మన మహాత్ముడు-విమర్శ-1

శ్రీ ఎం.వీ.ఆర్. శాస్త్రి గారు రచించిన మన మహాత్ముడు అనే పుస్తకం గురించిన విమర్శనాత్మక వ్యాస పరంపరలో ఇది మొదటిది.

ఆయన గాంది గారి గురించి వ్రాయ తలపెట్టిన మూడు పుస్తకాలలో ఇది మొదటి భాగం.అప్పుడే విమర్శించటం సమంజసమా? అన్న సందేహం వస్తుంది. మొదటి భాగం పూర్తయింది. పుస్తకం విడుదలయింది. సమీక్షలు పత్రికలలో వెలువడుతున్నాయి. కాబట్టి మొదటి భాగం గురించి అభిప్రాయాన్ని ప్రకటించటంలో తప్పులేదు.

విమర్శ ఆరంభించేముందు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ విమర్శను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఒకప్పుడు మన సాహిత్య ప్రపంచంలో పుస్తకం మంచి చెడులను రచయిత స్థాయితో సంబంధంలేకుండా నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చర్చించేవారు. ఈ చర్చలు సాహిత్యం వరకే పరిమితమయ్యేవి. వ్యక్తిగతంగా మంచి మితృలయినా సాహిత్యంలో మాత్రం రాజీ పడేవారు కారు.

ఇప్పుడలాంటి వాతావరణం లేదు. ఒక రచన గురించి చర్చించేముందు, రచన తప్ప ఇతర అనేక అంశాలు పరిగణనలోకి వస్తాయి.ఎం.వి.ఆర్. శాస్త్రి గారు ఆంధ్రభూమి దిన పత్రిక సంపాదకులు. సాధారణంగా సమీక్షలు, విమర్శలు చేసేవారంతా రచయితలు. రచయితలెప్పుడూ సంపాదకులపైన ఆధారపడేవారే. కాబట్టి సంపాదకులకు అప్రియమయిన రాతలు రాసి రచయితలు బ్రతకలేరు. దాంతో ఒక సంపాదకుడి పుస్తకం గురించి నిశ్పక్షపాత విమర్శ ఏ పత్రికలోనూ వచ్చే అవకాశంలేదు.అలావేసి పత్రికలు, రాసి రచయితలూ అనవసర వివాదాల్లో ఇరుక్కోటానికి ఇష్టపడరు.

మరి అలాంటప్పుడు నేనెందుకు రాసేందుకు ముందుకు వస్తున్నాను?

ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పటం కష్టం. రచయితలు తమ మనస్సులు చాలా గాయపడినప్పుడు ఆ గాయాన్ని రచనల రూపంలో వ్యక్తపరుస్తారు. కవితలు, కథలు, నవలలు, వ్యాసాలు, రచనా ప్రక్రియ ఏదయినా మూలం ఒకటే. గాయమే గేయమైనదంటారు.

మన మహాత్ముడు పుస్తకంలో అనేక అంశాలతో నేను విభేదిస్తాను. కానీ నా ఆలోచనలను వ్యక్తంచేసే వీలు పత్రికారంగంలో లభించదు. బ్లాగుల్లో ఆ స్వేచ్చ వుంది. ఇంత స్వేచ్చ వుండికూడా నేను నమ్మినదాన్ని పదిమందికీ ప్రకటించకపోతే రచయితగా చెప్పుకునే హక్కు నాకు వుండదు.అదీగాక, ఆరంభమ్నుంచీ నేను నాకు నచ్చి, నేను నమ్మిన రాతలే రాస్తున్నాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను.

నువ్వుచెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, నువ్వునమ్మినదాన్ని చెప్పే నీ హక్కు కోసం పోరాడతానన్న తత్వవేత్త ఆలోచననే నా ఆలోచన. కాబట్టి నేను నమ్మినదాన్ని చెప్పే ప్రయత్నం ఇది. ఇది ఎవరినీ నొప్పించాలని, తక్కువచేయాలని, అనవసర వివాదాలు సృష్టించాలని, లేనిపోని గొడవలలో ఇరుక్కోవాలని కానీ రాస్తున్నది కాదు. కాబట్టి ఈ విమర్శను విమర్శగానే తీసుకోవాలని మనవి. అంతకుమించి వేరే ఉద్దేశ్యాలేవీ లేవు.

ముందుగా, ఈమధ్య మన దేశంలో కాస్త పేరున్న ప్రతివారినీ ఏదో ఒక రకంగా దిగజార్చాలన్న తపన కనిపిస్తోంది. అనుచరులు, కార్యకర్తలున్నవారయితే నానా రభస సృష్టిస్తారనే భయం వుంటుంది. అలా సృష్టిస్తున్నారుకూడా. కాబట్టి, పాత నాయకులను, దిక్కుమొక్కు లేని అనాథ దేశభక్తులను, వేదాలను, ప్రాచీన రాజులను దూషించి, వారు పనికి రానివారని నిరూపించి తమ తెలివిని, అహంకారాలను సంతృప్తి పరచుకోవటం జరుగుతోంది.

వేద రుషులు తాగుబోతులు. మద్యపాన మత్తులో చేసిన వ్యర్ధప్రేలాపనలు వేదాలు. మిగతా రాతలన్నీ ఒక కులంవారు తమ ఆధిక్యతను నిలుపుకోవటానికి చేసిన మాయలు. రాసిన కల్లబొల్లి కబుర్లు.

ఇప్పుడు ఆ రుషులు వచ్చి తమని సమర్ధించుకోలేరు.వారిని సమర్ధించాల్సిన వారంతా చాందసులు, పాతను పట్టుకునివేలాడే మూర్ఖులు.

రాముడు బూటకం. కృష్ణుడు నాటకం. భగవద్గీత మోసం. వాళ్ళూ సమర్ధించుకోలేరు. సమర్ధించేవారులేరు.

రాజపుతృలు మూర్ఖులు. రాణాప్రతప్ హిందూ వాది. శివాజీ చిట్టెలుక. చిన్న విప్లవకారుడు. వీళ్ళూ రక్షించుకోలేరు.

1857 విప్లవంకాదు. అది బూర్జువాలపైన సామాన్యుల తిరుగుబాటు. దాన్ని రాజులంతా తప్పుత్రోవ పట్టించారు. నానాసాహెబ్ పనికిరాని వాడు. తాత్యతోపేకి యుద్ధం రాదు. ఝాన్సీ లక్ష్మి రాజ్యంపోతే యుద్ధంలో దిగింది తప్ప, దేశ భక్తితో కాదు.

పాపం వీళ్ళకీ నోళ్ళు లేవు.

కాంగ్రెస్ వారంతా ఒక వర్గం ప్రతినిధులు. చేతకానివారు. గోఖలే మెతకవాడు. తిలక్ మత తత్వవాది. అరబిందొ పిరికివాడు. పోలీసులు పట్టుకుంటారని పాండిచేరి పారిపోయాడు. నెహ్రూ స్వార్ధపరుడు. గాంధీ గొప్ప మాయగాడు.రాజాజీ బ్రతకనేర్చినవాడు. రాధాకృష్ణన్ తత్వవేత్తనేకాడు. మున్షీ హిందూ సమర్ధకుడు. సర్దార్ హిందూ చాందసుడు.సావర్కర్ మత చాందసుడేకాదు, బ్రిటీష్ వారిని శరణు వేడిన భీరువు.

పాపం వీళ్ళూ నోరు విప్పలేరు.

ఇలా ఒకరొకరిగా మనకు ఆదర్శం అన్న వారిని ఆ పీఠం నుంచి లాగేస్తున్నారు.మనకు పూజనీయులు అన్నవారిపై బురద జల్లుతున్నారు. మనం గౌరవించేవారిని అందుకు అర్హులుకానివారని నిరూపిస్తున్నారు.

ఇదంతా ప్రజలకు నిజాలు చెప్పి వాళ్ళ మెదళ్ళలో నిండిన తుప్పును వదిలిచే ప్రయత్నంగా చెప్పుకుంటున్నారు. సమాజానికి నిజం చెప్పి కళ్ళు తెరిపించిన వారిగా కాలర్లెగరేస్తున్నారు. నిజానికి పెద్దపీట వేస్తూ, వ్యక్తుల స్థాయితో పనిలేని రీతిలో విమర్శిస్తున్నాట్టు చెప్పుకుంటున్నారు.

అయితే, ఇలా చేయటం వల్ల సమాజానికి మేలు జరుగుతోందా, కీడు జరుగుతోందా అన్నది వారు ఆలోచించటం లేదు. తమ అహాల సంతృప్తి కోసం చూస్తున్నారు తప్ప సామాజిక మనస్తత్వాన్ని తాము ఎలా దెబ్బ తీస్తున్నారో ఆలోచించటంలేదు. 

అంటే గొప్పవారి తప్పులను కప్పి పుచ్చి, వారి గొప్పనే చెప్పాలా అని అడ్గవచ్చు. దానికి సమాధానం విచక్షణ.

మను ధర్మ శాస్త్రంలో ఒక శ్లోకంవుంది.

సత్యం చెప్పాలి. అప్రియమయిన సత్యాన్నికూడా ప్రియంగా చెప్పాలి.

కానీ మనువు పనికిరానివాడవటంతో అతను చెప్పిన విచక్షణ కూడా పనికిరానిదవుతోంది.

ప్రాతహ్ స్మరణీయులను, దేశ భక్తులను, పురాణపురుషులను, జాతీయ నాయకులను చిన్నబుచ్చటంవల్ల సామాజికమనస్తత్వానికి తగిలేదెబ్బ గురించి చర్చిన తరువాత పుస్తక విమర్శలోకి దిగుదాం.

Enter Your Mail Address

September 19, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

No Responses

  1. janardhan - September 30, 2008

    చాలా బాగా చెప్పారు. ఇలాంటి మూర్ఖులకు వచ్చె జన్మ లో ఐనా మంచి బుథ్థి ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నాను.

Leave a Reply