25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథ విశ్లేషణ-15

ఆడెపు లక్ష్మీపతి కథలు మొత్తం 5 ప్రచురితమయ్యాయి 25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాల్లో..1991లో ఆక్రోశం, 1995లో జీవన్మృతుడు, 1996లో తిర్యగ్రేఖ, 2000లో విధ్వంసదృశ్యం, 2008లో అసందిగ్ధ కర్తవ్యం అనే కథలు ఉత్తమ కథలుగా ఎంపికయి ప్రచురితమయ్యాయి.
ఆడెపు లక్ష్మీపతి కథల గురించి చర్చించేకన్నా ముందు కథను చెప్పే పద్ధతుల్లో ద్వితీయ పురుష కథారచన ప్రక్రియ గురించి కొంచెం చర్చించుకోవాల్సివుంటుంది.
సాధారణంగా కథను ఉత్తమ, తృతీయ పురుషల్లో చెప్పటం అధికంగా చూస్తూంటాం. ప్రథమ పురుషలో నేను అని కథ చెప్పటం వుంటుంది. తృతీయ పురుషలో రచయిత  తాను పాత్ర కాకుండా మూడోవ్యక్తిలా, అతను, వారు అంటూ కథ చెప్తాడు. ఒకరకంగా చెప్పాలంటే తృతీయపురుషలో కథ చెప్పేటప్పుడు రచయిత ప్రతివ్యక్తి మనసులో దూరి వారి మనోభావాలను వివరిస్తూ కథ చెప్పవచ్చు. ప్రథమ పురుషలో కథ చెప్పేటప్పుడు, నేను అంటూ చెప్పేవ్యక్తి ఇతరుల మనోభావాలను ఊహించి చెప్పగలడే కానీ, నిర్ధారణగా చెప్పలేడు. పైగా, నేను అని కథ చెప్పే వ్యక్తి అనుభవానికి రాని విషయాలను చెప్పేవీలుండదు.
అయితే, రచయితలు తమ అనువును బట్టి ఈ రెండు పధతులనూ ఒకే కథలో వాడటారు. కథ నేను అంటూ చెప్పి....అవసరాన్ని బట్టి థర్డ్ పర్సన్లో కథను చెప్పటం జరుగుతుంది. ఒకోసారి కథను అల్టెర్నేట్ గా థర్డ్ పర్సన్లోనూ, ప్రథమ పురుషలోనూ చెప్పటం వుంటుంది. జేంస్ పాటెర్సన్ అనే క్రైం నవలల రచయిత పలు రచనల్లో కథను నేను అంటూ డిటెక్టివ్ తో చెప్పిస్తాడు. మరోవైపు క్రిమినల్ దృష్తిలో నేను అంటూ చెప్పిస్తాడు. ఒకోసారి థర్ద్ పర్సన్లో క్రిమినల్ గురించి, ప్రథమ పురుషలో డిటెక్టివ్ కథను చెప్తాడు.
ఈ రెండు పద్ధతులు కాక అరుదయిన మూడో పద్ధతి వుంది. అది ద్వితీయపురుషలో కథ చెప్పటం. నువ్వు..అంటూ కథ చెప్పటం వుంటుందీ పద్ధతిలో....
సాధారణంగా నువ్వు అనే ప్రక్రియను ఉపన్యాసాలలో, కవితల్లో, పాటల్లో, ప్రకటనలలో అధికంగా వాడతారు. సలహాలిచ్చేవారు నువ్వీపని చెయ్యి, ఆపని చెయ్యి అంటూ చెప్తారు. కథల్లో ఈ ప్రక్రియను అరుదుగా వాడతారు.
నువ్వు అంటూ కథ చెప్పటం క్లిష్టమయిన పని. నేను, అతడు అంటూ చెప్పే పద్ధతిలో పాథకుదిని ఆకర్షించటం సులభం. పాఠకుడిని కథలో ఓ పాత్రతో తాదాత్మ్యం చెందించటం సులువు. కానీ నువ్వు అంటూ ద్వితీయ పురుషలో కథ చెప్పేటప్పుడు పాఠకుడిని కథలో ఇన్వాల్వ్ చేయటం కష్టం. నువ్వు అంటూ చెప్పిన అంశం పాఠకుడి అనుభవానికి బాహిరం అయితే మొదటి వాక్యం నుంచే పాఠకుడు కథకు దూరం అయిపోతాడు. నువ్వు అంటూ కథ చెప్పే పద్ధతిలో కథ చెప్పేవాడు, కథలో ప్రధాన పాత్ర, పాఠకుల నడుమ ఇతర ప్రక్రియలలో లేని విచిత్రమయిన సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ నువ్వు అంటూ కథకుడు ప్రధాన పాత్రకు చెప్తున్నట్టుంటుంది. కానీ, ప్రధాన పాత్ర తనను తానే నువ్వు అంటూ కథ చెప్పుకోవటం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎదుటి వారి ప్రతి స్పందనను నువ్వులా అన్నప్పుడు వాళ్ళిలా అన్నారు అని చెప్పాల్సివుంటుంది తప్ప ఇతర ప్రక్రియల్లో లాగా వివరించి వర్ణించే వీలుండదు. ఇదికూడా పాఠకుడు కథతో తాదాత్మ్యం చెందే వీలునివ్వని అంశం. ప్రథమ తృతీయ పురుష ప్రక్రియల్లో కథ చెప్పేవాడు కథ చెప్పేపద్ధతిని నిర్దేశిస్తే, ద్వితీయ పురుషలో కథను వినేవాడు నిర్దేశిస్తాడు.....అంటే ఇతర ప్రక్రియలు ఎవరు చెప్తున్నారు అన్నదానిమీద ఆధారపడి వుంటే, ద్వితీయ పురుష కథలు కథను ఎవరు వింటున్నారు అన్నదానిమీద ఆధారపడివుంటుంది. అందుకే ద్వితీయ పురుషలో కథను ఏదయిన మానసిక సంఘర్షణను, మానసిక వేదనాత్మక సంఘటనను వివరించేందుకు వాడతారు.
ద్వితీయ పురుషలో కథను చెప్పటం ఎంత కష్టమో పాఠకుడు దాన్ని అర్ధం చేసుకోవటం తాదాత్మ్యం చెందటం కూడా కష్టమే.
ద్వితీయ పురుష కథా రచన ప్రక్రియ గురించి ఇంతగా ఎందుకు చర్చించాల్సివచ్చిందంటే ఆడెపు లక్ష్మీపతి కథలు అధిక శాతం ద్వితీయ పురుషలో చెప్పినవి.
కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో..

Enter Your Mail Address

February 4, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply