25ఏళ్ళ ఉత్తమకథల విశ్లేషణ-12

అనుకోకుండా కొన్ని రోజులు విరామం ఇవాల్సి వచ్చింది. మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తున్నామంటూ మెసేజ్ లు పెట్టిన వారికి ధన్యవాదాలు. ఏమయింది, ఆపేశారా? అని ప్రశ్నించిన వారికి ధన్యవాదాలు. మీ విస్లేషణలకోసం ఎదురుచూస్తున్నాము, అని మెయిల్ రాసిన వారికి ధన్యవాదాలు. మీ విశ్లేషణల ద్వారా కథల గురించి, కథల రచన గురించి తెలుసుకొంటున్నాం, కొనసాగించండి అని ఫోను చేసి మరీ చెప్పినవారందరికి కూడా ధన్యవాదాలు. నెట్ లో రాస్తున్న ఈ విశ్లేషణలను స్నేహితుల సహాయంతో ప్రింటు చేయించి మరీ చదువుతూ, ఆపకండి, వీలయితే ఇవన్నీ ఒక పుస్తకంలా తెద్దాం అని ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు. నేను కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల, కొన్ని ఆంతంగిక సమస్యలవల్ల ఇన్నాళ్ళు రాయలేదు కానీ, ఈ విశ్లేషణలు ఆపే ఉద్దేశ్యం లేదు.
ఈ వ్యాసంలో సుంకోజీ దేవేంద్రాచారి కథల విశ్లేషణ వుంటుంది.
25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాలలో సుంకోజీ దేవేంద్రాచారి కథలు 4 ఉన్నాయి. 2001లో నీడ, 2002లో అన్నం గుడ్డ, 2004లో అన్నదాత, 2005లో కొమ్మిపూలు, ఆతరువాత ఇంతవరకూ మరో కథ ఉత్తమ కథల సంకలనంలోకి ఎంపిక కాలేదు.
ఈ నాలుగు కథల్లో మూడు ఒకే రకమయిన కథలు దాదాపుగా. ఈ మూడు కథలు కూదా 25ఏళ్ళ సంకలనంలో ఉత్తమ కథల ఎంపికకోసం సంపాదకులు తయారుచేసిన మూసలో అతి చక్కగా వొదిగే కథలు. ఈ కథలు చదువుతూంటే కొత్త కథలు చదువుతున్న భావన రాదు. కాస్త భాష తేడా(మాండలీకం), కాస్త భావనల తేడా తప్ప, అదే రైతు, అదే వానలు పడకపోవటం, అదే అప్పులపాలు, అదే సమస్య చిత్రణ ....పరిష్కారం మాత్రం హుళక్కి.
నీడ కథలో తండ్రి సేద్యాన్ని కాదని కొడుకు వేరే పనులు, ఆ కాలంలో లాభదాయకమయినవి ఆరంభిస్తాడు. అతడి కొదుకు, తండ్రి అభ్వృద్ధి పరచిన వ్యాపారాలను కాదని కొత్త వ్యాపారం ఆరంభిస్తాడు. అప్పుడు అతడికి తన తండ్రి తాను చేసిన పనికి ఎంత బాధపడ్డాడో తెలిసొస్తుంది. ఇదీ కథ.
అన్నంఘుడ్డ కథలో ట్రాక్టర్లు రావటంతో పనిలేక తిండికి బాధపడే ఒక కుతుంబం కథ. ఈ కథ చివరలో టిఫిన్ బదులు అన్నాన్ని గుడ్డలో కట్టుకొచ్చే వారి గుడ్డ ఎగిరిపోతుంది. ఇది సింబాలిజం అన్నమాట...
అన్నదాత కథలో ఓ రైతుకు అప్పుదొరకదు. వాన పడదు. కొదుకు చదువు, కూతురి సమస్య, పొలం సమస్య, అప్పు దొరకదు,,,ఎవరూ సహాయం చేయరు..ఇదీ కథ..
ఒకే సమస్యను ప్రతి సంవత్సరం వేర్వేరు కథకులు ఎన్ని రకాలుగా చూపించినా, ఒక స్థాయికి వచ్చేసరికి పాఠకుడి మెదడు మొద్దుబారిపోతుంది. దెబ్బ తగిలిన చోటే దెబ్బ పదే పదే తగులుతూంటే నొప్పి తెలియనట్టు, ఒకే సమస్యను 1990 నుంచి వరుసగా 2004 వరకూ క్రమం తప్పకుండా చదువుతూ వస్తూంటే 2004 లో మళ్ళీ అదే కథ వచ్చేసరికి ఆ కష్టాలూ కన్నీళ్ళొ మన ఒకప్పతి తెలుగు సినిమాలూ నవలల్లో నాయికా నాయకుల కష్టాల్లా రొటీన్ అయిపోతాయి. ఖళ్ళున దగ్గే తల్లి, భళ్ళున వాంతిచేసుకునే చెల్లి, చెప్పులు సరిచేస్తూ తండ్రి కళ్ళాపరేషన్ అమెరికాలో చేయించనందుకు బాధపడే హీరో...ఇదిగో ఈ రైతుల కష్టాలు, పల్లెల్లో మారిన జీవన విధానాల కష్టాలు అన్నీ అలా హాస్యాస్పదమైపోయాయి. దాంతో, స్పందింపచేయాలంటే రచయిత  అప్రతిమాన ప్రతిభ వున్నవాడయితే తప్ప పాఠకుడిని అప్రతిభుడిని చేయగల కథ సృజించలేడు. దాంతో  సుంకోజీ దేవేంద్రాచారి కథలు రొటీన్ గా , లవాటయి పాతబడిన అప్పడాల కర్ర జోకులా అనిపిస్తాయి. రచయిత మాండలీకాన్ని వాడేడన్నది తప్పించి మరో చెప్పుకోదగ్గ విషయం కనబడదీ కథల్లో. అన్నంగుడ్డ కథకు బోలేడన్ని అవార్డులొచ్చాయి. పలువురు ఆ కథను ఉత్తమ కథకు ఉదాహరణగా చూపుతూ ప్రసగైంచారు. కానీ, అన్నంగుడ్డ ఒక రొటీన్ కథ. ఈ 15 ఏళ్ళ కథల సంకలనాల్లోనే అలాంటి కథలు ఒక 150 దాకా కనిపిస్తాయి. ఒక దాన్లో రైతు కావచ్చు. ఇంకో దాన్లో టైలర్ కావచ్చు. మరింకో దాన్లో సోడా అమ్మేవాడు కావచ్చు. కానీ, ఏ కథ చూసినా ఏమున్నది గొప్పతనం, ప్రతి కథ ఆధునిక జీవన విధానానికి తగ్గట్టు మారలేని వారి పతన చ్యధా చిత్రణం అనిపిస్తుంది.
అంటే మార్పును నిరసించటం తప్ప దాన్ని అర్ధం చేసుకోవటం, దానికి తగ్గట్టు ఎలా మారాలో చెప్పటం రచయితల బాధ్యత కాదన్నమాట. మార్పు వస్తోంది. మనం చస్తాం, చస్తున్నాం..ఉత్తమ కథకు పిండి తయారయింది. కథల రొట్టెలు తయారుచేయండి. ఉత్తమ కథ అయిపోతుంది..అన్న భావనను ఇస్తున్నాయి, ఒకతొకతిగా కనిపిస్తున్న ఈ ఒకేరకమయిన మూస కథలు.
సుంకోజీ దేవేంద్రాచారి నాలుగో కథ ఒక ట్రావెలాగ్ లాంటిది. ఇది కథకాదు. నలుగురు ఒక గుట్ట ఎక్కుతారు. అక్కడి విషయాలను గురించి చర్చిస్తారు. అక్కడ కొమ్మిపూలు చూస్తారు. వాసన పీలుస్తారు. తరువాత కొండ దిగిన తరువాత మళ్ళీ కొమ్మిపూలు కనిపిస్తాయి.పట్నానికి వెళ్తున్నకొద్దీ వాతికి దూరమైపోతారు. ఇదీ కథ. ఇలాంటి కథలను ఉత్తమ కథగా ఒప్పుకోవటం కాస్త కష్టమే.
గజ ఈతరాలు కథలోనూ ఇలాంటి ప్రయాణ వర్ణనలున్నాయి. కానీ అవి కథలో రెండు పాత్రల అనుబంధాన్ని నిరూపించేందుకు పనికొస్తాయి తప్ప అదే కథ కాదు. అంటే, ఈ కథ ఒక పెద్ద సీరియల్ లో ఒక ఎపిసోడ్ లాంటిదన్నమాట!
ఆ తరువాత రచయిత కథల్లో పల్లెలు మాయమయ్యాయి. మధ్యలో ఒక పత్రికలో ఉద్యోగానికి పత్నం వచ్చి పడక పల్లెకు వెళ్ళిపోయే కథ కొకదానికి ఏదో పత్రికలో బహుమతి వచ్చింది, కానీ, అప్పటికి మూస కథలు రాసే ఇతర రచయితలు తెరపైకి రావటంతో ఈయన కథలు సంకలన కర్తల పరిథికి బాహిరమయిపోయినట్టున్నాయి. అదీగాక, 2000 తరువాత, ప్రపంచీకరణ పవనాలు వేగవంతమవటంతో ప్రపంచంలోని పలుప్రాంతాలలోని రచయితల పవరూ పెరగటంతో , రచయిత అన్నంగుడ్డ ఎక్కడో ఎగిరిపోయినట్టు ఉత్తమ కథలూ ఎగిరిపోయినట్టున్నాయి.ఈ రచయిత కథలను ఉత్తమ కథలుగా ఎంచుకోవటంలో రాయలసీమ పవర్ ఫుల్ లాబీలోని ఒకరి పేరు బలంగా వినిపిస్తుంది. దానికి తోడు జర్నలిస్టు రచయిత కావటమూ రచనల బరువును పెంచిందని అనుకోవటం అనృతం కాదు.
అంటే కథను కథగా కాక, ఒక ఇజమో, ఉద్యమమో, ప్రత్యేక ఆలోచన వ్యక్తీకరణకో మాధ్యమంగా భావించి కథలను సృజించేవారు తాత్కాలికంగా అలాంటి కథలను ఆదరించేవారి కనుసన్నల్లో వున్నంతవరకూ ఆదరణ పొందవచ్చేమేకానీ, వారి కళ్ళకు దూరమయితే.....అంతేనన్నమాట! రచయితలు ఈ సత్యాన్ని గ్రహంచి కథకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. ఎవరి కనుసన్నలు, ఎవరి ఆగ్రహానుగ్రహాలపైనా వారి సృజన ఆధారపడివుండదు.
వచ్చే వ్యాసంలో ఓల్గా కథల విశ్లేషణ వుంటుంది.

Enter Your Mail Address

December 11, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply