నేను చదివిన మంచి పుస్తకం-16

జీవిత చరిత్రల పఠనం అపూర్వానుభవం. అందులో స్వీయ జీవిత చరిత్రల పఠనమంటే చిత్రకారుడు  మన చేయిపట్టుకుని తన చిత్రాలలోని మర్మాలను, ఇంపులను, సోయగాలను, వివరిస్తూ విహారయాత్ర చేయిస్తున్నట్టు. ఇస్మాయిల్ మర్చంట్ స్వీయ జీవిత చరిత్ర my passage from india చదువుతూంటే ఇలాంటి అనుభూతి కలుగుతుంది.

నిజానికి ఈ పుస్తకంలో ఆయన అద్భుతమయిన విషయాలేమీ రాయలేదు. సినిమా గాసిప్పులు రాయలేదు. విమర్శకులపయిన భయంకరమయిన బాణాలు విసరలేదు.

ఆయన సినిమాలలాగే ఆయన రచనా శైలి కూడా నెమ్మదిగా, మృదువుగా, మంద్రంగా ప్రవహించే నదిలా వుంది. చదువుతూ చదువుతూ వుంటే, ఉద్విఙ్నత కలగకున్నా ఒక రకమయిన ఉత్సాహమూ, ఆనందమూ కలుగుతాయి.

ఆరంభంలోనే బాల్యం నుంచీ సినిమాల పయిన తనకు ఉన్న ఆకర్షణను ప్రస్తావిస్తాడు. నటి నిమ్మి పయిన వున్న ఆకర్షణనూ తెలుపుతాడు. ఆ ఆకర్షణ ఎలా తనను సినీ నిర్మాణం వైపు నెట్టిందో వివరిస్తాడు.

కాలేజీ రోజులలో కార్యక్రమ నిర్వహణానుభవం ఎలా భవిష్యత్తులో తాను నిర్మాత అయినప్పుడు ఉపయోగపడిందో వివరిస్తాడు. అమెరికా చేరటం సినీ నిర్మాణంలో అ ఆ లు నేర్వటం లాంటి విషయాలను ఎలాంటి అతిషయోక్తులు లేకుండా వర్ణిస్తాడు.

ఒకటొటొకటిగా సినిమాలు నిర్మిస్తూ, జయాపజయాలతో సంబంధంలేకుండా, ముందుకు సాగటం వివరిస్తాడు. సినీ నిర్మాణంలో కష్టాలను చిరునవ్వుతో వర్ణిస్తాడు. అంటే, ఇవి చదువుతూంటే పాఠకుడికి సినీ నిర్మాణమంటే భయం కలగదు. ఉత్సాహం కలుగుతుంది. నిర్మాత బాధ్యతలోని సవాళ్ళు అర్ధమవుతాయి.

ఐవరీ తో సంబంధం, రూథ్ ప్రావర్ ఝాబ్ వాలా తో అనుబంధం, ప్రతి సినిమాలో తనతో పని చేసే కళాకారులతో ఆప్యాయతలను చక్కగా చూపుతాడు. ముఖ్యంగా సత్యజిత్ రే తో అనుబంధం, ఆయన వీరికి చేసిన సహాయం, రే కు ఆస్కార్ రావటంలో తన పాత్రలను ఎలాంటి భేషజాలు లేకుండా తెలుపుతాడు.

ఇలా, ఈ పుస్తకంలో ఒకో అధ్యాయం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆలోచనాభరితంగా సాగుతుంది. మామూలు సినిమా నిర్మాణం కాక, ఉత్తమ సినీ నిర్మాణంలో నిర్మాత బాధ్యత, అభిరుచిల ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.

ఒక సినిమా ఉత్తమంగా ఉన్నా, అధమంగా ఉన్నా మనం కళాకారులను బాధ్యులను చేస్తాం. కానీ, ఈ పుస్తకం చదివితే, కళాకారుల కళా ప్రదర్శన నిర్మాత అభిరుచికి అనుగుణంగా వుంటుందని అర్ధమవుతుంది.

ఈ పుస్తక రచన ద్వారా సమాంతర సినిమా నిర్మాణంలో వుండే సాధక బాధకాలను, ప్రేక్షక ఆదరణ, నిరాదరణలపీన్ ఆధారపడివున్న కళలోని మర్మాలనూ తెలుసుకునే వీలు కలుగుతంది. అందుకే, సినిమా పైన ఆసక్తి వున్న వారంతా తప్పక చదివితీరాల్సిన పుస్తకం ఇది.

ముఖ్యంగా, మర్చంట్-ఐవరీల సినిమాలు అధిక శాతం నవలల ఆధారంగా తీసినవి కావటంతో, నవలను సినిమాగా మలచటం పట్ల ఆసక్తి వున్న వారికి మరింత ఉపయోగ పదుతుందీ పుస్తకం.

ఈ సందర్భంలో మన మనసులను తొలుస్తున్న ప్రశ్న- తెలుగులో నవలల ఆధారంగా సినిమాలు రావటం లేదన్న దానికి సమాధానమూ దొరుకుతుంది.

తెలుగులో సినిమాలకు తగ్గ రచనలు బోలెడు వస్తున్నాయి. కానీ, తెలుగు వచ్చిన నిర్మాతలు, కళాకారులేరి, రచనలో మంచి చెడులు చదివి తెలుసుకోటానికి?

Enter Your Mail Address

December 3, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

No Responses

  1. కొత్తపాళీ - December 3, 2008

    మంచి పరిచయం. లైబ్రరీలో దొరుకుతుందేమో చూస్తాను.

Leave a Reply