25ఏళ్ళ ఉత్తమ కథ విశ్లేషణ-13(డి)

సారీ జాఫర్ కథ ను ఉత్తమ కథగా ఎంచుకోవటానికి కారణాలను ముందుమాటలో సంపాదకులు వివరించారు. ముస్లిం జీవితాలన్ను చర్చించిన కథ అని, ఈ కథతోపాటూ 2003 సంకలనంలో ఎంచుకున్న ఇంకో రెండు కథలను గమనిస్తే గాయపడ్డ ముస్లింల మనస్సులు, వారిని వెన్నాడే అభద్రతాభావాలు అర్ధమవుతాయనీ, అతి మామూలు విషయాలు, సంఘటనలు వారి మనోభావాలను దెబ్బతీసే సున్నితమైన స్థితికి కళ్లకుకట్టినట్తు చూపిస్తాయనీ రాశాౠ. అంతే కాదు, కథానిర్మాణం విషయంలో అనుభవజ్ఞులు కావటంతో రావాల్సిన సమయంలో వచ్చిన మంచి కథ అనిపించారని రాశాౠ.
అయితేం సారీ జాఫర్ కథ చదివితే, బహుషా ఈ కథ సంపాదకులకు సరిగా అర్ధం కాలేదేమోనన్న అనుమానం కలుగుతుంది. అంతేకాదు..ఈ కథ పాత హిందీ సినిమా ధర్మపుత్రను తలపుకు తెస్తుంది. రచయిత్రికి హిందీ సినిమాలతో పరిచయం బాగానే వుందని కథలో ఒకచోట జాఫర్, రామారావులు గజల్స్, హిందీ సినిమాపాతలు రాత్రంతా పాడుకునేవారని రాయటం పట్టిస్తుంది.
రామారావు, జాఫర్ లు స్నేహితులవుతారు. జాఫర్ రామారావుకు సహాయంచేస్తాడు. జాఫర్ వ్యాపారం కలసిరాక కరీమ్నగర్ వెళ్తాడు. చాలా ఏళ్ళ తరువాత కూతురిని హైదరాబాదులో చదివించేందుకు వస్తాడు. అద్దె ఇల్లో, హాస్టలో దొరికేవరకూ తమ ఇంట్లో వుంచమని రామారావు అంటాడు. అయితే, అతని కొడుకు వినయ్ కి ముస్లిం ఇంత్లో వుండటం నచ్చదు. ఆమెని పొమ్మంటాడు. పెద్ద బొట్టుపెట్టుకుని ఆమెని అవమానిస్తాడు. ఆమె కూడా బురఖాలు వేసుకుంటుంది. లేకపోతే మీకూ మాకు తేడా ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నిస్తుంది. చివరికి మావాళ్ళంతా అక్కడే వున్నారని ముస్లిం లుండే ప్రాంతంలో అద్దెగది తీసుకుని వెళ్ళిపోతుంది. తల్లికి చలం నవలలో పాత్ర జాఫర్ అన్నా, పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రం అన్నా ఇష్టమని తెలిసి కొడుకు మంది పడతాడు. వసీం అక్రం ని జట్టులోంచి తీసేస్తే సంతోశిస్తాడు. తల్లి క్రికెట్ పై ఇష్టం పోయిందంతుంది. కొదుకు వేరే దేశం వెళ్ళిపోతాడు. కొదుకు ప్రవర్తనకు రామారాచు బాధపడతాడు. సారీ జాఫరాలి అనుకుంటాడు. ఈ మధ్యలో రామారావులాంటి అనేకమంది ఆలోచించకపోవటంవల్లనే, రథయాత్రలూ, బాబ్రీ మసీదులు, గుజరాత్ లూ జరిగాయని వాళ్ళకు తట్టడు. అంటూ చిన్న వ్యాఖ్యానన్ని రచయిత్రి తనవంతుగా చొప్పించారు( ఇది ఉత్తమ కథా రచన సూత్రానికి విరుద్ధం. అయినా అనుభవజ్ఞురాలయిన రచయిత్రికాబట్టి నియమభంగమే నాగాభరణం అనుకోవాలి) . ఇదీ సారీ జాఫర్ కథ.
ఈ కథలో వినయ్ ప్రవర్తన, అతని సంభాషణలు తిన్నగా హిందీ సినిమా ధర్మపుత్రలో శశి కపూర్ పాత్రను గుర్తుకు తెస్తాయి. బొట్టు గురించిన సంభాషణ కూడా ఆ సినిమాలోదే. ఇంటికి వచ్చిన అతిథిని అవమానించటం, పొమ్మనటం , తండ్రి వీడికీ బుద్ధులు ఎలా వచ్చాయని అనుకోవటం అంతా, ధర్మపుత్ర సినిమానే!
ఇంతకీ కథ ముగింపేమిటి? ఒక రాజకీయ కథ, తోడుల్లోలాగే…ఒక ఉపన్యాసం, ఒక అసంబద్ధమయిన కంక్లూజన్, రచయిత్రి కథతో సంబంధంలేకుండా కథలోకొచ్చి తీర్మానాలు చేయటం….ఇదీ ఉత్తమ కథ!
కథగా తీసుకుంటే, నిజంగా హిందూ ధర్మాన్ని తీవ్రంగా అభిమానించేవారెవరూ ఇస్లామీయులను అంతగా ద్వేషించరు. ద్వేషించినా, ఇలా బహిరంగంగా అవమానించరు. కనీసం ఇంటికి వచ్చిన వారితో అలా అనాగరికంగా ప్రవర్తించరు. నిజానికి ధర్మ పుత్రలో ఆయా దృశ్యాలు సినిమాకోసం కృత్రిమంగా కల్పించినవి. సినిమాలోనూ కృతకంగా వుంటాయి. ఆ సినిమా ఏ నవల ఆధారంగా తీశారో ఆ నవలలో అలా అనాగరికంగా, క్రూడ్ గా ప్రవర్తించదు ఆ పాత్ర. చరిత్రను ఒక సారి గమనిస్తే, హిందువులను చూసి ముస్లింలు అభద్రతా భావానికి గురవటం కన్నా, ముస్లింలను చూసి హిందువులే అభద్రతాభావానికి గురవటం ఈనాటికీ కనిపిస్తుంది. రచయిర్తి చెప్పినట్టు సెక్యులరిస్టులు మౌనంగా వుండటం అన్నది మన దేశంలో జరగలేదు. ఏ విషయమయినా, హింసను మన దేశ ప్రజలు నిర్ద్వంద్వంగా ఖందించటం మనకు తెలుస్తూనేవుంది. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు ఉరితీత గురించిన వివాదం ఇప్పటికీ రగులుతోంది. అదే, మరో ప్రజాస్వామ్యమయిన అమెరికాలో బుష్ అన్యాయంగా ఇరాక్ పై దాడి చేసినా, అఫ్గన్ తీవ్రవాదులను గుంతానమో బే లో అమానుష పరిస్థిల్లో వుంచినా పెద్దగా ఎవరూ కిక్కురుమనలేదు. అదే మన దేశంలో దేశంపై దాడి చేసినవాడిని శిక్షించాలంటే సైన్యాన్ని దింపాల్సిరావటమేకాదు, ఇప్పటికీ నిరసనలు తెలుస్తున్నాయి. ఒకసారి మసీదు దగ్గర బాంబుపేలితే, భయపడి మసీదుకెళ్ళననే కథను గొప్ప కథ అని అవార్డులిచ్చి, ముస్లింల అణచివేత అంటూ మనం ప్రచారం చేసుకుంటాం. కానీ, గుడులపై జరిగిన బాంబుదాడులు, అమర్నాథ్ యాత్రపైని తీవ్రవాదం నీడలున్నా తీవ్రవాదులను ఎదిరించి మరీ గుళ్ళకు యాత్రలకు వెళ్ళే ధైర్యాన్ని కథల్లో ఎక్కడా ప్రస్తావించం. ప్రస్తావిస్తే మనోభావాలు గాయపడతాయని మిన్నకుంటాం. అలాంటి దేశం మనది. ఎవరయినా దెబ్బకొడితే, అబ్బ అనె కనీ, అయ్యో అని కానీ అనకుండా, నన్నుకొట్టిన నీ చేయికి నొప్పిపుట్టించినందుకు తప్పునాదే అనే మనస్తత్వం మనది. అలాంటి దేశంలో ఇలాంటి అసంబద్ధపు, అర్ధం పర్ధం లేని కథలే ఉత్తమ కథలవుతాయి.
నిజానికి , ముస్లింలంటేనే సమాజంలో ఒక రకమయిన వెరపు వుంది. ఇప్పటికీ పాత బస్తీలోనేకాదు, ముస్లీములు అధికంగా వున్న కాలనీల్లో ధైర్యంగా తిరిగే ముస్లిమేతరులు లేరు. పోలీసులకే భయం అటు వెళ్ళలంటే…కానీ మన కథల్లో ముస్లింలు మంచివారు. హిందువులు ముస్లిం ద్వేషులు. అనాగరికులు. అలాంటి పొలిటికల్లీ కరెక్ట్ కథలే ఉత్తమ కథలు. ఈ 25ఏళ్ళ సంకలనాల్లో ఈ అంసంతో వున్న కథలనీ ఇలాంటివే…గమనిస్తే, భారత్దేశంలో వున్నంత స్వేచ్హ భద్రత, ఇస్లామీయులకు ఇస్లాం దేశాల్లోకూడా లేదు. అమ్మాయి బుర్ఖా విషయంలో మతమౌఢ్యమని చర్చించారు రచయిత్రి. కానీ, హిందూ మతమౌఢ్యం లేని యూరప్ దేశాల్లోనూ మత చిహ్నాలు ధరించకూడదని, స్థానిక భాష నేర్చుకోవాలని ఆయా ప్రభుత్వాలు( లౌకిక ప్రభుత్వాలే, రెందు చేతులతో వలసకు వచ్చినవారిని ఆహ్వానించిన దేశాలే) ఆంక్షలు విధించటం చూస్తూంటే, ప్రతి చిన్న విషయానికి మనోభావాలు గాయపడి హింసకు దిగటానికి హిందూ మతమౌఢ్యం కారణం కానేకాదని, హిందూ మతమౌఢ్యం అన్నది మన వామపక్ష, లౌకిక వాదుల ఊహ తప్ప అలాంటిది ఏమీ లేదనీ తెలుస్తుంది. కానీ, అలా లేనిదాన్ని ఉన్నట్టు రాసి, హిందూ ధర్మంపై బురదజల్లితేనే అది అచ్చమైన అలౌకికలౌకిక అభ్యుదయ కథ అవుతుంది, పొలితికల్లీ కరెక్ట్ కథ అవుతుంది. అందుకే, ఉత్తమ కథల్లో ముస్లింల అభద్రతాభావాలు కనిపిస్తాయి కానీ, తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి హాహాకారాలు రోదనలు వినిపించవు. ఆయా కుతుంబాల దయనీయ గాథలు, తమ భయాలతో జరిపే భీకర పోరాటాలు కనబడవు. మాట్లాడితే గుజరాతు గాయాలంటారు కానీ, ముంబాయి దాడిలోని పోయిన ప్రాణాల ఆర్తనాదాల ప్రసక్తి తేరు. ప్రభుత్వ హింస అని సైన్యాన్ని నరరూప రాక్షసులుగా చూపుతారు కానీ, పట్టుబడ్డ వారితో తీవ్రవాదులు పశువుల్లా వ్యవహరించే తీరు, చిక్కిన అమ్మాయిలతో క్రూరమృగాల్ల తీవ్రవాదులు వ్యవహరించే విధానము, వారికి ఆశ్రయం కల్పిస్తూన్న పందికొక్కుల్లంటి ఇంటి దొంగల ద్రోహమూ తెలుగు కథల్లో కనబడవు. ఎందుకంటే, ఒక పద్ధతి ప్రకారం నిజం చెప్పటం నేరమని నమ్మించారు. ఆబద్ధమే ఉత్తమమని స్థిరపరచారు. అందుకే, సారీ జాఫర్ లూ, జమీన్ లు ఉత్తమ కథలయ్యాయి. చంకీపూలదండలు ఉత్తమ కథలయ్యాయి.
కథగా చూసినా పాత్రల చిత్రీకరణ సరిగాలేదు. వినయ్ పాత్ర ఎందుకలా అయిందో వివరణ లేదు.( ధర్మపుత్రలో కూడా ఆ పాత్ర అలా హఠాత్తుగా ప్రవర్తిస్తుంది…నేరం రచయిత్రిది కాదు….ధర్మపుత్ర సినిమాది) ….సంపాదకులూ భారతీయ సంప్రదాయానికి ధర్మానికీ వ్యతిరేకులు కావటంతో( ఈ వ్యతిరేకత ఎలాంటిదంటే తాము సుఖంగా సంసారాలు చేసుకుంటూంటారు కానీ, కథలు దాంపత్యాన్ని తూలనాడాలి, కూల ద్రోయాలి, తాము పురుషుడి అండలో వుంటారు కానీ, మహిళలు సంసారాలు వదలి వేతులు కలిపి పోరాడాలి….వగైరా..వగైరా) ఇలాంటి అర్ధం పర్ధంలేని కథలు, అవగాహన ఆలోచన లేని కథలు, తాము ప్రచారం చేయాలనుకుంటున్న భావం వస్తే చాలు..దాని ఔచిత్యము, తర్కమూ చూడకుండా ఉత్తమ కథ అనేస్తున్నారు. నమ్మిస్తున్నారు. స్థిరపరుస్తున్నారు.
వచ్చే వ్యాసంలో మృణ్మయనాదం విశ్లేషణ వుంటుంది…

Enter Your Mail Address

December 18, 2016 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply