విశ్వనాథ సాహిత్య పరిచయం-నాందీ ప్రస్తావన.

విశ్వనాథ సత్యనారయణ గారి సాహిత్యాన్ని పరిచయం చేయాలన్న ఆలోచన ఎప్పటినుంచో వుంది. ఆయన సాహిత్యంపైన ఎవరయినా విమర్శనాస్త్రాలు సంధించినా, ఆయన పైన దూషణబాణాలు విసిరినా, ఆయన సాహిత్యాన్ని దుర్వ్యాఖ్యానంతో తీసిపారేస్తూన్నా, ఆయన సాహిత్యంలోని అర్ధాలను, పరమార్ధాలనూ, గూఢార్ధాలనూ , నిగూఢార్ధాలనూ వివరించాలన్న తీవ్ర తపన కలుగుతూండేది. ముఖ్యంగా, ఆయన సాహిత్యాన్ని చదవని వారు, ఆయన సాహిత్యం దరిదాపులకు కూడా వెళ్ళని వారు, కనీసం ఆయన పుస్తకన్ని ముట్టుకుని కూడా చూడని వారు సైతం, వారూ వీరూ అన్న మాటలను ప్రామాణికంగా తీసుకుని తెలిసీ తెలియక ఒక మహా సాగరంలాంటి సాహిత్యాన్ని తీసిపారేస్తూంటే వీరందరికీ విశ్వనాథ సాహిత్య సాగరంలోని అధ్బుతమయిన విషేషాలను వివరించాలన్న తపన కలుగుతూండేది.

మనకు మంచి తెలిస్తే పది మందితో పంచుకుంటే మంచి పెరుగుతుంది. అందుకని, విశ్వనాథ సాహిత్యాన్ని నేను అర్ధం చేసుకున్న రీతిలో ఇతరులకు చేరువ చేస్తూ, నేను గ్రహించిన మణిమాణిక్యాలు, అందుకున్న అమూల్యమయిన సంపదలను అందరితో పంచుకోవలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను.

ఈ విషయాన్ని ఒక వ్యాస పరంపరగా రాస్తానని ఏ పత్రికతో అన్నా ఏదో ఒక కారణం చెప్పి ఎత్తగొట్టేవారు. నిలదీసి అడిగితే, ఆయన సాహిత్యంలో ఇప్పటి తరానికేముంది అని తమ అఙ్నానాన్ని ప్రదర్శించుకున్నారు. కొందరు, ఆయన్ సాహిత్యాన్ని పరిచయటం చేయటం మతానికి సంబంధించింది, వొద్దులెండి అని తమ లౌకికతను చాటుకునేవారు. ఆ చ్చాందసుడా, వొద్దొద్దు అని తమ భ్యుదయ ప్రోగ్రెస్సివ్ భావాలు చూపేవారు.

ఇలాంటి అనేక అనుభవాల వల్ల విసిగిపోయాను. ఇంతలో బ్లాగులు లభించటం వల్ల బ్లాగులో రాదామనుకున్నాను. పత్రికలలో వున్న పరిమితులు బ్లాగులో వుండవు. కానీ, అనెక కారణాల వల్ల ఆయన్ చిన్న కథల పరిచయం ఆరంభించి కొన సాగించలేకపోయాను.

చివరికి, ఇప్పుడు, అనేక కారణాల వల్ల, నేను పత్రికలలో కాలం లను స్వచ్చందంగా తగ్గించుకుంటున్నాను. కాబట్టి, నేను ఇష్టంగా చేయాలనుకుంటున్న పనులను బ్లాగు ద్వారా వెలువరించాలని నిశ్చయించాను. పత్రికలు ప్రచురించ నిరాకరించినవి, నాకు నచ్చినవి, బ్లాగు ద్వారా పాఠకులకు చేరువచేయాలన్న ప్రయత్నం ఆరంభించాను. అందులో భాగంగా, ఫేస్ బుక్ లో సాహిత్యకాగడా పేజీని ఆరంభించి, నిర్మొహమాటమయిన విమర్శలు చేస్తున్నాను. నా బ్లాగులో నేను ఎంతో కాలంగా అనుకుంటున్న విస్వనాథవారి సాహిత్యాన్ని పరిచయం చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాను.

నా జీవితంలో కీలకమయిన దశలో విశ్వనాథ సాహిత్యం నాకు పరిచయం అయింది. అది వ్యక్తిగతంగా నాకెంతో లాభించింది. ఇతరులు సందేహాలలో కొట్టుకుపోతున్న వేళ, నేను నిశ్చలంగా నిలవగలిగాను. విశ్వనాథ సాహిత్యంతో పరిచయం లేకపోవటం వల్ల్, సమాజము, యువ తరమూ, యువ రచయితలూ ఎంతగానో నష్టపోవటం చూస్తున్నాను. అందుకని, నేను అర్ధం చేసుకున్న విశ్వనాథను అందరితో పంచుకునే ప్రయత్నం ప్రారంభిస్తున్నాను.

విశ్వనాథ సాహిత్యం అనంతమయిన సాగరం. నేను పండితుడను కాను. కానీ, సృజనాత్మక రచయితగా, సున్నిత మనస్తత్వం కలవాడిగా, భావుకుడిగా, రొమాంటిక్ గా, దేశ భక్తుడిగా, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం, వారసత్వం, వాఙ వారసత్వం, వాఙయాలపైన అచంచలమయిన విశ్వాసం వున్నవాడిలా నాకు అర్ధమయిన విశ్వనాథను మీముందుంచుతున్నాను. స్వీకరించినా, తిరసరించినా….విశ్వనాథార్పణం

Enter Your Mail Address

September 10, 2013 · Kasturi Murali Krishna · 7 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

7 Responses

 1. G.S.Lakshmi - September 11, 2013

  ఎప్పుడో చదివిన విశ్వనాథవారి సాహిత్యాన్ని మళ్ళీ మీ పలుకులద్వారా ఙ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు..

 2. hari.S.babu - September 11, 2013

  very nice, I am waiting for the essays

 3. Sowmya - September 12, 2013

  ఇదివరలో మీరు ఆయన కథలపై విశ్లేషణ ప్రారంభించినప్పుడు ఆసక్తిగా తదుపరి భాగాల కోసం ఎదురుచూశాను. ఈసారి కొనసాగిస్తారని ఆశిస్తున్నాను :-)

 4. valaludu - September 16, 2013

  ఏదోక ఇ-పత్రికలో చేయవచ్చు కదా ఈ పరిచయం. సారంగ, ఈమాట, పుస్తకం.నెట్ వంటి చక్కటి పత్రికలున్నాయి. ఐతే బ్లాగులో రాసుకుంటే తప్పేమీ కాదు కానీ అటువంటి వేదికలపైనైతే మరింతమందికి చేరుతుంది కదా.

 5. Kasturi Murali Krishna - September 16, 2013

  వలలుడు గారూ

  మీరన్నపని చేయవచ్చు. కానీ, నెట్ పత్రికలకూ బయటి పత్రికలకూ పెద్ద తేడాలేదు. అక్కడివాళ్ళే ఇక్కడా వున్నారు. కొన్ని నెట్ పత్రికలయితే, తమకోసం, తమవారికోసమే వున్నాయి. వాటి గురించి మరోసారి. అదీగాక, నాకు కంప్యూటర్ లో తెలుగు టైప్ చేయటం కష్టం. చేతి రాత నేను చాలా వేగంగా రాస్తాను. ఏ పత్రిక అయితే నా చేతిరాతను వొప్పుకుంటాయో ఆ నెట్ పత్రికకే రాస్తున్నాను. అదీగాక, ఇది ఒక సిరీస్ లాగా రాయాల్సివుంటుంది. చాలా నెట్ పత్రికలు శీర్షికలిచ్చేందుకు సిద్ధంగా లేవు. నా టెరంస్ ప్రకారం రాయటం అలవాటయిన నేను ఇప్పుడు వేరేవారి నిబంధనలకు లోబడి రాయటం కన్నా, నా బ్లాగులో రాసుకోవటమే ఆనందంగా వుంది. మీ సందేహానికి సమాధానం వచ్చిందనుకుంటాను.

 6. Ravindranath Nalam - September 28, 2013

  “వీర వల్లడు ” చదువుతే ఆయన లో ఉన్న మానవీయ కోణం మనకు కనపడగలదు , విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువుతే వారి హాస్య చతురత తెలుసుకొగలమ్. ఆకాశవాణి లో వస్తున్న వేయి పడగలు వినండి ఆయన సంబాషణ ల లోని చమక్కులు తెలుస్తాయి.

  *

 7. Ravindranath Nalam - September 28, 2013

  విరహము కూడా మధురము కాదా?

Leave a Reply