయటకుపోతున్న అతడిని చేయిపట్టుకులాగి……
అసలీకథకు అర్ధమేమయినా వుందా?
పైగా..పాత్రలన్నీ ఆత్మలు,పరమాత్మలు, సంఘము, అభివృద్ధి, ఫ్రీ మార్కెట్ అంటూ అర్ధం పర్ధం, ఒక లాజిక్కు, ఔచిత్యం లేకుండా సంభాషణలు పలికేస్తూంటాయి..
అసలు కథగానే పరిగణించటం కష్టమయ్యే ఈ కథను( ఒక నాలుగేళ్ళ పిల్లవాడు.సంఘటనలు ఇంతకన్నా ఎక్కువ లాజిక్ తో చెప్పగలడు) ఉత్తమ కథగా ఎంచుకున్న సంపాదకులకు జోహార్లు…ఉత్తమ కథ అన్న పదం అర్ధంపై భయంకరమైన వ్యంగ్యం ఈ కథను ఉత్తమ కథ అనటం
మిగతా కథల విశ్లేషణ మరో వ్యాసంలో….

June 16, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-19

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల సంకలనం కథలలో ప్రత్యేకమయిన కథలు భగంతం కథలు. ప్రతి రచయితకూ తనదంటూ ఒక దృక్కోణం వుంటుంది. దృక్పథం వుంటుంది. తనదైన ప్రత్యేక భావ వ్యక్తీకరణ పద్దతి వుంటుంది. అయితే, రచయిత రాను రాను అనేక కారణాల వల్ల తన దృక్కోణాన్నో, దృక్పథాన్నో, భావ వ్యక్తీకరణ పద్ధతినో మార్చుకునే వీలుంది. ఈ మార్పులో అనేకానేక ఒత్తిళ్ళు కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి. కానీ, కొందరు రచయితలు, ఇతరులకు భిన్నంగా తమదంటూ ఒక ప్రత్యేక పద్ధతిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ తరువాత ఎవరెంత విమర్సించినా, అరచి గీపెట్టినా, తమ పద్ధతిని మార్చుకోరు. దీనికి కారణం, ఆ భావ వ్యక్తీకరణ పద్ధతి రచయిత తెచ్చిపెట్టుకున్నది కాదు. ఎవరో నేర్పితే వచ్చింది కాదు. ఎవరినో అనుకరిస్తే అబ్బింది కాదు. అది వారి జీవలక్షణం. ఆ జీవలక్షణాన్ని ప్రేరేపించి, రచయిత తనను తాను గుర్తించేందుకు బాహ్య ప్రభావాలు దోహదం చేస్తాయి. ఆ రచయితకు అది అతని జీవలక్షణంలోని సృజనాత్మకా విషక్రణకు ప్రాణం అయినటువంటి ఆ పద్ధతి ఎవరి అనుకరణనో, ప్రభావమోగా భావించటం పొరపాటు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకవసరమయిందంటే, భగవంతం, కథలను పలువురు త్రిపుర రచనలతో పోల్చి, ఆ రచయితను ఒక చట్రంలో బంధించి, అతని సృజనాత్మకత స్వేచ్చా విశృంఖల విహారాంపై ప్రతిబంధకాలు విధించి, పంజరంలో బంధిస్తారు. ఇదీ ఉత్తమ కథలుగా ఎంపికయిన భగవంతం కథలను పరిశీలిస్తే గమనించవచ్చు.
25ఏళ్ళ ఉత్తమ కథా సంకలనాల్లో భగవంతక్ కథలు నాలుగు ఎంపికయ్యాయి. 2006లో అతడు-నేను-లోయ చివరి రహస్యం, 2010లో చిట్టచివరి సున్నా, 2013లో చంద్రుడు గీసిన బొమ్మలు, 2014లో గోధుమరంగు ఆట అన్న కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
భగవంతం అన్న కలం పేరులోనే రచయితపై త్రిపుర ప్రభావం కనిపిస్తుండవచ్చు, కానీ, భగవంతం రచనా సంవిధానానికి, ఆలోచన రీతికి, భావ వ్యక్తీకరణ పద్ధతికి, త్రిపుర కూ చాలా తేడా వుంది. ఈ రచయిత సృజనాత్మక జీవలక్షణంలోని ప్రాణాన్ని, త్రిపుర కథలు తట్టి లేపివుండవచ్చు, కానీ, భవంతం వేరు, త్రిపుర వేరు. కానీ, మన విమర్శకులు, రచయితను త్రిపుర అనే చట్రంలో బిగించి, అతనికో ఇమేజీ ఇచ్చేసి, అతని సృజనాత్మక స్రవంతి ప్రసారాన్నికి అడ్డుకట్టలు కట్టారు. ఆ ఇమేజీ పంజరంలో ఇమిడిన రచయిత సృజనాత్మకత ఇనుప పంజరం గోడలపై రెక్కలు టపటపా కొట్తుకోవటం కూడా ఈ కథల్లో కనపడుతుంది.
భగవంతం కథలు అర్ధమయీ అవనట్తుంటాయి. కథలో ఏదో మార్మిక అంశం నిగూధంగా పొందుపరచిన భావన కలుగుతుంది. ప్రతీకల వెనుక దాగిన మార్మికత ఒక అస్పష్టమైన ఆకారంతో మనసు తెరల వెనుక నర్తనమాదుతూంటుంది. కానీ, కథను పలుమార్లు చదివితే కానీ, రచయిత ప్రదర్శించిన అంశం స్వరూపం సంపూర్ణంగా అవగాహన కాదు. ఒకోసారి, ఎంత ప్రయత్నించినా అందీ అందని స్వప్నంలా మిగిలిపోతుంది. అయితే, రచయిత రచనా శైలి అతి చక్కనిది. విడవకుండా చదివిస్తుంది చివరివరకూ..చివరికి ఎవరి సంస్కారాన్ని బట్టి వారు రచనలో ఆంతర్యాన్ని అర్ధం చేసుకుంటారు. ప్రస్తుతం నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో ఇలాంటి విభిన్నమయిన రచనలు చేస్తున్నవారు ఇద్దరే. ఒకరు భగవంతం, మరొకరు, వేదాంతం శ్రీపతి శర్మ!
ఇంకా, అనేకులు , దానికి మాజిక్ రియలిజం అనో, ఇంకేదో ఇజం అనో పేరుపెట్టి అభాసుపాలయ్యే కథలెన్నో రాస్తున్నారు. వారికి అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయి. అది వేరే విషయం. కానీ, భగవంతం కథలను వారి జాబితాలో చేర్చలేము. ఇవి ప్రత్యేకమయిన కథలు.
అతడు-నేను-లోయ చివరి రహస్యం…చదువుతూంటే అద్భుతంగా అనిపిస్తుంది. రచయిత సృజనాత్మకతకు, సున్నితత్వానికి, మార్మికతకు జోహార్లర్పించాలనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతీకల ద్వారా. యాంత్రిక జీవితానికి బందీలయి, తమలోని ఆత్మ స్వేచ్చా విహంగంలా విహరించాలన్న త్ర్ష్ణను గుర్తించీ, అందుకు ప్రయత్నించీ, అందుకోలేని జీవితాలలోని విషాదాన్ని అత్యంత అద్భుతమయిన రీతిలో, ప్రత్యక్షంగా ఒక్క ముక్క చెప్పకుండా పరోక్షంగా మనసు లోలోతుల్లో ఆ భావం స్పురింపచేసి స్పందన కలిగే రీతిలో రచయిత ప్రదర్శించిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఓ వ్యక్తి రైలు పట్టాలమీద నడుస్తూ, పక్షిలా పైకి ఎగిరిపోవాలనుకుంటాడు. అతనికి ఆ పట్టాలమీదే పక్షిలా ఎగురుతూ, మనిషిలా రక్తమాంసాలతో బరువుగా నడవాలనుకునే మనిషి కనిపిస్తాడు. వారికి రైల్వేయ్ట్రాక్ పైని టన్నెల్లో నుంచి వేగంగా పరుగెత్తి ఆవైపుకు చేరుకుంటే తమకోరిక నెరవేరుతుందనిపిస్తుంది. అందుకు ప్రయత్నిస్తారు. కానీ, అది జరగదు. పక్షిలాంటివాడు ఎగురుతూనే వుంటాడు. ఎగరలేనివాడు అలాగే వుంటాడు. కథను రచయిత, ఏదో కొంచెం కొంచెంగా అర్ధమవ సాగింది. కానీ, ఒక్క విషయం మాత్రం ఎందుకో అర్ధం కాలేదు, అంటూ ముగిస్తాడు. కథలో పక్షిలాంటి మనిషి, మనిషిలాంటి పక్షి దేనికి ప్రతీకలో రచయిత అక్కడక్కడా ఆధారాలు వదిలాడు. ఈ కథనలు, పాత్రల స్పందనలు గమనించటం ఒక అద్భుతమయిన అనుభవం. ఈ కథను ఉత్తమ కథగా భావించటంలో ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ వుండవు. ఎందుకంటే, ఇలాంటి రచనా సంవిధానం ఈ రచయితకే ప్రత్యేకం. అయితే, కొందరు అందరికీ అర్ధంకాదేమో అనవచ్చు..కానీ, రచయిత తాను రాయాలనుకున్నది, తనకు తోచినట్టు, తాను రాయాలనుకున్నట్టు రాస్తాడు. దాన్ని పాఠకులు తమ తమ సంస్కారాన్నిబట్టి అర్ధం చేసుకుంటారు. కాబట్టి, రచయితను పాఠకుల స్థాయికి దిగిరమ్మనేకన్నా, పాఠకులను రచయిత స్థాయికి ఎదగమనటమే ఉత్తమం. ఈ కథ చదివితే, రచయిత ఆలోచనాలోతు , భావ వ్యక్తీకరణ పటిమలు స్పష్టమవుతాయి.
చిట్టచివరి వ్యక్తి కథ ఒక అబ్సర్డ్ కథ. ఒక వ్యక్తికి, వార్తాపత్రికలో ఖాళీ భాగంలో కొన్ని రాతలు కనిపిస్తాయి. దాన్లో, జీవిత సత్యాన్ని తెలిపే ఆ పదార్ధంతో పులుసు వండుకొని చివరిసారి తృప్తిగా భోంచేసి వెళ్ళిపోవాలి అనిరాసి వుంటుంది. దాంతో మన హీరో ఆ పులుసు ఏమిటో తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఎక్కడెక్కడ ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతూంటాయో అక్కడక్కడకు వెళ్తాడు పులుసుకోసం. చివరికి, ఓ పాప అనేక జన్మలని కప్పుకుని నిద్రపోయేదాని ఒక్కోక్క జన్మకథనీ తెలుసుకుంటూ పోతే, చివరికంతా శూన్యం అనే పొడుపు కథ చెప్తుంది. అప్పుడు మన హీరోలొ అది ఉల్లిపాయ అనీ, ఉల్లిపాయ పులుసు అనీ అర్ధమవుతుంది. అదీ కథ… కథ రచయిత ఆసక్తి కలిగించే రీతిలో రాసినా, ఉల్లిపాయ పొడుపుకథ, జీవితాలు నిరర్ధకాలు, అర్ధవిహీనాలన్న భావనను బోధిస్తూన్నా, కథ పూర్తయ్యే సరికి ఒక గంభీరమయిన విషయాన్ని రచయిత తేలిక చేసి హాస్యాస్పదంగా చెప్పాలని ప్రయత్నిస్తూ, చివరికి ఒక ఎద కదిలించే దృష్టాంతంతో ముగించాలని ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. కానీ, కథలో ఈ రెంటి నడుమ సమన్వయం సాధించలేక విఫలమయ్యాడనీ తెలుస్తుంది. తాత్త్వికాంశాన్ని హాస్యాస్పదంచేసి చెప్పటం అతి కష్టమయిన పని. ఎంచుకున్న అంశాన్ని బట్టి రచనా సంవిధానం వుంటే, రచన పండుతుంది. అలాకాక, రచనా సంవిధానం ఎంచుకుని దాన్లోకి అంశాన్ని చొప్పించి మెప్పించాలనుకోవటం కత్తిమీద సాములాంటిదే. అందుకు ప్రయత్నించిన రచయితను అభినందిస్తూనే, విఫలమయ్యాడని చెప్పక తప్పదు. కథ ఎంత అబ్సర్డ్ అయినా, దానికి లాజిక్ వుండాలి. ఆ లాజిక్ లోనే అబ్సర్డిటీని ఇమిడ్చాలి. అక్కడ అది లాజికల్లీ, అబ్సర్డ్ అయినా, అబ్సర్డ్లీ లాజికల్ అనిపిస్తుంది. లాజిక్ వదలి అబ్సర్డ్ వెంట పడితే, అబ్సర్డ్ స్టుపిడిటీలా తోస్తుంది. అదీ ఈ కథలోపం. రచయిత కథను చదివిస్తాడు. అక్కడక్కడా ఆశ్చర్యకరమయిన ఆలోచనలు, వ్యాఖ్యలు ఉంటాయి కథలో..కానీ, పేపర్ లో ఒక వాక్యం చూసి దాన్ని పులుసుగా భావించి పాత్రను పులుసు వేటలో పంపించటంతో కథలో ఏ పాత్ర ప్రయాణంతో పాథకుడు మమేకం చెందితే కథ పండుతుందో, ఆ విషయంలోనే పాఠకుడు పాత్ర మానసిక స్థితిని ప్రశ్నించటం మొదలుపెడితే, కథ అభాసుపాలవుతుంది. అయితే, లోయ రహస్యం కథను అంత పకడ్బందీగా రాసిన రచయిత నాలుగేళ్ళలో ఇలాంటి కథ ఎలా సృజించాడా? అన్న ప్రశ్న కలిగుతుంది. దానికి సమాధానం తెలుగు సాహిత్య ప్రపంచంలో వున్న ఒక విచిత్రమైన పరిస్థితి కారణంగా కనిపిస్తుంది.
సాధారణంగా, ఆటగాళ్ళు, చిన్న వయసులో ప్రతిభను కనబరుస్తారు, రచయితలు, పరిణతి పొందిన తరువాత ప్రతిభ ద్యోతకమవుతుంది అంటారు. కానీ, తెలుగు సాహిత్య ప్రపంచంలో పలు కారణాల వల్ల ఒకటి రెండు కథలు రాయగానే, అంటే ఇంకా మొగ్గగా వున్న దశలోనే పొగడ్తలు, బహుమతులు లభిసంచేస్తూంటే, ఇంకా రెక్కలు విప్పుకోకముందే తాను ఆకాశంలో వీర విహారం చేయగలనని నమ్మే పక్షుల్లా తయారవుతారు రచయితలు. వారికి తమకు తెలియనిదేదీలేదని, ఎవరూ తమకు చెప్పేవారులేరని, ఎవరయినా తమముందు దిగదుడుపేనన్న నమ్మకం స్థిరపడుతుంది. దాంతో ప్రశంశలు తప్ప విమర్శలు భరించలేరు. తాము అరిస్తే వాద్యం, స్మరిస్తే పద్యం అనుకుంటారు. ఘూకం కేకలు, బేకం బాకల ప్రలోభంలో తమని తాము మరచిపోతారు. వారి ఎదుగుదల ఆగి, చత్రంలో బంధితులవుతారు. భగవంతం ను మన విమర్శకులు, త్రిపుర చట్రంలో బిగించారు. దాంతో తానిలాగే రాయాలి, అదే తన ప్రత్యేకత అన్న భ్రమలో రచయిత పడ్డట్టు తోస్తుంది. అయితే, త్రిపుర వేరు భగవంతం వేరు. త్రిపుర సైతం పట్తుమని పది కథలను మించి రాయలేదు. ఆ కథలనుకూడా కొందరు భుజానెత్తుకుని మోయకపోతే( వారికీ ఆ కథలు ఎంత అర్ధమయయో తెలియదు) ఆ కథలు మరుగున పడేవి. గమనిస్తే, భగవంతం రచన సంవిధానం త్రిపుర అంత కఠినం మార్మికం కాదు. సులభంగా చదువుకునే వీలున్న రచనలు. కానీ, త్రిపురతో పోలిక తేవటంతో, భగవంతం త్రిపురలా తప్ప మరో రకంగా రాస్తే, తన అస్తిత్వం నిలవదనే భయంతోనో అలాగే రాయాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇది, అతని స్ర్జనాత్మ ప్రవాహానికి ప్రతిబంధకంగా మారుతున్నట్టూ అనిపిస్తుంది.
చంద్రుడు గీసిన బొమ్మలు కాన్సెప్ట్ అతి చక్కనిది. ఒక స్థాయివరకూ రచయిత చక్కగా కథను నడిపేడు..కానీ, చివరలో కథపై పట్టు తప్పి, ఈ కథ ఎంతో గొప్ప సత్యాన్ని ప్రదర్శిస్తుందన్న భావన కలిగించి నిరాశ పరుస్తుంది.
చందమామను చూస్తున్న వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది. ఒక హైకు రాస్తాడు. అతని కవి మిత్రుడూ అలాంటి భావాన్నే వ్యక్తపరుస్తాడు. మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. ఆదిమకాలం నుంచి చందుదిని ఎంతమంది చూశారో అని రాస్తాడు. చిన్నప్పుడు ఆడుకున్న ఆట గుర్తుకువస్తుంది. చంద్రుడు వచ్చి రాస్తాడన్న ఆట అది. చిత్రంగా అతనుకోరిన జాబితా అతని కాగితాల్లో కనిపిస్తుంది. దాన్లో ఒక ఆఫ్రికా అమ్మాయి తల్లి చూసిన చంద్రుడిని తాను చూస్తున్నానని కంటతడి పెట్టిన విషయం వుంటుంది. దాంతో రచయిత ఇతర జాబితా కోసం చూడడు…చంద్రుడు తన మీద కళ్ళుమోపే వాళ్ళకోసం ఎదురుచూస్తున్నాడనిపిస్తుంది.
ఈ కథలో రచయిత ఆలోచన సున్నితమైన ఆలోచనలా అనిపించినా, కథను ఒక చెరికా అనే అమ్మాయికి పరిమితంచేసి పాథకుల హృదయం ద్రవింపచేయాలని ప్రయత్నించటంతో కథ గతి తప్పింది. అదీగాక….రచయిత కోరిన కోరికను సమర్ధించినా…ఆ కోరికను..నెరవేర్చటంలో లాజిక్ తప్పింది. రచయిత కోరింది, నాలా ఎంతమంది చంద్రుడిని చూస్తూ ఫలానావారు చూసిన చంద్రుడిని నేనూ చూస్తున్నానని భావించుకున్నవారు మొత్తం మానవజాతి చరిత్రలో ఎంతమందున్నారన్నది. ఈ జాబితాను చంద్రుడు మూడు నాలుగు పేజీల్లో రాసినట్టు చెప్పాడు రచయిత…మూడు నాలుగు పేజీలవరకూ రాసిఉన్నాయా నీలివాక్యాలు….అని చెప్తాడు. అంటే…మానవజాతి చరిత్రలో ఫలానా వారు చూసిన చంద్రుడిని నేనూ చూస్తున్నాను అనుకునేవారి జాబితా సందర్భంతో సహా నాలుగుపేజీలేనా? అంత అరుదయినదా ఈ ఆలోచన? పైగా చెరికా కథే ఒక పేజీవుంది. ముందు ఒకపేజీలో హైకు వుంది..అంటే రెండు పెజ్జీల్లో సందర్భంతో సహా ఇమిడిపోయేంత గుప్పెడేనా జాబితా? మన ప్రబంధాలు తిరగేస్తేనే వందలకొద్దీ సందర్భాలు దొర్లుతాయి..ఇదీ, అబ్సర్డిటీలో లాజిక్ లేకపోవటంటే….ఈ కథ చివరి వాక్యాలు గొప్పగా వున్నా, కథను గొప్ప కథ అనలేము.
గోధుమరంగు ఆట దగ్గరకు వచ్చేసరికి రచయిత త్రిపుర చట్రంలో సంపూర్ణంగా ఇమిడిపోయాడన్న ఆలోచన స్థిరపదుతుంది. ఇది త్రిపురకు నివాళిగా, ఆయన కథ కొనసాగింపు….పూర్తిగా చదవటం కష్టం అనిపిస్తుంది. మామూలుగా కథ ఉన్న కథను నదిపించటం సులభం. ఏమీలేకుండా కథను నడిపించటం చాలా కష్టమయిన పని….
ఒకరిని అనుకరించటంకన్నా, ఆ దారిలో ప్రయాణిస్తూ తనదైన స్వతంత్ర మార్గాన్ని ఏర్పరుచుకున్న వారే తమదయిన ప్రత్యేక స్తిత్వాన్ని సాధిస్తారు. లేకపోతే, తామెవరి ప్రేరణతో అలాంటి రచనలను సృజిస్తున్నారో, జీవితాంతం వారి నీడలో ఒదిగిపోతారు. ఎంతయినా, హిమాలయాన్ని అందరూ అనుకరించలేరు. అనుకరించినా హిమాలయాన్ని మరిపించాలంటే దానికన్నా ఎత్తు ఎదగటమేకాదు, హిమాలయాల్లో వున్నవన్నీ కాక ఇంకా భిన్నమయినవీ చేర్చుకోవాలి. ప్రతిభావంతుడయిన రచయిత, అందరికన్నా భిన్నమయిన ఆలోచనలు, సున్నితత్వం, భావవ్యక్తీకరణ ల;అ అత్యద్భుతమయిన రచయిత ఇనేజీ చట్రంలో బిగుసుకుని, లోయ రహస్యం కథలోలా, శరీరపు బరువుకి క్రుంగిపోతూ, పక్షిలా పైకెగరాలని ప్రయత్నిస్తూ వొఫలమయిన పాత్రలా మిగిలిపోతాడు.
వచ్చే వ్యాసంలో వివినమూర్తి కథల విశ్లేషణ వుంటుంది.

June 11, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized