1929లో కాబట్టి రాయగలిగిన పొలిటికల్లీ పూర్తిగా ఇంకరెక్ట్ కథ.

సాహిత్య కాగడాలో వేలూరి శివరామ శాస్త్రి గారి గురించిన వ్యాసాలకు ఈ వ్యాసం తరువాత కాస్త విరామం వుంటుంది.

ఈవారం పరిచయం చేస్తున్న కథ గురించి తెలుసుకున్న తరువాత ఎందుకని వేలూరి శివరామ శాస్త్రిగారు, ఆయన కథలను ఎవరూ ఎందుకు ప్రస్తావించరో అర్ధమవుతుంది. ఆయన చేదు నిజాలను ఎంత నిక్కచ్చిగా ప్రదర్శించారో తెలియటంతో పాటూ పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథలెలా వుంటాయో స్పష్టమవుతుంది. నిజాలు చెప్పటం నేరమయిన మన సాహిత్య ప్రపంచంలో, ఇలాంటి నిజాలు చెప్పిన వేలూరి గారిని తలవటమెంత పాపమో బోధపడుతుంది.

కథ పేరు వ్యత్యము.

కథ తొలి వాక్యంలోనే చూచాయాగా కథాంశం తెలుస్తుంది.

‘నరసిమ్హులుకు కాటడు పాలేరు. ఇపుడిరువురికిని సుమారు ఎనుబడేండ్లు.’

ఈ వాక్యం చదవగానే మారుతున్న కాలాంతో, మారుతున్న తరాలతో రూపాంతరం చెందుతున్న జీవన విధానాలు, ఆలోచనలు, విలువలు, తద్వారా రూపాంతరం చెందుతున్న మానవ సంబంధాల స్వరూపాన్నీ ఈ కథ ప్రదర్శించబోతోందని ఊహించవచ్చు.

వారిరువురికి ఎనబదేండ్లు అనటంతోటే ఒక తరం, ఆ తరం ప్రాతినిథ్యం వహించే విలువలన్నీ అవసాన దశలో వున్నాయని తెలుస్తుంది.

నరసిమ్హులుకి కాటడు, పాలేరు నమ్మినబంటు మాత్రమే కాదు, ప్రాణానికి ప్రాణం కూడా.

‘దొరవలన పాలేరును పాలేరువలన దొరయు సుఖజీవనమొనరించిరీ అన్న వాక్యం ద్వారా రచయిత సమాజంలో ఒక పద్ధతి ప్రకారం నెలకొల్పుతున్న అపోహలు, అపవాదులు, దురూహల అసలు రూపాన్ని బట్టబయలు చేస్తాడు, ఎలాంటి ఉపన్యాసాలు, సిద్ధాంత చర్చలూ లేకుండా.

దొరకొడుకు సోములు. పాలేరు కొడుకు రాములు. ఒకరోజు కాటడు, సోములుకెదురుపడతాడు. అప్పుడు సోములు, దూరముగానుండూ అంటాడు. అంటే మారుతున్న తరంతో మారుతున్న విలువల ఆధారంగా మారుతున్న మానవసంబంధాలను ఈ వొక్క సంఘటన ద్వారా రచయిత ప్రదర్శిస్తున్నాడు. తండ్రికి ప్రాణం, కొడుకుకి దూరం (అంటరానివాడు).

కాటడు తానుదాచిన నూరుకాసులను దొర దగ్గర దాస్తాడు. ఈ విషయం కొడుకులకూ చెప్తారు. పాత తరం మరణిస్తుంది.

తండ్రి మరణం తరువాత సోములు తన పొలమేకాదు, రాములుకిచ్చిన పొలంలోనూ వ్యవసాయం మానేసి వ్యాపారం చేస్తాడు. రాములు, సోములు వద్దకొచ్చి, పొలంలో వ్యవసాయం చేస్తానంటాడు. ‘తమ నాయనగారి అనుగ్రహమునే తమరు నాయెడ నవలంబింపుడు. నేను మీ వ్యవసాయమంతయు చేసెదను.’ అంటాడు.

కానీ, సోములు అందుకు నిరాకరిస్తాడు.’ నీకు పొలమును లేకు. కాసులంతకన్న లేవూ అని పత్రాలు చింపేస్తాడు.

దాంతో రాములు దయనీయమయిన స్థితికి దిగజారతాడు. తినటానికి తిండి వుండదు. అప్పుడు, రెబెకా అనే యువతి అతనిపై జాలి చూపిస్తుంది. తిండి పెడుతుంది. ఆమె తండ్రి రాములు మతం మార్చుకుని కూతురిని పెళ్ళి చేసుకోమంటాడు.

‘నేనిపుడు నిరుపేదను. మతము పుచ్చుకొనినంత మాత్రమున పిల్లనిత్తువా?’ అని అడుగుతాడు. దానికి ఆమె తండ్రి, మతం మారితే ‘నీవు పంతులవగుదువూ అని ఫాదరీ దగ్గరకు తీసుకెళ్తాడు.

ఫాదరీ అతడికి కిరస్తానీ గురించి చెప్తాడు. ఒక నెల రోజుల తరువాత రాములు జకరయ్య అవుతాడు. రెబెకాకు అతడికి పెళ్ళవుతుంది.

నూరునేబది రూకలు నాకిచ్చుచో పాతికరూకల పంతులపని ఇప్పిస్తానని ఫాదరీ అంటాడు.

‘ అయ్యా, అన్నముచే కడుపు నిండుననియూ, బైబిలుచే నోరు నిండుననియు సద్ వృత్తిచే మనస్సు నిండుననియు నేను మతమున గలిసితిని. నాకు పాటకూటికి టికాణా లేదు” అంటాడు.

చివరికి జకరయ్య పంతులు, రెబెకా పంతులమ్మ అవుతారు.

‘రెబెకా జకరయ్యలు ప్రతి ఆదివారము నాడును యేసు పేర పావలా ముదుపు కట్టవలసియుండెను. వేరు వేరు పండుగలలో పందుగపందుగకు ఒకొక రూపాయి యీయవలసి వచ్చెను. నెలకొక రూపాయి ఇచ్చి మత వా~ంమయము కొనవలసి యుండెను. ఇదియంతయు చూడగా కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో లాగుకొను చందముగాయుండెను. ‘

ఇలాంటి స్థితిలో జకరయ్య ఫాదరీ దగ్గరకు వెళ్ళి ఇది అన్యాయమంటాడు. అప్పుడా ఫాదరీ ‘ మీకును ఏసునకును సాక్షాత్సంబంధము లేదు. మాగుండా మీరాయేసు ముంగిలికి మాత్రమే రాగలరూ అని తిడతాడు. ఉద్యోగంలోచి తీసేస్తాడు, ఎందుకంటే జకరయ్య యేసు చెప్పిన సూక్తులను ఫాదరీకి చెప్పి అతని నైచ్యాన్ని, యేసు బోధలకు వ్యతిరేకంగా వున్న అతని ప్రవర్తనను ఎత్తి చూపిస్తాడు.

అప్పుదు రెబకా’ కిరస్తానీ మతము కాని మతమూ అంటుంది.

జకరయ్య, ‘విద్యావినయములుకల బ్రాహ్మణుదును మాలడును ఎరుకగలవారికొకటే యని చదువుచు దానియర్ధమును త్ర్ణీకరించు సోములుగారే చెడ్డవారని యనుకొంతిని. దైవమును చింతించుచుండువారిని దైవమే కాపాదునని చదువు పాదరీ సోములుగారికి తీసిపోయెనా? ఏమతములో తప్పున్నది, స్వార్ధపరుడగు మానవులో గాక?’ అని ప్రశ్నిస్తాడు.

ఇదీ కథ. కథ గురించి తెలిస్తూంటేనే ఎంతగా పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ కథనో ఇది అర్ధమవుతుంది.

ఎంత ధైర్యం లేకపోతే, భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఒకప్పుడు ఇప్పతిలా లేదని, కులాలున్నా వారి నదుమ సఖ్యత, స్నేహము, అవగాహన గౌరవాలుండేవని చెప్పటం ఎంత ఘోరం? ఇంత పచ్చి చేదు నిజాన్ని చెప్తే, సమాజంలో ద్వేష భావనలు రెచ్చగొడుతూ పబ్బం గదుపుకునే వారి మనుగడలేమి కావాలి?

మతం మారిపోయినా, హిందువులుగా వున్నప్పుడు పొందే సౌకర్యాలన్నీ పొందుతూ, అందువల్ల లాభపడుతూ, ఆవలి గట్టుకెళ్ళి, ఈవలి గట్తుపై దుమ్మెత్తి పోసి, ఏరు దాటి తెప్ప తగలేస్తూ, పబ్బం గడుపుకునే వారికి ఇలాంటి కథలు ప్రచారంలోకి వస్తే ఎంత నష్టం? తమ అసలు రూపాలను కథకులు ఇలా బయట పెడుతూంటే వారి మనుగడ ప్రస్నార్ధకమయిపోదూ?

అందుకే, ఏదో 1929లో కాబట్టి ఇలాంటి కథ ఆయన రాశాడు, పత్రికలు వేశాయి. ఇప్పుడు ఇలాంటి కథలు రాసే ధైర్యమెవరూ చేయరు. చేసినా జాగృతి లాంటి పత్రిక కూడా వేసే ధైర్యం చేయదు. దాంతో మసిపూసిన మారు నిజాలే తప్ప అసలయిన చేదు నిజాలను రచయితలు ప్రదర్శించే సాహసం చేయటం లేదు. దాంతో కొన్ని తరహా కథలేతప్ప తెలుగు సాహిత్యం తెలుగు సమాజిక జీవితాన్ని సంపూర్ణంగా ప్రదర్సించలేక పోతోంది.

అందుకే, విదేశీ సాహిత్యంలో తీవ్రవాదాన్ని నిరసిస్తూ, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాం సమాజంలో జరుగుతున్న సంఘర్షణ, సామాజిక, మానసిక సందిఘ్ధాలను చూపుతూ కథలొచ్చాయి కానీ, తెలుగులో మాత్రం మైనారిటీలెంట భయంతో వణికి పోతున్నారు, మెజారిటీలెలా తమ మతాన్ని మైనారిటీలపై రుద్దుతున్నారో తప్ప మరో రకమయిన కథలు రావటం లేదు. వాతికి ఆదరణ లేదు. అందుకే, వేలూరి వారి గతి పట్టకుండా వుండాలనే కథకులంతా పొలితికల్లీ కరెక్ట్ కథలే రాస్తున్నారు. విమర్శకులూ ఆ పరిథిలోనే తమ బావుల్లో కప్పలుగా భద్రంగా వున్నారు. తెలుగు సాహిత్యాన్ని వీధిలో పారేశారు. పాథకులు పారిపోతున్నారు.

Enter Your Mail Address

December 22, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: sahityakaagada

One Response

  1. SIVARAMAPRASAD KAPPGANTU - December 22, 2013

    మన తెలుగు సాహిత్యం విదేశీ ఇజాల తో నిండిన కథలు, కవితలుతో నాశనమయినంతగా మరే భాషా సాహిత్యం నాశనం అయ్యి ఉండదు. దాదాపు 1950ల్లో మొదలయ్యి 1990ల వరకూ కూడా, ముఖ్యంగా 60లు 70ల్లో వామ పక్ష వాదాన్ని కాదని కథ/కవిత వ్రాయగలిగిన రచయిత మనకు ఉన్నారా!!?? అలా కనుక వ్రాస్తే, వాణ్ణి చీల్చి చెండాడి, అభివృధ్ధి నిరోధకుడు, బూర్జువా, సమాజ విరోధి వంటి మాటలతో సత్కరించేవారు. ఏదో స్కూలు మాష్టారో, చిన్న గుమాస్తా ఉద్యోగాలో చేసుకుంటూ, కథలు వ్రాసుకునేవారు ఈ గోలంతా మనకెందుకని, మామూలు, అదే పొలిటికల్లీ కరెక్ట్, కథలు వ్రాసుకుంటూ గడిపేశారు. ఇప్పటికి కూడా మన సామాజిక పిరికితనం చాలా ఉన్నది. ఆంగ్లంలో అంటారే “To call a spade a spade”, అనే దృక్పథం మన సాహిత్యంలో ఇంకా కొరవడుతూనే ఉన్నది.

Leave a Reply