హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుందా?

సాధారణంగా సినిమాలు తీసేవారు రిస్కు తీసుకోటానికి ఇష్ట పడరు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఒక్క సారి నష్టం వస్తే దాదాపుగా దివాళా తీయటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే నష్టం పూడ్చుకోవాలన్నా ఇంకో సినిమా తీయటం తప్ప మరో దారి లేదు.

ఇటీవలే ఒక నిర్మాతను కలవటం తటస్థించింది. ఆయన చాలా మంచి సినిమాలు నిర్మించాడు ఒకప్పుడు. మాటల సందర్భంలో ఆయన సినిమాలు తీయటం ఎందుకు మానేశాడో చెప్పాడు.

హిట్ సినిమాలు నిర్మిస్తూ ఆయనకు ఒక సినిమా గురించిన ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనను ఒక ప్రఖ్యాత దర్శకుడికి చెప్తే, ఆయన ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడట. మొత్తం బాధ్యత అతడికి అప్పగించి నిర్మాత ఊరుకున్నాడు. ఎందుకంటే అతడు పేరున్న దర్శకుడు. అనవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు.

అయితే, షూటింగ్ జరుగుతూంటే, ఆయన దగ్గరకు అనేకులు వచ్చి సినిమా దారి తప్పుతోందని చెప్తూ వచ్చారట. కానీ దర్శకుడు పెద్దవాడు. మధ్యలో జోక్యం చేసుకుంటే బావుండదు. అందుకని నిర్మాత ఓపిక పట్టాడు. సినిమా రషెస్ చూస్తూంటేనే అది నడవదని అర్ధమయిపోయింది. కానీ ముందుకు తప్ప వెనక్కు వెళ్ళలేని పరిస్థితి. దాంతో, మొండిగా సినిమా పూర్తిచేసి, విడుదల చేశాడు. అనుకున్నట్టే ఘోరంగా దెబ్బతింది సినిమా. ఆ కాలంలో 50 లక్షలపైగా నష్టం వచ్చింది.

రెండు మూడేళ్ళలో 50 లక్షల నష్టం పూడ్చుకోవాలంటే, మరో 50 లక్షలు అప్పు తెచ్చి సినిమా తీయాలి. ఇంత తక్కువ సమయంలో అంతగా సంపాదించాలంటే అదొక్కటే మార్గం. కానీ, సినిమా నడవకపోతే, నష్టం కోటి దాటుతుంది. ఆయన సందేహంలో పడ్డాడు.

అప్పుడు ఆయన శ్రేయోభిలాషులు, ఓ మాంచి మసాల సినిమా తీయండి. మినిమం గారంటీ వుంటుందని అన్నారు. ఆయనకు అలవాటయినట్టు సినిమా తీస్తే నడవదన్నారు. అసలే దెబ్బ తినివున్నారు, మళ్ళీ రిస్కెందుకన్నారు. వాళ్ళా మాటలకాయన లొంగాడు. అప్పు చేసి మసాలా సినిమా తీశాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. అంత కాలం మంచి సినిమాలు నిర్మించిన పేరు పోయింది. మళ్ళీ సినిమా పేరెతాలేదు. ఆస్తులమ్మి అప్పులు తీర్చి, మూటా ముల్లె సర్దుకుని కూతురి ఇలు చేరుకున్నాడు. జీవితం గడిపేస్తున్నాడు.

అతని కథ విన్న తరువాత ఒక అనుమానం వస్తుంది. మసాలా సినిమాలు మనకు విజయానికి రహదార్లు. కానీ, ప్రతి మసాల సిన్మా హిట్ అవదు. అలా అయితే, ప్రతి సినిమా సూపెర్ హిట్ అవ్వాలి. ప్రతివారూ మసాలాలే తీస్తారు. కాబట్టి మసాలా సినిమాలే హిట్ అవుతాయని, ఒక ఫార్మూలా ప్రకారం తీస్తే హిట్ తప్పదని, అందుకు భిన్నంగా తీస్తే నడవవని అనుకోవటం కుదరదు.

ఒక సంస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. చివరి ప్రయత్నంగా వారు సినిమా తీయాలనుకున్నారు. మంచి కథ ఎన్నుకున్నారు. కళాకారులను ఎన్నుకున్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఉత్తమంగా నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. తరతరాలుగా వారికి ఎనలేని కీతిని సంపాదించిపెట్టింది. అది బైజూ బావ్రా అనే సినిమా!

రాజ్ కపూర్ ఎంత గొప్ప కళాకారుడో అంత తెలివయిన వ్యాపారి. దొంగలమనసుమారే అమ్షంతో హిట్ సినిమా తీసిన వ్యక్తి.( జిస్ దేష్ మె గంగా బహతీహై) అలాంటి వాడు మనస్ఫూర్తిగా ఉన్నదంతా ఖర్చుపెట్టి ఒక సినిమా తీసాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. మేరా నాం జోకర్ ఇప్పుడు క్లాసిక్ కాని విడుదలయినప్పుడు ఘోరంగా విఫలమయింది. దాంతో రాజ్ కపూర్ పూర్తిగా నష్ట పోయాడు. అయిదేళ్ళవరకూ తేరుకోలేదు. ఇప్పుడు హిట్ సినిమా తీయకపోతే కుదరదు. దాంతో ప్రేమ ఫార్మూలాపై పడ్డాడు. గ్రాడ్యుయేట్ అనే ఆంగ్ల సినిమాను భారతీయీకరణం చేసి బాబీ అన్నాడు. దాంతో భారతీయ సినిమాలలో నిక్కర్ల ప్రేమ అధ్యాయం మొదలయింది. అంత గొప్ప హిట్ అది.

బోనీ కపూర్ హిట్ సినిమాలు నిర్మించాడు. మరో హిట్ సినిమాను సంకల్పించాడు. అనిల్ కపూర్, శ్రీదేవిలు నాయికా నాయకులు. లక్ష్మి ప్యారె సంగీతం. ప్రతీకారాలు, మోసాలు, ఎత్తుకు పైఎత్తులు, పాటలు, యుద్ధాలు మొత్తం మాల్ మసాలాలన్ని నింపాడు. అడుగడుగునా మసాలాను దట్టించాడు. రూప్ కీ రానీ చోరోంకా రాజా ఎంత ఘోరంగా దెబ్బ తిన్నదంటే, ఆయన ఇంకా తేరుకోలేదు.

మూస సినిమాలకు భిన్నంగా విశ్వనాథ్, అన్ని వ్యాపరాల సలహాలను కాదని శంకరాభరణం నిర్మించాడు. అప్పుడు వస్తున్న సినిమాలకు పూర్తిగా భిన్నంగా, హీరోను మాఫియా లాంటివాడిని చేసి రాం గోపాల్ వర్మ శివ తో సినిమాల స్వరూపాన్నే మార్చాడు.  నాగేష్ కుకునూర్ తక్కువ బడ్జెట్ తో పెద్ద హిట్ హైదెరాబాద్ బ్లూస్ సాధించాడు. అస్సలు విలన్లు, యుద్ధాలు లేకుండా ఒక పెళ్ళి వీడియోలాంటి హం ఆప్కే హై కౌన్ ఘన విజయం సాధించింది. కమర్షియల్ సినిమా పరిథిలో వున్నా మూస సినిమాలకు భిన్న మయిన తారే జమీన్ పర్ సూపెర్ డూపెర్ హిట్.

వెస్టెర్న్ సినిమాలు అలవాటు లేని మనం అటు షోలే నూ ఇటు మోసగాళ్ళకు మోసగాడునూ ఆదరించాం. ఇలా చూస్తూ పోతే, హిట్ ఫార్మూల నిజంగా హిట్ ఫార్మూలా కాదని, కష్టపడి ఆలోచించి స్వయంగా సినిమా నిర్మించటం తప్పించుకునే బద్ధకానికి మారు పేరనీ అర్ధమవుతుంది.

నిజంగా హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుంటే, అది హిట్ ఫార్మూలా అంటూ ఏదీ లేదన్నదే. ఇంకొన్ని విజయవంతమయిన సినిమాలను పరిషీలిస్తే, ఈ హిట్ ఫార్మూలా అపోహ ఎలా వచ్చిందో అర్ధమవుతుంది.

Enter Your Mail Address

October 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

No Responses

  1. కె.మహేష్ కుమార్ - October 25, 2008

    నా ఉద్దేశంలో హిట్ సినిమాలుతప్ప, హిట్ ఫార్ములాలు లేవు. ఈ ఫార్ములాలే నిజమైతే, ప్రతి హిట్టైన సినిమాకీ అదే మూస(ఫార్ములా)తోవచ్చిన వంద ఫ్లాప్ సినిమాలు మనదగ్గర ఉండేవేకాదు. మనం తీసే సినిమా మీద నమ్మకం, conviction అవసరం. దానికితగ్గ నేర్పు, నైపుణ్యం వుంటే హిట్ దానంతట అదే వస్తుంది..ఫార్నులా దానంతటాదే పుడుతుంది..మారుతుంది.

    రాజకపూర్ ‘బాబీ’ , ‘గ్రాడ్యుయేట్’ ఆధారంగా తీసింది కాదనుకుంటాను. ఒకసారి గమనించగలరు.

  2. కస్తూరి మురళీకృష్ణ - October 25, 2008

    మహేష్ కుమార్ గారూ, రాజ్ కపూర్ గొప్ప తనమేమిటంటే, ఆయన ఏ సినిమాని చూసి స్ఫూర్తి పొందాడో దాన్ని ఖచ్చితంగా చెప్పటం కుదరదు. ఎందుకంటే, అనేక రకాల ప్రేరణల కలగలుపు ఆయన సినిమాలు. రాజ్ కపూర్ చార్లీ చాప్లిన్ ప్రభావంతో తన ఇమేజీని తీర్చి దిద్దుకున్నా, చాప్లిన్ కూ రాజ్ కపూర్ కూ కొన్ని విషయాలలో తప్ప మిగతా అంతా తనదంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. సంగం సినిమా, అందాజ్ అనే సినిమా నుంచి వచ్చింది. అందాజ్ లోని సామాజిక సందేశం లేకుండా, కాస్త డ్రమటైజ్ చేస్తే సంగం తయారవుతుంది. అలాగే, చాప్లిన్ లైం లైట్ ను తిరగేసి, వుతికి ఆరేస్తే, మేరా నాం జోకర్ తయారవుతుంది. ఒక కళాకారుడు, తన పునర్వైభవాన్ని గుర్తుచేసుకోవటమనేది కేంద్ర బిందువు. దాని చుట్టూ రాజ్ కపూర్ కథ అల్లుకున్నాడు. చాప్లిన్ సినిమా కూడా పరాజయం పొంది తరువాత క్లాసిక్ గా పరిగణనకు రావటం గమనార్హం.అలాగే, మేరా నాం జోకర్ తౌవాత తప్పని సరిగా హిట్ తీయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు అబ్బాస్ కు ఆ కాలంలో వివాదాస్పదమూ, విజయవంతమూ అయిన గ్రాడ్యుయేట్ ను భారతీయీకరణం చేయాలనుకున్నారు. ఫలితంగా బాబీ రూపొందిందింది. యువకుడు ఎక్కువ వయసు ఆవిడతో సెక్స్ చేసి, ఆవిడ కూతురిని ప్రేమిస్తే మనవారు అప్పుడేమిటి, ఇప్పుడూ ఒప్పుకోరు. కాబట్టి, నాయిక యువతిని అలానేవుంచి, అరుణా ఇరానీ పాత్రను నాయకుడిని రెచ్చగొట్టేందుకు వాడుకున్నారు. రిషి పుట్టిన రోజు సందర్భమూ, గ్రాడ్యుయేట్ లో పరీక్ష పాసయిన పార్టీ సందర్భాలలో పోలికలు గమనించండి. అలాగే. గ్రాడ్యుయేట్ లో నాయికా, నాయకుల ప్రేమ సన్నివేశాలు, స్విమ్మింగ్ పూల్ రొమాన్సులు, చివరికి పారిపోవటాలూ గమనించండి. ఎంత తెలివిగా సినిమా భారతీయీకరణం జరిగిందో అర్ధమవుతుంది. పెద్దల పగలు, అంతస్థులు తేడాలూ ఇవన్నీ మన వాతావరణం. అంత చిన్న వయసులో ప్రేమలు, రొమాన్సు వారి వాతావరణం. వెరసి, సంకరం మన వాతావరణం. మీకింకో విషయం తెలుసనుకుంటాను. బర్సాత్ నిర్మాణ సమయంలో రాజ్ కపూర్ ఒక అర్జెంటీనా జానపద బాణీ విన్నాడు. అది అతనికి నచ్చి శంకర్-జైకిషన్ లకు ఇచ్చాడు. అది వారి సిగ్నేచర్ బాణీ లా మారింది. బర్సాత్ లో పడవలో రాజ్ వయోలిన్ పైన వాయించే సంగీతం అదే. అదే సినిమాలో చోడ్ గయే బాలం ఇంటెర్ల్యూడ్ సంగీతం అదే. జానే కహా గయే వొ దిన్, జీనా యహా మర్నా యహా పాటలలోనూ అదే బాణీ. చివరికి బాబీలోకూడా దాన్ని వినవచ్చు. కళాకారుడికి ఏదో చిన్న విషయం ప్రేరణనిస్తుంది. అది అతడి సృజనాత్మక సరస్సులో స్నానమాడి ఊహకందనై రూపాలను ధరిస్తుంది. అందుకే ప్రతిభావంతులది ప్రేరణ. చేతకాని వారిది కాపీ.

Leave a Reply