నూజివీడు సభ విశేషాలు-2

కథకులమయిన నేను, పెద్దిభొట్ల, జానకీబాల, యం వేంకటేశ్వర రావులము స్టేజీ మీదకు ఎక్కటంతోటే ఇంతవరకూ జరిగిన సభ స్వరూపం మారిపోయింది.
పెద్దిభొట్ల గారు కథా రచనలో తన అనుభవాలను వివరించారు. వివరిస్తూ తాను ఎంతో కష్టపడతానన్నారు కథ రాస్తూ. అంతే కాదు రచయితలు ఎంతో కష్టపడుతూ కథలు రాస్తారన్నారు.
ఇంద్రగంటి జానకీబాల గారు మాట్లాడుతూ తాను శ్రీకాంత శర్మ గారి నీడ నుంచి వెలుపలకు వచ్చేందుకు పడ్డ కష్టాలను వివరించారు. తాను ఆయన భార్యగా సాహిత్య రంగంలో ఎదుర్కొంటున్న అపోహలను వివరించారు. అలా వివరిస్తూ కథలు రాసి సమాజాన్ని మార్చాలనుకోవటం అపోహ అనీ, కథల వల్ల ప్రయోజనం వుండదన్నట్టు అన్నారు.
ఆతరువాత నా వంతు వచ్చింది.
నేను మొదటగా సభలోని ఒక వైచిత్రిని చూపాను.
సాధారణంగా రచయిత కథ రాసిన తరువాత పరిశోధకుల పని ఆరంభమవుతుంది. వారు ఆ కథను విమర్శిస్తారు. విశ్లేషిస్తారు. పరిశోధిస్తారు. ఇందుకు భిన్నంగా ఆ సభలో పరిశోధకుల పని అయిపోయిన తరువాత కథకుల పని మొదలయింది.
ఆ తరువాత నేను రచయితకు అహంకారం వుండాలని అది వుంటేనే తానేదో ఎవరికీ తెలియని విషయలు చెప్పగలననీ, అవి రాసి అందరినీ చదివించగలనని రచనలు చేస్తాడని చెప్పి ఆ అహంకారంతోనే నేను నాకు  సీనియర్ రచయితలు చెప్పిన విషయాలతో విభేదిస్తున్నానని చెప్పాను.
నేను కథలు కష్టపడి కాదు ఇష్టపడి రాస్తానని చెప్పాను. రచయితను కథ రాయమని ఎవ్వరూ బ్రతిమిలాడరు. అతనిలో కలిగిన ఒక సంచలనాన్ని అక్షర రూపంలో వ్యక్త పరిస్తేకానీ నిలవలేని స్థితిలో రచయిత రచిస్తాడు. కాబట్టి రచయిత స్వచ్చందంగా రచిస్తాడు తప్ప దానికోసం కష్టపడితే అది రచయిత వ్యక్తిగత వ్యవహారం కానీ పాఠకులకు దాంతో సంబంధంలేదని చెప్పాను.
అలాగే, కథ ప్రభావం సమాజంపై వుండదనటాన్ని నేను ఒప్పుకోనని చెప్తూ, సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలను ఉదాహరించాను. ముఖ్యంగా వేదాలు, రామాయణ భారత భాగవతాలు, శతకాల ఆధారంగా నిలుస్తున్న సమాజంలో రచనల ప్రభావం లేదనటం అర్ధరహితమని అన్నాను.

ఆతరువాత విమర్శకుల బాధ్యత. రచయితల పరిస్థితి, ప్రస్తుత సాహిత్య ప్రపంచంలోని మాఫియా ముఠాలు, రంగుటద్దల విమర్శకులవల్ల ఏర్పడిన పరిస్థితులను వివరించాను. దెవషాలు వెదజల్లి, నిరాశ కలిగించే కథలకు పెద్దపీ ట వేయటాన్ని వివరించాను. వున్నదున్నట్టు రాసినా. అలా రాసి సమాజాన్ని ప్రతిబింబిస్తున్నానని సమర్ధించుకున్నా అది పొరపాటని, వున్నదున్నట్టు రాస్తే అది వార్త అవుతుంది తప్ప కథకాదని కథా రచయిత ద్రష్టలా వ్యవహరించాలనీ సోదాహరణంగా వివరించాను. ఆపై వారణసి నాగలక్ష్మి కథల విశ్లేషనను వినిపించాను.
నా ఉపన్యాసమయిన తరువాత హాలులో నా పైన అభిమానం వెల్లువయింది.
నా తరువాత యం వెమకటేశ్వరరావు కాలేజీతో, ఎంవీయల్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
సభ అయిన తరువాత స్టేజీ దిగగానే అందరూ చుట్టుముట్టారు. అప్పుడు జరిగింది నా కాళ్ళు భూమి మీద నిలనివ్వని సంఘటన.
ఈ సమావేశాలకు వెళ్ళినప్పటినుంచీ ఎవరో ఒకరు నన్ను వెతుక్కుంటూ వచ్చి కలసి నా పుస్తకాలు చదివామని వాటిగురించి చర్చిస్తూ వచ్చారు. ఒక అధ్యాపకుడు భారతీయ వ్యక్తిత్వ వికసం ఆధారంగా రీసెర్చ్ చేస్తానని సలహా అడిగాడు. మరో ఉపాధ్యాయుడు శ్రీకృష్ణదేవరాయలగురించి చర్చించాడు. ఇంకో అధ్యాపకుడు సౌశీల్య ద్రౌపది గురించి సందేహాలు తీర్చుకున్నాడు. ఒక అధ్యాపకురాలు నా అంతర్మథనం నవల చదివి దాచుకుందని, దాన్ని యువత భగవద్గీతలా చదవాలని తాననుకుంటున్నదనీ చెప్పింది. కానీ, నేను ఇంకో పది సంవత్సరాల తరువత వస్తుందనుకుంటున్న పొగడ్త నాకు అప్పుడే అక్కడే లభించింది.
ఆ కాలేజీకి చెందిన విశ్రాంతాచార్యులు అత్తిలి వేంకట రమణ సభ అయినతరువాత నా భుజం మీద చేయివేసి అన్నారు. నీ ఉపన్యాసం వింటూంటే పాత కాలం నాటి సాహిత్య సభలు గుర్తుకు వచ్చాయి. నిర్దిష్టమయిన అభిప్రాయాలతో స్పష్టమయిన అవగాహనతో మాట్లాడే ఆ కాలం గుర్తుకువచ్చింది. కళ్ళు మూసుకుంటే విశ్వనాథ సత్యనారాయణ ఉపన్యసం వింటున్న అనుభూతి కలిగింది. ఆ స్పష్టత, నిక్కచ్చితనం, భారతీయత పత్ల గౌరవం అభిమానం నీలో కనిపిస్తున్నాయి అన్నారు.
ధన్యుడను. ఇలాంటి కాంప్లిమెంటు ఇంకో పదేళ్ళ తరువాత వస్తుందనుకున్నాను. కానీ, అందరూ అభిమానించే ఆయన, నాకు ఏమాత్రం పరిచయంలేని ఆయన, అలా అనటం, అన్నతరువాత నా కాళ్ళు భూమిమీద వుంటాయా………

Enter Your Mail Address

September 26, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

  1. కొత్త పాళీ - September 27, 2011

    మళ్ళీ మళ్ళీ నెమరువేసుకోదగిన అనుభవాల్ని మీకు ఈ సభ కలిగించినందుకు చాలా సంతోషం.
    నిజమే, రచయితకి ఆ మాత్రం “ఇది” ఉండాలి.

Leave a Reply