25ఏళ్ళ ఉత్తమ కథల విశ్లేషణ-8

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనంలో పాపినేని శివశంకర్ కథలు 6 ఉన్నాయి. ఈ సంకలనానికి ఈయనకూడా ఒక సంపాదకుడు. ఇది, సంపాదకుడు తన కథనే ఉత్తమ కథగా ఎంచుకోవచ్చా? అన్న ప్రశ్నకు దారి తీస్తుంది. ఎంచుకోవచ్చనేవారున్నారు, ఎంచుకోకూడదనేవారున్నారు. పత్రికలు పోటీలుపెట్టి, ఆ పత్రికలో పనిచేసేవారు కానీ, వారి బంధువులుకానీ పోటీలో పాల్గొనేందుకు అర్హులు కాదని అనేవారొకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. పత్రికలలో పోటీలు పెడితే, జడ్జి స్థానంలో వున్నవారితో ప్రొద్దస్తమానమూ తిరిగేవారికే గర్వంగా అవార్డులిచ్చేసుకునే కాలం ఇది. conflict of interest అన్న పదం అన్నది వ్యాపారానికేకానీ సాహిత్య వ్యాపారానికి కాదు అన్నది స్థిరపడిన కాలం ఇది. కాబట్టి ఎడిటర్ స్థానంలో వుండి తన కథలను ఉత్తమ కథలుగా ఎంచుకోవటాన్ని నిరసిస్తూనే ఆమోదించాల్సి వుంటుంది.
పాపినేని శివశంకర్ కథలు, 1990లో ఇప్పుడూ-ఇక్కడా, 1995లో చింతలతోపు, 1998లో సగం తెరచిన తలుపు, 1999లో మనుషులు వదులవుతారు, 2004లో చివరి పిచ్చిక, 2007లో సముద్రం అనే కథలను ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు. ఎవరు? ఆయనే!
ఇప్పుడూ ఇక్కడా మామూలుగా మనకలవాటయిన కథ. నీలిమ అనే పాపకు తండ్రి పెద్దగా కష్టపడకున్నా డబ్బులు సంపాదించేయటం రిక్షాలో అమ్మాయిని స్కూలుకు తీసుకెళ్ళే కన్నయ్యకు ఎంత కష్టపడ్డా డబ్బులెందుకుండవో అర్ధం కాదు. పైగా, వాళ్ళు ప్రతి విషయానికి నువ్వు పెద్దగయ్యాక అనటం ఆ పాపకి నచ్చదు. ఆమె వేసిన బొమ్మకు బహుమతి వస్తే తల్లి తండ్రి పట్తించుకోరు.వారు కొన్న లాకెట్ గురించి ఆలోచిస్తూంటారు.
అమ్మ నాన్న ఎంతసేపటికి నన్నుగాక నా భవిష్యత్తునే పట్టించుకుంటారు. అన్నీ డబ్బుకు సంబంధించిన ఆలోచనలే. డబ్బునే కోరుకునేవారు మనుషుల్ని ప్రేమించలేరు కదూ? ఈ మనుషుల మాటల్లో, చేష్టల్లో ఎక్కడో భలే ఆబద్ధం వుంది మామయ్యా! నిన్ను మరీ మరీ చూడాలనిపిస్తోంది. నువ్వు రావా? అంటూ ఉత్తరం రాయటంతో కథ ముగుస్తుంది.
మామూలు కథ ఇది. ధనవంతుడు పేద రిక్షావాడికి డబ్బులివ్వకపోవటం, వాడి డగ్గర డబ్బులు మూల్గుతూండటం, కూతురు సెన్సిటివ్ అవటం, ఆమెను పెద్దలి ఇగ్నోర్ చేయటం…ఈ కూతురే యుక్తవయస్య్దైతే, ఇది యద్దనపూడి మీనా నవలకు నకలు తయారయ్యేది, కాస్త ప్రేమ ఎలిమెంట్ జోడిస్తే! కానీ, ఇది అభ్యుదయ భావాల కథ కదా! కాబట్టి తల్లితండ్రుల డబ్బు బాధ ను విమర్శిస్తే ఉత్తమ సీరియస్ కథ అయిపోతుంది. అయితే, ఈ కథ చివరలో పాప మామయ్యకు ఉత్తరం రాస్తుంది. నిన్ను చూడాలంటుంది. ఈ మామయ్య ఎవరు? అతనికి డబ్బు బాధ లేదా? ఏ రకంగా పాప తన వారికన్నా, ఆ మామయ్యను మంచి అనుకుంటోంది? ఇవన్నీ, సమాధానం లేని ప్రశ్నలు. ఎందుకంటే, ఈ కథలో చివరి వాక్యంలో తప్ప, ఆయన ప్రసక్తి ఎక్కడా రాదు. హీరోయిన్ కొండ అంచునుంచి దూకేసమయానికి వెనుకనుంచి ఒకచేయి వచ్చి లాగినట్టు హఠాత్తుగా వచ్చేస్తాడీ మామయ్య కథలోకి. వస్తు పరంగా, వ్యక్తీకరణ పరంగా ఏమాత్రం కొత్తదనం లేని ఈ కథను సంపాదకుడు ఉత్తమ కథ( కాకి పిల్ల కాకికి ముద్దు) అనుకోవటం సహజం కదా!
చింతలతోపు కథ గురించి గతంలో ప్రస్తావించుకున్నాం. పొగాకు రైతులు, ప్రభుత్వ నిర్ణయాలు, వానలు పదకపోవటం వగైరా.వగైరాల మామూలు అలవాటయిన అభ్యుదయ ఉత్తమ మూస కథ ఇది.
రామకృష్ణ ఓ సబ్ ఎడిటర్. రొటీన్ జీవితం. అతగాడు ఊరెళ్తాడు. అక్కడ గతంలోని స్వేచ గుర్తుకువస్తుంది. స్నేహితులందరితో కలసి బట్టలిప్పి నీళ్ళల్లో దూకుతాడు. ఏమీలేని అత్యుత్తమ కథ ఇది. భార్య అసంతృప్తితో ఆరంభమవుతుంది కథ. మొదటి పేరా చదివి ఇది pre mature ejaculation కు సంబంధించిన కథేమో అనుకుంటాం. ఆయన సాహిత్య పేజీ ఇంచార్జి, కానీ ఎడిటర్ చెప్పిన వారి కవితలు వేయాల్సి వస్తుంది. ఇది చిరాకు. ఈ కథ 1998నాతిది. అప్పటికే సాహిత్య పేజీ ఇంచార్జీలు ఆ పేజీని సాహత్య పేజీలా మార్చి తమవారిని, తమకు లాభాలున్నవారి బాకాపేజీలా, ప్రచార కరపత్రంలా సాహిత్య పేజీని మార్చేశారు. రైతుల ఆత్మహత్యల గురించి కవితలు వేస్తూ ఇంకో ప్రాబ్లం గురించి కవిత వేయమనగానే నిరాశకు గురవటం, టిపికల్, అభ్యుదయ ఆదర్శ వామపక్ష మైనారిటీ లౌకికవాద సబ్ ఎడిటర్ లక్షణం. రచయిత ఈ కథలోనూ ఆ లక్షణాన్ని చూపారు.
మూడు దశాబ్దాలనాతి బాణీ, అంత్యప్రాసలు, ఏళ్ళ తరబడి కవులు వాడీ వాడీ అలసిపోయిన మాటలు అంటూ సాంప్రదాయ పద్యాలను ఈ సడిస్తాడీ రచయిత. అందుకే ఉత్తమ కథ అయిందిది. కానీ, ఈ నాటికి సాంప్రదాయ పద్యాలు చదివి మైమరచిపోయేవారే అధికం, ఆధునిక మాటల పేరాగ్రాఫుల మూటల, చచ్చుపుచ్చు వచన రచనల కవితలకెవ్వరూ స్పందించటంలేదన్న నిజం రచయితకు తెలుసో లేదో..కవులందరికీ తెలుసు. అయినా, ఇది ఊతమ కథ అయింది, ఎలాంటి మెరుపులు లేకున్నా!( కాకి పిల్ల కాకికి కాక ఇంకెవరికి ముద్దు?)
మనుషులు వదులవుతారు అన్నది మరో సగటు మామూలు మూస కథ.
వయసయి పోతున్న చక్రపాణికి భార్య కన్నా, మరో అమ్మాయి అందంగా కనబడుతుంది. ఆమె మొదటి భర్తతో వేరుపడుతుంది. చక్రపాణిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అతనితో వూరు వస్తుంది. కానీ, అతను సెక్స్ కోసమే తనవెంటపదుతున్నాడని గ్రహించి పొమ్మంటుంది. ఇదీ కథ…బాగుందనేవాళ్ళ అభిరుచి వాళ్ళది..( కాకి పిల్ల కాకికే ముద్దు)
కాస్త విభిన్నంగా కథ చెప్పాలన్న ప్రయత్నం చివరి పిచ్చిక కథలో కనిపిస్తుంది. మానవుడి చర్యల వల్ల పిచ్చుకలజాతి అంతరించటాన్ని చూపాలని ప్రయత్నం చేస్తూ, పర్యావరణ కాలుష్యాన్ని పనిలో పనిగా చూపించారు రచయిత. మామూలుగా అయితే, అప్పుడప్పుడే కథలు రాస్తూన్న రచయిత తడబడే బుది బుడి అడుగుల ప్రయత్నమీ కథ అనుకునేవాళ్ళం. కానీ, ఇది ఆయేటి ఉత్తమ కథ!( కాకి పిల్ల కాకికి ముద్దు)
ఈ ఉత్తమ కథల సంకలనంలో ఎంపికయిన పాపినేని శివశంకర్ కథలలో ఏమాత్రమయినా కాస్త బాగున్నదనిపించే కథ సముద్రం. కొన్నేళ్ళుగా కథలు రాస్తూవుంటే రచయిత పరిణతి సాధిస్తాడు. ఈ కథారచనలో కొంతయినా కథారచన సంవిధానంలో రచయిత ఒక అడుగు ముందుకువేశాడు అనిపిస్తుంది ఈ కథ చదివిన తరువాత.
సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి అంటూ ఆరంభమయ్యే ఈ కథ వనమాలి అనే వ్యక్తి జీవిత గమనాన్ని చూపుతూ, దేనికీ చలించని వ్యక్తిత్వాన్ని చూపుతూ, చివరికి అతను మరణించినప్పుడు, చుట్టూ వున్న పుస్తకాలని చూస్తూ, రచయిత సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి అనుకోవటంతో ముగుస్తుంది. rounded off story ఇది. మనకు వనమాలి పాత్రపైన ఎలాంటి అభిమానం, జాలి, అనుబంధం కలగదు. రచయిత రచన అలా అంటీ ముట్టనట్టు matter of fact లా వుంటుంది. కానీ, కథను రౌండ్ ఆఫ్ చేసిన విధానం బావుంది. అందుకని, కాకి పిల్ల చిన్నతనంలో ముద్దుగా వుంటుంది, అందరికీ కాకపోయినా, కొందరికి అనుకోవచ్చు.
వచ్చే వ్యాసంలో రిపీట్ కథకులు వాడ్రేవు చినవీరభద్రుడు, బమ్మిడి జగదీశ్వరరావు కథల విశ్లేషన వుంతుంది.

Enter Your Mail Address

October 25, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply