25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ-16(అ)

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాల్లో అక్కిరాజు భట్టిప్రోలు కథలు మూడు ఉన్నాయి. 2003లో నందిని, 2004లో అంటుకొమ్మ, 2006లో గేటెడ్ కమ్యూనిటీ.
ఈ మూడు కథ్నలు సులభంగా చదివేయగల కథలు. ఎలాంటి సంక్లిష్టతలు, ప్రయోగాలు, అస్పష్ట ప్రతీకలు లేని కథలు. అంటే రేడెర్ ఫ్రెండ్లీ కథలన్నమాట. ఈమూడు కథలు చదివిన తరువాత ఇవి చదివించదగ్గ కాథలేకానీ, ఏమాత్రం గుర్తుంచుకోదగ్గ కథలు, చర్చించదగ్గ కథలు, మనసును తాకి, మనసును కదిలించగల కథలు కావు అనిపిస్తుంది. అంటే ఇవి మామూలుగా చదువుకోదగ్గ కథలే తప్ప ఉత్తమకథలుగా ఎంచుకుని చర్చించదగ్గ కథలు కావనిపిస్తుంది. వీటిని ఉత్తమ కథలుగా ఎంచుకొనేందుకు కారణాలను చర్చించేకన్నా ముందు కథలను పరిశీలిద్దాం.
నందిని కథ మామూలు అలవాటయిని అభ్యుదయ భావాల వివాహవ్యవస్థను దూషించే ఫెమినిస్టులు ఎడమచేత్తో కళ్ళు మెదళ్ళూ మూసుకుని కాలి చివరి వేలితో అలవోకగా రాసేసే అనేకానేక మూస పుంఖానుపుంఖాల కథా ఇసుకరేణువుల్లో బాగా నలిగిన ఒక ఇసుకరేణువు లాంటిది.
నందిని అనే అమ్మాయి విదేశంలో మార్క్ అనే అబ్బాయితో కలసివుంటుంది. వారిద్దరూ వ్యాపారంలో బోలేడన్ని డబ్బులు సంపాదిస్తారు. నందిని ఇంటికి ఫోను చేస్తే వాళ్ళు పెళ్ళిచేసుకోమంటారు. పెళ్ళి అన్న పదం వినగానే అమ్మాయి మూడు పాడయిపోతుంది. వివాహ వ్యవస్థని తృణీకరించే కథలు ఉత్తమ కథలు అన్న రంగుటద్దాలు తమకున్నాయని బహిరంగంగానే ప్రకటించుకునే ఉత్తమ కథ ఎంపిక సంపాదకులకు ఈ పదం వినగానే గగుర్పాటు కలిగి ఉలిక్కిపడిలేచి కొన్ని మార్కులు అదనంగా ఇచ్చేసి ఉంటారు.
ఇక్కడినుంచీ కథ ఫ్లాష్ బాక్ లోకి వెళ్తుంది.
నందిని కాలేజీలో చదివే సమయంలో ఆమె స్నేహితురాలు ఓ వార్త చెప్తుంది. తన అన్నకో పెళ్ళి సంబంధం వచ్చిందని, అది నందినే అని చెప్తుంది. అంతేకాదు, నందిని అన్నకు సరిపోదనీ చెప్తుంది. ఎందుకంటే నందిని ముఖం మీద మచ్చలుంటాయి, అందుకు.
ఏ ఉద్యోగం చేసే వాణ్ణయినా చేసుకోవడానికి అభ్యంతరం లేదుకానీ, ఆ పెళ్ళి, ఆ మనిషి ఉద్యోగం నా జీవితానికి అడ్డంకులు కావటం నాకిష్టం లేదు. వాటన్నిటికన్నా ముందు ఇలాంటి పెళ్ళి తంతు నాకు మరీ అన్యాయంగా తోస్తోంది. పెళ్ళి కోసం మరీ ఇంత రాజీపడాలా….అది లేకుండా బతకడమే సుఖంగా వుంది..బతగ్గలిగితే…..అంటుంది. ఇంకేం, మన అభ్యుదయవాద, వివాహవ్యవస్త నిర్మూలనే అభివృద్ధి మహిళోద్ధరణ అని నమ్మి కళ్ళకు కంకణాల్లా గంతలు కట్టుకున్న సంపాదక శూర్పణఖలకు ఈ కథ ఉత్తమంగా తోచటంలో ఆశ్చర్యంలేదు..మార్కుల వర్షం వెల్లువయిపోయివుంటుందీపాటికి.
ఇదంతా మార్క్ కి చెప్తుంది. మార్క్ ఎప్పుదూ ఆఫీసులో గడుపుతూంటే అతడిని వదిలి వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ ని గుర్తుచేస్తుంది.
ఒంటరితనం కొంచెం కష్టమయినదే. ఎంతరాజీపడ్డా, దేంట్లో రాజీపడ్డా తోదు దొరుకుతుందంటే తప్పులేదనుకుంటా అని అంటాడు మార్క్.
అప్పుడు నందిని ఆలోచనలో పడుతుంది. రాజీపడటం ఇష్టం లేక, తనని తాను గుర్తించటంకోసం ఒంటరి తనన్ని మోస్తున్నదొకళ్ళు. ఒంటరితనాన్ని భరించలెక ఏ రాజీ అయినా పడ్డానికి సిద్ధంగా మరొకళ్ళు అనుకుంతుంది.
ఇక్కడ మన సంపాదక శిఖామణులు, ఎంత గొపా విశ్లేషణ. ఎంత గొప్పగా మానాసిక స్థితిని, సందిగ్ధాలను చూపించేశాడు..అని మరోసారి మార్కుల వర్షం కురిపించేసివుంటారు.
ఆరోజు రాత్రి మార్క్ ఆమెని ముద్దుపెట్టుకుంటాడు. మొదటి అనుభవం అయినా ఆమెకి అసహజం అనిపించలేదు. అతడి పరిచయంలో ఆమెకి తెలియకుండానే ఏర్పడిన నమ్మకమో, సాన్నిహిత్యమో, వ్యామోహమో, దాహమో ఆమె అడ్దు చెప్పలేదు. ముందుకు వచ్చి అతణ్ణి గట్టిగా కౌగలించుకుని గుండెలమీద తలపెట్టి కళ్ళుమూసుకుంటుంది…అని వర్ణిస్తాడు రచయిత…
ఇది చదవగానే మన సంపాదక మండలి ఒక్క సారిగా ఆనందంతో కేకలువేసి కన్నీళ్ళు కార్చి, ఎంత అభ్యుదయం!! ఏంత స్వేచ్చా,,,ఎంతెంత ఫార్వార్డ్…అని ఉబ్బితబ్బిబ్బయిపోయివుంటారు. ఒకపక్క పెళ్ళిపై తిరస్కృతి, మరో వైపు ఒక విదేశీయుడితో సహజసహజీవనం…ఇంకోవైపు వాడి ముద్దు. అమ్మాయి అడుగుముందుకు వేసి వాడిని హత్తుకోవటం…ఇంకేమి వెనకబడి అవంతింట్లో అంట్లు తోముతూ అణచివేతకు గురవుతున్న భారతీయ మహిళకు సంసారపు సంకెళ్ళు తెంపి అభివృద్ధి పథానికి దారిచూపించగల అతి గొప్ప కథ..అన్న నిస్చయానికి మన సంపాద్క వర్గమేకాదు, వారి అనుచరగణం, వందిమాగధ, భట్రాజ గణ భజన బృందాల కందళిత ముకిళిత హృదయాలు……ఇదిద్ ఉత్తమం..ఇదే ఉత్తమోత్తమం.. sex before marriage, living together without marriage ఇంతకు మించి మహిళా వికాసానికి మార్గమేది..అని పొగడ్తల స్పీచులు సిద్ధం చేసేసుకుని వుంటారు, పాత స్పీచుల దుమ్ములు దులిపి…
ఇంతలో నందిని వాళ్ళ తల్లీతండ్రి అమెరికా వస్తారు. అంతకుముందు మాధవి అనే స్నేహితురాలితో నేను ప్రెగ్నంట్ అని పొట్టతదుముకుంటూ చెప్తుంది…ఇదేమిటి? అని అడిగితే….పెళ్ళి ఓ వ్యవస్థ అని అనుకుంటే, ఉన్న వ్యవస్థని నేనంగీకరించలేను. అవసరం అనుకుంటే..ఆ అవసరాలన్నీ నేను సమకూర్చుకున్నాను. అవును, ఆకలి, దాహం లాగానే సెక్స్ కూడా నాకు అవసరమే…దీనికి ఎవరేం పేరు పెట్టుకున్నా నాకభ్యంతరం లేదు..అంటుంది..
ఇంకేం..జన్మ జన్మలకు నీకు బానిసలమోయి…అని పాదుకుంటూండివుంటారు…సంపాదకోత్తములు…
ఇక్కడ కాస్త ఒక చర్చ వుంతుంది. చర్చలో వీలయినంత పెళ్ళి వ్యవస్థను దూషించటంవుంటుంది…
ఇక పూర్తిగా చదవనవసరంలేకుందానే ఉత్తమ స్టాంప్ వేసేసివుంటారు. ఇదొక్కటే కాదు రాయబోయే మరో రెందు కథలకు ఉత్తమ స్టాంప్ వేసేసేన్ని మార్కులు ఇక్కడే వచ్చేసివుంటాయి…
తరువాత ఆమె తల్లితండ్రులకు నిజం తెలుస్తుంది. వారు అండగా నిలబడతారు. పిల్లాదు పుడతాడు. ఒకరోజు మార్క్ వచ్చి ఒక వజ్రాల వుంగరం ఇచ్చి నువ్వులేనిదే నేను బ్రతకలేను అంటాడు. పెళ్ళి చేసుకోమంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆమెకు మార్క్ ప్రపోజల్ ని గతంలో తిరస్కరించినా తండ్రి ప్రోద్బలం మార్క్ ఉంగరం తేవటంలో వుందని.
ఎవ్వరినీ తన తరఫున ఆలోచించనివ్వని, ఓ సలహాకూడా ఇవ్వలేనంతగా దూరం చేసుకున్న నైజాన్ని నెమరువేసుకుంతుంది. ఉంగరం చేస్తికి తొడుక్కుంటుంది. అంటే పెళ్ళికి ఒప్పుకుందన్నమాట. కొదుకుని ముద్దు పెట్టుకుంటూ ఎన్ని చెలియలికట్టలు దాటాక దొరికిందో తెలుసా ఈ వజ్రం..అంటుంది..
ఇదీ అందరూ గొప్పగా పొగిడి, అక్కిరాజు భట్టిప్రోలు అనగానే గుర్తుకుతెచ్చుకునే మామూలు ఉత్తమకథ మసాలాలు దట్టించిన అలవాటయిన సాధారణ కథ….
ఈ కథలో కొత్తదనమూ లేదు. గొప్పతనమూ లేదు. అయితే,కథ ముగింపు నందిని వ్యక్తిత్వాన్నే కాదు, కథలో రచయిత చెప్పాలనుకున్నదాన్నీ ప్రశ్నార్ధకంలో పడేస్తుంది. బహుషా, కథ పూర్తిగా చదివితే, మెదడు ఇంకా రంగుటడాలతో పూర్తిగా కప్పబడకపోయి వుంటే సంపాదకులూ ఈ విషయాన్ని గ్రహించి వుండేవారు. అన్ని అవసరాలు తీరుతూంటే పెళ్ళెందుకు అని అడిగిన అమ్మాయి, చివరికి ఏ అవసరం తీరలేదని పెళ్ళి చేసుకుంది???
అప్పుడూ మార్క్ ఉన్నాడు. ఇప్పుదూ ఉన్నాడు. అదనంగా పిల్లవాడున్నాడు. ఒకవేళ మార్క్ వదలి వెళ్ళిపోయినా, ఇంకెవరో ఆ అవసరం తీర్చేవాళ్ళుంటారు. అలాంటప్పుదు మార్క్ ఉంగరం వేలికి తొడుక్కుని పెళ్ళి అనే సంకెళ్ళలో తనని తాను బంధించుకోవటం ఎందుకు? ఇది ఏ రకంగా సమర్ధనీయం? అంటే కనీస వ్యక్తిత్వం లేని పాత్ర అన్నమాట నందిని. మొదటి నుంచీ వివాహ వ్యవస్థను పెళ్ళినీ తిడుతూ వచ్చిన అమ్మాయి, ఇప్పుడు వివాహ వ్యవస్థ ఏం మారిందని పెళ్ళి చేసుకుంతోంది? ఇంతకీ రచయిత ఈ కథ ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటి? చెలియలి కట్టలు దాటి వజ్రాలను వెతుక్కొని పెళ్ళి చేసుకోమనా? ఆ చెలియలు కట్టలు దాటాలంటే, సప్త సముద్రాలు దాటి తెల్లవాళ్ళలో వజ్రాలున్నాయి, అక్కడ వెతుక్కోమనా? అయినా, అన్ని అవసరాలు తీరితే పెళ్ళి అవసరంలేదని అని రాసిన కలంతోనే రచయిత వెలికి ఉంగరం తొడిగినట్తు ఎలా రాశాడు? లేక పిల్లవాదు పుట్టగానే, వాదికి తండ్రి కావాలని, భద్రత కావాలని గ్రహింపువచ్చి అందుకు వివాహమనే బంధమే ఉత్తమం అన్న ఆలోచన వచ్చిందా నందినీ అమ్మవారికి?
ఇది ఉత్తమ కథనా? ఒక నిర్దిష్టమయిన ఆలోచన, సక్రమమయిన తర్కం, మానవ సమాజము, మనస్తత్వముపై అవగాహన, వ్యక్తిత్వమూ ఏమీ లేని ఈ కథ ఉత్తమ కథనా?
ఒకవేళ ఇది ఉత్తమ కథ అయితే, ఇలాంటివి, ఇంతకన్నా, లాజికల్గా, ఆసక్తికరంగా వున్న ఇలాంటి కథలను అంతకుముందు సంవత్సరాలనుంచీ, సంవత్సరానికి కనీసం ఒక 50 పైగా కథలు చూపించవచ్చు. మరి అవేవీ ఉత్తమ కథలు కాక, ఇదొక్కటే ఉత్తమ కథ ఎలా అయింది? ఈ ప్రశ్నకు సమాధానం మనం కథలో కాక, బయట ప్రపంచంలో వెతుక్కోవాల్సివుంటుంది.
ఈ వెతుకులాటను మిగతా రెండు కథల్లో వచ్చే వ్యాసంలో కొనసాగిద్దాం!!!

Enter Your Mail Address

February 18, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply