విశ్వనాథ సాహిత్యం-3

విశ్వనాథ సాహిత్య సాగరంలో మునకలేసేముందు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఇతర రచయితలకూ, విశ్వనాథ రచనలకూ ఒక మౌలికమయిన తేడా వుంది. ఇతర రచయితలు తమ స్థాయిలో అతి సున్నితంగా రాస్తారు. అతి గొప్పగా భావ వ్యక్తీకరణ చేస్తారు. తమ చుట్టూ వున్న సమాజాన్నీ మనుషులనూ మనస్తత్వాలనూ ఎంతో గొప్పగా విశ్లేషిస్తారు. అనేక విషయాలను సూటిగా, నిర్భయంగా తమ రచనల్లో ప్రకటిస్తారు. కానీ, విశ్వనాథ వారిలా, ప్రతి చిన్న విషయాన్నీ లోలోతుల్లోకి వెళ్ళి విస్లేషించి, విమర్శించిన వారు అరుదు. అంతేకాదు, ప్రతి విషయాన్ని ఇతరుల్లా ఆయన సిద్ధాంత లోచనాలలోంచి చూడడు. అలా చూడాలనీ ప్రయత్నించడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ మట్టి, ఏ గాలి, ఈ జాతి, ఈ జాతి ఆత్మ దృష్టితో చూస్తాడు. అందుకే, విశ్వనాథ వారు సాహిత్యం అన్నది అసహజమయిన ప్రవృత్తిని వృద్ధి పొందించేదుకు రాయకూడదని నమ్మేరు. ఆయన రచనలన్నీ సహజమయిన కామకొరధాదులు సముద్దీపించటానికే సృజించినవి.

ఇక్కడ ఈ సహజ, అసహజ ప్రవృత్తులంటే ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అర్ధం చేసుకుంటే విస్వనాథ సాహిత్యాన్ని చూడాల్సిన దృష్టి అర్ధమవుతుంది.

సహజ ద్వేషమన్నది హృదయంలోఅంచి పుడుతుంది. ఒకడు మచ్చడు. వాదు చేసే పనులు నచ్చవు. పలు కారణాల వల్ల వాడంటే కోపం కలుగుతుంది. అది ద్వేషంలా పరిణామం చెందుతుంది. అలాగే ప్రేం కూదా. ఈ భావనల వల్ల సుఖం కలగవచ్చు. దుహ్ఖం కలగవచ్చు. ఇవన్నీ వ్యక్తిగత భావనలు. ఒక రచన చదువుతూంటే కూడా ఈ భావనలు కలుగుతాయి. ఇవి శరీరంపైన ప్రభావం చూపవు. అంటే ఆ రచన సహజ ప్రవృత్తిని ఉద్దీప్తం చేస్తున్నదన్నమాట.

ఇందుకు భిన్నంగా, అంటే వ్యక్తిగతమయిన భావనలకు భిన్నమయిన భావనలను కూడా సాహిత్యం కలిగ్స్తుంది. కానీ, అవి, అసహజమయిన భావనలు. ఇక్కడ వ్యక్తితో సంబంధం వుండదు. వ్యక్తినిమరచి ఒక సమూహాన్ని ద్వేషించే భావనలు కలిగించే అలాంటి సాహిత్యం అధికంగా సిద్ధాంతగతమయిన సాహిత్యం. అంటే, హృదయంలో జనించే సహజ భావనలకు భిన్నంగా మనస్సులో జనిస్తాయీభావనలు. అవి అసహజమయిన భావనలు. అలాంటి భావనలను కలిగించే రచనలను రచయితలు చేయకూడదన్నది విశ్వనాథ ప్రగాఢ విశ్వాసం. అంటే రచనకు జీవితము, ప్రపంచము ప్రేరణ అయినా, ఆ ప్రేరణ కు సిద్ధాంత లోచనాల దృష్టిని ఆపాదించకూడదన్నమాట రచయిత.

ఒక రచన చదువుతూంటే, నాయకుడి పైన ప్రేమ కలుగుతుంది. విలన్ పట్ల క్రోధం కలుగుతుంది. కానీ, ఈ ప్రేమకానీ, క్రోధం కానీ నవల పఠనం పూర్తవటంతో పూర్తయిపోతాయి. కానీ, సిద్ధాంతగత సాహిత్యం వల్ల జనించిన భావనలు పాత్రల పరిథి దాటి, సమాజంలోని వ్యక్తుల సమూహాలవైపు ప్రసరిస్తాయి. ఇలాంటి అసహజ ప్రవృత్తి ఉద్దీపితమవటం వల్ల సమాజంలో ద్వేష భావనలు ప్రజ్వరిల్లుతాయి. ఉద్విఙ్నతలు చెలరేగుతాయి. స్నేహ సౌభ్రాత్రుత్వ భావనలు దెబ్బతింటాయి. సమాజంలోని సమతౌల్యం దెబ్బతింటుంది. శాంతి, ప్రశాంతతలకు భంగం కలుగుతుంది. తద్వారా సమాజం బలహీనమవుతుంది. ఇది దేశానికి, సంస్కృతి సాంప్రదాయాలకు, దేశ మౌలిక అస్తిత్వానికి ప్రమాదకరం. కాబట్టి రచయితలు, ఆవేశపరుల్లా కాక, ఆలోచనలున్న విఙ్నాన వంతుల్లా, విచక్షణ వున్న వారిలా, ద్రష్టల్లా వ్యవహరించాల్సి వుంటుంది. రచయిత అలా వ్యవహరించక తాత్కాలిక ఆవేశాలకు లోనయి రచిస్తే, దాని దుష్ప్రభావం రచయిత పైనేకాదు, సమాజం పైన కూడా వుంటుంది. ఒక్కసారి ఇప్పుడొస్తున్న సాహిత్యం, దాన్ని సృజిస్తున్న రచయితల రంగుటద్దాలు, సమాజంలో అవి సృష్టిస్తున్న విభేదాలు, ఉద్విఙ్నతలను గమనిస్తే విశ్వనాథ ఆలోచనలలో లోతు, వాటిలోని సామంజస్యమూ స్పష్టమవుతాయి. ఇలా, ద్రష్టలా వ్యవహరించటం, విచక్షణతో రచనలను సృజించటం, భూత కాలం పట్ల గౌరవం, వర్తమానం పట్ల అవగాహన, భవిష్యత్తుపట్ల ఆలోచన వున్న ద్రష్టలాంటి భారతీయ రచయిత విశ్వనాథ సత్యనారాయణ.

ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న తరువాత విశ్వనాథ సాహిత్య సాగరంలో అడుగిడటం ఆరంభిద్దాము.

Enter Your Mail Address

October 12, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

Leave a Reply