25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల విశ్లేషణ-14(c)

కుప్పిలి పద్మ రచించిన మరో రెండు కథలు 2003లో వర్షపు జల్లులో, 2013లో లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ , ఉత్తమ కథలుగా 25ఏళ్ళ ఉత్తమ కథల సంపాదకులు ఎంపిక చేశారు. అయితే, ఈ రెండు కథలు చదువుతూంటే, ఇవి, సాలభంజిక కథలోంచి పుట్తిన ఉప కథలుగా అనిపిస్తాయి తప్ప ప్రత్యేకమయిన కథలుగా అనిపించవు. సాధారణంగా, ఒక కళాకారుడి ఒక కళాప్రదర్శన బాగా పాపులర్ అయితే, కళాకారుడు మళ్ళీ మళ్ళీ అలానే కళాప్రదర్శన చేయాలని ప్రదర్శిస్తాడు. కానీ, మొదటి సారి ఉన్న కొత్తదనం తరువాత వుండదు. ఇమేజీకి బందీ అవటం అంటారు దీన్ని. బహుషా సాలభంజిక కథలో మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేయటం , ఆడవాళ్ళు అన్యాయం అయిపోవటాన్ని చూపించిందని విమర్శకుల నుంచి లభించిన ప్రశంశలు కలిగించిన అభిప్రాయం వల్ల కావచ్చు, ఇక అలాంటి కథలయితేనే మీపులభిస్తుందనేమో, విమర్శకులు తననుంచి అలాంటి కథలే ఆశిస్తారనేమో సాలభంజికలా, పురుషులు అమ్మాయిలను పెళ్ళి పేరుతోనో, మరింకో ఆశచూపో, ప్రలోభ పెట్టి మోసం చేయటమనె అంశమే ఈ రెండు కథల్లోనూ కనిపిస్తుంది. బహుషా తాము ఆశిస్తోందో అందించిందనో ఈ రెండు కథల్లో ఏ మాత్రం కొత్తదనము లేకున్నా, ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
వర్షపు జల్లులో కథ ఆరంభంలో మహి అన్న అమ్మాయి వర్షాన్ని చూస్తూ విషాదంగా వుంటే, వాళ్ళమ్మ, ఏమయింది మహీ? అని అడుగుతుంది. అవును ఏమయింది…అని నాయిక గతంలోకి జారుకుంతుంది…ఇంటర్మేడియట్ లో చేరినప్పటినుంచి మహిలో న్యూనత భావం కలుగుతూంటుంది…తన జీవితంపట్ల, పరిస్థితులపట్ల అసంతృప్తి కలుగుతుంది. క్లాస్ మేట్ దీపాలి కజిన్ ప్రదీప్ ఆమెని కలుస్తాడు. అతను ఆమెని ప్రలోభ పెడతాడు. రెయిన్ డాన్స్ కు తీసుకెళ్తాడు. బీర్ తాగిస్తాడు. ఒకరోజు గెస్ట్ హౌజ్ కి తీసుకెళ్తాడు. ఆమెకు భయం వేసి పరుగెత్తుకుని వచ్చేస్తుంది. ఆమె ఫోన్ చేస్తే, సరిగా మాట్లడడు. పారిపోయావ్ అంటాడు. అన్నీ పెళ్ళి తరువాతే అంటుంది. వెంటనే అతడు..రోజూ తిరిగేవాళ్ళంతా పెళ్ళిచేసుకుంటారనుకుంటున్నావా అని అవమానకరంగా మాట్లాడతాడు. ఇదీ ఆమె బాధ. అది తల్లికి చెప్తుంది. అప్పుడు తల్లి ఓ లెక్చరిచ్చి, కొన్నిసార్లు గాయపడటం అనివార్యం. కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది అని అంటుంది..అంతవరకూ అద్భుతంగా అనిపించని వర్షపు ధ్వని అప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది…ఇదీ కథ.
ఒకరకంగా చూస్తే, ఇలాంటి కథలు బోలెడన్ని వచ్చాయి. ఇంతకన్నా ముందుకెళ్ళి, అబ్బాయి ప్రేమ నటించి, ప్రేమ పేరుతో అమ్మాయిని లొంగదీసుకుని తరువాత వదిలేయటం, బెదిరించటం, బ్లాక్ మెయిల్ చేయటం….ఇలాంటి కథలు బోలెడొచ్చాయి. సినిమాలూ బోలెడున్నాయి. అనేక పాత సినిమాల్లో హీరో చెల్లి ఇలా దెబ్బతింటుంది. వాటితో పోలిస్తే, ఈ కథలోని ప్రదీప్ అమాయకుడే. అమ్మాయి ఒక్కసారి పారిపోగానే తన అసలు రూపం చూపించేసాడు. అనుకున్నది సాధించాలనుకునేవాడు మనసులో కోరిక దాచి, మంచిగా నటించి, అమ్మాయి విశ్వాసం చూరగొని అప్పుడు స్నేహమనో, ప్రేమానో బలహీనం చేసి పబ్బం గడుపుకుంటాడు. అలాంటి కథలూ బోలెడన్ని ఉన్నాయి. ఈ ఉత్తమ కథలను ఎంచుకునే సంపాదకులు ఈసడించే కమర్షియల్ పాపులర్ రచయితలెంతోమంది ఇలాంటి కథలు పలు విభిన్న పద్ధతులలో రచించారు. కొందరు సృంగార కథగా, ఇంకొందరు ట్రాజెడీగా, మరింకొందరు అన్యాయంగా, ఆక్రోశంతో ఇలా పలు విభిన్న కోణాల్లో ఇలాంటి కథలు ఇంతకన్నా ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా రచించారు. వాటికన్నా ఈ కథ ఏ విధంగా భిన్నమో, ఏ విధంగా ఉత్తమమో ఎంత ఆలోచించినా బోధపడదు. అయితే, మేము మెచ్చిందే ఉత్తమ కథ అని సంపాదకులంటారు..కాబట్టి ఈ సంకలనాల సంపాదకులు అమాయకులని, తమకు నచ్చినవారి సాహిత్యం తప్ప మరొకటి చదవరనీ, అందుకే ఇది ఉత్తమ కథగా వారికి తోచిందనీ అనుకోవచ్చు. ఇలాంటి అమాయకులు , సాహిత్యం చదవని వారు ఎంచుకునే ఉత్తమ కథలే ఉత్తమ కథలుగా మిగులుతున్న తెలుగు సాహిత్యం ఎంత అదృష్టం చేసుకుందీ అని ఆనందంతో కన్నీళ్ళు ఎవరికయినా వస్తే నేరం నాది కాదు, కథది..ఉత్తమ కథగా ఎంపిక చేసిన సంపాదకులది.
ఈ కథలోని ప్రదీప్ సాలభంజికలో సురేష్ పాత్రకు దగ్గరగా అనిపిస్తాడు. దాన్లో పెళ్ళి ప్రలోభం చూపించి అమ్మాయిని వాదుకుంటాడు సురేష్. దీన్లో ప్రదీప్ పాపల్ రెయిన్ డాన్స్ కు తీసుకెళ్ళి, బీరు తాగించి, అంతా తిప్పి గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళి, దెబ్బతిని అసలు రూపం చూపించేస్తాడు. అందుకే ఇది అమాయకమయిన మామూలు ఉత్తమ కథ అనుకోవచ్చు. అంటే మనకు మామూలు, సంపాదకులకు అమాయకమయిన ఉత్తమ కథ.
2013 ఉత్తమ కథ లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ కథలో పాత్ర అమాయకత్వాన్ని పోగొట్టుకుందేమోకానీ, సంపాదకులు మాత్రం తమ అమాయకత్వాన్ని అలాగే కాపాదుకుంటూ వస్తున్నారని నిరూపిస్తుందీ ఉత్తమ కథ.
ఇదీ, అబ్బాయి, అమ్మాయిని మోసం చేసే కథనే. అంటే ఒక పదేళ్ళ తరువాత మళ్ళీ మోసం కథే ఉత్తమ కథ అయిందన్నమాట. దీన్లో ఒక సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ విహాన్, దర్శన అనే అమ్మాయితో హాయిగా గడపటానికి షూటింగ్ స్పాట్ కు రమ్మంటాడు. ఆమె రాగానే, అతడి కేరీర్ కి ప్రాముఖ్యం అయిన హనీ అనే ఆమె వస్తుంది. దాంతో దర్శనని నడిరోడ్ లో వదలి పరుగెత్తుతాడు. దర్శన డబ్బులు కార్డులు లేక ఎంతో ఇబ్బంది పడుతుంది. ఎంత ఫోన్ చేసినా విహాన్ సమాధానమివ్వడు. ఆమెకి అతడు జీపులో మరో అమ్మాయితో కనిపిస్తాడు. మరుసటి రోజు ఆమెని విమానం ఎక్కిస్తూ ఏదో కథ చెప్తాడు. ఆమె ఆఫీసుకి వస్తే, ఆఫీసుతో బాసుతో మంచిగా వుంటే సమస్యలుండవని కోలీగులు చెప్తారు.
వోసారి అతనితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళు..నీకీ గోల వదలిపోతుంది..కన్ను గీటుతూ అంది వినీత…
ఐకాంట్ అంది దర్శన.
వో మై డియర్. నీదంతా చాదస్తం. నువ్వు నీ వర్క్ తో మాత్రమే శాటిస్ఫై చెయ్యలేవ్. మేమది ముందే రియలైజ్ అయ్యం. అందుకే ఇప్పుడు చూడు మాకు రోజూ వాడి సతాయింపు వుండదు. పైగా రోజూ పాంపర్ చేస్తాడు. వో పెగ్..వో హగ్ అంతే..అంతుంది..
వాదికంత ఇంపార్టెన్స్ లేదని దర్శన అంటే…
ఆర్యూ మేడ్…ఎక్కడయినా ఇంతే…దానికోసం మరో ఆర్గనైజేషన్ మారటం వేస్ట్…నీకు తెలుసా..నా కాస్మొటెక్స్ బిల్ వొకడికి, నా ఫేషియల్, సెలూన్ బిల్ ఒకడికి ఇచ్చేస్తూంటాను ప్రతి నెలా..దర్శనా ఈ యేజ్లోనే మగవాళ్ళకి మనపై ఆసక్తి వుంటుంది. క్యాష్ ఇట్..ఆ తర్వాత పెళ్ళి పిల్లలు, మన హబ్బీకూడా మనవైపు ఆసక్తిగా చూడడు. అతనికి అవకాశాలు కేరీర్లో బోలెడుంటాయి..మన బాస్ లా…
ఇలా..చెప్తుంది..ఇప్పుడే బాస్ తో ఎంజాయ్ చేసి సమస్యలు సాల్వ్ చేసుకోమంటుంది. అక్కడ విహాన్ దర్శనని పెళ్లి చేసుకుంటే హనీ తనని దూరంపెడుతుందనీ అనుకుంటాడు.
ఇంతలో హనీ ఇంకో యువ కళాకారుదితో బయటకు వెళ్తుంది. సినిమా అవకాశాలు కావాలనుకున్న మరొకడిని గే డైరెక్టర్ రమ్మంటాడు…ఇదే సమయానికి దర్శన బాస్ తో రాజీ పడుతుంది. టే తాగుతుంది. మళ్ళీ విహాన్ ఖండాలాకు పిలిస్తాడు. వెళ్తుంది. అతను హనీ గురించి ఆలోచిస్తూంటాడు. గే ఉదంతం చెప్తాడు. యే ఫీల్డ్ అయితేనేమి క్యాట్( అచ్చుతప్పుకాదు) రేస్లొ అందరం భాగస్తులమే అనుకుంటుంది. కారులో స్టీవీ వండర్ పాట లవ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ లవ్ టుడే…అన్న పాట వస్తూంటుంది. ఇదీ కథ…
ఈ కథ చదువుతూంటే ఒక ఆలోచన వస్తుంది. సరిగ్గా ఇదే సమయానికి బ్లాగుల్లో, ఫేస్ బుక్లో కొందరు ఆడ రీసెర్చ్ స్కాలర్ల గురించి మాట్లాడుతూ అందరూ ప్రొఫెసర్లతో చేస్తారని ఏవో కామెంట్లు వేసుకుంటే, ఆడవాళ్ళగురించి అవమానకరంగా వ్యాఖ్యానించారని వారిపై కేసులుపెట్టి వారిని బ్లాగుల్లోంచి, ఫేస్ బుక్లోంచి తరిమికొట్టారు. ఆ సమయంలోనే ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకున్నారు. ఈ కథలో ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళంతా బాసులతో…వాది సంత్ర్ప్తి కోసం ఓ హగ్..వో పెగ్ తో రాజీపడతారని..మగవాళ్ళు బాసుల్లా వుంటారని..పెళ్ళయితే హబ్బీ కూడా చూడదు కాబట్టి ఇప్పుడే కేష్ చేసుకోవాలనీ….
మగవాళ్ళ కామెంట్లకన్నా ఎక్కువ డామేజింగా, ఆడవాళ్ళ పత్ల, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ పట్ల అపోహలను మరింత పెంచే రీతిలో వుందీ కథ. మగవాళ్ళ టాక్, అవమానకరం అయి, మహిళా రచయిత్రి ఒక హగ్..ఒక పెగ్..ఉత్తమం ఎలా అయింది? పైగా, ఒక మహిళే ఉద్యోగాలు చేసే అందరూ ఒక హగ్, ఒక పెగ్, అనీ ఇప్పుడే కేష్ చేసుకోవాలనీ రాస్తే…అది నిజమని భ్రమపడటంలో తప్పేముంది? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు అవాకులూ చవాకులూ రాస్తే అది ఉత్తమమా? ఎవరో ఒకరో ఇద్దరో హగ్ పెగ్ కు ఒప్పుకుంటే వాళ్ళ వల్ల చులకనకు గురై, బాసు వేధిస్తూంటే చెప్పుకోలేని బాధకు గురయే మహిళా ఉద్యోగులెందరో వున్నారు. ఈ కథ వాళ్ళకి ఏం సందేశం ఇస్తోంది..ఒప్పుకుని సమస్యలను పరిష్కరించుకోమంటోంది. ఇదేనా మహిళల ఆత్మగౌరవం..ఆత్మవిశ్వాసం..ఇదేనా ఫెమినిజం?
ఈ కథలో స్త్రీ పాత్రలను గమనించండి..ఒక్క స్త్రీ పాత్ర కూడా సవ్యంగా లేదు. హనీ, యువకుడు కనిపిస్తే, వాదిని ఫారిన్ తీసుకెళ్తుంది. వాదితో హాలిడేలు గడిపేస్తుంది. నాయిక కోలీఫు హఫ్ పెగ్…కెషిట్..దర్శన విహాన్ తో హాలిడే కు వెళ్తుంది..వాదితో పెళ్ళి తేలకుండానే ఖండాలా వెళ్తుంది..ఇది క్యాట్ రేసు అంతుంది. బాసుతో టే తాగి తిట్టుకుంటుంది. ఇందులో ఏదీ వ్యక్తిత్వం? ఏదీ ఆత్మ గౌరవం? సాలభంజికలు కథలో కళ్ళపై ముద్దుపెట్తుకుని గట్తిగా హత్తుకుని నీకు మంచి మొగుడిని వెతుకుతానంతుందో పాత్ర..ఇందులో హాలిడే కి వెళ్ళి వాది పొందుకోసం తపిస్తూ, వాదు విస్మరిస్తే, వాడి గురించి భయపడుతూ పెళ్ళి ప్రస్తావన తెస్తుంది..వాడేమీ వాగ్దానాలు చేయకున్నా మళ్ళీ ఖండాలా వెళ్తుంది. ఇదేనా ఫెమినిస్ట్ కథలు చెప్పే స్త్రీ వ్యక్తిత్వం..లేక ఆడవాళ్ళిలా వున్నారని చూపిస్తోందా ఈ కథ..ఇలా నష్టపోతున్నారని చెప్తోందా? కానీ నాయిక కొలీగు ఫేషియల్ ఒకడు, ఇంకో ఖర్చు ఇంకోడు అన్నది చూస్తూంటే ఆడవాళ్ళే కేష్ చేసుకుంటున్నాట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఈ కథ గొప్పతనం ఏమిటి? అందరూ కేట్ రేసులో వున్నారని చెప్పటమా? దానికి అందమయిన ప్రక్ర్తి వర్ణనలు, ప్రేమ భావనలు ఇవన్నీ అప్రస్తుతం కాదా? అప్పుడు ఆఫీసు, హారాస్మెంటు..హగ్ పెగ్ వైద్యం…చూపిస్తే సరిపోయేదికదా?
ఏమిటో…ఇదొక ఉత్తమ కథ…దీన్ని చదివి ఇదెందుకు ఉత్తమమయిందో ఆలోచించి విశ్లేషించాలి….
ఒక్క పాత్రకూ వ్యక్తితవ్మ్ లేదు. తనని పిలిచి నదిరోడ్డుమీద వదిలివాది గురించి తపించి మళ్ళీ వాదు పిలవగానే ఖండాలా వెళ్ళిన అమ్మాయిని, ఆ అమ్మాయిపాత్రను సృష్తించిన వారిని, దాన్ని ఉత్తమ కథగా భావించిన వారినీ, ఒక రెండు రోజులు రంగనాయకమ్మ ముందు పారిపోకుండా నిలబెడితే, అప్పుడు వ్యక్తిత్వం , ఆత్మ గౌరవం అంటే తెలిసొస్తుంది. హై క్లాస్ లేడీస్ అంటా ఇమ్మోరల్ అనీ, నీతులూ నియమాలు లేనివారనీ ఉన్న అపోహలను పెంచుతూ, ఆధునిక మహిళలు సెక్స్ ఫస్ట్, మిగతావి తరువాత అనుకుంటున్నారన్న అపోహలను పెంచటమే ఫెమినిజం అయితే, తెలుగు మహిళోద్ధారకులంతా ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం వుంది.
మాకు నచ్చింది, మేము డబ్బులుపెడుతున్నాము కాబట్టి మేమేదంటే అదే ఉత్తమ కథ అనే అహంకారాల స్థానన్న్ని జవాబుదరీ ఆక్రమించనంతవరకూ ఇలాంటి అర్ధం పర్ధం లేని ఉడికీ ఉడకని ఫోకస్ లేని రచనలు ఉత్తమ రచనలవుతాయి. వ్యక్తిత్వం లేని వారూ, ఆత్మగౌరవం ఆత్మవ్శ్వాసం, నైతిక విలువలు, బాధ్యతలు లేని పాత్రలూ ఫెమినిజానికి ప్రతీకలుగా నిలచి మహిళల పట్ల వున్న చులకన్ అభిప్రాయాన్ని మరింత చులకన చేస్తాయి… ఇలాంటి సందర్భాలలోనే అనిపిస్తుంది….ఉత్తమ కథలను నిర్ణయించేవారికి డబ్బు మాత్రమే కాక కనీస సాహిత్య పరిజ్ఞానం, కాస్త విచక్షణ, ఇంకాస్త విలువలపైన విలువ అర్హతలుగా వుంటే బాగుంటుందేమో అని. లేకపోతే, పిగ్మీలంతా మేరు శిఖరాలయి తెలుగు సాహిత్యం దిగ్గజాలై దిశా నిర్దేశనం చేసేస్తూంటారు. అప్పుడు తెలుగు సాహిత్యం ఏ దిక్కు పోతుందో చెప్పనవసరం లేదు. చుట్టూ చూస్తే చాలు.
వచ్చే వ్యాసంలో ఆడెపు లక్స్మీపతి కథల విశ్లేషణ వుంతుంది.

Enter Your Mail Address

January 17, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply