మీడియా గురించి చెప్పుకోటానికి మంచే లేదా????

దేన్నయినా విమర్శించటం చాలా సులభం. విమర్శించేవాడికి వేయి నాల్కలు అని ఒక సామెతవుంది. దీనికన్నా ముందు వాక్యం, చేసేవాడికి రెండే చేతులు.

అంటే, కష్టపడే వాడికి వున్నవి రెండేచేతులు. కానీ, విమర్శించేవాడికి వెయ్యినాల్కలు అన్నమాట. అందుకే, ఎంతో కష్టపడి చేసినపనిని కూడా చూసీచూడకుండా, తెలిసీ తెలియకుండా విమర్శించేస్తూంటారు. విమర్శించేసి తమని తాము ఎంతో గొప్పగా భావించుకుంటారు. ఇదెలాగ అంటే, తానెలాగో ఏమీ సాధించలేడు. కానీ, సాధించిన వాడిని తక్కువచేయటం వల్ల వాడికన్నా తాను అధికుడనయిపోయానని అహాన్ని సంతృప్తి పరచుకోవటంలాంటిది.

మన మీడియాలో బోలెడన్ని అవకతవకలున్నాయి. జర్నలిజంలో ఒకప్పుడున్నంత నిజాయితీలేదు. గౌరవం లేదు. ముఖ్యంగా ఒకప్పుడున్నంత విచక్షణ, విఙ్నానమూ ఇప్పుడు లేవు. పాండిత్యమూ కరవయింది. ఇది కాదనలేని సత్యం.

అయితే ఇది కేవలం జర్నలిజానికేకాదు, నిత్య జీవితంలోని ప్రతి రంగానికి, ప్రతి అంశానికీ వర్తిస్తుంది. నైతిక విలువల దగ్గరనించి ప్రతీదీ ఒకప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. వుండకూడదు కూడా. నిత్య పరిణామశీలి అయిన ప్రపంచంలో మార్పులేకపోవటమన్నది మరణమే. కాబట్టి ప్రతీదీ మారుతుంది. మారాలి. ఆ మార్పును అర్ధం చేసుకుని, మమచిని పెంచుతూ, చెడును ఎత్తిచూపి, దాన్ని పరిహరిస్తూ ముందుకు సాగాలి.

కానీ, మన మీడియోద్ధారకులు చెడును చూపటానికి ఇచ్చిన ప్రాధాన్యము మంచిని చూపటానికి ఇవ్వటంలేదు. లోపాలెంచటానికి ఇచ్చిన ప్రాముఖ్యము, కష్టాలను, సాధక బాధకాలను సానుభూతిగా అర్ధంచేసుకుని తగిన సూచనలు సలహాలు ఇచ్చి పరిస్థితిని మెరుగు పరచటం వైపు ఇవ్వటం లేదు.

ఒకోసారి ఈ విమర్శలలో అక్కసుపాళ్ళు అధికంగా కనిపిస్తూంటుంది. తననెవరూ గుర్తించటం లేదనో, తనకు అవకాశాలు ఇవ్వటంలేదనో అన్న కసి ఈ విమర్శల ద్వారా ఎదుటివారిని చులకన చేయటంలో కనిపిస్తోంది. నేనే అయితేనా…… అన్న భావన అడిగడుగునా కనిపిస్తోంది.

గమనిస్తే, ఇప్పుడు మీడియాలో ప్రతి ఒక్కరు ఎంతో ఉద్వుగ్నతామయమయిన పరిస్థితులలో పని చేస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగానికి సంబంధించిన ఉద్విగ్నత మాత్రమే కాదు. ఆ ఉద్వుగ్నతల నడుమ పనిచేస్తూ కూడా నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ చేతనయినంత మంచి చేయాలని చూసేవారనేకులున్నారు. కానీ, నలుపు దృష్టిని ఆకర్శించినట్టు తెలుపు ఆకర్శించదు. పైగా వీరి నిజాయితీ, క్రమశిక్షణ, తెలివితేటలు, ప్రవాహంలో పడిపోవటంతో ఇతరులు గుర్తించరు. గుర్తించినా ఒప్పుకోరు. తమ గొప్పలు తాము చెప్పుకోరు వీరు. అందుకే మీడియాపైన విమర్శలు గుప్పించేవారు వీరి ప్రసక్తి తేరు. వీరి పనులను ప్రస్తావించరు.

కాబట్తి, ప్రింటు మీడియా కానీ, విజువల్ మీడియా కానీ విమర్శకులు చూపుతున్నంత అధ్వాన్నంగా లేదు. ఆ మీడియాలో ఎంతో తపనతో, ఆర్తితో పనిచేసేవారు అనేకులున్నారు. వీలయితే అలాంటి మంచివారి గురించి తెలిపి వారిని ఆదర్శంగా నిలపటం ద్వారా ఇతరులకూ ఎంతో మేలు చేసినట్టవుతుంది.

కానీ, నాకు అవకాశం రాలేదు కాబట్టి, అవకాశం ఇవ్వని మీడియా అంతా పనికిరానిదే అని విమర్శకులనుకుంటే దానికి దోషం మీడియాది కాదు.

నేను పేర్లు చెప్పను కానీ, నాకు తెలిసిన ఒక జర్నలిస్తు ఎలాంటి రాజకీయాలలోకి పోకుండా, ఎవరి భజన చేయకుండా, తన పనినే దైవంలా భావిస్తూ పనిచేస్తూ ఉన్నత స్థాయిలో వున్న్నాడు.

నాకు తెలిసిన మరో జర్నలిస్తు, ఎలాంటి రాజీ పడకుండా, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, తన పరిథిలో కొత్తవారికి, ప్రతిభవున్నవారికీ అవకాశాలిచ్చి ప్రోత్సహించటం నాకు తెలుసు. నేను ఉన్నత స్థానం లో వున్నాను, నా ముందుకు వచ్చి చేతులు కట్తుకుని నిలబడిన వాడే రచయిత, అన్న అహంకారం చూపకుండా, ఎక్కడ ప్రతిభ వుందనిపిస్తే, వారికి స్వయానా ఫోను ద్వారానో, పరిచయస్తుల ద్వారానో కబురు పపంపి మరీ అవకాశాలిచ్చి ప్రోత్సహించటం నేను కళ్ళారా చూశాను.

నాకు తెలిసిన మరో జర్నలిస్టు, ప్రచురణకు స్వీకరించిన కథలు కాక, తిరస్కరించిన కథలు చదువుతాడు. ఎందుకంటే, మంచి కథలు వెనక్కు పోకూడదని, మమచి కథకులు నిరాశ చెందకూడదని.

నాకు తెలిసిన మరో జర్నలిస్టు, తన క్రింది ఉద్యోగులకు ఎంత స్వేచ్చ నిస్తాడంటే, వారికి ఇచ్చిన పేజీలకు వారే ఎడిటర్లు. ఈయన వారి వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. వారివల్ల పొరపాటయితే మాత్రం బాధ్యత తాను వహిస్తాడు.

ఇలా, చెప్తూ పోతే,  అధ్భుతమయిన వ్యక్తులు అనేకులు ఈనాడు మీడియాలో వున్నారు. తమ మేధ ద్వారా మీడియాకు వన్నె తెస్తున్నారు. భావి తరాల వారికి స్ఫూర్తి నిస్తున్నారు. కానీ, వారు స్వయానా తమ గురించి ఏమీ చెప్పుకోరు. ఎవరినీ చెప్పనివ్వరు.

కాబట్టి, నిజంగా మన మీడియాను మెరుగు పరచాలనుకున్న వారు, తప్పులను ఎత్తి చూపించేకన్నా, మంచిని ఎత్తి చూపించే ప్రయత్నం చేయాలి. మంచిని పొగడాలి. అప్పుడు, చెప్పనవసరం లేకుండానే అందరికీ మంచి ఏమితో తెలుస్తుంది. ఏపని చేస్తే గుర్తింపు లభిస్తుందో తెలుస్తుంది.

అందుకే మన పూర్వీకులు మంచిని మైకులో  చెప్ప మన్నారు. చెడును చెవిలో చెప్పమన్నారు. కానీ. ఇప్పుడు చెడును బహిరంగంగా ప్రకటిస్తూ మంచిని చెవిలో చెప్పటం జరుగుతోంది.

నేను కథాసాగర మథనం శీర్షిక ముందు జాగృతి పత్రికలో రాసేవాడిని. ఆరంభంలో అత్యుత్సాహంతో కథలను చీల్చి చెండాడేవాడిని, ఏవో కొన్ని కథలను మెచ్చేవాడిని.

కొన్ని వారాలతరువాత, జాగృతి పత్రిక  అప్పతి ఎడిటర్ రామమోహనరావు గారు గారు ఒక మాటన్నారు.

నీ శీర్షిక బాగుంది. మంచి స్పందన వస్తోంది. ఉపయోగ కరంగా వుంది. కానీ, 90 కథలలో అయిదు మంచి కథలను చూపి 85 బాగోలేని కథలను చూపుతున్నావు. మంచి కథలనే చూపు. మిగతావి బాగోలేవనే అర్ధమవుతుంది. పాఠకుడు అప్పుడు, ఆ మంచి కథలను చదువుతాడు. నీకూ శ్రమ తప్పుతుంది. పాథకుడికీ మంచి ఎక్కడుందో తెలుస్తుంది. అదీగాక, నెలకు 85 మంది నీకు శతృవులవటమూ తప్పుతుంది, అన్నారు.

గొప్ప సత్యం అది. అందుకే అప్పతినుంచీ కథాసాగర మథనంలో చదివిన కథల సంఖ్య చెప్పి, పరిచయానికి ఎంచుకున్న  కొన్ని కథలనే విమర్శించటం ఆరంభించాను.

కథల విషయంలో చేస్తున్నదే మీడియా విషయంలోనూ జరిగితే మంచి పదిమందికి తెలియటమే కాక, మంచి చేసేవారికి ఉత్సాహమూ, ప్రోత్సాహమూ లభిస్తాయి.

Enter Your Mail Address

August 6, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: నా రచనలు.

4 Responses

 1. SVK - August 6, 2010

  I agree with you sir. And I congratulate all of them who are encouraging talent.

 2. అరుణ పప్పు - August 6, 2010

  మంచి సూచనలు చేశారు, మంచి మాటలు చెప్పారు.

 3. రాజేంద్రకుమార్ దేవరపల్లి - August 6, 2010

  మీరన్న దాంట్లోనూ నిజముంది కానీ పాక్షికమే.మహాత్ములు అందరిలోనూ ఉంటారు మురళీకృష్ణ గారు,కానీ అందరూ మహాత్ములు కారు,కాబోరు.ఇవ్వాళ(ఒ నిమిషం క్రితంవరకూ) మన రాష్ట్రం లొ ఎన్ని పత్రికలున్నాయో మీకు తెలుసా??5242.ఇవి కాక టీవీ ఛానల్సు,వెబ్ మీడియా,రేడియో కేంద్రాలు.ఒక్కో పత్రికలో స్ట్రింగర్లనీ,కంట్రిబ్యూటర్లనీ అసంఖ్యాక ప్రజానీకం ఉంది ఇవ్వాళ.మీడియాలో ఇరవైయేళ్ళ అనుభవం ఉన్నవాడిగా నా మాట యేమంటే…మీడియా గురించి ఎక్కువగా విమర్శించేది మీడియా వారే.ఇప్పుడు బ్లాగుల్లో కనిపిస్తున్నాయి అవి అంతే.చాలా సార్లు ఆ విమర్శలే ఎంతో పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి.మీరు పైన చెప్పిన మీ సన్నిహితుల్లో ఎవర్నైనా అడిగిచూడండి.

 4. కోడీహళ్లి మురళీమోహన్ - August 7, 2010

  “కొన్ని వారాలతరువాత, జాగృతి పత్రిక అప్పతి ఎడిటర్ రామమోహనరావు గారు గారు ఒక మాటన్నారు.”

  పై వాక్యం ద్వారా మీకు రామమోహనరావు గారంటే రెట్టింపు గౌరవం ఉందని అర్థం అవుతోంది. :-)

Leave a Reply