రక్ష సినిమా చూసే హక్కు నాకుంది!

ఈ మధ్య మన సమాజంలో ఇది ఒక ఫాషన్ అయిపోయింది. ఎవడికి వాడు వాడే సమాజాన్ని ఊద్ధరించేవాడినని నమ్ముతున్నాడు. దాన్ని బలపరచుకునేందుకు ఒక పదిమందిని కూడగట్టుకుని గోల చేస్తున్నాడు. అరిచేవాడి గొంతు వినిపిస్తుంది. దాంతో అందరూ వీళ్ళకి లేని పోని ప్రాధాన్యం ఇచ్చి వారిని చూసి బెదురుతూన్నారు. దాంతో మన సమాజం పిరికి సమాజం అయిపోతోంది. పది మందిని పోగేసుకోగలిగిన ప్రతివాడూ సమాజ మార్గదర్శకుడయిపోతున్నాడు. సమస్త సమాజానికి తానే ప్రతినిధినన్నట్టు ప్రవర్తిస్తున్నాడు.

మొన్న థకరేలదేచేశారు. వాళ్ళకు నచ్చకపోతే మహారష్ట్ర ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. అందరూ భయపడి అపాలజీలు చెప్పుకున్నారు.

థాక్రేలను దూషించే హేతువాదులూ ఇప్పుడదే చేస్తున్నారు. రక్ష అనే సినిమా చూస్తే మూఢాచారాలు ఊపందుకుంటాయట. ప్రజలలో చేతబడులపయిన నమ్మకం పెరుగుతుందట. అందుకని ఆ సినిమా ప్రదర్శన నిలిపివేయాలట. మూర్ఖత్వం, అహంకారాం, అహేతుకం కాకపోతే మరేమిటిది?

అదొక సినిమా. రక్ష అనేది భీభత్స ప్రధానమయిన సినిమా. సాంఘిక, సాహస, ప్పుఒరాణిక ఇత్యాది రకరకాల సినిమా ప్రక్రియలలాగే ఇదీ ఒక పద్ధతికి చెందిన సినిమా. రేషనలిస్టుల పితామహులయిన పాశ్చాత్యదేశాలలో ఇలాంటి సినిమాలకు మంచి గిరకీ వుంది. ఎక్సార్సిస్ట్, ఓమెన్, డ్రాకులా, నైట్ మేర్ లాంటి సినిమాలనుంచి. కాండీమాన్, వాంపైర్లు, ఇంకా ఆడ్రే రోస్ లాంటి సినిమాలేకాక, ఇంకా క్రూర కర్కోటక సినిమాలుకూడా ఈ కోవకు చెందుతాయి. ఇలాంటివి చూసి సంతోషించేవారూ ఉన్నారు.రక్ష కూడా అలాంటి కొందరికి సంతృప్తి నిస్తుంది.అది వాళ్ళు చూస్తే వీళ్ళ సొమ్మేం పోయిందట. చూసి నమ్మితే వీళ్ళకేమి నష్టమట?

సినిమాలు చూసి ఇప్పుడు కొత్తగా నమ్మకాలు పెంచుకునే పరిస్థితి లేదిక్కడ. అయినా, ఈ రేషనలిస్టులకు అందరికీ ఏది మంచో తమకే తెలుసని అంత నమ్మకం ఏమిటి? తమ దేవుడినే అందరూ కొలవాలన్న మూర్ఖపు పట్టుదలకీ, తమకు నచ్చని సినిమా ఎవ్వరూ చూడకూడదన్న వీరి పట్టుదలకూ తేడ ఏమయినా వుందా?  అది మతం కాబట్టి మౌఢ్యం అయింది. ఇది సినిమా కాబట్టి గొప్ప అయిందా?

అదీగాక, ఈ సినిమా చూసి ప్రజలలో మూఢనమ్మకాలు పెరుగుతాయని వీరికి కలలో దేవుడు కనబడి చెప్పాడా?

నిజంగా వీళ్ళకి సమాజ శ్రేయస్సు గురించి తపన వుంటే, సినిమాల్లో వెర్రి మొర్రి పాటలు, నృత్యాలు, వెకిలి హాస్యాలు, వ్యక్తిత్వం లేని ఆడవాళ్ళు, లైంగికపరంగా రెచ్చగొట్టే నీచ దృష్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆడవారిని చులకన చేస్తూ, ఆత్మగఔరవ రహితులుగా చూపటం గురించి ఆందోళన చేయాలి. ప్రమను అదో గూప చర్యలా చూపిస్తూ నిక్కర్లు సరిగ్గా వేసుకోరాని వాళ్ళను తప్పుదారి పట్టించే సినిమాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అవన్నీ వదలి, ఏదో కాసేపు, ప్రజల్ని భీతిభ్రాంతులను చేసే సినిమా వెంట పడి లాభంలేదు.  ఈ సినిమాలు ఇష్టంలేనివారు వాటి జోలికి కూడా వెళ్ళరు.అవి చూసి తమకు మూఢనమ్మకాలొచ్చెస్తాయన్నంత బలహీన మనస్కులే ఈ హేతువాదులయితే ఆ సినిమా చుట్టుపక్కలకే వెళ్ళొద్దు. అంతేకానీ చూసేవారిని చూడొద్దనద్దు. సినిమా చూసే హక్కుని అడ్డుకోవద్దు.

అయినా, తాము ఒక మెట్టుపైనున్నట్టు భావించుకుంటూ మిగతావారంతా ఏమీ తెలియని అమాయకులనుకోవటం హేతువాదులకు అలవాటేకదా! ఆ అలవాటులో వున్న హేతు రాహిత్యం గ్రహించే విచక్షణవారికి దేవుడిచ్చుగాక!

అంతవరకూ వారు ఎవరినీ సినిమా చూడకుండా అడ్డుకోవద్దు. ఎవరి ఆనందం వారిదని వదిలేయాలి. సమాజొద్ధరణ మాని, సమాజోపయోగ కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలి.

అప్పుడప్పుడూ భగవద్గీతనో, రామాయణమో పారాయణం చేస్తూ, ఆంజనేయ దండకం చదువుకుంటే వారికి భూత ప్రేత పిశాచాల బాధలు, భయాలు వుండవు.

Enter Your Mail Address

September 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. కె.మహేష్ కుమార్ - September 20, 2008

  హేతువాదం కూడా ఈ మధ్యకాలంలో మతఛాందసవాదాన్ని తలపిస్తోందన్నమాట! మూర్ఖత్వానికి వ్యతిరేకంగా మరోమూర్ఖత్వం ఇదే మన భారతీయతత్వం అన్నట్లుంది.
  మీ స్పందన చాలా బాగుంది.

 2. సుజాత - September 20, 2008

  బాగా చెప్పారు. సినిమాలు చూసి జనం చెడి పోతారనో, మారతారనో అనుకోవడమంత మూర్ఖత్వం లేదు. రాం గోపాల్ వర్మ తనకిష్టమైన సబ్జెక్టుతో సినిమాలు తీస్తాడు, చూసేవాళ్ళు చూడొచ్చు, లేని వాళ్ళు మానెయ్యొచ్చు!

  చివరి నుంచి మూడో పేరా బాగుంది. అలాగే మీరు హేతువాదులకిచ్చిన సలహా కూడా అద్భుతంగా ఉంది.

 3. aruna - September 20, 2008

  “అప్పుడప్పుడూ భగవద్గీతనో, రామాయణమో పారాయణం చేస్తూ, ఆంజనేయ దండకం చదువుకుంటే వారికి భూత ప్రేత పిశాచాల బాధలు, భయాలు వుండవు.”

  Ha haa.. Super narration. :)

 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి - September 20, 2008

  సరే మురళీకృష్ణ గారు, ఆ రక్ష అన్నది పూంక్ అనే ఒక దరిద్రగొట్టు హిందీ సినిమాకు తెనుగుసేత,హిందీలో అందరూ చల్ చల్ నికల్ జా అని ఈసడించుకుని వెళ్ళగొట్టాక తెలుగులో ఇలా రక్ష గా వచ్చింది.ఈ సినిమా ఏం ఖర్మ మీ ఇష్టమొచ్చిన సినిమా చూడొచ్చు.దానితో పాటు కక్ష,శిక్ష ఇలా మీ ఇష్టమొచ్చిన సినిమాలకు రాయొచ్చు,దర్శకత్వం వహించొచ్చు,డబ్బులుంటే స్వంతగా తీయొచ్చు కూడా.
  మీరు హేతువాదులకు సలహాలు ఇచ్చారు,బాగుంది,అసలు వారెవరు?మన రాష్ట్రంలో మీకు పరిచయమున్న ఒక పది మంది అనగా పత్రికల్లో,టీవీచానళ్ళలో చూసి,వినేవారు అన్నమాట ఒక్క పదిమంది పేర్లు చెప్పండి ముందు.వారిలో మీరు చెప్పిన సినిమా వద్దని ప్రదర్సనలు చేస్తున్న వారిలో ఉన్నారా? ఆ సినిమాకోసం, సదరు సినిమానిర్మాతలకు కిరాయి కోసం అదో ప్రచారం కాబట్టి నెగటివ్ పబ్లిసిటీ కూడా కనీసం మొదటి వారంలో బోణీలన్నా అయ్యేట్టు చేస్తుందన్న దింపుడుకళ్ళం ఆశ ఎందుకు అయ్యుండకూడదు?
  హేతువాదులకు క్లాసుపీకి తలంటు పోసేందుకు తయారయ్యారు మీరు,మరి యం.వీ.ఆర్.శాస్త్రి గారి మన మహాత్ముడు అన్న పుస్తకం మీద ఒక వ్యాస పరంపరను ఎందుకు ప్రారంభించినట్లు మీరు?ఏం ఆయనకు తెలిసింది ఆయన రచించుకుంటే మీరు మీ బ్లాగులో ఎందుకు అభ్యంతరపెడుతున్నారు?
  హేతువాదులకు నీతులు చెప్పే తొందరలో మీరు ఒక నికృష్టమైన సినిమాకు పరోక్షం గా మద్దతు పలుకుతున్నారు.రామ్ గోపాల్ వర్మకు ఇలాంటి సినిమాలు తీసుకునే హక్కు.అవి చూసే హక్కు మీకు,బ్లాగులు,కధలు,కవితలు రాసుకునే హక్కు మీకు మాకు ఎలా ఉందో ఆ హేతువాదులకీ వారికి నచ్చని సినిమా గురించి ప్రకటనలు ఇచ్చుకునే హక్కు ఉంది,రాజ్యాంగపరిధికి లోబడి,శాంతియుతంగా,అహింసామార్గంలో తమ నిరసన తెలియజేసుకునే హక్కు మనకుంది.

  మీరన్నట్లు “సినిమాల్లో వెర్రి మొర్రి పాటలు, నృత్యాలు, వెకిలి హాస్యాలు, వ్యక్తిత్వం లేని ఆడవాళ్ళు, లైంగికపరంగా రెచ్చగొట్టే నీచ దృష్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆడవారిని చులకన చేస్తూ, ఆత్మగఔరవ రహితులుగా చూపటం గురించి ఆందోళన చేయాలి. ప్రమను అదో గూప చర్యలా చూపిస్తూ నిక్కర్లు సరిగ్గా వేసుకోరాని వాళ్ళను తప్పుదారి పట్టించే సినిమాలకు వ్యతిరేకంగా పోరాడాలి.”నిజమే ఆ అంశాలకు వ్యతిరేకంగా ’ పోరాడుతున్న”వారికి ఇంతకుముందు మీరెప్పుడన్నా మద్దతు ప్రకటించారా?భవిష్యత్తులో కనీసం మీ బ్లాగు ద్వారా ప్రోత్సహించగలరా?
  అన్నిరకాల ప్రసార సాధనాలలో ఊదరకొడుతూ,ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు మీ వంటి వారి మద్దతూ సంపాదించుకున్న సదరు చిత్రరాజానికి ఎవరో నలుగురు గొట్టంగాళ్ళు వ్యతిరేకించినందువల్ల వచ్చే నష్టమేమిటో?
  ఇన్ని తెలిసిన మీరు శాస్త్రిగారు రాసిన పుస్తకానికి అచ్చంగా ధారావాహికగా విమర్శిస్తూ మీవ్యాసపరంపరను మొదలుపెట్టటమేమిటో?

 5. కస్తూరి మురళీకృష్ణ - September 20, 2008

  మహేష్, సుజాత, అరుణ గార్లకు బహు కృతఙ్నతలు.

  రాజేంద్ర కుమార్ గారు

  మంచి చర్చకు ఆస్కారం ఇచ్చారు. ధన్యవాదాలు.

  నిజమే, మీరన్నట్ట్లు డబ్బుంటే నేనే కథ, స్క్రిప్టు, పాటలు, దర్శకత్వం చేస్తూ సినిమా తీసేవాడిని. కానీ ఈ జన్మలో ఆ అవకాశం లేదు కాబట్టి అంతా బ్రతికిపోయారు.

  ఇక, రాం గోపాల్ వర్మ మీ దృష్టిలో అంత మంచి కళాకారుడు కాకపోవచ్చు. కానీ, దేవీ దేవతలను నగ్నంగా చిత్రించే స్వేచ్చ ఉన్న మన దేశంలో తన ఇష్టం వచ్చినట్టు నీచ నికృష్ట సినెమా తీసే హక్కు ఆయనకూ వుంది. దాన్ని చూడాలో వొద్దో నిర్ణయించుకునే విచక్షణ ప్రేక్షకులకూ వుంది. మీరు గమనిస్తే, ఏ విమర్శకుడి పొగడ్త విని ప్రజలు శంకరాభరణాన్ని హిట్ చేసారు? ఈ విమర్శకుడి విమర్శ చదివి సావరియా అంత ఘోరంగా దెబ్బతింది? కాబట్టి ఎవరు ఏమన్నా ప్రజల విచక్షణ మాత్రం ప్రశ్నార్ధకం కాదు. నేను ఎప్పుడూ అందరితో ఒక మాట అంటూంటాను.

  మీ స్థాయికి ప్రజలను దింపకండి, ప్రజల స్థాయికి మీరు ఎదగండి అని. కాబట్టి ఇలాంటి రచనలు చేయవద్దనో, ఇలాంటి సినిమాలు తీయవద్దనో, ఇలాంటివి చూడవద్దనో గోల చేసి, ధర్నాలు చేసి, సినిమాకు వెళ్ళేవళ్ళని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు.

  ఇక, ధర్నాలో వున్న వారేవరయినా మీకు తెలుసా, అనడిగారు. రోజూ బోలెడంత మంది ధర్నాలు చేస్తూంటారు. టీచర్ల సంఘం అంటే టీచర్లు కాబోలు అనుకుంటాం. గుడ్డివారి సంఘం అంటే గుడ్డివారు అనుకుంటాం. హేతువాదులం అంటే హేతువాదులు అనుకుంటాం. అదీగాక, నాయకులు ఇళ్ళల్లో వుంటారు. రోడ్డుమీద పడేది ఏమీ తెలియని అమాయకులే.

  ధర్నా చేసేది పబ్లిసిటీ కోసం అంటారా? వర్మ ఏ సినిమా తీసిన ఇలా నిరసనలు చేసేవారున్నారు. ఆమధ్య భర్యని చమపటం లాంటి పేరు చూసి మహిళాసంఘాలు గోల చేసాయి. అదీ పబ్లిసిటీ నే అంటారా? సంధ్య ముందే ఫై బ్రాండ్. మిమ్మల్ని నన్నూ కడిగి, ఉతికి, పిండి ఆరేసి ఎండిన తరువాత రెండ్రోజులు ఆగకుండా తిట్టి మనమీద పురుషాహంకారం కేసు పెట్టి మనువు నుంచి మీదాక, నాదాక ఎవరూ మళ్ళీ నోరిప్పకుండా చేస్తుంది.

  మీరు ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకం గురించి నా వ్యాఖ్య సరిగ్గా చదవనట్టున్నారు.

  నేను సత్సాంప్రదాయ పద్ధతిలో, హుందాగా, గౌరవ ప్రదంగా, ఇద్దరు నాగరీకులు ఒకరి కోకరు గౌరవమిచ్చుకుంటూ తమ ఆలోచనాధోరణుల్లో భేదాలను చర్చించుకునే రీతిలో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంతేకానీ, ఆయన పుస్తకం రాయొద్దనీ, దాన్ని చదవొద్దనీ, దాన్ని నిషేధించాలనీ రోడ్డుమీద పడి గోల చేయటంలేదు. నాకు నా నిరసన వ్యక్త పరచుకునే స్వేచ్చ బ్లాగులో లభించింది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఏ పత్రికలోనయినా అవకాశం ఇచ్చివుంటే అక్కడే రాశేవాడిని. నా అభిప్రాయాన్ని నేను ముఖతహా ఆయనకూ తెలిపాను. ఆయన సహృదయంతో తన వాదనను వినిపించారు కూడా!

  గమనిస్తే, ఆ వ్యాసంలోనే నేను, నీఅభిప్రాయంతో ఏకీభవించకున్నా, నీ అభిప్రాయాన్ని వ్యక్త పరచే హక్కుకోసం పోరాడతాను అన్న వోల్టెయిర్ ఆలోచనను పొందు పరచాను కూడా. అంటే విడిగా వివరించే అవసరం లేదను కుంటాను.

  మన మహాత్ముడు గురించి నేను రాయటంలో కూడా ఇదే లక్ష్యం వుంది. రక్ష నిరసనకూ, నా సాహిత్య పరమయిన భేదాభిప్రాయ వ్యక్తీకరణకూ తేదా గమనించాలని ప్రార్ధన.

  ఇక నేను హేతువాదులకు సూచించిన కార్యప్రణాళిక నేను నా నవల కథలు, వ్యాసాల ద్వార నా వంతు చేస్తూనే ఉన్నాను. మీరు నా అసిధార, అంతర్మధనం , ఇది నాహృదయం వంటి నవలలు చదివితే సినిమాల ద్వారా యువతకు అందే ప్రేమకూ, అసలయిన ప్రేమకూ వున్న తేడాలు వివరించాను. భారతీయ వ్యక్తిత్వవికాసం అనే పుస్తకంలో సినిమాలూ-ప్రేమలపయిన ఒక అధ్యాయమే వుంది. నా కథలు వీచికలు-మరీచికలు ఇంకా అనేక కథలలొ ఈ అంశాలే కేంద్ర బిందువు. నా రచనలు మీరు చదవలేదు కదా.

  వీలయితే రేపటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం, వొచ్చేవారమూ అంధ్రప్రభ చూడండి ఇలాంటి రాతలే కనిపిస్తాయి.

 6. ప్రవీణ్ గార్లపాటి - September 20, 2008

  నిజమే! ప్రతీ చిత్రాన్ని ఏదో సాకు చూపడం, “మనోభావాలు దెబ్బ్తిన్నాయని” అడ్డుకోవడం ఓ ఫ్యాషనయిపోయింది.

 7. అబ్రకదబ్ర - September 20, 2008

  ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు. రామగోపాలవర్మ భూత ప్రేతాల మీద సినిమాలు తియ్యొచ్చు, హేతువాదులు దానిమీద గోల చెయ్యొచ్చు, మురళీకృష్ణ గారు దాన్ని ఖండిస్తూ వ్యాసం రాయొచ్చు, అది నచ్చనోళ్లు ఆయన బ్లాగులోనే ఆయన్ని విమర్శించొచ్చు, విమర్శలు నచ్చనోళ్లు ఆయన్ని వెనకేసుకు రావచ్చు, ….

  ఎవరికిష్టంవచ్చినట్లు వాళ్లు చెయ్యొచ్చనే వాదనొస్తే అదలా సాగుతూనే ఉంటుంది – అందరూ ఒప్పే అనిపించేలా.

 8. కస్తూరి మురళీకృష్ణ - September 20, 2008

  అబ్రకదబ్ర గారూ,

  అదే ప్రజాస్వామ్యమంటే. అందరికీ స్వేచ్చ వుంటుంది.కానీ ఆ స్వేచ్చను విచక్షణతో, పరిణతి ప్రదర్శిస్తూ వినియొగించుకోవాలి. వినదగునెవ్వరు చెప్పిన, ఒరులేయవి యొనరించిన లాంటి వాటిని పాటించాలి. అదిలేకపోతే ఇప్పుడు మనము అనుభవిస్తున్నట్టే వుంటుంది. బ్లాగులో విమర్శించినా, ఆ విమర్శను స్వీకరించాలా, తొలగించాలా అన్న స్వేచ్చకూడా బ్లాగరికి వుంటుంది. సర్వేజనా సుఖినోభవంతు.

 9. రాజేంద్ర కుమార్ దేవరపల్లి - September 28, 2008

  మంచి చర్చకు ఆస్కారం ఇచ్చారు. ధన్యవాదాలు.
  మురళీకృష్ణ గారు మొదటగా మీకు ధన్యవాదాలు.మొదటిది నా వ్యాఖ్యలను చర్చ అన్నందుకు.రెండోది నా వ్యాఖ్యలను ప్రచురిస్తున్నందుకు.ఈ మధ్య తెలుగుబ్లాగుల్లో పొడచూపుతున్న ఒకానొక వైపరీత్యమేమంటే మనకు ఇష్టం లేని వ్యాఖ్య వస్తే ఆ వ్యాఖ్యతోపాటు సదరు టపాకూడా తొలగించివేస్తున్నారు.

  నిజమే, మీరన్నట్ట్లు డబ్బుంటే నేనే కథ, స్క్రిప్టు, పాటలు, దర్శకత్వం చేస్తూ సినిమా తీసేవాడిని. కానీ ఈ జన్మలో ఆ అవకాశం లేదు కాబట్టి అంతా బ్రతికిపోయారు.

  —మీకు త్వరలో లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మనీ వచ్చి మీకూనాకూ నచ్చిన సినిమాలు తీయాలని కోరుకుంటున్నా :)

  ఇక, రాం గోపాల్ వర్మ మీ దృష్టిలో అంత మంచి కళాకారుడు కాకపోవచ్చు.—

  రాం గోపాల్ వర్మ మీద నాకు అలాంటి చిన్నచూపులేదు.అలాగే ఈ మధ్య కాలంలో అతనితో నేరుగా కాకపోయినా అతని కజిన్స్ తో ఇప్పటికీ నా స్నేహసంభంధాలు కొనసాగుతున్నాయి.అలాగే ఈ ప్రాతిపదికన మీరు పాండురంగడు సినిమా మీద రాసిన విమర్శని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని,ఆ సినిమాకు పనిచేసిన వారిమీదా మీకు అలాంటి భావముందా (అంత మంచి కళాకారులు కాదా అని)
  నాలాంటివాళ్ళు భావించటానికి అవకాశముంది కదా?!
  కానీ, దేవీ దేవతలను నగ్నంగా చిత్రించే స్వేచ్చ ఉన్న మన దేశంలో
  … ఇది చాలా పెద్ద అంశం,మరో సారి తీరిగ్గా చర్చిద్దాం,ఈ లోపు ఇదేవిషయంపై ఇటీవల భారతసర్వోన్నతన్యాయస్థానం ఇటీవల ఇచ్చిన రెండు తీర్పులను వీలువెంబడి పరిశీలించమని కోరుకుంటున్నాను.

  తన ఇష్టం వచ్చినట్టు నీచ నికృష్ట సినెమా తీసే హక్కు ఆయనకూ వుంది…అవును నేనూ ఒప్పుకుంటున్నా,అది మీరన్నట్లు నీచనికృష్టసినిమాయే,

  దాన్ని చూడాలో వొద్దో నిర్ణయించుకునే విచక్షణ ప్రేక్షకులకూ వుంది….
  ప్రేక్షకులు రెండోదె ఖాయం చేసారు.
  మీరు గమనిస్తే, ఏ విమర్శకుడి పొగడ్త విని ప్రజలు శంకరాభరణాన్ని హిట్ చేసారు?
  అవును,కానీ ఆ శంకరాభరణం దర్శకుడి స్వాతికిరణం(మమ్ముట్టి,రాధిక)బాక్సీఫీసు వద్ద విఫలమైనప్పుడు వ్యక్తం చేసిన అభిప్ర్రాయాలు వీలయితే పాతపత్రికలోమాటు తిరగేయగలిగితే,ఈ సినిమా దర్శకులు ఎంత వినయంగా భాషించగలరో,అంతకన్నా ఎక్కువగా విశృంఖలంగానూ తిట్టిపోయగలరని మనకు అర్ధమౌతుంది.

  ఈ విమర్శకుడి విమర్శ చదివి సావరియా అంత ఘోరంగా దెబ్బతింది? కాబట్టి ఎవరు ఏమన్నా ప్రజల విచక్షణ మాత్రం ప్రశ్నార్ధకం కాదు. నేను ఎప్పుడూ అందరితో ఒక మాట అంటూంటాను.
  మీ స్థాయికి ప్రజలను దింపకండి, ప్రజల స్థాయికి మీరు ఎదగండి అని. కాబట్టి ఇలాంటి రచనలు చేయవద్దనో, ఇలాంటి సినిమాలు తీయవద్దనో, ఇలాంటివి చూడవద్దనో గోల చేసి, ధర్నాలు చేసి, సినిమాకు వెళ్ళేవళ్ళని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు…..
  ఆధర్నాలు,అడ్డుకోవటం వల్లే వెళ్ళిన నలుగురికన్నా ఆ సినిమా గూర్చి తెలిసింది.ఇక్కడ మా వైజాగులో అలాంటి హడావుడి ఏమీ లేదు కాబట్టి దాని ఊసెత్తినవారెవరూ లేరు.

  ఇక, ధర్నాలో వున్న వారేవరయినా మీకు తెలుసా, అనడిగారు. రోజూ బోలెడంత మంది ధర్నాలు చేస్తూంటారు. టీచర్ల సంఘం అంటే టీచర్లు కాబోలు అనుకుంటాం. గుడ్డివారి సంఘం అంటే గుడ్డివారు అనుకుంటాం. హేతువాదులం అంటే హేతువాదులు అనుకుంటాం. అదీగాక, నాయకులు ఇళ్ళల్లో వుంటారు. రోడ్డుమీద పడేది ఏమీ తెలియని అమాయకులే.
  ….నిజమే మీరు హేతువాదులూ అంటుంటే మీకు తెలిసినవారున్నారేమొ అని భావించా

  ధర్నా చేసేది పబ్లిసిటీ కోసం అంటారా? వర్మ ఏ సినిమా తీసిన ఇలా నిరసనలు చేసేవారున్నారు…
  అలా ఎందుకు జరుగుతుంది?సినిమాలో విషయం కన్నా వివాదాస్పదమౌవటం వల్లన్నా ఓపెనింగ్స్ రావా అన్న భావన
  .ఆమధ్య భర్యని చమపటం లాంటి పేరు చూసి …
  భార్యను ఎలా చంపాలి అన్నది కధాంశం,మీకెప్పుడన్నా మీభార్యను చంపాలనిపించిందా అన్నది ప్రచారాస్త్రం.అవునూ మనల్ని ఎవరన్నా వ్యక్తిగతం గా ఆ ప్రశ్న అడిగితే ఏమిచెస్తామండి?

  మహిళాసంఘాలు గోల చేసాయి. అదీ పబ్లిసిటీ నే అంటారా? సంధ్య ముందే ఫై బ్రాండ్. మిమ్మల్ని నన్నూ కడిగి, ఉతికి, పిండి ఆరేసి ఎండిన తరువాత రెండ్రోజులు ఆగకుండా తిట్టి మనమీద పురుషాహంకారం కేసు పెట్టి మనువు నుంచి మీదాక, నాదాక ఎవరూ మళ్ళీ నోరిప్పకుండా చేస్తుంది
  — ఇంతకీ మీరంటున్న ఆ హేతువాదులు సంధ్య.ఇతరులు అన్నమాట. సంధ్య్త గతంలో ఆరుగురు పతివ్రతలు అన్నవెకిలి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా నిర్మాత,దర్శకుడైన ఇ.వి.వి.సత్యనారాయణ తో ఒక టీవీ చర్చాగొష్టిలో చాలా బాగా మాట్లాడింది ఆమె,ఇక్కడో విషయం.వామపక్షాల్లో ఉన్నవారందరూ హేతువాదులూ,నాస్తికులూ కారు.అలాగే హేతువాదులూ,నాస్తికులందరూ వామపక్షవాదులు కారు.

  మీరు ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకం గురించి నా వ్యాఖ్య సరిగ్గా చదవనట్టున్నారు.
  -అవునేమో,
  నేను సత్సాంప్రదాయ పద్ధతిలో, హుందాగా, గౌరవ ప్రదంగా, ఇద్దరు నాగరీకులు ఒకరి కోకరు గౌరవమిచ్చుకుంటూ తమ ఆలోచనాధోరణుల్లో భేదాలను చర్చించుకునే రీతిలో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను.

  చాలా మంచి సంప్రదాయమది,
  అంతేకానీ, ఆయన పుస్తకం రాయొద్దనీ, దాన్ని చదవొద్దనీ, దాన్ని నిషేధించాలనీ రోడ్డుమీద పడి గోల చేయటంలేదు.
  –=-అది సినిమా కాబట్టి వారు సింబాలిక్ గా ఆ థియేటర్ దగ్గర నిరసన తెలుపుతున్నారెమో?
  నాకు నా నిరసన వ్యక్త పరచుకునే స్వేచ్చ బ్లాగులో లభించింది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను.

  –వామపక్షాలకు చెందిన ప్రజాసంఘాలుగా వారు ఏ ఉద్యమమైనా ఎక్కడైనా చెయ్యొచ్చని భావిస్తున్నారేమో?
  ఏ పత్రికలోనయినా అవకాశం ఇచ్చివుంటే అక్కడే రాశేవాడిని.
  –ఒక పత్రిక సంపాదకుడు రాసిన ఒకపుస్తకం మీద మీ విమర్శ/సమీక్షని మరో పత్రికవారు అనుమతిస్తారని మీరెలా భావించారు.ఆంధ్రభూమిలో రాసేందుకు మీకు శాస్త్రిగారు అనుమతి ఇవ్వలేదా?
  నా అభిప్రాయాన్ని నేను ముఖతహా ఆయనకూ తెలిపాను. ఆయన సహృదయంతో తన వాదనను వినిపించారు కూడా!

  గమనిస్తే, ఆ వ్యాసంలోనే నేను, నీఅభిప్రాయంతో ఏకీభవించకున్నా, నీ అభిప్రాయాన్ని వ్యక్త పరచే హక్కుకోసం పోరాడతాను అన్న వోల్టెయిర్ ఆలోచనను పొందు పరచాను కూడా. అంటే విడిగా వివరించే అవసరం లేదను కుంటాను.

  మన మహాత్ముడు గురించి నేను రాయటంలో కూడా ఇదే లక్ష్యం వుంది. రక్ష నిరసనకూ, నా సాహిత్య పరమయిన భేదాభిప్రాయ వ్యక్తీకరణకూ తేదా గమనించాలని ప్రార్ధన.
  – గమనించాను.కానీ అందరూ మనలాగా సున్నితంగా ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు?

  ఇక నేను హేతువాదులకు సూచించిన కార్యప్రణాళిక నేను నా నవల కథలు, వ్యాసాల ద్వార నా వంతు చేస్తూనే ఉన్నాను. మీరు నా అసిధార, అంతర్మధనం , ఇది నాహృదయం వంటి నవలలు చదివితే సినిమాల ద్వారా యువతకు అందే ప్రేమకూ, అసలయిన ప్రేమకూ వున్న తేడాలు వివరించాను. భారతీయ వ్యక్తిత్వవికాసం అనే పుస్తకంలో సినిమాలూ-ప్రేమలపయిన ఒక అధ్యాయమే వుంది. నా కథలు వీచికలు-మరీచికలు ఇంకా అనేక కథలలొ ఈ అంశాలే కేంద్ర బిందువు. నా రచనలు మీరు చదవలేదు కదా.
  —నిజమే మీ బ్లాగులు తప్ప మీరచనలు చదవలేదు.అవకాశమొస్తే వదలను

  వీలయితే రేపటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం, వొచ్చేవారమూ అంధ్రప్రభ చూడండి ఇలాంటి రాతలే కనిపిస్తాయి.
  – మాయింటి దగ్గర కిళ్ళీషాపు వాడికి అంధ్రప్రభ ఒక్క కాపీయే వస్తుందంటున్నాడు,నేనెళ్ళేసరికి అవి అయిపోతున్నాయి.ఆన్ లైన్ లో చూసా కానీ దొరకలేదు.

  మీ బ్లాగు కాబట్టి ఇంతగా రాసాను.
  నిన్నటి డెక్కన్ క్రానికల్ లో చూసుంటారు,బాణామతి,చేతబడి పేరిట ఇంకా జరుగుతున్న హత్యల్లో కరీంనగరం మొదటిస్థానంలో ఉందని.సుమారు నలభై హత్యలు ఆ ఒక్క కారణం గా జరిగాయని.
  ఇలాంటి చెత్త సినిమాలను నిషేధించమని కోరే సంఘాలవల్లన్నా కాస్త సమాజానికి మేలు జరుగుతుందేమో గానీ ఈ సినిమాలవల్ల కలిగే పరోక్ష హాని మాత్రం చాలా ఎక్కువని నా నమ్మకం.
  ఇంతకీ మీరా సినిమా చూసారా?

Leave a Reply