25ఏళ్ళ వుత్తమ కథ విశ్లేషణ-6

ఫార్ములా సినిమాలని ఒక మాట వింటూంటాం. అది కథలకూ వర్తిస్తుందని 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో రిపీప్త్ కథకులిద్దరుముగ్గురి కథలు చదవగానే అనిపిస్తుంది. ఫార్మూలా సినిమాలు సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అందరూ అదే ఫార్మూలాను అనుసరించేట్టు, రచయితలు ఏదయినా కొత్త ఆలోచన చెప్తే ప్రేక్షకులు ఆమోదించరని ఫార్మూలానే అనుసరించమనేట్టు, ఈ ఉత్తమకథల సంకలన కర్తలుకూడా బాగున్నా, బాగాలేకున్నా ఇదే ఉత్తమకథల ఫార్మూలా అని రచయితలు, పాఠకులు, సాహిత్య డింపతుల మెదళ్ళనూ వాష్ చేసినట్టు ఈ కథలు నిరూపిస్తాయి. ముందుగా, మొదటి సంకలనంలోని రిపీట్ కథకుడు స్వామి కథలను పరిశీలిద్దాం. ఈయనవి మొత్తం 5 కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. 1990లో అద్దం, 1991 లో వానరాలె, 1996లో నదఖ, 2003లో తెల్లదయ్యం అను గ్రామ వివక్ష కథ, 2009లో రంకె అనే అయిదుకథలు ఈ రచయిత ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
కథ అన్నదానికి కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాల పరిథిలో రచయితలు అనేకానేక ప్రయోగాలు చేస్తారు. ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. కానీ, పద్ధతి ఏదయినా, కథ ఆసక్తి కరంగా వుండాలి. ఆలోచనలు కలిగించాలి. మానవ జీవితంపైనా, మనస్తత్వంపైనా, సమాజంపైనా అవగాహన కలిగించాలి. పైగా, అందరికీ అర్ధం కావాలని మనం భాషనే సులభతరం చేసుకున్నాం. ఏది మాట్లాడితే అదే రాయాలనుకుంటున్నాం. కాబట్టి, ప్రయోగం ఎలాంటిదయినా అది అందరికీ అర్ధం అయ్యేట్టుంటేనే దానికి సార్ధకత.
స్వామి కథ అద్దం కథనా, వ్యాసమా, ఒక చమత్కార భరిత శీర్షికలోని ఒక ఐటమా? అన్న ప్రశ్న వస్తుంది. ఇదొక ఆలోచన. ఆలోచనను కథగా మలచటం ఈ ఉత్తమ కథగా ఎంపికయిన కథలో కనబడదు. లోకమొక అద్దం అన్న అంశం ఆధారంగా రచించిన ఒక వ్యాసం అనవచ్చీకథను. ఈ ఆలోచనలు కూదా ఒక లాజిక్, ఒక ఔచిత్యాన్ని పాతించవు. ముందు అద్దం లోకం అంటూ ఆరంభమవుతుందీ ఆలోచన( దీన్ని ఎవరయినా ఆలోచనా స్రవంతి అని సమర్ధిస్తారేమో..ఆలోచనా స్రవంతిలోనూ సంఘటనలుంటాయి. దీన్లో అదీ లేదు. ) ఇంతకీ, ఈ ఆలోచనాత్మక వ్యాసం ద్వారా రచయిత ఏమి చెప్పాలనుకుంటాడంటే, ఈ ప్రపంచం మనపై ముద్రలు వేస్తుందనీ, మనం మన ఇష్టానుసారంగా కాక, సమాజంలొ ఇతరుల అభిప్రాయాల ప్రకారం బ్రతుకుతామని, మనిషి సమాజంవైపు కాక, తనలోకి తాను చూసుకోవాలనీ చెప్తుందీ ఉత్తమ కథ అయిన వ్యాసం. భవిషయత్తులో పలు సంకలనాల్లో ఇలాంటి ఉత్తమ కథలయిన వ్యాసాలు కనబడతాయి. వాటికి దారిచూపిందే అద్దమే..
ఉన్నదున్నట్టు చూపిస్తే వార్త అవుతుంది. ఉన్నదానికి ఊహలను జోడించి, నాటకీయంగా చెప్తే కథ అవుతుంది. వాడు బస్సెక్కాడు. బస్సులో సీటు దొరకలేదు. ఒకదు బీడీ కాల్చాడు. ఒకడు పాట పాడాడు. ఎండ మండిస్తోంది. చెమట కారుతోంది. నేను దిగే స్టాపు వచ్చింది. దిగాను…ఇది రిపోర్టింగ్. కథ కాదు. కానీ, నేను అనుభవించిందే రాస్తాను. అనుభవించనిది రాయలేను అని కొందరు రచయితలు తమ రిపోర్టుల్లాంటి కథలను self righteous గా సమర్ధించుకుంటారు. వానరాలె అలాంటి సమర్ధన అవసరమయిన కథ. వానలు రావు. రైతు ఒక పంట వేయాలనుకుంటాడు. డబ్బులుండవు. ఇంట్లో ఖర్చులుంటాయి. అప్పులుంటాయి. విత్తనాలకు డబ్బులుకావాలి. ఎలాగో విత్తనాలు తెస్తాడు. వాన వస్తుందని చెప్తే ఒక పంట బదులు మరో పంట వేస్తాడు. వాన రాదు. దాంతో ఆ పండిన ఏదో పంటను..ఎంతకో అముకుని మరిన్ని అప్పులు చేస్తాడు. వచ్చేసారికి ఏ పంట వేయాలా అని ఆలోచిస్తాడు. అప్పటికీ వాన రాదు. ఒక ఆర్ట్ ఫిల్మ్ లా వుంటుందీ కథ.
1995లో ఉత్తమ కథగా ఎంపికయిన మరో రిపీట్ కథకుడు, ఈ సంకలనానికి ఒక సంపాదకుడు అయిన పాపినేని శివశంకర్ కథ చింతలతోపు దాదాపుగా ఇదే కథ. స్వామి కథ ఆర్ట్ ఫిల్మ్ లా వుంటుంది. పాపినేని కథ కమర్షియల్ ఫార్మాట్ లోని ఆర్ట్ ఫిల్మ్ లా వుంటుంది. ఆ కథ ఒక పిల్లవాది చదువు, పెద్దల పంటలు పండించాలనే విఫల ప్రయత్నాలు ఆల్టెర్నేట్ గా చూపిస్తుంది. ప్రభుత్వం పొగాకు పంట వేయమంటే అది వేస్తాడు. ధర తగ్గి నష్టపోతాడు. దాంతో చింతలతోపు కొట్టి వచ్చేసారికి పత్తి వేదామనుకుంటారు. తమ నష్టానికి ప్రభుత్వం బాధ్యత అంటారు. ఇదీ ముగింపులేని కథ. సినిమాలో ఒక సీనులాంటిది స్వామి కథ అయితే, రెండు మూడు సీన్లు ఈ కథ. రెండూ ఒకే అంశం చెప్పినా, భిన్నంగా చెప్తాయి. పాపినేని శివశంకర్ కథ ముగింపు కాని కథగా వుంటే, స్వామి కథ ముగింపులేని డాక్యుమెంటరీగా వుంటుంది. ఇంకా ఇలాంటి కథకని కథలవ్యధలు ఈ 25ఏళ్ళలో బోలెడున్నాయి. ఆయా సంధర్భాలలో వాటిని ప్రస్తావించుకుందాం.
స్వామి మూడో కథ నడక కూడా కథకు తక్కువ, వ్యాసానికి ఎక్కువలా వుంటుంది. కథ ఏకసూత్రంగా సాగదు. ఎటో ఎటో పోతుంది. పల్లెవాతావరణం చూపితే ఉత్తమ కథ అన్న ఫార్మూలా( ఇది అందరు రచయితలకూ వర్తించదు. ) అనుసరించి, మల్లయ్య డబ్బుల్లేకుండా పేటకు పోయి ఏవేవో చేయాలనుకుంటాడు. ఒకప్పుడు అని రచయిత జొరబడి నాగరికతా వ్యామోహం గురించి స్లోగన్లలాంటి వాక్యాలు చెప్తాడు. బస్సెక్కగానే మళ్ళీ ఫ్లాష్ బాక్ లోకి పోతాడు. కూలీలు చేయటం, కష్టాలు, అప్పులు, జబ్బులు వగైరా, వగైరాలు సాగుతాయి. అటునుంచి వూళ్ళో బోయోళ్ళు కమ్మల కులాల వరిరం వైపుకు మళ్ళుతుంది కథ. అటునుంచి బస్సులేని కాలంలో వూరి ప్రశాంతత గురించి మరో లెక్చరుంటుంది. అటునుంచి మళ్ళీ వూరి వర్ణన. బస్సు నాయుడి కోసం ఆగిపోతే, దాని వర్ణన. మల్లయ్య నాయుడిని తిట్టుకోవటం, అతడు చేసిన మోసాలను తలచుకోవటం వగైరా వగైరాలుంటాయి.అక్కడినుంచి మళ్ళీ కూలీల పద్ధతిలో మార్పులు, మారిన జీవన విధానాల సమాచారం ఆలోచనల రూపంలో అందుతుంది. తక్కువ కులాల పిల్లలు ఫాషన్లు, నాయుడు దౌర్జన్యాలు వగైరా, వగైరా…మళ్ళీ నలభై యేళ్ళ క్రితం —ఫ్లాష్ బ్యాకూ….అటునుంచి సినిమాచూసి డబ్బుల్లేకున్నా, తాగాలని నిశ్చయించుకుంటాడు. అతనికి ఒక ఫ్రెండ్ కలుస్తాడు. వాడు నాయుడు వ్యతిరేకి అయిన రెడ్డి క్యాంపు మనిషి..ఇక్కడనుంచి రెడ్డి క్యాంపు, వాళ్ళ గొడవల సమాచారముంటుంది. చివరికి మన మల్లయ్య ఆ రెడ్డి క్యాంపులో చేరి తన వూరికి బాంబులు తీసుకుపోవటంతో ” పల్లెనుంచి పట్నానికి, పట్నం నుంచి పల్లెకి ఒక కలగాపులగపు కొత్త రాజకీయ సంస్కృతిని విస్తరింపచేస్తున్న యాంత్రిక సూత్రం లాగా మల్లయ్య గ్రామానికి పోయే బస్సు సిద్ధంగా వుంది” అంటూ కథ ముగుస్తుంది. ఈ కథ, ఇది తిరిగే పాముల మెలికల్లాంటి పల్లె మార్పుల సమాచార మెలికలు చదివి కథ ముగింపు చూసిన తరువాత…పాఠకుడు తెలుగు కథను వదిలి ఎంత దూరం పారిపోతాడంటే, రచయితలు తమ పుస్తకాలను తామే అచ్చువేసుకుని వీధుల్లో నిలబడి ఫ్రీగా ఇస్తామని పిలిచినా, పొయ్యిల్లోకి కట్టెలులేకున్నా సరే ఎవ్వరూ ఫ్రీ కాపీకూడా తీసుకోనంత దూరం పారిపోతారు. ఇలాంటివన్నీ ఉత్తమ కథలవటంతో, ఇవే ఉత్తమ కథలని రంగుటద్దాల భట్రాజ విమర్శక డింపతులంతా తీర్మానించి వేదికలెక్కి 25ఏళ్ళుగా అరచి చెప్తూండటంతో ఇవి ఉత్తమ కథలయాయి. సంకలనాలు మిగిలాయి. పాథకులు హుష్ కాకి!!!
తెల్లదయ్యం కథ దాదాపుగా ఇలాంటిదే. కాస్త విభిన్నంగా చెప్పాలని రచయిత ప్రయత్నించటం తెలుస్తుంది. దీన్లో అన్నీ మాయమయిపోతూంటాయి. మాయమయినవన్నీ మిల్లుల్లో తేలుతూంటాయి. ” నీ గ్రామంలోని సంపద నీ గ్రామంలో కాకుండా మరెక్కడో చదువులై, ఉద్యోగాలై, పరిశ్రమలై, కళలు, రాజకీయాలుగా మారుతున్నంత కాలం నీకూ నీ పల్లెకూ ఈ మాయ రోగం తప్పదు. మేలుకో! తిరగబడు! నీ శత్రువును నువ్వే కనుక్కో!” అన్న సందేశం వస్తుంది. ఇంతలో సముద్రానికవతలనుంచి ఎగిరొచ్చిన తెల్లదయ్యం జనాలను భయభ్రాతుల్ని చేస్తుంది. వేట కొడవలితో తెల్లదయ్యాన్ని నరకుతాడు. బండ్లు తరలిస్తున్న రెడ్డిని బెదిరిస్తాడు. అదీ కథ. కథను కొత్త రకంగా చెపాలని ప్రయత్నించినా కొత్త దనం లేని కథ ఇది. పైగా, ఇక్కడ ఎవరు శత్రువులు? ఎవరి మీద తిరగబడాలి? రెడ్డి ప్రతీకగా వున్నా, కథలో రచయిత వాదిన పదజాలం పల్లెలనూ పట్నాలనూ శత్రువులుగా వేరు చేసి చూపిస్తుంది. సమాజంలో ఏవయినా మార్పులుంటే రచయిత అన్నవాదు, ఇతరులకన్నా భిన్నం కాబట్టి, ఆ మార్పులను అవగాహన చేసుకోవాలి. పరిణామాల ప్రభావాన్ని గ్రహించాలి. ఆ అవగాహన, గ్రహింపు ద్వారా ప్రజల భయాలను, సంకుచితాలను తొలగించి వారికి మార్గదర్శనం చేయాలి. రచయిత కూడా సామాన్య ప్రజలలాగే ఆవేశ కావేషాలకు గురయి చంపండి, కొట్టండి, నరకండి అంటే, ఇక సమాజానికి మార్గదర్శనం చేసేదెవరు? అందుకే, దీపం పురుగులు మాడిపోయేందుకు దీపంవైపు పరుగులు తీసేట్టు సమాజం గుడ్డిగా సంకుచితాలకు, ద్వేషాలకూ పెద్దపీట వేసి తానున్న కొమ్మక్రింద నిప్పుపెట్టుకునే మూర్ఖుల్లా ప్రవర్తిస్తోంది. మార్గదర్శనం చేయాల్సినవారే గమ్యం దిశలేకుండావుంటే ఇలాగే వుంటుంది. ఏరకంగానూ, ఈ కథను ఉత్తమ కథగా పరిగణించలేము. మిగతా కథలతో పోలిస్తే, సగం వరకూ ఆసక్తిగా అనిపిస్తుంది. రచయిత ఊహ మెచ్చుకోవాలనిపిస్తుంది.
ఈ రచయిత మరో కథ రంకె మిగతా కథల ఫార్మూలానే అనుసరిస్తుంది. అయితే ఇంతకు ముందు కథలో మాయమవటం వుంటే, దీన్లో యాగంటి బసవయ్యను విప్లవానికి ప్రతీకగా వాడటం కనిపిస్తుంది. అయితే, ఈ ప్రతీక ఔచిత్యానికి ఒదగదు. ఈ కథలో అభినందించాల్సిన విషయం ఏమిటంటే, ఆత్మ హత్యలను గ్లోరిఫై చేసేబదులు రచయిత ఆత్మహత్య వ్యర్ధమనీ, అర్ధంలేనిదనీ చెప్పాలని ప్రయత్నించటం. చివరలో ఒక పెద్ద వ్యాసంలాంటి విమర్శ వుంటుంది. మళ్ళీ ఇది కథ అని గుర్తొచ్చి, ఆత్మహత్య చేసుకున్న రైతు రాతిగిట్టెలున్న దూడగా పుట్టటంతో కథ ముగుస్తుంది.
గమనిస్తే, ఉత్తమ కథలుగా ఎంపికయిన అయిదు కథలూ దాదాపుగా ఒకే పరిథిలో తిరగటం తెలుస్తుంది. అద్దంలోని ఆలోచనలు, రంకె దగ్గరకు వచ్చేసరికి ప్రతీకలుగా ప్రదర్సించే స్థాయికి రచయిత పరిణతి చెందటం కనిపిస్తుంది. కానీ, అన్ని కథల్లో రచయిత ప్రదర్సించిన అంశం ఒకటే… నిరాశా నిర్స్పృహలు తప్ప, ఒక defeatist depressive mentality తప్ప మరొకటి కాదు.
పల్లె వాతావరణాన్ని చూపించాయి కాబట్టి ఉత్తమ కథలు, పల్లెల్లో రెడ్ది, నాయుడు గొడవల్లో నలిగే ఇతర కులాల వారి పరిస్థితి చూపించాయి, రైతుల దుస్థితి చూపించాయి అని సమర్ధించుకుంటే ఒక నమస్కారం. కానీ, కథా రచన సూత్రాలు, నియమాలూ ఆధారంగా ఒకో కథని తీసుకుని విశ్లేషిస్తే, ఈ కథలు నిరాశను పెంచటమే కాదు, సమాజంలో విద్వేష భావనలు కలిగించి ఒక negative ఆలోచనకు దారి తీస్తాయని అనిపిస్తుంది.
తిరగబడాలి..ఎవరి మీద? కొడవలి తో నరకాలి. ఎవరిని? ఏదో ఒక గుంపులో చేరి బాంబులేయాలి. ఇదేనా కథల సారం? రాజకీయ నాయకులు దుర్మార్గులు. సరే, దానికి చంపటమో, రంకెలేసి తన్నటమో పరిష్కారమా? అది పరిస్థిని మారుస్తుందా?
ఒక కథలో మల్లయ్య బాంబులు తీసుకుని వూరెళ్తాడు. అది పరిష్కారమా? అలాగే జరుగుతోంది. అలాగే రాశాను..అన్నది సమాధానం కాదు. అలాగే రాస్తే అది వార్త అవుతుంది. ఆ పరిస్థితిలోంచి ఎలా బయటపడల్లో సూచించటం రచయిత పని కాదా? గాడ్ ఫాదర్ లాంటి రచనలోనే రచయిత మాఫియా ఫామిలీ నెమ్మదిగా సమాజంలో మంచి స్థానం సంపాదించటంకోసం మాఫియా పనులు మానేసి గౌరవ ప్రదమయిన వ్యాపారం చేయాలని ప్రయత్నించటం చూపుతాడు రచయిత. అలా జరగకపోవచ్చు. కానీ, ఒక మంచి ఆలోచన ప్రదర్సించటం అభిలషణీయం కదా? అబసవయ్య రంకెలేశాడు. ఏమవుతుంది? ఎవరు నాశనమవుతారు? ఏం ఒరిగింది? ఇలాంటి ప్రశ్నలకు తావు లేకుండా చక్కని ఆలోచనలు కలిగించి మార్గదర్శనం చేసేవే ఉత్తమ కథలు. కేవలం దుర్భర పరిస్థితులు, పల్లెల్లో మార్పులు చూపించి ఆవేశాలు రగల్చటం ఉత్తమం కాదు. అలాంటి కథలు ఉత్తమ కథలు కావు. అలా ఎవరయినా భావిస్తే, వారు కథా రచన గురించి క్లాసులు అటెండ్ చేయాల్సివుంటుంది.
వచ్చే  రిపీట్ కథకులు కేతు విశ్వనాథ రెడ్డి, పాపినేని శివశంకర్ కథల విశ్లేషణ వుంటుంది.
 
Murali Krishna Kasturi
Write a comment…

Enter Your Mail Address

October 11, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply