సగటు మనిషి స్వగతం-5

భూమి గుండ్రంగా వుందంటారు.గుండ్రంగా వుండటమంటే,ఎక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచమంతా చుట్టినా,మళ్ళీ అక్కడికే వచ్చి చేరతామని అర్ధం.ఇది నిజమే అని తేల్చుకున్నాను.అలాగని నేను ప్రపంచం చుట్టిరాలేదు.ఉన్న చోటనే ఉన్నాను.ప్రపంచమే తన చుట్టూ తాను తిరుగుతోంది.

మొన్నో రోజు, రాత్రి, చీకట్లో, కారుతున్న చెమటలను తుడుచుకోవాలో, కుడుతున్న దోమలను చంపాలో, ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూడాలో తెలియక చిట పట లాడుతున్న సమయంలో ఓ మిత్రుడు ఇంటికి వచ్చాడు.వస్తూనే, ఏమిటీ లైట్లార్పలేదు? అనడిగాడు కోపంగా.

నాకు నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. బాబూ, మూడు గంటలనుంచీ కరెంటు లేదు.కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో, కనిపించని, చెప్పలేని ఇబ్బందులతో సతమతమవుతున్నాను.లైట్ వేయందే ఎలా ఆర్పుతాను? గుడ్డికన్ను తెరిస్తే ఎంత? మూస్తే ఎంత? అన్నాను, చాలా గొప్పగా సమాధానం ఇచ్చాననుకున్నాను.

కానీ నా మిత్రుడు మండి పడ్డాడు. ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక దారి అంటారు.అలావుంది నీ వ్యవహారం.ప్రపంచమంతా పర్యావరణం పాడయిపోతోందని దీపాలార్పేస్తూంటే, నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు దోమలను కొట్టుకుంటూ కూర్చున్నావు! ఈసడించాడు.

దీపాలార్పటం ఏమిటి?రామ రామ! దీపం వెలిగించమంటారు పెద్దలు.దీపం ఆర్పటం అశుభ సూచకమ్రా, సినిమాల్లో చూడటం లేదూ,దీపం ఆరుతుంది.ఒక ప్రాణం గాల్లో కలుస్తుంది.చ! చ! చీకటి పూట అలాంటి మాటలనకు,  అన్నాను.

కాలం మారింది.మారిన కాలంతో నువ్వూ మారాలి.ఇప్పుడు దీపం ఆర్పటం, పర్యావరణం గురించి నువ్వు పట్టించుకున్నావనటానికి నిదర్శనం.ఒక్క గంట, ఒక్క గంట దీపాలార్పు.పర్యావరణం వేడెక్కి అందరమూ మాడిపోతున్నాము. నువ్వు నడిపే కారు, వాడే ఫ్రిజ్జి, అయిర్ కండిషనర్, ఒక్కటేమిటి, నువ్వు ఊపిరి పీల్చటం కూడా పర్యావరణంలోకి కార్బన్ డయాక్సయిడును పంపిణీ చేస్తుంది తెలుసా? ఇంతగా పర్యావరణంలోకి కాలుష్యం వదలుతున్న నువ్వు,ఒక్క గంట లైట్లు ఆర్పమంటే వినటంలేదు. నీలాంటి మూర్ఖులవల్ల పర్యావరణం ఇలా తగలబడింది! లెక్చరు దంచాడు.

నాకు భయం వేసింది.పెట్రోలు వాడకం వల్ల పర్యావరణం పాడవుతోందని పెట్రోలు వాడద్దంటున్నారు.లైట్లు, ఫోన్లు, టీవీలవల్ల పర్యావరణం పాడవుతోందని అవి వాడవద్దంటున్నారు.ఊపిరి లోంచి కార్బన్ డయాక్సయిడు వాతావరణంలోకి చేరుతోంది కాబట్టి ఊపిరి తీయటం ఒక గంట మానమంటాడా ఏమిటి? నా చెమట్లు వరదలై పోయాయి.

అయినా నాకు అర్ధం కాదు, సంవత్సరానికి ఒక గంట లైట్లార్పేస్తే పర్యావరణం సర్దుకుంటుందా? పర్యావరణం అనేది ఒక డైనమిక్ సిస్టెం. ఎల్లప్పటికీ మారుతూనే వుంటుంది. ఆ మార్పును మనం వేగవంతం చేసాము. అంతే!

అసలు మనిషికి మరణేచ్చ తీవ్రంగా వుంటుందనుకుంటాను.అందుకే ఎప్పుడూ ఏదో ప్రళయం ఊహిస్తాడు.ప్రపంచన్ నాశనమయిపోతోందని బెదురుతూంటాడు.ఆ బెదురుతో మనిషి పోతాడు కానీ, ప్రపంచం ఇలాగే వుంటుంది. ఎన్ని యుద్ధాలొచ్చాయి. ఎన్ని బాంబులొచ్చాయి. ఎన్ని వాదాలొచ్చాయి. ప్రళయాల్లో ప్రపంచాన్ని ముంచెత్తాయి. ప్రజల జీవితాలను అల్ల కల్లోలం చేసాయి.వెళ్ళిపోయాయి. మనిషి ఇంకా ప్రపంచ నాశనం గురించి ఎదురుచూస్తూనే వున్నాడు. అంతెందుకు, మన జార్జి బుష్ కు ఇరాక్ లో ప్రపంచ నాశక మారణాయుధాలు ఎంత స్పష్టంగా కనిపించాయి! ఇరాక్ ను నాషనం చేసి, సద్దాం ను చంపి, ప్రజలింకా చస్తూన్నా ఒక్క మారణాయుధం కూడా దొరకలేదు. డాన్ క్విక్సోట్ అనే నవలలో ఆ మూర్ఖ రాజు గాలితో యుద్ధం చేస్తాడు. లేని శత్రువులను, దయ్యాలను ఊహిస్తాడు.అల్లా వుంది నీ లట్లార్పే వ్యవహారం. ఇదంతా మనసులో వుంచుకోకుండా పైకి అనేశా. అంతటితో ఆగితే నేను సగటు మనిషినెందుకవుతాను? ఎప్పుడు నోరు మూయాలో తెలిస్తే నేనూ అందరితో తలలూపుతాను, నోరెందుకు తెరుస్తాను?

మీ లట్లార్పే వ్యవహారం భూమి గుండ్రంగా వుందని నిరూపిస్తోంది.ఆది మానవుడికి లైట్లు లేవు,ఫ్రిజ్జిలు లేవు, కార్లు లేవు, గాస్ స్టవ్వులు లేవు, అన్నీ వున్న మనం వాటిని వాడకుండా బ్రతకటం ఎలా? ఉన్నంత కాలం వాడదాం. పొతే ఎడ్ల బళ్ళలో ప్రయాణిద్దాం.పిడకలు చేద్దాం.చితుకులు ఏరి వంట చేద్దాం.టీవీలు,ఫాన్లు బయట పారేద్దాం.హాయిగా ఓ నది పక్కన గుడిసె కట్టుకుందాం.భూమి గుండ్రంగా వుందని నిరూపిద్దాం.పర్యావరణం హాయిగా వుంటుంది.మనం హాయిగా వుందాం.అంతే కానీ రాక రాక కరెంటు వస్తే, వెంటనే బందు చేయమంటే ఎట్లా? పద,ఆది మానవుడిలా బతుకుదాం.కానీ,ఆది మానవుడు,పంటలు పండించటం నేర్చినప్పటి నుంచీ పర్యావరణం దెబ్బ తింటోంది తెలుసా? అంటే, మనిషి పుట్టిందే సంతానాన్ని కనటానికి, పర్యావరణాన్ని పాడుచేయటానికి అన్నమాట.పర్యావరణాన్ని పాడు చేయటం మనిషి మౌలిక హక్కు! ఆవేశంతో వాదించాను.

ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు.అందుకే నిన్నెవ్వరూ గుర్తించరు.నీ తెలివి బత్తీబందు కార్యక్రమంలో పవర్ కట్టులా అవుతోంది అని తిట్టటం ఆరంభించగానే కరెంటు వచ్చింది.

నేను నోరిప్పేలోగా వాడు లైట్లార్పండి అని అరిచాడు.వెంటనే కరెంటు పోయింది.
ఇందాక మూడు గంటలు అఫీషియల్ పవర్ కట్టు.ఇప్పుడు అనఫీషియలు , వాడి  మాట మా ఇంట్లోవాళ్ళు విన్నారన్న సంతృప్తి వాడికి వుండకుండా కసిగా అన్నాను.

మరుసటి రోజు పత్రికల్లో లైట్లార్పే కార్యక్రమం విజయవంతమయిందనీ, కార్యక్రమం విజయవంతమవటంలో ప్రభుత్వం సహాయ సహకారాలందించిందనీ వార్త వచ్చింది.అది చూసి పర్యావరణం మెరుగయిపోయిందని అందరూ ఆనందించారు.మళ్ళీ ఇంకో సంవత్సరం ఒక గంట లైట్లార్పి పర్యావరణాన్ని బాగుచేద్దామని సభలు ఆరంభించారు.దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ, మరింత దీర్ఘంగా కార్బన్ డయాక్సయిడు వదలటం మొదలుపెట్టారు.

సగటు మనిషిని నేను.దేన్నీ నమ్మలేను.అన్నిటినీ ప్రశ్డ్నిస్తాను.అందుకే భూమి గుండ్రంగా వుందంటాను.నేను ఎక్కడ వున్న వాడిని అక్కడనే వుంటాను కదా!

22.6.2008 ఆంధ్ర ప్రభలో ప్రచురుతం. 

Enter Your Mail Address

June 24, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

No Responses

 1. కొల్లూరి సోమ శంకర్ - June 24, 2008

  నా దృష్టిలో “బత్తీబందు” వంటి కార్యక్రమాలకి రెందు ప్రయోజనాలు 1). తాత్కాలిక ప్రయోజనాలు – ప్రజలలో పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించడం, ఉన్న అవగాహనని విస్తృతపరచడం 2). దీర్ఘకాల ప్రయోజనాలు – ప్రజలలో చైతన్యం పెరిగి పర్యావరణానికి హాని కలిగించే తమ చర్యలను తగ్గిస్తారు.
  పర్యావరణాన్ని బాగు చేయకపోయినా, తమ వంతు నాశనం చేయకుండా ఉంటే అదే పదివేలు……

 2. ravindra - June 24, 2008

  something is better than nothing….

 3. సుజాత - June 24, 2008

  బాగా చెప్పారండి! ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చి, దీర్ఘ కాలికంగా ఏదైనా చేపడితేనే పర్యావరణానికి కొద్దో గొప్పో మేలు జరిగేది. గంట సేపు లైట్లు ఆర్పడం(నేనూ ఆర్పాను) ఆర్నెల్లకో సారి చేయడం పక్కనబెట్టి, రోజుకో ఐదు నిమిషాలు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తే, ఇంతకంటే ఎక్కువ మేలు జరుగుతుందేమో!

 4. కస్తూరి మురళీకృష్ణ - June 24, 2008

  సోమ శంకర్,సుజాత గార్లూ,
  బహు కృతజ్ఞతలు.
  రవీంద్ర గారూ,

  it is agreed that something is always better than nothing,but let that something be concrete with long term planning than being just a symbolic gesture, forgotten conveniently after it is made emphatically.

Leave a Reply