25ఏళ్ళ ఉత్తమకథ విశ్లేషణ-9

25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనంలో వాడ్రేవు చిన వీరభద్రుడు, బమ్మిడి జగదీశ్వరరావు కథలు చెరో మూడేసి వున్నాయి. వీరిద్దరిలో బమ్మిడి జగదీశ్వరరావు కథకుడేకాక, వామపక్ష ఉద్యమాలతో సంబంధం వున్నవాడు. ఈ సంకలనాలలో కథ ఎంపిక అవటానికి అదొక అదనపు అర్హత!
వాడ్రేవు చినవీరభద్రుడు ప్రధానంగా కథకుడు కాదు. ఆయన కవి. సాహిత్య విశ్లేషకుడు. తాత్విక సాహిత్యం లోలోతుల్లోకి వెళ్ళి అత్యంత నిగూధమయిన రహస్యాలను గ్రహించి ప్రకటించగల సహృదయుడు. సునిషిత అధ్యయనశీలి. ఒకరకంగా చెప్పాలంటే , ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్య విమర్శ గురించి అవగాహన కలిగిన పండితుడు అనవచ్చు. కానీ ఇది ఆయన కథా రచనలో కనిపించదు. కథా రచనలోనూ ఆసక్తి కరంగా ఒక స్థాయివరకూ రచించినా, వాక్యం శుభ్రంగా, భావానికి సంధర్భానికి తగ్గ పదాల కూర్పుతో వున్నా, రచయితకు నిడివి మీద నియంత్రణలేదని, కథా రచనలో ఆరంభం ఎంత ప్రాధాన్యమో ముగింపు అంతకన్నా ప్రాధాన్యమన్న భావన రాహిత్యం ఈ మూడు కథల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.కథా రచయితగా కన్నా, కవిగా, తాత్విక రచయితగా, సాహిత్య విమర్శకుదిగా ఆయన ఉత్తమ సాహిత్యాన్ని స్ర్జించారనవచ్చు.
చిన వీరభద్రుడి కథలు 1990లో సుజాత, 2002లో ప్రశ్నభూమి, 2010లో పాఠాంతరం అనే కథలను సంకలన కర్తలు ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు. సుజాత కథ, 20ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలోనూ వుంది.
సుజాత కథ ఆరంభమే, లాకప్ రూంలో నాపై అత్యాచారం జరిగి ఏడాది కావస్తోంది , అంటూ ఆరంభమవుతుంది. సగం కథ తెలిసిపోవటమే కాదు, సంకలన కర్తలకీ కథ ఎందుకంత నచ్చిందో కూడా అర్ధమయిపోతుంది. సంకలనకర్తలు ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యతిరేకులు. ఈ వ్యవస్థను నిలిపే పోలీసులంటే వారికి పరమ అసహనం. పోలీసులేకాదు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే ఏ వ్యవస్థకూడా వారికి నచ్చదు. వాటిని ఎంత విమర్శిస్తే అంత ఉత్తమ కథ. అందుకే, ఈ కథ ఆరంభ వాక్యం చదవగానే కథ అర్ధమయిపోవటమే కాదు, ఎందుకని సుదీర్ఘమూ, పలు అర్ధంలేని మెలికలు తిరిగే ఈ కథ ఎందుకని ఉత్తమ కథ అయిందో తెలిసిపోతుంది.కథ ఆరంభంలో తనపై జరిగిన అత్యాచారినికి వికలమయిన అమ్మాయి మానసిక స్థిని తెలిపటం వుంటుంది. ఆపై, అమ్మాయి, ప్రగతి శీల, క్రియాశీల శక్తులకు వేదిక అయిన ప్రోగ్రెసివ్ ఫోరం సమావేశానికి వెళ్లాలని అనటంతో, కథ ఉత్తమ కథ ఎందుకయిందో మరో సాక్షం అవసరం లేకుండా తెలిసిపోతుంది. ఆ అమ్మాయి ఎక్కడికీ కదలదు. కానీ, తాను జైల్ లో వున్నప్పుడు తన విడుదలకు ప్రయత్నించిన వారు కాబట్టి వారు ఏర్పాటు చేసిన సమావేశానికి వెల్తుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బాక్ లో సుజాత ఎలా అరెస్టయిందో చెప్తారు. ఆమె, సెలవులకని వూరొచ్చి, సోషియాలజీ లెక్చరర్ సుధాకర్ ని కలవాలని మధ్యాహ్నం మూడింటికి బయలు దేరుతుంది. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు కలసి చేసే ఊరేగింపు ఎదురొస్తుంది. తెలిసిన టీచర్లు కనబడితే మాట్లాడుతుంది. అది చూసి వెయ్యండిరా దీన్ని జీపులో అని పోలీసులు జైలుకు తీసుకువెళ్తారు. ఆమె దగ్గర సుధాకర్ కి రాసిన ఉత్తరం వుంతుంది. దాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిందివుందని పోలీసులు ఆమెని రాత్రికి వుంచేస్తారు. ఇక్కడే కథ బలహీనమవుతుంది. ప్రొద్దున్నే ఉద్యమంలో పాల్గొని పట్తుబడ్డ వారిని సాయంత్రానికల్లా వదిలేశారని అందుకనే సాయంత్రం ఆమె ఒక్కర్తే పోలీసు లాక్ అప్ లో వుందని రచయిత రాశారు. సాయంత్రం కూడా తీవ్రత తగ్గలేదనీ రాసారు. అలాంటప్పుడు సాయంత్రం మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఉద్యమంలో వున్నవారితో మాట్లాడినందుకే ఈమెను అరెస్టు చేసిన పోలీసులు ప్రదర్శన చేస్తున్న వారందరినీ ఎందుకని అరెస్టు చేయలేదు? పైగా ఆమె తండ్రి మునిసిపల్ ఇంజనీయర్ గారి అమ్మాయి. మూడు గంటలకు బయటకు వెళ్ళిన అమ్మాయి, ( అసలు బయట ఉద్యమాలున్నప్పుడు ఇళ్ళల్లోంచి ఆడపిల్లలను బయటకు వెళ్ళనివ్వరు) రాత్రి ఏడుకు ఇంటికి రాకపోతే తల్లితండ్రులు కంగారు పడి ముందుగా పోలీసులను కలుస్తారు. కలిస్తే కథేలేదు. కాబట్టి అత్యాచారం జరిగిన తరువాత మునిసిపల్ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అంటే, రాత్రంతా అమ్మాయి ఇంటికి రాకపోతే ఇంట్లోవాళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఆతరువాత, మొత్తం ప్రోగ్రెసివ్ ఫోరంలూ అందరూ పట్టించుకోవాల్సివచ్చింది. పది రోజులు అమ్మాయి జైల్లో వుంటుంది. అసలు ఉద్యమాలు చేసిన వారిని వదిలేసి అమ్మాయినే పట్టుకుని లాకప్ లో పెట్టటం ఒక అనౌచిత్యం. కనీసం ఉద్యమ నాయకులను కూడా పట్టుకోని వారు, పట్టుకున్నా విడిచేసిన వారు ఈ ఒక్క అమ్మాయినే పట్టుకుని అత్యాచారం చేయటం, అదీ పెద్ద స్థాయి ఉద్యోగంలో వుండి వాళ్ళ నాన్న ఆ రాత్రంతా పోలీసులకు చెప్పకపోవటం కథను కృత్రిమ సినిమాటిక్ సన్నివేశంతో పోలీసుల క్రౌర్యాన్ని చూపి మార్కులు కొట్టేయలన్న తపనను చూపిస్తుంది.
నిజానికి మన పోలీసులు సినిమాల్లో, నవలల్లో అటు జోకర్లుగానో, ఇటు రాక్షసులుగానో కనిపిస్తారు కానీ, వాళ్ళు ఒక్క చూపులో ఎవరేమిటో గ్రహించేస్తారు. ఎవరు నేరస్తులో, ఎవరు కాదో, ఆవలించకముందే ప్రేగులు లెక్కపెట్టి దాన్లో వున్న దోషాలూ చెప్పేస్తారు. ముఖ్యంగా, చదువుకున్నట్టు కనిపించే అమ్మాయితో, ఆమె, ఎలాంటి అసభ్య, అభ్యంతకర ప్రవర్తన లేనప్పుడు, అత్యంత మర్యాదగా ప్రవర్తిస్తారు. అరెస్టయిన అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలు అడగకుండా, తెలుసుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రేపులు చేసేయరు. అలాగని పోలీసు స్టేషన్లలో రేపులు జరగలేదా? అంటే జరిగాయి. కానీ అలా జరగటానికి సరయిన కారణాన్ని ఈ కథ చూపదు. నిజానికి విద్యార్థులు బస్సులను, రైళ్ళను తగలబెడుతూ రెడ్ హాండెడ్ గా చిక్కినా, అరెస్టు చేసి గంట తరువాత వదిలేస్తారు. కాబట్టి, కథలో పోలీసు దౌష్ట్యము, రాక్షసత్వమూ, ప్రోగ్రెసివ్ సంస్థల గొప్పతనమూ స్పష్టంగా రచయిత ప్రదర్సించినందుకే ఇది ఉత్తమ కథ అయింది తప్ప, కథా రచనలో రచయిత ప్రదర్శించిన మెళకువలకో, ఉత్తమ స్థాయి సృజనవల్లనో కాదనిపిస్తుంది. ముగింపుకూడా లేదీ కథకు. తన అనంతర జీవితం ఎలా? అని సుజాత ఆలోచిస్తూంటే కథ ముగుస్తుంది. ఈ కథలో అధిక భాగం ఆలోచనలుంటాయి. ఏరకంగా చూసినా గొప్ప కథ అనిపించదు.
ప్రశ్నభూమి కథ ఒక స్థాయిదాకా అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. మండల రెవెన్యూ అధికారి చంద్రమోహన్ పైన మండలాధ్యక్షుడు రామినాయుడు కేసు పెడతాడు. వాళ్ళ రేషన్ దుకాణం మూసిన తరువాత రాత్రి 8-8.30 మధ్యన వర్షం కురిసే రాత్రి వచ్చి చంద్ర మోహన్, నాయుడు భార్యపై అత్యాచారం చేయాలని ప్రయత్నించాడన్నది నేరారోపణ. దాని మీద కోర్టులో విచారణ జరుగుతూంటుంది. మోహన్ చంద్ర రావు మాట్లాడనంత వరకూ కథ ఆసక్తి కరంగా సాగుతుంది. నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవలన్న ఆసక్తి కలుగుతుంది. రచయిత కథను ఎలా ముగిస్తాడో అని ఆలోచిస్తూ కథ చదువుతూంటాం. మోహన్ చంద్ర మాట్లాడటం మొదలుపెట్టినప్పటినుంచి, కథ గురితప్పుతుంది. ముంబాయి వెళ్ళే రైలు, దారి మళ్ళి, గౌహతి వెళ్తే ఎలావుంటుందో అలా అనిపిస్తుంది కథ పూర్తి చేసిన తరువాత.
మోహన్ చంద్ర, అసలు విషయం విడిచి, ఆవారాలో రాజ్ కపూర్, ఇంకా ఆ మురికి గుడిసెల నడుమ పిల్లలు ఆడుతూనే వున్నారని లెక్చరిచ్చినట్టు ఈ పాత్ర, తన నేపథ్యం, తను ఉద్యోగం సంపాదించటం, ఉద్యోగంలో అందరూ తనకు సేవలు చేస్తూంటే కలిగిన భావాలు, పనిమనుషులు, ఆడపనిమనిషితో సంబంధం, చెప్పుడు మాటలు విని వారిని తరిమివేయటం వంటివి మామూలుగా మరో సందర్భంలో నప్పేవేమో కానీ, ఈ కథను పూర్తిగా దశ దిశను మార్చేస్తాయి. ఈ కథ ఎందుకు ఉత్తమ కథగా ఎంపికయిందని ఆలోచిస్తే, ఈ కథలో వ్యవస్థను విమర్శించటం వుంది. నా ఉద్యోగం నన్ను మనిషిగా నశింపచేసి ఒక లైంగికావయవంగా మారిందని స్టేట్ పై నేరం నెట్టటం వుంది. రాజ్యాంగాన్ని, రాజ్య పరికరాలయిన ఆఫీసర్లను దోషులుగా నిలపటం వుంది.వ్యవస్థను విమర్శిస్తూ, దీన్ని కూల ద్రోయాలని ఉద్యమం చేసే వారిలో ఒకరయిన సంపాదకులకు కథతో కన్నా, రచయిత చూపిన వ్యవస్థ వ్యతిరేకత ప్రాధాన్యం అయి, ఔచిత్యాలు, అనౌచిత్యాలు, ఉపన్యాసాలు పక్కనపెట్టి దీన్ని ఉత్తమ కథగా నిర్ణయించటంలో ఆశ్చర్యం లేదు. ఇంతకీ, కథ పూర్తయినా ఆరోజు ఏమి జరిగిందో తెలియదు. రచయిత కేసు ఏ విధంగా డిస్పోస్ అయిందో అప్రస్తుతం అంటాడు కానీ, కథకు అదే ప్రస్తుతం . తుపాకీ కనిపిస్తే, అది పేలటమో, లేక కనీసం దాని గురించి చివరలో తెలియటమో, ఏదో ఉపయోగం వుండటమో కథా రచనలో మౌలిక సూత్రం. ఆ సూత్రాన్ని విస్మరించి, అసలు విషయం చెప్పకుండా వ్యవస్థని తిట్టి, మాజిస్ట్రేట్ గారి అమ్మాయితో మోహన్ వివాహం అయిందని కథ ముగించటం, ఫెయిలయిన వ్యంగ్యం.
కథగా, పాఠాంతరం కాస్త మెరుగనిపించినా, రచయితలోని పండితుడు కథనాన్ని డామినేట్ చేయటం, మళ్ళీ ముగింపు అసందిగ్ధంగా వుంటుంది. ఒక పత్రిక ఎడిటర్ దగ్గరకు ఒక స్కూలు యజమాని కొడుకు వస్తాడు. విదేశాల్లో వుంటాడీయన. వారిద్దరూ హాంలెట్( షేక్ష్పియర్ నాటకం) గురించి చర్చించుకుంటారు. హాంలెట్ అసలు తప్పు ఘోరాన్ని ఆపగలిగి ఆపలేకపోవటం అని తీర్మానిస్తారు. ఇంతకీ , అసలు విషయం ఏమిటంటే, వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయిని క్లాస్ మేట్స్ వేధిస్తున్నారని ఎడిటర్ కు ఫోన్ కాల్స్ వస్తూంటాయి. ఆ విషయం చెప్తాడు. ఆ తరువాత మళ్ళీ కాస్త చర్చ తరువాత, మా సస్థ రెప్యుతేషన్ పాదు చేయాలన్న పని ఇది అంటాడా యువకుడు. చివరికి ఆ అమ్మాయి మీద ఏసిడ్ దాడి జరిగిందని తెలుస్తుంది. అప్పుడు ఎడిటర్ హాంలెట్ లాగా ఫీలయిపోతాడు. చిన్నప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చి టాయ్లెట్ కి వెళ్ళాలంటే వెంట వచ్చిన ఇక్బాల్ గుర్తుకొస్తాడు.ఇక్బాల్ నువ్వెక్కడున్నావు? అనుకోవటంతో కథ ముగుస్తుంది.
నిజానికి , ఈ కథ ఉత్తమ కథ ఎలా అయిందో అర్ధం కాదు. ఎడిటింగ్ అవసరమయిన కథ ఇది. ఆరంభంలోని మూడు పేజీల చర్చను ఒక్క ముక్కలో చెప్పవచ్చు. హాంలెట్ గురించిన సుదీర్ఘమయిన చర్చ లిటరేచర్ విద్యార్ధులకు ఉపయోగ్గపడవచ్చు. అదంతా తీసేసి తిన్నగా నిన్నెందుకు పిలిచానంటే తో ఆరంభమయితే ఒక్క పేజీలో కథ అయిపోతుంది. ఇంతకీ ఎడిటర్ అంతగా గిల్టీ ఫీలవటం అంతగా నప్పదు. స్కూలు యాజమాన్యానికి తెలిపాడు. అతని బాధ్యత అయిపోయింది. నిరాధారమయిన వార్తలు పత్రికలో వేస్తాడా? టెలీఫోనుల సంగతి పోలీసులకు చెప్తే, వారూ యాజమాన్యానికే తెలియచెప్పేవారు. ఇంతకీ, కరప్షన్ అనీ, ఇక్కడ ఉండాలనిపించటంలేదనీ అని, హాంలెట్ గురించి అంత మాట్లాడిన యువకుడు సాధించిందేమిటి? ఈ కథలో హాంలెట్ ఆ యువకుడే. సమాచారం అందుకుని, పరిశోధించి సరయిన నిర్ణయం తీసుకోకుండా, ఇంత అనర్ధం కానిచ్చింది అతడు. కాబట్టి, ఎడిటర్ కాదు, ఆ యువకుడు బాధపడాలి. కథలో చివర్లో అతడి ప్రసక్తే లేదు. స్కూలు రెప్యుటేషన్ గురించి ఆలోచించే అతడు, తమ స్కూలు విద్యార్థినిపై ఏసిడ్ దాడి అవనిచ్చాడంటే అది అతని వైఫల్యం. స్కూలుకు చెడ్డ పేరు. మరి కథ ఏం సాధించింది? కనీసం ఇది వేరే స్కూలు వాళ్ళ కుట్ర అని తేలిస్తే, స్కూళ్ళ నడుమ పోటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని చూపించిన కథ అనుకోవచ్చు. ఇంతకీ, ఎడిటర్ సరయిన నిర్ణయం తీసుకోలేకపోవటానికి, అతని ఇక్బాల్ అనుభవానికి సంబంధమేమిటి?
ఈ మూడు కథలు ఈ రచయిత ఉత్తమ కథలయితే, కథా రచయితగా కన్నా, విమర్శకుడిగా, వ్యాస రచయితగానే ఈ రచయితను గుర్తించటం ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ కథలను ఉత్తమ కథలుగా ఎన్నుకోవటంలో సంపాదకులు కథ, కథనం, ఔచిత్యం కన్నా, వేరే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తూనేవుంది.
బమ్మిడి జగదీశ్వర రావు కథల విశ్లేషణ రాబోయే వ్యాసంలో….

Enter Your Mail Address

October 28, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply