25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ- 15(IV)

ఆడెపు లక్స్మీపతి మరో ఉత్తమ కథ విధ్వంస దృశ్యం. ఇది కూడా ద్వితీయ పురుష(మధ్యమ పురుష)లో వున్న కథ. అయితే దీన్ని కథ అనేకన్నా దృశ్య వర్ణన అనవచ్చు. ఇదికూడా చదవటానికి అతి కష్టపడాల్సిన కథ. రచయిత కథను దృశ్యాల ద్వారా చెప్పాలని ప్రయత్నించాడు. కానీ, దృశ్యాలనన్నిటినీ కలిపే అంశమేదీలేదు. అన్నీ డిప్రెసివ్ సంఘటనలే…ఎటునుంచి ఎటువెళ్తాయో ఓహకందవు. ఇదెలాగంటే ఒక గమ్యం, సంబంధము లేని దృశ్యాలను ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూస్తూంటే ఎలావుంటుందో ఈ కథ చదువుతూంటే అలా వుంటుంది. గమనిస్తే, రచయిత కథను టెక్నిక్ కోసం త్యాగం చేయటం స్పష్టంగా తెలుస్తూంటుంది. ఇక్కడే ఒక విషయం ప్రస్తావించుకోవాల్సివుంటుంది.
కథలో ప్రధానమయినదేది అన్న విషయం చర్చించాల్సివుంటుంది.
ఇటీవలే ఒక విమర్శక మిత్రుడు నాతో మాట్లాడుతూ, నాకు ఆడెపులక్ష్మీపతి కథ జీవన్మృతుడు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు చైతన్య స్రవంతిలో రాసే కథలు నచ్చుతాయి అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, విమర్శకుడు కథను టెక్నిక్ ఆధారంగా మెచ్చటం. కానీ, టెక్నిక్ అన్నది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడపడితే అక్కడ విచక్షణ రహితంగా వాడేది కాదు. అలావాడితే టెక్నిక్కేకాదు అన్నీ అభాసుపాలవుతాయి. చైతన్య స్రవంతి ఒక ప్రక్రియ. మధ్యమ పురుషలో కథ చెప్పటం ఒక ప్రక్రియ..ఈ రెండు ప్రక్రియల వాడకమూ నిర్దిష్టమయిన ప్రయోజనాలు సాధించటంకోసం…ముఖ్యంగా మధ్యమ పురుషలో కథ చెప్పటం ఏదయిన ట్రామా ను వర్నించే కథలలో వాడతారు. ఆడెపు లక్ష్మీపతి ట్రామా తో సంబంధంలేకుండా ఆలోచనలను చైతన్య స్రవంతి పద్ధతిలో చూపించేందుకు ఈ పద్ధతి వాడుతున్నాడు. నిజానికి కథ ఏమీలేదు. ఆలోచనలు, నిరాశ, కోపం, విసుగు..ఇలాంటి భావాల ప్రదర్శనకు ఆయన కథా మాధ్యమాన్ని ఎంచుకునాడు తప్ప కథ చెప్పటానికి కాదేమో అనిపిస్తుంది. యూరోపియన్ సినిమాలు చూసేవారికి విసుగొస్తాయి..ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు. అలాగే, మిలన్ కుందేరా, బెర్జెర్, గేబ్రియల్ గార్షియా మార్కెజ్ వంటి వారి రచనలు చదవటం, సామాన్య పాఠకుడికి చాలా కష్టం. ముఖ్యంగా మిలన్ కుందేరా వంటివారు అసలు నవలలో కథ ఎందుకుండాలని ప్రశ్నించి మరీ ఇష్టం వచ్చినట్టు రచనలు చేస్తారు. ఒక నారేషన్ అన్నది లేకుండా వుంటుంది….ఆడెపు లక్ష్మీపతి కథలు అలాంటివి. విధ్వంస దృశ్యం కథలో ధరలు భగ్గుమనటంతో కథ ఆరంభమవుతుంది. ధరల గురించి, లేమి గురించి, అనారోగ్యాలగురించి ఆలోచిస్తూ అందరినీ చీదరించుకుంటూ పోతున్న కమలకు అందంగా అలంకరించుకున్న శిరీష కనిపిస్తుంది. కాస్సేపు శిరీషను చూసి మనసులో ఏడ్చుకుంటుంది కమల. వాళ్ళ చర్చలు మధ్యలో ఆలోచనల్లో ప్రభుత్వ విధానాలు ప్రజల బాధలు అన్నీ చర్చకు వస్తాయి…మధ్యలో చిట్ ఫండ్ లెత్తుకుపోయినామె గురించి చర్చవస్తుంది. ప్రైవేట్ ఎకానమీ చర్చవస్తుంది. చివరలో శ్రీష కమలతో మద్రాసువంటి నగరాలకెళ్ళి వారం గుట్టుగా గడిపి డబ్బులు సంపాదించుకువచ్చేయమంటుంది. హాలీవుడ్ అర్ధనగ్నతార బొమ్మ చూస్తూ నీ దగ్గరున్న పవర్ నువ్వు మర్చిపోయావేమో ఆలోచించుమరి అనటంతో కథలాంటి చర్చలాంటి, డాక్యుమెంటరీలాంటి అర్ధం పర్ధం లేని వాక్యాల సముద్రంలాంటి ఈ ఉత్తమ కథ ముగుస్తుంది.
ఈ విధ్వంసదృశ్యంలో దృశ్యాలున్నాయి. దొంతర దొంతరల వాక్యాలున్నాయి. ఆలోచనలున్నాయి. చర్చలున్నాయి. ఏడ్పులున్నాయి. ఆడవాళ్ళు పవర్ ఉపయోగించి డబ్బులు సంపాదించవచ్చన్న సూచనావుంది. ఇందులో లేనిదల్లా కథ మాత్రమే!
టెక్నిక్ కథ కాదు. కథకోసం టెక్నిక్ తప్ప టెక్నిక్ కోసం కథకాదు. కానీ, ఆడెపులక్ష్మీపతి కథలన్నీ టెక్నిక్ కోసం రాసినట్టు కనిపిస్తాయి తప్ప కథను చెప్పటం కోసం కాదు. ఇక్కడే తెలుగు సాహిత్య ప్రపంచంలోని మరో విచిత్రమైన పరిస్థితిని ప్రస్తావించుకోవాల్సివుంటుంది.
తెలుగులో విమర్శకులు ఒక రచయితను ఎన్నుకుంటారు. దానికి పలు కారణాలుంటాయి. కలసి మాట్లాడుకున్నట్టు, ఒకరి తరువాత ఒకరుగా క్రమం తప్పకుండా రెండుమూడు నెలలకొకసారి ఆ రచయిత కథ గురించి విమర్శలు రాస్తూంటారు. వీలు దొరికినప్పుడల్లా ప్రస్తావిస్తూంటారు. దాంతో ఆ రచయితకో ఇమేజీ వస్తుంది. తాను ఇలా రాస్తేనే తన ప్రత్యేకత నిలుస్తుందని అనుకుంటారు. దాంతో అలాగే రాస్తారు. ఇంక కొన్నాళ్ళకు మరో రకంగా రాయలేకపోతారు. అయితే, ఎప్పుడూ ఒకే రకంగా రాస్తూండటంతో కొన్నాళ్ళు పొగిడిన విమర్శకులు కొత్త రచయితను ఎన్నుకుంటారు. దాంతో మరో రకంగా రాయలేక, ఎప్పుడూ రాసేట్టు రాస్తే పొగిడేవారు లేక రచయిత కథలు రాయటం మానివేస్తాడు. ఒకప్పుడు రాసిన కథలనే పదే పదే ప్రస్తావిస్తూ బ్రతికేస్తూంటాడు. ఇలాంటి వారు విమర్శకులకు, సాహితీ ముఠాలకు మాత్రమే తెలుస్తారు. పాథకులకు వీరెవరో కూడా తెలియదు. ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో దిగ్గజాలుగా పొగడ్తలందుకుంటూ వేదికలెక్కి కథలెలారాయాలో చెప్పేవారెంతోమంది పాథకులకు తెలియదు. వారి పేరు తెలుసు రచనలు తెలియవు. పేరెలా తెలుస్తుందంటే పదే పదే ఎవరో ఒకరు పనికట్తుకుని వారి పేరు ప్రస్తావిస్తూంటారు. పత్రికలో వేఅదికలపి వారి పేర్లు చూస్తారు, వింటారు. అంతే..ఇలా ఎంతో మంది చక్కని యువ రచయితలు పొగడ్తల ఇమేజీ చట్రంలో పడి రచనలు మాని పాత ఖ్యాతి నీడలో బ్రతికేస్తున్నారు. ఆడెపులక్ష్మీపతి సైతం విమర్శకులు సృష్టించిన ఇమేజీ చట్రంలో పడి ఒకేరకంగా రాసి రాసి రాయటం మానిన కథకుడు…ఉత్తమ కథలుగా ఎంపికయిన ఒక్కొక్క కథ చదువుతూంటే ఒక చక్కని కథకుడిని ఈ విమర్శక శిఖామణులు, మాఫియా ముఠాలు ఎలా చట్రంలో బిగించి ఊపిరాడనీయకుండా చేసేశారో తెలుస్తుంది. విధ్వంసదృశ్యం ఇందుకు చక్కని ఉదాహరణ….ఇదసలు కథేకాదు. కేవలం చైతన్యస్రవంతి మధ్యమపురుష ప్రభుత్వంపై విమర్శలు ఉన్నందుకు ఉత్తమకథగా ప్రచారం చేస్తున్నరు తప్ప ఇది కథకాదు. అంటే కథలేకున్నా టెక్నిక్ వుంటే చాలన్నమాట. అదీ అందరికీ వర్తించదు. కొందరికే వర్తిస్తుంది.
అసందిగ్ధ కర్తవ్యం కథ కథలా వుంటుంది. దీన్లోనూ ఆలోచనలున్నాయి. కానీ, టెక్నిక్ వెంట పడకుండా తిన్నగా కథను చెప్పటంపైనే రచయిత దృష్తిని కేంద్రీకరించటంతో ఇది చదివించదగ్గ కథగా నిలిస్తుంది. ఇందులో ప్రధాన పాత్రధారి ఒక కీలకమయిన నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. ఒక అర్హత వున్న అభ్యర్ధికి ఒరమోషన్ ఇవ్వాలనుకుంటాడు. కానీ, అధికారులు అర్హతలేనివాడికి ఇమ్మంటారు. బెదిరిస్తారు. అప్పుడాయనకు బాల్యంలో తన స్నేహితుదిని గీజు పెంకుల్లోకి తోసి సహాయం చేయకుండా పరుగెత్తివాచిన సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడలా చేయకూదదనుకుంటాడు. ఆఫీసర్ ను ఎదిరించి నిలబడి న్యాయం చేయాలనుకుంటాడు. అదీ కథ..తిర్యగ్రేఖ తరువాత కథ వున్న కథ ఇదే!!! అంటే ఉత్తమ కథలుగా ఎంచుకున్న అయిదు కథలలో కథలు రెండే…
ఈ కథ చదువుతూంటే ఆంగ్ల నవల కైట్ రన్నర్ గుర్తుకువస్తుంది. దాన్లో బాల్యంలో మోసం చేసినందుకు ప్రతిగా అతడి కొదుకును అఫ్గనిస్తాన్ నుంచి తప్పించి తెచ్చి అమెరికాలో పెంచుకుంటాడు. బహుషా ఆ నవల ప్రేరణతో సృజించి వుండవచ్చీకథను. దీన్లో రచయిత తన ప్రత్యేకమయిన ఆలోచనలను చొప్పించాడు. అయితే, మిగతా కథలలా కాక ఈ కథను చదవటం సులభం. కానీ, ఏ రకంగానూ ఉత్తమ కథగా ఎంచుకోవటం సబబు అనిపించదు. మామూలు చదివించదగ్గ కథ ఇది.
ఆడెపు లక్ష్మీపతి అయిదు కథలు చదివిన తరువాత మన తెలుగు విమర్శకులు, సాహిత్య మాఫియా ముఠాలు ఎలా ఒక రచయితనో ఇమేజీకి బందీని చేసి అతనిలోని సృజనాత్మక రచయితను చంపేస్తాయో బోధపడుతుంది. ఎలా, కొందరు రచయితలు విమర్శక ప్రపంచంలో పెద్ద పేరున్నా, చదువరులకసలు అలాంటి రచయితలున్నట్తుకూడా తెలియదో ..ఇలాంటి చిచిత్రమయిన పరిస్థితి ఎలా ఏర్పడుతోందో కూడా తెలుస్తుంది. ఆంగ్లంతో సహా ఇతర భాషలలో ఒక రచయిత క్రిటికల్ మెప్పు పొందాడంటే తప్పనిసరిగా అతని రచనలు పాఠకులను అలరిస్తాయి. కానీ, మన తెలుగు సాహిత్య ప్రపంచంలో మాత్రం విమర్శకులు మెచ్చే రచయితలు వేరు. రచనలు మేరు. పాఠకులున్న రచయితలు వేరు. పాఠకులు చదివే రచనలు వేరు..

Enter Your Mail Address

February 13, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply