ఒక అత్యద్భుతమయిన పాట……

రచయిత లేకపోతే సినిమాలు ఆరంభమే కావు. కానీ రచయితలంటే సినిమావారికి చిన్నచూపు ఎక్కువ. స్క్రిప్టు రచయితలు, కథా రచయితల పరిస్థితే ఇలా వుంటే ఇక గేయ రచయితల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. అలాంటి సినీ ప్రపంచంలో హీరో, హీరోయిన్లు, దర్శకులు, సంగీత దర్శకులకన్నా ఎక్కువ మన్ననలను పొందిన గేయ రచయిత సాహిర్ లూధియాన్వీ.

సాహిర్ గొప్పతనమేమిటంటే అతని గేయాలవల్ల సినిమాలు సూపెర్ హిట్ లయ్యేవి. ఎలాగయితే ఇది రాజ్ కపూర్ సినిమా, ఇది శంకెర్ జైకిషన్ సినిమా అని చెప్పుకుంటారో అలాగే ఇది సాహిర్ సినిమా అని కూడా అంటారు.

తన గేయాలవల్ల సినిమాల విలువను పెంచగలగటంతో సినిమావారు సాహిర్ కు ఎంతో గౌరవమచ్చారు. అలా గౌరవమిచ్చిన వారితోనే పనిచేశాడు సాహిర్.

సినిమా కథ దగ్గిరనుంచి సంగీత దర్శకుడు, నటీనటులవరకూ సాహిర్ ఇష్టం ప్రకారమే కానిచ్చేవాడు బీ ఆర్ చోప్రా. అందుకే ఈనాటికీ అతడి సినిమాలు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నాయి.

నయాదౌర్, సాధన,  ధూల్ క ఫూల్, ధర్తీపుత్ర, వక్త్, గుమ్రాహ్, హం రాజ్ వంటి సినిమాలన్నీ సాహిర్ కవితలవల్లే హిట్ అయ్యాయనటం అతిశయోక్తి కాదు. సాహిర్ కవిత విశ్వరూపాన్ని ప్రదర్శించి, ఎలా ఒక గేయ రచయిత సినిమా విజయానికి కారకుడవుతాడో నిరూపిస్తుంది గుం రాహ్.

గుం రాహ్ సినిమా కథ సాహిర్ జీవితాన్ని పోలివుంటుంది. సాహిర్ జీవితానుభవాల ప్రభావంతో వచ్చినన్ని సినిమాలు మరే కళాకారుడి జీవితానుభవాల ఆధారంగా రాలేదు.

మాల సిణా, సునీల్ దత్ లు ప్రేమించుకుంటారు. ఇన్ హవావోమె ఇన్ ఫిజావోమె తుఝ్ కొ మేరా ప్యార్ పుకారే, అని పాడుకుంటారు. కానీ, సోదరి మరణంతో, పిల్లల కోసం , మాలా సిణా పాత్ర, అశోక్ కుమార్ పాత్రను పెళ్ళిచేసుకుంటుంది.

భగ్న హృదయుడయిన సునీల్ దత్, వారి పెళ్ళయి సంవత్సరం పూర్తయిన సందర్భంలో, అదే ఇన్ హవావోమే ను విషాదంగా పాడతాడు. ( ఈపాట గురించి మరో పోస్టులో) . అత్యద్భుతమయిన సాహిత్యం, మానవ హృదయ స్పందనలను ప్రతిబింబిస్తుందా పాట.
మళ్ళీ వారిద్దరి ప్రేమ చిగిరిస్తుంది. ఇంతలో ఆమె భర్త వస్తాడు. ఆమె కోసం ఎదురుచూస్తూ, యేహవా హై ఉదాస్ జైసె మేర దిల్, అనే మరో ఎదకరిగించే పాట పాడతాడు. హీరో. ఇక్కడా సాహిత్యం ప్రధాన పాత్ర వహిస్తుంది.

ఆమె భర్తతో ఆమె ఇంటికి వస్తాడు. చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ఞబీ బన్ జాయె హం దోనో, అని పాడతాడు. సాహిత్యాపరంగా అత్యుత్తమమయినదీ పాట. సినీ సందర్భంలో వొదుగుతూ సార్వజనీన భావాలను ప్రదర్శించి ఆ పాటను చిరంజీవి చేశాడు సాహిర్.

ఆతరువాత హీరోకు పాడే అవకాశం వస్తుంది. తాను పాడేటప్పుడు స్టూడియోలో ప్రేయసి ఎదురుగా వుండాలంటాడు సునీల్ దత్. ఆమె భర్తకు తెలియకుండా ఆమె వచ్చి అతని ఎదురుగా కూచుంటుంది. ఆమె భర్త కూడా అక్కడికి వస్తాడు. ఆ సందర్భంలో సాహిర్ రాసిన పాటలాంటి పాట ఇంతవరకూ ఎవరూ రాయలేదు. ఇక రాయరు.

అది నిజానికి పాట కాదు. హృదయ స్పందనలకు అక్షర రూపం. అక్కడ హీరో నాయికను చూస్తూ పాడుతున్నాడు. సినిమా సందర్భానికి చక్కగా సరిపోతుంది.

కానీ, పాట విన్నవారికి సాహిర్ భగ్న ప్రేమ గుర్తుకు వస్తుంది. అతని ఎదురుగా భర్తను వదలి వచ్చి నిలచిన అతని ప్రేయసి గుర్తుకు వస్తుంది.

పాటను విన్న ప్రతి ఒక్కరికీ తమతమ భగ్న ప్రేమలు గుర్తుకు వస్తాయి. తమ మనసుల్లో కలిగిన భావాలు తాజా అవుతాయి. ఇలా తన ప్రేయసికి తన మనసులో భావాలు వినిపించాలన్న కోరిక కలుగుతుంది.

దాంతో సినిమా స్వరూపమే మారిపోతుంది. సినిమాలో పాత్రల ఆవేదనలు, సంఘర్షణలు, భావాలు, స్పందనలు అన్నీ ప్రేక్షకుల వ్యక్తిగతమయిపోతాయి. ఇలా సినిమాను వ్యక్తిగత అనుభూతిలా ఎదిగేట్టు చేసిన సాహిర్ గేయాలు  ఆయన పాటలు రచించిన సినిమాలను ఇతర సినిమాలకు ప్రత్యేకంగా నిలుపుతాయి.

ప్రేయసి ఎదురుగా వున్నప్పుడు నాయకుడు పాడేపాట ఇది.

ఆప్ ఆయీ తొ ఖయాలే దిల్ ఎ నాషాద్ ఆయా
కిత్నె భూలే హువె జక్షోంక పతా యాద్ ఆయా…

ఆమెను చూస్తే గాయపడిన హృదయ వేదన తాజా అయిందట. మరచిపోయిన అనేక గాయాలు తలలెత్తాయట.

అత్యద్భుతమయిన సున్నితమయిన ఆలోచన. ఎద ఝల్లుమంటుంది ఈ భావం మనసును తాకగానే. హృదయానికయిన గాయాలు గుర్తుకు వచ్చాయట!

ఆప్ కే లబ్ పే కభీ అప్న భి నాం ఆయాథ
షోక్ నజ్రే మొహబ్బత్ క సలాం  ఆయాథ
ఉమ్ర్ భర్ సాథ్ నిభానేక పయాం ఆయాథ

ఆమె పెదవులపై ఒకప్పుడు తన పేరుండేది. ఆమె కనులనుండి ప్రేమ సందేశాలు అందేవి. కీవితాంతం కలసివుండే వాగ్దానాలందేవి.

ఇన్ని చెప్పి దెబ్బ కొడతాడు.

ఆప్ కో దేక్ కె వొ ఎహదే వఫా యాద్ ఆయా..

ఆమెను చూస్తే ఆమె అతనిలో కలిగించిన విశ్వాసం గుర్తుకు వచ్చిందట. చావు దెబ్బ. తనని కాదని వేరే వాడిని పెళ్ళిచేసుకుందామె! అందుకే ఆమెని చూస్తే అచంచల విశ్వాసం గురుకువస్తోంది కవికి.

రూహ్ మే జల్ ఉఠె బుఖ్తీ హువి యాదోంకె దియే
కైసె దీవానె థె హం ఆప్ కొ పానేకె లియే
యూన్ తొ కుచ్ కం నహి జో ఆప్ నె ఎహెసాన్ కియే

ఆమెని చూడగానే ఎదలో ఆరిపోతున్న ఝ్నాపకాల దీపం ఒక్క సారిగా భగ్గుమన్నదట. ఆమెను పొందాలని అతనెంత పిచ్చివాడయ్యాడో గురుతుకువచ్చిందట. అంతేకాదు, ఆమె అతనిపై చూపించిన జాలీ గుర్తుకు వచ్చిందట.

ఎంత వ్యంగ్యం. కసి తీర్చుకుంటున్నాడు కవి. ప్రేమించి మోసం చేసినందుకు వాగ్బాణాలతో లోతయిన గాయాలు చేస్తున్నాడు. కానీ ఆమెపైన చెరగని తన ప్రేమను ప్రకటిస్తున్నాడు.

ఈ చరణంలో కూడా చివరి పాదం అత్యద్భుతమయినది.

పర్ న మాంగేసె న పాయా వొ సిలా యాద్ ఆయా

కోరి పొందలేని ఆ కథ ఝ్నాపకం వచ్చిందట.

చివరి చరణం మహాద్భుతమయినది. చిత్రీకరణ పాట అర్ధాన్ని భాష రానివారికి కూడా తేట తెల్లం చేతుంది.

ఆజ్ వో బాత్ నహి, పర్ కొయి బాత్ తొ హై

ఇప్పుడు ఒకప్పటి ప్రేమలేదు. కానీ ఇంకా ఏదోవుంది తమ మధ్య.

మేరె హిస్సేమె హల్కీసి ములాకాత్ తొ హై

తనవంతుకు కాస్త కలయిక ఇంకా వుంది. ఎందుకంటే…

గైర్ కా హోకె భీ ఆజ్ మెరే సాథ్ తొ హై

పరాయిదయికూడా ఆమె తన ఎదురుగా వుంది.

హాయె ఇస్ వక్త్ మ్య్ఖే కబ్ కా గిలా యాద్ ఆయా..

అయినాసరే అతడికి ఎప్పటెప్పటి ఆరోపణలు ఆవేదనలో గుర్తుకు వస్తున్నాయి.

ఈపాట విన్న తరువాత ఇక వేరే పని చేయలేము. పాటవింటూ పాట అర్ధాన్ని అనుభవిస్తూ, మనసులో కలిగిన గాయాలను నెమరువేసుకుంటూంటే సినిమా పాట ఎలా సినీ పరిథి దాటి వ్యక్తి కి catharsis గా మారి సాంత్వననిస్తుందో, అతనిలో నిద్రాణంగా వున్న సున్నిత భావనలను తట్టి లేపుతుందో అర్ధమవుతుంది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఎంత అనుభవించినా సరిపోదు. అలాంటి అద్భుతమయిన గేయాలు రచించిన సాహిర్ తన కలం పేరు తగ్గట్టు పెట్టుకున్నాడు.

సాహిర్ అంటే ఐంద్రజాలికుడు అని అర్ధం.
అక్షరాలతో అనంతమయిన భావాలను సృజించి మామూలు మనుషులు కూడా లోతయిన భావనలను అనుభవించేట్టు చేసే సాహిర్ నిజంగా ఐంద్రజాలికుడే. ఎవరికయినా సందేహముంటే ఎ పాట వినండి. అనుభవించి పలవరించండి.

Enter Your Mail Address

April 24, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: sinemaa vishleashaNaa.

4 Responses

 1. సుజాత - April 24, 2010

  మురళీ కృష్ణ గారూ,
  అద్భుతంగా రాశారు! ఇలాంటి పోస్టులు ఇదివరలో రాసేవారు మీరు. ఇప్పుడు మరీ శీతకన్ను వేశారు.

  అన్నట్లు ఇలాంటివి రాసినపుడు ఆడియో లింక్ ఇస్తే ఇంకా ఇంకా బావుంటుంది.

 2. మందాకిని - April 24, 2010

  అభినందన (కార్తిక్, శోభన, శరత్) కథ ఇదే కదూ!
  అభినందన పాటల సాహిత్యం కూడా మనసును కదిలించేదిగా ఉంటుంది.

 3. Sankar - April 24, 2010

  ఇప్పుడే మరో సారి యు-గొట్టం లో విని వస్తున్నా … అద్భుతమైన పాట అండి. ఓ సారి గుండెను చుక్కనెత్తురు పోకుండా చీల్చి మరీ కుట్టేసి తాపీగా వెళ్ళి పోయే సర్జన్ లా అనిపించాడు, కవి. కోయీ అస్వాదించ్ నా హైతో యహా నొక్కు లీజియే:
  http://www.youtube.com/watch?v=0dE2u5AKvTY&feature=related

 4. కంది శంకరయ్య - April 24, 2010

  బాగుంది. ధన్యవాదాలు.

Leave a Reply