Archive for November, 2017

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ- 25(3)

2000లో ఉత్తమ కథగా ఎంపికయిన నోరుగల్ల ఆడది కథ కూడా ఉమామహేశ్వర రావు ఇతర కథలకు మల్లే చదివించేదిగా వుంటుంది. కానీ, చివరికి లాజికల్ గా వుండక, పలు సందేహాలను కలిగిస్తుంది. అసంతృప్తిని మిగులుస్తుంది. ఈ కథ టూకీగా చెప్పాలంటే, వేశ్యల కథ. విజయమ్మ స్వర్ణ అనే ఇద్దరు వేశ్యావృత్తిలో వుంటారు. కానీ, తమ డిగ్నిటీని కాపాడుకుంటూంటారు. వేశ్యలందరి భూములను మునసబు కాజేస్తాడు. కానీ, స్వర్ణ మాత్రం అరచి నోరుపెట్టుకుని భూమిని కాపాడుకుంటుంది. అదీ కథ. అయితే, రచయిత కథను చెప్పిన విధానం ఇబ్బంది కలిగిస్తుంది. ఫ్లాష్ బాక్, ఫార్వార్డ్, ఫ్లాష్ బాక్, ఫార్వార్డ్…అంటే గతం, వర్తమానం, మళ్ళీ గతం వర్తమానం ల నడుమ కథ చెప్తూ, గత వైభవాన్ని చూపుతూ, వర్తమానంలోని దుస్థితిని చూపుతూ కథ సాగుతుంది. అయితే, ఈ టెక్నిక్ ఈ కథకు వాడాల్సింది కాదు. ఉదాత్తమయిన అంశాలకు, ఇప్పటి దుస్థితి, ఒకప్పటి వైభవం వెనువెంటనే చూపిస్తూంటే పాఠకుడి మనస్సు వైభవానికి పొంది, దుస్థితికి క్రుంగేట్టుంటే ఈ రీతిని కథ చెప్పటం పండుంతుంది. అలాకాని పక్షంలో విసుగు కలిగిస్తుంది. అయోమయాన్ని కలిగిస్తుంది. వేశ్యలయినా ఒకడికే లాయల్ గా వుండటమూ చూపిస్తాడు రచయిత.కానీ పాత్రలతో కనెక్ట్ కావటానికి ఈ టెక్నిక్ అడ్డువస్తుంది. దాంతో కథ వెల్లకిల్లాపడుతుంది. ఏదో గొప్ప కథ చదవబోతున్నామనుకున్న పాఠకుడు చతికిలపడతాడు.
ఆంగ్లంలో జాన్ ఫొవెల్స్ అనే ఆయన ఈ టెక్నిక్ ను బహుచక్కగా వాడేడు. ముఖ్యంగా ఫ్రెంచ్ లెఫ్టినెంట్స్ వొమెన్ అనే నవలలో ఆధునిక ప్రేమ జంట ప్రేమను ప్రాచీన కాలంలోని ప్రేమ జంట ప్రేమ తో పోలుస్తూ,, వారి కథను సమాంతరంగా నడుపుతాడు. ప్రేమ భావనలోని సార్వకనీనతను, సమాజాల్లో ప్రేమ భావన పై వున్న అపోహలను సమాంతరంగా చూపుతాడు. చాలా గొప్ప నవల అది. దాన్ని అదే పేరుతో సినిమాగా కూడా తీశారు. అంటే, ఈ టెక్నిక్ వాడాలంటే సరయిన సబ్జెక్ట్ అవసరం. అది లేనప్పుడు టెక్నిక్ వుంటుంది..కథ వుండదు.
2004లో వుత్తమ కథగా ఎంపికయిన ఉమామహేశ్వరరావు కథ వొంటేపమాను. ఇదీ ఇతర కథల్లాగే ఆసక్తికరంగా చదివిస్తుంది. కానీ, చివరికి అర్ధంలేనిదిగా, ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఇది బంగారమ్మ కథ. ఆమెకు ఊళ్ళోని పెద్దతో సంబంధం వుంటుంది. కానీ, అతనికి ఇస్తుందే తప్ప తీసుకోదు. అతడిని కష్టాల్లోంచి గట్టెక్కిస్తుంది. ఊళ్ళో అందరికీ అండగా వుంటుంది. అందరి గౌరవమన్ననలు పొందుతుంది. బంగారమ్మని నమ్ముకుని బాగుపడ్డోళ్ళేకానీ, ఆ యమ్మ యువుర్నీ నమ్ముకుని బతకలా, యేనాడూ యెవురి కష్టానికీ ఆసి పడలా…యేదో తనకు కలిగిందే తినింది. వికరికి పెట్టింది..అంటారందరూ. అయితే, ఊళ్ళో సబ్ స్టేషన్ పెడతారు. పోలీసులు ఆ ప్రాంతంలోని వేస్యలందరినీ లాకుపోయి అవమానిస్తూంటారు. అడ్డుపడ్డ బంగారమ్మనీ కట్టేసి తీసుకుపోతారు. బంగారమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటినుంచీ ధైర్యంగా ఎవరయినా ఎదురుతిరిగితే బంగారమ్మ కానీ పూనిందా అని అడుగుతూంటారు. ఇదీ కథ. కథ చదువుతూంటే బంగారమ్మ పాత్రని బాగానే అభివృద్ధి చేస్తూన్నట్టు అనిపిస్తుంది. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పటంతో ఆ పాత్ర అర్ధవిహీనమైపోతుంది. అంత ధైర్యం కల ఆమె ఎదురునిలచి పోరాడినట్టు చూపివుంటే అది ఆ పాత్ర వ్యక్తిత్వానికి తగ్గట్టు వుండేది. ఆత్మహత్య పిరికివాడి పని. ఆ పని చేసిన ఆమెను ధైర్యానికి ప్రతీకగా తీసుకోమనటం అర్ధవిహీనం..ఇక్కడ అప్రస్తుతమయినా ఒక విషయం ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ఇటీవలి కాలంలో కొందరి పద్మావతి సినిమా వివాదాన్ని పురస్కరించుకొని..రాజపుత్ర స్త్రీల జౌహార్ గురించి అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నారు. జౌహార్ కీ, ఆత్మహత్యకూ చాలా తేడా వుంది. జౌహార్ ఆత్మాభిమానంతో ఆత్మగౌర్వం నిలుపుకోవటం కోసం చేసిన వీరోచితమయిన కార్యం. ఆత్మహత్య, మానసిక దౌర్బల్యంతో, నిరాశలో వచ్చిన తెగింపువల్ల జరిగే పిరికి పని . ఈ రెంటికీ తేడా గుర్తించలేని స్థితిలో వుంది మనసమాజమే కాదు, తెలివైన వారిగా భావించుకునే మేధావులుకూడా అని ఈ కథ నిరూపిస్తుంది. పైగా, ఈ కథలో పోలీసులపై విసురువుంది. వారి రాక్షసత్వాన్ని చూపటం వుంది. బహుషా అందుకని సంపాదకులకు ఈ కథ నచ్చివుంటుండి.
ఉమామహేస్వరరావు కథలు చదివిన తరువాత , ఒక మనచి రచయిత, రంగుటద్దాలలో ప్రపంచాన్ని చూస్తూ, సిద్ధాంతాల పరిమితుల్లో సృజనను ఇముడ్చాలని ప్రయత్నించటంవల్ల ఎన్నో మంచికథలు రాబోయి దారిమళ్ళి సముద్రంలో కలవాల్సిన నది, ఎడారిలో ఎండిప్పయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కథలను ఉత్తమ కథలుగా ఎంచుకున్న సంపాదకులూ, జర్నలిస్ట్ రచయిత, తమ ఉద్యమంలోనివాడు కాబట్టి ఏమి రాసినా పొగడే వందిమాగధభట్రాజభజనబృందాలు ఈ రచయితను ఎడారివైపు దారిమళ్ళించినవారు. తెలుగు సాహిత్యంలోని ఒక దుస్థితికి చక్కని ఉదాహరణ ఈ కథలు.
వచ్చే వ్యాసంలో జాన్సన్ చోరగుడి కథల విశ్లేషణ వుంటుంది.

November 29, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ తెలుగు ఉత్తమకథ విశ్లేషణ-25(2)

ఆర్ ఎం ఉమామహేశ్వర రావు రచించిన మంచివాడు కథ 1993 ఉత్తమ కథల సంకలనంలో ఉత్తమ కథగా ఎంపికయ్యింది. ఈ కథ ఉత్తమ కథల సంపాదకులకు సర్వసాధారణంగా ఇష్టపడే పలీటూరి పేదరైతుల కథ..కాబట్టి, ఇంతకుముందే ఒక కథ ఉత్తమ కథగా ఎంపికయ్యింది కాబట్టి, ఈ రెండు అంశాలను కలుపుకుంటే ఈ కథను ఉత్తమ కథగా సంపాదకులు భావించటంలో ఆశ్చర్యం కలుగదు. కథ చాలా ఆసక్తికరంగా చదివిస్తుంది. కథ ఆరంభమే గ్రామీణ జీవితంలో వస్తున్న పెనుమార్పులు, కొత్తగా వెలుస్తున్న ధనస్వాముల ప్రభావంవల్ల పరువు ప్రతిష్ఠలను నిలబెట్టుకోవాలని అనుకొనే నిజమైన పెద్దమనుషులకు నిలువనీడ లేకుండా పోతోంది…అన్న వాక్యాలుంటాయి. ఈవాక్యాలు చదవగానే కథ అర్ధమయిపోతుంది. పెద్దరెడ్డి అనే ఒక పెద్దమనిషి ఒకప్పుడు పెద్దమనిషి. భూములున్నమనిషి….పెద్దచెయ్యి ఆయనది. అడిగినవారిని కాదనడు. అలా అతని ఆస్తి కరగిపోతుంది. చివరికి ఇప్పుడు వేరేవారి పొలానికి కాపలా కాసే స్థితికి వస్తాడు. అతని కొడుకుకూడా తండ్రితోపాటే వుంటాడు. ఇంట్లో దుర్భర దారిద్ర్యం తాండవిస్తూంటుంది. తినటానికి తిండివుండదు. కోడలు తిడుతూంటుంది. చివరికి పెద్దరెడ్డి కాపలాకాస్తున్న ధాన్యరాశినుంది దొంగిలించేందుకు అతని కొడుకే వస్తాడు. కానీ కొడుకుని ఒక్క గింజకూడా తీసుకోనీయడు పెద్దరెడ్డి. తండ్రి పట్టుదలను చూసి కొడుకు థూ అని వుమ్మేసి పోతాడు…చిన్నరెడ్డికి ….ఒరేకొడకల్లారా..నేను మంచోణ్ణిగాదురా. నాకు మానం, మర్రేదావొద్దురా అని అరవాలనిపించిందని కథ ముగిస్తాడు రచయిత…
కథ చదువుతున్నంతసేపు రచయిత కథన ప్రతిభవల్ల ఆసక్తిగా చదువుతాం. కానీ, కథ పూర్తయిన తరువాత చూస్తే..కథ అర్ధవిహీనమనిపిస్తుంది. అలాగని ఇలాంటి మనుషులు లేరౌ అని అనలేము. సత్యహరిశ్చంద్రుడి కయ్జ వుండనేవుంది. కాటికాపరిగా స్వంతకొదుకు శవాన్ని కాల్చేందుకు భార్యనే సుంకం అడిగేడు. కానీ, ఈ కహలో పెద్దరెడ్డి ఎవరి అన్యాయంవల్లనో పేదవాడు కాలేదు. అతను పేదవాడయి ఆస్తి కరగిపోవటం స్వయంకృతాపరాధం. ఇక అతని ఇంట్లోవాళ్ళు పస్తులుండటం, కొడుకు దొంగతనానికి వచ్చేందుకు కారణం మూర్ఖత్వమే తప్ప మరొకటికాదు. ఇలాంటి పరిస్థితిలో ఆ పాత్రపై సానుభూతి కలగదు సరికదా…కథమొత్తం చక్కగా చెప్పిన వ్యర్ధమయిన కథ అనిపిస్తుంది. కథ ఆరంభవాక్యాలకు చివరి వాక్యాలకూ నడుమ పొంతనలేదనీ అర్ధమవుతుంది.
1997లో ఉత్తమ కథగా ఎంచుకున్న మొగుడూ పెళ్ళాలప్రేమ కథ ఉత్తమ కథ అనిపిస్తుంది. రచయిత కథాకథన ప్రతిభ వ్యర్ధమయిన అంశాలనే అద్భుతం అనిపించేరీతిలో ప్రదర్సించినప్పుడు చక్కని కథ ఉన్న కథను మరింత చక్కని కథగా ప్రదర్సించటంలో ఆశ్చర్యంలేదు.
ఈ కథ లో కథచెప్పే అతనికి విజయమ్మ అనే ఆమెతో చిన్నప్పటినుంచీ తెలుసు. ఇతను చదువుకుంతున్నప్పుడు ఆమె ఆమెభర్త అన్యోన్యంగా వుంటూంటారు. ఇంతలో ఆమె భర్త పనిచేస్తున్న కంపెనీ మూసేస్తారు. అప్పటినుంచీ వారి దుర్దశ ప్రారంభమవుతుంది. చివరికి అతను చిరాకులో రైలుక్రింద చేత్తులు పెట్టి చేతులు కోసేసుకుంటాడు. విజయమ్మ టేకొట్టుపెట్టి అతడిని పోశిస్తూంటుంది. అతను ఆమెని తంతూంటాడు. ఆమె అరచి గోలపెడుతూంటుంది. మన కథకుడు ఆమెపై ఆధారపడి బ్రతుకుతున్న భర్త ఆమెని అంతగా కొడుతూన్నా ఆమె ఎందుకని అతడిని భరిస్తోందని అడుగుతాడు. అప్పుడామె..ఒకప్పుడు ప్రేమగానే వుండేవాడు..కాలం కలసిరాక ఇలా తయారయ్యాడు..అని చెప్తూ ఇంతచేసినా అతనిపై కోపం రాదు..రాత్రి కౌగలించుకుని పసిబిడ్డలా ఏడుస్తాడంటుంది. కథ పూర్తయినతరువాత భార్యా భర్తల నదుమ ప్రేమను బానే చూపేడనిపిస్తుంది. అందుకే, ఈ కథలోని అసంబద్ధాలను పక్కనపెడితే కథ బాగుందనిపిస్తుంది.
మిగతా కథలగురించి వచ్చేచ్యాసంలో…

November 24, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగుకథ విశ్లేషణ-25

ఆర్ ఎం ఉమామహేశ్వర రావు కథలు 1991లో బిడ్డలుగల తల్లి, 1993లో మంచివాడు, 1997లో మొగుడూ పెళ్ళాల ప్రేమ కత, 2000ల్0అ నోరుగల్ల ఆడది, 2004లో వొంటేపమాను అనే నాలుగు కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
ఉమామహేశ్వరరావు కథలు చదువుతూంటే కళ్ళముందు దృశ్యాలు కదలాడుతూంటాయి. జీవితాలు కళ్ళముందు కనిపిస్తాయి. ముఖ్యంగా, రాయలసీమ మాండలీకంలో కథలు రాయటంతో రాయలసీమ గ్రామీణ జీవితాలు మనకు పరిచయమవుతాయి. అయితే, అన్ని కథలూ ఆసక్తిగా చదివించేవే అయినా, అన్ని కథలనూ ఉత్తమ కథలుగా పరిగణించటం కష్టం. కానీ, ఈ కథలు చదివిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. రచయితకు భాషపై పట్టుంది. పదాల కలయికతో దృశ్యాలు సృజించే నేర్పువుంది. కథను పద్ధతి ప్రకారం చెప్పే నైపుణ్యం వుంది. కానీ, కొన్ని కథలు అసంతృప్తిని ముగులుస్తాయి. కొన్ని కథలు అద్భుతంగా అనిపిస్తాయి. రచయితకు కథ పట్ల ఉన్న నిర్దిష్టమయిన అభిప్రాయాలో, సిద్ధాంతాలో రచయిత పై ప్రభావం చూపిస్తున్నాయేమో అనిపిస్తుంది అసంతృప్తి కలిగించిన కొన్ని కథలు చదివితే…కానీ, రచయిత కథాకథన నైపుణ్యం పై మాత్రం ఎలాంటి సందేహం కలగదు. చక్కని కథకులలో జాబితాలో సులభంగా ఈ రచయిత పేరు రాయవచ్చు అనిపిస్తుంది.
బిడ్డలుగల్ల తల్లి కథ ఒక విచిత్రమయిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ కథ చదువుతూంటేనే ఇది రచయిత విన్నదో, చూసినదో,అనుభవించిన కథో అనిపిస్తుంది. కాబట్టి ఇలా జరగలేదని, జరగదని అనటం కుదరదు. కానీ, నిజంగా జరిగిన విషయాన్ని కథగా రాస్తున్నప్పుడు , ఈ కథ రచయిత కకనకత్త అని అనే ఆమెకి సంబంధించింది. కనకత్త కూతురు రాజమ్మ. ఆమె చక్కని సంసారాన్ని వదలి ఊళ్ళోని వెంకునాయుడి ఇంతికి వెళ్ళిపోతుంది. ఊళ్ళోవాళ్ళంతా వెళ్ళి ఆమెని లాక్కొస్తారు. కానీ మూడు రోజులకు మళ్ళీ అతని ఇంటికి పారిపోతుంది. మళ్ళీ ఊళ్ళోవాళ్ళు దాదికి వెళ్ళేసరికి అతను పారిపోతాడు. రాజమ్మను ఈడ్చుకొస్తారు. ఆమె తల్లి కనకత్త ఆమెని తనైంట్లోకి రానివ్వదు. ఆమెని ఆమె భర్త ఇంటికి తీసుకువెళ్ళి అక్కడే వదిలేస్తుంది. వాడు పట్టించుకోడు. దయనీయమయిన స్థితిలో జీవిస్తూంటుంది రాజమ్మ. అది చూసి కూతురిని అలా వదిలిందని కనతక్కను అందరూ దూషిస్తూంటారు. చివరికి , ఉండబట్టలేక మన కథకుడు, ఆమె ప్రవర్తన వెనుక అర్ధం అడుగుతాడు. తాను కూతురికి పుట్టింట్లో చోటిస్తే ఇక మొగుడు ఆమెని చూసుకోడు కాబట్తి అక్కడ వదిలింది. ఇక వాడు చూసుకోడని నిర్ధారణ అయిన తరువాత ఒకరోజు వాది ఇంతిముందుకెళ్ళి బూతులు తిట్టి తన కూతుర్ని తాను చూసుకుంటానని చెప్పి కూతురిని తీసుకుని వచ్చేస్తుంది. కూతురితో బంకు పెట్టిస్తుంది. ఇదీ కథ.
చదవగానే ఒక గొప్ప తల్లి పాత్రను సృజించాడు రచయిత అనిపిస్తుంది. కానీ, కథకుండవలసిన లక్షణాలు, కథ నాణ్యతను నిర్ణయించే ప్రామానికాలను అన్వయించి చూస్తే కథ తీవ్రమయిన అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇలా జరగదు అని అనే వీలు లేదు. రచయిత కథను ఎంత సహజంగా అనిపించేట్తు రాశేడంటే సంఘటనలు సజీవంగా కళ్ళముందు నిలబడతాయి. పాత్రలు అటూ ఇతూ కదలాడతాయి.. కానీ, ఉన్నదాన్ని ఉన్నట్టు రాస్తే అది రిపోర్టింగ్ అవుతుంది తప్ప రిక్రియేటింగ్ కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పటంలోనూ కాస్త సృజన వుండాలి. ఈ సృజన కథలోని అనౌచిత్యాలను తొలగించాలి. ఈ కథలో అది జరగలేదు. ముఖ్యంగా పాత్రల చిత్రణ తీవ్రమయిన అసంతృప్తిని కలిగిస్తుంది. ఇందులో ప్రధానంగా కనిపించే పాత్ర కనకత్త. తరువాత రాజమ్మ. ఆమె మొగుడి పాత్ర సర్వ సాధారణంగానే ప్రవర్తిస్తుంది. రాజమ్మ వెళ్ళిన నాయుడు కథలో కనబడడు. అతదిలో ఏ విషయం రాజమ్మను ఆకర్షించిందో మనకు తెలియదు. పైగా, ఒక సారి ఆమె ఇంటివాళ్ళు లాక్కొచ్చినప్పుడు అతడేమి చేశాడో తెలియదు. ఈమె మళ్ళీ పోయినప్పుడూ ఏమీ అనలేదు. కానీ, అతడిని తన్నటానికి వెళ్ళేసరికి మాత్రం రాజమ్మతో సహా పెళ్ళాం పిల్లల్ని కూడా వదలి పారిపోయాడు. దాంతో చక్కని సంసారాన్ని, మొగుడిని పిల్లల్ని రాజమ్మ ఎందుకు వదలి నాయుడింటికి వెళ్ళిందో మనకు తెలియదు. అందువల్ల ఆ పాత్రపైన సానుభూతి , కేవలం కష్టాలు పడుతోంది అన్న అంశం ఆధారంగా తప్ప మరోరకంగా కలగదు. ఇక, అంతగా రెండు సార్లు ఇల్లొదిలి వెళ్ళిన అమ్మాయి, మొగుడింట్లో అన్ని అవమానాలూ భరిస్తూ ఆరునెలలపాటూ దుర్భర పరిస్థితుల్లో పడివుండటమూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని అయోమయంలో పారేస్తుంది. రెండు సార్లు సంసారాన్ని వదలి నాయుడు దగ్గరకు పారిపోయింది. మరి అవసరంలేని, అంత అయిష్టమయిన ఇంట్లోనే అన్ని అవమానాలూ, దెబ్బలూ తింటూ ఎందుకని పదివుంది? నాయుడు పారిపోవటంతో ఆమెకు జీవితం మీద విరక్తి కలిగిందా? తాను చేసింది పొరపాటన్న గ్రహింపు వచ్చిందా? అలాంటిదేమీ రచయిత చూపడు. ఆమె మౌనంగా అన్నీ భరిస్తూంటుంది. ఎవడు కొట్టినా మౌనంగా వుంటుంది. ఇది ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని, మానసిక స్థితిని సందిగ్ధంలో పారేస్తుంది. పాత్రను సరిగా రచయిత తీర్చి దిద్దలేదనిపిస్తుంది. అయితే, ఆ పాత్రని సరిగా ఎందుకు తీర్చి దిద్దలేదంటే కనకత్త పాత్రను ఎలివేట్ చేయటానికే అనిపిస్తుంది. ఆ పాత్ర కనుక వ్యక్తిత్వంతో, ఆత్మాభిమానంతో ప్రవర్తిస్తే, ఇక కనకత్త గొప్పతనమేముంది. అమ్మాయి ఇల్లొదిలేసింది. ఎవరికోసం వదిలేసిందో వాడీమెని వదిలి పారిపోయాడు. ఆమె తనకాళ్ళమీద తాను నిలబదింది. దీన్లో కనక్త్త పాత్రకేమీ పాత్ర వుండదు. అందుకని, రాజమ్మ , ఒక్క భర్తని వదిలి పారిపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ నిర్ణయాత్మకంగా ప్రవర్తించకూడదు. ఇది కథను బలహీనం చేస్తుంది. కథపై అసంతృప్తి కలిగిస్తుంది.
కనకత్త పాత్ర విషయానికి వస్తే, కూతురు ఎలాంటిదయినా తల్లి అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించదు. అయితే, పచ్చటి సంసారాన్ని అకారణంగా వదలి వెళ్ళిపోయిందన్న కోపం వున్నా, దానివెనుక, కూతురి బరువును అల్లుడిపైన పెట్టాలన్న ఆలోచన, అందుకోసం ఆరునెలలు కూతురు నానా కష్టాలు పడుతున్నా చూడనట్టుండటం, చివరికి అల్లుడు చూసుకోడని తెలియగానే శాపనార్ధాలు పెట్టి , కూతురితో బంకు పెట్తించటం..ఆమెను కరుణామయి అయిన తల్లిగా కాక, స్కీమింగ్, కన్నింగ్ కంత్రీ తల్లిగా మనముందు నిలుపుతాయి. నిజానికి, ఈ కథలో రాజమ్మ భర్తను విలలా చూపించారు కానీ, ఆయనే అన్యాయమయిపోయినవాడు. అతని పిల్లల తల్లి అకారణంగా పిల్లల్ని సంసారాన్నీ వదలి పారిపోయింది. అదీ, అదేవూళ్ళో మరొకడి ఇంటికి…ఇంత జరిగిన తరువాత కూడా ఆమెని ఆరునెలలు ఇంట్లో వుండనిచ్చాడు..ఏ స్థితిలో, ఎలా అన్నది పక్కన పెడితే, సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో..మీ అమ్మనే నిన్ను రానియ్యట్లేదు, నా ఇంటికెందుకొస్తావు, పో… అని తరిమేస్తారు. అలాకాక, ఇంట్లో ఆమెని వుండనిచ్చిన నేరానికి, కనకత్త చేతిలో బూతులు తినాల్సివచ్చిందతనికి. నిజానికి, రాజమ్మ వదలిపోవటంలో అతని పాత్రలేదు. తనని కాదని అలా పారిపోయి, మళ్ళీ పారిపోయిన తరువాత ఎవరయినా మళ్ళీ సవ్యంగా సంసారం చేస్తారని ఊహించటం కష్టమే. అలాంటిది, అతనిపై తన కూతురి బాధ్యతను రుద్దాలని కనకత్త ప్రయత్నించటం దాన్ని లౌక్యంగానూ, గొప్పతనంగానూ చూపించాలని ప్రయత్నించటం, దాన్ని ఉత్తమ కథగా ఎన్నుకోవటం అన్నీ అసంబద్ధాలూ, అనౌచిత్యాలూ అనిపిస్తాయి. అయితే, అమ్మాయి ఇల్లొదిలి, ముఖ్యంగా మొగుదిని వదలి మరొకడితే పారిపోవటం, మళ్ళీ పట్తుకొస్తే, మళ్ళీ పారిపోవటం..అద్భుతమయిన స్త్రీ స్వేచ్చలా సంపాదకులకు అర్ధమయివుంటుంది. అలా, పరాయివాదింతికి ఎన్ని మార్లు పారిపోయినా, ఆమె స్పేస్..స్త్రీ స్వేచ్చ…అని వదిలేసి, తిరిగ్వస్తేనే మహాభాగ్యం అని చూసుకోక, ఆమెని కష్టపెట్టిన ఆమె మొగుడు పురుషాంకార పందిలా అర్ధమయివుంటాడు. ఇంకేం అభుతమయిన అభ్యుదయ స్త్రీ స్వేచ్చ, పురుషాహంకార దౌష్ట్య ఖండన విప్లవ కథ అనుకునివుంటారు. దీనికి తోడు కూతురు ఎన్ని దెబ్బలు తింటూ, ఎంత నీచమయిన స్థితిలో వున్నా అల్లుడిపై రుద్దాలని ఎదురుచూసి చివరికి తిట్టిన కనకమ్మత్త గొప్ప ఫెమినిస్ట్ అనుకుని వుంటారు. అంతేకానీ, పారిపోయిన అమ్మాయికి విలువౌండదని, కూతురిని వారు ఏలుకోరని తెలిసివుండీ కూతురిని ఇన్ని కష్టాలకు గురిచేసే బదులు, ముందే ఆమెకో బనకు పెట్తించివుంటే, కూతురికిన్ని బాధలు తప్పేవి కదా!!! కూతురు ఇష్టపడక వదలి పారిపోయిన మొగుడికే ఆమె బాధ్యతను అంటగట్టాలని ఇన్ని కష్టాలు కూతురుపడుతూంటే చూస్తూ ఊరుకున్న కనకమ్మత్త పాత్ర అర్ధవిహీనము అనిపిస్తుంది. అయితే…ఉత్తమ కథగా ఎన్నుకోవటంలో మాండలీకము, ముఖ్యంగా రాయలసీమాండలీకము, రచయిత జర్నలిస్టు కావటమూ కూడా తమవంతు పాత్ర నిర్వహించాయేమో అనిపించినా…రచయిత కథను చెప్పే నేర్పు విషయంలో మాత్రం ఎలాంటి సందేహమూ, అనుమానాలు వుండవు.
మిగతా కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో….
Like
Show more reactions

November 22, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ-24(2)

బెజ్జారపు రవీందర్ రచించిన కొత్త రంగులద్దుకున్న కల 2010లో ఉత్తమ కథల సంకలనంలో స్థానం సంపాదించుకుంది. ఈ కథ చదవటం ఒక రకంగా కఠినమయిన పని. ఎందుకంటే ఇది కథ నిర్వచనంలో ఒదగని రచన. ఒక నాటకం రిహార్సల్స్ సాగుతూంటాయి.. ఆ నాటకంలో సంభాషణలు కథ..సంభాషణల్లోనూ మనకు కథ తెలియదు. అంతా సిద్ధాంతాలు, విమర్శలు, పరోక్షంగా విమర్శలు….ఇలా సాగుతుంది..
ఆరంభంలోనే రచయిత దృష్టి తెలిసిపోతుంది.
ఇది ఫిలాసఫర్లు, జ్ఞానుల దేశం.
అంటే భారతదేశం లో ఇంతవరకూ జరిగింది, రాసిందిందీ, సాధించిందీ అంతా పనికిరానిదన్నది రచయిత ఉద్దేశ్యమని ఇది ఎర్రటి వెలుతురులో తప్ప ప్రపంచాన్ని మామూలుగా చూడలేని అరస విరస కురస నీరస నోరస సిద్ధాంత కథా రచయితల ఆలోచనా ధోరణిని ప్రదర్శించే కథ అనీ అర్ధమవుతుంది.
రచయిత కవిత్వం రాయబోయి వచన సంభాషణ రాశేడేమో అన్న అనుమానం వస్తుంది.
ఎందుకంటే, హఠాత్తుగా ఒక కాగడా మొలుచుకు వస్తుంది. ఆ కాగడా వెలుతురులో వంచనా ప్రపంచపు నగ్నత్వం బట్టబయలవుతుంది..ఈ ప్రతీకల అర్ధాలు, మాట్ల వెనుక భావాలు సులభమే అర్ధమవటం..
ఇంతకీ కథ ఏదీ అంటే ఇదే కథ.
కహ మధ్యలో జనం ఒక పాత్ర అనిచెప్తాడు రచయిత. జనం జ్ఞానులకు ఒక అప్పీలు ఇస్తారు. అయితే..తాను చేస్తున్న రచన మర్మం అందరికీ బోధపడదని రచయిత గ్రహించినట్టున్నాడు. అందుకే..ఒక సందర్భంలో….అంతా కంఫ్యూజన్. నువ్వూ నీ మాటలు మరీనూ…అనిపిస్తాడు…
ఈ మాటలు ఈ కథకు సరిపోతాయి.
అయితే…మరో పాత్ర…ఖండిత చేతులు సైతం పిడికిళ్ళను కలలు కంటున్న రోజుల్లో ఎత్తిన పిడికిలి దించకు…అని మరో పాత్ర అనటంతో కథ లేని ఈ కథ సంపాదకులకు ఎందుకని ఉత్తమంగా అనిపించిందో అర్ధమవుతుంది..
అయితే…చివరలో….జ్ఞాన భారంతో వంగిపోతున్న మిత్రులూ- నాతో కలవండి. నా ముందో, వెనుకో, పక్కలకో ఊతంగా వుండండి..అయినా..అడుగు కదపని నోరు మెదపని పరమ పవిత్రులతోటి, జ్ఞాన సంపన్నులతోటి నాకేమిటి పని… అనటంతో కథ సంపూర్ణమవుతుంది…
అయితే, ఇది సంపాదకుల దృష్టి ఉత్తమ సిద్ధాంత కథ కావచ్చేమో కానీ…ఇది కథ కాదు అని మాత్రం అనిపిస్తుంది.దీన్ని ఉత్తమ కథగా ఎంచుకుని, ఒప్పించి మెప్పిస్తున్న కథల సంపాదకులకు జోహార్లర్పించాలని పిస్తుంది. బహుషా..ఈ కథలోనివే కొన్ని వాక్యాలు ఈ కథల సంపాదకులు రచయితలను పాఠకులను చూసి నవ్వుకుంటూ ప్రతి సంవత్సరం అనుకుంటూంటారేమో!!!
జనంగారండీ…మిమ్మల్ని మొట్టికాయలు వేసీ వేసీ అలవాటయిపోయింది. కొట్టే బాధనాకు, తినే హాయి నీకు లేకుండా వుండలేం..నేను పెట్టే వాతలే లేకుంటే నువ్వు దిగంబరం కృజఘ్నుడా…
ఇక్కడ పెట్టేవి ఉత్తమ కథల వాతలన్నమాట!!!!!

బెజ్జారపు రవీందర్ రచనలతో చిక్కు ఏమిటంటే ఆయన కథ రాస్తే చక్కగా రాస్తాడు. అద్భుతంగా అనిపించేట్టు రాస్తాడు. కథ బదులు సిద్ధాంతం రాస్తేనే చిక్కు వస్తుంది… కొత్త రంగులద్దుకున్న కల అనే ఎర్రటి రాత్తల్ని చదివిన తరువాత…మూడు తొవ్వలు చదవటం ఆరంభించేందుకు మనసును గట్టి చేసుకుని, గుండెను దిటవు పరచుకుని సిద్ధమవ్వాల్సివుంటుంది. కానీ, ఇది కథ. ఈ కథలో రచయిత ప్రావీణ్యం, కథా కథన చాతుర్యం, కళ్ళ ముందు దృశ్యాలను నిలుపుతూ వాటి ద్వారా జీవిత పాఠాలను నేర్పే చాతుర్యం స్పష్టంగా తెలుస్తూంటాయి.
మధు అనే వ్యక్తి క్రిక్కిరిసిన బస్సులో ప్రయాణిస్తూంటాడు. బాసు పెట్టే బాధల వల్ల చిరాకుగా వుంటాడతడు. బస్సులో రష్హు అతని చిరాకు పెంచుతూంటుంది. అలా చిరాకుగా ఆఫీసు విషయాలు గుర్తుకుతెచ్చుకుని బాధపడుతున్న మధు దృష్టిని బస్సు కండక్టర్ ఆకర్షిస్తాడు. అందరినీ నవ్విస్తూ, వరసలు కలుపుతూ బస్సు ప్రయాణాన్ని ఒక ఆహ్లాదకరమయిన అనుభవంలా మారుస్తూంటాడు కండక్టర్. వృత్తి జీవితంలోని అధిక కాలాన్ని మింగేస్తూంటే పనిలోనే రిలాక్సేషన్ ని వెతుక్కోవాల్సి వస్తోంది..అనుకుంటాడు మధు. అతి చక్కని, గొప్ప వ్యాఖ్య ఇది.. ఈ వాక్యం, ఈ observation కథకుడి పట్ల గౌరవం కలిగిస్తుంది. ఇంతలో బస్సులోకి ఒక అమ్మాయి పిల్లని చంకనేసుకుని వస్తుంది. ఆమె వెనకే ఆమె మొగుడు వస్తాడు. వారిద్దరూ బస్సులో బహిరంగంగా వాదించుకుంటూంటారు. ఇదంతా ఒక సన్యాసి చూస్తూంటాడు. అతను భార్యతో వేగలేక అన్నీ వదలి పారిపోయినవాడు. ఇంతలో ఆ అమ్మాయి మొగుడు, ఆమె శీలాన్ని శంకిస్తాడు. అప్పటి దాకా మూగదానిలా వున్న ఆమె తిరగబడి మొగుడి జుట్టు పట్టుకుంటుంది. నవ్వుతున్న కండక్టర్, నిర్వికారంగా వున్న సాధువు, ఉగ్రరూపమెత్తిన స్త్రీ….ఇవీ మూడు తొవ్వలన్నమాట…దాన్లో మధుకి తన సమస్య స్వరూపము, పరిష్కరించుకునే మూడు దారులూ బోధపడతాయి. చక్కని కథ..ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకోవటంపట్ల ఎలాంటి విభేదమూ వుండదు.
వచ్చే వ్యాసంలో ఆర్ ఎం ఉమా మహేశ్వర రావు కథల విశ్లేషణ వుంటుంది.

November 8, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized