25ఏళ్ళ ఉత్తమ కథల విశ్లేషణ-17(అ)

25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో బీ. అజయ్ ప్రసాద్ కథలు ఆరు వున్నాయి. 2006లో జాతక కథ, 2007లో లోయ, 2008లో యూఎఫో, 2009లో జాగరణ, 2011లో ఖేయాస్….కథలను ఉత్తమ కథల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు.
ఈ ఆరుకథలు చదివిన తరువాత ఒక ఆలోచన కలుగుతుంది. ఇంతవరకూ ఈ ఉత్తమ కథల సంకలనంలో చదివిన కథలకు, కథకులకు పూర్తిగా భిన్నమయిన కథకుడు అజయ్ ప్రసాద్ అని. అతను ఎంచుకున్న కథాంశాలు కానీ, వాటిని కథ రూపంలోకి మలచి అందించిన విధానంకానీ, పాత్రల చిత్రణలో కానీ, పాత్రల వ్యక్తిత్వాలను రూపొందించిన విధానంలో కానీ, ముఖ్యంగా అక్షరాలతో దృశ్యాలను చిత్రించి మ్నసుతెరపై కదిలే బొమ్మలుగా వాతిని ప్రతిష్టించిన తీరులో కానీ, ఈ కథకుడు ఇతర కథకులందరికన్నా భిన్నమయినవాడన్న విషయం స్పష్టంగా తెలుస్తూంటుంది. రచయిత తన కథలలో తాత్వికంగా, ఆలోచనాభరితంగా, నర్మగర్భితంగా ప్రదర్శించిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకున్నా, ఆయన ఆయా అంశాలను కథ ద్వారా ప్రదర్శించిన విధానం మాత్రం పాఠకులను ముగ్ధులను చేస్తుంది. ఈ ఆరు కథలు చదివిన తరువాత బీ.అజయ్ ప్రసాద్ అసలు సిసలయిన సృజనాత్మక కథారచయిత అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సమకాలీన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతుడయిన అసలయిన సృజనాత్మక రచయిత అని గర్వంగానూ చెప్పవచ్చు. అలాగని రచయితకు వామపక్ష సైద్ధాంతికపు రంగుటద్దాలు లేవని కాదు. రంగిటద్దాలున్నా, అక్కడక్కడ అవి కథన రీతిపై ప్రభావం చూపిస్తూన్నా, రచయిత అత్యద్భుతమయిన కథాకథన నైపుణ్యం ఆలోటును మరుగున పడేస్తుంది. కథను మెచ్చినా, మెచ్చకున్నా, ఆయన అక్షరాలద్వారా గీసిన దృశ్యాలు పఠితను వెన్నాడుతూనే వుంటాయి. అంత ప్రతిభావంతుడయిన రచయిత బీ. అజయ్ ప్రసాద్.
ఈ రచయిత కథలు చదివిన తరువాత ఒక సందేహం పట్టిపీడిస్తుంది. ….ఈ 25ఏళ్ళ సంకలనాలను పరిశీలిస్తే, ఉత్తమ కథలు ఎంపికయిన రచయితలంతా ఒక నిర్ణీత కాలం రచనలు చేస్తున్నారు. తరువాత అదృశ్యమయిపోతున్నారు. ఆ తరువాత వారు ఉత్తమ రచనలుగా ఎంపికయ్యే రచనలు చేయటంలేదా? లేక, రచనలు చేయటమే మానేశారా? లేక రచయితకిన్ని కథలనో, ఒక కోటా ఏమయినా వుందా?
అక్కిరాజు భట్టిప్రోలు వరుసగా, 2003,04,06లలో ఉత్తమ కథలు రాశాడీ సంకలన కర్తల ప్రకారం. ఆతరువాత ఆయన కథలేవీ సంకలనంలో లేవు. అజయ్ ప్రసాద్ కూడా 2006, 07, 08, 09, 11 తరువాత కనబడడు. అట్టాడ అప్పల్నాయుడు 1997, 98, 99 లలో వరుసగా కనిపించి, మళ్ళీ 2005, 08, 09 లలో కనిపిస్తాడు. తరువాత హుష్ కాకీ. ఇలా, రిపీట్ కథకుల కథలు ఎంపికయిన సంవత్సరాలు గమనిస్తే, అవి వరుసగా వుంటున్నాయి, తరువాత హుష్ కాకీ. ఇలా ఎందుకు జరుగుతోంది? ఆయా రచయితలు ఆ కాలంలోనే ఉత్తమ రచనలు చేసి, తరువాత సృజనాత్మకత అడుగంటిందా? లేక, ఆ కాలంలో రచయితలు సంపాదకులకు నచ్చు, తరువాత మీకొచ్చిన పేరు చాలే, ఇక మీ కథలు ఉత్తమ కథలు కావు అని సంపాదకులు ఏవయినా గీతలు గీస్తున్నారా? ఖదీర్ బాబు కథలను చూస్తే, 1997, 98,2000, 02,02, 05,10 లలో వరుసగా ప్రచురితమయి ఆ తరువాత హుష్ కాకీ అయ్యాయి. అంటే వరుసగా అన్ని ఉత్తమ కథలు రాసిన రచయిత ఇన్నేళ్ళు మరో ఉత్తమ కథ స్థాయి రచనలు చేయలేక పోయాడా? లేక ఇన్ని వేసేశాము కాబట్తి ఇక చాలు అని సంపాదకులు అనుకున్నారా? అందరికన్నా ఎక్కువ ఉత్తమ కథలు 10 ఉన్న వీ చంద్రశేఖర్ రావు కథలు 1991, 93,97, 98,99,2002,04,06,08,10 వరకూ దాదాపుగా రెండేళ్ళకోకటి వుండి గత ఆరేళ్ళుగా ఒక్కకథా లేదు. ఇలా, ఉత్తమ కథల ఎంపికలో ఒక పద్ధతి కనబడటం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది. అంటే, కథకులు ఒక పీరియడ్లో ఉత్తమ కథలు రాసి ఆ తరువాత ఇక రాయలేకపోతున్నారా? అందుకేనా, ఒకప్పుదు విరివిగా ఉత్తమ కథలుగా ఎంపికయిన ఇప్పుడు ఎంపిక కాని రచయితలంతా సంపాదకులపై కారాలు మిరియాలు నూరుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? కొందరు రచయితలేమో మేము తక్కువ కథలు రాసినా ఎక్కువ పేరొచ్చిందని కథలు రాయటమే మానేశారు కొన్నేళ్ళుగా?
అత్యద్భుతమయిన రీతిలో కథలు రాసిన అజయ్ ప్రసాద్ హఠాత్తుగా ఇన్నేళ్ళు మరో ఉత్తమ కథ రాయకపోవటం అత్యంత ఆశ్చర్యం కలిగిస్తూ ఇన్ని ఆలోచనలు కలిగించింది. ఎందుకంటే, ఒక రచయిత కాలం గడుస్తున్న కొద్దీ పరిణతి చెందుతాడు. అతని ఆలోచన పరిణతి చెందుతుంది. ఆటల్లో 30ఏళ్ళు వచ్చేసరికి ఆటగాడిని ముసలివాడిగా పరిగణిస్తారు. కానీ, రచయిత అసలు ప్రతిభా పాటవాలు ఏళ్ళు గడుస్తున్నాకొద్దీ వికసిస్తాయి. కానీ, ఈ సంకలనాల్లో అలాకాక, ఒక creative burst లాగా రచయితలు ఉత్తమ కథలు రాసేయటం ఆతరువాత మిన్నకుండటం కనిపిస్తోంది. ఇది ఆలోచించవలసిన విషయం.
అజయ్ ప్రసాద్ కథల విశ్లేషణ వచ్చే వ్యాసంలో

Enter Your Mail Address

March 5, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply