సాహిత్యకాగడా మెచ్చిన 1949 నాటి పొలిటికల్లీ ఇన్ కరెక్టు కథ.

ఎప్పుడూ నిప్పు రవ్వలు వెదజల్లటమేనా? దారి చూపే దివ్వెగా కాగడా పనిచేయదా? అని ప్రశ్నిస్తూ వచ్చిన కాగడాభిమానుల సూచనను మన్నించి ఈవారం నుంచీ కాగడా మెచ్చిన, కాగడాకు నచ్చిన, సాహిత్య ప్రపంచం విస్మరించిన గొప్ప కథలను, కథకులను కాగడా వీలువెంబడి పరిచయం చేయాలని నిశ్చయించింది. అందుకిదే నాందీ ప్రస్తావన.

యువ కథకులేకాదు, తల పండిన కథకులు కూడా నోరిప్పితే గురజాడ, శ్రీపాద అంటారు. ఇంకా వెనక్కు వస్తే, కొకు, చలం, గోపి చంద్ అంటారు. ఇంకా వెనక్కు వస్తే, వోల్గా, కుప్పిలి పద్మ, కాశీభట్ల అంటారు. ఇంకింకా వెనక్కు వస్తే, ఇలాంటి పేర్లే వినిపిస్తాయి. నిన్న మొన్న కళ్ళు తెరచిన కథకులయితే, వెనక్కు చూడ కుండానే, తన కళ్ళెదుట వున్న, అనిల్ రాయలు, శివ సోమయాజులు, వేంపల్లె షరీఫ్ లాంటి పేర్లు చెప్పేసి తాము మెచ్చిన రచయితలు తప్ప మిగిలినవారంతా సోసో సాసా అంటారు.
ఇది ప్రస్తుతం ఏ రచయితను కదిపినా తెలుస్తుంది. తా వలచింది రంభ, తాను మునిగింది గంగ అని పెద్దలు ఊరకనే అనలేదు. ఎవరికి వారు కూటములుగా, ముఠాలుగా విడిపోయి విడిపోయి తమవారే గొప్ప అనుకోవటం వల్ల, వీరేర్పరచిన బాటలో తరువాత వారు గుడ్డిగా ప్రయాణించటం వల్ల, ఒకో తరానికి మనం ఎంతెంతో ముందుకు పోతున్నాము. ఇలా ముందుకు పోతూ, ఒకరిద్దరిని వెంట మోస్తూ, అనేకులను విస్మరిస్తున్నాము. దాని వల్ల, రాను రాను కొత్త తరాలకు గతం అన్నది తెలియని పరిస్థితి వస్తోంది. గతం గురించి తెలుసుకోవాలన్న తపన నశించి, తనకు తెలిసిన రెండు మూడు పేర్లే సర్వస్వం అని విర్రవీగటం, అది కాదన్న వాదిని పట్తించుకోక తమ మూర్ఖత్వంలో తాముండటం ఆనవాయితీగా మారుతోంది. ఇంకా యువ తరమయితే ఆ రెండు మూడు పేర్లూ వదలి, తమ స్నేహితులే అతి గొప్ప రచయితలు, వారి వెనకా ఎవరూ లేరు. ముందు వుండబోరన్నట్టు ప్రవర్తిస్తున్నాను.

కానీ, గతాన్ని విస్మరించిన ఏ జాతికీ భవిష్యత్తు లేనట్టు, తమ పూర్వీకుల సాహిత్యాన్ని విస్మరించిన ఏ సాహిత్యానికి కూడా భవిష్యత్తు వుండదు. తన పూర్వీకుల భుజాన నిలబడి మరింత ముందుకు చూడగలిగినది సాహిత్యమయినా, సమాజమయినా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది. ఇందుకు భిన్నంగా వర్తించ్స్తే, సాహిత్య మయినా, సమాజమయినా, యముని మహిషపు లోహ ఘంటల ఖణేల్, ఖణేళ్ళు వినాల్సివస్తుంది. గమనిస్తే, పాశ్చాత్య రచయితలు, వారు ఎలాంటి రచనలు చేసేవారయినా, తమ పూర్వీకుల సాహిత్యం గురించి ఖ్షుణ్ణంగా తెలిసిన వారయి వుంటారు. మన తెలుగు సాహిత్యకారులు, వారు పండితులయినా, ప్రొఫెస్సర్లయినా, ఈ విషయంలో తమ కంటి ముందు 15 సెంటీమీటర్ల దూరం కూడా చూడలేని హ్రస్వ దృష్టులే.

తెలుగు సాహిత్యంలో పొలిటికల్లీ కరెక్టు కథలే ఎందుకు రాస్తారో, అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుత కథకుడు వేలూరి శివ రామ శాస్త్రి గారికి పట్టిన గతిని గమనిస్తే అర్ధమవుతుంది.

వేలూరి గారు చాలా గొప్ప కథకుడు. అనన్య సామాన్య మయిన శైలీ శిల్పాలతో, సమకాలీన సంఘటనలను, నిక్కచ్చిగా, చేదు నిజాలను ఏమాత్రమూ ఏమార్చకుండా, కుండలు బ్రద్దలు కొడుతూ తన కథలలో ప్రదర్శించారు. ఆయన కథలు చదువుతూంటే, కాల యంత్రంలో వెనకకు ప్రయాణించినట్టనిపిస్తుంది. ఆయన కథలు చదువుతూంటే ఇప్పటి సమాజంలో మనం అనుభవిస్తున్న అనేక సమస్యలకు బీజాలు పడిన విధానమే కాదు, అందుకు కారణాలు తెలుస్తాయి. సమస్యల స్వరూపాలు, పరిష్కారాలూ బోధపడతాయి. అంతేకాదు, ఆయన కథలు మన సామాజిక అభివృద్ధిలో, చరిత్రలోని కీలకమయిన ఘట్టాలను సజీవంగా నిలిపే శక్తి కలవీ అని తెలుస్తుంది. ఆయన కథలు చదువుతూంటే ఎందుకని అవి పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథలో ఎందుకని ఏ విమర్శఖ శిఖామణీ, కథల కాణాచులూ, కథల ప్రాణ ప్రదాతలు, రక్షకులు, స్టేజీలెక్కి కథలెలా రాయాలో చెప్పే ఘనాతిగజఘనులూ ఈయన కథలను తలవరో, కనీసం తెలుసుకోరో, ప్రస్తావించక పోవటం వల్ల, ఈయన కథలు కనబడ్డా ఎవరూ పట్టించుకోకుండా ఎందుకు చేశారో తెలుస్తుంది.

వేలూరి శివ రామ శాస్త్రి గారి జీవిత కాలం, 1892 నుండి 1967. అంటే బ్రిటీష్ వారి హయాం, స్వాతంత్ర్య పోరాటం, నల్ల దొరల ప్రజాస్వామ్యం వంటి వన్నీ ఆయన అనుభవించారు. తన అనుభూతిని, భావి తరాలకు అందించారు.

1949 కాలం లో ఆయన రచించిన నకలు హైదెరాబాదు అన్న కథను ఈ వారం కాగడా పరిచయం చేస్తోంది. కథ చెప్పక మునుపే ఇది పూర్తిగా, పొలిటికల్లీ, సోషల్లీ, ఇంకా ఎన్నెన్ని ఇల్లులున్నాయో అన్నన్ని ఇల్లుల ప్రకారమూ రాయకూడని ఇంకరెక్ట్ కథ. ఎందుకో, కథ చదివితేనే తెలుస్తుంది.

అది నిజాములో ఒక జాగీరు. దానికి మురాద్ అని అపర నిజాం లాంటి జాగీరు. ఆ జాగీరులో 800 గడపలు, ఒక వంద గడపలకు గజ గజ లాడతాయి. ఏ గడపలెవరివో చెప్పనక్కర్లేదు. ఎంత పొలిటికల్లీ చెప్పకూడని నిజాన్ని చెప్పేశాడు రచయిత.

ఇంతలో ఒక రోజు ఆ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎవరో ఎగరేస్తారు. అపర నిజామయిన మురాద్ కు ఆగ్రహం వస్తుంది. జెండా ఎగరేసిన కాఫిరెవరంటాడు, మురాద్. అతని సేనన్ని బజ్జు అందరినీ రెచ్చగొడతాడు. తాను వెనుక నిలబడి రజాకార్లను ఉసి గొల్పుతాడు. రజాకార్లకు, ఇతర ప్రజలకు నదుమ గలాటా మొదలవుతుంది.

రజాకార్లు దెబ్బలు తింటూంటారు. రజాకార్లకిపుడు సంఖ్యాబల ప్రాబల్యము తెలిసి వచ్చెను అంటాడు రచయిత.

ఇంతలో, బజ్జు తుపాకీ తెస్తాడు. టపాకాయ పేల్చి తుపాకీ పేలినట్టు భ్రమ కలిగించటంతో ప్రజలు పారిపోతారు. రజాకార్లు విజృంభిస్తారు.

రజాకార్ల గృహములలో చెరపబడిన ఆడువారి యేడుపులు వినబడుచుండెను. అంటాడు రచయిత.

గ్రాహంపై పట్టు సాధించిన తరువాత బజ్జు మళ్ళీ తన అనుచరులను రెచ్చగొడతాడు. ఇంకా తమ మతములో చేరని వారిని, రజాకార్ల చేరుడు, ఎవడే పొలములో కాలు పెట్టునో వానిదే పొలము అని ప్రకటిస్తాడు. దాంతో పలువురు హరిజనులు రజాకార్లలో చేరి పొలాలు సాధిస్తారు. ఆ భయంతో, బంగారం తీసుకొని పారి పోతున్న వారిపై రజాకార్లు దాడి చేస్తారు.

తెల్లవారులోపల బజ్జు ఇల్లు బంగారమాయెను. అంటాడు రచయిత.

ఇంతలో కొత్త కోడండ్రు నవాబుకొక రేయి నజురానా అన్న ఫర్మానాను అనుసరించి బసవన్న గౌడు కొత్త కోడలిపై మురాద్ కన్నేస్తాడు. కోడలు గౌరమ్మ, మురాద్ భార్య ఫాతిమా అండ కోరుతుంది. ఫాతిమా, మారు వేషంలో గౌరమ్మ శయన మందిరానికి చేరుతుంది.

ఇంతలో మురాద్ చర్య తెలుసుకున్న యువకులు అతనితో యుద్ధానికి సిద్ధపడతారు. మురాద్ కు రక్షణగా రజాకార్లు వుంటారు.

మురాద్ గౌఉరమ్మ ఇల్లు చేరతాడు. ఫాతిమాను చూస్తాడు. ఆపై జరిగింది రచయిత రాతలోనే….

మురాద్ కుప్పున కూలెను. వాకిట కర్రలు లేచెను. రజాకార్ల తలలు పగిలెను.

అప్పుడు గూడెములో కొందరు కర్రలతో కత్తులతో బసవ గౌడు గదిలో ప్రవేశింప పోయిరి. ఫాతిమా ద్వారమునకడ్డుగా నిలిచి యు యస్ ఓ కు అపీలు చేసికొననిదే మీరు మా నిజాం గారిని బందీగా చేయవలదు అనెను.

సరిగ్గా ఆ సమయముననే -నిజాం హిందుస్తాన్ సేనలను తన సంస్థానము లోనికాహ్వానించెనని రేడియో

వానలో వాకిట పడియున్న బజ్జు, నిజాం గారికి ఒక కన్ను హిందువు, ఒక కన్ను ముసల్మాన్ అని యరచెను.

లోపల పడియున్న మురాద్, నేను కంఠము వరకు హిందువును, ఆపైని ముసల్మానును, అని అందరకును సలాము కొట్టి మరల నమస్కారము చేసెను.

ఇదీ కథ. ఈ కథ గురించి ఎవరూ ఎందుకు ప్రస్తావించరో, వేలూరి వారి కథలను గుర్తు చేసుకునేందుకే ఎందుకిష్టపడరో సులభంగా వూహించవచ్చు. ఎందుకని ఇలాంటి కథలను విస్మరించటం వల్ల, మరో రచయిత ఇలాంటి చేదు నిజాలు రాయకుండా చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ప్రయత్నాల ఫలితమే, ఈనాడుక మైనారిటీ కథలంటే, దేశంలో ఇస్లామీయులంతా పోలీసు దమనకాండలకు భయపడుతూబితుకు బితుకు మంటూ బ్రతుకుతున్నారనీ, మసీదుకెళ్ళాలంటే వనికి పోతున్నారనీ, మసీదు దగ్గర చెప్పులు పెట్తుకునే పిల్లాడు, ఎక్కడో చదువ్కుని నగరానికి వచ్చిన అమాయక యువకుడు అంతా అభద్రతతో అణగిపోతున్నారనీ స్థిరపడ్డాయో, ఇందుకు భిన్నంగా రాస్తే ఎవ్వరూ ఎందుకు పట్తించుకోరో తెలుస్తుంది. అర్ధసత్యాలనే అసలయిన సత్యాలుగా నమ్మించటం, నిజాన్ని తొక్కిపట్టటం తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సమస్యలస్వరూపం చెప్పకుండానే తెలుస్తుంది.

Enter Your Mail Address

December 4, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada

One Response

  1. SIVARAMAPRASAD KAPPAGANTU - December 5, 2013

    మంచి పరిచయం మురళీకృష్ణగారూ. నా ఉద్దేశ్యంలో మన దేశం మొత్తం “స్టాక్‌హోం సిండ్రోం” తొ బాధపడుతున్నది. మనల్ని శతాబ్దాలు బాటు బలవంతంగ పరిపాలించి, దోచుకున్న వాళ్ళ కథలు ముచ్చటగా చెప్పుకుంటాము, వాళ్ళ మీద వైన వైనాలుగా సినిమాలు తీసి కళాఖండాలని పొగుడుకుంటాము, వాళ్ళు కట్టించిన కట్టడాలను మూర్చలు పోతూ చూస్తాము, వాటిమీద పద్యాలు అల్లుతాము. కాని మన శివాజీ మీద, రుద్రమ దేవి, రాణా ప్రతాప్ మీది ఒక్కటంటే ఒక్క సినిమా తియ్యటానికి పిరికితనం అడ్డువస్తున్నది. ఆ పిరికి తనానికి ఎన్నెన్నో పేర్లు పెట్టుకును బతికేస్తున్న జాతి మనది.

    మంచి వ్యాసం వ్రాసి మన సాహిత్య విమర్శకుల ద్వంద్వ నీతిని బయటపెట్టారు. వేలూరి వారి కథ ఎక్కడ దొరుకుతుందో లింకు ఇవ్వగలరు.

Leave a Reply