నాకాళ్ళు భూమి మీద నిలవటం లేదు; నూజివీడు సభ విశేషాలు.

ఆజ్ కల్ పావ్ జమీ పర్ నహి పడ్తే మేరా… అని ఒక హిందీ పాట వుంది. నూజివీడులో అది నా అనుభవానికి వచ్చింది.

నూజివీడు సభకు వెళ్ళే ప్రయాణం ఆరంభమే కష్టాలతో ఆరంభమయింది.
నూజివీడుకు తిన్నగా వెళ్ళే రైలు లేదు కాబట్టి విజయవాడలో దిగి బస్సులో వెళ్ళాలి లేకపోతే, తిన్నగా వెళ్ళే బస్సులో వెళ్ళాలని సలహా ఇచ్చారు. విజయవాడలో దిగి బస్ స్టేషన్ వెళ్ళి బస్సుపట్టుకుని వెళ్ళేకంటే డైరెక్ట్ బస్సులో వెళ్ళాలనుకున్నాను. ఇంతలో బస్సులన్నీ ఆపుతామని ప్రకటించటంతో చివరి క్షణంలో రైల్లో టికెట్ బుక్ చేసుకున్నాను. ప్రయాణాలకెవ్వరూ ఇష్టపడకపోవటంతో టికెట్ సులభంగానే దొరికింది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఒక పూట వుండాలనుకున్నాను. కానీ 23 నుంచీ రైళ్ళూ బందనటంతో విజయవాడలో వుండాలన్న ఆలోచన వదలుకుని 22 రాత్రికే తిరుగు ప్రయాణం బుక్ చేసుకున్నాను.
తీరా ఆరోజు రాత్రి నర్సాపూర్ రైలు పట్టుకోవటానికి బయలు దేరి మా ఇంటినుంచి ఒక నాలుగు కిలోమీటర్లు దూరం రాగానే బండి ఆగిపోయింది. ఎంతగా తన్నినా అది కదలలేదు. తుస్సుమని నిట్టూరుస్తోంది తప్ప బుర్రుమని గర్జించటంలేదు. అప్పటికే తొమ్మిదయింది. దాంతో ఇక బండిని ఎక్కడయినా వుంచి ఆటో ఏదయినా దొరికితే పట్తుకుని స్టేషన్ చేరాలనుకున్నా,. బస్సులు నడవటంలేదు. దాంతో ఆటోవాళ్లు 300కు తగ్గటంలేదు. దాంతో బండిని దగ్గరలోనే వున్న ఒక కార్పొరేట్ అస్పత్రి ఎదుట వుంచి, పక్కింటాయనకు ఫోను చేసి ప్రిస్థితి వివరించి నన్ను స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళమని అడిగాను. ఆయన వస్తానన్నాడు.
ఇంతలో ఒక కాబ్ వాడు నా బ్యాగు చూసి ఆగి, పాట్నీ, అనండు. నేను స్టేషన్ అన్నాను. పాట్నీ అనేసి వచ్చిన వారిని ఎక్కించుకుని పోయాడు. ఇంతలో మరో కాబ్ వాడు వచ్చి పాట్నీ అని, సంగీత్ దగ్గర దింపేందుకు ఒప్పుకున్నాడు. ఇంతలో వారణాసి నాగలక్ష్మి గారినుంచి ఫోను వచ్చింది. ఆవిడ బస్సులో బుక్ చేసుకున్నారట, బస్సులు నడవటం లేదు కాబట్టి రాలేనన్నారు.
నేను మా పక్కింటాయనకు రావద్దని ఫోన్లో చెప్పి కాబ్ లో బయలు దేరాను. బస్సులు లేకపోవటంతో రోడ్లు ఖాళీగా వున్నాయి. దాంతో 9-30 కల్ల్ల్లా స్టేషన్ చేరాం.
అలా, ఆరంభమే ఒక ఇబ్బందితో నూజివీడు ప్రయాణం ఆరంభమయింది.
విజయవాడ చేరి స్నేహితుడి ఇంట్లో కాస్సేపు గడిపి ఎనిమిదికల్లా నూజివీడు ప్రయాణమయ్యాను.
నూజివీడులో ర్చయిత యం వేంకటేశ్వర రావు బంధువు ఇంట్లో వున్నాను. యం వేంకటేశ్వర రావు కూడా ఈ సభ కోసం వచ్చాడు.
సభ నిర్వాహకులు నాకోసం అకామిడేషన్ సిద్ధంగా వుందంటారు కానీ ఎంత్కూ చూపక పోవటంతో నేను తోటి రచయిత బంధువు ఇంట్లో వుండాల్సి వచ్చింది. ఒకవేళ నేను వారి మాట నమ్మి విజయవాడ నుంచి తిన్నగా నూజివీడు వచ్చినా, యం వేంకటేశ్వర రావు కలవకున్నా, పెద్ద మనసుతో వాళ్ళ బంధువు ఇంట్లో వుండమని అనకున్నా నేను నూజివీడులో హోటెళ్ళు వెతుక్కోవాల్సి వచ్చేది, లేకపోతే నిర్వాహకులు దయతలచి గది ఏదో చూపేవరకూ పాచి మొహంతో అలాగే కూచోవాల్సి వచ్చేది.
సభ ఆరంభమయింది.

మండలి బుద్ధ ప్రసాద్, శలాక రఘునాథ శర్మ వంటి వారు ప్రసంగించిన తరువాత పత్ర సమర్పణ ఆరంభమయింది. నాకు సభలలో ఉపన్యాసాలు వినటాం ఒక శిక్ష లాంటిది. ఎంతో బాగా వుంటే తప్పించి నేను కూచోలేను. అలాంటిది ఇక్కడకు వచ్చిందే ఉపన్యాసాలు వినటానికి. పైగా వేరే పనిలేదు. నచ్చకపోతే పోయి పడుకోటానికి స్థలం లేదు. దీనికి తోడు అందరూ తమ పత్రాలను చదువుతున్నారు. అది మరీ విసుగు కలిగించింది. దాంతో హాలు బయటకు వెళ్ళి గడ్డిలో పడుకుని  ఆకాశాన్ని చూస్తూ మైకులో వినిపిస్తున్న పత్ర పఠనాన్ని వింటూ హాయిగా గడిపాను.
ఇంద్రగంటి జానకీబాల గారు మరుసటి రోజు వస్తాననటంతో నేనూ పత్ర సమర్పణ తరువాత రోజు చేస్తానని చెప్పాను. ఎందుకంటే పత్ర సమర్పణ అయితే ఇక అక్కడ వుండటానికి కారణం వుండదు. మానవ సంబం,ధాల గురించి మాట్లాడాలని వచ్చినవారు తమ పత్రాలు చదివేసి పేపర్లు జేబులో కుక్కుకుని వెళ్ళిపోతున్నారు.

ఇదంతా చూసిన నేను నిర్వాహకుల దగ్గర నా నిరసనను తెలిపాను. అంత దూరం నుంచి వచ్చింది పేపరు చదివేసి వెళ్ళటానికి కాదు. ఒకరికొకరికి పరిచయం అవటం లేదు. అందరూ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. కాబట్టి పేపరు చదవటం బదులు వివరణ ఇస్తే దానిలో సందేహాలు అడుగుతూ ఆసక్తి కరంగా చర్చ నిర్వహించవచ్చని చెప్పాను. అదీకాక, అక్కడ మా గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి కనీసం పరిచయం చేస్తేనయినా బాగుంటుందని అన్నాను. ఎందుకంటే అక్కడున్న వారిలో కథా రచయితలము మేమే కాబట్టి కథా సృజన గురించి వారితో చర్చిస్తే బాగుంటుందని సూచించాను.
ఆరోజు రాత్రి వేంకటేశ్వరరావు, అతని బంధువు మారుతిలతో వారింట్లో జరిగిన చర్చ ఎంతో ఆసక్తి కరంగా, సంతృప్తిగా అనిపించింది.

మరుసటి రోజు జానకీబాల గారితో, పెద్దిభొట్ల సుబ్బిరామయ్య గారితో పరిచయం జరిగింది. జానకీబాల గారు నా రచనలు చదివానన్నారు. కానీ, పెద్దిభొట్ల గారు నా పేరూ ఎక్కడా వినలేదన్నారు. అయితే మీరు పత్రికలు చూడటంలేదన్నమాట అన్నాను. నా దగ్గర వున్న పుస్తకాలిచ్చాను. ఇకపై నా పేరు తెలియదన్నా, పుస్తకాలు చూడలేదన్నా వొప్పుకోనని చెప్పాను. కానీ, ప్రస్తుతం వస్తున్న కథలు, రచనలు చదవకుండా   ఎలా సాహిత్యం పాడయిపోతోందని తీర్మానిస్తారో అనిపించింది.

ఆరోజూ పత్ర సమర్పణలు జరిగాయి. అయితే ముగింపు సభకన్నా ఒక గంట ముందు కథా రచయితలతో గోష్టి అన్నారు. పెద్దిభొట్ల గారు, జానకీబాల గారు, వేంకటేశ్వర్ రావు లతో నన్నూ స్టేజి మీద కూచో బెట్టారు. మాత్లాడండి అన్నారు.
మిగతాది రేపు……

Enter Your Mail Address

September 25, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply