25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథ విశ్లేషణ-15(ii),15(iii)

ఆడెపు లక్ష్మీపతి కథ ఆక్రోశం థిర్డ్ పెర్సన్ నారేటివ్ లో మామూలుగా అర్ధమయ్యే రీతిలో సాగుతుంది. వెంకటి అనే రైతు పని చేస్తూంటాడు. అతని భార్య వూరు వెళ్తుంది. ఆయన చేస్తున్న పనిని కాస్త వర్ణిస్తాడు రచయిత. ఊరూరు తిరిగి తిండి సంపాదించే శారడకాండ్ల బృందం వస్తుంది రెండెకరాల పొలంలో రెండుపుట్లు కూడా వడ్లు రాలేదని ఉన్నదేదో వారికి ఇస్తాడు వెంకటి. ఇంతలో అతడికి కొడుకు ఆలోచనలు వస్తాయి. అతడి కొడుకు దొరలు దొరతనాలు పోయినయి. ప్రభుత్వ పథకాల సొమ్మును ఎమ్మెల్లే ఇతర పెద్దలు కాజేస్తుంటే వారికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఒకరోజు పోలీసులు వచ్చి అతడిని తీసుకుపోతారు. అతడిని విడుదల చేసామని పోలీసులు అంటారు. ఇంతలో అతని శవం దొరుకుతుంది. ప్రజాస్వామ్య హక్కుల వేదికల వాళ్ళు జోక్యం చేసుకుని లాకప్ డెత్ అని గోల చేస్తారు. ఆయన ఇదంతా ఆలోచిస్తూన్న సమయంలో కుక్కవచ్చి అతని తిండిని తినేస్తుంది. పరాన్నభుక్కూ, దిక్కుమాలినదీ అయిన ఈ ఊరకుక్క అంతా మెక్కేసిందన్న కోపంతో దానిపై రోకలి విసురుతాడు. అది చస్తుంది. ఏదో ఉపశమనం కలిగినట్టనిపించి బీడీ వెలిగించి తేలికగా దమ్ములాగాడని కథను ముగిస్తాదు రచయిత.
ఈ కథ చదువుతూంటే ఆరంభంలో కొత్త కథ చదువుతున్నట్టనిపిస్తుంది. చివరికి వచ్చేసరికి అలవాటయి ఎన్నెన్నోమార్లు చదివిన పాత కథే అని తేలుతుంది. ప్రజాస్వామ్య హక్కుల వేదిక ప్రసక్తి ఈ కథను ఉత్తమ కథగా సంపాదకులు ఎంచుకోవటంలో ఇతోధికంగా తోడ్పడి వుంటుంది. ఆరంభంలో శారదాకాండ్ల వాళ్ళు వస్తే, కథ, అంతరిస్తున్న ఒక జీవన విధానానికి దర్పణం పదుతుందేమో అనుకుంటాం. కానీ, హఠాత్తుగా ఒక యో టర్న్ తీసుకుని అలవాటయిన దారిలోకి వచ్చేస్తుంది కథ. దాంతో ఆరంభంలో వర్ణనలు, అతని భార్య ఊరికివెళ్ళటం, శారదాకాండ్ల వాళ్ళు రావటం అంతా కథ నిదివి పెంచినట్టు అనిపిస్తుంది. కథకు అవన్నీ అనవసరం అనిపిస్తుంది. తిన్నగా కథను వెంకటికి గతం గుర్తుకురావటంతో ఆరంభిస్తే బోలెడంత సమయం మిగిలేదనిపిస్తుంది. పైగా, ముగిపూ ఏమీలేదు. కుక్కను పరాన్నభుక్కు అన్నాడు. ఊరకుక్క అన్నాడు. అన్నమంతా తినేసిందన్నాడు. దాన్ని ఊరి పెద్దలకు ప్రతీకగా తీసుకుని దానిపై రోకలిని విసరటాన్ని తిరగబడి పెద్దలను చంపటానికి ప్రతీకగా అర్ధం చేసుకుందామనుకున్నా అన్వయం కుదరదు. దాంతో ఈ కథ అర్ధంపర్ధం లేని చదివించదగ్గ కథగా మిగిలిపోతుంది. అయితే, కథనం, వస్తువు వంటి కొలబద్దాలను పక్కకు పెట్టి చూస్తే, ఈ ఉత్తమ కథలను ఎంచుకునేవారికి నచ్చే అంశాలయిన పల్లె వాతావరణం, రైతుల అగచాట్లు, దొరల దాష్టీకం, ప్రజాస్వామ్య వేదికల గొప్పతనం, పోలీసుల జులుం వంటివన్నీ పుష్కలంగా వుండటంతో ఇతర లక్షణాల గురించి ఆలోచించే అవసరం లేకుండా ఈ కథ ఉత్తమమై పోయిందని అర్ధంచేసుకోవచ్చు. అయితే, రచయిత భాష, వాక్య నిర్మాణాలలో ఒక సొగసు, ఆకర్షణలున్నాయన్నది నిర్వివాదాంశం.
జీవన్మృతుడు కథ…ఒక్కముక్కలో చెప్పాలంటే దివాళాతీసి మూతపడుతున్న పబ్లిక్ సెక్టార్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి జీవితాన్ని ఆలోచనల ద్వారా ప్రదర్సించిన కథ.. ఇలాంటి కథలు కూడా ఈ సంకలనకర్తలకు అత్యంత ప్రీతిపాత్రమయినవి. దాంతో ఈ కథను ఉత్తమ కథగా ఎంచుకోవటం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించదు. అయితే, ఈ కథను కొత్తగా, కొత్త రీతిలో రచయిత చెప్పటం కూడా ఈ కథను భిన్నమైన ప్రక్రియను ప్రదర్శించిన కథగా సంపాదకులు ఉత్తమ కథగా ఎంచుకున్నారని భావించవచ్చు. అయితే ఈ కథను చదవటానికి మాత్రం పాఠకుడు ఎంతో కష్టపడాల్సివుంటుంది. ఎందుకంటే ద్వితీయ పురుషలో కథను చదివే అలవాటు లేకపోవటం వల్ల రచయిత చెప్తున్న కథలో లీనమవటం కష్టమవుతుంది. దీనికి తోడు కథ ఆలోచనల రూపంలో సాగటంవల్ల చైతన్య స్రవంతి రచనలలు చదివుతూంటే ఎలాగయితే విసుగు కలిగి, ఒకొసారి ఏం చదువుతున్నామో మరచిపోతామో ఈ కథలోకూడా అలాంటి మతిమరపు కలుగుతుంది. పైగా, ద్వితీయ పురుషలో రచనలోనే ఒక డిటాచ్మెంట్ వుంటుంది. నువ్వు అని కథ చెప్పటంవల్ల పాత్రనే తనను తాను వేరుగా భావించుకుంటూ తన కథ చెప్తూంటే , కథ చదివేవాడు దాన్లో తనను గుర్తించి స్పందించటం కష్ట తరమవుతుంది. దీనికి తోడు ద్వితీయ పురుష రచనలో ఏమాత్రం అజాగ్రత్తగా వున్న అది డాక్యుమెంటరీలా తయారవుతుంది. దాంతో , ఈ ప్రక్రియలో రచన చేసేందుకు సాహసించిన రచయితను అభినందిస్తూనే తిట్తుకుంటూ కథను చదవాల్సివస్తుంది.
అయితే, కథ ఆరంభంలో మనకు కథ ఎవరు చెప్తున్నారో అర్ధంకాదు. ఇదికూడా కథలో లీనమవటంలో అడ్డుపడే అంశం. ఒక సినిమా ఆరంభంలో పాయింటాఫ్ వ్యూలో ఒక పదినిముషాలు దృశ్యాలను చూపాడనుకోండి, ప్రేక్షకుడు విసిగి పోతాడు. ఇక్కడా అదే జరుగుతుంది. ఆరంభం గణ గణ గణ …..నిరంతర స్వంతీయిన కాలం…రోజులు, గంటలు, నిముషాలు సెకండ్లుగా మానవ సౌలభ్యం కోసం విభజింపబడ్డ కాలం, ఇలా వర్ణనలు ఆలోచనల్తో ఆరంభమవుతుంది. తరువాత బోనస్ అందలేదని, లాభాలలో నడుస్తున్న కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోతే..ఇలా సాగుతుంది.
గంట మోగుతోంది. ఫోర్మాన్ శణ్ముఖం నిద్రపోతున్నాడా? చీఫ్ ఇంజనీయర్ కి కబురు చేయాలి….ఇలా సాగుతుంది..అంటే పాఠకుడు ఇది ప్రథమ పురుషలో చెప్తున్న కథేమో అనుకుంటాడు ఇక్కడి వరకూ…అయితే..ఫూల్..ఇది ప్లాంట్ కాదు నీ పడకగది…అన్న వాక్యం రావటంతో..ఇది ద్వితీయ పురుషలో కథ అని అర్ధమవుతుంది..ఇది అర్ధమయ్యే సరికే సహనం నశించే స్థితికి వస్తుంది. ఇక్కడి నుంచీ ఇక ప్రభుత్వ రంగంలో రసాయన కర్మాగారంలో ప్లాంట్ ప్రాసెస్ ను నియంత్రించే పనిలో ప్రధాన పాత్రకు 20ఏళ్ళు గడిచిందని అర్ధమవుతుంది. కంపెనీ వ్యవహారాల గురించి కాస్త వర్ణన వుంటుంది.
ఇంతలో సెకండ్ పర్సన్ నేరేటివ్ లో థర్డ్ పర్సన్ వచ్చినట్టు తోస్తుంది…అందరికీ జీయం మాంత్రికుడిలా కనబడ్డాడు…అన్న వ్యాఖ్య..ద్వితీయ పురుష నేరేటివ్ లో రాకూడదు. ఎందుకంటే నువ్వు..అని చెప్పే ప్రక్రియలో ..నీకు కనబడ్డాడు, అందరికీ అలా కనిపించినట్టు నీకనిపించింది..అని ఉండాలి…ద్వితీయ పురుషలో కథ చెప్పేటప్పుడు వ్యక్తిగతానుభవాన్ని సార్వజనీనానుభవంలా చెప్పేవీలుంటుంది..ఎప్పుడయితే..అందరికీ అలా కనబడ్డాడు…అన్న వాక్యం వస్తుందో అప్పుడు…అది థర్డ్ పర్సన్ నేరేటివ్ గా మారిపోతుంది. ఎలాగయితే ప్రథమ పురుషలో కథ చెప్పేటప్పుడు, ఎదుటి వారి ఆలోచనలను చెప్పలేమో, ద్వితీయ పురుషలోనూ అందరి తరఫున మాట్లాడలేడు..కేవలం నువ్వు అంటూ చెప్పాల్సివుంటుంది..
ఆ తరువాత..మళ్ళీ పాత్ర మారిపోతుంది…
ఇంతవరకూ నువ్వు 20ఏళ్ళు ఉద్యోగం చేశావ్..ఇది చేశావ్..అది చేశావ్…అని ఒక పాత్ర గురించి చెప్తూ..ఇక్కడ హఠాత్తుగా మేనేజర్ గురించి నువ్విది చేశావ్ అని చెప్పటం ఆరంభమవుతుంది….అంటే..ఇంతవరకూ మనతో నువ్వు…అంటూ తనగురించి చెప్పుకున్న పాత్ర ఇప్పుడు మరో వ్యక్తితో నువ్వు అంటూ మాట్లాడుతోందన్నమాట..దాంతో ఇది ద్వితీయ పురుషలోంచి మళ్ళీ…స్పీచ్ మార్పిడిలోకి వచ్చింది..అయితే అదే పేరా చివర్లో మళ్ళీ అందరూ ఆక్రోశాన్ని జింజర్ ముక్కల్లో నమిలిమింగారంటూ ద్వితీయ పురుషలోకి వచ్చేస్తుంది కథ…బొంబాయిలో నువ్వు ఇచ్చి వచ్చిన ఇంటర్వ్యూ విశేషాలడిగారంటూ..మళ్ళీ మొదటినుంచీ కథ చెప్తున్న వ్యక్తి వైపు మళ్లుతుంది..ఇదీ ద్వితీయ పురుషలో కథ రాయటంలోని కష్టం..ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా వ్రతం చెడుతుంది..ఫలితం పోతుంది…ఇక అలా సాగుతుంది కథ….భార్య వేధింపులు…పిల్లల పెంపకంలో కష్టాలు..ఇలా విసుగ్గా గమ్యం లేకుండా సాగుతుంది కథ…పిల్లల గురించి కొన్ని ఆలోచనలు…మళ్ళీ చైతన్య స్రవంతి రీతిలో సాగుతాయి..అంటే రచయిత చైతన్య స్రవంతి ప్రక్రియనూ…ద్వితీయ పురుషలో కథ చెప్పే ప్రక్రియనూ కలిపి కలగాపులగం చేస్తున్నాడన్నమాట. ఇందువల్ల కథ గందరగోళం అవుతుంది. మళ్ళీ భార్య మాటలను ఆమె అన్నవీన్నట్టు యథాతథంగా రాశాడు రచయిత..ఆమె నిన్నిలా అన్నది..అని రాయక ఆమె మాటలను కొటేషన్లలో పెట్టటంతో….కథ ఒకసారి పాత్ర తనగురించి తాను నువ్వు అని చెప్తూ..మరోసారి వారు..అంటూ..ఇంకోసారి కొటేషన్లిస్తూ…మధ్యలో కంపెన్నీ వ్యవహారాలు, వాతావరణ కాలుష్యం, కంపెనీ రాజకీయాలు, ఇలా సాగుతూ సాగుతూ చివరికి అమ్మ మరణ వార్త విని కూడా చలించని మానసిక మరణాన్ని పొందటంతో కథ పూర్తవుతుంది…
ఈ కథ నిడివి చాలా పెద్దది…ద్వితీయ పురుషలో పెద్ద కథలు రాయటం చాలా కష్టం…ఇటీవలే యుటాహ్ యూనివర్సిటీలో ద్వితీయ పురుష రచనలపై రీసెర్చ్ పేపర్ వెలువడింది. దాన్లో ద్వితీయ పురుషలో ఎక్కువనిడివి ఉన్న కథలు నవలలు రాసి పాఠకుల చేత చదివించగలగటం కష్టం అని తీర్మానించారు. అయినా కొందరు ద్వితీయ పురుషలో నవలలు రాసి మరీ మెప్పిస్తున్నారు..కానీ, ఈ కథ ద్వితీయ పురుషలో చెప్పటంవల్ల రచయిత ఆసించిన ప్రయోజనం సిద్ధించిందనుకున్నా…పాత్ర మానసిక వ్యధను ప్రదర్శించటం, దుర్భరమైన వేదనను..మానసిక మరణాన్ని ప్రతిభావంతంగా ప్రదర్సించటము అన్నవి నెరవేరాయనుకున్నా…ఈ కథను చదవటం ఒక రకంగా పెద్ద కఠినమయిన పరీక్షనే…సహనం, ఓపికలున్నా..మనసు ఎటో పరుగెత్తి కథ అర్ధంకావాలంటే, మళ్ళీ పట్తి బంధించి చదివాల్సివుంటుంది…కథ నిదివి తగ్గిస్తే కథను చదవటం సులభం అవుతుంది…అయితే, ద్వితీయ పురుషలో కథను రచించే సాహసం చేసి విజయవంతంగా కథను పూర్తిచేసిన రచయితను అభినందించక తప్పదు…
(iii)
ఆడెపు లక్ష్మీపతి రాసిన జీవన్మృతులు కథ చదివేక ఒక ఆలోచన వస్తుంది..అసలు ఒక కథను ఉత్తమ కథగా ఎలా నిర్ణయిస్తారు? కథలో ప్రదర్శించిన అంశమా? అంశాన్ని ప్రదర్శించిన విధానమా? ఒక మామూలు అంశాన్ని రచయిత అత్యద్భుతమయిన రీతిలో ప్రదర్శిస్తే అది ఉత్తమ కథ కాదా? ఒక గొప్ప విషయాన్ని అత్యంత విసుగువచ్చే రీతిలో, చదవాలని ఉన్నా చదవలేని రీతిలో రాసినా అది ఉత్తమ కథ అవుతుందా? ఒక కథను ఉత్తమ కథగా ఎంచేందుకు ప్రధానంగా అది మనసును కదిలించాలన్నది అధికులు చెప్తారు. అలాంటప్పుడు మనసును కదిలించకున్నా కొన్ని అంశాలను స్పృశిస్తే చాలు ఉత్తమ కథలయిపోతాయా?

జీవన్మృతులు కథ చెప్పిన విధానం, ద్వితీయ పురుష, ప్రయోగాత్మకం. సాధారణంగా ఇది వ్యక్తి మనసుకయిన గాయాన్ని trauma ను ప్రదర్శించటానికి వాడే ప్రక్రియ. ఒక కొత్త ప్రక్రియలో కథ చెప్పినందువల్ల అది ఉత్తమ కథ అవుతుందా?
గమనిస్తే, కథలో , ద్వితీయ పురుష పద్ధతిలోనే కాక, తెలిసో తెలియకో ఇతర ప్రక్రియలోనూ అక్కడక్కడ కథను రాసినట్టు తెలుస్తోంది. ఇది కథనలోపం..అలాంటప్పుడు, కొత్త ప్రక్రియలో కథ చెప్తూన్నా, ఆ ప్రక్రియలో కథ చెప్పటంలో లోపాలున్నా దాన్ని ఉత్తమ కథగా ఎంచాలా?
కథలో , స్వగతం వుంది..నువ్వు అని చెప్తూన్నా కథ స్వగతంలా అనిపిస్తుంది తప్ప కొత్త ప్రక్రియలోని థ్రిల్ కథ చదువుతూంటే కనపడదు. అలాగే, కథలో పలు ఆలోచనలుంటాయి…అవన్నీ చదివేసరికి ఎంతో విసుగు వస్తుంది. ఇక్కడ కథ, ఒక ప్రభుత్వ రంగ సంస్థ మూతపడటం గురించా? అది మూతపడితే అల్లకల్లోలమయ్యే వ్యక్తుల జీవితాల గురించా? మానవ సంబంధాలగురించా? రచయిత వీటన్నితినీ కథలో ప్రదర్శించాలని ప్రయత్నించటంతో కథ ఫోకస్ లేకుండా అయింది. దీనికి తోడు ద్వితీయ పురుషలో చెప్పటంతో కథ చదవటం ఒక కష్టమయిన శిక్షలా తోస్తుంది..అయినా ఇది ఉత్తమ కథ ఎలా అయింది? కథాంశం…..ఎలాగయితే అవార్డు వచ్చిన ఆర్ట్ సినిమాలను చూడటం ఎంత కష్టమో, అయినా అందరూ అసలు భావాలను దాచి పైకి నలుగురితో పాటూ అద్భుతం అనకపోతే, ఎవరేమనుకుంటారో అని అద్భుతం అన్నట్టు, ఒకరు పొగడగానే విమర్శకులు తమ కలాల పొగడ్తల పాళీని పదునుపెట్టి పొగిడేస్తారు…ఇవన్నీ పక్కనపెడితే, రచయిత కథలో ప్రదర్శించినవేవీ కొత్తవి కావు…కొత్తదనమల్లా….ఒక వ్యక్తి ఆంతరంగిక ఫ్రస్ట్రేషన్లో, కూతురు బ్లూఫిల్ములు చూస్తోందా అని బాధపడటం, సెక్సీ సెక్సీ ముఝె లోగ్ బోలే పార్కులో బెంచిమీద పాడుకుంతుందా అనుకోవటం..ఇలా ఒక మనిషి మనసులోని ఆలోచనలను ప్రదర్సించటం..ఈ కథ ప్రత్యేకత…గమనిస్తే, ఇదే రకమయిన ఆలోచనా పద్ధతిని, ఇంకాస్త దిగజార్చి ప్రదర్శించినా ఉత్తమ కథగా ఎన్నుకోవటం ఇంకొన్ని కథల్లో చూస్తాము….అంటే, సంపాదకులకు, ఉన్నతమయిన ఆలోచనలు, ఆత్మవిశ్వాసము కన్నా, దిగజారుడు తనము, ఫ్ర్స్ట్రేషన్లోని ఆలోచనలకే ప్రాధాన్యం అన్నమాట…
ఒక్క నిముషం, కాస్త సబ్జెక్ట్ నుంచి పక్కకు తొలిగి చూస్తే, ఇదే రకమయిన ఆలోచనాధోరణి సినిమాలను ఉత్తమ సినిమాలుగా ఎంచటంలోనూ కనిపిస్తుంది. దరిద్ర్యము, నైచ్యము, దిగజారుడు తనము, మనిషి మనస్సుల్లోని కుళ్ళు, లైంగిక అసంతృప్తులు, నియమోల్లంఘనలు ఇవే ఉత్తమాలు మనకు…..అదే సాహిత్యంలోనూ కనిపిస్తోంది. ఇది ఎంతగా వామపక్ష అభ్యుదయ విప్లవ ఉద్యమ భావాలు మన ఆలోచనా విధానాన్ని, మన సాహిత్యాన్ని, ఉత్తమము, ఆదర్శము, అనుసరణీయము అన్న ప్రతిదాన్నీ ఎంతగా ప్రభావితం చేసాయో స్పష్టం చేసే అంశం…
తిర్యగ్రేఖ కథను ద్వితీయ పురుషలో చెప్పటం అభినందనీయం…రేప్ కు గురయిన ఒక అమ్మాయి మానసిక వ్యథను ప్రదర్సించే కథ ఇది…దాంతో ద్వితీయ పురుష ప్రక్రియ కథకు చక్కగా అతికింది..కథ కూడా ఆసక్తిగా సాగుతుంది. రేపిస్తును పిచ్చికుక్కతో పోలుస్తూ, పిచ్చికుక్క కరచిందని చెప్పటం బాగానిపిస్తుంది..పాథకుడికి విషయం బోధపదుతున్నా అదేనా ? కాదా? అని చివరివరకూ చదువుతాడు. అయితే, ఈ కథలో ఒక దశలో మానసిక వేదన బదులు సామాజిక విమర్శవైపు కథ మళ్ళుతుంది.ఇక్కడే కథ దెబ్బతిని..సంపాదకులు మెచ్చే వామపక్ష ఉద్యమ భావ ప్రచారక కథలా మారిపోతుంది. ఒక అమ్మాయి విప్లవాత్మకమయిన నిర్ణయం తీసుకుంటే దానికి సమాజ విమర్శ జోదించాల్సిన అవసరం లేదు. మానభంగం మీద సమాజం దృక్పథం మారదామేడం? అని కథ చెప్పే పాత్ర ఏదవటానికి సరయిన భూమిక కల్పించి పాత్రపట్ల సానుభూతి కలిగించలేకపోవటం రచయిత వైఫల్యం..ముఖ్యంగా ద్వితీయ పురుషలో కథ చెప్తూకూడా!!! దీనికి కారణం కథ చివరకు వచ్చే సరికి రచయిత ఉపన్యాస ధోరణిలోకి వచ్చేస్తాడు. కానీ, ఈ కథ చెప్పిన విధానానికి, కథలో ద్వితీయపురుష ద్వారా ఇతర పాత్రల వ్యక్తిత్వాలను ప్రదర్సించిన తీరుకు రచయితను అభినందంచక తప్పదు. ఒక చక్కని ప్రయోగాత్మక కథ అని అభినందించకతప్పదు…అందుకే, ఈ కథను ఉత్తమకథ అంటే కాదనటానికి మనసొప్పదు.
మిగతా కథల విస్లేషణ మరో వ్యాసంలో…

Enter Your Mail Address

February 7, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply