Archive for November 29, 2017

25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ- 25(3)

2000లో ఉత్తమ కథగా ఎంపికయిన నోరుగల్ల ఆడది కథ కూడా ఉమామహేశ్వర రావు ఇతర కథలకు మల్లే చదివించేదిగా వుంటుంది. కానీ, చివరికి లాజికల్ గా వుండక, పలు సందేహాలను కలిగిస్తుంది. అసంతృప్తిని మిగులుస్తుంది. ఈ కథ టూకీగా చెప్పాలంటే, వేశ్యల కథ. విజయమ్మ స్వర్ణ అనే ఇద్దరు వేశ్యావృత్తిలో వుంటారు. కానీ, తమ డిగ్నిటీని కాపాడుకుంటూంటారు. వేశ్యలందరి భూములను మునసబు కాజేస్తాడు. కానీ, స్వర్ణ మాత్రం అరచి నోరుపెట్టుకుని భూమిని కాపాడుకుంటుంది. అదీ కథ. అయితే, రచయిత కథను చెప్పిన విధానం ఇబ్బంది కలిగిస్తుంది. ఫ్లాష్ బాక్, ఫార్వార్డ్, ఫ్లాష్ బాక్, ఫార్వార్డ్…అంటే గతం, వర్తమానం, మళ్ళీ గతం వర్తమానం ల నడుమ కథ చెప్తూ, గత వైభవాన్ని చూపుతూ, వర్తమానంలోని దుస్థితిని చూపుతూ కథ సాగుతుంది. అయితే, ఈ టెక్నిక్ ఈ కథకు వాడాల్సింది కాదు. ఉదాత్తమయిన అంశాలకు, ఇప్పటి దుస్థితి, ఒకప్పటి వైభవం వెనువెంటనే చూపిస్తూంటే పాఠకుడి మనస్సు వైభవానికి పొంది, దుస్థితికి క్రుంగేట్టుంటే ఈ రీతిని కథ చెప్పటం పండుంతుంది. అలాకాని పక్షంలో విసుగు కలిగిస్తుంది. అయోమయాన్ని కలిగిస్తుంది. వేశ్యలయినా ఒకడికే లాయల్ గా వుండటమూ చూపిస్తాడు రచయిత.కానీ పాత్రలతో కనెక్ట్ కావటానికి ఈ టెక్నిక్ అడ్డువస్తుంది. దాంతో కథ వెల్లకిల్లాపడుతుంది. ఏదో గొప్ప కథ చదవబోతున్నామనుకున్న పాఠకుడు చతికిలపడతాడు.
ఆంగ్లంలో జాన్ ఫొవెల్స్ అనే ఆయన ఈ టెక్నిక్ ను బహుచక్కగా వాడేడు. ముఖ్యంగా ఫ్రెంచ్ లెఫ్టినెంట్స్ వొమెన్ అనే నవలలో ఆధునిక ప్రేమ జంట ప్రేమను ప్రాచీన కాలంలోని ప్రేమ జంట ప్రేమ తో పోలుస్తూ,, వారి కథను సమాంతరంగా నడుపుతాడు. ప్రేమ భావనలోని సార్వకనీనతను, సమాజాల్లో ప్రేమ భావన పై వున్న అపోహలను సమాంతరంగా చూపుతాడు. చాలా గొప్ప నవల అది. దాన్ని అదే పేరుతో సినిమాగా కూడా తీశారు. అంటే, ఈ టెక్నిక్ వాడాలంటే సరయిన సబ్జెక్ట్ అవసరం. అది లేనప్పుడు టెక్నిక్ వుంటుంది..కథ వుండదు.
2004లో వుత్తమ కథగా ఎంపికయిన ఉమామహేశ్వరరావు కథ వొంటేపమాను. ఇదీ ఇతర కథల్లాగే ఆసక్తికరంగా చదివిస్తుంది. కానీ, చివరికి అర్ధంలేనిదిగా, ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఇది బంగారమ్మ కథ. ఆమెకు ఊళ్ళోని పెద్దతో సంబంధం వుంటుంది. కానీ, అతనికి ఇస్తుందే తప్ప తీసుకోదు. అతడిని కష్టాల్లోంచి గట్టెక్కిస్తుంది. ఊళ్ళో అందరికీ అండగా వుంటుంది. అందరి గౌరవమన్ననలు పొందుతుంది. బంగారమ్మని నమ్ముకుని బాగుపడ్డోళ్ళేకానీ, ఆ యమ్మ యువుర్నీ నమ్ముకుని బతకలా, యేనాడూ యెవురి కష్టానికీ ఆసి పడలా…యేదో తనకు కలిగిందే తినింది. వికరికి పెట్టింది..అంటారందరూ. అయితే, ఊళ్ళో సబ్ స్టేషన్ పెడతారు. పోలీసులు ఆ ప్రాంతంలోని వేస్యలందరినీ లాకుపోయి అవమానిస్తూంటారు. అడ్డుపడ్డ బంగారమ్మనీ కట్టేసి తీసుకుపోతారు. బంగారమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటినుంచీ ధైర్యంగా ఎవరయినా ఎదురుతిరిగితే బంగారమ్మ కానీ పూనిందా అని అడుగుతూంటారు. ఇదీ కథ. కథ చదువుతూంటే బంగారమ్మ పాత్రని బాగానే అభివృద్ధి చేస్తూన్నట్టు అనిపిస్తుంది. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పటంతో ఆ పాత్ర అర్ధవిహీనమైపోతుంది. అంత ధైర్యం కల ఆమె ఎదురునిలచి పోరాడినట్టు చూపివుంటే అది ఆ పాత్ర వ్యక్తిత్వానికి తగ్గట్టు వుండేది. ఆత్మహత్య పిరికివాడి పని. ఆ పని చేసిన ఆమెను ధైర్యానికి ప్రతీకగా తీసుకోమనటం అర్ధవిహీనం..ఇక్కడ అప్రస్తుతమయినా ఒక విషయం ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ఇటీవలి కాలంలో కొందరి పద్మావతి సినిమా వివాదాన్ని పురస్కరించుకొని..రాజపుత్ర స్త్రీల జౌహార్ గురించి అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నారు. జౌహార్ కీ, ఆత్మహత్యకూ చాలా తేడా వుంది. జౌహార్ ఆత్మాభిమానంతో ఆత్మగౌర్వం నిలుపుకోవటం కోసం చేసిన వీరోచితమయిన కార్యం. ఆత్మహత్య, మానసిక దౌర్బల్యంతో, నిరాశలో వచ్చిన తెగింపువల్ల జరిగే పిరికి పని . ఈ రెంటికీ తేడా గుర్తించలేని స్థితిలో వుంది మనసమాజమే కాదు, తెలివైన వారిగా భావించుకునే మేధావులుకూడా అని ఈ కథ నిరూపిస్తుంది. పైగా, ఈ కథలో పోలీసులపై విసురువుంది. వారి రాక్షసత్వాన్ని చూపటం వుంది. బహుషా అందుకని సంపాదకులకు ఈ కథ నచ్చివుంటుండి.
ఉమామహేస్వరరావు కథలు చదివిన తరువాత , ఒక మనచి రచయిత, రంగుటద్దాలలో ప్రపంచాన్ని చూస్తూ, సిద్ధాంతాల పరిమితుల్లో సృజనను ఇముడ్చాలని ప్రయత్నించటంవల్ల ఎన్నో మంచికథలు రాబోయి దారిమళ్ళి సముద్రంలో కలవాల్సిన నది, ఎడారిలో ఎండిప్పయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కథలను ఉత్తమ కథలుగా ఎంచుకున్న సంపాదకులూ, జర్నలిస్ట్ రచయిత, తమ ఉద్యమంలోనివాడు కాబట్టి ఏమి రాసినా పొగడే వందిమాగధభట్రాజభజనబృందాలు ఈ రచయితను ఎడారివైపు దారిమళ్ళించినవారు. తెలుగు సాహిత్యంలోని ఒక దుస్థితికి చక్కని ఉదాహరణ ఈ కథలు.
వచ్చే వ్యాసంలో జాన్సన్ చోరగుడి కథల విశ్లేషణ వుంటుంది.

November 29, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized