25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనం-విశ్లేషణ-3

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనానికి ముందుమాటలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వామ పక్ష భావజాలం కథలు అధికంగా సంకలనాల్లో వుండటాన్ని సమర్ధించాలని ప్రయత్నించారు. జీవితాన్ని వామపక్ష భావజాలం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు, అందులోంచే అత్యధిక శాతం మంచి సాహిత్యం పండుతున్నప్పుడు అది సంకలనాల్లో ప్రాతినిధ్యాన్ని పొందటం సహజ పరిణామమే..అని సమర్ధించారు.
జీవితాన్ని వామపక్ష భావజాలం తీవ్రంగా ప్రభావితం చేయటం అన్న విషయాన్ని పక్కనపెడితే, అందులోంచే ఉత్తమ సాహిత్యం అధికంగా పండుతోందనటం చర్చనీయాంశమే.
సంకలనాల్లోకి అలాంటి కథలనే ఎన్నుకుంటున్నారు కాబట్టి, తమ కథను ఉత్తమ కథల సంకలనంలో చూడాలని ఆశవుంటుంది కాబట్టి అలాంటి కథలే రాస్తారు రచయితలు. అలాంటి కథలనే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి, అలాంటి కథలే వస్తాయి కాబట్టి, అధిక శాతం వామపక్షభావజాల కథలే వస్తున్నట్టు కనిపిస్తుంది.
ఇక్కడ నా వ్యక్తిగత అనుభవం ఒకటి చెప్తాను.
ఒక పత్రిక ఎడిటర్ నన్ను నవల రాయమన్నాడు. టాపిక్లు చెపాను. ఒకటి ఎన్నుకున్నాడు. దాన్ని ఎలా రాయాలో ఆయన చెప్పటం ఆరంభించాడు. మధ్య మధ్య వామపక్ష భావాలు, అభ్యుదయ భావాలు ఎలా జొప్పించాలో సూచించాడు. అంతా విని నేను నా అభిప్రాయం చెప్పాను. భారతీయ ధర్మం ఔన్నత్యం, భారత జీవన విధానంలోని వైషిష్ట్యం చూపటం నా ఉద్దేశ్యమనీ చెప్పాను. ఆయన నవ్ల అవసరం లేదని చాలా బాధపడుతూ చెప్పాడు. అంతేకాదు, మీరు వామపక్ష భావజాలంతో రాస్తే, మీ పేరు దేశమంతా మారుమోగుతుంది. అందుకు నేను పూచీ..అని కూడా అన్నాడు. ఇప్పటికీ, ఎప్పుడయినా కలిస్తే, నా మాట వినలేదు, అందుకే, ఇంత విశిష్టంగా, విస్తృతంగా రాస్తూ కూడా నీకు రావాల్సిన పేరు, గుర్తింపు రావటంలేదు. ఇప్పటికయినా, కాస్త విప్లవము, స్త్రీ విమోచన, అగ్రవర్ణాల దౌష్ట్యం, పల్లెల్లో జమీందారుల దోపిడి, ప్రభుత్వ హింస లాంటి టాపిక్కులతో రెండు మూడు కథలు రాయి, నీ పేరు పైకి తీసుకెళ్ళే బాధ్యత నాది..అంటూంటాడు. సమాధానంగా, మనకు వచ్చేదాన్ని ఎవ్వరూ ఆపలేరు, రాని దాన్ని ఎవ్వరూ తేలేరు అని నవ్వి తప్పించుకుంటాను.
నేను మొండివాడిని కాబట్టి లొంగలేదు. కానీ, ఎందరో రచయితలు ఆ ప్రలోభానికి లొంగి తమ స్వభావానికి విరుద్ధమయిన రచనలు చేస్తున్నారు.
ఇటీవలె, సుజాత అనే ఆవిడ, వేలుపిళ్ళై రచయిత రామచంద్రరావు గారి ఇంటర్వ్యూను ప్రకటించింది. దాన్లో ఆయన కూడా ఇలాంటి సంఘటన చెప్పారు. సామాజిక స్పృహ వున్న కథ రాస్తే సంకలనానికి పరిగణిస్తామని చెప్పటంతో అలాంటి కథ రాశానని చెప్పారు.
మిథునం కథను ఉత్తమ కథల సంకలనంలో ఎంపికచేసుకోకపోవటానికి కారణాన్ని వివరిస్తూ, సంపాదకులు, ఆ కథ వివాహ వ్యవస్థను సమర్ధిస్తున్నట్టు వుంది కాబట్టి ఎన్నుకోలేదన్నారు. అంటే, కథ మంచి చెడు అది వివాహ వ్యవస్థను సమర్ధిస్తుందా, వ్యతిరేకిస్తుందా అన్న దానిపైన ఆధారపడి వుంటుందన్న మాట. కథ ఎంత గొప్పగా వున్నా, వివాహ వ్యవస్థను సమర్ధిస్తే ఉత్తమ కథ కాకుండాపోతుందన్నమాట. మరి తమ కథలు కథలుకాకుండాపోకుండా, ఉత్తమ కథలుగా గుర్తింపు పొందాలంటే, తాము భద్రంగా వైవాహిక వ్యవస్థలోని శాంతిని అనుభవిస్తూ, తాళులు తెంపే కథలు, పురుషులను పురుగులుగా చూపే కథలు, అక్రమ సంబంధాలే ఉత్తమ సౌఖ్యానికి సోపానాలు, పెళ్లి కుళ్లు అనే కథలను రచయితలు రాస్తారు. వాటిని ఉత్తమ కథలుగా గుర్తిస్తూండటంతో అదే ఉత్తమ కథ అవుతుంది.
అంటే, ఎలాగయితే పెట్తుబడిదార్లు మార్కెట్ ను సృష్టించి వస్తువును అమ్ముకుంటారో, ఇక్కడ కూడా ఉత్తమ కథ ఇది అని చెప్పి అలాంటి కథలు మాత్రమే ఉత్తమ కథలుగా గుర్తింపు పొందేట్తు చేసి, ఉత్తమ కథలని తామనుకున్నవి కాక, మరొకటి కాని పరిస్థితులు కల్పించారన్నమాట...ఈ విషయాన్ని రచయితల కథల విశ్లేషణలో నిరూపించటం జరుగుతుంది. 

ఇక అదే ముందుమాటలో సాహిత్య రంగంలో రిజర్వేషన్లు అక్కర్లేదని స్పష్టంగా చెప్పారు వల్లంపాటి గారు అమాయకంగా..

ఈ 25ఏళ్ళ ఉత్తమ కథలను చూస్తూంటే అలాంటి రిజర్వేషన్లు ఉన్నాయనీ, వాతిని పాతిస్తున్నారనీ అర్ధమవుతుంది.

సంకలనాలలో దళిత కథ వుండితీరాలి. మైనారిటీ కథ వుండాలి. స్త్రీ వాదం కథ వుండాలి. అరస, విరస, కురస, నీరస, నోరస వీరుల కథలుండాలి. అయిపోయింది..కథల సంకలనం. ఇందులో ఇంకా కొందరు ముసలి పేరున్న కథకుల కథలను పరిగణించాలి. వారు ఏమి రాసినా ఉత్తమ కథ అనకపోతే నొచ్చుకుంటారు పెద్దలు. జర్నలిస్టు రచయితలదో ప్రత్యేక రిజర్వేషన్ కోటా. వారి కథలు ఉత్తమం అనకపోతే, సంకలనాలకు ప్రచారం రాదు. సమీక్షలు పాజిటివ్ గా రావు. అందుకే, జీవితంలో ఒకే కథ రాసిన జర్నలిస్టు రచయితలు, ఒకట్రెండే ఉత్తమ కథల సంకలనంకోసం మాత్రమే రాసిన జర్నలిస్టు రచయితలూ ఈ సంకలనల్లో కనిపిస్తారు.( ఎలాగో ఎవ్వరూ వేయకపోతే అచ్చేయటానికి ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. ఇక్కడా ఒక అనుభవం చెప్పాలి. నేను ఒక యువ రచయితను విమర్సించాను. తరువాత అతనికో సలహా ఇచ్చాను. నెట్ పత్రికలకు పరిమితం కాకుండా అచ్చు పత్రికల్లోను కథ పడాలని, మంచి కథ పంపితే అందుకు సహాయం చేస్తాననీ చెప్పాను. అతను సమాధానం ఇవ్వలేదు. కొన్ని వారాలకు అతని కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అలాగే..ఒకాయనను జీవితంలో ఒక్క కథ రాయలేదు, కథల గురించి మాట్లాడవద్దని అన్నాను. అన్న రెండు వారాల్లో అతని కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మళ్ళీ ఇంతవరకూ మరో కథ రాయలేదారచయిత..ఇలాంటి అనుభవాలెన్నో).. ఇవి అయ్యాక, లాబీయింగ్ వాళ్ళుంటారు. రికమండేషన్లుంటాయి. డబ్బులిచ్చే ఎన్నారైల సూచనలుంటాయి. ఇక ఇందులో అసలు కథలకు, కథకులకు స్థానం ఎక్కడ...
బంగారుమురుగులాంటి అధ్బుతమయిన కథను బూర్జువా, అగ్రవర్ణ, మనువాద, కదుపునిండిన అహంకార కథగా ఎందుకు కొట్టిపక్కన పారేయలేదో ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని వెనుక ఎవరెంత కష్టపడి ఆ కథ ఊతమమయినదని ఒప్పించారో తెలుసుకోవాలనుంది.

అంటే, వల్లంపాతి గారు ఎంత సమర్ధించకున్నా, ప్రాంతీయాల వారి, కులాల వారి, భావజాలాల వారి, అవసరము, ఉపయోగాల వారి..అన్ని రిజర్వేషన్లూ అమలులో వున్నాయన్నమాట.
అందుకే..మొవ్వ వృషాద్రిపతి అనే కవి..కథల గురించి ఇలా వ్యాఖ్యానించారు...

ఈనాడెందరో పెద్ద పెద్ద కథా రచయితలున్నారు. ఎన్నో పురస్కారాలు పొందుతున్నారు. బిరుదనామాలతో విరాజిల్లుతున్నారు. వారి కీర్తిని ఆహా! ఓహో! అని ప్రశంసించేవారు గాని, పురస్కారాలందించే వారు గానీ ఆయా రచయితల కథలు పఠించారా? ఏదీ! ఒక కథను చెప్పమనండి. మానవ జీవితానికి అన్వయించి లోతుగా పరిశీలించి ఈ కథలో ఈ శాశ్వత లక్షణముందని చెప్పండి. అంధపరంపరాన్యాయంగా, ఆయన గొప్పవాడంటే గొప్పవాదు ..ఎందుకు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే వారెందరు? ఆయా కథలను ఏ సభలలో ఎవరెక్కడ చెప్పుకొంటున్నారు? లోకం గతానుగతికం కదా!

ఇది పొగడుతునావారికీ, పొగిడించుకుంటున్నవారికీ తెలుసు..కానీ, ఎవరి భయాలు వాళ్ళవి, ఎవరి అవసరాలు వాళ్ళవి, ఉన్నది పోతుందన్న బెదురు, అనుకున్నది కాదేమోనన్న అదురు.....అందుకే, ప్రతి రచయిత మనసులో ఈ సంకలనాలపై అసంతృప్తి వున్నా బయత పడటంలేదు. ఏమో..ఈ సారి కాకున్నా వచ్చే సారి సంకలనంలో కథ వచ్చే అవకాశాన్ని నోరుపారేసుకుని పోగొట్తుకోవటమెందుకని మౌనంగా వుండిపోతున్నారు. పెదవులతో పొగడుతున్నారు.
పూర్తిగా నిరాశ చెందిన కొందరు, తామే సంకలనాలను వేసుకుంటున్నారు. కానీ డబ్బిచ్చిన వాళ్ళ కథలుండటం, సరయిన సంపాదకుడు లేకపోవటంతో ఆ సంకలనాలు ఆశించిన ఫలితాలివ్వటంలేదు. ప్రాతినిథ్య అన్న కథల సంకలనం వస్తూన్నా, అది దళిత మైనారిటీ కథలకు పరిమితమవటంతో సర్వజనాదరణ పొందటంలేదు. ప్రరవే పేరిట ఒక సంకలనం వచ్చినా అదీ డబ్బుల వసూళ్ళు, సరయిన సంపాదకుడులేకపోవటంతో అంత ప్రాచుర్యం పొందటంలేదు. అందుకే.. 25 ఏళ్ళుగా అప్రతిహతంగా సాగుతూ వస్తున్న ఈ సంకలనానికి అంత ప్రాధాన్యం. ఈ సంకలనమూ ఒక భావజాలానికి పరిమితమయినా, సంకుచిత దృష్టితో కథలను ఎంచుకుంటున్నా, సంకలనకర్తలు మాత్రం తెలుగు కథ మొత్తానికి ఈ సంకలనాన్ని ప్రాతినిథ్యం వహిస్తున్న భ్రమ కలిగించి విజయం సాధిస్తున్నారు. ఈ కథలు ప్రామాణికం కాదు, ఈ ఎంపిక సరయినది కాదు అనే వారి గొంతు వినపడే వీలు లేదు. ఉన్నా పట్టించుకుని సంకలనకర్తలకు దూరమవటం ఎవరికీ ఇష్టం లేదు. పిల్లిమెడలో గంట కట్టటం లాంటిది ఇది..
వచ్చే వ్యాసంలో కథలను విశ్లేషణ ద్వారా, ఇంతవరకూ ప్రతిపాదించినవాతిని నిరూపించటం వుంటుంది.

Enter Your Mail Address

September 13, 2016 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

 1. Sowmya - January 18, 2017

  “మిథునం కథను ఉత్తమ కథల సంకలనంలో ఎంపికచేసుకోకపోవటానికి కారణాన్ని వివరిస్తూ, సంపాదకులు, ఆ కథ వివాహ వ్యవస్థను సమర్ధిస్తున్నట్టు వుంది కాబట్టి ఎన్నుకోలేదన్నారు. ”
  - నిజమా????? అలా అని పబ్లిగ్గా ఒక చోట ఎవరో సంపాదకులు అన్నారా???

  మీ విశ్లేషణ బాగుంది. నాకు ఆట్టే తెలుగు కథ గురించి అనుభవం లేదు కానీ, గొప్ప సంకలనాల్లో చాలా వరకు మీరు చెప్పిన రకం కథలే ఉండడం గమనించాను. ఈ విషయమై మీ మిగితా వ్యాసాలు చదవాలిక.

  వ్యాసం డిస్ప్లే లో ఏదో సమస్య ఉందండి. చదవడం చాలా కష్టంగా ఉంది. దానికి తోడు అక్కడక్కడా అక్షరదోషాలు కూడా. మీరు ఎంతో సమయం వెచ్చించి ఇదంతా రాస్తున్నారని అర్థం చేసుకోగలను. కానీ ఒక్కసారి చివర్లో ఈ స్పెల్లింగ్ దోషాలు సరిచూసుకోగలరా?

Leave a Reply