Archive for October, 2017

25ఏళ్ళ ఉత్తమకథల విశ్లేషణ-24

పోరుతల్లి కథ పూర్తిగా మాండలీకంలో రాసిన కథ..ఇది ప్రథమ పురుషలో సాగే కథ. కొవిరయ్య సారు పాథం చెప్తూంటే అది సగ్మ్ అర్ధమయితది, సగం అర్ధం కాదు అంటూ ఆరంభమవుతుంది కథ..కథ మొదట్లో ఇదీ రొటీన్ కథే అనిపిస్తుంది. సార్ కాలానికి తగ్గట్టు బట్టలు తొడుక్కోవాలని అంటే పిల్లలకు అర్ధం కాదు. ఏ బట్టయితే ఏందిగాని నాకున్నయి మొత్తంల రొండు అంగీలు, రెండు లాగూలు. ఏకాలంల అయిన గవ్వే ఏసుకుంట. అవ్విటికిగూడ ఎటు చూసినా పొక్కలే, అనటంతో మనకు విషయం అర్ధమవుతుంది. అంటే, రచయిత తాను చెప్పదలచుకొన్న విషయాన్ని కథలో భాగం చేసి చెప్తున్నాడు తప్ప, కథకు విడిగా చెప్పటంలేదు. చక్కని కథా రచనా సంవిధానం ఇది. కథ చెప్పే అతని స్నేహితుడు నారిగాడి. అతడు ఒక రకమైన రెబెల్. కథ చెప్పే అతని అమ్మ, నాన్న, తాత చనిపోతే లచ్చవ్వ పెంచుకుంటుంది. దొర ఆమె భూమిని కాజేస్తడు. కానీ ఆమె ఆ భూమి కోసం పోరాడుతూంటుంది. పాఠంలో సారు లక్ష్మీబాయి గురించి చెప్తూంటే మన కథ చెప్పే అతనికి లచ్చవ్వ గుర్తుకువస్తుంది. ఒక రోజు దొర వచ్చి పోరగాడిని కూడా కూలీకి పంపమంటాడు. లచ్చవ్వ దొరను తిడుతుంది. పిల్లవాడిని చదివిస్తానంటుంది. ఇంతలో వారి గుడిసె కాలిపోతుంది. ఎలా కాలిందో, ఎవరు కాల్చారో అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ ఇమ్మనరు. అయితే, నడి రాత్రి మన కథకుడికి మెలకువ వస్తుంది. లచ్చవ్వ ఏదో మూటకడుతూ కనిపిస్తుంది. ఇదెవ్వరికీ చెప్పద్దని అర్ధరాత్రి బయటకు వీళ్తుంది. తెల్లారేసరికి దొరగారి పొలంలో లింగం మొలుస్తుంది. ఊరంతా అక్కడికి వస్తుంది. ఇతర వూళ్ళనుంచీ తీర్ధయాత్రలా ప్రజలు వస్తారు. దొర లచ్చవ్వను అనుమానిస్తాడు. కొత్తవేషం కట్టినావని ప్రశ్నిస్తాడు. దేవునిజోలికస్తే నువ్వేలేకుండా పోతవ్ అంతుంది లచ్చవ్వ. ఆరోజు రాత్రి దొర ఇంట్లోకి నాగుపాము వస్తుంది. దాంతో దొర లచ్చవ్వను ఆమె భూమిని వదిలేస్తాడు. ఇదీ కథ. ఈ కథను ఉత్తమ కథగా నిర్ణయించటంలో ఎలాంటి అభ్యంతరాలు వుండవు. కథ బాగుంది. కథ చెప్పిన విధానం బాగుంది. కథలో పాత్రల చిత్రీకరణ సన్నివేశసృష్టీకరణలు ఉత్తమ స్థాయిలో వున్నాయి. ముఖ్యంగా ఝాన్సీ లక్ష్మీబాయి తన భూమి కోసం పోరాడింది, లచ్చవ్వ కూడా అదే చేసిందన్న ఆలోచనను రచయిత ఎంతో ప్రతిభావంతంగా కలిగిస్తాడు. తరచిచూస్తే, అడుగదుగుకీ అనేకమంది లచ్చవ్వలు కనిపిస్తారు. ఒక్క భూమికోసమే కాదు, నిత్యజీవితంలో పలు అంశాల కోసం నిరంతరం పోరాటం జరుపుతున్న అనామకులనేకులు. అలాంటి ఒక అనామక పోరాటాన్ని పోరుతల్లి రూపంలో రచయిత గొప్పగా తెరపైకి తెచ్చారు.
బెజ్జారపు రవీందర్ ఇతర కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో..

October 26, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized