25ఏళ్ళ ఉత్తమ కథల విశ్లేషణ- 14(బి)

2001 సవత్సరం ఉత్తమ కథల సంకలనంలో కుప్పిలి పద్మ కథ సాలభంజిక తెలుగు కథా ప్రపంచంలో అత్యంత అధికమైన పొగడ్తలకు గురయిన ఆధునిక కథలలో ఒకటి. ఉత్తమ కథ అనగానే సాలభంజిక అంటారు. గ్లోబలైజేషన్లో స్త్రీ ఎక్స్ప్లైటేషన్ అనగానే సాలభంజిక అంటారు.
అంతవరకూ ప్రచురితమయిన కథల్లోంచి 20 ఏళ్ళ ఉత్తమకథలుగా ఎంచుకున్న 30 కథలలో కుప్పిలిపద్మ రచించిన సాలభంజిక ఒకటి. 2000డశకంలోనే రాగలిగే కథల జాబితాలో ఈ కథను కూడా పేర్కొన్నారు జంపాల చౌధరి. కుటుంబం బయటా లోపలా బహుముఖీనమైన దోపిడికి గురవుతూ కూడా అలుపెరుగని పోరాటం చేస్తోన్న స్త్రీల విషాద జీవితాన్ని చిత్రించిన కథ ఇదీని ఏకే ప్రభాకర్ ముందుమాటలో సాలభంజిక కథను ప్రస్తావించారు. సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితంగా జీవితంలో నెలకొన్న కనిపించిన బీభత్సం ఎంత భయానకంగా వుంటుందో సాలభంజిక కథలో కుప్పిలి పద్మ చెప్పిన తీరు గగుర్పాటు కలిగిస్తుందని గుడిపాటి ముందుమాటలో రాశారు. 2001లో ఈ కథ ఎంపికను వివరిస్తూ వాసిరెడ్డి నవీన్, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇక్కడి పాలకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవటం చాలా కథల్లో కనిపిస్తుంది. అలాబలైపోతున్న జీవితాలకు ప్రతినిథులే అంటూ ఇచ్చిన పాత్రల జాబితాల్లో సాలభంజిక లొని పాత్ర అంజలి కూడా వుంది. ఇవే కాక, ఉత్తమ కథలెలా రాయాలని ఈ మధ్య రాసిన వాళ్ళంతా సాలభంజికను పొగడుతారు. విదేశాల్లో సభల్లో కథల గురించి మాట్లాడేవారు కుప్పిలి పద్మ పేరు, సాలభంజిక కథ ప్రస్తావించకుండా వుండరు.
అందరూ ఇంతగా పొగడిన సాలభంజిక కథ చదివితే……వీళ్ళంతా కథను చదివి పొగిడేరా? రచయిత్రి పేరు చూసి, కథాంశం చూసి పొగిడేరా? అన్న అనుమానం వస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గత 15ఏళ్ళుగా పేరున్న, పేరులేని ప్రతి ఒక్కరు ఈ కథను ప్రస్తావించారు. రచయిత్రిని పెద్ద రచయిత్రిగా పరిగణిస్తారు. కథల గురించి సమావేశాల్లో కొత్త/చిన్న కథకులకు ఉపన్యాసాలిప్పిస్తారు. కథ చదువుతూంటే వీరంతా కథ చదివి మాట్లాదుతున్నారా? లేక, ఒకరు పొగిడేరు కాబట్టి , పొగడకపోతే ఏమైనా అనుకుంటారేమోనని పొగడుతున్నారా అర్ధంకాదు. తెలుగు సాహిత్య ప్రపంచంలో కథను బట్టి గాక, రచయిత పేరును బట్టి ఉత్తమ కథలనెన్నుకుంటారని, పదే పదే ప్రస్తావిస్తూ ఆ కథను, రచయితను ఒక పీఠంపై నిలబెడతారని అనేందుకు చక్కని ఉదాహరణ ఈ కథ.
కథా రచనలో మౌలిక సూత్రం కథను ప్రథమ పురుషలో చెప్తే, కథ సాంతం అలాగే చెప్పాలి. లేదూ ఠర్డ్ పెర్సొన్ లో చెప్తే అలాగే చెప్పాలి. ఒకసారి థర్డ్ పర్సొన్లో, మరోసారి ప్రథమపురషలో చెప్పటం దోషం. ఈ కథలో రచయిత్రి కాస్సేపు థర్డ్ పెర్సొన్ లో చెప్పటం, అక్కడక్కడా మరచిపోయి నేనూ అంటూ ప్రథమ పురుషలోకి దిగిపోవటం కనిపిస్తుంది. ప్రచురించిన పత్రికవారు పట్తించుకోలేదు. ఉత్తమ కథగా ఎంచుకున్న సంపాదకులు పట్తించుకోలేదు. 20ఏళ్ళ ఊతమ కథగా ఎంచుకున్న ముగ్గురు సంపాదకులు పట్టించుకోలేదు. చివరికి మళ్ళీ అన్నీ కలిపివేస్తున్నప్పుడూ గమనించలేదు. కనీసం, మరో ఎడిషన్లో ఈ మౌలిక దోశం సవరించుకుంటారని ఆశిద్దాం. ఇన్నాళ్లూ ఎవరూ ఈ దోశం గమనించకపోవటానికి కారణం..ఎవ్వరూ కథ చదవకపోవటమే! కుప్పిలి పద్మ కథ..సంకలనంలో వుండాల్సిందే. గ్లోబలైజేషన్లో స్త్రీలను లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేసే కథ..అంతే…అది ఉత్తమ కథ అయిపోయింది. ఇదీ మన తెలుగు కథల ఉత్తమ కథల అసలు కథ….
అంటే రచయిత పేరు, కథాంశం చాలన్నమాట తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉత్తమ కథగా మన్ననలందుకోవటానికి. ఇవిలేనివారు ఎన్ని ఉత్తమ కథలు రాసినా వారుకానీ, వారి కథలుకానీ ఉత్తమ జాతికి చెందినవిగా పరిగణనకు గురవ్వవు.
సాలభంజిక కథ ఒక విమానాశ్రయం అరైవల్స్ లాంజిలో ఆరంభమవుతుంది. మాధురి అనే అమ్మాయి అక్కడ కూర్చుని కౌశిక్ కోసం ఎదురు చూస్తూంటుంది. మాధురి అనే అమ్మాయి ఎస్కార్టులు. విదేశీయులను రిసీవ్ చేసుకుని వారికి కంపానియన్లలా వుంటారు. తప్పొప్పులు ఆలోచించకు..మంచుఇ జీతం అని నేహా అనే ఆమె మాధురిని వొప్పిస్తుంది. ఇదంతా కథ చెప్పేలోగా, కౌశిక్ వస్తాడు. వారు ఇంటికి వెళ్ళేసరికి కౌశిక్ ఆమె భార్యా భర్తలని వాళ్ళకో పాప వుందనీ తెలుస్తుంది.
ఇక్కడ నేహా తనను ఒప్పించిన విధానం వివరిస్తూన్న చోట…..సోయాసాస్ కీ, టొమాటో సాస్ కీ తేడా తెలియనంతగా నాలిక తడి ఆరిపోయి వున్నానేమో ఇంక మంచూరియా రుచినేం చెప్తా….అన్న దగ్గర ఆగిపోతాం…ఇంతవరకూ మాధురి చూస్తోంది, ఆలోచిస్తోంది అని చెప్తూన్న కథ హఠాత్తుగా నేను అని చెప్తోందేమిటని…..అయితే, ఇది చాలా గొప్ప కథ కదా..ఇదేదో అచ్చు తప్పు అనుకుని ముందుకు సాగుతాం…
ఇంటికి వెళ్ళినతరువాత కౌశిక్ గతం తలచుకుని బాధపడవద్దని ఆమెకు నచ్చ చెప్తాడు. ఇక్కడినుంచి మళ్ళీ పొరలు పొరలుగా జ్ఞాపకాలు అంటుంది రచయిత్రి…ఇక్కడ మళ్ళీ నేహా మాధురిని వొప్పించే ప్రయత్నం చేస్తుంది. వుద్యోగం వదలి ఏం చేస్తారు, ఇదే బెస్ట్ అన్నట్తు చెప్తూంటుంది. ఇక్కడ రచయిత్రి మాధురి పాత్ర ఆలోచనలను మళ్ళీ నేను అంటూ చెప్తుంది.
మళ్ళీ ఉలిక్కి పడతాం. అది ఆలోచనా సంభాషణా అని మరో సారి జాగ్రత్తగా చదువుతాం. అది ఆలోచనే…రచయిత్రి పాత్రలో దూరి నేను అంటూ ఆలోచనలను చెప్తోంది. ఒక్కచోట కాదు, ఆ పేరా అంతా…చూస్తూండలేకపోయాను, సంబరపడిపోయాను, తృప్తిపరచానో, ….ఇలా నేను ప్రయోగం వుండటం….రచయిత్రి ఒక్కసారి కథను రాసిన తరువాత చదివిచూసుకోకపోవటమేకాదు, పత్రికలో సబ్ ఎడిటర్ నుంచి…15ఏళ్ళుగా కళ్ళున్న ఏ విమర్శకుడూ దీన్ని చూడలేదనీ, చూడకుండానే ఉత్తమకథని పొగిడేశారని, పాఠకులంటే, సాహిత్యమంటే వీరందరికీ ఎంత గౌరవం వుందోననీ అర్ధమయిపోతుంది.
అంతేకాదు, ప్రతి తెలుగు పాఠకుడు ప్రతి రచయిత ఇకపై ఎవరయినా ఏదయినా కథను ఉత్తమ కథ అంటే, ఆ కథను చదివినట్టు ఆ విమర్శకుడు నిరూపించుకోవాలని నిలదీసి అడగితేకానీ, ఇలాంటి కథలను శైలీ శిల్పాల పరంగా ఉదాహరణగా చూపి మెచ్చటం ఆపరు. కనీసం, భయంతోనయినా కథను ఒక్కసారయినా చదివి పోగడుతారు.
మాధురి ఉద్యోగం మానేయాలనుకుంటే ఇంట్లోవాళ్ళు బాధపడతారు. భయపడతారు.
ఈ పరిస్థితి మనకు గ్లోబలైజేషన్ తోనే రాలేదు. అంతకు ముందు అంతులేని కథలోనూ మనం అమ్మాయి ఇంటికోసం అన్నీ త్యాగం చేయటం చూశాం. ఏదిపాపం? అనే నవలలో భర్త ప్రమాదంలో వికలాంగుడయితే, భార్య కుటుంబాన్ని పోషించటానికి వ్యభిచరించటం..నిజం తెలిసిన తరువాత ఆమె త్యాగాన్ని గుర్తించటం అటుంచి, సానుభూతికూడా ఎవరూ చూపరు. ఇలాంటి కథలు చదివేం. సినిమాల్లోనూ, వ్యభిచరించి కుతుంబాన్ని పైకి తెస్తే అందరూ ఆమెని ఈసడించటం చూశాం. ఆ రచనలన్నీ 2000కు ముందే….వాతికీ, ఈ కథకీ తేడా అల్లా వేశ్యలనో, అక్రమ సంబంధాలనో, ఉపుదుగత్తె అనో కాక, ఎస్కార్ట్లు, కంపానియన్లు అవటం. అంతే తప్ప ఈ కథలో కొత్తదనమూ, అత్యద్భుతమూ ఏమీ లేవు. కనీసం కథంతా ఒకే పురుషలో చెప్పటమూ లేదు.
ఫ్లాష్ బాక్లో మాధురి సినిమాటిక్ సమస్యలన్నీ తెలుస్తాయి. తరువాత అంజలి పాత్ర వస్తుంది. ఈమె గొప్పలు చెప్పుకుంటుంది. సురేష్ అనేవాదు ఆమె గురించి చులకనగా మాట్లాడతాడు. ఇంతలో మాధురి ఈ ఉద్యోగం వదలి ఓ హోటెల్ లో చేరుతుంది. అక్కడ కౌశిక్ పరిచయమవుతాడు. ఇంగ్లీషు సినిమాల్లోలాగా వాళ్ళిద్దరూ దగ్గరయిపోతారు. ఆమె కనురెప్పలపై పెదవులాంచి నీకో అబ్బాయిని వెతుకుతానంటాడు కౌషిక్. అతడిని మరింత గాఢంగా పెనవేసుకుని మనమే పెళ్ళి చేసుకోవచ్చుగా అంటుంది. బహుషా మన అసంతృప్త జర్నలిస్టు విమర్శకులకు పెళ్ళి తరువాత అనకుండా సెక్స్ చేసి పెళ్ళి ప్రస్తావన చేయటం గొప్ప అభ్యుదయ ఆధునిక అభివృద్ధిగా అనిపించి ఉత్తమ కథగా తోచివుంటుంది.
ఇంతలో అంజలి వస్తుంది. సురేష్ తనని ప్రేమిస్తున్నానంటున్నాడని చెప్తుంది. మాధురి పెళ్ళి అవుతుంది.
ఇక్కడి వరకూ కథ మాధురి దృష్టి నుంచి చెప్పిన రచయిత్రి హఠాత్తుగా అంజలి దృష్టి నుంచి చెప్పతం ప్రారంభిస్తుంది. అది అర్ధం అయ్యేసరికి కాస్త సమయం పడుతుంది. సురేష్ అంజలిని తన వ్యాపారాభివృద్ధికి వాడుకుంటాడు. ఇంతలో అంజలికి సురేష్ వేరే ఎవరినో పెళ్ళి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సురేష్ ఆమెని ఖాతరు చేయడు. ఆమె డబ్బులూ ఇవ్వడు. ఇక్కడి నుంచి కథ మళ్ళీ మాధురి వైపునుంచి చెప్పటం ప్రారంభిస్తుంది రచయిత్రి. మాధురికి , అంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కారణం ఆమెకి ఎయిడ్స్.అక్కడ రచయిత్రి ….ప్రాణం పగిలింది…అన్న వాక్యం రాసింది. ప్రాణం పగలటం ఏమిటో…ఇంతకీ ఎవరి ప్రాణం పగిలింది. ఎందుకంటే రచయిత్రి ఒకసారి మాధురి వైపు నుంచి, మరోసారి అంజలి వైపు నుంచి మధ్యలో నేను వైపునుంచి కథ చెప్తున్నారు. ఇక్కడె ఎవరి ప్రాణాన్ని పగలగొట్టారో..విమర్శకులు, ఉత్తమ కథ అని పొగడినవారు చెప్పాలి, ఈ ప్రాణం పగలటం ఏమిటో..ఎవరి ప్రాణం పగిలిందో!!!!
తరువాత సెక్స్ ఎంత పెద్ద బిజినెస్సో ఒక పేరా లెక్చరిస్తుంది మాధురి ఆమె భర్తకు. ఇక్కడ కథ యేరా నిద్రరావటంలేదా…అంటూ ఆరంభమవుతుంది కాబట్టి అది రాత్రి అనుకుంటాం…ఆతరువాత అతను ఆమెని సముదాయిస్తాడు. అప్పుడు
మెల్లిగా నిద్రపోయాడు కౌశిక్.
ఆమెకి నిద్రపట్టటంలేదు…
కాస్త ఆలోన తరువాత డాలీ ఏడుపు వినిపిస్తుంది. రవ్వంత వుదయపు వెలుగులో ఆమెకి మెలకువ వస్తుంది. ఇంతలో చిట్టి చెయ్యివేసిన డాలీ తుళ్ళింతగా నవ్వుతూ బయటకు లాక్కుపోతుంది. బయట వడగళ్ళ వాన..క్రింద పిల్లలు గొడుగులూ పుస్తకాలూ విసిరేసి ఆడుతూంటారు.
ఇది అర్ధం కాదు. ఈవాన రచయిత్రి వర్ణించిన స్థలకాలాల ప్రకారం రవ్వంత వెలుతురు అందికాబట్టి ఉదయంపూట అనుకోవాలి. అప్పుడే పిల్లలు గొదుగులూ పుస్తకాలూ పారేసి ఆడటం ఏమిటి? అంత ప్రొద్దున్నే స్కూళ్ళకు వెళ్తున్నారా? స్కూళ్ళనుంచి వస్తున్నారా? స్కూళ్ళకువెళ్ళేవాళ్ళయితే తల్లితండ్రులు వర్షంలోనూ తీసుకెళ్తారు ఆడనియ్యరు. స్కూలునుంచి వస్తూంటే రవ్వంత వెలుతురు వచ్చేసమయానికి అయిపోయే స్కూళ్ళేమిటి? పిల్లలతో కలసి మాధురి ఆడుతూంటుంది. కథ అయిపోయింది.
ఇంతకీ ఆమె బాధ తీరిందా? తీరితే ఎలా తీరింది? కథంతా గతాన్ని తలచుకుని బాధపడిన మాధురి బాధ ఎలా మాయమయింది? ఇంతకీ ఈ కథకు అర్ధమేమిటి? కథలో రచయిత్రి ప్రత్యేకంగా ప్రదర్సించిన నవీనత్వమేమిటి? ప్రథమ నుంచి తృతీయకు దూకటమా? ఒకపాత్ర పక్షాన కథ చెప్తూ హఠాత్తుగా మరోపాత్ర వైపు చెప్పి మళ్ళీ ఇటు దూకటమా? లేక అక్కడక్కడా కాస్త సెక్సు కాస్త స్త్రీల అణచివేతలూ రాయటమా? ప్రేమించానని నతించి అమ్మాయిని తన వ్యాపార అభివృద్ధికి వాడే పాత్రను సృజించటమా? ఏమిటో, దీన్లో గొప్పతనము విమర్శకులే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథలు ఇంతకన్నా బాగుండేవి బోలెడన్ని చదివేము. పాకుడు రాళ్ళు నిండా ఇలాంటి పాత్రలే..కళ్యాణి, మంజరి …..దాంతో పోలిస్తే పాత్ర చిత్రణ, సన్నివేశ సృష్టీకరణ ఏమీ లేవీకథలో…. పైగా, ఆరంభమ్నుంచీ ఎలాంటి ఆసక్తి కలగదీ కథలో….కనీసం మానసిక సంఘర్షణలూ, మనస్తత్వ పరిశీలనలూ లేవు. మరి ఏరకంగా ఇది పదే పదే ప్రస్తావించే ఉత్తమ కథ అయింది?
కథా రచనలో ఒక ప్రణాళిక వుంతుంది. అయితే ఆరంభమ్నుంచీ ప్రధాన పాత్రల వైపునుంచి మార్చి మార్చి కథ చెప్పటం ఒక ప్రక్రియ. లేదంటే కథంతా ఒక పాత్ర వైపునుంచి చెప్తూ, మిగతావన్నీ ఆ పాత్ర దృష్తితో చూపటం మరో ప్రక్రియ. అలాంటిదేమీ లేక 80శాతం కథ ఓవైపు నుంచి చెప్త్తొ, మళ్ళీ మరోవైపు దూకి చివరికి మళ్ళీ మొదటి పాత్రవైపుకు దూకి హథాత్తుగా ఒక కంక్లూజన్, ఒక రిసొల్యూషన్ లేకుండా కథను ముగించటం ఏరకంగానూ గొప్ప రచనా సంవిధానం కాదు. ఏ కథనయితే ముగించలేమో ఆ కథనొక అందమయిన మలుపు తిప్పి ముగించమంటాడు, కథకుడు కాని సాహిర్. కనీసం అలాగయినా లేదీ కథ..కొన్ని సంఘటనలను ఒక కథగా మలచలేని అశక్తత ఈ కథలో కనిపిస్తుంది. కేవలం అమ్మాయిలను లైంగికంగా వాడుతున్నారన్న అంశం వున్నందుకు ఇది 20000లోనె వచ్చే అంశం అని తీర్మానించటం మన విమర్శకుల అమాయకత్వాన్ని సూచిస్తుంది. కాలం ఏదయినా, జీవన విధానం ఏదయినా, మహిళలు లంగిక ఆనందాలందించే బొమ్మలే అన్న ఒక సోషియాలజిస్ట్ మాటలను గమనిస్తే, సాలభంజికలు ఒక మామూలు సరిగా వుదికీ వుడకని కథ అని అర్ధమవుతుంది. ఉత్తమ కథకుండాల్సిన లక్షణాలేవీ లేని ఉత్తమ కథ అని తెలుస్తుంది. అయితే తెలుగు సాహిత్యంలో ఉత్తమ కథగా ఎంపికయ్యేందుకు ఉండాల్సిన లక్షణాలు వ్యవస్థ విమర్శ, తమవారయిన రచయిత అనే రెందు లక్షణాలు పుష్కలంగా వున్న ఉత్తం కథ ఇది.
మిగతా రెండు కథల విశ్లేషణ మరో వ్యాసంలో…

Enter Your Mail Address

January 12, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply